చెప్పింది చేసిన అరుదైన నేత | Sakshi Guest Column Special Story On YS Rajasekhar Reddy's Political Life History | Sakshi
Sakshi News home page

చెప్పింది చేసిన అరుదైన నేత

Published Mon, Jul 8 2024 8:44 AM | Last Updated on Mon, Jul 8 2024 9:11 AM

Sakshi Guest Column Special Story On YS Rajasekhar Reddy's Political Life History

నేడు వైఎస్సార్‌ 75వ జయంతి

వైఎస్‌ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడిన వారిలో వైఎస్సార్‌ది మొదటి స్థానం. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రయత్నించారు. ఎప్పుడూ తెలుగువారి సంప్రదాయ పంచెకట్టులోనే కనిపించేవారు. వివిధ సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించేవారు. ఆయన మాటలూ, చేతల్లో హుందాతనం తొణికిసలాడేది. ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ప్రజా నాయకుడాయన.

రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి అంతిమ ఘడియల వరకూ ఓటమి ఎరుగని నేత. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌గా చిరస్థాయిగా నిలిచిన ఆయన పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. నేటి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో రాజారెడ్డి, జయమ్మ దంపతులకు 1949 జూలై 8న జన్మించారు. బళ్లారిలో పాఠశాల విద్యాభ్యాసం, తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో పీయూసీ ఉత్తీర్ణులై, 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌ చదివారు.

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జెన్సీ పూర్తి చేసి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు. తరువాత జమ్మలమడుగు క్యాంబెల్‌ ఆసుపత్రిలో వైద్యునిగా పేదలకు ఏడాది కాలం సేవలందించారు. తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేసి, అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో 30 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు వైద్య సేవలు అందించి, రెండు రూపాయల డాక్టర్‌గా గుర్తింపు పొందారు.

తండ్రి కోరిక మేరకు 1978లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, జనతాపార్టీ అభ్యర్థి నారాయణరెడ్డిపై 20 వేల 496 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసన సభలో కాలు పెట్టినప్పటినుంచీ 2009 వరకు ఆయన పోటీ చేసిన అన్ని సార్లూ  విజయం సాధించారు. 4 పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, మూడు పర్యాయాలు సీఎల్పీ నేతగా, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రాజకీయ నేతలకు మార్గదర్శకంగా నిలిచారు.

పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్‌ 2004 మే 14న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, ఉచిత విద్యుత్, పెండింగ్‌లో ఉన్న విద్యుత్‌ బకాయిల రద్దుపై తొలి, మలి సంతకాలు చేశారు. అది మొదలు ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలు ప్రవేశపెట్టి అమలు జరిపారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం వంటివి ఆయనను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాయి.

నిర్లక్ష్యం నీడలో ఉన్న కడప జిల్లాను 2004–09 కాలంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెట్టించారు. కడప మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట మేజర్‌ పంచాయతీలను మునిసిపాలిటీలుగా రూపొందించారు. జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల, పశువైద్య విద్య కళాశాలను నెలకొల్పారు. జిల్లా కేంద్రంలో రిమ్స్‌ వైద్య కళాశాల, 750 పడకల రిమ్స్‌ ఆసుపత్రి, దంత వైద్యశాల, అలాగే ట్రిపుల్‌ ఐటీ నెలకొల్పారు. అనేక పరిశ్రమలు స్థాపింపజేశారు.

ఆయన హయాంలో జలయజ్ఞంలో భాగంగా సుమారు రూ. 12 వేల కోట్లతో కడప జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి, గండికోట కెనాల్, టన్నెల్, గండికోట వరదకాల్వ, గండికోట ఎత్తిపోతల పథకాలు వైఎస్‌ హయాంలో రూపొందించినవే. మైలవరం ఆధునికీకరణ, సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టు, సీబీఆర్, పీబీసీ, వెలిగల్లు, తెలుగుగంగ ప్రాజెక్టు పనులు చకచకా సాగించారు. ఇంతలో 2009 సెప్టెంబర్‌ 2న సంభవించిన ఆయన అకాల మరణం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద కుదుపయ్యింది. – నందిరాజు రాధాకృష్ణ, సీనియర్‌ జర్నలిస్ట్, 98481 28215 (నేడు వైఎస్సార్‌ 75వ జయంతి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement