
నివాళి
సంగీతం ఆపాతమధురం. భావుకతతో, సమసమాజ భావనలతో, ప్రకృతి వర్ణనలతో... ఇలా హరివిల్లులా సంగీత జగత్తు నాదమయం. అలాగే భక్తి, ప్రపత్తి, శరణాగతులతో గానం చేసిన వారి కీర్తి అజరామరం. మన సమకాలంలో గానం చేస్తున్న, చేసిన సంగీత విద్వాంసులలో తనదైన విలక్షణ గాత్రంతో వెలిగిన ధ్రువతార శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.
నాకు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్‌తో దశాబ్దాల అనుబంధం. సౌజన్యం, సంస్కారం, వినమ్రత – పరిచయమైన క్షణంలోనే సూదంటురాయిలా ఆకర్షించిన అంశాలు. శక్తి, భక్తి, రక్తి కలిగిన తిరుమల ఆలయ కవి అన్నమయ్య కీర్తనలు పాడి తరించిన సంకీర్తన మహతి.
స్వామి పుష్కరిణీ తీరంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని గానం చేసిన భావ పుష్కరిణి అన్నమయ్య. ఆ కీర్తనలలోని రసాత్మ కతను దర్శించి, అనుభవించి స్వర పరచిన మహనీయులలో ఆరాధ్యుడు, అనవధ్యుడు శ్రీ గరిమెళ్ళ. ఒక వాగ్గేయకారుని సహస్ర కీర్తనలు స్వర పరిచి, పాడి, తన శిష్య ప్రశిష్యులతో పాడించిన కారణ జన్ముడు. స్వయంగా వాగ్గేయకారుడు. ‘ఆంజనేయ కృతి మణిమాల’, ‘నవగ్రహ కీర్తనలు’ వంటివి ఇందుకు మణిదర్పణం. లలిత సంగీత రచనల్లో 200 పాటల అందమైన బాలకృష్ణ భావలహరి అజరామరం.
గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, స్వరకర్తగా, శిష్య ప్రశిష్యులను తీర్చిదిద్దిన సంగీత కులపతి ఆయన. ఉద్యాన వనంలో ఆనేకమైన పూలకుండే పరిమళంలా, ప్రతి పాటకు తాను చేసిన స్వర రచనలో ఎంతో వైవిధ్యం, ఎంతో శాస్త్రీయత ఉట్టిపడుతాయి. అయితే, అంత కన్నా ఎంత ఆర్ద్రత నిండుగా ఉంటుందో స్మరిస్తే పులకించిపోతాం.
సంగీత అక్షయ పుణ్యకోశమైన శ్రీ బాలకృష్ణ ప్రసాద్‌కు నాపై ఉండే ఆదరం నిరుపమానం. లెక్కకు మించిన సార్లు నా ఇంటికి వచ్చి నాకు నచ్చిన పాటలు వినిపించిన ఆత్మబంధువు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడిగా నేను రూపకల్పన చేసిన ‘దళిత గోవిందం’, ‘కల్యాణమస్తు’, ఇంకా, దేశ విదేశాల్లో జరిగిన కల్యాణాల్లో, ఇతర ధార్మిక కార్యక్రమ ప్రస్థానంలో, ఆయన నా సహచరుడు.
దళిత గోవిందం, శ్రీనివాస కల్యాణాల్లో – ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’, ‘ఇతడొక్కడే సర్వేశ్వరుడు’ వంటి కీర్తనలు ఆయన ఆలపించిన తీరు నాలో చెరగని ముద్ర వేశాయి.
బాలకృష్ణ ప్రసాద్ ఛాందసుడు కాడు. మానవత్వం మొగ్గ తొడగాలని, సమాజంలో అన్ని వర్గాల మధ్య మమతా బంధాలు బలపడాలనే తాత్వికుడు. ఈ సత్యాన్ని తెలిపే వారి లలిత గీతాలు – ఆకాశవాణిలో ఎన్నో ప్రసారం అయ్యాయి. సామ్యవాదాన్ని, సౌమ్య వాదాన్ని మేళవించుకొన్న స్థితప్రజ్ఞడు.
రాజకీయ నాయకుల్లో మాట తప్పని, మడమ తిప్పని మహ నీయుడు శ్రీ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారితో చేయించిన సన్మానం తనకొక మధుర స్మృతిగా నాకు తరచూ చెప్పేవాడు. జన హృదయ నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆదేశిస్తే, తి.తి.దే. అధ్యక్షుడిగా ఆయనకు ‘పద్మశ్రీ’ ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించాను.
కేంద్ర సంగీత నాటక ఆకాడమీ సన్మానితుడిగా, తి.తి.దే. ఆస్థాన పండితుడిగా, బిరుదులకే గౌరవాన్ని తెచ్చిన, లేదా పెంచిన ప్రజ్ఞాశాలి ఆయన. లాలిపాటల నుండి జోల పాటల వరకు కులశేఖరపడి వద్ద పాడిన అపర అన్నమయ్య.
శ్రీవారి సేవలో నాద విద్వాంసుడిగా జీవించిన పూర్ణకాముడు. ఆ గాత్రానికుండే ప్రత్యేకత ఆరు దశాబ్దాల కాలం, ఇలలో సౌగంధికా సౌరభాన్ని నింపింది. ఇక కోనేటి రాయుని కొలువులో నారద,తుంబురులతో గానం చేస్తాడు. అన్నమయ్య కీర్తనలను, తన కీర్తనలను కలిపి గానం చేస్తూ తాళ్ళపాక కవులను ఆనంద పారవశ్యంలో ముంచెత్తుతాడు.
పులుకు తేనెల తల్లి అమృత హస్తాలతో ఆనందామృతాన్ని గ్రోలుతాడు. ఆ మహనీయుని ధర్మపత్ని శ్రీమతి రాధ, వారి పుత్రులైన శ్రీ అనిల్ కుమార్, శ్రీ పవన్ కుమార్‌లకు – జాలి గుండెలవాడైన ఏడుకొండలస్వామి నిండైన అండదండగా ఉంటాడని విశ్వసిస్తున్నాను.
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త పూర్వ అధ్యక్షులు,
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి