భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ | Roshni Nadar Malhotra Success Story | Sakshi
Sakshi News home page

Roshni Nadar Malhotra: వెలుగుల నాడార్‌

Published Sun, Jun 20 2021 1:31 AM | Last Updated on Sun, Jun 20 2021 7:49 AM

Roshni Nadar Malhotra Success Story - Sakshi

రోష్‌నీ నాడార్‌ మల్‌హోత్రా

ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ... హెచ్‌సిఎల్‌ కంపెనీ సిఈవో, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.. విద్యాజ్ఞాన్‌ చైర్‌పర్సన్‌... ఆమె రోష్‌నీ నాడార్‌ మల్‌హోత్రా... శివ్‌ నాడార్‌ ఏకైక కుమార్తె.

భారతదేశంలో విజయాలు సాధించిన మహిళల గురించి మాట్లాడుకునేటప్పుడు రోష్‌నీ నాడార్‌ మల్‌హోత్రా గురించి తప్పక చెప్పాలి. కోవిడ్‌ – 19 మహమ్మారి సమయంలో సమర్థమైన నాయకత్వ లక్షణాలు చూపించిన 25 మంది పారిశ్రామిక వేత్తలలో రోష్‌నీ పేరు కూడా ఉంది. 38 సంవత్సరాల రోష్‌నీ హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. అంతకు ముందు భారతీయ ఐటీ కంపెనీని నడిపించిన మొట్టమొదటి మహిళగా మరో విజయం సాధించిన గుర్తింపు పొందారు.

చిన్నతనంలోనే...
సాంకేతిక దిగ్గజం, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు అయిన శివ్‌ నాడార్‌కు ఏకైక సంతానంగా ఢిల్లీలో 1982లో జన్మించిన రోష్‌నీ వసంత్‌ వ్యాలీ పాఠశాలలో చదువుకున్నారు. నార్త్‌వెస్టర్న్‌ యూనివర్సిటీ నుంచి కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, కెలాగ్స్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఏ చేశారు. చదువు పూర్తి కాగానే బ్రిటన్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. 27 సంవత్సరాలు వచ్చేసరికి తండ్రి ప్రారంభించిన వ్యాపారంలో భాగస్వాములయ్యారు. హెచ్‌సిఎల్‌లో చేరిన సంవత్సరానికే ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా కంపెనీ సిఈవో బాధ్యతలు కూడా చేపట్టారు.

విచిత్రమేమిటంటే, ఆమెకు సాంకేతిక రంగం మీద అస్సలు ఆసక్తి లేదు. వార్తా మాధ్యమం నుంచి ఆమె ప్రయాణం సాంకేతిక రంగం వైపుకి మళ్లింది. తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలంటే, పని మీద పూర్తిగా దృష్టి పెట్టాలని అర్థం చేసుకుని, తన రంగాన్ని అలా మార్చుకున్నారు. తక్షణం భారతదేశానికి తిరిగివచ్చి తన ఫ్యామిలీ బిజినెస్‌ మీద పనిచేయటం ప్రారంభించారు. సాంకేతిక రంగం మీద అవగాహన లేకపోయినప్పటికీ, రోష్‌నీ చూపిన శ్రద్ధ, అంకితభావం కారణంగా ఆ కంపెనీ ఆర్థికంగా, పరిపాలనా పరంగా బాగా ఎదిగింది.


తండ్రి శివ్‌ నాడార్‌తో రోష్‌నీ నాడార్‌ మల్‌హోత్రా

సంగీత సేవా కార్యక్రమాలలో..
శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు, యోగా మీద ఆసక్తి ఎక్కువ. హెచ్‌సిఎల్‌లో చేరటానికి ముందు రోష్‌నీ ‘శివ నాడార్‌ ఫౌండేషన్‌’లో ట్రస్టీగా సేవలు అందించారు. ఈ సంస్థ లాభాపేక్ష లేకుండా ‘శ్రీశివసుబ్రమణ్య నాడార్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ’ ని చెన్నైలో నడుపుతోంది. విద్యాజ్ఞాన్‌ సంస్థకు అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు రోష్‌నీ. ఈ సంస్థలో.. ఆర్థికంగా వెనుకబడినవారికి, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ ప్రజలకు మాత్రమే ప్రవేశం. గ్రామీణ భారతం నుంచి నాయకులను తయారు చేయాలనేదే ఆమె కోరిక.

వన్యప్రాణి పరిరక్షణ
రోష్‌నీ నాడార్‌కు వన్యప్రాణి సంరక్షణ అంటే చాలా ఇష్టం. వాటిని సంరక్షించటంతోపాటు పరిరక్షించటమంటే మరీ ఇష్టం. 2018లో హ్యాబిటేట్స్‌ ట్రస్ట్‌ను స్థాపించి, ఈ సంస్థ ద్వారా భారతదేశానికి చెందిన ప్రాణులను పరిరక్షిస్తుంటారు. వివిధ వన్యప్రాణి సంస్థలతో కలిసి వన్యప్రాణి సమతుల్యతకు కృషి చేస్తున్నారు. హోండా కంపెనీలో పనిచేస్తున్న శిఖర్‌ మల్‌హోత్రాను 2009లో వివాహమాడారు. వివాహానంతరం హెచ్‌సిఎల్‌లో చేరి, ప్రస్తుతం ‘హెచ్‌సిఎల్‌ హెల్త్‌కేర్‌’లో వైస్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం అర్మాన్, జహాన్‌. ఆమె సాధించిన విజయాలకు అనేక అవార్డులు అందుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement