సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్ పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు.
ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.
దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్‌ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.
ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment