Violinist
-
Violinist Tadepalli Subbalakshmi: స్వరవీణ
ఇంట్లోకి అడుగుపెట్టగానే సోఫా కార్నర్లో త్యాగయ్య విగ్రహం అతిథులకు ఆహ్వానం పలుకుతున్నట్లు ఉంటుంది. అదే గదిలో మరోదిక్కున వీణాపాణిౖయెన సరస్వతీ మాత పాదాల చెంత తంబుర మీటుతున్న త్యాగరాజు, కామధేనువు నిత్యపూజలందుకుంటున్న దృశ్యం ఆకట్టుకుంటుంది.‘‘పుష్యమాసం బహుళ పంచమి త్యాగరాజు సిద్ధి పొందిన రోజు. తమిళనాడులో ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి’’ అంటూ సంతోషం నిండిన స్వరంతో తన సంగీత ప్రస్థానాన్ని సాక్షితో పంచుకున్నారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. ‘‘మాది విజయవాడ. మా పెదనాన్న కొమ్ము వెంకటాచల భాగవతార్ హరికథకులు. కళల నిలయమైన ఇంట్లో పుట్టాను. ఆరవ ఏటనే నా సంగీత సాధన మొదలైంది. ఆకెళ్ల మల్లికార్జున శర్మ, కోటిపల్లి ప్రకాశరావులు నా వయోలిన్ గురువులు. విజయవాడ సత్యనారాయణపురంలో ‘ప్రభుత్వ సంగీత కళాశాల’ పెట్టారు. పదేళ్లకు ఆ కాలేజ్‌లో చేరాను. మంగళంపల్లి బాలమురళీకృష్ణ మా ప్రిన్సిపల్. ఆ తర్వాత నేదునూరి కృష్ణమూర్తిగారు కూడా. ఆరేళ్లపాటు సాధన చేసి వయోలిన్ లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో చేశాను. ప్రైవేట్‌గా వోకల్ కోర్సు కూడా చేశాను. డిప్లమో అందుకోవడం ఆ వెంటనే పెళ్లి. అబ్బాయిని వెతుక్కోవాల్సిన పని పడలేదు. మా వారు ఉమాశంకర్ నా క్లాస్మేట్. జీవితాన్ని పంచుకున్నాం. సంగీత విద్వాంసులుగా వందలాది వేదికలను పంచుకున్నాం. సంగీతసాగరంలో మా జ్ఞానాన్వేషణ కొనసాగుతోంది. సంగీత గురువు సంగీత గురువుగా నా బాధ్యత 1985లో మొదలైంది. జవహర్ బాలభవన్‌లో వయోలిన్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరాను. ఆ తర్వాత నేను చదివిన కాలేజ్‌లోనే ‘గాయక్ అసిస్టెంట్’గా చేరాను. వేదికల మీద గాత్ర సహకారం, వయోలిన్ సహకారం రెండూ చేయగలగడంతో అనేకమంది ప్రముఖులతో వేదిక పంచుకునే అవకాశం వచ్చింది. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి శోభానాయుడుకి గాత్ర సహకారం, ప్రముఖ గాయని శోభారాజ్కి వయోలిన్ సహకారం అందించాను. అలేఖ్య పుంజల, భాగవతుల సేతురామ్, ఆనంద్ శంకర్, మంజులా రామస్వామి, ఉమారామారావు, వాసిరెడ్డి కనకదుర్గ వంటి గొప్పవారితో నా సరిగమల, స్వర రాగాల ప్రయాణం సాగింది. ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత సంగీతసేవ విస్తృతంగా చేయడానికి నాకు అవకాశాలు వచ్చాయి. దూరదర్శన్, భక్తి చానెల్, ఎస్వీబీసీ – నాద నీరాజనంతోపాటు ఇతర దేవాలయాల్లో లెక్కకు మించిన కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఐసీసీఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్)నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సింగపూర్, టర్కీ, లెబనాన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, అబూదాబి వంటి దేశాల్లో కచేరీలు చేయగలిగాను. ఎన్టీఆర్‌గారు కళలను అభిమానించేవారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపుగా ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రారంభగీతం ఆలపించాను. గవర్నర్ రంగరాజన్‌గారి హయాంలో గవర్నర్ బంగ్లాలో అప్పటి రాష్ట్రపతి కే ఆర్ నారాయణన్ గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో భక్తి సంగీతం ఆలపించడం వంటి ఎన్నో సంతోషాలను సంగీత సరస్వతి నాకిచ్చింది. నా వయసు 74. ఆరు దశాబ్దాలు దాటిన సంగీత సాధనను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే నాకు ముచ్చట గా అనిపించే సందర్భం జూనియర్ ఎన్టీఆర్ నాట్యప్రదర్శన. మద్రాసు (చెన్నై)లో జరిగిన ఆ కార్యక్రమానికి సంగీత సహకారం అందించాను. ఆ పిల్లవాడు చాలా మంచి డాన్సర్. నిరంతర గాన వాహిని నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి రిటైర్ అయ్యేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగం నుంచి మా వారు కూడా రిటైర్ అయి ఉన్నారు. ఇద్దరం కలిసి ‘వాగ్దేవి సంగీత విద్యాలయం’ పేరుతో సంగీత పాఠశాలను స్థాపించాం. పూర్థిస్థాయి శిక్షణ ఇచ్చి డెబ్బైమందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపించాం. నా స్టూడెంట్స్ కెనడా, యూఎస్, సింగపూర్లలో మ్యూజిక్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. ఈ తరం బాల్యం చాలా చురుగ్గా ఉంటోంది. పిల్లల్లో గ్రహణ శక్తి చాలా మెండుగా ఉంది. త్వరగా నేర్చుకుంటున్నారు. అందుకు టెక్నాలజీ కూడా బాగా ఉపయోగపడుతోంది. అప్పట్లో మాకు గురువు పాడి వినిపించిన పాటను ఇంట్లో సాధన చేసేటప్పుడు ఏదైనా సందేహం వస్తే, మరునాడు క్లాస్‌లో నివృత్తి చేసుకోవాల్సిందే. ఇప్పుడలా కాదు, గురువు పాడేటప్పుడే రికార్డ్ చేసుకుని మళ్లీ మళ్లీ వింటూ నేర్చుకుంటున్నారు. కానీ సంగీతంలో కొనసాగేవాళ్లు తక్కువ. మూడేళ్లపాటు బాగా నేర్చుకున్న తర్వాత టెన్త్‌క్లాస్‌కు వచ్చారని, ఇంటర్మీడియట్ కూడా కీలకం కాబట్టి పూర్తి సమయం చదువుల కోసమే కేటాయించాలనే ఉద్దేశంతో సంగీతసాధనకు దూరమవుతున్నారు. మా రోజుల్లో సంగీతమే అసలు చదువుగా ఉండేది. నేను ప్రైవేట్‌గా మెట్రిక్యులేషన్ పూర్తి చేశాను. తమిళులు మాత్రం ఉన్నత చదువులు చదువుతూ సంగీతాన్ని కూడా కొనసాగిస్తుంటారు. మన తెలుగు వాళ్లలో ప్రతిభ ఉంది. అయితే అంకితభావమే తక్కువ. ఉపాధికి భరోసా ఉంటే ఈ కళను కెరీర్‌గా ఎంచుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది. నాకనిపించేదేమిటంటే... పిల్లలకు స్కూల్ దశలోనే సంగీతం, నాట్యం వంటి కళల కోసం ఒక క్లాసు ఉంటే బాల్యంలోనే కళలు పరిచయమవుతాయి. కళాసాధనతో వచ్చే క్రమశిక్షణ వారిలో దుడుకుతనాన్ని తగ్గించి ఒద్దిక నేర్పుతుంది. పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి పరోక్షంగా దోహదం చేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో సంగీత, నాట్యాలను సిలబస్‌గా పెట్టే విధంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు తాడేపల్లి సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి మంచి టీచర్ ఇది నేను సంపాదించుకున్న బిరుదు. ఇప్పటికీ రోజుకు రెండు గంటల పాటు కదలకుండా కూర్చుని సాధన చేస్తాను, పిల్లల చేత సాధన చేయిస్తాను. ఇంట్లో సంగీతపాఠాలు చెప్పే టీచర్లు కొందరు పిల్లలను తాళం వేయమని చెప్పి తాము వంట చేసుకుంటూ ఒక చెవి ఒగ్గి గమనిస్తుంటారు. టీచర్ ఎదురుగా ఉంటేనే క్రమశిక్షణ అలవడుతుందని నా విశ్వాసం. సంగీతం అంటే సరిగమలు పలకడం మాత్రమే కాదు, ఆత్మతో మమేకం కావాలి. సంగీత సాధన పట్ల పిల్లల్లో ఆసక్తిని, ఇష్టాన్ని కలిగించినప్పుడే గురువుగా మేము ఉత్తీర్ణత సాధించినట్లు. అలాగే కళ కోసం జీవించడంలో ఉండే సంతృప్తి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. నా యూట్యూబ్ చానెల్ ‘తిల్లానా’ కోసం పాటలు పాడి రికార్డ్ చేస్తున్నాను. భగవంతుడు ఒక నైపుణ్యాన్ని ఇస్తాడు, దానిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది. – తాడేపల్లి సుబ్బలక్ష్మి, గాయని, వయోలిన్ విద్వాంసురాలు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
కోవిడ్ సమయాలు.. చిన్న చిన్న సంతోషాలకు స్వాగతం
పెరట్లో కొమ్మల గుబురు మాటున ఒక జామ పిందె లేత పసుపు కాయగా ఎదుగుతుంది. చూట్టానికి మనకు టైం ఉండదు. ఇంట్లో పిల్లవాడు హోమ్‌వర్క్ చేస్తూ చేస్తూ ఏదో అర్థం లేని కూనిరాగం అద్భుతంగా తీస్తాడు. వినడానికి మనకు టైం ఉండదు. దారిన పోతూ ఉంటే సూర్యుడి మీదకు మబ్బు తెరగట్టి చల్లటిగాలిని విసురుతుంది. ఆస్వాదించడానికి సమయం లేదే. అప్పుడే పుట్టిన దూడ చెంగనాలు వేస్తుంది. మనం బైక్ కిక్ కొట్టి ఎటో వెళ్లిపోతూ ఉంటాం. ఆగండ్రా... ఎక్కడికి ఆ పరుగు అని చెప్పడానికే మహమ్మారి పదే పదే వస్తున్నట్టుంది. లాక్డౌన్ విధించినా ఇంటి పట్టున ఒక్కరోజు ఉండలేనంత పరుగుకు అలవాటు పడిపోయాం. హాసం లాస్యం స్నేహం సౌఖ్యం నెమ్మది స్థిమిత మది వీటికి దగ్గరవ్వాలి. పిల్లలకూ దగ్గర చేయాలి. 2007. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో స్టేషన్. శీతగాలులు వీస్తున్న జనవరి నెల. ఉదయం పూట. ఒక మూల ఒక వయొలినిస్టు నిలబడి తన అద్భుతమైన వయొలిన్ వాదన మొదలెట్టాడు. అతని చేతిలోని ‘బౌ’ ఆరోహణ అవరోహణ చేస్తుంటే వేళ్లు తీగలను నిమురుతూ స్వరాలను పలికిస్తున్నాయి. జనం వస్తున్నారు. వెళుతున్నారు. స్వింగ్డోర్లు తెరుచుకుంటున్నాయి. మూసుకుంటున్నాయి. 45 నిమిషాలు అతను కచేరి చేస్తూ ఉంటే 1,097 మంది అతని ముందు నుంచి రాకపోకలు సాగించారు. కేవలం 7 మంది ఆగి మొత్తం కచ్చేరి విన్నారు. తల్లులతో వెళుతున్న పిల్లలు కుతూహలంతో ఆగబోతే తల్లులు వారిని లాక్కుంటూ తీసుకెళుతుంటే పిల్లలు తలలు తిప్పి ఆ వయొలినిస్ట్ను చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 27 మంది అంత బిజీలోనూ ఒక్క క్షణం ఆగి, ఆ సంగీతం మీద ఏ మాత్రం పట్టింపు లేకుండా, పోనీలే పాపం అని ఎదుట పరిచిన హ్యాట్లో చిల్లర వేసి వెళ్లారు. మొత్తం 32 డాలర్లు వచ్చాయి. ఆ ఉదయం, ఆ మెట్రో స్టేషన్ రద్దీలో, ఒక గొప్ప కచ్చేరి అనామకంగా ముగిసింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మూగలేదు. ఆ కళాకారుణ్ణి భుజాల మీదకు ఎత్తుకోలేదు. కాని అంతకు రెండు రోజుల ముందు బోస్టన్‌లో అదే వయొలినిస్టు షో కోసం 100 డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి జనం విరగబడ్డారు. ఆ వయొలినిస్టు ఇప్పటికే తన వయొలిన్ వాదనతో మూడున్నర మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అతడే సుప్రసిద్ధ అమెరికన్ వయొలిస్ట్ జాషువా బెల్. మనలో చాలా మందిమి ప్రత్యేక సందర్భాలలోనే కళకు, సౌందర్యానికి, ఆనందానికి, వినోదానికి సమయం ఇవ్వాలనుకుంటాం. కాని రోజువారి