రామసాగరమనే ఊరిలో పిల్లలు చాలా ఆకతాయిలు. ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఉండడం వలన అక్కడ ఎక్కువ జాలరుల కుటుంబాలే నివసించేవి. అక్కడి పిల్లలకు ఆ సముద్రమే ప్రపంచం. రోజంతా ఆ సాగర తీరంలో ఆటలాడుతూ, ఈతలు కొడుతూ గడిపేసేవారు. ఆ పిల్లల తల్లితండ్రులకేమో ఆ పిల్లలకు బాగా చదువు చెప్పించి గొప్పవాళ్లను చేయాలని ఉండేది. పిల్లలు తెలివిగల వారే గాని చదువు మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాంతో బడికి పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయేది.
ఆ ఊరి పాఠశాలకు గణపతి మాష్టారు కొత్తగా వచ్చారు. ఎప్పటిలాగే పిల్లలు బడికి వచ్చి కాసేపు ఉండి ఆటలకు వెళ్లిపోయారు. ఒక వారం పాటు గణపతి మాష్టారు అక్కడి పిల్లలను గమనించారు. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించి దారిలోకి తీసుకురావాలని ఆయనకు అర్థమయింది. బడిలో పిల్లలందరినీ చేరదీసి ఆటల రూపంలోనే ఆ రోజు పాఠం చెప్పేవారు. ఆటల మీద మక్కువతో పిల్లలు నెమ్మదిగా బడిలో ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ల తరువాత తరగతిగదిలో కూర్చోబెట్టి కథల రూపంలో పాఠాలు చెప్పేవారు. మాష్టారి కథలకు పిల్లలు చెవులప్పగించేవారు. నెల తిరిగేసరికి పిల్లలంతా ఉదయం నుండి సాయంకాలం వరకు బడిలో గడపడానికి అలవాటుపడ్డారు.
ఒక రోజు మాష్టారు పాఠం చెప్తుండగా ఒక గడుగ్గాయి నిలబడి ‘మాష్టారూ! మొన్న మీరు చెప్పిన పాఠంలో.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బిపోయి అనారోగ్యం పాలవుతామని చెప్పారు కదా! మరి ఇంత ఎక్కువ చదువుతూ ఉంటే మెదడు కూడా ఉబ్బిపోయే ప్రమాదం ఉండదా?’ అని అడిగాడు.
ఆ ప్రశ్నకు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాష్టారు కూడా నవ్వుతూ ‘అవునవును.. సరైన ప్రశ్నే అడిగావు. మన కడుపుకి తగినంత తింటాం అలాగే మెదడులో స్థలం ఉన్నంతే నేర్చుకోవాలి. మనకి పొట్టలో ఎంత ఖాళీ ఉందో తెలుస్తుంది కనుక పట్టినంత తింటాం. మరి మెదడులో ఖాళీ ఎంతుందో తెలిస్తేనే కదా అంత చదువు చదువుకోగలం! తెలుసుకుందామా మరి!’ అని అడిగారు.
పిల్లలంతా ‘తెలుసుకుందాం’ అన్నారు ముక్తకంఠంతో.
‘రేపటి నుండి రోజూ బడి తరువాత మీకు ఇష్టమైన సముద్రం వద్దకు వెళ్ళి సముద్రం నిండే వరకు నీళ్లు తీసుకెళ్లి పోయండి. ఎన్ని నీళ్లు పోస్తే అది నిండిందో నాకు చెప్పండి’ అన్నారు మాష్టారు.
మరుసటి రోజు నుండి పిల్లలందరూ ఒకొక్కరు ఒకొక్క బిందెతో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోయసాగారు. వాళ్ళు పోసిన నీళ్లతో సముద్రం కొంచెం కూడా నిండినట్టు కనపడలేదు. ఒక రోజులో నిండటం సాధ్యం కాదులే అనుకుని ఒక వారం దాటాక చూద్దాం అనుకున్నారు. వారం దాటినా అదే పరిస్థితి కనిపించింది. వారు పొసే నీరు తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని గ్రహించి అందరి ఇళ్లల్లోని కుళాయిల నుండి నేరుగా గొట్టాల ద్వారా నీరు సముద్రంలోనికి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నుండి మర్నాటి ఉదయం తాము నిద్ర లేచేసరికల్లా సముద్రం నిండిపోతుందని ఊహించి ఆ రాత్రి పడుకున్నారు. మర్నాడు ఉదయమే లేచి సాగరతీరానికి చేరుకున్నారు. ఎప్పటిలాగే ఉన్న సముద్రాన్ని చూసేసరికి తమది వృథా ప్రయత్నమని వారికి అర్థమయ్యింది.
పిల్లలంతా కలిసి మాష్టారు వద్దకు వెళ్లి సముద్రాన్ని నింపడం తమ వల్ల కావడంలేదని చెప్పారు.
‘సముద్రంలాగే మానవ మేధ కూడా అనంతమైనది. మీరు ఎంత నేర్చుకున్నా గ్రహించుకోగల శక్తి మీ మెదడుకి ఉంటుంది. అలాగే విద్య కూడా అనంతమైనది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది. సముద్రంలోని ఉప్పునీరు తాగటానికి పనికిరాదు. అలాగే విద్య లేని మేధస్సు కూడా వృథాయే! ఎంత గొప్పవారైనా నిరంతర విద్యార్థిగా ఉంటూ మేధకు పదును పెట్టకపోతే ఉప్పునీటిలా వృథా పోవలసిందే’ అని చెప్పారు మాష్టారు.
‘ఇక పై బాగా చదువుకుందాం’ అని పిల్లలు వారిలో వారు గుసగుసలాడుకోవడం విని సంతోషపడ్డారు మాష్టారు. (క్లిక్: తన వంతు సాయం.. గుప్తదానమే మహాదానం)
Comments
Please login to add a commentAdd a comment