మన్యంలో కానరాని పెద్ద పులులు!
- 2010లో మూడు పులులు
- 2012లో రెండు పెద్ద, రెండు చిన్నవి ఉన్నట్టు నిర్ధారణ
- తాజా సర్వేలో ఒక్క పులి జాడా దొరకని పరిస్థితి
- వేటగాళ్ల చేతిలో బలి?
కొయ్యూరు, న్యూస్‌లైన్: దట్టమైన దండకారణ్యంలో ఒక్క పులి కూడా లేదు. పాడేరు, నర్సీపట్నం అటవీ డివిజన్లలో ఈ నెల 18 నుంచి 25 సుమారు 300 మంది అటవీ సిబ్బంది అణువణువు గాలించినా వాటి ఆచూకీ చిక్కలేదు. కొయ్యూరు-గూడెంకొత్తవీధి మండలాల్లో వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న దట్టమైన మర్రిపాకల రేంజ్‌లో పులులు ఉంటాయని భావించారు. అక్కడ కూడా వాటి జాడ కానరాలేదు.
మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజనులు సైతం తాము పులుల్ని చూశామని చెప్పలేకపోయారు. 2010లో నిర్వహించిన సర్వేలో మన్యంలో మూడు పెద్ద పులులున్నాయని నిర్ధారించారు. 2012లో నిర్వహించిన సర్వేలో మంపకు సమీపంలో పులినూతల వద్ద రెండు పెద్ద పులులు, రెండు పిల్లలను చూసినట్టు గిరిజనులు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. తాజాగా నిర్వహించిన సర్వేలో ఒక్కటంటే ఒక్క పులిని కూడా చూసినట్టు మన్యంలోని గిరిజనులెవ్వరూ ధ్రువీకరించలేకపోయారు.
వేటగాళ్లు హతమార్చారా?
ఒకప్పుడు కాకులు దూరని కారడవి...చీమలు దూరని చిట్టడవిగా ఉండేది. ఇప్పుడు కారడవి, చిట్టడవి స్మగ్లర్ల బారినపడి చిక్కిపోయింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వేటగాళ్లు అడవి జంతువులను హతమారుస్తున్నారు. ప్రతి వేసవిలో ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చే వేటగాళ్లు నాటు తుపాకులతో పులులను చంపి వాటి చర్మం, గోళ్లు తీసుకుపోతున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. 2010లో సీలేరు ప్రాంతం నుంచి పులి చర్మాలను తరలిస్తుండగా వాటిని నర్సీపట్నంలో పట్టుకున్నారు. అప్పట్లో చింతపల్లి సబ్ డీఎఫ్‌వోగా చేసిన ప్రస్తుత నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్ దీనిపై విచారణ నిర్వహించారు. అప్పటి నుంచే పులుల సంఖ్య తగ్గిపోతోందని నిర్ధారించారు.
మర్రిపాకల అవతల గ్రామాల్లో రోజు పశువులను పులులు చంపి తినేస్తుండడంతో వాటిని గిరిజనులే చంపేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పులి ఏ జంతువునైనా చంపిన తరువాత ముం దుగా దాని రక్తాన్ని పీల్చేసి, పేగులు, గుండె తినేస్తుంది. మిగిలిన మాంసం తినేందుకు మరో రోజు వస్తుంది. తమ పశువులను రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు ఆ పశు కళేబరంపై విషం చల్లి పులులను హతమార్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. మంప నుంచి మర్రిపాకల జోన్ వరకు అడవి గేదెలు సంఖ్య రెట్టింపయింది. కణుజులు, జింకలు, ఎలుగు బంట్లు, అడవి పందులు అధికంగానే ఉన్నాయని సర్వేలో తేలింది.
పులుల కోసం అన్వేషణ
మన్యంలో ఎక్కడా పులుల జాడ కనిపించలేదని బదిలీపై వెళ్తున్న డీఎఫ్‌వో రామ్మోహనరావు ఆదివారం రాత్రి న్యూస్‌లైన్‌కు తెలిపారు. అటవీ అధికారులు సేకరించిన వివరాలను సోమవారం పూర్తిగా విశ్లేషిస్తారని చెప్పారు. మరో రెండు రోజుల పాటు పులుల గణన సర్వేను పొడిగించారని తెలిపారు. తమ సిబ్బంది ప్రస్తుతం వాటి జాడ కోసం అన్వేషిస్తున్నారని తెలిపారు.