జనం గుండెల్లో నిండిన దేవుడు | Sakshi Guest Column On YS Rajasekhara Reddy | Sakshi
Sakshi News home page

జనం గుండెల్లో నిండిన దేవుడు

Published Mon, Sep 2 2024 12:00 AM | Last Updated on Mon, Sep 2 2024 12:00 AM

Sakshi Guest Column On YS Rajasekhara Reddy

స్మృతిపథం

ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడాయన. పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడాయన. జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడాయన. సర్కారీ పాలనలోనే కాదు... స్నేహంలోనూ, సాయంలోనూ  వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం. జనహృదయ విజేత వైఎస్‌ 2009లో అకాల మరణం చెందినప్పుడు ఆయన ఆప్తుడు, నాటి కాంగ్రెస్‌ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తన గుండె లోతుల్లో నుంచి ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాల మాలిక ఈ వ్యాసం. నేడు వైఎస్‌ 15వ వర్ధంతి సందర్భంగా నాటి కథనాన్ని నవతరం పాఠకుల కోసం మరోసారి అందిస్తున్నాం.

గాంధీభవన్‌లో మీటింగ్‌... పీసీసీ అధ్యక్షులు ఎం. సత్యనారాయణరావు గారు, సీఎల్‌పీ లీడర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిగారు కూర్చున్నారు. ఏదో అర్జంట్‌ మీటింగ్‌! అందుబాటులో ఉన్న నాయకులందరినీ పిలిచారు. ప్రెసిడెంట్‌ గారి రూంలోనే మీటింగ్‌. ముప్పై కుర్చీల దాకా వేశారు. నేను బాగా చివరి వరుసలో మూలగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ‘అరుణ్‌! ముందుకు రావయ్యా... ఇక్కడ ఖాళీగా ఉంది గదా!’ అంటూ ముందు వరుసలో కూర్చోమని ఆహ్వానించారు సత్యనారాయణ గారు. ‘ఎందుకు సార్‌... మళ్లీ ఎవరైనా పెద్ద లీడరొస్తే లేచి వెనక్కి రావాలి. ఇక్కడ కూర్చుంటే ఎవ్వరొచ్చినా లేవక్కర్లేదు’ అన్నాను నవ్వుతూ. అన్ని సీట్లూ నిండిపోయాయి. మీటింగ్‌ ప్రారంభమైంది. ఏదో నోట్‌ చేయాల్సిన అవసరమొచ్చింది. ‘అరుణ్‌! ముందుకు రావయ్యా!’ అంటూ వైఎస్‌ గారి పక్కనే కుర్చీ వేయించి నన్ను కూర్చోపెట్టారు. 

నేను, వైఎస్‌ గారితో అన్నాను... ‘చూశారా సార్‌! టైం వచ్చినప్పుడు చివరాఖర్న కూర్చున్నా తీసుకొచ్చి ముందు కూర్చోపెడ్తారు.’ ‘అవును అరుణ్‌! ఇది బైబిల్‌లో ఉంది... తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును’. నా జీవితంలో మర్చిపోలేని సందేశమిది. అప్పట్నుంచి నేనేనాడూ నా గురించి నేను గొప్పగా ఊహించుకోలేదు. ఎవరైనా పొగుడుతుంటే వైఎస్‌ గారి వాక్యమే గుర్తుతెచ్చుకుంటూ ఉండేవాడిని. 2009 ఎన్నికల ఫలితాలపై వైఎస్‌ మాట్లాడుతూ, ‘ప్రజలు మాకు పాస్‌ మార్కులే వేశారు. ఇది ఘన విజయంగా నేను భావించడం లేదు. గర్వం వీడి అణకువతో ప్రజలకు దగ్గరకండి’ అంటూ తనను తాను తగ్గించుకుంటున్నప్పుడు ఆయన మరింత హెచ్చించబడతాడనే అనుకున్నాను గానీ ఆ హెచ్చు మరీ ఇంత ఎక్కువగా ఉంటుందనీ... ఎవరికీ అందనంత ఎత్తులోకి వెళ్లిపోతారనీ కలలోనైనా ఊహించుకోలేదు. 

ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి నాయకులొస్తే వారి ఉపన్యాసాలను నేను అనువదించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకెవర్నీ ఒప్పుకునేవారు కాదు వైఎస్‌ గారు! చాలాసార్లు కొందరు నాయకులు లోపల్లోపల గొణుక్కుంటూ ఉండేవారు ‘వీడే చెయ్యాలా ట్రాన్స్‌లేషన్‌... ఆ మాత్రం అనువాదకులు మనూళ్లో లేరా...’ అని!!  కొన్నిసార్లు బాహాటంగా పత్రికల్లోనే విమర్శించారు. రాజీవ్‌గాంధీ, మన్మోహన్‌సింగ్, రాహుల్‌ గాంధీ – ఎవరొచ్చినా వారితోపాటు వేదిక మీద నాకూ కుర్చీ వేసేవారు! నాకన్నా సీనియర్లు, మంత్రులు, పెద్ద నాయకులు ఎంతోమంది కింద కూర్చోవటం,  కేవలం అనువాదకుడినైన కారణంగా నేను వేదిక మీద కూర్చోవటం కొంతమందికి మింగుడుపడేది కాదు. కానీ ట్రాన్స్‌లేషన్‌ విషయంలో మాత్రం వైఎస్‌  కాంప్రమైజ్‌ అయ్యేవారు కారు. 

రూరల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాం అనంతపూర్‌లో ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రçఘువంశప్రసాద్, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌  ప్రసంగించారు. నన్ను సోనియాగాంధీ గారికి కేటాయించి, మిగతా ముగ్గురికీ ఇంకో ముగ్గురు నాయకులను ట్రాన్స్‌లేషన్‌కి ఏర్పాటు చేశారు. సరిగ్గా అందరూ స్టేజీ మీద కూర్చున్నాక వైఎస్‌ గారికి ఈ ఏర్పాటు సంగతి తెలిసింది. ఆయన ససేమిరా అంగీకరించలేదు. మొత్తం నలుగురికీ నేనే అనువాదం చెయ్యాలన్నారు. ‘సుమారు నలుగురు మాట్లాడేదీ ఒకటే ఉంటుంది. మళీ మళ్లీ అదే నేనొక్కడినే రిపీట్‌ చేస్తే జనానికి బోర్‌ కొడ్తుందేమో సార్‌’ అన్నాను. ‘చెప్పినట్టు చెయ్‌! నో మోర్‌ ఆర్గ్యుమెంట్‌!’ అన్నారు. నలుగురి స్పీచ్‌లూ నేనే అనువదించాను. ‘ఇంటర్‌ ప్రెటేషన్‌ కావాలి, ట్రాన్స్‌లేషన్‌ కాదు. లక్షల మంది పాల్గొన్న సభ, ఎక్స్‌పెరిమెంట్లు చేయటం పద్ధతి కాదు’ అన్నారాయన. 

నాకు అప్పుడు పదేళ్ల క్రితం జరిగిన ఒక అనువాద సంఘటన గుర్తుకొచ్చింది. విశాఖలో గాజువాక దగ్గర రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ. రాజేష్‌ పైలట్, అహ్లూవాలియా, వైఎస్, ద్రోణంరాజులతో కలిసి కార్లలో గాజువాక వెళ్తున్నాం. రాజీవ్‌గాంధీ చిరునవ్వు ముఖంలో మృత్యుకళ ప్రవేశపెట్టడం ఆ దేవుడి వల్ల కాలేదనీ... అందుకే అందమైన ఆ ముఖం నిర్జీవమైనప్పుడు ఎలాగుంటుందో చూపించలేని ఆ దేవుడు, అసలు ఆ ముఖమే లేకుండా చేసేశాడని వైఎస్‌ గారితో చెప్పాను. 

ఆ రోజుల్లో వైఎస్‌తో ఉండవల్లి 

ఈ మాటలు రాజశేఖరరెడ్డి గారి స్పీచ్‌లో చెప్పమన్నాను. ఆయన వద్దన్నారు. ‘ఇంత వివరంగా నువ్వే చెప్పగలవు. నువ్వే చెప్పు’ అన్నారు. ‘సార్‌! నేను అనువాదకుణ్ణేగానీ వక్తను గాను. రాజేష్‌ పైలట్, లేదా అహ్లూవాలియానో ఈ మాటలంటే నేను అనువదించగలను గానీ వాళ్లనకుండా నేనెలా చెప్తాను’ అన్నాను. ‘అక్కడికేదో వాళ్లు చెప్పింది మాత్రమే నువ్వు చెబుతున్నట్టు పోజు పెట్టకోయ్‌... అయినా నువ్వు చేసేది భావానువాదం,  భాషానువాదం కాదు! భావం మారకుండా ఈ పదాలు జొప్పించు’ అన్నారు వైఎస్‌. అహ్లూవాలియా మాట్లాడుతూ రాజీవ్‌ మరణాన్ని విశ్లేషిస్తుండగా... నేను అనువాదం చేస్తూ, పైన చెప్పిన నాలుగు మాటలూ కలిపేశాను. సభలో ఊహించని రెస్పాన్స్‌. వైఎస్‌ గారు మీటింగ్‌ అయిపోయాక నా భుజం తట్టారు. ఇప్పుడనిపిస్తోంది... ఎప్పుడూ నవ్వుతూ ఉండే వైఎస్‌ ముఖంలో సైతం మృత్యువును ప్రవేశపెట్టడం ఆ భగవంతుని వల్ల కాలేదనీ, అందుకే హెలికాప్టర్‌ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన ఆ శరీరం కోట్లాదిమంది అభిమానుల ఆఖరి చూపులకు కూడా నోచుకోలేదని!

ఇద్దరు మనుష్యుల మధ్య సంబంధాలు... ఇచ్చిపుచ్చుకోవటాలతో బలపడుతుంటాయి. ఒకరికొకరు సహాయపడుతూ ఆప్తులవుతారు. వైఎస్‌ గారితో నా సంబంధం తల్చుకుంటే... నాకు ఆశ్చర్యమేస్తుంది! ఎప్పుడూ ఆయన వల్ల నాకు జరిగిన ఉపకారాలే తప్ప... నా నుంచి ఆయన కోసం వీసమెత్తు కంట్రిబ్యూషన్‌ కూడా లేదు. కనీసం వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి కూడా... కావల్సిన కులబలం, ధనబలం లేని నన్ను రెండుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్‌కీ పోటీ చేయించారు. ఎక్కడో లక్షలాదిమంది మధ్య నుంచొని రాజీవ్‌గాంధీ ఉపన్యాసానికి చప్పట్లుకొట్టే స్థాయి కాంగ్రెస్‌ కార్యకర్తనైన నన్ను సాక్షాత్తూ ఆ రాజీవ్‌గాంధీ పక్కనే నిలబెట్టారు. 

అగ్రనాయకులందరూ అడ్డుపడ్డా... నేనే బాగా అనువదిస్తానని, వారితో వాదించి – వారిని వారించి నాకు ఢిల్లీ స్థాయి నాయకులందరి పక్కనా ఉండే స్థాయి కల్పించారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ స్థాయి నాయకులు నన్ను పేరెట్టి పిలిచే స్థానంలోకి పంపించారు. నేనేనాడూ ఆయన్ని ‘నాకిది కావాల’ని అడగలేదు. మొన్నటి (2009) ఎన్నికలకు  మూడు నెలల ముందు మాత్రం ధైర్యం చేసి ఒక్క రిక్వెస్ట్‌ చేశాను... ‘ఈసారి ఎన్నికల్లో నన్ను పోటీ చేయించవద్ద’ని! అప్పటికే రామచంద్రరావు గారి దగ్గర ఈ ప్రతిపాదన చేసి చాలా తిట్టించుకున్నాను. 

అందుకే వైఎస్‌ గారితో నెమ్మదిగా ఈ విషయం చెప్పాను. హైదరాబాద్‌ శివార్లలో ఒక సభకు హాజరవ్వటానికి బయలుదేరుతున్న వైఎస్, తనతో పాటు కారెక్కమన్నారు. సుమారు ఇరవై నిమిషాల ప్రయాణం. దారిలో ఆయనకి ఎక్స్‌ప్లైన్‌ చేశాను. ఈసారి నాకెంత ప్రతికూల పరిస్థితులున్నాయో... నేను నెగ్గటం ఎంత అసాధ్యమో వివరించాను. ‘ఇప్పుడు నువ్వు పోటీ చేయకపోవడం కరెక్ట్‌ డెసిషన్‌ కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా నువ్వే గెలుస్తావు... డోంట్‌ వర్రీ గాడ్‌ ఈజ్‌ దేర్‌’ అన్నారు వైఎస్‌. 

అది 2009 సెప్టెంబర్‌ 3. ఆ రోజు వినాయక నిమజ్జనం. హైదరాబాద్‌ నగరమంతా అల్లకల్లోల సునామీ సముద్రంలా ఉండేరోజు. వైఎస్‌ మరణవార్త నెమ్మది నెమ్మదిగా జనానికి చేరుతోంది. నిశ్శబ్దంగా నిమజ్జనం ప్రారంభమయ్యింది. ప్రతి ముఖంలో దుఃఖం, ఎంతోమంది మహానాయకుల మరణవార్తల్ని విన్నాం, కళ్లారా చూశాం. ‘ఆ వార్త వినగానే గుండె పగిలింది’ అంటూ చాలాసార్లు అంటుంటాం. ఇంతకాలం ఇదొక పద ప్రయోగమే... మహా అయితే పదాలంకారమో అనుకున్నాగానీ... నిజంగా గుండె పగిలి చచ్చిపోయేంత దుఃఖం ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. 

ఇంట్లో అందొచ్చిన కొడుకు చచ్చిపోతే ఏడ్చినట్టుగా ఏడుస్తున్న వృద్ధులు... ‘రేపు నా బిడ్డల పరిస్థితేమి’టంటూ పిల్లల తల్లులు... ఫ్రీగా ఇంజనీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థులు... రాష్ట్రమంతా వెక్కివెక్కి ఏడ్చింది. కొన్ని వందల గుండెలు నిజంగానే పగిలిపోయాయి. యాక్సిడెంట్‌ కన్‌ఫర్మ్‌ అయి వైఎస్‌ మృతదేహాన్ని గుర్తించారని తెలిసిపోయాక, సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి గారి ఫ్లోర్‌లోకి వెళ్లాను. ఆయనతో నాకున్న సంబంధం, ఆయన నాపై చూపిన ప్రేమాభిమానాలూ మనసులో రీళ్లు తిరగసాగాయి. ఒక మాట దగ్గర రీల్‌ ఆగిపోయింది. ‘డోంట్‌ వర్రీ,,, గాడ్‌ ఈజ్‌ దేర్‌.’ నేను తప్పుగా విన్నాను ఆయనన్న మాట... ‘డోంట్‌ వర్రీ గాడ్‌ ఈజ్‌ హియర్‌!’ అని అయి ఉంటుంది. నేనుండగా నీకెందుకు వర్రీ!! నా సంకల్పమే నీకు దైవం. నా బలమే నీకు దైవబలం. ఇంకా తెలియలేదా అరుణ్‌... నేనెవరినో!!

వైఎస్‌ గారితో నేను మాట్లాడిన మాటలు, వెటకారాలు, వేళాకోళాలు, జోకులూ అన్నీ గుర్తుకొచ్చి నెమ్మదిగా వెన్నులో వణుకు పుట్టింది. ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమి అనాలనిపిస్తే అది అనేసేవాడిని. ఎవరేమనుకుంటారో, అనొచ్చో–లేదో... అని ఏనాడూ సంకోచించలేదు. ఎన్నిసార్లు నా మాటలు ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చో... ఎన్నిసార్లు ఆయనకు నా మాటల వల్ల బాధ కలిగిందో... హఠాత్తుగా నాకు ‘భగవద్గీత’లోని ఒక శ్లోకం (11: 42) గుర్తుకొచ్చింది. 

అర్జున ఉవాచ :
‘‘యచ్చావహా సార్థ మసత్కృతోసి
విహార శయ్యాసన భోజనేషు
ఏకోథ వాప్యచ్యుత తత్సమక్షం
తత్‌ క్షామయే త్వామహ మప్రమేయమ్‌’’ 
(విశ్వరూప సందర్శన యోగం)

‘‘కృష్ణా! నాశరహితా! నీ ఈ మహిమ తెలియక పొరపాటున గానీ, చనువు వల్ల గానీ ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా అని అలక్ష్యముగా నేనేమి అన్నానో... విహారము సల్పునపుడుగానీ, పరుండునప్పుడుగానీ, కూర్చుండునప్పుడు గానీ, భుజించినప్పుడు గానీ, ఒక్కడవుగా ఉన్నప్పుడుగానీ, ఇతరుల యెదుట పరిహాసముగా గానీ ఏ విధంగా ప్రవర్తించితినో నా అపరాధములన్నీ అప్రమేయుడవగు నీవు క్షమించమని వేడుకొనుచున్నాను.’’
తండ్రీ! ఓ రాజశేఖరరెడ్డీ! నన్ను క్షమించు... అనుగ్రహించు!!


ఉండవల్లి అరుణ్‌కుమార్‌ 
– వ్యాసకర్త ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement