LEARNING
-
ఫ్యామిలీ ఫార్మింగ్ : విద్యార్థులకు ప్రకృతి సేద్య శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను హైస్కూలు నుంచి యూనవర్సిటీ స్థాయి వరకు విద్యార్థులకు అలవాటు చేయటం ఎంతో అవసరమనే విషయంతో ఇప్పుడు ఏకీభవించని వారు బహుశా ఎవరూ ఉండరు. రసాయనిక అవవేషాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తి ద్వారానే మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. అయితే, ఈ బృహత్ కార్యక్రమాన్ని వ్యాప్తిలోకి తేవటానికి విద్యాసంస్థలతో కలసి పనిచేస్తూ స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పనులను అలవాటు చేయటంలో ప్రత్యక్ష కృషి చేస్తున్న వారిని వేళ్లపై లెక్కించవచ్చు. ఈ కోవలో మొదటి పేరు డాక్టర్ గంగాధరం. దాదాపు రెండు దశాబ్దాలుగా సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ విజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక శిక్షణ ద్వారా విశేష కృషి చేస్తున్న ప్రకృతి సేద్య ప్రేమికుడు డాక్టర్ వర్డ్ గంగాధర్. ఇప్పటికే వేలాది మంది రైతులకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఘనత వర్డ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తిరుపతికి చెందిన డాక్టర్ ఎం గంగాధర్‌కే దక్కుతుంది. తిరుపతిలో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే పద్ధతులను ఆయన గత కొన్ని నెలలుగా నేర్పిస్తున్నారు. 20 అడుగుల వెడల్పు “ 20 అడుగుల ΄÷డవు విస్తీర్ణంలో చిన్న చిన్న ఎత్తుమడులు ఏర్పాటు చేసి విద్యార్థుల చేత 15 రకాల ఆకుకూరలు, 4 రకాల కూరగాయల సాగు చేయిస్తున్నారు. ఈ నమూనాకు కుటుంబ వ్యవసాయం (ఫ్యామిలీ ఫార్మింగ్) అని పేరు పెట్టారు. డాక్టర్ గంగాధరం యూనవర్సిటీలో కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చి ‘గ్రీన్ టీమ్’లను ఏర్పాటు చేశారు. డా. గంగాధరం మార్గదర్శకత్వంలో ఈ గ్రీన్ టీమ్‌ల ఈ కుటుంబ వ్యవసాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. గ్రీన్ టీం సభ్యులు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులను ఇంటింటల కుటుంబ వ్యవసాయ నమూనా మడుల దగ్గరకు ఆహ్వానించి వారికి అవగాహన కల్పిస్తున్నారు.ప్రకృతి సేద్య వ్యాప్తికి దోహదంఈ ఫ్యామిలీ ఫార్మింగ్ నమూనా ముఖ్య ఉద్దేశం గురించి వివరిస్తూ డా. గంగాధరం (98490 59573) ఇలా అన్నారు.. ‘ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆరోగ్యకరమైన 15 రకాల కూరగాయలను ఏ విధంగా సాగు చేయవచ్చో నేర్పిస్తున్నాం. ఈ నమూనా ద్వారా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ పూర్తిస్థాయిలో నమూనాపై అవగాహన తెచ్చుకోగలుగుతారు. వివిధ ప్రాంతాలలో వారి సొంత పొలాల్లో కూడా కొంచెం విస్తీర్ణంలో అయినా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేయటం ప్రాంరంభిస్తారు. ఆ విధంగా గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం ప్రాంచుర్యానికి ఎంతో దోహదపడుతుంది. అట్లే తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఆశాభావం..’ అన్నారు. (గార్బేజ్ ఎంజైమ్ : పండ్లు, కూరగాయ మొక్కలకు ఈ ద్రవం ఇచ్చారంటే!)తిరుపతి పట్టణంలోని ప్రజలు కూడా సాయంత్రం 4–5 గంటల వరకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనవచ్చని, తమ ఇంటి వద్ద తక్కువ స్థలంలో వివిధ రకాల కూరగాయలు సాగుచేసే పద్ధతులను తెలుసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో యువత విశ్వవిద్యాలయం నుంచి హైస్కూల్ వరకు ఈ నమూనా వ్యాప్తి చెంది రాష్ట్రమంతా యువత ప్రకృతి వ్యవసాయంపై పట్టు సాధించగలరని భావిస్తున్నానన్నారు. ఈ కృషి ఫలించాలని ఆశిద్దాం. డా. గంగాధరం -
ఈజీగా విదేశీ భాష, క్రేజీగా కొరియన్ నేర్చుకుందామా!
విదేశీ భాషని అధ్యయనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మన రెస్యూమ్‌ను బలోపేతం చేయడంతో పాటు పర్యాటక రంగంలో, గైడ్స్‌గా ఇతరత్రా రంగాల్లో రాణించడానికి, ట్రావెల్, బ్లాగులను తయారు చేయడం తదితర ఎన్నో రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రపంచం నలుమూలలకూ కమ్యూనికేట్ చేయగలిగేలా చేస్తుంది. విదేశీ విశ్వవిద్యాలయలో ప్రవేశాలకు కూడా ఉపయుక్తం అవుతున్నాయి.. ప్రస్తుతం వర్క్ కల్చర్, ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు మారడంతో విదేశీ భాషా నైపుణ్యాలతో ఫ్రీలాన్సర్‌గా అవకాశాలు పెరిగాయి. ఓటీటీ తదితర వేదికల విజృంభణతో అనువాదకులకు భారీగా డిమాండ్ పెరగడం కూడా విదేశీ భాషలను క్రేజీగా మార్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలతో జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు దేశ విదేశాలలో రాయబార కార్యాలయాలు, హై–కమిషన్లలో విదేశీ భాషా ఉపాధ్యాయులుగా కొనసాగడానికి వీలైన కోర్సులకు డిమాండ్ సంతరించుకుంటున్నాయి. డిమాండ్‌లో ఫ్రెంచ్.. క్రేజీగా కొరియన్.. కొత్త భాషలు నేర్చుకోవడం కొన్నేళ్ల క్రితం వరకూ కేవలం హాబీగా భావించేవారు. అయితే, ప్రపంచీకరణతో విదేశీ భాషా నైపుణ్యం ఆదాయమార్గంగా కూడా అవతరించింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా నగరవాసుల్లోనూ విదేశీ భాషలపై ఆసక్తి పెరుగుతోంది. సంపాదన కోసమో, మరేదైనా లక్ష్యాలతోనో సీరియస్‌గా ఫారిన్ లాంగ్వేజెస్‌కు జై కొడుతున్నారు. ప్రస్తుతం ఫ్రెంచి, రష్యన్, స్పానిష్, చైనీస్ అరబిక్ వంటి అనేక విదేశీ భాషలు బాగా డిమాండ్‌లో ఉన్నాయి. ఇటీవలే కొరియన్ వెబ్‌సిరీస్, మ్యూజిక్కూ పెరిగిన ఆదరణ కొరియన్ భాషా పరిజ్ఞానంపై యువత ఆసక్తిని పెంచింది. – సాక్షి, హైదరాబాద్ఈ నేపథ్యంలో విదేశీ భాష నేర్చుకోవడంలో సహాయపడే అనేక అకాడమీలు, సంస్థలు నగరంలో వెలుస్తున్నాయి. ఆయా భాషల కోర్సు వ్యవధి సాధారణంగా ఆరు నుంచి 12 నెలల్లో పూర్తి చేసి ప్రొఫెషనల్ డిగ్రీని అందుకుంటారు. అయితే అనర్గళంగా మాట్లాడడం, చదవడం, రాయడం అర్థం చేసుకోవడంపై పూర్తి పట్టు సాధించేందుకు మరింత వ్య«వధి అవసరం అవుతుందని శిక్షకులు అంటున్నారు. ఇవి కాకుండా ఒక విద్యార్థి ఆ భాష చరిత్ర, భాష సంస్కృతి సంబంధిత దేశాల ప్రజలు, అర్థం చేసుకునే పద్దతి, ఆ భాష యాస, డిక్షన్ గురించి కూడా నేర్చుకుంటేనే పూర్తి అవగాహన వస్తుందని సూచిస్తున్నారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత సరి్టఫికెట్ డిప్లొమా స్థాయి కోర్సు లేదా పన్నెండో తరగతి పూర్తి చేసిన తర్వాత విదేశీ భాషలో డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును అభ్యసించవచ్చు. నగరంలో ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ, హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాలు వంటివి విదేశీ భాషల్లో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. అలాగే పలు ఆన్లైన్ లెరి్నంగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విదేశీ భాషా కోర్సులను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. స్పానిష్ జోష్.. దాదాపు 50 కోట్ల మందికి పైగా మాట్లాడే వారితో స్పానిష్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మాట్లాడే భాషలలో రెండో స్థానంలో ఉంది. స్పానిష్ మాట్లాడే దేశాలతో మన దేశానికి ఇటీవల పెరుగుతున్న వాణిజ్యం దృష్ట్యా నేర్చుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకించి అంతర్జాతీయ వ్యాపారం, ఆతిథ్యం పర్యాటక రంగంలో ఆసక్తి ఉన్న వారికి ఇది బెస్ట్. ఫ్రెంచ్ పట్ల ఆసక్తి.. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది పైగా మాట్లాడే ఫ్రెంచ్ అత్యధికంగా మాట్లాడే భాషగా ఆరో స్థానంలో ఉంది. ఇది ఫ్రాన్స్, కెనడాతో సహా 29 దేశాల్లో అధికారిక భాష. ఫ్యాషన్, హాస్పిటాలిటీ, టూరిజంలో కెరీర్‌కు ఉపకరించే ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విశ్వవ్యాప్తంగా విలువైన భాష. విన్.. జపాన్.. సాంకేతిక హబ్ హోదా, భారతదేశంతో బలమైన వాణిజ్య సంబంధాలు కలిగిన జపాన్ జపనీస్ అత్యధికులు కోరుకునే భాషగా మార్చాయి. ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల మందికి పైగా మాట్లాడే ఈ భాష సాంకేతికత, యానిమేషన్, గేమింగ్‌లో కెరీర్‌ను ఎంచుకున్న సిటీ యూత్ ఎంపికగా మారింది. మాండరిన్.. మంచిదే.. మనదేశపు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా చైనాను దృష్టిలో ఉంచుకుంటే.. అంతర్జాతీయ వ్యాపారం, దౌత్యం పర్యాటక రంగం కోసం మాండరిన్ నేర్చుకోవడం అవసరంగా మారింది. కో అంటే కొరియన్.. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా మాట్లాడే కొరియన్‌కు నగరంలో బాగా డిమాండ్ ఉంది. ఆసియాలో మనదేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కొరియా కావడం సాంకేతిక, వినోద పర్యాటక రంగాల్లో ఈ భాషా నైపుణ్యానికి డిమాండ్ పెంచుతోంది.జర్మన్‌కు జై.. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా, యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే భాష జర్మన్. జర్మన్ నేర్చుకోవడం ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో విభిన్న అవకాశాలకు తలుపులు తెరుస్తోంది. ఇదీ..ఇటాలియన్..యూరోపియన్ యూనియన్‌లో అత్యధికంగా మాట్లాడే నాల్గో భాష ఇది. పర్యాటక కేంద్రంగా మరియు ఫ్యాషన్ మరియు డిజైన్‌కు కేంద్రంగా ఇటలీకి ఉన్న ప్రాచుర్యంతో ఫ్యాషన్, డిజైన్, హాస్పిటాలిటీలో కెరీర్‌ను లక్ష్యంగా చేసుకున్న సిటీ విద్యార్థులకు రైట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. గ్రేస్.. పోర్చుగీస్..బ్రెజిల్ పోర్చుగల్‌తో సహా ఎనిమిది దేశాల్లో మాట్లాడేది పోర్చుగీస్. ఈ దేశాలతో మనకు విస్తరిస్తున్న సంబంధాల కారణంగా పోర్చుగీస్ భాషలో ప్రావీణ్యం అనేది భవిష్యత్తు విజయాలకు బాట వేస్తుంది.పలు భాషల్లో ప్రావీణ్యం కోసం.. విదేశీ భాషా పరిజ్ఞానం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు మరెన్నో ప్రయోజనాలను యువత ఆశిస్తున్నారు. గతంలో పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్థులు కనిపించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు చేరింది. కెనడాలో ఉండే భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా మాకు స్టూడెంట్స్‌గా ఉన్నారు. నేర్చుకోవడం అనేది ఇలా సులభంగా మారడం కూడా విదేశీ భాషల పట్ల ఆసక్తిని పెంచుతోంది. – ఎం.వినయ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫ్రెంచ్ భాషా విభాగం, ఉస్మానియా వర్సిటీ -
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
విద్యలో వండర్
‘ఎడెక్స్’తో ఒప్పందం రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో సువర్ణాధ్యాయం. ‘రైట్ టు ఎడ్యుకేషన్’ అనేది పాత నినాదం. ‘రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్’ అనేది మన ప్రభుత్వ విధానం. నాణ్యమైన విద్య అందించడం ద్వారానే పేదరికాన్ని నిర్మూలించవచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పిల్లల ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా మానవ వనరులపై పెట్టుబడికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విప్లవాత్మక సంస్కరణలతో ఎవరూ ఊహించనన్ని మార్పులు తెచ్చామని గుర్తు చేశారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ‘ఎడెక్స్’ (edX) ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2 వేలకు పైగా వర్దికల్స్లో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడంలో వెనుకబడితే మిగతా ప్రపంచం మనల్ని దాటుకుని ముందుకు వెళ్లిపోతుందని వ్యాఖ్యానించారు. అందుకే చదువుల్లో దేశంతో కాకుండా ప్రపంచంతో పోటీపడుతున్నామన్నారు. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతభత్యాలు సాధిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియట్ (ఐబీ) సిలబస్ అందుబాటులోకి తెస్తున్నామని, దీన్ని తొలుత ఒకటో తరగతితో ప్రారంభించి పదేళ్లలో రాష్ట్ర విద్యార్థులు ఐబీ విధానంలో టెన్త్ పరీక్షలు రాసేలా అడుగులు ముందుకు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు చేపట్టిన ఈ సంస్కరణల ఫలాలు కనిపించేందుకు మరో నాలుగైదేళ్లు పట్టవచ్చని తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ‘ఎడెక్స్’ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, 26 వర్సిటీల వీసీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అనూహ్య సంస్కరణలు.. ఉన్నత విద్యారంగంలో అనూహ్య సంస్కరణలు తెచ్చాం. ఆర్థిక భారంతో ఏ ఒక్కరి చదువులూ మధ్యలో ఆగిపోకూడదనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తున్నాం. ప్రతిభ కలిగిన పేదింటి విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీల్లోనూ కూర్చోబెట్టి చదివిస్తున్నాం. ఏటా జగనన్న వసతి దీవెన ద్వారా అర్హులందరికీ వసతి ఖర్చులు అందజేస్తున్నాం. ప్రతి విద్యార్థి చదువు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా పాఠ్య ప్రణాళికను సమూలంగా మార్పు చేశాం. దాదాపు 30 శాతం స్కిల్ ఓరియెంటెడ్ కోర్సులు ప్రవేశపెట్టాం. తొలిసారి డిజిటల్ విద్యలో భాగంగా డిగ్రీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు, మూడేళ్ల కోర్సులో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. దీనికి అదనంగా మరో ఏడాది ఆనర్స్ డిగ్రీ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా సిలబస్ చదువుకునేలా 400కిపైగా బైలింగ్యువల్ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యలో బోధన ప్రమాణాలు పెంచేందుకు కోర్టు కేసులను అధిగమించి 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టాం. 2019లో 257 ఉన్నత విద్యాసంస్థలకు న్యాక్ గుర్తింపు ఉంటే మనం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో 437కు పెరిగింది. బలమైన పునాది.. మానవ వనరులపై పెట్టుబడికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ప్రాథమిక స్థాయి నుంచి విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. విద్యార్థులను గ్లోబల్ సిటిజెన్స్‌గా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాం. నాడు – నేడుతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మార్చాం. విద్యార్థులను స్కూళ్లకు రప్పించేందుకు, తల్లిదండ్రుల్లో స్ఫూర్తిని నింపేందుకు అమ్మఒడి, గోరుముద్ద అమలు చేస్తున్నాం. పదేళ్లలో మన విద్యార్థులకు పూర్తిగా ఐబీ విధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఐబీ విభాగం ఎస్సీఈఆర్టీ భాగస్వామ్యంతో ఈ ఏడాది టీచర్లకు బోధన విధానాలపై శిక్షణ ఇస్తుంది. వచ్చే ఏడాది ఒకటో తరగతితో ఐబీని ప్రారంభించి ప్రతి ఏడాది ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతాం. తద్వారా 2035 నాటికి పదో తరగతిలో ఐబీ బోర్డు పరీక్షలు రాస్తారు. సృజనకు పదును.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు నాంది పలికి 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెళ్లతో సృజనాత్మక బోధన చేపట్టాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించడం ద్వారా చదువుల్లో వేగం పెంచి సులభంగా అర్థమయ్యేలా చర్యలు చేపట్టాం. ద్విభాషా పాఠ్యపుస్తకాలు విద్యార్థుల నైపుణ్యాన్ని మరింత పెంపొందించాయి. అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు స్థానికంగానే మన విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ స్థాయిలో అందించేందుకు ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకున్నాం. ఈ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దాదాపు 2 వేలకు పైగా కోర్సులు మన పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కిందకు వస్తాయి. ఎడెక్స్‌లో విద్యార్థి తనకు కావాల్సిన వర్టికల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఎంఐటీ, హార్వర్డ్ లాంటి విద్యా సంస్థలు ఈ కోర్సులను ఆఫర్ చేసి బోధిస్తాయి. అక్కడి ప్రొఫెసర్లతో మన విద్యార్థులు ఆన్లైన్లో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లతో పాటు క్రెడిట్స్ దక్కుతాయి. తద్వారా జాబ్ మార్కెట్లో ఉద్యోగాలు సులభంగా లభిస్తాయి. పాశ్చాత్య దేశాల్లో డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, సైబర్ ఫోరెన్సిక్, స్టాక్ ఎక్ఛేంజ్, వెల్త్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ లాంటి వర్టికల్స్ కనిపిస్తాయి. మన దగ్గర అవి లేకపోగా నేర్పించే సరైన మానవ వనరులు అందుబాటులో లేవు. ఈ సమస్యలను అధిగమించేందుకు అత్యుత్తమ వర్సిటీల కోర్సులను మన కరిక్యులమ్‌లో భాగం చేస్తున్నాం. తద్వారా ఆంధ్రా వర్సిటీ నుంచి తీసుకునే డిగ్రీల్లో స్టాక్ ఎక్ఛేంజ్, రిస్క్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్, ఫైథాన్ కోర్సులకు ప్రపంచ వర్సిటీల సర్టిఫికేషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం మన వర్సిటీల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నాం. దీని ద్వారా ఉన్నత విద్యలో దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. వర్సిటీల్లో టెక్నాలజీ వినియోగం పెరగాలి.. యువతకు మనం ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే. నాణ్యమైన విద్య అందిస్తే పేదరికం నుంచి బయటపడతారు. మంచి కంపెనీల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో కనిపిస్తారు. అందుకే జగనన్న విదేశీ విద్య ద్వారా అత్యధికంగా ఒక్కో విద్యార్థిపై రూ.1.20 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ప్రపంచంలోని టాప్–50 వర్సిటీలు, 21 ఫ్యాకల్టీల్లో టైమ్స్ రేటింగ్స్, క్యూ ఎస్ రేటింగ్స్‌లోని 320 కాలేజీలలో సీటొస్తే ఉచితంగా చదివిస్తున్నాం. ఇప్పటి వరకు 400 మందికి పైగా ప్రభుత్వ సాయంతో విదేశాల్లో చదువుతున్నారు. విదేశాలకు వెళ్లి చదువుకోలేని వారికి కూడా మనం ఆ స్థాయి విద్యను అందించాలి. వర్సిటీల్లో ఏఐ, అగ్మెంటెడ్ టెక్నాలజీ, 3 డీ లెర్నింగ్ విధానాలను మన కరిక్యులమ్‌లో అందుబాటులోకి తేవాలని గతంలోనే వీసీలకు సూచించా. ఇప్పటికే పద్మావతి వర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి చర్యలు తీసుకున్నారు. కంప్యూటర్ విజన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్‌కు దాదాపు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇలాంటివి అన్ని వర్సిటీల్లోనూ రావాలి. సీఎం జగన్ దార్శనికతకు నిదర్శనం పద్మశ్రీ అనంత్ అగర్వాల్, ఎడెక్స్ సీఈవో రాష్ట్రంలో ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే తపనతో 12 లక్షల మందికి ఎడెక్స్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికీ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ దార్శనికతకు ఇది నిదర్శనం. ఉన్నత విద్యలో ఇది నిజంగా గేమ్ ఛేంజర్. పదేళ్ల కిందట ఎడెక్స్ ప్రయాణం మొదలైంది. డిగ్రీ చదివి రెండేళ్లు ఉద్యోగం కోసం ఎదురు చూసిన అక్షయ్ అనే విద్యార్థి కెరీర్‌పై ఆశలు వదులుకున్న తరుణంలో ఎంఐటీ రూపొందించిన పైథాన్ కోర్సు ఎడెక్స్ ద్వారా నేర్చుకున్నాడు. క్లౌడ్ కంప్యూటింగ్ చేశాడు. ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోగానే ఎంపికయ్యాడు. బెంగళూరు విమానాశ్రయంలో నన్ను గుర్తుపట్టి ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. సంపన్నుల పిల్లలకు చాలా అవకాశాలు వస్తాయి. వాళ్లు డబ్బు ఖర్చుచేసి మంచి కోచింగ్ సెంటర్లకు వెళ్లి నేర్చుకోగలరు. 36 ఏళ్లపాటు ప్రొఫెసర్‌గా ఉన్న నన్ను ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలు, విజన్ ఆశ్చర్యపరిచాయి. ఎంఐటీ, హార్వర్డ్ లాంటి వర్సిటీల విద్యను పేద విద్యార్థులందరికీ ఇవ్వాలని నాతో చెప్పారు. డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఆ స్థాయి విద్యను ఎలా అందించగలమో నాతో చర్చించారు. ఎడెక్స్‌తో ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌ను విద్యారంగంలో మొదటి స్థానంలో నిలబెడుతుంది. విజ్ఞానం, ఆర్థిక ప్రగతి, మంచి పౌరుడిగా తీర్చిదిద్దడంలో నాణ్యమైన చదువు ఎంతో ముఖ్యం. అందుకే ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి అగ్రపీఠం వేస్తోంది. సామాన్యులకూ కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తోంది. త్వరలోనే వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం ఏపీ విద్యా విధానాన్ని అనుసరిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సీఎం కోరిక మేరకు పాఠ్య ప్రణాళికలను సమర్థంగా తీర్చిదిద్దేందుకు నా వంతు సహకారం అందిస్తా. మరింత రాణిస్తాం.. నాలాంటి ఎంతో మంది విద్యార్థులు నాణ్యమైన విద్య కోరుకుంటున్నారు. మధ్య తరగతి విద్యార్థులు పరిమిత వనరులతో ఉన్నత స్థాయి విద్య అందుకోవడం చాలా కష్టం. అంతర్జాతీయ వర్సిటీల్లో చదువుకోవడం కలే. ముఖ్యమంత్రి జగన్ విజనరీ లీడర్‌షిప్‌తో వరల్డ్ క్లాస్ విద్య సాధ్యమవుతోంది. ఏపీని స్టేట్ ఆఫ్ నాలెడ్జ్, స్టేట్ ఆఫ్ ఇన్నొవేషన్, స్టేట్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడం గొప్ప విషయం. ఎడెక్స్ అందించే అంతర్జాతీయ వర్సిటీల కోర్సులను అందిపుచ్చుకుని రాణిస్తాం. – ప్రగతి జైశ్వాల్, బీటెక్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి స్ఫూర్తినిచ్చిన సీఎం జగన్ మా నాన్న చిన్న రైతు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నేను చదువుకుంటున్నా. నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యావకాశాలు దక్కుతున్నాయి. కరిక్యులమ్‌తో మా స్కిల్స్ పెరుగుతున్నాయి. ఎడెక్స్‌తో టాప్ వర్సిటీల కోర్సులను ఉచితంగా నేర్చుకుని గ్లోబల్ లెవల్ పోటీకి సిద్ధమవుతాం. ముఖ్యమంత్రి జగన్ లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. – ఎ.హరిత, బీటెక్, జేఎన్టీయూ–అనంతపురం మార్కెట్లో మంచి విలువ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌తో చదువుకునే సమయంలోనే ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకుంటున్నాం. మాకంటూ మార్కెట్లో వాల్యూ క్రియేట్ చేశారు. ఇంటర్న్‌షిప్ ద్వారా నెలకు రూ.8 వేల స్టైఫండ్ పొందుతున్నా. మా అమ్మను నేనే చూసుకోవాలి. జీవితంలో స్థిరపడితేనే ఏదైనా చేయగలను. పోటీని తట్టుకుని నిలబడాలంటే నాణ్యమైన విద్య తప్పనిసరి. ఎడెక్స్‌తో ఇది ప్రతి విద్యార్థికీ దక్కుతుంది. అంతర్జాతీయ వర్సిటీ సర్టిఫికేషన్‌తో సులభంగా ఉద్యోగాలు వస్తాయి. – అంజలి, బీకాం, మేరీ స్టెల్లా కాలేజీ, విజయవాడ -
హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!
కింద ఒక చాపలాంటిది పరచుకుని చిన్నారి డాన్స్ చేస్తోంది. చూశారు కదా! ఇది మామూలు చాప కాదు. ఇది హైటెక్ డాన్స్‌మ్యాట్. ఇందులో రిథమ్ సెట్ చేసుకుంటే, రిథమ్‌కు అనుగుణంగా ఈ చాప మీద లైట్లు వెలుగుతాయి. వెలిగే లైట్ల మీద అడుగులు వేస్తుండటమే! చిన్నారులు డాన్స్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ హైటెక్ డాన్స్‌మ్యాట్ ఎంతో అనువుగా ఉంటుంది. అమెరికన్ కంపెనీ ఫావో ష్వార్జ్ దీనిని ‘డాన్స్ మిక్సర్ రిథమ్ స్టెప్ ప్లేమేట్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు మోడ్స్‌లో పనిచేస్తుంది. ‘కీప్ ద బీట్’, ‘ఫ్రీస్టైల్’ మోడ్స్‌లో కోరుకున్న మోడ్ ఎంపిక చేసుకుని, దీని మీద తకిట తధిమి అంటూ ఇంచక్కా గంతులేయవచ్చు. మూడేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇది చక్కని ఆటవస్తువు. దీని ధర 30 డాలర్లు (రూ.2,497) మాత్రమే! (చదవండి: పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..) -
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్‌ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్‌లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
టెక్కీలకు గుడ్‌న్యూస్: ఏఐలో ఉచిత సర్టిఫికేషన్.. డేటా సైన్స్ కోర్సు కూడా..
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ వర్చువల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై కృత్రిమ మేథలో (ఏఐ) సర్టిఫికేషన్ కోసం ఉచిత శిక్షణ అందించనున్నట్లు తెలిపింది. ఏఐ, జెనరేటివ్ ఏఐలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇందులో కోర్సులు ఉంటాయి. అలాగే, పైథాన్ ప్రోగ్రామింగ్, లీనియర్ ఆల్జీబ్రా సహా డేటా సైన్స్‌కి సంబంధించిన వివిధ అంశాలతో సిటిజెన్స్ డేటా సైన్స్ కోర్సు కూడా ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి సరి్టఫికెట్ లభిస్తుంది. ఇన్ఫోసిస్ ఏఐ–ఫస్ట్ స్పెషలిస్టులు, డేటా స్ట్రాటెజిస్టులు ఈ బోధనాంశాలను రూపొందించారు. -
ఎన్ఈపీతో ‘ప్రాక్టికల్’ బోధన
గాంధీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం గుజరాత్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకున్నారు. అఖిల భారత ఉపాధ్యాయుల సదస్సులో ప్రధాని మాట్లాడుతూ కొత్త జాతీయ విద్యా విధానంతో (ఎన్ఈపీ) బోధనలో సమూల మార్పులు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు విద్యార్థులు పుస్తకాలు చూసీ బట్టీ పట్టడమే ఉండేదని కానీ ఈ కొత్త విద్యావిధానం ప్రాక్టికల్ లెర్నింగ్‌పై దృష్టి పెట్టిందని అన్నారు. దీనిని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రాథమిక విద్య విద్యార్థులకు వారి వారి మాతృభాషలోనే ఉండాలని అప్పుడే విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికి వస్తాయని చెప్పారు. మన దేశంలో ఆంగ్ల భాషలో బోధనకే అధిక ప్రాధాన్యం ఉందని ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఇంగ్లీషు మీడియంలో చదివించడానికి ఇష్టపడుతున్నారని ప్రధాని చెప్పారు. దీని వల్ల గ్రామాల్లోని ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారికి సరైన అవకాశాలు రావడం లేదన్నారు. ఎన్ఈపీతో ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రధాని మోదీ వివరించారు. ప్రభుత్వ పథకాల్లో వివక్షకు తావు లేదు గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ ప్రారంభోత్సవంతో పాటు రూ.4,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకి ప్రధాని శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభు త్వ పథకాల్లో కుల, మత వివక్షకు తావు లేదని అర్హులైన అందరికీ అవి చేరుతున్నాయని చెప్పారు. నిజమైన లౌకికవాదం ఉన్న చోట వివక్ష కనిపించదని అన్నారు. అందరూ సంతోషంగా ఉండడానికి కృషి చేయడం కంటే మించిన సామాజిక న్యాయం మరోటి లేదని అభిప్రాయపడ్డారు. 70% మంది మహిళల సాధికారతకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం ఒక పనిముట్టులా నిలిచిందని ప్రభుత్వ పథకాలన్నీ నూటికి నూరు శాతం లబ్ధి దారులకు చేరేలా చర్యలు చేపట్టామన్నారు. -
ఇంకా.. ఇంకా ఎదగాలి.. పరుగెత్తయినా పాలే తాగుతాం!
ఉన్న దానితో సంతృప్తి చెందాలి అందలాలు ఆశించకూడదు అనే సనాతన భావాలను నేటి తరం తోసిరాజంటున్నారు. నిలబడి తాగే నీళ్లు తమకు వద్దని పరుగెత్తయినా పాలే తాగుతామని చెబుతున్నారు. ఐదు, ఆరు అంకెల జీతాలు, హోదాలు అందుకున్నా అక్కడితో ఆగిపోవడం చేత కాదని, ఎదుగుదల అనేది నిర్విరామ ప్రయత్నమని స్పష్టం చేస్తున్నారు. అత్యుత్తమ ఆదాయాలు, హోదాలు ఆశిస్తూ తమ నైపుణ్యాలకు సానపట్టడంలో మన ప్రొఫెషనల్స్ అంతర్జాతీయంగా ముందున్నారని నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌పై నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. –సాక్షి, హైదరాబాద్ తమకున్న నైపుణ్యాలు, అవి తెచ్చిపెట్టిన ఉపాధి, ఆదాయాలతో ఐటీ సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు సరిపుచ్చుకోవడం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తమ సామర్థ్యాలను పదను పెట్టుకోవాలని మరింత మెరుగైన స్థితిని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో అంతర్జాతీయంగా అన్ని దేశాల కన్నా మనవాళ్లు ముందే ఉన్నారని ప్రముఖ ఎడ్ టెక్ ప్లాట్ ఫామ్ అయిన గ్రేట్ లెర్నింగ్...తన ‘అప్ స్కిల్లింగ్ ట్రెండ్స్ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివే... ♦ కెరీర్లలో ఎదుగుదల కోసం మన దేశంలో 85% మంది ప్రొఫెషనల్స్ అప్ స్కిల్లింగ్ ఎంతో ముఖ్యమైందిగా భావిస్తుంటే, అంతర్జాతీయంగా ఈ సగటు 76%గా ఉంది. ఇక అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల ప్రొఫెషనల్స్‌లో 64% మంది మాత్రమే అప్ స్కిల్లింగ్‌కు సై అంటున్నారు. ♦ మన ప్రొఫెషనల్స్ లో 71 % మంది తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలమని ఆత్మవిశ్వాసంతో ఉండగా, ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 59% మాత్రమే. ♦ ఈ ఏడాది తమ ఉద్యోగాలను నిలబెట్టుకునే విషయంలో అంతర్జాతీయంగా చూస్తే లాటిన్ అమెరికా అత్యంత తక్కువ ఆత్మ విశ్వాస శాతాన్ని (44%) కలిగి ఉంది. ♦ భారతదేశం, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికాలలో ఆఫీస్ వర్క్ అనేది ప్రొఫెషనల్స్ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతోంది. అదే సమయంలో అమెరికా, పశ్చిమాసియాలలో కుటుంబ బాధ్యతలు అనేవి ప్రొఫెషనల్స్ అప్ స్కిల్ కావడంలో అడ్డంకిగా ఉన్నాయి. ♦అప్ స్కిల్ కావడంలో ప్రొఫెషనల్స్‌కు ప్రేరణ కలిగించే అంశాల్లో పని చేస్తున్న సంస్థలో పెద్ద హోదా ప్రధాన కారణం కాగా, వ్యక్తిగత ఆస్తులు రెండో కారణంగా నిలిచింది. కొత్త ఉద్యోగాన్ని పొందడం అనేది 3వ స్థానంలో నిలిచింది. -
Ind Vs Pak: పాక్‌పై చారిత్రక ఇన్నింగ్స్.. కోహ్లి నేర్పిన 'పంచ సూత్రాలు'
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లి వీరోచిత పోరాటం చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ గ్రేట్ ఇన్నింగ్స్ నుంచి మనమంతా ఐదు విషాయాలు నేర్చోవాలని తెలిపారు ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కోహ్లీ నుంచి అందరూ నేర్చుకోవాల్సిన ఆ ఐదు విషయాలెంటో ఇప్పుడు చూద్దాం.. బ్యాడ్ టైమ్ తాత్కాలికమే.. శాశ్వతం కాదు. ప్రదర్శనతోనే బదులివ్వాలి చివరి క్షణం వరకు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి ప్రజలు దేన్నైనా త్వరగా మర్చిపోతారనే విషయం గుర్తుంచుకోవాలి మీ ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు ఎంతపెద్ద కష్టాన్నైనా సులభంగా అధిగమించవచ్చు #ViratKohli𓃵 की पारी से सीख: 1. आपका बुरा समय भी स्थायी नहीं है 2. सिर्फ़ अपने परफ़ॉर्मेंस से ही जवाब दिया जा सकता 3. अंतिम समय तक अपनी भावनाओं पर नियंत्रण रखना 4. लोगों की याददाश्त बहुत छोटी होती है 5. जब आत्मविश्वास बढ़ता है तो कठिन परिस्थिति भी आसान लगती है — Awanish Sharan (@AwanishSharan) October 24, 2022 ఐఏఎస్ అధికారి చెప్పినట్లు ఈ ఐదు విషయాలు కోహ్లి ఇన్నింగ్స్ నుంచి అందరూ నేర్చుకోవచ్చు. పాక్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమిండియాను హార్దిక్ పాండ్యతో కలిసి విజయతీరాలకు చేర్చాడు కోహ్లి. మ్యాచ్ పూర్తయాక భావోద్వానికి లోనయ్యాడు. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడినట్లు చెప్పాడు. చదవండి: Ind Vs Pak: భారత్-పాక్ మ్యాచ్.. చివరి ఓవర్లో 'నో బాల్'పై తీవ్ర దుమారం -
చదివినదెంత.. అవగాహన ఎంత?
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాల అయినా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు, విద్యాబోధన అందుతున్న సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్లో మరో సరికొత్త సదుపాయమూ అందుబాటులోకి వస్తోంది. పాఠశాలలోని విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంపొందించేందుకు ప్రత్యేక యాప్‌తో సేవలు అందనున్నాయి. జియో ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఎంబైబ్ డిజిటల్ లెర్నింగ్’ యాప్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంది రానగర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వినియోగించను న్నారు. విద్యార్థి ఏ స్థాయిలో విద్యను అభ్యసిస్తు న్నాడు? ఏ విషయంలో మెరుగుపడాల్సి ఉందనే అంశాలను ఈ యాప్ సాయంతో గుర్తించవచ్చు. విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టి.. అవసరమైన శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు వీలవుతుంది. దేశంలో 40 ప్రభుత్వ పాఠశాలల్లో.. గతేడాది దేశవ్యాప్తంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యా యులుగా అవార్డు అందుకున్న టీచర్లు పనిచేస్తున్న 40 ప్రభుత్వ పాఠశాలలకు ఈ యాప్ ను ఉచితంగా అందించేందుకు జియో సంస్థ ముందుకు వచ్చింది. అందులో భాగంగానే సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది. ఈ యాప్ వినియోగానికి సంబంధించి ఈ పాఠశాల ఉపాధ్యా యులకు శిక్షణ ఇచ్చారు. మరో వారం రోజుల్లో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 23 సెక్షన్లలో 1,212 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 90% పిల్లల తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. వారందరికీ కొత్త యాప్‌తో ప్రయోజనం కలుగు తుందంటున్నారు. ‘ఎంబైబ్’ యాప్ పనితీరు, ప్రయోజనాలివీ.. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు లాగిన్ అవకాశం ఉంటుంది. అందరినీ సమ న్వయం చేసేందుకు, పర్యవేక్షించేందుకు హెచ్ఎం/ప్రిన్సిపాల్‌కు కూడా అడ్మిన్ లాగిన్ ఉంటుంది. ప్రతిరోజూ చెప్పిన సబ్జెక్టులు, హోంవర్క్, ప్రశ్నలను ఉపాధ్యాయులు ఈ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. యాప్‌లోనే సబ్జెక్టుల వారీగా వీడియోలు, యానిమేషన్లు ఉంటాయి. ►విద్యార్థులు ఇంటికి వెళ్లాక పాఠాలను మళ్లీ చదువుకోవచ్చు. చదివిన తర్వాత యాప్‌లో ఆ పాఠానికి సంబంధించి చిన్నచిన్న ప్రశ్నలు వస్తాయి. అందులోనే సమాధానాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా విద్యార్థులకు ఎంత మేర పాఠం అర్థమైందనేది ఉపాధ్యాయులు గ్రహిస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు. విద్యార్థి ఎంత సమయంలో చదవడం పూర్తి చేశారు? యాప్ ఆన్ చేసి పక్కన పెట్టేశారా అన్నదీ గమనించ వచ్చు. ►ఈ యాప్ విద్యార్థుల అభ్యసన స్థాయిని ట్రాక్ చేసి, కృత్రిమ మేధ సాయంతో సమీక్షిస్తుంది. విద్యార్థికి అవసరమైన ఇన్‌పుట్స్‌ను సూచిస్తుం ది. వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు సదరు విద్యార్థులపై శ్రద్ధ పెడతారు. అవసరా న్ని బట్టి ఆన్లైన్, ప్రత్యక్ష బోధన చేస్తారు. ►విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యాప్ ద్వారా పిల్లలు ఏం చదువుతున్నారు? ఎంత మేర అవగాహన పొందుతున్నారన్నది తెలుసు కోవచ్చు. యాప్ ద్వారానే అవసరమైన సలహాలు, సూచనలు చేయవచ్చు. ►ఈ యాప్ వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులపై ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్లకు పర్యవేక్షణ మరింత సులువు అవుతుంది. మెరుగైన విద్య అందించే లక్ష్యంతో.. విద్యార్థులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మంత్రి హరీశ్‌రావు సహకారంతో మా పాఠశాల కార్పొరేట్ స్థాయికి చేరింది. ఎంబైబ్ డిజిటల్ లెర్నింగ్ యాప్ వినియోగానికి మా పాఠశాల ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఆ యాప్ విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుంది. అలాంటిది ఉచితంగా అందజేయనున్నారు. మా విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగితే.. చదువు చెప్పిన మాకు సంతోషంగా ఉంటుంది. – రామస్వామి, ప్రధానోపాధ్యాయుడు, (జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత) -
పిల్లల కథ: మాష్టారి పాఠం
రామసాగరమనే ఊరిలో పిల్లలు చాలా ఆకతాయిలు. ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఉండడం వలన అక్కడ ఎక్కువ జాలరుల కుటుంబాలే నివసించేవి. అక్కడి పిల్లలకు ఆ సముద్రమే ప్రపంచం. రోజంతా ఆ సాగర తీరంలో ఆటలాడుతూ, ఈతలు కొడుతూ గడిపేసేవారు. ఆ పిల్లల తల్లితండ్రులకేమో ఆ పిల్లలకు బాగా చదువు చెప్పించి గొప్పవాళ్లను చేయాలని ఉండేది. పిల్లలు తెలివిగల వారే గాని చదువు మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాంతో బడికి పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయేది. ఆ ఊరి పాఠశాలకు గణపతి మాష్టారు కొత్తగా వచ్చారు. ఎప్పటిలాగే పిల్లలు బడికి వచ్చి కాసేపు ఉండి ఆటలకు వెళ్లిపోయారు. ఒక వారం పాటు గణపతి మాష్టారు అక్కడి పిల్లలను గమనించారు. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించి దారిలోకి తీసుకురావాలని ఆయనకు అర్థమయింది. బడిలో పిల్లలందరినీ చేరదీసి ఆటల రూపంలోనే ఆ రోజు పాఠం చెప్పేవారు. ఆటల మీద మక్కువతో పిల్లలు నెమ్మదిగా బడిలో ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ల తరువాత తరగతిగదిలో కూర్చోబెట్టి కథల రూపంలో పాఠాలు చెప్పేవారు. మాష్టారి కథలకు పిల్లలు చెవులప్పగించేవారు. నెల తిరిగేసరికి పిల్లలంతా ఉదయం నుండి సాయంకాలం వరకు బడిలో గడపడానికి అలవాటుపడ్డారు. ఒక రోజు మాష్టారు పాఠం చెప్తుండగా ఒక గడుగ్గాయి నిలబడి ‘మాష్టారూ! మొన్న మీరు చెప్పిన పాఠంలో.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బిపోయి అనారోగ్యం పాలవుతామని చెప్పారు కదా! మరి ఇంత ఎక్కువ చదువుతూ ఉంటే మెదడు కూడా ఉబ్బిపోయే ప్రమాదం ఉండదా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాష్టారు కూడా నవ్వుతూ ‘అవునవును.. సరైన ప్రశ్నే అడిగావు. మన కడుపుకి తగినంత తింటాం అలాగే మెదడులో స్థలం ఉన్నంతే నేర్చుకోవాలి. మనకి పొట్టలో ఎంత ఖాళీ ఉందో తెలుస్తుంది కనుక పట్టినంత తింటాం. మరి మెదడులో ఖాళీ ఎంతుందో తెలిస్తేనే కదా అంత చదువు చదువుకోగలం! తెలుసుకుందామా మరి!’ అని అడిగారు. పిల్లలంతా ‘తెలుసుకుందాం’ అన్నారు ముక్తకంఠంతో. ‘రేపటి నుండి రోజూ బడి తరువాత మీకు ఇష్టమైన సముద్రం వద్దకు వెళ్ళి సముద్రం నిండే వరకు నీళ్లు తీసుకెళ్లి పోయండి. ఎన్ని నీళ్లు పోస్తే అది నిండిందో నాకు చెప్పండి’ అన్నారు మాష్టారు. మరుసటి రోజు నుండి పిల్లలందరూ ఒకొక్కరు ఒకొక్క బిందెతో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోయసాగారు. వాళ్ళు పోసిన నీళ్లతో సముద్రం కొంచెం కూడా నిండినట్టు కనపడలేదు. ఒక రోజులో నిండటం సాధ్యం కాదులే అనుకుని ఒక వారం దాటాక చూద్దాం అనుకున్నారు. వారం దాటినా అదే పరిస్థితి కనిపించింది. వారు పొసే నీరు తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని గ్రహించి అందరి ఇళ్లల్లోని కుళాయిల నుండి నేరుగా గొట్టాల ద్వారా నీరు సముద్రంలోనికి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నుండి మర్నాటి ఉదయం తాము నిద్ర లేచేసరికల్లా సముద్రం నిండిపోతుందని ఊహించి ఆ రాత్రి పడుకున్నారు. మర్నాడు ఉదయమే లేచి సాగరతీరానికి చేరుకున్నారు. ఎప్పటిలాగే ఉన్న సముద్రాన్ని చూసేసరికి తమది వృథా ప్రయత్నమని వారికి అర్థమయ్యింది. పిల్లలంతా కలిసి మాష్టారు వద్దకు వెళ్లి సముద్రాన్ని నింపడం తమ వల్ల కావడంలేదని చెప్పారు. ‘సముద్రంలాగే మానవ మేధ కూడా అనంతమైనది. మీరు ఎంత నేర్చుకున్నా గ్రహించుకోగల శక్తి మీ మెదడుకి ఉంటుంది. అలాగే విద్య కూడా అనంతమైనది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది. సముద్రంలోని ఉప్పునీరు తాగటానికి పనికిరాదు. అలాగే విద్య లేని మేధస్సు కూడా వృథాయే! ఎంత గొప్పవారైనా నిరంతర విద్యార్థిగా ఉంటూ మేధకు పదును పెట్టకపోతే ఉప్పునీటిలా వృథా పోవలసిందే’ అని చెప్పారు మాష్టారు. ‘ఇక పై బాగా చదువుకుందాం’ అని పిల్లలు వారిలో వారు గుసగుసలాడుకోవడం విని సంతోషపడ్డారు మాష్టారు. (క్లిక్: తన వంతు సాయం.. గుప్తదానమే మహాదానం) -
నయా ఇంగ్లిష్: ఘోస్ట్ కిచెన్ అంటే?
కస్టమర్ల కోసం ఇండోర్ సీటింగ్ ఉండదు. వెయిటర్లు ఉండరు. డైనింగ్ రూమ్ ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఫుడ్ డెలివరీ వోన్లీ తరహా రెస్టారెంట్లను ‘ఘోస్ట్ కిచెన్’ అంటారు. truthiness అంటే? అమెరికన్ టెలివిజన్ కమెడియన్ స్టిఫెన్ కోల్బర్ట్ ఈ టెర్మ్‌ను కాయిన్ చేశాడు. సాక్ష్యాలు, ఆధారాలతో సంబంధం లేకుండా ఒక విషయాన్ని గట్టిగా నమ్మడం... ట్రూతినెస్. sobercurious అంటే? ఆల్కహాల్ ముట్టకుండా ఒక నిర్ణితమైన కాలాన్ని ప్రయోగాత్మకంగా గడపడం. (చదవండి: పూజను 70 లక్షల మంది ఫాలో అవుతున్నారు.. ఎందుకంటే!) హైపర్బొలి అనగా... ఏదైనా విషయాన్ని కాస్త అతిశయంగా చెప్పడమే హైపర్బొలి. భావాన్ని యథాతథం గా తీసుకోవద్దు. కవితల్లో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: అతని కళ్లు కన్నీటి సముద్రాలు అయ్యాయి. convolution అంటే ఒక విషయం కష్టంగా, సంక్లిష్టంగా ఉండడం. ‘మనం సృష్టించకపోతే పదాలు ఎలా పుడతాయి!’ అనేది ఒక పాలసీ. పాత పదాలనే కొత్తగా కాయిన్ చేయడం అనేది మరో పద్ధతి. ‘ఒరిజనల్ సెన్స్ ఆఫ్ ది వర్డ్’కు దగ్గరగా తమాషా పదాలను సృష్టించడమే aptagram -
నేర్చుకో.. లాభాలు అందుకో
ఈక్విటీలు నూతన గరిష్టాలకు చేరుతుండడం యువ ఇన్వెస్టర్లలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. పెట్టుబడులపై చక్కని రాబడులు సొంతం చేసుకునే దిశగా వారు అడుగులు వేస్తున్నారు. గతంతో పోలిస్తే నేటి తరానికి ఉన్న అనుకూలత.. డిజిటల్ వేదికలపై సమాచారం పుష్కలంగా లభిస్తుండడం. లెర్నింగ్ యాప్‌ల సాయంతో ఈక్విటీలపై మరింత అవగాహన పెంచుకునేందుకు టెక్కీ యువత ఆసక్తి చూపిస్తోంది. జెరోదా పెట్టుబడుల మద్దతు కలిగిన ‘లెర్న్‌యాప్’కు యూజర్ల సంఖ్య ఏడాదిలోనే మూడింతలు పెరిగింది. 2020లో యూజర్ల సంఖ్య 70,000 కాగా, ఈ సంఖ్య ప్రస్తుతం 2,00,000 దాటిపోయింది. అంతేకాదు 10 లక్షల మంది ఇతరులు ఈ యాప్‌పై సమాచారాన్ని ఆన్వేషిస్తున్నారు. స్టాక్స్, క్రిప్టోలకు సంబంధించిన పాఠాలు ఇందులో వీడియోల రూపంలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. 50 లక్షల మంది యూజర్లకు చేరువ కావాలన్నది లెర్న్‌యాప్ లక్ష్యం. ‘‘2020 నుంచి మా ఆదాయంలో 300 శాతం వృద్ధి కనిపిస్తోంది. గతేడాది ఆదాయంతో పోలిస్తే 2021లో ఆదాయం 350 అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని లెర్న్‌యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో ప్రతీక్‌సింగ్ తెలిపారు. డాక్యుమెంటరీ రూపంలోని వీడియోలు, క్విజ్‌లతో ఇందులోని సమాచారాన్ని మరింత ఆసక్తికంగా మార్చే ప్రయత్నాలను లెర్న్‌యాప్ అమలు చేస్తోంది. సాధారణంగా ఆర్థిక అంశాల పట్ల ఎక్కువ మందిలో ఆసక్తి ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా రూపొందించడంపై ఈ సంస్థ దృష్టి పెట్టడం గమనార్హం. మహిళలకు ప్రత్యేకంగా.. పట్టణ మహిళల కోసం ఉద్దేశించినది ‘బేసిస్’ యాప్. క్రిప్టోలు, పెట్టుబడులపై ఈ యాప్‌లో ఆసక్తికర చర్చలు కూడా సాగుతుంటాయి. మార్కెట్లకు సంబంధించి తమ ఐడియాలను యూజర్లు ఇతరులతో పంచుకుంటుంటారు. 2019లో బేసి స్ మొదలు కాగా.. ఈ ప్లాట్‌ఫామ్‌పై మహిళా యూజర్ల సంఖ్య లక్ష దాటిపోయింది. వీరిలో ఎక్కువ మంది మిలీనియల్స్ కావడం గమనార్హం. కాలేజీ విద్యార్థినులు కూడా ఇందులో యూజర్లుగా ఉన్నారు. పెట్టుబడులను మెరుగ్గా నిర్వహించే విషయంలో నేర్చుకోవాలన్న ఆకాంక్ష వీరి లో వ్యక్తం కావడం భవిష్యత్తు పట్ల వారు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉన్నారో తెలుస్తోంది. ‘‘సభ్యు లు మా ప్లాట్ఫామ్లో చేరిన తర్వాత తమ ఆదాయంలో సగటున 40 శాతం మేర ఆదా చేయగలుగుతున్నారు’’ అని బేసిస్ సహ వ్యవస్థాపకురాలు దీపికా జైకిషన్ తెలిపారు. నిపుణుల సాయంతో తమ ఖర్చులను క్రమబదీ్ధకరించుకోవడం వల్లే ఇది సాధ్యమవుతున్నట్టు చెప్పారు. ఈ యాప్‌లో సభ్యత్వానికి వార్షిక చందా రూ.9,000. ‘ఫైనాన్స్’కు సంబంధించి ఎన్నో ఆరి్టకల్స్ ఈ యాప్‌పై అందుబాటులో ఉన్నాయి. ‘‘ఫైనాన్స్’ గురించి సౌకర్యవంతంగా నేర్చుకునేందుకు మహిళలకు ఒక సురక్షితమైన వేదికను ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’’ అని జైకిషన్ వెల్లడించారు. సొంత సామర్థ్యాలపై ఆసక్తి నేటి తరానికి తాము స్వయంగా ఆర్థిక అంశాలను తెలుసుకుని, తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోవాలన్న ఆసక్తి పెరుగుతున్నట్టు ఈ సంస్థలు చెబుతున్నాయి. ఆర్థిక సలహాదారులపై ఆధారపడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. లెర్న్యాప్ను బెంగళూరు, పుణె, ముంబై తదితర పట్టణాల నుంచి ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులు వినియోగిస్తున్నారు. ప్రాంతీయ మార్కెట్లకూ చేరువ కావాలని, హిందీతోపాటు కనీసం రెండు భారతీయ భాషల్లో కంటెంట్‌ను అందించాలన్న ప్రణాళికతో ఉన్నట్టు ప్రతీక్‌సింగ్ తెలిపారు. ప్రతీ నెలా రూ.375 చందా చెల్లించడం ద్వారా లెర్న్‌యాప్‌పై ఎన్ని కోర్స్‌లను అయినా నేర్చుకోవచ్చు. యూజర్ల విచారణలకు నిపుణులతో జవాబులను కూడా ఇప్పిస్తోంది. నాణ్యతపై దృష్టి.. ఆన్లైన్లో ఎన్నో వేదికలపై ఫైనాన్స్‌కు సంబంధించి వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో లెర్న్‌యాప్, బేసిస్ పనిచేస్తున్నాయి. లెర్న్‌యాప్‌పై పరిశ్రమలకు చెందిన నిపుణులు, దిగ్గజాలు చెప్పిన అనుభవ పాఠాలు అందుబాటులో ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చైర్మన్ రామ్‌దియో అగర్వాల్, బీఎస్ఈ సీఈవో ఆశిష్ చౌహాన్, ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో రాధికా గుప్తా, రాకేశ్ జున్‌జున్‌వాలాకు చెందిన రేర్ ఎంటర్ప్రైజెస్ సీఈవో ఉత్పల్సేత్ తదితరులు చెప్పిన అంశాలతో వీడియోలో ఈ వేదికపై ఉన్నాయి. ‘‘పరిశ్రమలకు చెందిన దిగ్గజ నిపుణులు పాఠాలు చెప్పడం సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశ్యంతోనే. అంతేకానీ, యూజర్ల నుంచి డబ్బులు సంపాదించుకోవాలని కాదు’’ అని ప్రతీక్‌సింగ్ తెలిపారు. లెర్న్‌యాప్ స్టోరీ రూపంలో వీడియోలను రూపొందిస్తోంది. తద్వారా ఆర్థిక అంశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి రోజూ 45 నిమిషాల వర్క్‌షాప్‌ను, అనంతరం ప్రశ్న/జవాబుల సెషన్‌ను నిర్వహిస్తోంది. దీంతో తాము నేర్చుకున్న అంశాలపై వారిలో మరింత అవగాహన ఏర్పడే దిశగా పనిచేస్తోంది. ‘‘మేము ప్రత్యక్ష ఫలితాలను కూడా అందిస్తున్నాం. ఈ రోజు నేర్చుకుని.. పెట్టుబడులు వృద్ధి చెందేందుకు 20 ఏళ్లు వేచి చూసే విధంగా ఇది ఉండదు’’ అని ప్రతీస్ సింగ్ చెప్పడం గమనార్హం. -
బైజూస్ చేతికి సింగపూర్ సంస్థ
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ దిగ్గజం బైజూస్ శరవేగంగా అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కొత్తగా మరో సంస్థను కొనుగోలు చేసింది. సింగపూర్ కేంద్రంగా పనిచేసే గ్రేట్ లెర్నింగ్‌ను 600 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4,466 కోట్లు) దక్కించుకుంది. ప్రొఫెషనల్, ఉన్నత విద్య సెగ్మెంట్లో తన స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా గ్రేట్ లెర్నింగ్‌లో 400 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,977 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. బైజూస్ ఇటీవలే అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫాం ఎపిక్‌ను 500 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,730 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఉత్తర అమెరికా మార్కెట్లో 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. బైజూస్ గ్రూప్‌లో భాగంగా మారినప్పటికీ వ్యవస్థాపక సీఈవో మోహన్ లక్కంరాజు, సహ వ్యవస్థాపకులు హరి నాయర్, అర్జున్ నాయర్ల సారథ్యంలో గ్రేట్ లెర్నింగ్ ఇకపైనా స్వతంత్రంగానే కార్యకలాపాలు కొనసాగించనుంది. బైజూస్ టెక్నాలజీ, గ్రేట్ లెర్నింగ్ ప్రొఫెషనల్ కోర్సుల కంటెంట్ ఒక దగ్గరకు చేరేందుకు ఈ డీల్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పేరొందిన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా కొత్త సెగ్మెంట్లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించుకోగలమని బైజూస్ వ్యవస్థాపక, సీఈవో బైజూ రవీంద్రన్ తెలిపారు. ఆన్లైన్లో ఉన్నత విద్యాభ్యాసం పెరిగే కొద్దీ అందుబాటు ధరల్లో అందరికీ విద్యను అందించేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని మోహన్ పేర్కొన్నారు. బైజూస్.. గ్రేట్ లెర్నింగ్ ఇలా.. గ్రేట్ లెర్నింగ్ 2013లో ప్రారంభమైంది. ఇప్పటిదాకా 170 పైచిలుకు దేశాల్లో 15 లక్షల మంది పైగా విద్యార్థులకు కోర్సులు అందించింది. ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) వంటి దిగ్గజ విద్యా సంస్థలకు చెందిన 2,800 పైగా పరిశ్రమ నిపుణులు ఇందులో మెంటార్లుగా ఉన్నారు. ప్రధానంగా సింగపూర్, అమెరికా, భారత్‌లో గ్రేట్ లెర్నింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. -
శిక్షణ కేంద్రం సమస్యలమయం
శిథిలావస్థకు చేరిన భవనాలు మరమ్మతులకు ప్రతిపాదనలతోనే సరి పట్టించుకునే వారేరీ? రాజమహేంద్రవరం రూరల్ : మహిళా సాధికారత కోసం తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతల ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేసేవారే కరువయ్యారు. ఉన్నతాధికారులకు, స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. దీనిని బట్టి మహిళలపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందోనని అర్థమవుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి... మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి, స్వావలంబనకు కృషి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో 1990లో బొమ్మూరు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళాప్రాంగణం)ను ప్రారంభించారు. అప్పటి నుంచి వివిధ కోర్సుల్లో సుమారు 75 వేల మందికి శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారు. పదెకరాల స్థలంలో నిర్మాణం చేపట్టిన భవనాలతో పాటు తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరాయి. ప్రాంగణంలో రోడ్లు సైతం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఈ ప్రాంగణంలో మహిళలకు అనేక రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఏ సమయంలో పెచ్చులు ఊడి మీద పడతాయోనని మహిళలు ఆందోళన చెందుతున్నారు. గోడు పట్టని పాలకులు శిక్షణల పర్యవేక్షణకు వస్తున్న అధికారులందరికీ భవనాలు మరమ్మతుల విషయాన్ని ప్రాంగణం మేనేజర్ స్వయంగా వివరిస్తున్నా ఉన్నతాధికారుల్లో మాత్రం చలనం ఉండడం లేదు. గత ఏడాది గిరిజన శిక్షణ కేంద్రం శంకుస్థాపనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి స్వయంగా తీసుకువెళ్లినా ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. జిల్లా ఉన్నతాధికారులు, మహిళా ఆర్థిక సంస్థ డైరెక్టర్లు పరిశీలించి వెళ్లినా ఇప్పటివరకు ప్రయోజనం చేకూరలేదు. భవన మరమ్మతులకు రూ.16.60 లక్షలు ప్రతిపాదనలు పంపించినా మంజూరు కాలేదని ప్రాంగణం మేనేజర్ రమణశ్రీ తెలిపారు. మహిళాసాధికార సంస్థ చైర్మన్, డైరెక్టర్లు, అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని పేర్కొన్నారు. -
ఆచరిస్తే..అద్భుతాలే.!
డీటూహెచ్, ఆన్లైన్ శిక్షణతో బహుముఖ ప్రయోజనం. భానుగుడి(కాకినాడ) : జేఈఈ అడ్వాన్డ్, జేఈఈ మెయిన్, ఐఐటీ శిక్షణలపేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న కోట్లాది రూపాయల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆయా పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో టీవీల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఐఐటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ లెర్నింగ్ (ఐఐటీ–పాల్) పథకాన్ని రూపొందించింది. ఈ టీవీ ఆధారిత శిక్షణాతరగతులను విద్యార్ధులు వినియోగించుకుంటే అధ్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభం జనవరి–1 నుంచి దేశవ్యాప్తంగా ఈ విద్యాపథకం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రవేశాలకు శిక్షణ పొందే విద్యార్థులకు స్వయం ప్రభ విద్యాచానళ్ల ద్వారా ఉచిత టీవీ ఆధారిత శిక్షణ ఇవ్వనున్నారు. నాలుగు స్వయంప్రభ విద్యా చానళ్ల ద్వారా విద్యార్థులకు అవసరమయ్యే గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులను ప్రతి సబ్జెక్టుకు 200 తరగతుల వరకు ఉండేలా ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేశా రు. సబ్జెక్టులో వచ్చే సందేహాల నివృత్తికి ఆన్ లైన్లో సమాధానాలు సబ్జెక్టు నిపుణులు ఇస్తారు. ఈ పరీక్షలకు యేటా రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు సిద్ధమవుతుండగా, మన జిల్లానుంచి 12–15 వేల మంది విద్యార్థులు రూ.లక్షలు వెచ్చించి పరీక్షలకు సిద్దమవుతున్నట్లు అంచనా. బడుగు విద్యార్థులకు అధిక ప్రయోజనం బడుగు విద్యార్థులు జేఈఈ అడ్వాన్డ్ పరీక్షలకు సన్నద్ధమవ్వాలన్న ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు ఇదొక సదావకాశం. జిల్లాలో42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 ఎయిడెడ్ కళాశాలలున్నాయి. 21,738 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందులో 11,600 మంది సైన్సు గ్రూపు విద్యార్థులున్నారు. ఎంసెట్‌తో సహా, ఐఐటీ, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్ధులు వందల్లోనే. ఆయా కళాశాలల్లో వీటికి సంబం«ధించిన భోధన జరగకపోవడం, విద్యార్థులు బయట తరగతులకు వెళ్లే ఆర్థిక స్తోమత లేకపోవడం కారణంగానే నైపుణ్యం ఉన్నా పరీక్షలకు సన్నద్ధమవడం లేదు. ప్రస్తుత విధానంతో ఆ ఇబ్బంది తీరనుంది. – విప్పర్తి సోమశేఖర్, ప్రిన్సిపాల్, పీఆర్ జూనియర్ కళాశాల, కాకినాడ ఆచరణ ముఖ్యం ప్రస్తుత పథకాన్ని విద్యార్థులు ఆచరణలో పెట్టాలి. ప్రతీరోజూ ఈ తరగతులకు హాజరుకావడం దినచర్యలో భాగంగా టైంటేబుల్ ఏర్పాటు చేసుకుని సన్నద్ధం కావాలి. ప్రభుత్వ కళాశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులున్నారు. వీరికి కనీసం మెటీరియల్ కొనుక్కోవడానికే డబ్బులు లేని పరిస్థితి ఉంది. వారికి ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. – అరుంధతి, కెమిస్ట్రీ అధ్యాపకురాలు ప్రింటెడ్ మెటీరియల్‌ను అందివ్వాలి విద్యార్థులకు ఆన్లైన్ లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా తరగతులు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వినే వెసులుబాటు ఉంది. విద్యార్థులకు ప్రింటెడ్ మెటీరియల్‌ను అందిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశం. ఎక్కువ సందేహాలు వచ్చే ఫిజిక్స్‌లో కాంతి, ఉష్ణం, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, గణితంలో డెరివేటివ్స్ ఇలా పలు అంశాల్లో లోతుగా నిపుణులు అధ్యయనంతో చేసే భోధన అన్నివిధాలుగా మేలు జరుగుతుంది. కే.ఎస్.ఎస్.రాజ్‌కుమార్, ఫిజిక్స్ అధ్యాపకులు మంచి నిర్ణయం ప్రభుత్వం ఐఐటీ, జేఈఈల కోసం ప్రత్యే క తరగతులను ఈ –లెర్నింగ్ విధానం ద్వారా అందివ్వాలన్న ఆలోచన చాలా మం చిది. ఈ కాంపిటేటివ్ పరీక్షలకు మేథస్సుతో పాటుగా, సకాలంలో స్పందించే నైపుణ్యం కావాలి. దానికి ప్రత్యేక శిక్షణ తప్పనిసరి. ఈ శిక్షణ ప్రభుత్వ కళాశాలల్లో లేదు. ప్రస్తుత పథకంతో పేద విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్ర యోజనం చేకూరుతుంది. – లక్ష్మినారాయణ, పీఆర్జీ ఫిజిక్స్ అధ్యాపకులు. -
ఇంగ్లిషు భయాన్ని పారద్రోలాలి
నేలకొండపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంగ్లిషు భయాన్ని ప్రారద్రోలేలా బోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నాంపల్లి రాజేష్ సూచించారు. మండల కేంద్రంలోని బాలికల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు పాఠాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మోనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా లో 965 మంది ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ బోధనపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 811 మంది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యావాలంటీర్లు ద్వారా బోధన చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని చెన్నారం హైస్కూల్లో ఉపాధ్యాయుడు సెలవు పెట్టి వైరాలో కాలేజీ నిర్వహిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నెల 28న జిల్లాలో రాష్ట్ర బృందం ప్రవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో తనీఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేలకొండపల్లి మండ లంలో కొత్తకొత్తూరు ప్రవేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని, దీనిపై మండల విద్యాశాఖాధికారిని విచారణ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రవేట్‌కు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. సమావేశంలో ఎంఈఓ పురుషోత్తమరావు, డీఆర్పీలు రామనాధం, అనితరాణి, ఆశాలత, పెద్ది జగన్నాధం, పంబ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
లెర్నింగ్‌పైనా దృష్టిపెట్టండి
గురుపూజోత్సవంలో కలెక్టర్ విజయవాడ : ఉపాధ్యాయులు టీచింగ్‌పై కాకుండా లెర్నింగ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు అన్నారు. విద్యారంగంలో కృష్ణా జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. జిల్లా విద్యా శాఖ, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యాన శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనపై గౌరవానికి నిదర్శనమన్నారు. సమాజం, ప్రభుత్వం కలిసి నిర్వహించేది టీచర్స్ డే ఒక్కటేనని పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించినప్పుడు ఆ ఘనత సంబంధిత బృందానికి దక్కుతుందని, విఫలమైతే ఇందుకు బాధ్యులను ఒకరిద్దరై నెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. తమ బోధనల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి మన జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యకు ప్రాధాన్యతనిచ్చి ఎక్కువ నిధులు కేటాయిస్తోందని, ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో అనుకున్న ప్రగతిని సాధించలేక పోవడం దురుదృష్టకరమన్నారు. ప్రపంచ దేశాలలో విద్యా ప్రమాణాలను ‘పాసా’ విధానాన్ని కొలమానంగా తీసుకుంటారని, దాని ప్రకారం మన దేశం వెనుకబడి ఉందని తెలిపారు. అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు మాట్లాడుతూ మార్కులే పరమావధిగా విద్యా బోధన చేయటం సరికాదన్నారు. విద్యార్థులలో సామాజిక, నైతిక విలువలను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అవార్డులు అందుకుంటున్న ఉపాధ్యాయులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని హితవుపలికారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి, రాజీవ్ విద్యా మిషన్ ఇన్చార్జ్ పీవో పుష్పమణి, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్‌ఎంజే నాయక్, జిల్లాలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మన్యంలో కానరాని పెద్ద పులులు!
2010లో మూడు పులులు 2012లో రెండు పెద్ద, రెండు చిన్నవి ఉన్నట్టు నిర్ధారణ తాజా సర్వేలో ఒక్క పులి జాడా దొరకని పరిస్థితి వేటగాళ్ల చేతిలో బలి? కొయ్యూరు, న్యూస్‌లైన్: దట్టమైన దండకారణ్యంలో ఒక్క పులి కూడా లేదు. పాడేరు, నర్సీపట్నం అటవీ డివిజన్లలో ఈ నెల 18 నుంచి 25 సుమారు 300 మంది అటవీ సిబ్బంది అణువణువు గాలించినా వాటి ఆచూకీ చిక్కలేదు. కొయ్యూరు-గూడెంకొత్తవీధి మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న దట్టమైన మర్రిపాకల రేంజ్లో పులులు ఉంటాయని భావించారు. అక్కడ కూడా వాటి జాడ కానరాలేదు. మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు సైతం తాము పులుల్ని చూశామని చెప్పలేకపోయారు. 2010లో నిర్వహించిన సర్వేలో మన్యంలో మూడు పెద్ద పులులున్నాయని నిర్ధారించారు. 2012లో నిర్వహించిన సర్వేలో మంపకు సమీపంలో పులినూతల వద్ద రెండు పెద్ద పులులు, రెండు పిల్లలను చూసినట్టు గిరిజనులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఒక్కటంటే ఒక్క పులిని కూడా చూసినట్టు మన్యంలోని గిరిజనులెవ్వరూ ధ్రువీకరించలేకపోయారు. వేటగాళ్లు హతమార్చారా? ఒకప్పుడు కాకులు దూరని కారడవి...చీమలు దూరని చిట్టడవిగా ఉండేది. ఇప్పుడు కారడవి, చిట్టడవి స్మగ్లర్ల బారినపడి చిక్కిపోయింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వేటగాళ్లు అడవి జంతువులను హతమారుస్తున్నారు. ప్రతి వేసవిలో ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చే వేటగాళ్లు నాటు తుపాకులతో పులులను చంపి వాటి చర్మం, గోళ్లు తీసుకుపోతున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో సీలేరు ప్రాంతం నుంచి పులి చర్మాలను తరలిస్తుండగా వాటిని నర్సీపట్నంలో పట్టుకున్నారు. అప్పట్లో చింతపల్లి సబ్ డీఎఫ్‌వోగా చేసిన ప్రస్తుత నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్ దీనిపై విచారణ నిర్వహించారు. అప్పటి నుంచే పులుల సంఖ్య తగ్గిపోతోందని నిర్ధారించారు. మర్రిపాకల అవతల గ్రామాల్లో రోజు పశువులను పులులు చంపి తినేస్తుండడంతో వాటిని గిరిజనులే చంపేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పులి ఏ జంతువునైనా చంపిన తరువాత ముం దుగా దాని రక్తాన్ని పీల్చేసి, పేగులు, గుండె తినేస్తుంది. మిగిలిన మాంసం తినేందుకు మరో రోజు వస్తుంది. తమ పశువులను రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు ఆ పశు కళేబరంపై విషం చల్లి పులులను హతమార్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మంప నుంచి మర్రిపాకల జోన్ వరకు అడవి గేదెలు సంఖ్య రెట్టింపయింది. కణుజులు, జింకలు, ఎలుగు బంట్లు, అడవి పందులు అధికంగానే ఉన్నాయని సర్వేలో తేలింది. పులుల కోసం అన్వేషణ మన్యంలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదని బదిలీపై వెళ్తున్న డీఎఫ్‌వో రామ్మోహనరావు ఆదివారం రాత్రి న్యూస్‌లైన్‌కు తెలిపారు. అటవీ అధికారులు సేకరించిన వివరాలను సోమవారం పూర్తిగా విశ్లేషిస్తారని చెప్పారు. మరో రెండు రోజుల పాటు పులుల గణన సర్వేను పొడిగించారని తెలిపారు. తమ సిబ్బంది ప్రస్తుతం వాటి జాడ కోసం అన్వేషిస్తున్నారని తెలిపారు. -
నటుడు విజయ్ నుంచి నేర్చుకున్నానంటోంది అమలాపాల్
నటుడు విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో క్రేజీ హీరోయిన్గా ప్రకాశిస్తోంది. కోలీవుడ్‌లో విజయ్‌తో జతకట్టిన తలైవా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జయంరవికి జంటగా నిమిర్న్ందు నిల్ చిత్రంలో, ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో, మలయాళంలో ఒక్కో చిత్రంలో చేస్తోంది. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్ సరసన నటించాలన్న కోరిక తలైవా చిత్రంతో నెరవేరిందని తెలిపింది. తలైవా చిత్రంలో హీరోయిన్గా దర్శకుడు విజయ్ తనను ఎంపిక చేసినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనంది. తన జీవితంలో ఊహించని సంఘటనలు చాలా జరిగాయని పేర్కొంది. తాను స్నేహానికి చాలా విలువనిస్తానని తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు ప్రాముఖ్యం ఉండదని పేర్కొంది. అయితే తలైవాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని వివరించింది. ఈ పాత్రలో నటించడం చాలెంజింగ్‌గా ఉందని పేర్కొంది. ఈ పాత్ర పోషణలో హీరో విజయ్ తనకు చాలా సహకరించారని చెప్పింది. వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తి విజయ్ అని పొడగ్తలు కురిపించింది. -
విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్
నటుడు విజయ్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది అమలాపాల్. ఈ మలయాళ కుట్టి ప్రస్తుతం తమిళం, తెలుగు భాషలలో క్రేజీ హీరోయిన్గా ప్రకాశిస్తోంది. కోలీవుడ్‌లో విజయ్‌తో జతకట్టిన తలైవా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం జయంరవికి జంటగా నిమిర్న్ందు నిల్ చిత్రంలో, ధనుష్ సరసన వేలై ఇల్లా పట్టాదారి చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో, మలయాళంలో ఒక్కో చిత్రంలో చేస్తోంది. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్ సరసన నటించాలన్న కోరిక తలైవా చిత్రంతో నెరవేరిందని తెలిపింది. తలైవా చిత్రంలో హీరోయిన్గా దర్శకుడు విజయ్ తనను ఎంపిక చేసినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనంది. తన జీవితంలో ఊహించని సంఘటనలు చాలా జరిగాయని పేర్కొంది. తాను స్నేహానికి చాలా విలువనిస్తానని తెలిపింది. సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్లకు ప్రాముఖ్యం ఉండదని పేర్కొంది. అయితే తలైవాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని వివరించింది. ఈ పాత్రలో నటించడం చాలెంజింగ్‌గా ఉందని పేర్కొంది. ఈ పాత్ర పోషణలో హీరో విజయ్ తనకు చాలా సహకరించారని చెప్పింది. వృత్తి పట్ల అంకితభావం గల వ్యక్తి విజయ్ అని పొడగ్తలు కురిపించింది.