బిజీ జీవితంలో కేవలం ఉపాధికే సమయాన్ని వెచ్చించాలనుకుంటాం. కళ్ల ముందు అంత గొప్ప వయొలిన్ వాదన కూడా ఆ బిజీలో వెలవెలబోతుంటే ఎన్ని చిన్ని చిన్ని బతుకు చిత్రాలు సుందర జీవన సౌందర్యాలు మిస్ అయిపోతున్నామో కదా అని ఈ ‘సోషల్ ఎక్స్పెరిమెంట్’ రుజువు చేసింది. అందుకే సమయాన్ని బతుకు వెతుకులాటకే ఖర్చు చేయకండి... నడుమ చిన్ని చిన్న ఆనందాలని ఆస్వాదించండి. జాషువా బెల్ చెప్పినా, కోవిడ్ సమయాలు చెప్పినా సారం అదే. గత సీజన్లో లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా మంది ఆకాశాన్ని తేరిపార చూడగలిగారు సమయం చిక్కి. ఇళ్లల్లోనే ఉండటం వల్ల సాయంత్రాలు డాబా ఎక్కినప్పుడు శిరస్సు మీద పరుచుకున్న ఆ నీలిమ అంత అందంగా ఉంటుందా... ఎలా మిస్ అయ్యాం అనుకున్నవారు ఉన్నారు. బాల్కనీలోని మొక్కల్లో ఒక రక్తమందారం రెక్కలు విచ్చుకుని ఉంటుంది. అది ఏదో సంభాషిస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విష్ చేస్తూ ఉంటుంది. కాని ఆగి చూసే సమయం ఎక్కడ? లాక్డౌన్ వస్తే తప్ప సాధ్యం కాలేదు. అపార్ట్మెంట్ గేట్ ముందు వీధికుక్క నెల క్రితం కన్న పిల్లలు ఆడుకుంటుంటాయి. ఈ లోకం మీద విశ్వాసంతో మమ్మల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అటూ ఇటూ గునగున నడుస్తూ ఉంటాయి. పిల్లలు కనిపిస్తే తోకలు ఊపుతాయి. వాటి దైవికమైన మూగ సౌందర్యాన్ని దర్శించామా. రోజువారి పరుగులో దర్శించేందుకు కన్నులు తెరుస్తున్నామా? మన ఇంటి పనిమనిషికి ఒక పదేళ్లు కూతురు ఉన్నట్టు మనకు తెలియదు. మాసిన గౌన్ వేసుకున్న ఆ పాప ఎప్పుడైనా వచ్చినా సిగ్గుకొద్దీ తల్లి కొంగు వదలదు. ‘ఇలా రా’ అని ఆ పాప చేతుల్లో కొత్త డ్రస్సు ఒకటి పెట్టి ఆ పిల్ల తెల్లటి కన్నుల్లో మెరిసే సంతోషాన్ని చూస్తున్నామా? కొత్తది ఇవ్వలేకపోయినా మన పిల్లవాడు గత సంవత్సరం వాడి పక్కన పెట్టిన స్కూల్ బ్యాగ్‌ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చామా? చినుకుల జడి. చిన్న చిన్న బిందువులు జలధి. బుజ్జి బుజ్జి సంతోషాలు... జీవితం. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని చాలామంది అంటుంటారు. అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... కవి చెప్పలేదా? పశువులకు కూడా తెలుసు పాటకు మోర ఎత్తాలని. మంచి సంగీతం వినడానికి కూడా సమయం లేదా? బైక్ మీద రోడ్‌పై వెళుతుంటే అంధుల బృందం మైక్ సెట్ పెట్టుకుని పాడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగి ఒక పాటైనా విని ‘బాగా పాడారు’ అని చెప్పి పది రూపాయలు ఇస్తే ఈ చీకటి కళ్లల్లో వచ్చే సంబరం మనకు సంతృప్తి ఇవ్వదూ? సెల్‌ఫోన్ పక్కన పడేసి పక్కింటి మూడేళ్ల బుజ్జిగాణ్ణి తెచ్చుకుని వాడికి చిన్నప్పుడు విన్న నానమ్మ పాటో అమ్మమ్మ పాటో వినిపిస్తే వాడు లేత గులాబీరంగు పెదాలతో బోసిగా నవ్వి కళ్లు మిటకరిస్తూ చూస్తే... బదులు పాడితే మన అకౌంట్లో గుర్తు తెలియని అకౌంట్ నుంచి కోటి రూపాయలు పడిన దానితో సమానం. ఆ వేళ కొత్తిమీర పచ్చడి మనకు మనమే చేసుకున్నా... ఆ రాత్రి వంట మానేసి ఫుడ్ బజార్లో వేడి వేడి ఇడ్లీలు విసురు గాలిలో ఊదుకుంటూ తిన్నా ఆ ఆనందాన్ని కొలిచే కొలమానం లేదు. అప్పుడప్పుడు తీరిగ్గా కూచుని పాత ఆల్బమ్ తిరగేసినా, స్కూల్ నాటి ఫ్రెండ్‌ని ఫేస్బుక్లో పట్టుకుని పలకరించినా నింపిన టబ్‌లో పిల్లల కోసం బొమ్మ స్టీమర్ తిప్పినా చిట్టి పొట్టి చిరుతిళ్లు తినిపించినట్టే జీవితానికి. కొంపలు మునిగేదేమి లేదు... నిత్య పరుగులు లేకపోయినా మనం బతగ్గలం అని కరోనా పదే పదే మనకు చెబుతోంది. కాని మనమే వినడం లేదు. అది మ్యుటేషన్లు మార్చుకుంటోంది. మనం మన ధోరణి మార్చుకోవడం లేదు. ‘స్లో’ అనేది ఇటీవలి జీవన విధానం. ‘స్లో’గా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చేమో చూడండి. ఈ రెండు మూడు నెలలు గుంపుల్లో ఉండకుండా ఉరుకులు పరుగులు ఎత్తకుండా అనవసర ప్రయాణాలు చేయకుండా జీవితం ప్రసాదించి చిరు ఆనందాల ప్రసాదాన్ని ఆరగించండి. జయం. -
వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ కన్నుమూత
చెన్నై : కర్ణాటక సంగీత ప్రపంచంలో వయోలిన్ త్రిమూర్తుల్లో ఒకరిగా ప్రఖ్యాతి పొందారు టీఎన్ కృష్ణన్. వయోలిన్ త్రిమూర్తుల్లో మిగిలిన ఇద్దరూ లాల్గుడి జీ జయరామన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్. వారిద్దరూ ఏడేళ్ల కిందటే కొద్ది నెలల వ్యవధిలో గతించారు. వారిలో ఒకరైన టీఎన్ కృష్ణన్ సోమవారం రాత్రి చెన్నైలో కన్ను మూశారు. కేరళలోని తిరుపణిత్తూర్‌లో నారాయణ అయ్యర్, అమ్మణి అమ్మాళ్ దంపతులకు 1928 అక్టోబర్ 6న జన్మించిన తిరుపణిత్తూర్ నారాయణ అయ్యర్ కృష్ణన్ బాల విద్వాంసుడిగా పదకొండేళ్ల పసితనం నుంచే కచేరీలు చేయడం ప్రారంభించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి వద్ద సరిగమలు నేర్చుకుని, సాధన ప్రారంభించారు. తండ్రి నారాయణన్ అయ్యర్ కొచ్చిన్ సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా ఉండేవారు. ఆయన గాత్ర విద్వాంసుడే కాకుండా, బహువాద్య నిపుణుడు. తన తండ్రి తొంభై తొమ్మిదో ఏట కన్నుమూసేంత వరకు తనకు సంగీత పాఠాలు చెబుతూనే వచ్చారని కృష్ణన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. చదవండి: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్ బాల్యంలోనే ఆయన ఆనాటి సంగీత దిగ్గజాలు అరైకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్, ఎం.డి.రామనాథన్, అళత్తూర్ సోదరులు వంటి వారి గాత్ర కచేరీల్లో వారి పక్కన వయొలిన్ వాయించేవారు. సంగీతంలో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో 1942లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాత విద్వాంసుడు శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్‌ను కలుసుకుంటే, ఆయన కృష్ణన్ బాధ్యతను పారిశ్రామికవేత్త అయ్యదురైకి అప్పగించారు. అయ్యదురై దంపతులు కృష్ణన్‌ను తమ ఇంట్లోనే ఉంచుకుని, సొంత బిడ్డలా చూసుకున్నారు. అరైకుడి రామానుజ అయ్యంగార్, శెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ల శిక్షణలో టి.ఎన్.కృష్ణన్ తన సంగీత ప్రజ్ఞకు మరింతగా మెరుగులు దిద్దుకున్నారు. చదవండి: కరోనా: తమిళనాడు మంత్రి కన్నుమూత సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండానే, ఆధునిక పోకడలను అందిపుచ్చుకున్న టి.ఎన్.కృష్ణన్ సంగీత ఆచార్యుడిగా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. మద్రాసు సంగీత కళాశాలలో ప్రొఫెసర్‌గా, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైనార్ట్స్ డీన్‌గా సేవలందించారు. కేవలం లిపిబద్ధంగా మాత్రమే అందుబాటులో ఉన్న పూర్వ విద్వాంసుల స్వరకల్పనలను యథాతథంగా శ్రోతలకు వినిపించే అరుదైన విద్వాంసుల్లో ఒకరిగా టి.ఎన్.కృష్ణన్ తన సమకాలికుల మన్ననలు చూరగొన్నారు. జాంగ్రీ, బాదం హల్వాలను అమితంగా ఇష్టపడే కృష్ణన్, తన స్వరాలకు బహుశ వాటి మాధుర్యాన్ని అద్దారేమోననిపిస్తుంది ఆయన కచేరీలు వినేవాళ్లకు. దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన కచేరీలు చేశారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, జాకిర్ హుస్సేన్ వంటి హిందుస్తానీ విద్వాంసులతో కలసి చేసిన జుగల్బందీ కచేరీలు ఆయనను ఉత్తరాది శ్రోతలకూ దగ్గర చేశాయి. టి.ఎన్.కృష్ణన్ సోదరి ఎన్.రాజం కూడా వయోలిన్ విద్వాంసురాలే. అయితే, ఆమె హిందుస్తానీ విద్వాంసురాలు. ఆమెతో కలసి కూడా జుగల్బందీలు చేశారు. ఆయన కుమార్తె విజి కృష్ణన్ నటరాజన్, కుమారుడు శ్రీరామ్ కృష్ణన్ సహా ఎందరో శిష్యులు కర్ణాటక సంగీత విద్వాంసులుగా రాణిస్తున్నారు. టి.ఎన్.కృష్ణన్ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1973లో ఆయనను ‘పద్మశ్రీ’తో, 1992లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఆయన సంగీత నాటక అకాడమీ అవార్డు (1974), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2006) పొందారు. చెన్నైలోని ది ఇండియన్ ఫైనార్ట్స్ సొసైటీ 1999లో ఆయనను ‘సంగీత కళాశిఖామణి’ బిరుదుతో సత్కరించింది. ఇవే కాకుండా, తన ఎనభయ్యేళ్ల సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో ఆయన ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు టి.ఎన్.కృష్ణన్ సంగీత రంగానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. -
మనామి గురించి తెలిస్తే మన ఆలోచన మారుతుంది
సేవలో అమ్మలా.. నీటిలో చేపలా..సంగీతంలో సరిగమలా.. మనామి ఓ అద్భుతం. సంకల్పానికి నిలువుటద్దం. కృత్రిమ చేత్తో వయోలిన్ వాయిస్తూ ఆకట్టుకుంటున్న ఈ యువతిని చూస్తుంటే ఇలాంటి వీడియోలు, చిత్రాలు ఎన్నో చూశాం కదా అనుకోవచ్చు. కానీ, మనామి గురించి తెలుసుకుంటే మాత్రం మన ఆలోచనా దృక్పథం ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ‘మనామి ఇటో అకా’ జపాన్ వాసి. ఓ అద్భుతమైన వయోలిన్ వాయిద్యకారిణి. మనామి వయోలిన్‌ను చేతిలోకి తీసుకునేముందు తన భుజాలను ఒకసారి సరిచేసు కుంటుంది. ఆ తర్వాత వయోలిన్‌ను ఎడమ చేత్తో భుజం మీదుగా పట్టుకుని, ఆపై ప్రొస్తెటిక్ చేయికి కట్టిన వయోలిన్ కీ సహాయంతో ప్లే చేస్తుంది. ఆ వయోలిన్ నాదం చెవులకు వీనుల విందుచేస్తుంది. మనిషి సంకల్పం ముందు ఎంతటి అడ్డంకినైనా గడ్డిపోచగా మార్చుకోవచ్చు అని నిరూపిస్తుంది మనామి. (‘రెండు గంటల మాటలు.. పెళ్లి చేసుకుందాం’) కృత్రిమ చేయి ఉన్న జపాన్ మొదటి నర్సు మనామి సాధించిన విజయాల జాబితా చూస్తే ఒక్క వయోలిన్ వాయిద్యకారిణిగానే ఆమె మిగిలిపోదు. ప్రమాదంలో చేయి కోల్పోయినా తన అభిరుచిని వదల్లేదు. అలాగే చదువునూ వదల్లేదు. నర్సింగ్ చదువుతున్న కాలంలో ప్రమాదం జరిగినా చదువును కొనసాగించి నర్సు అయ్యింది. ప్రోస్తెటిక్ చేయితో రోగులకు సేవలు అందిస్తుండటంతో జపాన్‌లో ‘ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్స్’గా గుర్తింపు పొందింది. మనామి నర్సు, వయోలిన్ వాద్యకారిణి, అలాగే ప్రసిద్ధ పారాలింపిక్ స్విమ్మర్ కూడా. 2008 బీజింగ్ పారాలింపిక్స్‌లో 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో నాలుగో స్థానం, 2012 లో జరిగిన లండన్ పారాలింపిక్స్‌లో 8వ స్థానం లో నిలిచింది. మనామి వీడియో ట్విట్టర్లో షేర్ అవడంతో ఇప్పుడది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా మనామికి అభినందనలు తెలుపుతున్నారు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుంటే పట్టుదల మనిషిని ఏ విజయతీరాలకు చేరుస్తుందో కళ్లారా వీక్షించవచ్చు. మన జీవితాలనూ గొప్పగా దిద్దుకోవడానికి స్ఫూర్తిగా నిలుపుకోవచ్చు. (ఒడి పట్టిన హీరో) -
పెద్దపులి
ఆయన ఒక సంగీత విద్వాంసుడు. వయొలిన్ వాయించాడంటే మండుటెండల్లో కూడా వర్షాలు కురుస్తాయని పేరు. ఆయన ఒకసారి ఒక సర్కస్ చూడటానికి వెళ్లాడు. అక్కడొక సర్కస్ కళాకారుడు వయొలిన్ వాయిస్తుంటే ఒక ఎలుగుబంటి డాన్స్ చేసింది. ప్రేక్షకుల చప్పట్లతో సర్కస్ టెంట్ మార్మోగింది. అది చూసిన మన వయొలిన్ విద్వాంసుడు ‘‘బాగా తర్ఫీదునిచ్చిన ఎలుగుబంటి మాత్రమే నీ వయొలిన్‌కు తగినట్టు నాట్యం చేయగలదు. కాని నా సంగీతంతో ఎటువంటి జంతువు చేతనైనా నాట్యం చేయించగలను’’అన్నాడు గొప్పగా. ‘‘అది సాధ్యం కాదు’’ అన్నాడు సర్కస్ కళాకారుడు. ఇద్దరికీ మాటా మాటా పెరిగి పోటీకి దారితీసింది. దాంతో వయొలిన్ విద్వాంసుడికి ఎదురుగా ఒక సింహాన్ని పంపాడు సర్కస్ కళాకారుడు. వయొలిన్ నాదానికి చిందులేస్తూ ఆడింది సింహం. ఆ తరువాత ఒక చిరుతపులిని పంపాడు. అది కూడా వయొలిన్ సంగీతానికి మైమరచి నాట్యం చేసింది. తరువాత ఒక పెద్దపులి వంతు వచ్చింది. ఏమాత్రం బెదిరిపోకుండా అద్భుతంగా వయొలిన్ వాయించసాగాడు విద్వాంసుడు. అయితే ఆ పులి సంగీతానికి అసలు ఏమీ మైమరచిపోకుండా పంజావిప్పి వయొలిన్ విద్వాంసుడి మీదికి దూకబోయింది. బిత్తరపోయిన ప్రేక్షకులు చెల్లాచెదరయ్యారు. విద్వాంసుడు కూడా వయొలిన్‌ను కిందపడేసి పరుగుతీసి పులిబారి నుంచి తప్పించుకున్నాడు. సర్కస్ సిబ్బంది ఒడుపుగా పులిని బోనులో బంధించారు. ప్రాణభయం నుంచి తేరుకున్న సంగీత విద్వాంసుడు సర్కస్ కళాకారుని ముందు తన ఓటమిని అంగీకరిస్తూనే, ఆ పెద్దపులి తన సంగీతానికి కట్టుబడకపోవడం తనకెంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నాడు. అందుకు సర్కస్ కళాకారుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ‘‘ఆ పెద్ద పులి పుట్టినప్పుడే దానికి చెవుల్లేవు. ఈ సంగతి గమనించిన ప్రేక్షకులు పారిపోవడం ప్రారంభించారు. మీరు అది గమనించకుండా వయొలిన్ వాయిస్తూనే ఉన్నారు’’అన్నాడు. సంగీత విద్వాంసుడు తల దించుకున్నాడు. ఈ కథను చెప్పిన గురువు తన శిష్యులతో– చదువు, తెలివి, చురుకుదనం మాత్రమే ఉంటే చాలదు. వర్తమానం గురించిన స్పృహ కూడా అవసరం. ఈ వివేకం లేనివారికి ఎన్ని తెలివితేటలున్నా ఏవిధమైన ప్రయోజనమూ ఉండదని గ్రహించాలి’’ అని బోధించాడు. – డి.వి.ఆర్. -
రాగాల పల్లకిలో కోకిలమ్మలు..
రాగాల పల్లకిలో కోకిలమ్మలు.. సంగీత సామ్రాజ్యంలో విరిసిన జంటస్వరాలు.. ఈ అక్కాచెల్లెళ్లు. తమిళనాట విరిసిన ఈ కర్ణాటక సంగీత ఝరి.. అటుపై ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. చిన్ననాటి నుంచి ఒకే మాట.. ఒకే పాటగా సాగిన వీరి యుగళార్చన.. సరాగాలతో పల్లవించింది. వయోలినిస్ట్‌లుగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు సోదరీమణులూ.. మధుర గాత్రంతో గంధర్వ గీతికలను వినిపిస్తున్నారు. సౌత్ ఇండియన్ కల్చర్ అసోసియేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన రంజనీ, గాయత్రి సిస్టర్స్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. తొమ్మిదో ఏట నుంచే ఇద్దరం సంగీతం నేర్చుకోవడం ఆరంభించాం. మా అమ్మ మీనాక్షి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఆమె సంప్రదాయ సంగీతంలో ప్రసిద్ధులైన పాలక్కాడ్ అయ్యర్ కుటుంబంలో జన్మించింది. అందుకే చిన్ననాటి నుంచే సంగీతంపై అభిరుచి ఏర్పడింది. చదువుతో పాటు సంగీత సాధన చేశాం. ఆ రోజు పడిన కష్టానికి ఫలితం ఇదిగో ఈ రోజు సంగీత పథంలో మాకంటూ ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. మొదట్లో వయోలినిస్ట్‌లుగా ఉన్న మేము క్రమంగా గాత్ర కచేరీల్లో స్థిరపడ్డాం.అలా నేర్చుకున్నాం 1997లో మొదటిసారి ప్రదర్శన ఇచ్చాం. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పద్మభూషణ్ పీఎస్ నారాయణస్వామిదగ్గర సంగీతం నేర్చుకున్నాం. ఆయన శిష్యరికంతో మాకు కచేరీలలో ఏ ఆటంకాలు ఎదురుకాలేదు. ప్రముఖ విద్వాంసురాలు డీకే పట్టమ్మాళ్తో కలసి కచేరీలు చేయగలిగాం. ఈ అవకాశాన్ని మా అదృష్టంగా భావిస్తాం. తర్వాతి కాలంలో సీతానారాయణ్ దగ్గర భజనలు, విశ్వాస్ జోషి దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాం. ప్రపంచ ఖ్యాతి పొందిన కొల్హాపూర్‌కు చెందిన మానిక్ ఖైద్- అప్పాసాహెబ్ దగ్గర కూడా నేర్చుకున్నాం. తిరుమలేశుని కృప మా మొట్టమొదటి కచేరి తిరుమల తిరుపతి దేవస్థానం కార్యక్రమాల్లో భాగంగా జరిగింది. వేలాది మంది జనం మధ్య సాగిన ఆ కచేరీని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నాం.వేంకటేశుడి కృపతో ఆనాటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ స్వామే మమ్మల్ని నడిపిస్తున్నాడని అనిపిస్తుంటుంది. అలా మొదలైన మా గాత్ర ప్రయాణం జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిధ్వనించింది. అమెరికా, యూకే, కెనెడా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాం. అభిమానమే అవార్డులు అవార్డులు, బిరుదుల కన్నా.. ప్రేక్షకుల అభిమానమే మాకు ఎక్కువ ఆనందాన్ని పంచుతుంది. ఢిల్లీలోని సంస్కృతి ఫౌండేషన్ ఇచ్చిన అవార్డులతో మొదలు.. కల్కి కృష్ణమూర్తి మెమోరియల్ అవార్డు, యోగం నారాయణ స్వామి అవార్డు ఇలా ఎన్నో వచ్చాయి. ప్రముఖ సితార్ విద్వాంసుడు, భారతరత్న పురస్కార గ్రహీత పండిత్ రవిశంకర్ ఢిల్లీలో మా గాత్ర కచేరీకి వచ్చి మమ్మల్ని అభినందించారు. ఆ ఆనందం వెల కట్టలేనిది. ఇది సరిగమనం హైదరాబాద్‌తో మా అనుబంధం ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ఇక్కడ చాలా క చేరీలు నిర్వహించాం. ఇక్కడి వారికి సంగీతంపై మక్కువే కాదు పరిజ్ఞానం కూడా ఉంది. ఎంతో శ్రద్ధగా వింటారు. చక్కగా ఆనందిస్తారు. ఈ తరం పిల్లలు సంగీతం వైపు నడుస్తున్నారు. కార్పొరేట్ కల్చర్‌లో జీవిస్తున్నా.. శాస్త్రీయ సంగీతంపై మక్కువతో ఈ రంగం వైపు వస్తున్నారు. చదువుతో పాటు సంగీత సాధనలో కూడా అద్భుతాలు సృష్టిస్తున్నారు. సరిగమల సావాసంతో మనోబలం కలుగుతుంది. ఈ మార్గం వైపు మరింత మంది రావాలి. ..:: కోన సుధాకర్‌రెడ్డి