ఆంధ్రప్రదేశ్ పరిపూర్ణ మానవ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో అనతి కాలంలోనే ‘సామర్థ్య ఆంధ్ర’గా ఆవిర్భవించింది. విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతితో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘సామర్థ్య ఆంధ్ర’ కింద 2024–25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఏకంగా రూ.53,508.04 కోట్లు కేటాయించింది.
బుధవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసన సభలో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. పాఠశాల, సాధారణ విద్యకు పెద్దపీట వేస్తూ రూ.33,898.04 కోట్లు కేటాయించారు. సాంకేతిక విద్యకు రూ.578.59 కోట్లు, కార్మిక శక్తి, ఉద్యోగాల కల్పనను పెంచేలా రూ.1,114.74 కోట్లు కేటాయించారు. ఇక గ్రామీణ పేదలకు ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా, ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యాన్ని పెంచడానికి రూ.17,916.67 కోట్లు కేటాయించడం విశేషం. –సాక్షి, అమరావతి
‘విద్య’యీ భవ
పిల్లలకు మంచి విద్య అందించి, ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం వైఎస్ జగన్ సంకల్పం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చింది. వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. త్వరలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) పాఠ్య ప్రణాళికలను అమలు చేయనుంది. ఆంగ్ల భాషా నైపుణ్యం పెంచేలా టొఫెల్ సరి్టఫికేషన్ అందిస్తోంది. విద్యా బోధనలో సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. పిల్లలకు ఉచిత కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను ఉచితంగా అందిస్తోంది.
3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌తో బోధన ప్రవేశపెట్టింది. జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా ఏటా రూ.3,367 కోట్లతో 47 లక్షల మంది విద్యార్థులకు యూనిఫామ్‌లు, బ్యాగ్‌లు, బూట్లు, పాఠ్యపుస్తకాలను అందిస్తోంది. మనబడి నాడు–నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలల రూపురేఖలను మార్చింది. నాడు – నేడు ద్వారా ఇప్పటివరకు రూ.7163 కోట్ల స్కూళ్లను అత్యాధునికంగా తీర్చిదిద్దింది.
రెడీ టు వర్క్
విద్యార్థులు చదువుల సమయంలోనే పరిశ్రమలు, ఐటీ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హబ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్ కాలేజీలు స్థాపించింది. తద్వారా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో 1.06 లక్షల మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వగా.. వీరిలో 95 శాతం మంది ఉద్యోగాలు పొందారు.
యువతకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్ ల్యాబ్‌లు, క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. 14 పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో (ఐటీఐ) కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలతో ల్యాబ్‌లను అభివృద్ధి చేసింది.
ఉన్నతంగా విద్య
జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.11,901 కోట్లు, వసతి దీవెన కింద రూ.4,276 కోట్లు ఖర్చు చేసింది. తద్వారా విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం భారీగా తగ్గింది. ప్రపంచంలోని టాప్–50 (సబ్జెక్టుల వారీగా) విశ్వ విద్యాలయాల్లో రాష్ట్ర విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టింది.
ఇంటర్న్‌షిప్ ద్వారా చదువుతో పాటే విద్యార్థులు బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగులు పొందే అవకాశాన్ని కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలోనే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగిలిన అన్ని కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటాలో పేదలు ఉచితంగా చదువుకునే వెసులుబాటు కల్పించింది.
ఆరోగ్యశ్రీతో పునరుజ్జీవనం
వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు–నేడు ద్వారా రూ.16,852 కోట్లతో ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధన ఆస్పత్రుల వరకు సమూల మార్పులు చేసి మెరుగైన వైద్యాన్ని అందిస్తోంది. గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ విధానంతో 14 రకాల వైద్య పరీక్షలను, 105 రకాల మందులను ఇంటి వద్దనే అందిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ పేదల పాలిట సంజీవనిగా మారింది. కుటుంబ ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచి, మరింత మందికి ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తోంది.
ప్రొసీజర్స్‌ను పెంచి, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరిమితి లేని చికిత్సలు అందిస్తోంది. ఆరోగ్య ఆసరా కింద 25 లక్షల మంది రోగులకు రూ.1366 కోట్లు అందించింది. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 1.67కోట్ల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు, మందులు పంపిణీ చేసింది.
కిడ్నీ రోగులకు కార్పొరేట్ సౌకర్యాలతో 200 పడకలతో పలాసలో వైఎస్సార్ కిడ్నీ రిసెర్చ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించింది. వైద్య శాఖలో 53,126 మంది శాశ్వత సిబ్బందిని నియమించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల ఖాళీలు సగటున 61 శాతం ఉంటే.. ఏపీలో దానిని 4 శాతానికంటే తక్కువకు తగ్గించడం గమనార్హం.
గోరుముద్దతో ఆరోగ్యం..
ప్రభుత్వం జగనన్న గోరుముద్ద కింద ఏడాదికి రూ.1,910 కోట్లు ఖర్చు చేస్తూ 43 లక్షల మందికిపైగా విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇది గత ప్రభుత్వం చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ. గిరిజన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కిట్లతో మహిళల్లో రక్తహీనత సమస్యను తగ్గిస్తోంది.
సామర్ధ్యాంధ్ర కేటాయింపులు
రూ. 53,508.04 కోట్లు
సాధారణ విద్య రూ.33,898.04 కోట్లు
వైద్య రంగంరూ.17,916.67 కోట్లు
సాంకేతిక విద్య రూ.578.59 కోట్లు
ఉద్యోగ, ఉపాధి రంగాలురూ. 1,114.74 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment