
చాట్ జీపీటీ బామ్మ బెంగళూరుకు చెందిన 88 ఏళ్ల బామ్మ చాట్‌జీపీటీతో స్నేహం కట్టింది. అన్ని ప్రశ్నలూ దానినే అడుగుతోంది. ‘నా మనవడు పెళ్లి చేసుకోవడం లేదు. కారణం ఏంటంటావ్’ అనే ప్రశ్నకు చాట్‌జీపీటీ చెప్పిన జవాబుకు నెటిజన్లు బోలెడు ముచ్చటపడుతున్నారు. మనవడు పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.
ఊళ్లలో చాలామంది బామ్మలు టీవీతో కాలక్షేపం చేస్తారు. కాని బెంగళూరు(Bengaluru)కు చెందిన ఈ బామ్మ(Grand mother) ఏకంగా ‘ఏఐ’ చాట్‌బాట్ అయిన ‘చాట్‌జీపీటీ’(ChatGPT)తో స్నేహం కట్టింది. వాయిస్ ద్వారా చాట్‌జీపీటీతో మాట్లాడవచ్చు కనుక బామ్మ తనకున్న సందేహాలన్నిటినీ దానినే అడుగుతూ కాలక్షేపం చేస్తోంది. ఆమె మనవడు శశాంక్ జాకబ్ ఇదంతా వీడియో తీసి ఇన్‌స్టాలో పెడితే వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఆ వీడియోలో సంభాషణ ఇలా సాగింది.
బామ్మ: హాయ్
చాట్‌జీపీటీ: హాయ్
బామ్మ: నా వయసు 88. నా బిపి 165/88 ఉంది. ప్రమాదం అంటావా?
చాట్‌జీపీటీ: సిస్టాలిక్ కొంచెం ఎక్కువుంది. డయస్టాలిక్ నార్మల్‌గా ఉంది.
బామ్మ: నా మనవడు పెళ్లి చేసుకోనంటున్నాడు. కారణం ఏంటి?
చాట్‌జీపీటీ: ఓ ఇది మంచి ప్రశ్న. నీ మనవడు పెళ్లి వద్దనడానికి అనేక కారణాలు ఉంటాయి. కెరీర్ గురించి ఆలోచిస్తుండవచ్చు, ఏవైనా లక్ష్యాలు ఉండవచ్చు లేదా గత అనుభవాల వల్ల కూడా కావచ్చు. బామ్మ మనవడి వైపు తిరిగి: ఏరా.. ఏవైనా గత అనుభవాలు ఉన్నాయా?
మనవడు: ఉండొచ్చు
బామ్మ: సరే అలా అయితే. నీకు క్లారిటీ రావడానికి కొంత టైమ్ ఇస్తాను...
ఇంతటితో ఆ సంభాషణ ముగిసింది. ఇన్‌స్టాలో ఈ వీడియోను వేల మంది లైక్ చేశారు. బామ్మను చాలా మెచ్చుకుంటున్నారు. బామ్మా.... మనం స్నేహం చేద్దామా అని అడుగుతున్నారు. చాలామంది తమ బామ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు.
(చదవండి: మహిళా ఉద్యోగిని ఆ సాకుతో జాబ్‌లోంచి తీసేశారు..! కట్‌చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment