అమెరికాలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 7వ వర్ధంతిని అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మెట్రోలో శనివారం ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ మెట్రో (మేరీలాండ్, వర్జీనియా, వాషింగ్టన్ డీసీ)లోని వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు. యాష్బర్న్లోని లౌడౌన్ పార్క్వే హోమ్ఓనర్స్ క్లబ్ హౌస్లో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు పదిలక్షల రూపాయల విలువైన దుస్తులు, షూస్, గృహోపకరణ వస్తువులను రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందజేశారు. పేదరికాన్ని నిర్మూలించాలన్న మహానేత ఆశయం మేరకు సేవాకార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సోమవరపు శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, వైఎస్ఆర్ సీపీ డాక్టర్స్ వింగ్ ప్రతినిధి డాక్టర్ గోసుల శివభారత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ రీజినల్ ఇంచార్జ్ బత్తినపట్ల సురేందర్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ అడ్వైజర్-రీజినల్ ఇంచార్జ్ వల్లూరు రమేష్ రెడ్డి, నాటా బోర్డు సభ్యుడు సోమవరపు శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పేదల కోసం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం దివంగత మహానేత వైఎస్ఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర.. ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలు.. డ్వాక్రా మహిళలకు, రైతుల రుణమాఫీ, పావల వడ్డీకి రుణాలు, 108 అంబులెన్స్ సర్వీసులు, గ్రామాలకు 104 మొబైల్ హెల్త్ యూనిట్లు, ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు ఇళ్లు, ఆరోగ్యశ్రీ, సాగునీటి ప్రాజెక్టుల వల్ల కోట్లమందికి లబ్ధి కలిగిందని గుర్తుచేసుకున్నారు.
వైఎస్ఆర్ సీపీకి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ మద్దతు కొనసాగిస్తామని వైఎస్ఆర్ మద్దతుదారులు చెప్పారు. యంగ్ డైనమిక్ లీడర్ వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ అంకితభావంతో నిరంతరం పోరాడుతున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్కు మళ్లీ స్వర్ణ యుగం రావాలంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీని గెలిపించాలని, వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని డాక్టర్ శివభారత్ రెడ్డి కోరారు. గుండె గుండెల్లో వైఎస్ఆర్ పేరుతో రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ వీడియోను సురేందర్ రెడ్డి ప్రజెంట్ చేశారు. వైఎఎస్ఆర్ సీపీ ప్రజల పార్టీ అని రమేష్ రెడ్డి చెప్పారు. సభలో వైఎస్ఆర్ అమర్ రహే, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలతో మార్మోగిపోయింది. వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సోమవరపు శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.