పెరట్లో కొమ్మల గుబురు మాటున ఒక జామ పిందె లేత పసుపు కాయగా ఎదుగుతుంది. చూట్టానికి మనకు టైం ఉండదు. ఇంట్లో పిల్లవాడు హోమ్‌వర్క్ చేస్తూ చేస్తూ ఏదో అర్థం లేని కూనిరాగం అద్భుతంగా తీస్తాడు. వినడానికి మనకు టైం ఉండదు. దారిన పోతూ ఉంటే సూర్యుడి మీదకు మబ్బు తెరగట్టి చల్లటిగాలిని విసురుతుంది. ఆస్వాదించడానికి సమయం లేదే.
అప్పుడే పుట్టిన దూడ చెంగనాలు వేస్తుంది. మనం బైక్ కిక్ కొట్టి ఎటో వెళ్లిపోతూ ఉంటాం. ఆగండ్రా... ఎక్కడికి ఆ పరుగు అని చెప్పడానికే మహమ్మారి పదే పదే వస్తున్నట్టుంది. లాక్‌డౌన్ విధించినా ఇంటి పట్టున ఒక్కరోజు ఉండలేనంత పరుగుకు అలవాటు పడిపోయాం. హాసం లాస్యం స్నేహం సౌఖ్యం నెమ్మది స్థిమిత మది వీటికి దగ్గరవ్వాలి. పిల్లలకూ దగ్గర చేయాలి.
2007. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో స్టేషన్. శీతగాలులు వీస్తున్న జనవరి నెల. ఉదయం పూట. ఒక మూల ఒక వయొలినిస్టు నిలబడి తన అద్భుతమైన వయొలిన్ వాదన మొదలెట్టాడు. అతని చేతిలోని ‘బౌ’ ఆరోహణ అవరోహణ చేస్తుంటే వేళ్లు తీగలను నిమురుతూ స్వరాలను పలికిస్తున్నాయి. జనం వస్తున్నారు. వెళుతున్నారు. స్వింగ్‌డోర్లు తెరుచుకుంటున్నాయి. మూసుకుంటున్నాయి.
45 నిమిషాలు అతను కచేరి చేస్తూ ఉంటే 1,097 మంది అతని ముందు నుంచి రాకపోకలు సాగించారు. కేవలం 7 మంది ఆగి మొత్తం కచ్చేరి విన్నారు. తల్లులతో వెళుతున్న పిల్లలు కుతూహలంతో ఆగబోతే తల్లులు వారిని లాక్కుంటూ తీసుకెళుతుంటే పిల్లలు తలలు తిప్పి ఆ వయొలినిస్ట్‌ను చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 27 మంది అంత బిజీలోనూ ఒక్క క్షణం ఆగి, ఆ సంగీతం మీద ఏ మాత్రం పట్టింపు లేకుండా, పోనీలే పాపం అని ఎదుట పరిచిన హ్యాట్‌లో చిల్లర వేసి వెళ్లారు.
మొత్తం 32 డాలర్లు వచ్చాయి. ఆ ఉదయం, ఆ మెట్రో స్టేషన్ రద్దీలో, ఒక గొప్ప కచ్చేరి అనామకంగా ముగిసింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మూగలేదు. ఆ కళాకారుణ్ణి భుజాల మీదకు ఎత్తుకోలేదు. కాని అంతకు రెండు రోజుల ముందు బోస్టన్‌లో అదే వయొలినిస్టు షో కోసం 100 డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి జనం విరగబడ్డారు. ఆ వయొలినిస్టు ఇప్పటికే తన వయొలిన్ వాదనతో మూడున్నర మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అతడే సుప్రసిద్ధ అమెరికన్ వయొలిస్ట్ జాషువా బెల్.
మనలో చాలా మందిమి ప్రత్యేక సందర్భాలలోనే కళకు, సౌందర్యానికి, ఆనందానికి, వినోదానికి సమయం ఇవ్వాలనుకుంటాం. కాని రోజువారి బిజీ జీవితంలో కేవలం ఉపాధికే సమయాన్ని వెచ్చించాలనుకుంటాం. కళ్ల ముందు అంత గొప్ప వయొలిన్ వాదన కూడా ఆ బిజీలో వెలవెలబోతుంటే ఎన్ని చిన్ని చిన్ని బతుకు చిత్రాలు సుందర జీవన సౌందర్యాలు మిస్ అయిపోతున్నామో కదా అని ఈ ‘సోషల్ ఎక్స్‌పెరిమెంట్’ రుజువు చేసింది. అందుకే సమయాన్ని బతుకు వెతుకులాటకే ఖర్చు చేయకండి... నడుమ చిన్ని చిన్న ఆనందాలని ఆస్వాదించండి. జాషువా బెల్ చెప్పినా, కోవిడ్ సమయాలు చెప్పినా సారం అదే.
గత సీజన్‌లో లాక్‌డౌన్ వచ్చినప్పుడు చాలా మంది ఆకాశాన్ని తేరిపార చూడగలిగారు సమయం చిక్కి. ఇళ్లల్లోనే ఉండటం వల్ల సాయంత్రాలు డాబా ఎక్కినప్పుడు శిరస్సు మీద పరుచుకున్న ఆ నీలిమ అంత అందంగా ఉంటుందా... ఎలా మిస్ అయ్యాం అనుకున్నవారు ఉన్నారు. బాల్కనీలోని మొక్కల్లో ఒక రక్తమందారం రెక్కలు విచ్చుకుని ఉంటుంది. అది ఏదో సంభాషిస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విష్ చేస్తూ ఉంటుంది. కాని ఆగి చూసే సమయం ఎక్కడ? లాక్‌డౌన్ వస్తే తప్ప సాధ్యం కాలేదు.
అపార్ట్‌మెంట్ గేట్ ముందు వీధికుక్క నెల క్రితం కన్న పిల్లలు ఆడుకుంటుంటాయి. ఈ లోకం మీద విశ్వాసంతో మమ్మల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అటూ ఇటూ గునగున నడుస్తూ ఉంటాయి. పిల్లలు కనిపిస్తే తోకలు ఊపుతాయి. వాటి దైవికమైన మూగ సౌందర్యాన్ని దర్శించామా. రోజువారి పరుగులో దర్శించేందుకు కన్నులు తెరుస్తున్నామా? మన ఇంటి పనిమనిషికి ఒక పదేళ్లు కూతురు ఉన్నట్టు మనకు తెలియదు.
మాసిన గౌన్ వేసుకున్న ఆ పాప ఎప్పుడైనా వచ్చినా సిగ్గుకొద్దీ తల్లి కొంగు వదలదు. ‘ఇలా రా’ అని ఆ పాప చేతుల్లో కొత్త డ్రస్సు ఒకటి పెట్టి ఆ పిల్ల తెల్లటి కన్నుల్లో మెరిసే సంతోషాన్ని చూస్తున్నామా? కొత్తది ఇవ్వలేకపోయినా మన పిల్లవాడు గత సంవత్సరం వాడి పక్కన పెట్టిన స్కూల్ బ్యాగ్‌ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చామా? చినుకుల జడి. చిన్న చిన్న బిందువులు జలధి. బుజ్జి బుజ్జి సంతోషాలు... జీవితం. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని చాలామంది అంటుంటారు. అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... కవి చెప్పలేదా?
పశువులకు కూడా తెలుసు పాటకు మోర ఎత్తాలని. మంచి సంగీతం వినడానికి కూడా సమయం లేదా? బైక్ మీద రోడ్‌పై వెళుతుంటే అంధుల బృందం మైక్ సెట్ పెట్టుకుని పాడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగి ఒక పాటైనా విని ‘బాగా పాడారు’ అని చెప్పి పది రూపాయలు ఇస్తే ఈ చీకటి కళ్లల్లో వచ్చే సంబరం మనకు సంతృప్తి ఇవ్వదూ? సెల్‌ఫోన్ పక్కన పడేసి పక్కింటి మూడేళ్ల బుజ్జిగాణ్ణి తెచ్చుకుని వాడికి చిన్నప్పుడు విన్న నానమ్మ పాటో అమ్మమ్మ పాటో వినిపిస్తే వాడు లేత గులాబీరంగు పెదాలతో బోసిగా నవ్వి కళ్లు మిటకరిస్తూ చూస్తే... బదులు పాడితే మన అకౌంట్‌లో గుర్తు తెలియని అకౌంట్ నుంచి కోటి రూపాయలు పడిన దానితో సమానం. ఆ వేళ కొత్తిమీర పచ్చడి మనకు మనమే చేసుకున్నా... ఆ రాత్రి వంట మానేసి ఫుడ్ బజార్‌లో వేడి వేడి ఇడ్లీలు విసురు గాలిలో ఊదుకుంటూ తిన్నా ఆ ఆనందాన్ని కొలిచే కొలమానం లేదు.
అప్పుడప్పుడు తీరిగ్గా కూచుని పాత ఆల్బమ్ తిరగేసినా, స్కూల్ నాటి ఫ్రెండ్‌ని ఫేస్‌బుక్‌లో పట్టుకుని పలకరించినా నింపిన టబ్‌లో పిల్లల కోసం బొమ్మ స్టీమర్ తిప్పినా చిట్టి పొట్టి చిరుతిళ్లు తినిపించినట్టే జీవితానికి.
కొంపలు మునిగేదేమి లేదు... నిత్య పరుగులు లేకపోయినా మనం బతగ్గలం అని కరోనా పదే పదే మనకు చెబుతోంది. కాని మనమే వినడం లేదు. అది మ్యుటేషన్లు మార్చుకుంటోంది. మనం మన ధోరణి మార్చుకోవడం లేదు. ‘స్లో’ అనేది ఇటీవలి జీవన విధానం. ‘స్లో’గా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చేమో చూడండి. ఈ రెండు మూడు నెలలు గుంపుల్లో ఉండకుండా ఉరుకులు పరుగులు ఎత్తకుండా అనవసర ప్రయాణాలు చేయకుండా జీవితం ప్రసాదించి చిరు ఆనందాల ప్రసాదాన్ని ఆరగించండి.
జయం.
Comments
Please login to add a commentAdd a comment