Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ | Tadepalli Subbalakshmi: singer and violinist Tadepalli Subbalakshmi sakshi special story | Sakshi
Sakshi News home page

Tadepalli Subbalakshmi: స్వరవీణ

Published Thu, Feb 1 2024 12:20 AM | Last Updated on Thu, Feb 1 2024 12:20 AM

Tadepalli Subbalakshmi: singer and violinist Tadepalli Subbalakshmi sakshi special story - Sakshi

అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌. నారాయణన్‌ నుంచి పురస్కారం అందుకుంటున్న సుబ్బలక్ష్మి

ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్‌లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి.

‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్‌ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్‌ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్‌లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్‌.

ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్‌ లో సర్టిఫికేట్‌ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్‌గా వోకల్‌ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్‌ నా క్లాస్‌మేట్‌. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది.  
 
సంగీత గురువు
సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్‌ బాలభవన్‌లో వయోలిన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్‌లోనే ‘గాయక్‌ అసిస్టెంట్‌’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్‌ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్‌కి వయోలిన్‌ సహకారం అందించాను.

అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్‌ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్‌వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్‌ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను.

ఎన్టీఆర్‌గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్‌ రంగరాజన్‌గారి హయాంలో గవర్నర్‌ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్‌ నారాయణన్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్‌ ఎన్టీఆర్‌ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్‌.  
 
నిరంతర గాన వాహిని
నేను మ్యూజిక్‌ కాలేజ్‌ నుంచి రిటైర్‌ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్‌ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్‌ కెనడా, యూఎస్, సింగపూర్‌లలో మ్యూజిక్‌ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు.

అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్‌లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్‌ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్‌క్లాస్‌కు వచ్చారని, ఇంటర్‌మీడియట్‌ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు.

మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్‌గా మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్‌గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్‌ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్‌గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి.

సుబ్బలక్ష్మి మంచి టీచర్‌
ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్‌ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్‌ చానెల్‌ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్‌ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది.  
– తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్‌ విద్వాంసురాలు

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: నోముల రాజేశ్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement