
ముప్పై ఏళ్ల ఆర్థిక సంస్కర ణల తర్వాత పరిధులు దాటి ప్రభుత్వంలోకి చొరబడు తున్న ప్రైవేటీకరణ వల్ల కొన్ని కొన్ని రంగాల్లో ‘రాజ్యం’ ఉనికే ప్రశ్నార్థకం అవుతు న్నది. పైగా విషయం సున్నిత మైన జ్ఞాన రంగానికి మూల మైన ఉన్నత విద్యకు సంబంధించింది కావడం వల్ల ‘ఎలీట్’ అనబడే ఎగువ మధ్యతరగతి ఆలోచనాపరుల చురుకైన జోక్యం అవసరం అవుతుంది. ప్రభుత్వ పరిధిలోకి ‘ప్రైవేట్’ చొచ్చుకు రావడం వల్ల నిర్వీర్యమవుతున్న విద్యా ప్రమాణాలు కారణంగా తెలుగు సమాజానికి మిగిలే నామర్దాపై లోతైన సమీక్ష అవసరమైన దశకు మనం చేరాం.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004–2014 మధ్య పలు స్టేట్ యూనివర్సిటీలు రావడం, ప్రభుత్వం అందించిన ‘ఫీజు రీయింబర్స మెంట్’ దన్నుతో ఆర్థిక–సామాజిక బలహీన వర్గాలు కొంతమేర ప్రయోజనం పొందడం జరిగాయి. కొద్దిపాటి ప్రయత్నంతో విదేశాల్లో విద్యా–ఉపాధి అవకాశాలు పెరిగిన కాలం అది. అయితే ‘జాతీయ విద్యా విధానం–2020’ పేరుతో దేశమంతా ‘స్టేట్ యూనివర్సిటీ’లలో సంస్కరణలు అమలును ‘నీతి ఆయోగ్’ తప్పనిసరి చేసింది. సంపన్నులు తమ పిల్లల్ని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంత ఖర్చుకైనా వెరవకుండా చదివిస్తారు. కానీ దిగువ మధ్యతర గతి పరిస్థితి అదికాదు. వాళ్లకు నాణ్యమైన విద్య అందడం కల కాకూడదు. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుగా మొదలై ఆర్థిక సంస్కరణల కాలంలో ‘డీమ్డ్ యూనివర్సిటీలు’గా చలామణీ అవుతూ, ఉన్నత విద్యా వ్యాపారం చేస్తున్న చోట... ఉన్న ప్రమాణాలు గురించిన చర్చ ఇది. యాజమాన్యాలకు తమ వాణిజ్య ప్రయోజనాలు ప్రధానం అవుతుంటే, వాటి ప్రమాణాలు వడకట్టి మరీ వర్గీకరించే సమీక్ష బాధ్యతలు చూసే ‘న్యాక్’ (నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్) పరపతి పలచబడిన సందర్భం ఇది.
ఇటీవల నీతి ఆయోగ్ 2011–2021 మధ్య చేసిన మదింపులో ‘తెలుగునాట యూనివర్సిటీల ప్రమాణాలు ఏ మాత్రం బాగాలేవు’ అని తేలింది. మూడు అంశాలను అది పరిశీలించింది. 1. విద్యా ర్థుల స్థూల నమోదు, 2. విద్యార్థి– టీచర్ నిష్పత్తి,3. లింగ సమానత్వ సూచిక. ఈ మూడు అంశాల్లో దేనిలోనూ మొదటి పది స్థానాల్లో మనం లేము. ప్రభుత్వం కంటే ప్రైవేట్ క్వాలిటీ బాగుంటుంది అనేది మన నమ్మకం. గడచిన ముప్పై ఏళ్లలో డిగ్రీతో మొదలై పీజీ, పీహెచ్‌డీ వరకు ఎదిగిన మన యూని వర్సిటీ చదువుల్లోకి భారీ పెట్టుబడులతో ప్రైవేట్ రంగం ప్రవేశించినా, నీతి ఆయోగ్ మదింపు అలా ఉందంటే, మన ప్రమాణాలు అనుమానమేగా! రాష్ట్ర విభజన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి కూడా కొత్త యూనివర్సిటీలు వస్తుంటే అమరావతి చుట్టూ భూములు ఇవ్వడం, వాళ్ళు భారీ భవనాలు కట్టడం... ఇలా మన దృష్టి అంతా ‘షోకేసింగ్’ మీదే సరిపోయింది.
ఈ యాజమాన్యాల రాజకీయ రంగ ప్రవేశంతో విద్యా వ్యవస్థలో ప్రభుత్వ– ప్రైవేట్ ప్రయోజనాలు ఒక్కటయ్యాయని పిస్తున్నది. అమరావతి సమీపాన ఉన్న ఒక డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన ఉదంతం వెనుక పైన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అంటే విషయం సులువుగా బోధపడుతుంది. సీబీఐ అరెస్ట్ చేసిన పదిమంది ముఖ్యుల్లో ఒక వైస్– ఛాన్స్‌లర్ ఉండడం దేశాన్ని ఉలిక్కి పడేట్టుగా చేసింది. తమ యూనివర్సిటీకి ‘ఏ ప్లస్ ప్లస్’ ర్యాంకింగ్ రాబట్టడం కోసం న్యాక్ నుంచి తనిఖీకి వచ్చే ‘పీర్ రివ్యూ వర్స్’కు ముందే నగదు, విలువైన బహుమతులతో యాజమాన్యం వారిని ప్రలోభపరిచింది అనేది సీబీఐ అభియోగం. నింది తులు ఉన్నత విద్యారంగంలో పలు విభాగాలలోని ప్రమాణాలను సమీక్షించడంలో నిపుణులు. అరెస్ట్ వార్త వెలుగులోకి వచ్చిన మూడు వారాల్లో సుమారు 900 మంది పీర్ రివ్యూవర్స్‌ను శాశ్వతంగా న్యాక్ బాధ్యతల నుంచి తొలగించింది.
ఒక ఆంగ్లపత్రిక ప్రతినిధికి న్యాక్ డైరెక్టర్ గణేశన్ కన్నాభిరాన్ జరిగింది ఏమిటో చెబుతూ– ‘మా వద్ద పీర్ రివ్యూవర్స్ జాబితాలో 5,000 మంది ఉన్నారు. వీరి పనిని సమీక్షించే కసరత్తు గత 18 నెలలుగా మా వద్ద సాగుతున్నది కనుకనే, ఈ విషయం తెలిసిన వెంటనే వారిపై వేటు సాధ్యమయింది. ఇకముందు మా వడపోత ‘హైబ్రీడ్ మోడల్’లో ఉంటుంది’ అన్నారు. జరిగిన దానిపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ ప్రొ‘‘ ఎం. జగదీశ్ కుమార్ స్పందిస్తూ – ‘యూజీసీ పరిధిలో పనిచేసే స్వయం ప్రతి పత్తి కలిగిన న్యాక్‌లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాల తర్వాత ర్యాంకింగ్ ఇచ్చే విషయంలో పారదర్శకత, చిత్తశుద్ధి పెంచే విధంగా న్యాక్ సమూల సంస్కరణలను అమలులోకి తెచ్చింది. ఎక్రిడిటేషన్ జారీ విషయంలో న్యాక్ దృఢ చిత్తంతో అనుసరిస్తున్న పరిపాలనా విధానాన్ని, నిర్దేశించిన రూల్స్ అమలుచేయడానికి తీసుకుంటున్న చొరవను యూజీసీ అభినందిస్తున్నది’ అన్నారు.
వారం తర్వాత విశాఖపట్టణంలోని ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన ఓ ప్రైవేట్ పుస్తక ఆవిష్కరణ సభలో ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి ఇద్దరూ ఒకే వేదికపైన ఉన్నారు. అక్కడున్న ‘ప్రభుత్వ భూమి–కేంపస్ గోడ’ వివా దాన్ని దృష్టిలో ఉంచుకుని, తన ప్రసంగంలో సీఎం ‘...ఇటువంటి యూనివర్సిటీని మీరు కూల్చివేయా లని అనుకుంటారా’ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలో చించాల్సిన ప్రశ్న అది. జ్ఞానరంగానికి మూలమైన ఉన్నత విద్య ప్రమాణాలు ‘ప్రైవేట్’ వల్ల ప్రమాదంలో పడినప్పుడు, ‘రాజ్యం’తో పాటు పౌర సమాజమూ అప్రమత్తం కావాలి.
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత
