పేదలు తమ పిల్లల బతుకులు మారాలని ఆరాటపడుతున్నా.. మన ఖర్మ కొద్దీ ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో బతుకుతున్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. బయట ఒకటి మాట్లాడుతూ అసెంబ్లీలో బిల్లును అడ్డుకున్నారు. అయితే బిల్లును జాప్యం చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. ఆ బిల్లును మళ్లీ పెట్టి పాస్ చేయించాం
– ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యతోనే నిరుపేదల బతుకులు మారతాయని, ఆ దిశగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంగ్లిష్ మీడియం వద్దంటున్న పెద్ద మనుషులు వారి పిల్లలను, మనవళ్లను ఏ మీడియంలో చదివిస్తున్నారో ఆలోచించుకోవాలన్నారు. రాష్ట్రంలో 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం కోసం సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని చెప్పారు. 94 శాతం పేరెంట్స్ కమిటీలు కూడా ఇంగ్లిష్ మీడియాన్నే కోరుకున్నాయన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివే వారు శాతం కేవలం 25.8 శాతమేనని, పేదరికంతో ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్నారని సీఎం పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’లో విద్యారంగంపై బుధవారం మేధోమథన సదస్సులో ఇంగ్లిష్ మీడియం ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ...
పేరెంట్స్ కమిటీలు కావాలన్నాయి
పేద విద్యార్థులు, వారి కుటుంబాల మేలు కోసం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చాలని నిర్ణయించాం. ఈ క్రమంలో పేరెంట్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాధ్యమంపై అభిప్రాయాలను కోరాం. దాదాపు 94 శాతం పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉంటేనే తమ పిల్లలు ఆంగ్లం నేర్చుకుని బాగా చదువుకుంటారని, భావి ప్రపంచంతో పోటీ పడగలుగుతారని తేల్చి చెప్పాయి.
కొత్త థియరీలు...
► కొంతమంది ప్రతి అడుగులోనూ అడ్డుకుంటూ చివరకు ఎలా మాట్లాడుతున్నారంటే ఇంగ్లీషు మీడియం తెస్తే తెలుగును అగౌరవపర్చినట్లు అంటూ కొత్త థియరీలు తెస్తున్నారు. అంతగా తెలుగును గౌరవించాలనే ఈ పెద్దమనుషులు తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను ఎక్కడ చదివిస్తున్నారు? అంతా ఇంగ్లీషు మీడియంలోనే చదివిస్తున్నారు. కానీ పేదబిడ్డలు మాత్రం తెలుగు మీడియంలోనే చదవాలట. కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా పేదల జీవితంలో మార్పు తెచ్చేందుకు ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నాం.
► సదస్సులో మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, విద్యా శాఖ అధికారులతో పాటు, నిపుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment