WASHINGTON DC METRO
-
కోవిడ్ సమయాలు.. చిన్న చిన్న సంతోషాలకు స్వాగతం
పెరట్లో కొమ్మల గుబురు మాటున ఒక జామ పిందె లేత పసుపు కాయగా ఎదుగుతుంది. చూట్టానికి మనకు టైం ఉండదు. ఇంట్లో పిల్లవాడు హోమ్‌వర్క్ చేస్తూ చేస్తూ ఏదో అర్థం లేని కూనిరాగం అద్భుతంగా తీస్తాడు. వినడానికి మనకు టైం ఉండదు. దారిన పోతూ ఉంటే సూర్యుడి మీదకు మబ్బు తెరగట్టి చల్లటిగాలిని విసురుతుంది. ఆస్వాదించడానికి సమయం లేదే. అప్పుడే పుట్టిన దూడ చెంగనాలు వేస్తుంది. మనం బైక్ కిక్ కొట్టి ఎటో వెళ్లిపోతూ ఉంటాం. ఆగండ్రా... ఎక్కడికి ఆ పరుగు అని చెప్పడానికే మహమ్మారి పదే పదే వస్తున్నట్టుంది. లాక్డౌన్ విధించినా ఇంటి పట్టున ఒక్కరోజు ఉండలేనంత పరుగుకు అలవాటు పడిపోయాం. హాసం లాస్యం స్నేహం సౌఖ్యం నెమ్మది స్థిమిత మది వీటికి దగ్గరవ్వాలి. పిల్లలకూ దగ్గర చేయాలి. 2007. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి మెట్రో స్టేషన్. శీతగాలులు వీస్తున్న జనవరి నెల. ఉదయం పూట. ఒక మూల ఒక వయొలినిస్టు నిలబడి తన అద్భుతమైన వయొలిన్ వాదన మొదలెట్టాడు. అతని చేతిలోని ‘బౌ’ ఆరోహణ అవరోహణ చేస్తుంటే వేళ్లు తీగలను నిమురుతూ స్వరాలను పలికిస్తున్నాయి. జనం వస్తున్నారు. వెళుతున్నారు. స్వింగ్డోర్లు తెరుచుకుంటున్నాయి. మూసుకుంటున్నాయి. 45 నిమిషాలు అతను కచేరి చేస్తూ ఉంటే 1,097 మంది అతని ముందు నుంచి రాకపోకలు సాగించారు. కేవలం 7 మంది ఆగి మొత్తం కచ్చేరి విన్నారు. తల్లులతో వెళుతున్న పిల్లలు కుతూహలంతో ఆగబోతే తల్లులు వారిని లాక్కుంటూ తీసుకెళుతుంటే పిల్లలు తలలు తిప్పి ఆ వయొలినిస్ట్ను చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించారు. 27 మంది అంత బిజీలోనూ ఒక్క క్షణం ఆగి, ఆ సంగీతం మీద ఏ మాత్రం పట్టింపు లేకుండా, పోనీలే పాపం అని ఎదుట పరిచిన హ్యాట్లో చిల్లర వేసి వెళ్లారు. మొత్తం 32 డాలర్లు వచ్చాయి. ఆ ఉదయం, ఆ మెట్రో స్టేషన్ రద్దీలో, ఒక గొప్ప కచ్చేరి అనామకంగా ముగిసింది. ఎవరూ చప్పట్లు కొట్టలేదు. మూగలేదు. ఆ కళాకారుణ్ణి భుజాల మీదకు ఎత్తుకోలేదు. కాని అంతకు రెండు రోజుల ముందు బోస్టన్‌లో అదే వయొలినిస్టు షో కోసం 100 డాలర్లు పెట్టి టికెట్ కొనడానికి జనం విరగబడ్డారు. ఆ వయొలినిస్టు ఇప్పటికే తన వయొలిన్ వాదనతో మూడున్నర మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అతడే సుప్రసిద్ధ అమెరికన్ వయొలిస్ట్ జాషువా బెల్. మనలో చాలా మందిమి ప్రత్యేక సందర్భాలలోనే కళకు, సౌందర్యానికి, ఆనందానికి, వినోదానికి సమయం ఇవ్వాలనుకుంటాం. కాని రోజువారి బిజీ జీవితంలో కేవలం ఉపాధికే సమయాన్ని వెచ్చించాలనుకుంటాం. కళ్ల ముందు అంత గొప్ప వయొలిన్ వాదన కూడా ఆ బిజీలో వెలవెలబోతుంటే ఎన్ని చిన్ని చిన్ని బతుకు చిత్రాలు సుందర జీవన సౌందర్యాలు మిస్ అయిపోతున్నామో కదా అని ఈ ‘సోషల్ ఎక్స్పెరిమెంట్’ రుజువు చేసింది. అందుకే సమయాన్ని బతుకు వెతుకులాటకే ఖర్చు చేయకండి... నడుమ చిన్ని చిన్న ఆనందాలని ఆస్వాదించండి. జాషువా బెల్ చెప్పినా, కోవిడ్ సమయాలు చెప్పినా సారం అదే. గత సీజన్లో లాక్డౌన్ వచ్చినప్పుడు చాలా మంది ఆకాశాన్ని తేరిపార చూడగలిగారు సమయం చిక్కి. ఇళ్లల్లోనే ఉండటం వల్ల సాయంత్రాలు డాబా ఎక్కినప్పుడు శిరస్సు మీద పరుచుకున్న ఆ నీలిమ అంత అందంగా ఉంటుందా... ఎలా మిస్ అయ్యాం అనుకున్నవారు ఉన్నారు. బాల్కనీలోని మొక్కల్లో ఒక రక్తమందారం రెక్కలు విచ్చుకుని ఉంటుంది. అది ఏదో సంభాషిస్తూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటే విష్ చేస్తూ ఉంటుంది. కాని ఆగి చూసే సమయం ఎక్కడ? లాక్డౌన్ వస్తే తప్ప సాధ్యం కాలేదు. అపార్ట్మెంట్ గేట్ ముందు వీధికుక్క నెల క్రితం కన్న పిల్లలు ఆడుకుంటుంటాయి. ఈ లోకం మీద విశ్వాసంతో మమ్మల్ని ఎవరో ఒకరు చూసుకుంటారులే అని అటూ ఇటూ గునగున నడుస్తూ ఉంటాయి. పిల్లలు కనిపిస్తే తోకలు ఊపుతాయి. వాటి దైవికమైన మూగ సౌందర్యాన్ని దర్శించామా. రోజువారి పరుగులో దర్శించేందుకు కన్నులు తెరుస్తున్నామా? మన ఇంటి పనిమనిషికి ఒక పదేళ్లు కూతురు ఉన్నట్టు మనకు తెలియదు. మాసిన గౌన్ వేసుకున్న ఆ పాప ఎప్పుడైనా వచ్చినా సిగ్గుకొద్దీ తల్లి కొంగు వదలదు. ‘ఇలా రా’ అని ఆ పాప చేతుల్లో కొత్త డ్రస్సు ఒకటి పెట్టి ఆ పిల్ల తెల్లటి కన్నుల్లో మెరిసే సంతోషాన్ని చూస్తున్నామా? కొత్తది ఇవ్వలేకపోయినా మన పిల్లవాడు గత సంవత్సరం వాడి పక్కన పెట్టిన స్కూల్ బ్యాగ్‌ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇచ్చామా? చినుకుల జడి. చిన్న చిన్న బిందువులు జలధి. బుజ్జి బుజ్జి సంతోషాలు... జీవితం. ఈ జీవితానికి అర్థం ఏమిటి అని చాలామంది అంటుంటారు. అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం... కవి చెప్పలేదా? పశువులకు కూడా తెలుసు పాటకు మోర ఎత్తాలని. మంచి సంగీతం వినడానికి కూడా సమయం లేదా? బైక్ మీద రోడ్‌పై వెళుతుంటే అంధుల బృందం మైక్ సెట్ పెట్టుకుని పాడుతూ ఉంటుంది. ఒక నిమిషం ఆగి ఒక పాటైనా విని ‘బాగా పాడారు’ అని చెప్పి పది రూపాయలు ఇస్తే ఈ చీకటి కళ్లల్లో వచ్చే సంబరం మనకు సంతృప్తి ఇవ్వదూ? సెల్‌ఫోన్ పక్కన పడేసి పక్కింటి మూడేళ్ల బుజ్జిగాణ్ణి తెచ్చుకుని వాడికి చిన్నప్పుడు విన్న నానమ్మ పాటో అమ్మమ్మ పాటో వినిపిస్తే వాడు లేత గులాబీరంగు పెదాలతో బోసిగా నవ్వి కళ్లు మిటకరిస్తూ చూస్తే... బదులు పాడితే మన అకౌంట్లో గుర్తు తెలియని అకౌంట్ నుంచి కోటి రూపాయలు పడిన దానితో సమానం. ఆ వేళ కొత్తిమీర పచ్చడి మనకు మనమే చేసుకున్నా... ఆ రాత్రి వంట మానేసి ఫుడ్ బజార్లో వేడి వేడి ఇడ్లీలు విసురు గాలిలో ఊదుకుంటూ తిన్నా ఆ ఆనందాన్ని కొలిచే కొలమానం లేదు. అప్పుడప్పుడు తీరిగ్గా కూచుని పాత ఆల్బమ్ తిరగేసినా, స్కూల్ నాటి ఫ్రెండ్‌ని ఫేస్బుక్లో పట్టుకుని పలకరించినా నింపిన టబ్‌లో పిల్లల కోసం బొమ్మ స్టీమర్ తిప్పినా చిట్టి పొట్టి చిరుతిళ్లు తినిపించినట్టే జీవితానికి. కొంపలు మునిగేదేమి లేదు... నిత్య పరుగులు లేకపోయినా మనం బతగ్గలం అని కరోనా పదే పదే మనకు చెబుతోంది. కాని మనమే వినడం లేదు. అది మ్యుటేషన్లు మార్చుకుంటోంది. మనం మన ధోరణి మార్చుకోవడం లేదు. ‘స్లో’ అనేది ఇటీవలి జీవన విధానం. ‘స్లో’గా ఉంటూ కూడా సంతోషంగా ఉండొచ్చేమో చూడండి. ఈ రెండు మూడు నెలలు గుంపుల్లో ఉండకుండా ఉరుకులు పరుగులు ఎత్తకుండా అనవసర ప్రయాణాలు చేయకుండా జీవితం ప్రసాదించి చిరు ఆనందాల ప్రసాదాన్ని ఆరగించండి. జయం. -
వాషింగ్టన్ డీసీలో వైఎస్సార్‌కు ఘననివాళి
వాషింగ్టన్ డీసీ (వర్జీనియా): అవిభజిత ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం(ఇండియా కాలమానము ప్రకారం శనివారం ఉదయం) ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్‌రెడ్డి, సత్య పాటిల్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్‌రెడ్డి వల్లూరు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక దూరం పాటిస్తూ మహానేత వైఎస్సార్‌కి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అమెరికా సలహాదారు రమేష్‌రెడ్డి వల్లూరు మాట్లాడుతూ.. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి మాట తప్పని, మడమ తిప్పని రాజకీయ నేత అని కొనియాడారు. ప్రజల సంక్షేమానికి కట్టుబడి విద్యకు, వ్యవసాయానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన మహానాయకుడని గుర్తుచేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తన తండ్రి రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడిగా వైఎస్ జగన్ రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పారని, మాట నిలుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్ బేరర్ (మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి అమరుడై 11 ఏళ్లు గడిచిపోయాయని, ఆ మహానేత దిశా నిర్దేశం చేసిన మార్గంలోనే గత 16 నెలలుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తూ.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా చర్యలు చేపట్టడాన్ని హర్షించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ఛార్జ్ శశాంక్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారని ప్రశంసించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పధకాల ద్వారా ప్రజలతో మమేకమైయ్యారని చెప్పారు. ప్రతి ఊరు బాగుండాలని కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా సంక్షేమం కోరుకునే వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నినాద్‌రెడ్డి అన్నవరం, నాటా నాయకులు సత్య పాటిల్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, సుజిత్ మారం, రామిరెడ్డి , సునీల్, మదన గళ్ల, అర్జున్ కామిశెట్టి, వినీత్ లోక, పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
మేరీ ల్యాండ్‌లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
వాషింగ్టన్ డి.సి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, ఫ్రెడెరిక్ నగరం లో ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం జూలై 11వ తేదీ ఉదయం (ఇండియా కాలమానము - శనివారం రాత్రి) వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంఛార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వెంకట్ యర్రం ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారందరూ తమకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారితో గల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దీంతో పాటు అమరావతి ఒక్కటే రాజధాని కాకుండా మూడు రాజధానులు ముద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదాలు చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రము అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని మాట్లాడుతూ, ‘ఈ కరోనా కష్ట కాలం లో కూడా ఇంత మంది పాల్గొనడం వల్ల వైఎస్ఆర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది . ఈ రోజు వరకు కూడా పెద్దాయనను గుర్తు చేసుకుంటున్నాం అంటే ఆయన చేసిన పథకాలు ప్రజల్లోకి వెళ్లాయి అని అర్థం. పెద్దాయన చేసిన మంచి పనులు మన పిల్లలకు కూడా గుర్తు చేసి వాళ్ళను కూడా భవిష్యత్తులో ఇలా తీర్చి దిద్దాలి’ అని అందరిని కోరారు. చదవండి: వాషింగ్టన్ డి.సిలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జ్ పార్థ సారధి రెడ్డి బైరెడ్డి మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సుపరిపాలన , పథకాలను గుర్తు చేశారు. ఈ రెండు సమంగా ప్రజల్లోకి తీసుకెళ్లినా ఘనత కేవలం వైఎస్సార్‌కి మాత్రమే దక్కుతుంది అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం లో ఎవరో ఒకరు అయన ప్రవేశ పెట్టిన పథకాలతో తప్పకుండా లాభం పొందారు అని గుర్తు చేశారు. అందుకే ఆయనంటే అందరికి అంత ప్రేమ అని చెప్పారు. వైఎస్ఆర్ గారి పథకాల్ని అయన కుమారుడు మళ్లీ పైకి తీసుకవచ్చి తన నవ రత్నాల్లో ఉంచి కేవలం ఒక సంవత్సరం లోనే ఎనభై శాతం పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు. మాట తప్పని..మడమ తిప్పని రాజకీయ నేత, బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం, చెదిరిపోని గుండె బలం, నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖరుడు అని అన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు రాజశేఖర్ యరమల మాట్లాడుతూ ‘వైఎస్సార్ అంటే ఒక్క వైఎస్సార్ సీపీ పార్టీ వాళ్ళే కాకుండా అన్ని పార్టీలో వాళ్ళు ఆయనకు గౌరవం ఇస్తారు. ముఖ్య మంత్రి అయినప్పుడు అందరికి మంచి చేయాలన్న తపనతో ముందుకు వెళ్లే వ్యక్తి వైఎస్సార్. అలాగే అదే బాట లోనే అయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా అందరికి మేలు చేయాలన్న తపన తోనే ముందుకు వెళ్తూ ఉండటం మనం చూస్తూనే వున్నాం. అలాంటి వాళ్లు మనకు ముఖ్యమంత్రిగా రావటం మనం చేసుకున్న అదృష్టం’ అని కొనియాడారు. చదవండి: ఆత్మనివేదనలో అంతరంగం వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు వెంకట్ యర్రం మాట్లాడుతూ ‘వైఎస్సార్ ప్రతి ఒక్క మనిషిని దృష్టిలో పెట్టుకుని అందరికి మంచి చేయాలి అన్న తపన తో మన రాష్ట్రాన్ని బంగారు బాటలో ముందుకు తీసుకెళ్లిన మంచి మనిషి . అయన కుమారుడు కూడా ఎన్నికలకు ముందు తన తండ్రి లాగానే చేస్తాడా అని ఒక సమస్య అందరిలోనూ ఉండేది. కానీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డినే మరిచిపోయే అంతలా రాబోయే పది సంవత్సరాల గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు. జగన్ నవరత్నాల్లో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా వరకు నెరవేరుస్తున్నారు.ఇలా జగన్ గారు చేసిన మంచి పనులు అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ పార్టీ ని ముందుకు తీసుకువెళ్లడానికి మన వంతు కృషి చేయాలి’ అని అన్నారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు మురళి బచ్చు మాట్లాడుతూ, మహానేత డాక్టర్ వైఎస్సార్ గారు ఒక కారణ జన్ముడు. అలాంటి వ్యక్తిని మళ్లీ పుట్టించాలని ఆ దేవుడిని కోరాలి. పెద్దాయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా చిరస్మరణీయం. అయన చేపట్టిన వైద్య , విద్య పథకాల ద్వారా ఎంతో మంది పేదలు చాలా లాభపడ్డారు. ప్రతి విషయం లో జగన్ తన తండ్రి ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతున్నారు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వాషింగ్టన్ డీసీ రీజినల్ ఇన్ ఛార్జ్ ప్రసన్న కక్కుమని, మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి పార్థ సారధి రెడ్డి బైరెడ్డి, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు వెంకట్ యర్రం, రాజశేఖర్ యరమల, రవి బారెడ్డి, రాంగోపాల్ దేవపట్ల, మురళి బచ్చు, సుదర్శన దేవిరెడ్డి, శ్రీనివాస్ పూసపాటి, నాగిరెడ్డి, లోకేష్ మేడపాటి, నాగార్జున, సతీష్ బోబ్బా, రాజేష్, సోమశేఖర్ పాటిల్, రామకృష్ణ లతో పాటు పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు -
వాషింగ్టన్ డి.సిలో వైఎస్సార్‌కు ఘనమైన నివాళి
వాషింగ్టన్ : ధరిత్రి మరువని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిరస్మరణీయులు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నవిషయం అందరికీ తెలిసిందే. వైఎస్సాఆర్ 10వ వర్ధంతి పురస్కరించుకొని అమెరికాలోని వైఎస్సార్సీపీ యూఎస్ఏ, వాషింగ్టన్ డీసీ మెట్రో ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఆయన వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, కార్యకర్తలు అమెరికాలోని స్టెర్లింగ్ సిటీ, వర్జీనియా,యూఎస్ఏ లోని ఇనోవా బ్లడ్ డోనర్ సెంటర్ లో రక్త దాన కార్యక్రమాలు నిర్వహించి ఘనమైన నివాళి అర్పించారు. ఈ రక్తదాన కార్యక్రమానికి మేరీల్యాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ వల్లూరు రమేష్ రెడ్డి, వర్జీనియా రీజినల్ ఇంచార్జి శశాంక్ రెడ్డి అరమడక, శ్రీ సత్య పాటిల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 150 మందికి పైగా పాల్గొనగా, 50 మంది రక్తదానం చేశారు. 'ఆరోగ్యప్రదాత, అన్నదాతల కల్పతరువు, పేదల దివ్యదాత ఇలా ఎన్ని చెప్పినా తక్కువే. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత. తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కరే "రాజన్న పరిపాలన"కు చిరునామాగా నిలిచారాని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్ రీజినల్ ఇంచార్జి ప్రసన్న కాకుమాని, మేరీల్యాండ్ స్టేట్ ఇంచార్జి పార్థ బైరెడ్డి, వర్జీనియా స్టేట్ ఇంచార్జి ఆంజనేయ రెడ్డి, దొందేటి శ్రీని గోపన్నగారి, వినీత్ లోక , రఘునాథ్ రెడ్డి , సుజిత్ మారం, మదన గళ్ళ, అనిత ఎరగంరెడ్డి , శ్రీరేఖ సంగీతం, శిరీష భీమిరెడ్డి, సుమంత్ మోపర్తి తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 7వ వర్ధంతిని అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రోలో శనివారం ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ మెట్రో (మేరీలాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ)లోని వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. యాష్‌బర్న్‌లోని లౌడౌన్ పార్క్‌వే హోమ్ఓనర్స్ క్లబ్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు పదిలక్షల రూపాయల విలువైన దుస్తులు, షూస్, గృహోపకరణ వస్తువులను రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. పేదరికాన్ని నిర్మూలించాలన్న మహానేత ఆశయం మేరకు సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సోమవరపు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వైఎస్ఆర్ సీపీ డాక్టర్స్ వింగ్ ప్రతినిధి డాక్టర్ గోసుల శివభారత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ రీజినల్ ఇంచార్జ్ బత్తినపట్ల సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ అడ్వైజర్-రీజినల్ ఇంచార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, నాటా బోర్డు సభ్యుడు సోమవరపు శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పేదల కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర.. ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు.. డ్వాక్రా మహిళలకు, రైతుల రుణమాఫీ, పావల వడ్డీకి రుణాలు, 108 అంబులెన్స్ సర్వీసులు, గ్రామాలకు 104 మొబైల్ హెల్త్ యూనిట్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కోట్లమందికి లబ్ధి కలిగిందని గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీకి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు కొనసాగిస్తామని వైఎస్ఆర్ మద్దతుదారులు చెప్పారు. యంగ్ డైనమిక్ లీడర్ వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ అంకితభావంతో నిరంతరం పోరాడుతున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ స్వర్ణ యుగం రావాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని, వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డాక్టర్ శివభారత్ రెడ్డి కోరారు. గుండె గుండెల్లో వైఎస్ఆర్ పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వీడియోను సురేందర్ రెడ్డి ప్రజెంట్ చేశారు. వైఎఎస్ఆర్ సీపీ ప్రజల పార్టీ అని రమేష్ రెడ్డి చెప్పారు. సభలో వైఎస్ఆర్ అమర్ రహే, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో మార్మోగిపోయింది. వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సోమవరపు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.