ఏడుతరాలుగా కొనసాగిస్తున్న శిల్పకళ
వైవిధ్యమైన సృజనతో అంతర్జాతీయ ఖ్యాతి
తాజాగా ‘భారతరత్న’ అంబేడ్కర్ విగ్రహాల ప్రదర్శన
అడుగు నుంచి 30 అడుగుల వరకు కొలువుదీరిన విగ్రహాలు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం
తెనాలి: శిలాశాసనులీ తండ్రీ కొడుకులు...వారసత్వంగా వస్తున్న శిల్పకళను ఏడుతరాలుగా కొనసాగిస్తున్న సృజనకారులు. ఫైబర్, కాంస్యం, ఐరన్‌స్క్రాప్, త్రీడీ విగ్రహాలతో తమ సృజనకు టెక్నాజలీని జోడిస్తున్నారు. వైవిధ్యమైన శిల్పాలను రూపొందిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తున్నారు. ఆ క్రమంలో భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాల వేళ ‘భారతరత్న’ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌తో సహా పలు రికార్డుల సాధనకు ప్రయత్నిస్తున్నారు.
తెనాలికి చెందిన సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు శిల్పకళను కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ఫైబర్, కాంస్య విగ్రహాలతో కాటూరి వెంకటేశ్వరరావు రాణిస్తుంటే, కోల్‌కతాలో ఫైనార్ట్స్‌లో పీజీ చేసిన కొడుకు రవిచంద్ర ఆ కళకు మరింత వన్నెలు తెస్తున్నారు. ఇనుప వ్యర్థ్యాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ దేశవిదేశీయులను ఆకర్షిస్తున్నారు. అతడి సోదరుడు శ్రీహర్ష త్రీడీ టెక్నాలజీలో అతి సూక్ష్మ విగ్రహాల్నుంచి భారీ విగ్రహాల వరకు తీర్చిదిద్దుతున్నారు. వీరి విగ్రహాలు దేశంలోని అనేక నగరాల్లో ప్రతిష్టకు నోచుకోవటమే కాకుండా, విదేశాల్లోనూ కొలువుదీరాయి. తమ విగ్రహాలతో తెనాలిలో కాటూరి ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటుచేసి, తమ కళానైపుణ్యాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నారు.
ప్రస్తుతం భారత రాజ్యాంగ ఆమోద వజ్రోత్సవాలను దేశమంతటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలతో ప్రదర్శన నిర్వహించాలని తలపోశారు. అనుకున్నదే తడవుగా గత కొద్దినెలలుగా తీవ్రంగా శ్రమించారు. యాభై విగ్రహాలతో కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనను బుధవారం సాయంత్రం ఏర్పాటుచేశారు. ఫైబర్, కాంస్య విగ్రహాలు రకరకాల సైజుల్లో ఇందులో కొలువుదీర్చారు. అడుగు ఎత్తు నుంచి 30 అడుగు ఎత్తు వరకు అంబేడ్కర్ విగ్రహాలను ఇందులో చేర్చారు. వీటిలో అడుగు ఎత్తులో ఉన్న బస్ట్ సైజువి త్రీడీ టెక్నాలజీతో రూపొందించారు. వీటితోపాటు కుర్చీలో కూర్చున్న భంగిమ నుంచి నిలుచున్న విగ్రహాలూ రకరకాల సైజుల్లో ఈ ప్రదర్శనలో చోటుచేసుకుని చూపరులను ఆకర్షిస్తున్నాయి. తమ శిల్పకళా నైపుణ్యానికి కాటూరి శిల్పకారులు అభినందనలు అందుకుంటున్నారు.
సూర్య శిల్పశాలతో విగ్రహాల రూపకల్పనలో కొనసాగుతున్న కాంటూరి వెంకటేశ్వరరావు ఆ వంశంలో ఆరోతరం వారు. ఏడోతరానికి చెందిన ఆయన ఇద్దరు కుమారులూ, వారసత్వంగా వస్తున్న శిల్పకళనే వృత్తిగా చేసుకోవటం విశేషం! వెంకటేశ్వరరావు తాత చంద్రయ్య సిమెంటు విగ్రహాలు, దేవాలయాల నిర్మాణం, దేవతా విగ్రహాలను తయారుచేసేవారు. తండ్రి కోటేశ్వరరావు రాజకీయ నేతల విగ్రహాలను కేవలం సిమెంటుతోనే చేసేవారు. వెంకటేశ్వరరావు ఆ విగ్రహాలతోనే ఆరంభించి, తన సృజనతో ఫైబర్, కాంస్య విగ్రహాల తయారీని ఆరంభించారు. కొడుకులు అందివచ్చాక నైపుణ్యం పెరిగింది. ఐరన్‌స్క్రాప్ వ్యర్థాలతో భారీ విగ్రహాలను తయారుచేస్తూ రవిచంద్ర, త్రీడీ టెక్నాజీలతో శ్రీహర్షలు తమ శిల్పకళకు ఆధునిక హంగులు అద్దారు. అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నారు. తాజా ప్రదర్శనలో ఉంచిన శిల్పాల్లో అధికశాతం హ్యాండ్‌వర్క్‌తోనే చేశారు. ఇందుకోసం 50 మందికిపైగా వర్కర్లతో 5–6 నెలలుగా కృషిచేసినట్టు చెబుతున్నారు.
గిన్నిస్ బుక్ రికార్డు కోసం...
– కాటూరి వెంకటేశ్వరరావు, శిల్పకారుడు
శిల్పకళలో తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేయటం...గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించాలనే ప్రయత్నంతోనే ఈ ప్రదర్శన ఆరంభించాం. వీడియోలు, ఫొటోలు పంపాం. పరిశీలిస్తున్నట్టు సమాచారం పంపారు. అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ ఆఫ్ రికార్డ్స్ వారు తమ సంసిద్ధతను తెలియజేశారు. త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment