విద్యలో వండర్ | State Government Ties Up With Online Learning Organization Edx | Sakshi
Sakshi News home page

విద్యలో వండర్

Published Sat, Feb 17 2024 4:32 AM | Last Updated on Sat, Feb 17 2024 4:32 AM

State Government Ties Up With Online Learning Organization Edx  - Sakshi

‘ఎడెక్స్‌’తో ఒప్పందం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం. ‘రైట్‌ టు ఎడ్యుకేషన్‌’ అనేది పాత నినాదం. ‘రైట్‌ టు క్వాలిటీ ఎడ్యుకేషన్‌’ అనేది మన ప్రభుత్వ విధానం. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు.  – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి:  పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరూ ఊహించనన్ని మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ‘ఎడెక్స్‌’ (edX) ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2 వేలకు పైగా వర్దికల్స్‌లో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు.

యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువుల్లో దేశంతో కాకుండా ప్రపంచంతో  పోటీపడుతున్నామన్నారు. వరల్డ్‌ క్లాస్‌ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియట్‌ (ఐబీ) సిలబస్‌ అందుబాటులోకి తెస్తున్నామని, దీన్ని తొలుత ఒకటో తరగతితో ప్రారంభించి పదేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఐబీ విధానంలో టెన్త్‌ పరీక్షలు రాసేలా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు చేపట్టిన ఈ సంస్కరణల ఫలాలు కనిపించేందుకు మరో నాలుగైదేళ్లు పట్టవచ్చని తెలిపారు.

శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ సంస్థ ‘ఎడెక్స్‌’ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్‌ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, 26 వర్సిటీల వీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే..  

అనూహ్య సంస్కరణలు.. 
ఉన్నత విద్యారంగంలో అనూహ్య సంస్కరణలు తెచ్చాం. ఆర్థిక భారంతో ఏ ఒక్కరి చదువులూ మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. ప్రతిభ కలిగిన పేదింటి విద్యార్థులను ప్రైవేట్‌ వర్సిటీల్లోనూ కూర్చోబెట్టి చదివిస్తున్నాం. ఏటా జగనన్న వసతి దీవెన ద్వారా అర్హులందరికీ వసతి ఖర్చులు అందజేస్తున్నాం.

ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. దాదాపు 30 శాతం స్కిల్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు ప్రవేశపెట్టాం. తొలిసారి డిజిటల్‌ విద్యలో భాగంగా డిగ్రీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు, మూడేళ్ల కోర్సులో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. దీనికి అదనంగా మరో ఏడాది ఆనర్స్‌ డిగ్రీ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాం.

విద్యార్థులు సులభంగా సిలబస్‌ చదువుకునేలా 400కిపైగా బైలింగ్యువల్‌ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో బోధన ప్రమాణాలు పెంచేందుకు కోర్టు కేసులను అధిగమించి 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. 2019లో 257 ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్‌ గుర్తింపు ఉంటే మనం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో 437కు పెరిగింది. 

బలమైన పునాది.. 
మానవ వనరులపై పెట్టుబడికి ప్రభుత్వం ప్రాధా­న్యం ఇస్తోంది. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. విద్యార్థులను గ్లోబల్‌ సిటిజెన్స్‌గా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాం. నాడు – నేడుతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మార్చాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపేందుకు అమ్మఒడి, గోరుముద్ద అమలు చేస్తున్నాం.

పదేళ్లలో మన విద్యార్థులకు పూర్తిగా ఐబీ విధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ విభాగం ఎస్‌సీఈఆర్టీ భాగస్వామ్యంతో ఈ ఏడాది టీచర్లకు బోధన విధానాలపై శిక్షణ ఇస్తుంది. వచ్చే ఏడాది ఒకటో తరగతితో ఐబీని ప్రారంభించి ప్రతి ఏడాది ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతాం. తద్వారా 2035 నాటికి పదో తరగతిలో ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. 

సృజనకు పదును.. 
పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు నాంది పలికి 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెళ్లతో సృజనాత్మక బోధన చేపట్టాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించడం ద్వారా చదువుల్లో వేగం పెంచి సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాం. ద్విభాషా పాఠ్యపుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించాయి.  

అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు స్థానికంగానే
మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ స్థాయిలో అందించేందుకు ‘ఎడెక్స్‌’తో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ ద్వారా దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్‌ కిందకు వస్తా­యి. ఎడెక్స్‌లో విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్‌ చేసి బోధిస్తాయి. అక్కడి ప్రొఫెసర్లతో మన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లతో పాటు క్రెడిట్స్‌ దక్కుతాయి. తద్వా­రా జాబ్‌ మార్కెట్‌లో ఉద్యోగాలు సులభంగా లభి­స్తాయి.

పాశ్చాత్య దేశాల్లో డిగ్రీ­లో ఆర్టిఫిషి­యల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్, సైబర్‌ ఫోరెన్సిక్, స్టాక్‌ ఎక్ఛేంజ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి వర్టికల్స్‌  కనిపిస్తాయి. మన దగ్గర అవి లేకపోగా నేర్పించే సరైన మానవ వనరులు అందుబాటులో లేవు. ఈ సమస్యలను అధిగమిం­చేందుకు అత్యుత్తమ వర్సిటీల కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేస్తున్నాం.

తద్వారా ఆంధ్రా వర్సిటీ నుంచి తీసుకునే డిగ్రీల్లో స్టాక్‌ ఎక్ఛేంజ్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఫైథాన్‌ కోర్సులకు ప్రపంచ వర్సిటీల సర్టిఫికేషన్‌ లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం మన వర్సిటీల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. దీని ద్వారా ఉన్నత విద్యలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది.  

వర్సిటీల్లో టెక్నాలజీ వినియోగం పెరగాలి.. 
యువతకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య అందిస్తే పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. అందుకే జగనన్న విదేశీ విద్య ద్వారా అత్యధికంగా ఒక్కో విద్యార్థిపై రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రపంచంలోని టాప్‌–50 వర్సిటీలు, 21 ఫ్యాకల్టీల్లో టైమ్స్‌ రేటింగ్స్, క్యూ ఎస్‌ రేటింగ్స్‌లోని 320 కాలేజీలలో సీటొస్తే ఉచితంగా చదివిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రభుత్వ సాయంతో విదేశాల్లో చదువుతున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని వారికి కూడా మనం ఆ స్థాయి విద్యను అందించాలి.

వర్సిటీల్లో ఏఐ, అగ్‌మెంటెడ్‌ టెక్నాలజీ, 3 డీ లెర్నింగ్‌ విధానాలను మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తేవాలని గతంలోనే వీసీలకు సూచించా. ఇప్పటికే పద్మావతి వర్సిటీలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పూర్తి స్థాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు. కంప్యూటర్‌ విజన్, మెటావర్స్‌ లెర్నింగ్‌ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇలాంటివి అన్ని వర్సిటీల్లోనూ రావాలి.  

సీఎం జగన్‌ దార్శనికతకు నిదర్శనం 
పద్మశ్రీ అనంత్‌ అగర్వాల్, ఎడెక్స్‌ సీఈవో 
రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనతో 12 లక్షల మందికి ఎడెక్స్‌ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికీ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్‌ దార్శనికతకు ఇది నిదర్శనం. ఉన్నత విద్యలో ఇది నిజంగా గేమ్‌ ఛేంజర్‌. పదేళ్ల కిందట ఎడెక్స్‌ ప్రయాణం మొదలైంది. డిగ్రీ చదివి రెండేళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూసిన అక్షయ్‌ అనే విద్యార్థి  కెరీర్‌పై ఆశలు వదులుకున్న తరుణంలో ఎంఐటీ రూపొందించిన పైథాన్‌ కోర్సు ఎడెక్స్‌ ద్వారా నేర్చుకున్నాడు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ చేశాడు. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగానే ఎంపికయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో నన్ను గుర్తుపట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు. 36 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా ఉన్న నన్ను ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచనలు, విజన్‌ ఆశ్చర్యపరిచాయి. ఎంఐటీ, హార్వర్డ్‌ లాంటి వర్సిటీల విద్యను పేద విద్యార్థులందరికీ ఇవ్వాలని నాతో చెప్పారు.

డిజిటల్‌ టెక్నాలజీని వాడుకుని ఆ స్థాయి విద్యను ఎలా అందించగలమో నాతో చర్చించారు. ఎడెక్స్‌తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలబెడుతుంది. విజ్ఞానం, ఆర్థిక ప్రగతి, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో నాణ్యమైన చదువు ఎంతో ముఖ్యం. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి అగ్రపీఠం వేస్తోంది.

సామాన్యులకూ కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తోంది. త్వరలోనే వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం ఏపీ విద్యా విధానాన్ని అనుసరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సీఎం కోరిక మేరకు పాఠ్య ప్రణాళికలను సమర్థంగా తీర్చిదిద్దేందుకు నా వంతు సహకారం అందిస్తా.     

మరింత రాణిస్తాం.. 
నాలాంటి ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోరుకుంటున్నారు. మధ్య తరగతి విద్యార్థులు పరిమిత వనరులతో ఉన్నత స్థాయి విద్య అందుకోవడం చాలా కష్టం. అంతర్జాతీయ వర్సిటీల్లో చదువుకోవడం కలే. ముఖ్యమంత్రి జగన్‌ విజనరీ లీడర్‌షిప్‌తో  వరల్డ్‌ క్లాస్‌ విద్య సాధ్యమవుతోంది. ఏపీని స్టేట్‌ ఆఫ్‌ నాలెడ్జ్, స్టేట్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్, స్టేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడం గొప్ప విషయం. ఎడెక్స్‌ అందించే అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందిపుచ్చుకుని రాణిస్తాం.   – ప్రగతి జైశ్వాల్, బీటెక్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి 

స్ఫూర్తినిచ్చిన సీఎం జగన్‌ 
మా నాన్న చిన్న రైతు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నేను చదువుకుంటున్నా. నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. కరిక్యులమ్‌తో మా స్కిల్స్‌ పెరుగుతున్నాయి.  ఎడెక్స్‌తో టాప్‌ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకుని గ్లోబల్‌ లెవల్‌ పోటీకి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి జగన్‌ లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.  – ఎ.హరిత, బీటెక్, జేఎన్‌టీయూ–అనంతపురం 

మార్కెట్‌లో మంచి విలువ 
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌తో చదువుకునే సమయంలోనే ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. మాకంటూ మార్కెట్‌లో వాల్యూ క్రియేట్‌ చేశారు. ఇంటర్న్‌షిప్‌ ద్వారా నెలకు రూ.8 వేల స్టైఫండ్‌ పొందుతున్నా. మా అమ్మను నేనే చూసుకోవాలి. జీవితంలో స్థిరపడితేనే ఏదైనా చేయగలను. పోటీని తట్టుకుని నిలబడాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. ఎడెక్స్‌తో ఇది ప్రతి విద్యార్థికీ దక్కుతుంది. అంతర్జాతీయ వర్సిటీ సర్టిఫికేషన్‌తో సులభంగా ఉద్యోగాలు వస్తాయి.   – అంజలి, బీకాం, మేరీ స్టెల్లా కాలేజీ, విజయవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement