సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగాన్ని అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించారు. టీడీపీ పాలనలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ విద్యా రంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా రంగానికి పెద్దపీట వేసి ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా రంగానికి తనదైన శైలిలో ఊపిరిలూది ప్రగతి బాట పట్టించారు.
ఇంటాబయటా వెల్లువెత్తుతున్న ప్రశంసలే దీనికి నిదర్శనం. దాదాపు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా రూ. 66,722.36 కోట్లు వ్యయం చేశారు. నాడు–నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు.
నవశకానికి నాంది..
♦ 2020 జనవరి 1న ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం.
♦ ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్ కేటాయింపు
♦ టీడీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనం కోసం ఏటా చేసిన ఖర్చు రూ.450 కోట్లు మాత్రమే.
♦ 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి.
♦ ఈ ఏడాది ముగిసిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ) పరీక్షల్లో 91.33 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు.
♦ నాడు నేడులో తొలి విడత కింద 2019–20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను రూ.3,669 కోట్లతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు.
♦ 42.62 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల చొప్పున జమ.
♦ పది, ఇంటర్ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సత్కారం.
♦ 10 మంది పేద ప్రతిభావంతులైన విద్యార్థులను అమెరికా సందర్శించే అవకాశం.
♦ 2019 జూన్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు దాదాపు 47 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రభుత్వం రూ.15,762 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో జగనన్న విద్యాదీవెన కింద రూ. 11,317 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద మరో రూ. 4,267 కోట్లు చెల్లించింది.
♦ ప్రైవేటు వర్సిటీల్లో రూ.5 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిన ఇంజనీరింగ్ కోర్సుల్లో 35 శాతం సీట్లలో రిజర్వేషన్ కోటా అమలు.
♦ గత నాలుగున్నరేళ్లల్లో 1,925 మంది విద్యార్థులకు జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థికంగా అండ.
♦ నైపుణ్య వర్సిటీ, ప్రత్యేక శిక్షణ సంస్థల ఏర్పాటుతోపాటు ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను మరింత అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకు 2021–22 బడ్జెట్‌లో రూ.774.01 కోట్లు ఖర్చుచేయగా 2022–23 బడ్జెట్‌లో రూ.969.91 కోట్లు కేటాయించారు.
మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం..
ఎడ్యుస్కిల్, సేల్స్‌ఫోర్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందంతో మరో 1.45 లక్షల మంది విద్యార్థులు నైపుణ్య కోర్సులు పూర్తి చేశారు. ఒక రాష్ట్రంలో 1.64 లక్షల మంది విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే కావడం విశేషం. దీంతో 2018–19లో క్యాంపస్ ఎంపికల్లో 37 వేల మంది ఉద్యోగాలు పొందితే, 2019–20లో 52 వేల మంది, 2020–21లో 69 వేల మంది, 2021–22లో 85 వేల మంది ఉద్యోగాలు పొందారు. ఇక 2022–23లో 1.20 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి.
దేశ సగటు కంటే మెరుగ్గా జీఈఆర్..
ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తుండడంతో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఈఆర్)లో మన రాష్ట్రం దేశ సగటుకంటే చాలా ముందుంది. 2019–20లో ఇండియా సగటు 27.1 శాతం ఉంటే.. రాష్ట్రంలో 35.2 శాతం, 2020–21లో దేశ సగటు 27.3 శాతం ఉంటే రాష్ట్రంలో 37.2 శాతం జీఈఆర్ నమోదు కావడం విశేషం. మరోవైపు కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల నిబంధనలు కూడా విద్యా అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆడపిల్లలను చదివించేందుకు
తల్లిదండ్రులు మొగ్గుచూపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment