ఆంగ్లమే అవసరం | Students and parents and educators opinions on English Medium | Sakshi
Sakshi News home page

ఆంగ్లమే అవసరం

Published Thu, May 28 2020 3:53 AM | Last Updated on Fri, May 29 2020 8:04 PM

Students and parents and educators opinions on English Medium - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం కావాలని, ఆంగ్లంలో చదివితేనే ప్రపంచంతో పోటీ పడగలమని విద్యార్ధులు, తల్లిదండ్రులు, విద్యా వేత్తలు పేర్కొన్నారు. అమ్మ ఒడితో పేదల చదువులకు భరోసా కల్పించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యకు అవకాశం కల్పించారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని బాగా చదువుకుంటామని విద్యార్థులు చెప్పారు. జగనన్న గోరు ముద్ద అమృతమని, రోజుకో మెనూతో నాణ్యమైన భోజనం అందిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చదువులపై ముఖ్యమంత్రికి ఉన్న స్పష్టత, అవగాహన అభినందనీయమని విద్యావేత్తలు పేర్కొన్నారు. విద్యారంగంపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం నిర్వహించిన మేధోమథన సదస్సుల్లో పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

అన్ని రకాలుగా సాయం...
నేను స్కూల్లో కుకింగ్‌ హెల్పర్‌గా పనిచేస్తా. ఈ సంవత్సరమే ఉద్యోగంలో చేరా. మొన్నటి దాకా పిల్లలకు భోజనంలో ఒట్టి సాంబారు పోశాం. ఇప్పుడు స్కూల్లో చిక్కీలు ఇస్తుంటే ఇష్టంగా తింటున్నారు. నా పిల్లలు నలుగురూ ప్రభుత్వ పాఠశాలలోనే తింటారు. బాగా చదువుతున్నారు. నాకు అమ్మఒడి డబ్బులు వచ్చాయి. డ్వాక్రా డబ్బులు ఇచ్చారు. నాకు ఇల్లు కూడా వచ్చిందని వలంటీరు ఫోన్‌ చేశారు. మా అత్తయ్యకు పింఛన్‌ కూడా వస్తోంది. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తోంది.
–జరీనా, పేరెంట్, గుంటూరు

ఇష్టంగా తింటున్నాం మామయ్యా..!
సీఎం జగన్‌ మామయ్యకు నమస్కారం. ‘జగనన్న గోరు ముద్ద’ గురించి చెబుతా. గతంలో ఒకటి రెండు కూరలే పెట్టేవారు. ఇప్పుడు ఎన్నో రకాల కూరలు. వారానికి ఐదు గుడ్లు, మూడు చిక్కీలు స్వీట్‌ పొంగల్, పాయసం, పులిహోర, కోడిగుడ్డు కూర, సాంబారు, ఆలూ కుర్మా, తోటకూర పప్పు ఇవన్నీ పెడుతుంటే ఎంతో ఇష్టంగా తింటు న్నాం. 8వ తరగతి చదివే మా అన్నయ్య కూడా స్కూల్లోనే తింటున్నాడు. ఇవన్నీ సమ కూర్చినందుకు సీఎం గారికి ధన్యవాదాలు.
–ఎం.రాజేశ్వరి, 5వ తరగతి, కోలవెన్ను, కృష్ణా జిల్లా.

అమ్మ ఒడితో పాఠశాల ఫుల్‌!
రెండేళ్ల క్రితం మా పాఠశాలలో 16 మంది విద్యార్ధులే ఉండేవారు. జగనన్న అమ్మఒడి కారణంగా విద్యార్ధుల సంఖ్య 165కి పెరిగింది. పేదవాళ్లను ఉన్నత స్ధితికి చేర్చే క్రమంలో మీరు బోయీలుగా పనిచేస్తున్నారు. మా బతుకుల్లో కొత్త దేవుడు ఉదయించాడని విద్యార్థులు, తల్లిదండ్రులు మీకు (సీఎం జగన్‌) చెప్పమన్నారు. ఆ చదువులయ్యే మాకు ఎప్పటికీ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు.
– రామ్‌మోహన్, సెకండరీ గ్రేడ్‌ టీచర్, వైయస్సార్‌ నగర్,నెల్లూరు.

దేశమంతా ఏపీ వైపు చూస్తోంది..
యావత్‌ దేశమంతా ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ వైపు చూస్తోంది. పాదయాత్ర హామీలన్నీ నెరవేరుస్తున్నారు. శార్వరి నామ సంవత్సరాన్ని మేం విద్యా సంవత్సరంగా భావిస్తున్నాం. నవకాయ పిండివంటల్లో ఏది బాగుందంటే ఎలా చెప్పలేమో మీరు ప్రవేశపెట్టిన నవరత్నాలు కూడా అలాంటివే. ఈ ఏడాది సంక్రాంతి 14వ తేదీన కాకుండా 9వ తేదీనే వచ్చిందని అమ్మ ఒడి పథకంతో లబ్ధిపొందిన తల్లులు పేరెంట్స్‌ కమిటీ సమావేశాల్లో చెప్పటాన్ని మరచిపోలేం. జగనన్న విద్యా కానుక ద్వారా పేద పిల్లలకు ఇచ్చే కిట్‌ ఎంతో ఉపయోగపడుతుంది.
–కే.ఎస్‌.ఆర్‌.వి. శాస్త్రి, టీచర్, బుట్టాయగూడెం, పశ్చిమగోదావరి.

అమ్మలా వచ్చిన అన్న...!
నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తూ పేదలకు మేలు చేస్తున్నారు. అమ్మఒడి పథకం మాకు ఎంతో మేలు చేసింది. ఇప్పటిదాకా అక్షరాభ్యాసం సమయంలో అమ్మ అని రాసేవారు ఇప్పుడు అన్న అని రాస్తున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినం దుకు పేరెంట్స్‌ కమిటీల తరపున సీఎంకు  కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.
– టి.ప్రకాష్, పేరెంట్, పెనమలూరు,కృష్ణా జిల్లా

ఐరోపాలోనూ ఇలా లేదు..
మీ ప్రసంగం విన్న తరువాత విద్యారంగంపై మీకున్న స్పష్టత అర్థమైంది. విద్యాశాఖ అంశాలపై సాధారణంగా కమిషనర్, సెక్రటరీ లేదా మంత్రి రివ్యూ చేస్తారు. కానీ ఒక సీఎం ఇంత క్లారిటీగా రివ్యూ చేయడం నా సర్వీసులో చూడలేదు. అద్భుతం. విద్యా శాఖకు మీరు కేటాయించిన బడ్జెట్‌ చూస్తుంటే ఐరోపా దేశాల్లో కూడా ఇలాలేదు. ఈరోజు ప్రపంచ దృష్టంతా విద్యారంగంపైనే ఉంది.
– ఉపేందర్‌ రెడ్డి, నిపుణుడు, అడ్వైజర్,అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌  కాలేజీ ఆఫ్‌ ఇండియా.

వర్సిటీల స్థాయిలో నాణ్యత పెరగాలి..
విద్యాసంస్ధల పరంగా మన రాష్ట్రంలో 16 స్టేట్‌ వర్సిటీస్, 5 డీమ్డ్‌ వర్సిటీస్, 5 ప్రైవేటు వర్సిటీలున్నాయి. 14 సెంట్రల్లీ ఫండెడ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ ఇన్ని సంస్థలు లేవు. కొత్త సంస్ధలను నెలకొల్పడం కంటే మనం ఉన్నవాటిని అభివృద్ధి చేసుకుని అప్‌గ్రేడ్‌ చేసుకోవడం మంచిది. విశ్వవిద్యాలయాల స్థాయిలో నాణ్యత పెంచాలి. కనీసం ఐదు విశ్వవిద్యాలయాలను జాతీయ స్ధాయిలో మొదటి 50 ర్యాంకుల లోపు ఉండేలా చూడాలి. అప్పుడే మనం దేశానికి ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతాం.
–కే.ఎన్‌.సత్యన్నారాయణ, డైరెక్టర్, ఐఐటీ, తిరుపతి.

విద్యా దీవెన ఆదుకుంది
మా తల్లిదండ్రులకు మేమిద్దరం ఆడపిల్లలం. జగనన్న విద్యా దీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందాం. నాన్నకు యాక్సిడెంట్‌ అయినప్పుడు ఆరోగ్యశ్రీతో బతికించు కున్నాం. నాన్నకు వికలాంగుల పింఛన్‌ వస్తోంది. దేవుడే మీ రూపంలో దిగివచ్చి ఏం కావాలని అడుగుతున్నారు. నేను బాగా చదివి మీ దగ్గర మంత్రిగా పనిచేయాలని కోరుకుంటున్నా. 
– చంద్రిక, విద్యార్థిని, ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజి, విజయవాడ

రెండు అడుగులు ముందుకు..
మీ నాన్న గారు (వైఎస్సార్‌) ఒక అడుగు ముందుకేసి గ్రామీణ పేద విద్యార్థుల కోసం ఆర్జీ యూకేటీలను స్ధాపిస్తే మీరు రెండు అడుగులు ముందుకేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టారు. మీకు ధన్యవాదాలు.
– నాగలావణ్య, ఆర్జీయూకేటీ, విద్యార్థిని, నూజివీడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement