moral stories
-
చవితి చంద్రుడు.. పున్నమి చంద్రుడు
అక్బర్ పాదుషా ఆస్థానంలో చేరిన అనతి కాలంలోనే బీర్బల్ ఆయనకు తలలో నాలుకలా మారాడు. బీర్బల్ చమత్కారాలను అక్బర్ పాదుషా అమితంగా ఇష్టపడేవాడు. తన తెలివితేటలతో బీర్బల్ ఎన్నో చిక్కు సమస్యలను పరిష్కరించి, మొఘల్ సామ్రాజ్యంలోనే అమిత మేధావిగా గుర్తింపు పొందాడు.బీర్బల్ తెలివి తేటలను అక్బర్ పాదుషా గుర్తించి, అతడిని తన ఆంతరంగికుడిగా చేసుకున్నాడు. మిగిలిన మంత్రులు చెప్పే మాటల కంటే బీర్బల్ మాటకు అక్బర్ పాదుషావారు ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఇదంతా ఆస్థానంలోని మిగిలిన మంత్రులకు, ఇతర ఉన్నత రాజోద్యోగులకు కంటగింపుగా ఉండేది. అదను చూసి బీర్బల్‌ను దెబ్బతీయడానికి ఎప్పటికప్పుడు విఫలయత్నాలు చేస్తుండేవారు. అసూయపరుల ప్రయత్నాలు ఎలా ఉన్నా, బీర్బల్ పేరు ప్రతిష్ఠలు మాత్రం అంతకంతకు పెరగసాగాయి. మొఘల్ సామ్రాజ్యంలోనే కాదు, బీర్బల్ ప్రఖ్యాతి పొరుగు దేశాలకూ పాకింది. బీర్బల్ ప్రఖ్యాతి ఆ నోటా ఈ నోటా పర్షియా రాజు వరకు చేరింది. బీర్బల్ తెలివితేటలను ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో ఆయన బీర్బల్‌కు తమ దేశానికి ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఆహ్వానం పంపాడు. అక్బర్ పాదుషా అనుమతితో బీర్బల్ పర్షియాకు ప్రయాణమయ్యాడు. పర్షియా రాజ్యంలో అడుగుపెడుతూనే బీర్బల్‌కు ఘనస్వాగతం లభించింది. పర్షియా రాజు బీర్బల్‌కు ఘనంగా అతిథి మర్యాదలు చేశాడు. అడుగడుగునా చక్కని విడిది వసతులు, రుచికరమైన విందులు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ్యంలోకి అడుగుపెట్టినది మొదలుకొని, పర్షియా రాజభటులు, ఉద్యోగులు బీర్బల్‌ను అంటిపెట్టుకుని ఉంటూ ఆయనకు కావలసిన ఏర్పాట్లన్నీ సజావుగా జరిగేలా చూసుకున్నారు. దగ్గర ఉండి మరీ వారు బీర్బల్‌ను రాజధానికి తీసుకువచ్చారు. రాజధానికి చేరుకున్న రోజు బీర్బల్ విశ్రాంతికి విలాసవంతమైన అతిథిగృహంలో ఏర్పాట్లు చేశారు. మరునాడు బీర్బల్ రాజోద్యోగులు వెంటరాగా పర్షియా రాజు దర్బార్‌లోకి అడుగుపెట్టాడు. బీర్బల్‌ను పర్షియా రాజు తన పక్కనే ఉన్నతాసనం మీద కూర్చోబెట్టుకుని, కుశల ప్రశ్నలు వేశాడు.‘బీర్బల్గారు! మీ వంటి మేధావి మా మిత్రుడైన అక్బర్ ఆస్థానంలో మంత్రిగా ఉండటం మాకూ గర్వకారణమే! మీకు నచ్చినన్ని రోజులు మా రాజ్యంలో అతిథిగా ఉండండి. రాజ్యం నలుమూలలా మీకు నచ్చినట్లు సంచారం చేయవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు చేయిస్తాను. మా రాజ్యంలోని పరిస్థితులను గమనించి, మెరుగు పరచుకోవలసిన అంశాలేమైనా ఉంటే సలహాలు ఇవ్వండి’ అని అన్నాడు.పర్షియా రాజ్యంలో కొన్నాళ్లు గడిపాక, బీర్బల్ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. తన రాజ్యానికి తిరిగి బయలుదేరాలనుకుంటున్నానని పర్షియా రాజుకు తెలియజేశాడు. బీర్బల్ తిరుగు ప్రయాణానికి ముందురోజు అతడి గౌరవార్థం పర్షియా రాజు ఘనంగా విందు ఏర్పాటు చేశాడు. పర్షియా రాజ దర్బారులోని మంత్రులు, సేనానాయకులు, ఉన్నతోద్యోగులు, రాజ్యంలోని కులీనులు, పెద్ద పెద్ద వర్తకులు ఆ విందులో పాల్గొన్నారు. విందులో కబుర్లాడుకుంటుండగా, పర్షియా మంత్రుల్లో ఒకరు వచ్చి బీర్బల్తో మాటలు కలిపాడు. ‘బీర్బల్ మహాశయా! మా రాజుగారి గురించి మీ అభిప్రాయం ఏమిటి?’ అని అడిగాడు.‘మీ రాజావారికేం? ఆయన పున్నమి చంద్రుడు’ అని బదులిచ్చాడు బీర్బల్.‘మరి మీ రాజావారి గురించి ఏమంటారు?’ అడిగాడా మంత్రి.‘మా రాజావారు చవితి చంద్రుడు’ అన్నాడు బీర్బల్. అక్బర్ పాదుషాను చవితి చంద్రుడితోను, తనను పున్నమి చంద్రుడితోను పోలుస్తూ బీర్బల్ అన్న మాటలకు పర్షియా రాజు పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. సాగనంపేటప్పుడు బీర్బల్‌కు అనేక విలువైన కానుకలు ఇచ్చాడు. అక్బర్ పాదుషాకు అందజేయమంటూ మరిన్ని కానుకలనిచ్చాడు. వాటిని మోసుకుపోవడానికి గుర్రబ్బగ్గీలను, సేవకులను ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికాడు.బీర్బల్ ఢిల్లీకి చేరుకున్నాడు. అక్బర్ పాదుషా దర్బారులోకి అడుగుపెట్టాడు. అక్బర్ పాదుషా చిర్రుబుర్రులాడుతూ కనిపించాడు. బీర్బల్‌కు ఏమీ అర్థంకాలేదు.పర్షియా రాజు వద్ద బీర్బల్ అన్న మాటలు వేగుల ద్వారా అప్పటికే అక్బర్ పాదుషా చెవికి చేరాయి.అక్బర్ పాదుషా ఇక ఉక్రోషాన్ని అణచుకోలేక నేరుగా విషయంలోకి వచ్చేశాడు.‘మా గురించి ఏమనుకుంటున్నావు బీర్బల్? పొరుగు రాజు వద్ద పరువు తీస్తావా?’ అన్నాడు కోపంగా.‘పొరుగు రాజు వద్ద నేను మిమ్మల్ని పొగిడాను జహాపనా!’ అన్నాడు బీర్బల్.‘చాలు, చాలు! ఇక బొంకకు. అక్కడ నువ్వన్న మాటలన్నీ నాకు తెలుసు. పర్షియా రాజు పున్నమి చంద్రుడా? నేను చవితి చంద్రుణ్ణా? ఇదేనా నన్ను పొగడటం?’ మరింత కోపంగా అన్నాడు అక్బర్ పాదుషా.‘జహాపనా! నిజమే, ఆయన పున్నమి చంద్రుడు. పున్నమి తర్వాత చంద్రుడు క్షీణించడం ప్రారంభిస్తాడు. తమరు చవితి చంద్రుడు. భవిష్యత్తులో తమరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. అందుకే అలా పొగిడాను. నా అదృష్టం బాగులేదు కనుక నన్ను తమరు అపార్థం చేసుకున్నారు’ అన్నాడు బీర్బల్.బీర్బల్ వివరణతో అక్బర్ సంతోషించాడు. తన మెడలోని హారాన్ని బహూకరించి సత్కరించాడు. -
అన్నింటికి మనస్సే ప్రధానం! ప్రేమతోనే గెలవాలి!
బుద్ధుని కాలంలో నిగంఠనాథ పుత్రుడు అనే సాధుగురువు ఉండేవాడు. అతనికి చాలామంది శిష్యులు ఉండేవారు. వారిలో దీర్ఘ తపస్వి అనే సాధువు ఒకడు. మనస్సు, వాక్కు, శరీరం అనే మూడింటిలో శరీరమే ప్రధానం అనేది నిగంఠుని సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని దీర్ఘ తపస్వి చాలా బలీయంగా ప్రచారం చేసేవాడు. దానితో నిగంఠుని శిష్యుల్లో శ్రేష్టుడయ్యాడు. ఈ దీర్ఘ తపస్వికి ఉపాలి అనే గృహస్తు మంచి అనుయాయి. ఉపాలి మంచి జ్ఞాని, ధనవంతుడు నిఘంటుని సాధు సంఘాన్ని అతనే పోషించేవాడు. అదే సమయంలో... బుద్ధుడు తన బౌద్ధ సంఘంతో నలందకు వచ్చాడు. శరీరం, మనస్సు, వాక్కుల్లో బుద్ధుడు మనస్సుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మనిషి చేసే కర్మలన్నింటికీ మనో కర్మే మూలం. మనసే అన్ని కర్మల్ని నడిపిస్తుంది అనేది బుద్ధుని సిద్ధాంతం. ఈ విషయం తెలిసి దీర్ఘ తాపసి కోపంతో... ‘‘నేను ఇప్పుడే వెళ్ళి, ఆ గౌతముణ్ణి వాదంలో ఓడించి వస్తాను’’ అని మండిపడ్డాడు. అప్పుడు ఉపాలి ‘‘గురువర్యా! ఈ మాత్రం దానికి తమరెందుకు! నేను చాలు. బలమైన ఏనుగు నీటి తటాకంలో దిగి, ఆ నీటిని చెల్లా చెదురు చేసినట్లు గౌతముణ్ణి నా వాదంతో చెల్లా చెదురు చేసి వస్తాను’’ అని బయలుదేరాడు. బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. వాదానికి దిగాడు. అతి కొద్ది సేపటికే వాదం ముగిసింది. ఉపాలి చివరికి అన్నింటికీ మనస్సే ముఖ్యం. మనసే మూలం అని అంగీకరించాడు. ఒక వ్యక్తి తనని కర్రతో కొట్టితే... తాను ఇంతకాలం ఆ నేరం ‘‘కొట్టిన కర్రది’’ అనుకున్నానని గ్రహించాడు. ఆ తప్పు కొట్టిన చేతిది కూడా కాదు. ఆ వ్యక్తి హింసా ప్రవృత్తే కారణం అని తెలుసుకున్నాడు. ఆ ప్రవృత్తి కేంద్రం మనస్సే అనే సత్యాన్ని నిర్ధారించుకున్నాడు. తాను ఇంతకాలం.. ఆ కర్రను పట్టుకుని వేలాడుతూ ఉన్నానని’’ గ్రహించాక, వెంటనే, బుద్ధునికి ప్రణమిల్లాడు. సముద్రం లోతులు చూడాలని, సముద్రంలో దిగిన ఒక ఉప్పు బొమ్మ, తాను కరిగిపోయి, ఆ సముద్రంలో లీనమైపోయినట్లు ఉపాలి మాత్రమే కాదు... ఎందరో బుద్ధుని మానవీయ సిద్ధాంతంలో కరిగిపోయారు. ఆ ధర్మ సాగరంలో బిందువులయ్యారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పది. సంకుచితత్వం కంటే విశాల దృక్పథం గొప్పదని చెప్పిన తథాగత బుద్ధుడు సర్వదా శ్లాఘనీయుడే! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
కార్పొరేట్ కోళ్ల ఫారాల్లో రాలుతున్న మొగ్గలు.. ఐఐటీ చెన్నైలో ఏం జరుగుతోంది?
👉ఐఐటీ లో సీట్ వచ్చిందంటే" లైఫ్" అనే సినిమా సూపర్ హిట్ అయినట్టేనని, మన దేశం లో కోట్లాది మంది పేరెంట్స్ నమ్ముతారు . 👉పరీక్ష రాసేది పన్నెండు లక్షల మంది .. చివరకు సీట్ సాధించేది 16 వేలమంది . 👉అంటే ఐఐటీ లో సీట్ కొట్టిన వారు త్రీ రోజెస్ టీ లాగ, "వేలాది లో ఒక్కరు" . ఐఐటీ లో విద్యా ప్రమాణాలు చాలా బాగుంటాయి. కోర్స్ పూర్తి చేస్తే భారీ శాలరీ ప్యాకేజీ తో మంచి ఉద్యోగం ఖాయం. మరి ఆత్మ హత్యలెందుకు ? ఏదో ఒకటి రెండు అయితే ఏదో అనుకోవచ్చు . ఐఐటీ చెన్నై లో గత రెండు నెలల్లో నాలుగు ఆత్మ హత్యలు . అన్ని ఐఐటీలలో కలిపి నాలుగేళ్లలో నలబై దాకా !ఎందుకిలా ? 1 . ఐఐటీ ఫౌండేషన్ పేరుతో ఆరో తరగతి నుంచే పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తున్నారు. దీని వల్ల , వీరిలో గ్రోత్ హార్మోన్ లోపం; హ్యాపీ హార్మోన్స్ తగినంత ఉత్పత్తి కావు. విపరీతమైన ఒత్తిడి వల్ల కార్టిసోల్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల చిరాకు, అసహనం , నిద్ర లేమి , ఆత్మ న్యూనతా భావం, అభద్రత, కుంగుబాటు లాంటి నెగటివ్ మానసిక ఉద్వేగభావాలు కలుగుతాయి. ఒక అంచనా ప్రకారం IITలో చదివే విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో కనీసం ఒకరు డిప్రెషన్ లాంటి మానసిక రోగాలతో బాధ పడుతున్నారు. 2. క్రీడలకు దూరం కావడం వల్ల క్రీడా స్ఫూర్తి కొరవడుతోంది. చిన్న సమస్యకు కుంగిపోతున్నారు ౩. తెలుగు, ఇంగ్లీష్, హిందీ.. ఈ సబ్జెక్టుల్లో అంతర్లీనంగా లైఫ్ స్కిల్స్ పాఠాలుంటాయి. IIT ఫౌండేషన్ లో కేవలం గణితం, భౌతిక శాస్త్రంపై దృష్టి నిలపడం జరుగుతోంది. కేవలం పరీక్ష కోసం తూతూ మంత్రంగా లిటరేచర్ అలాగే సోషల్ స్టడీస్ ను చదవక పోవడం వల్ల , ఇంగిత జ్ఞానం, సామజిక, భావోద్వేగ తెలివితేటలు లోపిస్తున్నాయి . పరిష్కారం : ✔️ప్రపంచం లో ఎన్నో ఉత్తమ విద్యా సంస్థలున్నాయి . వాటికీ ప్రవేశ పరీక్షలున్నాయి . ఆ పరీక్షల కోసం మహా అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయితే సరిపోతుంది . చిన్నప్పటి నుంచి సంపూరణాత్మక విద్య పొందిన విద్యార్థులకు ఈ ప్రిపరేషన్ కూడా పెద్దగా అవసరం లేకుండా పోతుంది. ❌దీనికి భిన్నంగా IIT JEE పరీక్షను రూపొందించారు. ఏళ్ళ తరబడి గణితాన్ని భౌతిక శాస్త్రాన్ని చదివిన వారికి.. అది కూడా క్రీడలు అల్ రౌండ్ డెవెలప్మెంట్ లాంటి వాటిని పక్కన పెట్టి, కోచింగ్ కోళ్లుగా మారిన వారికి మాత్రమే, ఈ పరీక్ష లో విజయం దక్కేలా ఆ పరీక్షను డిజైన్ చేసారు. ఐఐటీ కోచింగ్ వేల కోట్ల ఇండస్ట్రీ. ప్రత్యక్ష పరోక్ష పాత్రధారులు ఎంతో మంది. లబ్ది దారులు ఎంతో మంది. ఏదో అద్భుతం జరిగితే తప్పించి వ్యవస్థ మారదు . ఆరో తరగతి నుంచే కోట్లాది పిల్లల బాల్యం బుగ్గి పాలవుతోంది. ఇంటర్ .. అది ముగిసాక పరీక్ష రాసేవరకు బతుకు పరమ దుర్భరం. బ్రిటిష్ కాలం నాడు పోర్ట్ బ్లెయిర్ లోని సెల్యూలర్ జైలు. నేడు కోట .. ఇంకా తెలుగు నాట కార్పొరేట్ కోళ్ల ఫారాలు. కోటలో కోటి కన్నీటి కథలు. తెలుగు నాట కోళ్ల ఫారాలలో ఎనెన్నో వ్యధలు. అర్జెంటు గా అమెరికాకు వెళ్ళిపోవాలి . అక్కడి డాలర్ లు ఇక్కడికి పంపిస్తే నాలుగు సైట్స్ కొనాలి. అందరితో గొప్పలు చెప్పుకోవాలి . అటు పై 65 వచ్చే వరకు రెండేళ్లకు ఒక సారి అక్కడికెళ్లి వచ్చి నలుగురికి కబుర్లు చెప్పాలి.. ఇదీ ఆలోచన ... .ఇదీ తీరు ఐఐటీ లో చేరొద్దన్నా ? అమెరికా కు వెళ్లొదనా ? ✔️కానే కాదు. ఐఐటీ లు ప్రపంచ స్థాయి సంస్థలు . ఉత్తమ విద్యా ప్రమాణాలు . ✔️అమెరికాకో మరో చోటుకు వెళ్లడం సహజం. మనది నేడు విశ్వ గ్రామం . రానున్నది రోబో యుగం . ❌అమెరికాకో మరో దేశానికి వెళిపోతేనే సమస్యలు పరిష్కారం అయిపోతాయి .. అక్కడికి పొతే సమస్యలే ఉండవు అనుకోవడమే పెద్ద సమస్య . సమస్యలు లేని చోటు సమాధి ఒక్కటే .. సమస్యలు లేని జీవితం నరకం అని తెలుసుకోకపోవడం వీరి అజ్ఞానం. తాను సాధించలేని దాన్ని పిల్లల ద్వారా సాకారం చేసుకోవాలని అనుకోవడం. పిల్లల ఆప్టిట్యూడ్ పట్టించుకోక పోవడం. అన్నిటికీ మించి "కోచింగ్ కోసం .. కోచింగ్ ద్వారా ... కోచింగ్ మూలంగా" సాగే ఐఐటీ సీట్ ల భర్తీ ✔️ఐఐటీ లు సంతోష కర జీవనాన్ని సాగించడానికి ఒక మార్గం. ఎవరూ కాదనలేని సత్యం . కానీ ఐఐటీ లో సీట్ సాధించడమే జీవితం. ఆ ప్రయత్నం లో పిల్లల మానసిక శారీరిక ఆరోగ్యం ఎంత నాశనం అయినా ఫరవాలేదు అనుకొనే సగటు మధ్య తరగతి పేరెంట్ మనస్తత్వం మారనంత వరకు... ఇండియా లో బాల్యం శాపమే ! వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు చదవండి: మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
పిల్లల కథ: ఎగిరే కొండలు
సీతాపురం గ్రామం మొదట్లోనే.. ఒక పెంకుటిల్లు ఉంది. అందులో తన కొడుకు, కోడలుతో బాటుగా చిన్నవాడైన తన మనవడితో కలసి ఒక అవ్వ జీవిస్తోంది. కొడుకు, కోడలు పగలు పనికి వెళితే.. అవ్వ మనవడిని చూసుకునేది. రాత్రి అవగానే ఒక కథైనా చెప్పనిది మనవడు నిద్రపోయేవాడు కాదు. రోజూ రాజుల కథలు చెప్పి మనవడిని నిద్రపుచ్చేది, ఆ రోజు బాగా వెన్నెల కాస్తోంది. మనవడితో బాటు ఆరుబయట తాళ్ళ మంచంపై పడుకుంది అవ్వ. ‘కొండపైన అనేక రకాల పక్షులు ఉన్నాయి. అవి బాగా ఎగరగలవు. కొండకు కూడా రెక్కలు వుంటే ఎంత బాగుండేదో కదా అవ్వా..’ అన్నాడు మనవడు. మనవడి ప్రశ్నకు అవ్వ ఆశ్చర్యబోయింది ‘అవునూ.. ఎప్పుడూ రాజుల కథలేనా? ఇలాంటి కొత్త కథ ఒకటి చెప్పవ్వా’అంటూ మారాం చేశాడు. అవ్వ తల గీరుకుంది. ఏమి చెప్పాలా అని ఆలోచించింది. టక్కున ముసలి బుర్రకు ఒక కథ తట్టింది. వెంటనే చెప్పడం ప్రారంభించింది. ‘అనగనగా ఒకానొక కాలంలో కొండలకు రెక్కలు ఉండేవట. అవి ఎక్కడబడితే అక్కడ వాలిపోయేవట. మాకన్న బలవంతులు.. ఎత్తు గలవాళ్ళు, ఈ భూమిపై మా అంతటి విశాలమైన రెక్కలు ఏ పక్షికి లేవని చాలా గర్వపడేవట. మాకు ఎదురు లేదు, మేము ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగిపోతాం, ఒకరి ఆజ్ఞతో నడవాల్సిన పని లేదు, ఇంకొకరి సలహా అవసరం లేదు’ అంటూ చాలా గర్వంగా మాట్లాడేవట. ‘ఓ పర్వతమా.. మీరు బాగా ఎగరండి తప్పు లేదు. ఆకాశంలో ఆనందంగా విహరించండి, మాలాగా మీకు రెక్కలొచ్చాయి, కాదనలేదు, కానీ మేము ఏ కొమ్మలపైనో, ఏ రాతిపైనో వాలిపోతాం, ఏ జీవికి హాని చేయం’ అన్నాయట పక్షులు. ‘ఐతే ఏంటి’ అని వెటకార ధోరణిలో అడిగిందట కొండ. ‘మీరు ఎక్కడ వాలితే అక్కడ మీ బరువు జీవజాలంపై పడి చనిపోతున్నాయి, పైగా మీరు ఇలా స్థాన చలనం కావడం ప్రకృతికే విరుద్ధం’ అని హితవు పలికాయట పక్షులు. ‘ఏమన్నారు.. మేము విరుద్ధమా.. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా?’ అంటూ కొండలు కోప్పడ్డాయట. పక్షులు చేసేది లేక, మిన్నకుండి పోయాయట. కొండలు మాత్రం తమ రెక్కలతో ఎగురుకుంటూ వెళ్ళి, ఎక్కడబడితే అక్కడ వాలి, తమకు ఏ అపకారం చేయని జీవులను చంపేసేవట. ఇలా అయితే భూమిపై గల జీవులన్నీ చనిపోతాయని తలచి, ఎలాగైనా రెక్కల కొండల ఆగడాలను ఆపాలని, భూమిపై నివసించే జీవులన్నీ తమ గోడు వెళ్ళబోసుకోడానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాయట’ అంటూ కథ మధ్యలో ఆపేసి.. మంచం పక్కనే చెంబులో పెట్టుకున్న నీళ్ళు తాగి, కాస్త ఊపిరి పీల్చుకుంది అవ్వ. ‘తర్వాత ఏం జరిగిందో చెప్పవ్వా ’ అంటూ ఎంతో ఆసక్తిగా అడిగాడు మనవడు. తిరిగి చెప్పడం ప్రారంభించింది అవ్వ.. ‘అలా జీవులన్నీ దేవుని దగ్గరికి వెళ్లి మొర పెట్టుకోగానే.. దేవుడికి కోపం వచ్చిందట. ‘ఆ పర్వతాలకు ఎందుకంత గర్వం. ఒక చోట వుండలేక పోతున్నామంటే, పోనీలే అని కనికరించి రెక్కలు ఇస్తే.. ఇంతటి దారుణానికి ఒడిగడుతున్నాయా.. వెంటనే వాటి పొగరు అణచాల్సిందే ’ అంటూ దేవతలందరూ ఒక నిర్ణయానికి వచ్చారట. ఒక మంచి సమయం చూసుకుని పర్వతాల దగ్గరకు వెళ్లి ‘మీరు గౌరవంగా ఉంటారనుకుంటే.. గర్వంతో మసలుతున్నారు. బలముందని బలహీనులను తొక్కేయడం అహంకారానికి చిహ్నం. కాబట్టి మీ రెక్కలు తుంచడమే సరైన ధర్మం’ అంటూ దేవతలు కొండల రెక్కల్ని తెగ నరకడంతో ఊళ్ళకు అవతల పడిపోయాయట. ఉన్నచోటనే ఉండిపోయాయట. అంటూ కథ ముగించి పిల్లాడి వంక చూసింది అవ్వ. మనవడు బాగా నిద్రపోతున్నాడు. (పిల్లల కథ: ఎవరికి విలువ?) -
పిల్లల కథ: ఎవరికి విలువ?
ఒకరోజు ఒంటరిగా ఒక మూల కూర్చొని బాధపడుతున్న చెప్పుల దగ్గరకు టోపీ వచ్చి ‘ఏం చెప్పుమామా! దిగాలుగా ఉన్నావు’ అని పలకరించింది. దానికి జవాబుగా చెప్పు ‘ఏంలేదు అల్లుడు! రోజంతా నన్ను తొక్కి తొక్కి.. నా నారతీసి చివరికి ఇలా మూలనపడేస్తున్నారు ఈ మనుషులు. వాళ్ళ బరువు మోయలేక, వాళ్లు తిరిగే దారిలో ముళ్ళు, రాళ్ళ దెబ్బలు, మురుగు వాసన భరించలేక అలసిపోతున్నాను. నా మీద జాలి కూడా ఉండదు. అవసరం తీరిపోగానే, కనీసం శుభ్రం చేయకుండానే పక్కన ఇలా పడేస్తారు’ అని ఏడవసాగింది. చెప్పు వేదన విని టోపీ కళ్ళల్లో నీళ్ళు చిమ్మాయి. ‘నా బాధ ఎవరోతో చెప్పుకోను మామా! నన్ను ఎండలో మాడ్చేసి, వర్షంలో తడిపేసి నాలో తేజస్సు మొత్తం హరించేస్తున్నారు. అవసరం తీరాక నన్ను కూడా ఏదో ఒక మూల పడేస్తారు. అవసరం ఉన్నంత వరకే మన ఉపయోగం. తర్వాత మనల్ని పట్టించుకునే నాథుడే ఉండడు’ అంటూ వాపోయింది టోపీ. వీళ్ల సంభాషణ మధ్యలోకి బట్టలు వచ్చాయి.. ‘మీ పని పరవాలేదు కానీ మాకు మరీ నరకం. ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజంతా పని చేస్తాం. దుమ్ము, ధూళి, చెమట వాసన భరించలేకపోతున్నాం. కాస్త రంగు మారితే మమ్మల్ని పక్కన పడేస్తున్నారు’ అంటూ భోరున కన్నీరు కార్చాయి. చెప్పు, టోపీ, బట్టల వేదనాభరితమైన సంభాషణను పక్క నుండి వింటున్న బంగారం వారందరినీ పిలిచింది. ‘మీరంతా పిచ్చివాళ్ళలా ఆలోచించకండి.. నన్ను ఈ మనుషులు ఆడంబరం కోసం మీ అందరి కన్నా ఎక్కువ డబ్బులు పోసి కొని, తమ దర్జా చూపడానికి వేడుకల్లో నన్ను అలంకరించుకుని, తర్వాత బీరువాలో దాచేస్తుంటారు. మనల్ని తమ అవసరం కోసం మనిషి తయారుచేశారని మనం గుర్తుంచుకోవాలి. మీరు నిరంతరం మనిషికి ఉపయోగపడతారు. నేను కేవలం ఆడంబరం కోసం మాత్రమే ఉపయోగపడతాను. ఒక్కో సమయంలో ఒక్కో వస్తువుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ సృష్టిలో ఏది కూడా ప్రాధాన్యం లేకుండా ఉండదు. సమయాన్ని బట్టి వాటికి విలువ ఉంటుంది. అందుచేత మీరు అనవసరంగా ఆలోచించి, మీ విలువను మీరు తగ్గించుకుని బాధపడకండి’ అని హితబోధ చేసింది. ఆ మాటలు విన్న మిగతా వస్తువులు వాటి విలువ తగ్గలేదని తెలుసుకుని బంగారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనందంగా సేదతీరాయి. అదేవిధంగా ఈ సృష్టిలో మనిషి కూడా ఏదో ఒక సమయంలో తన విలువ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎదుటివారిని బాధపెడుతుంటారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవరాశికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. అది మనతో పాటు ఎదుటివారికి కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనమంతా గుర్తించి ఆనందంగా జీవిద్దాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. ఇతరులను గౌరవిస్తూ ముందడుగు వేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం జరుగుతుంది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పిల్లల కథ: ఎలుగుబంటి పిసినారితనం
చింతలవనంలో పెద్ద ఎలుగుబంటి ఒకటి కాపురముండేది. కూతురుని ఆమడ దూరంలో ఉన్న నేరేడుకోనలోని ఎలుగుకిచ్చి వివాహం చేసింది. పిల్లాడు బంటి బాల్యదశలోనే ఉన్నాడు. మగ ఎలుగుబంటి పగలంతా కష్టపడి చెట్లూ, పుట్టలూ వెదికి తేనెని సేకరించేది. దానితో ఆడ ఎలుగుబంటి వ్యాపారం చేసేది. ఆ అడవిలోని ఏ జంతువైనా తేనె అవసరమైతే వీరి దుకాణానికి రావలిసిందే. అయితే ఆడ ఎలుగు పరమ లోభి. పైగా నోటి దురుసు జాస్తి. కనీస జాలి లేకుండా అధిక ధరలతో ముక్కుపిండి ఖరీదు రాబట్టేది. ఇంట్లో భర్త, పిల్లాడిని కూడా తేనె ముట్టనిచ్చేది కాదు. ఒకరోజు ఆడ ఎలుగు ‘నేరేడుకోనకీ పోయి కూతురిని చూసివద్దాం’ అని అడిగింది. ‘నాకు పనుంది. పిల్లాడిని తీసుకుని నువ్వెళ్లు. అమ్మాయి కోసం వేరే కుండలో మంచి తేనె దాచాను. పట్టుకెళ్ళు’ అంది మగ ఎలుగు. ‘ఎందుకూ దండగా?ఎలాగూ అల్లుడు తెస్తాడుగా ’ అంటూ తిరస్కరించింది ఆడఎలుగు. ఇంటి ముందున్న కొబ్బరి చెట్టు నుంచి ఐదు కాయలు దింపింది. వాటి పీచు ఒలిచి, సంచీలో వేసుకుని ప్రయాణమైంది ఆడఎలుగు కొడుకు బంటితో. కొంతదూరం సాగాక బంటిగాడికి దప్పిక కలిగింది. ‘అమ్మా! దాహమేస్తోంది. మంచినీళ్ళు కావాలి’ అన్నాడు. ఆడ ఎలుగు నీళ్ళతిత్తిని వెదకబోయి నాలుక కరుచుకుంది. మంచినీరు మరిచి పోయింది. దెయ్యాలగుట్ట దాటితేగాని, నీటికుంట దొరకదు. ఇప్పుడెలా? అనుకుని ‘కాస్త ఓర్చుకో నాయనా! మరో రెండు మలుపులు తిరిగితే గుట్ట వస్తుంది. అక్కడ తాగుదువుగాని’ అంది అనునయంగా. బంటిగాడు బుద్ధిగా తలూపటంతో నడక సాగింది. మొదటి మలుపు దాటగానే మళ్ళీ అడిగాడు బంటిగాడు. ‘వచ్చేశాం! మరొక్క మలుపు’ అంటూ సముదాయించింది. కానీ విపరీతమైన దాహం వేయటంతో బంటిగాడు తట్టుకోలేక పోయాడు. సమీపంలో మరే నీటి తావూ లేదు. ‘పోనీ ఒక కొబ్బరికాయ కొట్టివ్వమ్మా!’ దీనంగా అడిగాడు. వాడలా అడగడంతో వాడి దాహం.. కేవలం కొబ్బరి నీళ్ల కోసం ఎత్తుగడ అనుకుంది. అసలు కాయలు దింపినపుడే నీరు తాగుతానని మంకుపట్టు పట్టాడు. అప్పుడు ఎలాగోలా గదిమి ఆపింది. ఇప్పుడు దాహం వంకతో కొబ్బరి నీళ్లకు పథకం వేశాడని నవ్వుకుంది. ‘ఇంకాసేపట్లో గమ్యం చేరతాం. అప్పటి వరకూ నిశ్శబ్దంగా ఉండు. లేకపోతే వీపు బద్దలవుతుంది’ అని హెచ్చరిస్తూ ముందుకు నడిపించింది. బంటిగాడిది నిజమైన దాహమని గుర్తించలేక పోయింది. నాలుగడుగులు వేశాక ‘దబ్బు’ మని కూలి,కళ్ళు తేలవేశాడు బంటిగాడు. ఆసరికి బిడ్డది నటన కాదు. నిజమైన దాహమని అర్థమైంది ఆడ ఎలుగుకి. వెంటనే సంచీలోంచి నాలుగు కొబ్బరి కాయలు తీసి వెంట వెంటనే కొట్టి, నీళ్ళు తాగించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే బంటిగాడి నేల కూలాడు. బిడ్డను చూస్తూ ‘సకాలంలో కొబ్బరినీళ్ళు పట్టించుంటే, నువ్వు దక్కి ఉండేవాడివిరా! నా పిసినారితనంతో నిన్ను చంపుకున్నాను’ అంటూ భోరున ఏడ్వసాగింది. దాని ఏడుపు విని సమీపంలోని పక్షులు, జంతువులూ వచ్చాయి. ఏమీ చేయలేక జాలిగా చూస్తుండి పోయాయి. అంతలో చింతలవనానికే చెందిన కోతి ఒకటి మూలికలను అన్వేషిస్తూ అటుగా వచ్చింది. అది హస్తవాసిగల వైద్యుడిగా పేరు గాంచింది. ఆడ ఎలుగుని గుర్తు పట్టి దగ్గరకు వచ్చింది. బంటిగాడి నాడిని పరీక్షించింది. అదృష్టవశాత్తు అది కొట్టుకుంటోంది. కానీ చాలా బలహీనంగా ఉంది. స్పృహ తప్పిందే గాని, చావలేదని గ్రహించింది. వెంటనే ఆడ ఎలుగుతో ‘ఏడ్వకు. నీ బిడ్డను బతికిస్తాను’ అంది. దాంతో కోతి కాళ్ళు పట్టుకుంది ఆడ ఎలుగు.. ‘నా దగ్గరున్న సమస్త తేనెని నీకు ధార పోస్తాను. నా బిడ్డని దక్కించు’ అంటూ. తన భుజాన వేలాడుతున్న సంచిలోంచి కొన్ని ఆకులు తీసి, నలిపి, బంటిగాడి ముక్కుల్లో పిండింది కోతి. తక్షణమే బంటిగాడు ‘హాఛ్’ అంటూ మూడుసార్లు తుమ్మి, పైకి లేచాడు. సంచీలోని చివరి కాయని కొట్టి, తాగించమని ఆడ ఎలుగుకు సూచించింది కోతి. ఆడఎలుగు కొబ్బరి నీళ్లు తాగించగానే బంటిగాడు తెప్పరిల్లాడు. ఇంతలో ఒక పక్షి పండును తెచ్చిచ్చింది. అది తిన్నాక బంటిగాడికి సత్తువ కలిగి కోలుకున్నాడు. అప్పుడు కోతి ‘మన నిత్యావసరాలు తీరగా మిగిలినది దాచుకుంటే దాన్ని ‘పొదుపు’ అంటారు. కడుపు మాడ్చుకుని కూడబెడితే అది‘పిసినారితనం’ అవుతుంది. నీ లోభత్వంతో కుటుంబాన్ని వేధించావు. ఇరుగు పొరుగుని సాధించావు. దానివల్ల చెడ్డపేరు మూటగట్టుకున్నావు తప్ప చిటికడెంత గౌరవం పొందలేక పోయావు. ‘నా ’ అనే వాళ్ళు నలుగురు లేని ఒంటరి జీవితం వ్యర్థం’ అని హితవు పలికింది. బుద్ధి తెచ్చుకున్న ఆడ ఎలుగు లెంపలేసుకుంది. ‘ఇకపై నా ప్రవర్తన మార్చుకుంటాను’ అంటూ బిడ్డపై ప్రమాణం చేసింది. మరిన్ని పిల్లల కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
పరాయి వస్తువులపై మోజు.. ఇన్ని ఇబ్బందులా!
వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి. వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది. తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది. తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్‌లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..) ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
పిల్లల కథ: ప్రతిభకు పట్టం
దేవరకొండ రాజ్యానికి రాజు శివవర్మ. తన తెలివితేటలతో, శక్తితో రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు. ప్రజల సుఖశాంతుల కోసం పాలనలో ఎన్నో సంస్కరణలు చేశాడు. తను వృద్ధుడు అవుతున్నాడు. తన తర్వాత రాజ్యానికి రాజు ఎవరు అనే ఆలోచన ఆయన్ని ఎప్పుడూ తొలుస్తూ ఉండేది. రాజు కొడుకుని రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయటం అనే సంప్రదాయానికి శివవర్మ పూర్తిగా వ్యతిరేకం. సమర్థుడు, తెలివైనవాడు, ప్రజల మనసు తెలిసినవాడు దేవరకొండ రాజ్యానికి రాజు కావాలనేది శివవర్మ కోరిక. తన తర్వాత రాజ్యానికి రాజును ఎంపిక చేసేందుకు తను ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నానని, ఆ పరీక్షలో తన ఇద్దరు కుమారులతో పాటు రాజ్యంలోని పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాడు శివవర్మ. ఆ పరీక్షకు రాజు పెద్దకొడుకుతో పాటు అనేక మంది హాజరయ్యారు. రాజు చిన్నకొడుకు హాజరుకాలేదు. అత్యంత క్లిష్టమైన రాత పరీక్ష, శరీర సామర్థ్య పరీక్షలలో రాజు పెద్దకొడుకు విఫలమయ్యాడు. పరీక్షలలో విజయం సాధించింది కేవలం ముగ్గురు. వారు అనంతుడు, వీరాచారి, కేశవుడు. ఆ ముగ్గురిని శివవర్మ తన మందిరానికి పిలిపించాడు. ‘నా తర్వాత రాజ్య బాధ్యతలు చేపట్టడానికి ముందుకు వచ్చి, రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైన మీ ముగ్గురికీ ముందుగా నా శుభాకాంక్షలు. చివరిగా నేను పెట్టబోయే పరీక్ష చాలా చిన్నది. కేవలం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరైతే నాకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు ’ అంటూ ముగ్గురికీ స్వాగతం పలికాడు శివవర్మ. ‘ఈ భూమి మీద అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరిలోకి గొప్పవాడు ఎవరు?’ అడిగాడు రాజు. ‘అందరి కంటే గొప్పవాడు దేవుడు.. ప్రభూ’ చెప్పాడు అనంతుడు. ‘మనుషుల్లో గొప్పవారు ఎవరు అనేది నా ప్రశ్న’ తెలియజేశాడు రాజు. ‘ప్రభూ... మీ మాట ఎవరూ కాదనరు. మీ కంటే గొప్పవారు ఇంకెవరుంటారు’ చెప్పాడు వీరాచారి. ‘రాజు కంటే గొప్పవాడు ఎవరు?’ మళ్లీ అడిగాడు రాజు. ‘గొప్పవాడు ఉన్నాడు మహారాజా.. అయితే నేను మీకు అతన్ని నేరుగా చూపిస్తాను’ అన్నాడు కేశవుడు. అనంతుడు, రంగాచారి, కేశవుడు, రాజుగారు మారువేషాల్లో నగరంలోకి ప్రవేశించారు. ఊరి బయట రహదారి పక్కన కొన్ని విత్తులు నాటుతూ, కొన్ని మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించాడు ఒక వృద్ధుడు. తర్వాత మరో ఊరికి వెళ్ళారు. అక్కడ ఒక వ్యక్తి శుభాశుభ కార్యక్రమాలు జరిగే ఇళ్ళల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పోగుచేసి నిరుపేదలకు పంచుతున్నాడు. ఇంకొక ఊరిలో ఒక వ్యక్తి అనాథ శవాలు, జంతు కళేబరాలకు అంతిమ సంస్కారం చేస్తున్నాడు. ‘ప్రభూ, తను పెంచుతున్న ఆ మొక్కలు వృక్షాలై ఫలాలను ఇచ్చేదాకా ఆ వృద్ధుడు జీవించి ఉండలేడు. అలాగే ఆహార పదార్థాలు వ్యర్థం కాకుండా నిరుపేదలకు పంచే.., అనాథ శవాలు, మృత కళేబరాలకు అంతిమ సంస్కారం చేసే వ్యక్తులు కూడా. ఈ ముగ్గురూ తమ కోసం కాక ఇతరుల కోసం పడే ప్రయాసను చూడండి. ఇతరులకు సేవ చేయడం కోసం జీవించేవాడి కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు ప్రభూ? ’ అన్నాడు కేశవుడు. కేశవుడి సమాధానంతో రాజు శివవర్మ సంతృప్తి చెందాడు. సంతోషంతో కేశవుని ఆలింగనం చేసుకున్నాడు. కేశవుడిని తన తరువాత రాజుగా ప్రకటించాడు. వెంటనే కేశవుడు తననెవరూ గుర్తించలేని విధంగా ఉన్న తన మారువేషాన్ని తొలగించి అసలు రూపంతో కనిపించాడు. అతన్ని చూసిన రాజు, అనంతుడు, వీరాచారి ఆశ్చర్యపోయారు. అతను రాజు రెండవ కొడుకు కేశవవర్మ. ‘నువ్వు పోటీలో మారువేషంలో పాల్గొనడానికి కారణం ఏమిటి?’ అని కొడుకును ప్రశ్నించాడు శివశర్మ. (పిల్లల కథ: ఆనందమాత) ‘ప్రభూ.. రాజుగారి కొడుకు హోదాలో ఈ పోటీలో పాల్గొనటం నాకు ఇష్టంలేదు. రాజుగారి కొడుకుగా పోటీలో పాల్గొంటే నాతో పాటు పాల్గొనే సాధారణ పౌరులు నన్ను చూసి భయపడటం లేదా వెనకడుగు వేయటం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా మారువేషంలో పాల్గొన్నాను. క్షమించండి ప్రభూ’ చెప్పాడు కేశవవర్మ. ‘కుమారా.. నీ ఆలోచనా విధానం బాగుంది. నువ్వు ప్రజల మన్ననలను పొందే పాలకుడివి కాగలవు’ అంటూ కొడుకును ఆశీర్వదించాడు రాజు శివవర్మ. వీరాచారి, అనంతులకు తన ఆస్థానంలో తగిన ఉద్యోగాలు ఇచ్చాడు. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!) -
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
పిల్లల కథ: మాష్టారి పాఠం
రామసాగరమనే ఊరిలో పిల్లలు చాలా ఆకతాయిలు. ఆ ఊరు సముద్రపు ఒడ్డున ఉండడం వలన అక్కడ ఎక్కువ జాలరుల కుటుంబాలే నివసించేవి. అక్కడి పిల్లలకు ఆ సముద్రమే ప్రపంచం. రోజంతా ఆ సాగర తీరంలో ఆటలాడుతూ, ఈతలు కొడుతూ గడిపేసేవారు. ఆ పిల్లల తల్లితండ్రులకేమో ఆ పిల్లలకు బాగా చదువు చెప్పించి గొప్పవాళ్లను చేయాలని ఉండేది. పిల్లలు తెలివిగల వారే గాని చదువు మీద శ్రద్ధ చూపేవారు కాదు. దాంతో బడికి పంపినా పెద్దగా ఉపయోగం లేకపోయేది. ఆ ఊరి పాఠశాలకు గణపతి మాష్టారు కొత్తగా వచ్చారు. ఎప్పటిలాగే పిల్లలు బడికి వచ్చి కాసేపు ఉండి ఆటలకు వెళ్లిపోయారు. ఒక వారం పాటు గణపతి మాష్టారు అక్కడి పిల్లలను గమనించారు. వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించి దారిలోకి తీసుకురావాలని ఆయనకు అర్థమయింది. బడిలో పిల్లలందరినీ చేరదీసి ఆటల రూపంలోనే ఆ రోజు పాఠం చెప్పేవారు. ఆటల మీద మక్కువతో పిల్లలు నెమ్మదిగా బడిలో ఉండటం మొదలుపెట్టారు. అలా కొన్నాళ్ల తరువాత తరగతిగదిలో కూర్చోబెట్టి కథల రూపంలో పాఠాలు చెప్పేవారు. మాష్టారి కథలకు పిల్లలు చెవులప్పగించేవారు. నెల తిరిగేసరికి పిల్లలంతా ఉదయం నుండి సాయంకాలం వరకు బడిలో గడపడానికి అలవాటుపడ్డారు. ఒక రోజు మాష్టారు పాఠం చెప్తుండగా ఒక గడుగ్గాయి నిలబడి ‘మాష్టారూ! మొన్న మీరు చెప్పిన పాఠంలో.. ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బిపోయి అనారోగ్యం పాలవుతామని చెప్పారు కదా! మరి ఇంత ఎక్కువ చదువుతూ ఉంటే మెదడు కూడా ఉబ్బిపోయే ప్రమాదం ఉండదా?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు అక్కడున్నవాళ్లంతా పగలబడి నవ్వారు. మాష్టారు కూడా నవ్వుతూ ‘అవునవును.. సరైన ప్రశ్నే అడిగావు. మన కడుపుకి తగినంత తింటాం అలాగే మెదడులో స్థలం ఉన్నంతే నేర్చుకోవాలి. మనకి పొట్టలో ఎంత ఖాళీ ఉందో తెలుస్తుంది కనుక పట్టినంత తింటాం. మరి మెదడులో ఖాళీ ఎంతుందో తెలిస్తేనే కదా అంత చదువు చదువుకోగలం! తెలుసుకుందామా మరి!’ అని అడిగారు. పిల్లలంతా ‘తెలుసుకుందాం’ అన్నారు ముక్తకంఠంతో. ‘రేపటి నుండి రోజూ బడి తరువాత మీకు ఇష్టమైన సముద్రం వద్దకు వెళ్ళి సముద్రం నిండే వరకు నీళ్లు తీసుకెళ్లి పోయండి. ఎన్ని నీళ్లు పోస్తే అది నిండిందో నాకు చెప్పండి’ అన్నారు మాష్టారు. మరుసటి రోజు నుండి పిల్లలందరూ ఒకొక్కరు ఒకొక్క బిందెతో నీళ్లు తీసుకెళ్లి సముద్రంలో పోయసాగారు. వాళ్ళు పోసిన నీళ్లతో సముద్రం కొంచెం కూడా నిండినట్టు కనపడలేదు. ఒక రోజులో నిండటం సాధ్యం కాదులే అనుకుని ఒక వారం దాటాక చూద్దాం అనుకున్నారు. వారం దాటినా అదే పరిస్థితి కనిపించింది. వారు పొసే నీరు తక్కువగా ఉండటం వలనే ఇలా జరుగుతోందని గ్రహించి అందరి ఇళ్లల్లోని కుళాయిల నుండి నేరుగా గొట్టాల ద్వారా నీరు సముద్రంలోనికి ప్రవహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రోజు సాయంత్రం నుండి మర్నాటి ఉదయం తాము నిద్ర లేచేసరికల్లా సముద్రం నిండిపోతుందని ఊహించి ఆ రాత్రి పడుకున్నారు. మర్నాడు ఉదయమే లేచి సాగరతీరానికి చేరుకున్నారు. ఎప్పటిలాగే ఉన్న సముద్రాన్ని చూసేసరికి తమది వృథా ప్రయత్నమని వారికి అర్థమయ్యింది. పిల్లలంతా కలిసి మాష్టారు వద్దకు వెళ్లి సముద్రాన్ని నింపడం తమ వల్ల కావడంలేదని చెప్పారు. ‘సముద్రంలాగే మానవ మేధ కూడా అనంతమైనది. మీరు ఎంత నేర్చుకున్నా గ్రహించుకోగల శక్తి మీ మెదడుకి ఉంటుంది. అలాగే విద్య కూడా అనంతమైనది. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవలసినది ఎంతో ఉంటుంది. సముద్రంలోని ఉప్పునీరు తాగటానికి పనికిరాదు. అలాగే విద్య లేని మేధస్సు కూడా వృథాయే! ఎంత గొప్పవారైనా నిరంతర విద్యార్థిగా ఉంటూ మేధకు పదును పెట్టకపోతే ఉప్పునీటిలా వృథా పోవలసిందే’ అని చెప్పారు మాష్టారు. ‘ఇక పై బాగా చదువుకుందాం’ అని పిల్లలు వారిలో వారు గుసగుసలాడుకోవడం విని సంతోషపడ్డారు మాష్టారు. (క్లిక్: తన వంతు సాయం.. గుప్తదానమే మహాదానం) -
పిల్లల కథ: తన వంతు సాయం
గుర్ల అనే గ్రామంలో నివసించే శశిధరుడికి బాగా డబ్బుంది. పండే పొలాలు కూడా చాలా ఉన్నాయి. ఐతే ఎవరైనా అవసరం పడి చేయి చాస్తే మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చేవాడు కాదు. ఈ ప్రవర్తన భార్య సుగుణకి నచ్చేది కాదు. ‘మీ మిత్రుడు చరితాత్ముడిని చూసి సిగ్గు తెచ్చుకోండి. ఆయన గుణం ఎంత మంచిది! ఎందరికో ఉత్తి పుణ్యాన దానాలు చేస్తూంటాడు. తను చేసిన దానాలను కూడా ఎవరికీ చాటద్దంటాడు. తన వ్యాపారంలో వచ్చే లాభాలన్నీ దానాలకే ఖర్చు పెడతారు. గుప్త దానమే గొప్పదంటాడు’ అని భార్య చెప్పాక శశిధరుడిలో ఒక వింత ఆలోచన పుట్టుకొచ్చింది. వెంటనే చరితాత్ముడిని కలవడానికెళ్ళాడు. ఆ సమయంలో ఎవరో పొరుగూరి రైతులు తమకు పంట నష్టం వచ్చిందని చెప్పి ఆదుకోమంటున్నారు చరితాత్ముడిని. ‘నేను మిమ్మల్ని ఆదుకున్న సంగతి బైటకు పొక్కనీయవద్దు. ఆ షరతు మీదే మీకు సాయపడగలను’ అని చెప్పాడు చరితాత్ముడు రైతులతో. దానికి వాళ్లు అంగీకరించి చరితాత్ముడి దగ్గర ధన సహాయం తీసుకుని వెళ్లిపోయారు. అప్పుడు శశిధరుడి రాకను గమనించి ‘మిత్రమా! చాలాకాలం తరువాత ఇలా దర్శనమిచ్చావేంటి?’ అంటూ మిత్రుడిని ఆహ్వానించాడు చరితాత్ముడు. ‘నేనొక విషయం విన్నాను. ఇప్పుడు స్వయంగా చూశాను. ఎన్ని దానాలు చేసినప్పటికీ పైకి చెప్పవద్దని అంటావెందుకో? నీకు పేరు రావాలని ఉండదా? ’ సందేహం వెలిబుచ్చాడు శశిధరుడు. ‘నా దృష్టిలో గుప్తదానమే మహాదానం. అది అవతలి వారిని అవసరంలో ఆదుకోవడానికే తప్ప మన గొప్ప చెప్పుకోడానికి కాదని నా ఉద్దేశం’ నిరాడంబరంగా చెప్పాడు చరితాత్ముడు. ‘నీ గుణం గొప్పదే కావచ్చు కాని ఇన్ని దానాలు చేస్తున్నప్పటికీ ఎవరికీ ఆ విలువ తెలియకపోవడం చూసి చింతిస్తున్నాను. అందువలన నువ్వు నాకొక సాయం చేయాలి’ అడిగాడు శశిధరుడు. ఏమిటో చెప్పమన్నట్లు చూశాడు చరితాత్ముడు. ‘ నువ్వు చేస్తున్న దానాలకు నీ పేరెలాగూ వద్దంటున్నావు. నీకు అభ్యంతరం లేకుంటే.. ఇకనుండీ నువ్వు ఏ దానం చేసినా అది నాదిగా చెప్పుకుంటాను. వాళ్లంతా నేనే దానం చేస్తున్నట్లుగా చెప్పుకుని నన్ను కీర్తిస్తారు. నా గురించి అందరూ గొప్పగా అనుకోవడం నాకు ఎంతో ఇష్టం’ అంటూ తన మనసులో కోరికను బైటపెట్టాడు శశిధరుడు. దానికి చరితాత్ముడు ‘నాకు కీర్తి కాంక్ష లేనప్పుడు అది నీకు దక్కితే నాకేమీ నష్టం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేస్తున్నది నువ్వేగాని నేనన్నది బైటపడకూడదు. దానికి కూడా నువ్వు ఒప్పుకోవాలి’ అని స్పష్టం చేశాడు. అంగీకరించాడు శశిధరుడు. ఆరోజు మొదలు చరితాత్ముడు తన దగ్గరకొచ్చిన వారికి ఏ దానమిచ్చినా సరే అది శశిధరుడిదనే చెప్పేవాడు. అలాగే వాళ్ళు కూడా బైట చెప్పడం మొదలెట్టారు. ఈ విషయం ఊరూవాడా పాకింది. ఇంతకాలం ఏనాడూ ఎవరికీ దానాలు చేయడం చూడని శశిధరుడిలో మార్పు రావడం వింత విషయంగా తోచింది అందరికీ. ఇలా ఉండగా కొంతకాలానికి చరితాత్ముడికి జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ పరిస్థితిలో దానం కోసం ఎవరైనా వచ్చినప్పటికీ అడగడానికి సంకోచించేవారు. ఐతే చరితాత్ముడి భార్య సుమతి ‘మావారి పరిస్థితి బాగులేదన్నది మీకు తెలుసు. శశిధరుడు దానాలు చేస్తున్న సంగతి మా వారు ఇటీవల చెప్పడం నాకు తెలుసు. అందువలన ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గరకు వెళ్ళండి. తప్పకుండా సహాయపడతాడు’ అని పంపించడం మొదలెట్టింది. ఆ విషయం తెలుసుకున్న వాళ్లంతా తిన్నగా శశిధరుడి దగ్గరకు పోయి ‘ఇంతదాకా మీరు చేస్తున్న దానాల గురించి వింటూనే ఉన్నాం. మీరు తప్పకుండా సాయం చేయాలి’ అంటూ చేయిచాచసాగారు. గతుక్కుమన్నాడు శశిధరుడు. ఇంతవరకూ తను చేసిన దానధర్మాలు చరితాత్ముడివేనని చెప్పలేక, తను సహాయపడతానని మాటివ్వలేక గిలగిలలాడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఊళ్ళోకి వరదలొచ్చి కొందరి ఇళ్ళు కొట్టుకుపోయాయి. అప్పుడు కొందరు ఊరిపెద్దలు శశిధరుడి దగ్గరకొచ్చి ‘ఇళ్ళు కోల్పోయిన కొందరికి ఇళ్లను కట్టించడానికి అందరినీ సాయమడుగుతున్నాం. మీరెలాగూ దానకర్ణులుగా పేరుబడ్డారు. మీ వాటా ఘనంగా ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇంతకాలం అయాచితంగా తనకు పేరొచ్చింది. ఇప్పుడు తన ఆస్తిలోంచి తీసివ్వడానికి మనసొప్పటంలేదు శశిధరుడికి. భర్త వాలకం కనిపెట్టిన సుగుణ ‘ఒకరి డబ్బుతో చేసిన దానాలను మీవిగా చెప్పుకుని మురిసిపోయారు. తీరా ఇప్పుడు నిజంగా మీరు చేయాల్సి వచ్చేసరికి వెనకడుగేస్తున్నారు. ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. బాధల్లో ఉన్నవారికి తోడుగా నిలవడం మానవత్వమని పించుకుంటుంది. దయచేసి మీలో మార్పు తెచ్చుకోండి’ అని సున్నితంగా మందలించింది. ఇంతదాకా వచ్చి ఇప్పుడు కుదరదు అంటే అయాచితంగా తనకు వచ్చిన మంచిపేరు పోతుంది. దీన్ని నిలబెట్టుకోవడమే ధర్మమనిపించింది. మరో ఆలోచనకి తావివ్వకుండా వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకోడానికి తన వంతు సాయంగా భారీగానే ముట్టచెప్పాడు శశిధరుడు. భర్తలో మార్పు చూసిన భార్య సుగుణ ఎంతగానో సంతోషించింది. (క్లిక్: జాతరలో కోతిబావ.. ఏం చేశాడంటే!) -
పిల్లల కథ: గర్వభంగం
దండకారణ్యపు లోతట్టు ప్రాంతంలో ఒక మంచినీటి కోనేరు ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని జీవులకు అదే నీటి వనరు. రాజైన సింహం కూడా అక్కడే దాహం తీర్చుకునేది. మడుగు సమీపంలోనే ఒక పుట్టలో ముసలి ఆడ తాచు, తన బిడ్డతో జీవిస్తుండేది. యువ పాము దుందుడుకు స్వభావం కలది. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేది. ఎవరైనా మందలిస్తే కాటు వేస్తానని బెదిరించేది. ఒకసారి మృగరాజు దప్పిక తీర్చుకోవటానికి కోనేటికి వచ్చింది. అయితే చుట్ట చుట్టుకుని దారికి అడ్డంగా పడుకుని గురకలు పెట్టసాగింది యువ పాము. ‘పక్కకి తొలుగు!’ అని సింహం ఆజ్ఞాపించింది. నిద్రమత్తులో ఉన్న ఆ పాముకి వినబడలేదు. ‘రాత్రి తిన్న ఎలుకో, కప్పో అరగలేదనుకుంటా. నిద్రకు ఆటంకం కలిగించటమెందుకు? పోన్లే పాపమ’ని సింహం పెద్ద మనసు చేసుకుని పక్కనుండి పోయి, నీళ్ళు తాగి తిరిగి ఎడంగా వెళ్ళిపోయింది. కాసేపటికి నిద్ర లేచిన యువ పాముని బాట పక్కనున్న చెట్టు మీది తీతువు పిట్ట పలకరించి జరిగిన సంఘటనని చోద్యంగా చెప్పింది. అది విన్న పాము సంతోషంతో పడగ విప్పి, అంతెత్తున ఉప్పొంగింది. రాజైన సింహమే తనను గౌరవించిందనే అహంకారం దాని తలకెక్కింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తీతువు మాటలు దాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళాయి. ‘మీది సామాన్యమైన జాతి కాదు మిత్రమా! పురాణ పురుషుడైన కాళీయుడి వారసులు మీరు. అందుకే మీ తలలపై శ్రీకృష్ణుడి పాద ముద్రలు ఉంటాయి. కాబట్టే మృగరాజు నీ పట్ల సహనం చూపించాడు. మీ సర్పాల్లో ఎన్నో శాఖలున్నా పడగ విప్పగల సామర్థ్యం కేవలం మీ తాచు పాములకే ఉంది’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ మాటలకు యువనాగు మరింత పెడసరంగా ప్రవర్తించసాగింది. తల్లి ఎన్నిమార్లు హితబోధ చేసినా దాని వైఖరి మారలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి పాము ఆందోళన చెందేది. (చదవండి👉 ఎవరు ఎక్కువ ప్రమాదం?) ఒకనాడు దాని ఆగడాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది, ఆ దారిన ఒక ముంగిస రావటం తటస్థించింది. మార్గమధ్యంలో తిష్టవేసిన పాముని చూడగానే దానికి కోపం వచ్చింది. ‘దారిలోంచి తప్పుకో. నేను మంచినీరు తాగటానికి పోవాలి’ అంది అసహనంగా. యువసర్పం ఓసారి కళ్ళు విప్పి ముంగిసని చూసి, నాలుకలు చప్పరించి మళ్ళీ పడుకుంది. ఆ నిర్లక్ష్యానికి ముంగిస కోపం నెత్తికెక్కింది. ‘చెపితే వినపడటం లేదా? మర్యాదగా మార్గంలోంచి లే!’ అంటూ హుంకరించింది. యువపాము దానినసలు పట్టించుకోలేదు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన తీతువు పిట్ట పాము దగ్గరకి వచ్చి, ‘పక్కకి జరుగు. లేకపోతే కొంపలంటుకుంటాయి’ అంది. యువపాము గీరగా చూస్తూ ‘చుంచెలుకకి నేను భయపడాలా? నా సంగతి దానికి తెలీదనుకుంటా. కాస్త మన ఘనతని వర్ణించి చెప్పు’ అంది తీతువుతో. ‘ఏంటీ? నేను ఎలుకనా? అసలు నేనెవరో తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి నీకు’ అంది ముంగిస ఆగ్రహంగా. ‘మరీ అంతగా గప్పాలు కొట్టుకోకు. నువ్వు ఎలుకవే కదా? మామూలు ఎలుకలైతే మూడు తింటాను. నువ్వు కాస్త పెద్దగా ఉన్నావు కాబట్టి నిన్నొక్కదాన్ని తింటే చాలు. మళ్ళీ వారం వరకూ వేట ప్రయాస ఉండదు’ అంటూ ఆవులించి మళ్ళీ పడుకోబోయింది. ముంగిసకి అహం దెబ్బతింది. ఈ పొగరుబోతు పాము పిల్లకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. (చదవండి👉 జానకమ్మ తెలివి) ‘ఇదిగో ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. పక్కకి తప్పుకుని, దారి ఇస్తావా? లేక నా తడాఖా చూపించమంటావా?’ అంది. దాంతో యువనాగుకీ తిక్కరేగింది. సర్రున పైకి లేచి పడగ విప్పి, బుస కొట్టి ‘నాకు భుక్తాయాసంగా ఉండటం వల్ల ఇంతసేపు మాట్లాడనిచ్చాను. ఆకలితో ఉంటే ఈపాటికి నిన్ను గుటుక్కున మింగేసేదాన్ని’ అంటూ బలంగా కాటు వేసింది. ముంగిస లాఘవంగా తప్పించుకుని ‘ఓహో నీకు ఎలుకలా కనిపిస్తున్నానా? అయితే నేనెవరో నీకు తప్పక తెలియాల్సిందే, తగిన బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ పోరాటానికి దిగింది. ముంగిసకీ, మూషికానికీ తేడా తెలియక యువపాము పీకలమీదకి తెచ్చుకుంటున్నదని తీతువు పిట్ట ఆవేదన చెందింది. దుడుకుతనంతో పాము పిల్ల వేస్తున్న కాట్ల నుండి తప్పించుకుంటూ, దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాగా కవ్వించింది ముంగిస. దాని వ్యూహంలో చిక్కుకున్న యువపాము పదే పదే కాటు వేయటంతో దాని దగ్గరున్న విషం నిల్వ అయిపోయింది. తిరిగి ఉత్పత్తి కావటానికి కొంత సమయం పడుతుంది. అత్యుత్సాహంతో పోరాడటం వల్ల తొందరగా అలసి పోయింది. దాడి చేస్తే లొంగిపోయి, ప్రాణ రక్షణకై ఆర్తనాదం చేసే ఎలుకకీ, కాటు వేస్తున్నా తప్పించుకుని, ఎదురు దాడి చేస్తున్న ముంగిసకీ మధ్య భేదం మొదటిసారిగా అవగతమై యువపాము కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఒళ్లంతా గాయలతో నెత్తురోడుతోంది. బలహీన పడిన యువపాముపై ముంగిస అమాంతం దూకి మెడ పట్టుకుని కొరకబోయింది. ఈలోపు తీతువు పిట్ట హుటాహుటిన పోయి, దాని తల్లిని తీసుకు వచ్చింది. బిడ్డ చావబోతుండటం చూసి, తల్లడిల్లిన తల్లిపాము ముంగిసని శరణు కోరింది. ముసలి పాముని చూసి జాలి పడిన ముంగిస యువ పాముని వదిలేసి మరెప్పుడూ పొగరుగా ప్రవర్తించ వద్దని హెచ్చరించింది. ఆ పాఠం తర్వాత యువపాము బుద్ధిగా మసలుకోసాగింది. -
పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?
ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ. సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి) ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. -
తల్లి కోడి ప్రేమ..
అనగనగా ఒక కొలను.. ఒడ్డు మీద ఒక చింతచెట్టు. ఆ చింతచెట్టు మీద ఒక గద్ద నివసించేది. అది రోజుకో కోడిపిల్లనో, బాతు పిల్లనో ఎత్తుకొచ్చి చెట్టు తొర్రలో దాచేది. అవి చనిపోయి కుళ్ళినాక వాటిని తినేది. కొలనుకు అవతలి ఒడ్డున ఒక కోడి ఉండేది. దానికి అందమైన మూడు బుజ్జి బుజ్జి పిల్లలున్నాయి. ఆకోడి వాటిని కంటికి రెప్పలా కాపాడుకునేది. ఒకరోజు తన బుజ్జి పిల్లలను వెంటేసుకుని ఇవతలి ఒడ్డుకు బయలుదేరింది. నడుచుకుంటూ పోతూండగా దారిలో ఓ చిట్టి బాతు ఏడుస్తూ కనిపించింది. కోడి చిట్టి బాతుతో ‘ఎందుకు ఏడుస్తున్నావూ?’అని అడిగింది. ‘నేనూ, మా అక్కా.. అమ్మ నుండి విడిపోయి దారితప్పి ఇటు వచ్చాం’ అంది. ‘మరి మీ అక్క ఎక్కడుంది?’ అడిగింది కోడి. ‘అక్కను గద్ద ఎత్తుకుపోయింది. ఆ చింత చెట్టు తొర్రలో దాచింది’ అంది చిట్టి బాతు. ‘భయపడకు.. నిన్ను మీ అమ్మ దగ్గరకు నేను తీసుకుపోతాను’ అంది కోడి. ఇంతలో ఆకాశం నుండి వేగంగా గద్దరావటం గమనించింది కోడి. తన రెక్కలచాటున తన బుజ్జి పిల్లలతో పాటు చిట్టి బాతుని దాచింది కోడి. గద్ద వచ్చి కోడి ముందు వాలింది. చిట్టి బాతు కోసం నలుదిక్కులా చూసింది. ‘ఏయ్ కోడీ! నీ పిల్లన్ని చూపించూ?’ అడిగింది గద్ద. కోడి కోపంగా గద్దను చూసి ‘వెళ్ళు ఇక్కడి నుండి’ అంది. ‘ నీ పిల్లల్ని చూసి వెళతాను. వాటికి ఏ హానీ తలపెట్టనని హామీ యిస్తున్నాను’ అంది గద్ద. కోడి రెక్కలు విప్పింది. అందులోంచి అందమైన బుల్లి కోడి పిల్లలతో పాటు చిట్టి బాతు బయటకు వచ్చాయి. బాతు పిల్లని తనకు వదిలేయమంది గద్ద. కానీ కోడి అందుకు అంగీకరించలేదు. ‘చూడూ.. నీ జాతి వేరు, బాతు జాతి వేరు! బాతు పిల్లను నాకు వదిలేయ్’ అంది గద్ద. అయినా కోడి.. చిట్టి బాతుని వదల లేదు. ‘మా జాతి వేరైనా బాతులు పెట్టే గుడ్లను పొదిగేది మేమే’ అంది కోడి. గద్ద.. కొద్దిసేపు ఆలోచించి చింత చెట్టు మీదకు ఎగిరింది. తొర్రలోంచి బాతు పిల్లని ముక్కుతో పట్టుకుని నెమ్మదిగా కోడి ముందు వదిలింది. ‘నీలోని తల్లి ప్రేమ నన్ను మార్చింది. ఈ బాతు పిల్లని కూడా తన తల్లి వద్దకు చేర్చు. ఇకపై కేవలం పురుగులు, కుళ్ళిన కళేబరాలనే తింటూ కడుపు నింపుకుంటాను’ అని ఆకాశంలోకి ఎగిరింది గద్ద. కోడి రెండు బాతు పిల్లల్నీ వాటి తల్లి వద్దకు చేర్చటానికి వెనుదిరిగింది. చదవండి: టీ గారూ.. తమరు సూపరు! -
నిజాయితీకి లభించిన బహుమానం
రామాపురం అనే గ్రామంలో కిరాణా వ్యాపారస్తుడైన సుబ్బయ్యకు నిజాయితీపరుడు అనే పేరుంది. వయసు మీదపడటంతో సుబ్బయ్య తప్పుకుని తన కొడుకు రాజేశ్‌కి వ్యాపారాన్ని అప్పగించాడు. సుబ్బయ్య కిరాణా వ్యాపారం చేసేటప్పటి నుండి ఆ దుకాణంలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వీరయ్య.. రాజేశ్‌కి కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అందుకే రాజేశ్ హాయంలో కూడా కిరాణా వ్యాపారం నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయింది. అయితే వీరయ్యకి కూడా వయసు మీద పడటంతో కొంతకాలానికి పని మానివేశాడు. దాంతో రాజేశ్‌కి తన కిరాణా దుకాణంలో పనిచేయడానికి ఒక నమ్మకస్తుడైన పనివాడి అవసరం పడింది. పనివాని ఎంపికలో రాజేశ్, తన తండ్రి సలహా కోరాడు. ఆ విషయాన్ని సుబ్బయ్య తన స్నేహితులకి చెప్పటంతో వాళ్ళు తమకు తెలిసిన పనివాళ్ళని సుబ్బయ్య దగ్గరకి పంపారు. అనేక రకాల వడపోతల తర్వాత తమ కిరాణా వ్యాపారంలోకి ఉపయోగపడతారు అనుకునే ఇద్దరిని ప్రాథమికంగా ఎంపిక చేశాడు సుబ్బయ్య. వారిద్దరి పేర్లు వినయ్, సతీశ్. ‘ఆ ఇద్దరిలోంచి ఒకరిని ఎంపిక చేసుకో. వారితో మాట్లాడుతున్నప్పుడు, వారికి అప్పగించిన పని వాళ్లు చేస్తున్నప్పుడు ఆ ఇద్దరినీ నిశితంగా పరిశీలించ’మనీ రాజేశ్‌కి వివరించాడు సుబ్బయ్య. ముందుగా వినయ్‌ని పిలిచి ‘నెలకు ఎంత జీతం కావాలి?’ అని అడిగాడు సుబ్బయ్య. ‘తమరు ఎంత ఇస్తే అంతే చాలు బాబయ్యా!’ సమాధానమిచ్చాడు వినయ్. ‘సరే..ఓ రెండు రోజులు కిరాణా దుకాణంలో ఉండి చెప్పిన పనులు చేయి, దాన్ని బట్టే నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు. ‘అయితే రేపే వచ్చి పనిలో చేరతాను’ అని వినయ్ సెలవు తీసుకున్నాడు. ‘రేపు వినయ్ దుకాణానికి వచ్చాక ఏ సరుకులు ఎక్కడ ఉన్నాయో చూపించి అప్పుడప్పుడు గల్లా పెట్టెకి తాళం వేసి ఇంట్లోకి వెళ్లొస్తూ ఎవరైనా సరుకులకు వస్తే ఆ ప్యాకెట్స్ పై ఉన్న ధర తీసుకుని, ఆ డబ్బుని నీకు ఇమ్మని చెప్పు. అలాగే చిల్లర ఒక పదిరూపాయలు పైన ఉంచు’ అంటూ రాజేశ్‌కి సలహా ఇచ్చాడు సుబ్బయ్య. మరుసటి రోజు వినయ్ వచ్చాక తండ్రి చెప్పినట్లే చేశాడు రాజేశ్. మధ్య మధ్యలో ఇంట్లోకి వెళ్లొచ్చినప్పుడల్లా తను ఏఏ వస్తువులను అమ్మాడో, ఎంత డబ్బు వచ్చిందో రాజేశ్ చేతికిచ్చేవాడు వినయ్. ఆ విషయాన్నే రాత్రి తండ్రికి చెప్పాడు రాజేశ్. ‘రేపు వినయ్ వచ్చాక నా దగ్గరకు పంపించు’ అని చెప్పాడు సుబ్బయ్య. అతను చెప్పినట్టే మరుసటి రోజు వినయ్ రాగానే అతనిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళాడు రాజేశ్. వినయ్‌ని ఉద్దేశించి సుబ్బయ్య ‘ఈ రోజు మన ఎలక్ట్రానిక్ కాటాని ఉపయోగించి సరుకులు అరకేజీ, కేజీల చొప్పున ఆ కవర్లలో ప్యాక్ చేయాలి. అలా ప్యాక్ చేసేటపుడు అరకేజీ ప్యాకెట్లలోంచి ఓ పది గ్రాముల చొప్పున, కేజీ ప్యాకెట్లలోంచి ఇరవై గ్రాముల చొప్పున ఆ సరుకులు తీసేసి ప్యాక్ చేయాలి. తెలిసిందా? ఈవాళ్టికి అరకేజీ ప్యాకెట్లు ఒక అయిదు, కేజీ ప్యాకెట్లు ఒక అయిదు ప్యాక్ చేసి తరువాత కొట్లో పనిచూసుకో’ అని పురమాయించాడు. ‘అలాగేనండి’ అంటూ సుబ్బయ్య చెప్పినట్లుగానే ప్యాక్ చేసి వాటిని సుబ్బయ్యకి అప్పజెప్పి కిరాణా దుకాణంలోకి వెళ్ళిపోయాడు వినయ్. ఈ వ్యవహారాన్నంతా రాజేశ్ పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆ రోజు పని పూర్తి అయిన తరువాత వినయ్‌ని పిలిచి ఆ రెండురోజులకు ఇవ్వాల్సిన మొత్తం కన్నా ఎక్కువ మొత్తాన్ని ముట్టజెప్పి, తరువాత రెండు రోజులు సతీశ్ పనితీరును కూడా పరిశీలించి , ఇద్దరి పనితీరును బేరీజు వేసుకుని కబురు చేస్తానని పంపించివేశాడు సుబ్బయ్య. ఆ మరుసటి రోజు సతీశ్‌కి కబురుపెట్టాడు. వినయ్‌ని అడిగినట్టే సతీశ్నీ అడిగాడు సుబ్బయ్య ‘ నెలకు ఎంత జీతం కావాలి?’ అని. ‘మూడువేలు ఇవ్వగలిగితే చేయగలను’ బదులిచ్చాడు సతీశ్. వినయ్‌కి చెప్పినట్లుగానే ‘సరే, ఒక రెండు రోజులు కిరాణా దుకాణంలో చెప్పిన పనులు చేశాక దానిని బట్టి నిన్ను పనిలో పెట్టుకునేది లేనిదీ చెపుతాను’ అన్నాడు సుబ్బయ్య. ‘సరేనండి, రేపే వచ్చి పనిలో చేరతాను’ అంటూ సెలవు తీసుకున్నాడు సతీశ్. అప్పుడు రాజేశ్‌తో ‘వినయ్ విషయంలో మొదటి రోజు ఏం చెప్పి చేయమన్నానో,అలాగే సతీశ్‌కీ చెప్పి చేయించు’ అన్నాడు సుబ్బయ్య. మరుసటి రోజు సతీశ్ రాగానే సుబ్బయ్య చెప్పినట్టే చేసి.. జరిగినదంతా ఆ రోజు రాత్రి తండ్రికి వివరించాడు రాజేశ్. ‘రేపు సతీశ్ రాగానే నా దగ్గరకు తీసుకురా’ అని రాజేశ్‌కి పురమాయించాడు సుబ్బయ్య. తండ్రి అడిగినట్టుగానే తెల్లవారి సతీశ్ రాగానే అతణ్ణి తండ్రి దగ్గరకు తీసుకెళ్లాడు రాజేశ్. తూకం, ప్యాకింగ్ విషయంలో వినయ్‌కి పురమాయించినట్టే సతీశ్‌కీ పురమాయించాడు సుబ్బయ్య. విన్నవెంటనే సతీశ్ ‘ఇటువంటి పనులు నేనెంత మాత్రం చేయను, చేయలేను. నిన్న పనిచేసినందుకు గానూ వందరూపాయలు ఇప్పించండి వెళ్ళిపోతాను’అన్నాడు. ‘సరే, ఈ పని చేయవద్దులే. నువ్వు అడిగినట్లే మూడువేల రూపాయలు ఇస్తాను. నిన్నటి నుంచి నువ్వు పనిలో చేరినట్లే. పో.. పోయి కొట్లో పనులు చూసుకో’ అన్నాడు సుబ్బయ్య. పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్న రాజేశ్‌తో ‘రానవసరంలేదని వినయ్‌కి కబురు పెట్టు’ అని సుబ్బయ్య అనడంతో కొడుకు విస్తుపోయాడు. ‘అదేంటి జీతం ఎంతిస్తే అంతకు ఒప్పుకొని, చెప్పిన పనిని తు.చ తప్పకుండా చేసిన వినయ్‌ని వద్దని కరాఖండిగా ఇంత జీతం ఇవ్వమని అడగటమే కాకుండా, చెప్పిన పని చేయనని తృణీకరించిన సతీశ్‌ని పనిలో పెట్టుకున్నారేంటి ’ అని తండ్రిని అడిగాడు రాజేశ్. ‘వినయ్ పనిచేసిన రెండురోజుల్లో మొదటిరోజు కొట్లో నువ్వు లేనప్పుడు సరుకులు కొనమని నా స్నేహితున్ని పంపి ‘మా కొట్లో పనిచేసే వాడిని ముప్పై రూపాయల పంచదార ప్యాకెట్ ఇవ్వమని అడిగి నలభైరూపాయలు ఇచ్చి ‘ఇవిగో ముప్పై రూపాయలు..సరిగా చూసుకో’ అని చెప్పమన్నాను. ‘పొరపాటున పది రూపాయలు ఎక్కువిచ్చేశారు’ అని వెనక్కి ఇచ్చేసినా లేదూ చూసుకుని కూడా తిరిగి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా వచ్చి నాకు చెప్పమన్నాను. వినయ్ అతనితో ‘సరిపోయింది’ అని చెప్పి నీకు డబ్బు అప్పచెప్పేటప్పుడు ఆ పదిరూపాయలను తన దగ్గరే ఉంచేసుకున్నాడు. అలాగే రెండో రోజు నేను చెప్పినట్లుగా అది తప్పు పనైనా ఆ పని చేయడానికి ఒప్పుకున్నాడు వినయ్. జీతం ఎంతిస్తే అంతే చాలనుకునే దాని వెనుక.. ఇదుగో ఇటువంటి మోసాలు చేస్తూ సంపాదించుకోవచ్చన్న ధీమా అన్నమాట. అదే సతీశ్ విషయానికొచ్చేసరికి మొదటిరోజు నా స్నేహితుడు పదిరూపాయలు ఎక్కువ ఇస్తే పదిరూపాయలు ఎక్కువ ఇచ్చారని వెనక్కి ఇచ్చేయడమే కాకుండా, రెండో రోజు నేను చెప్పిన అవినీతి పనిని చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడక తన ఒక రోజు కష్టానికి మాత్రమే ప్రతిఫలం ఇమ్మని అడిగాడు. ఇక నిక్కచ్చిగా ఇంతే జీతం ఇవ్వమని అడగడానికి కారణం అతని నిజాయితీయే. అటువంటి నమ్మకస్తుడు, నిజాయితీపరుడే మనకు కావలసినవాడు. అందుకే అతనిని పనిలోకి తీసుకున్నది’ అని చెప్పిన తండ్రి వివరణకు అబ్బురపడ్డాడు రాజేశ్. -
సౌది అరేబియా కథ: హాస్యగాడు అబునువాస్
పూర్వపు వాళ్లలోను, ఇప్పటి వాళ్లలోను మనం జ్ఞాపకం ఉంచుకో తగిన ఉపాయశాలులందరిలో గొప్పవాడెవడో చెప్పగలరా? కొందరు ఒకడు గొప్పవాడు అంటే మరికొందరు ఇంకొకడు మరీ గొప్పవాడంటారు. కానీ నిజం తెలిసినవాళ్లంతా అబునువాస్ పేరే చెబుతారు. అబునువాస్ జీవితమంతా హాస్యకథలుగా, తమాషాపనులతో, మంచి మంచి ఉపాయాలతో నవ్వుల మాటలతో గడచిపోయింది. అంతేకాదు ఎన్నోసార్లు తన యుక్తితో హాస్యంతో ఎన్నో చిక్కుల్లోంచి బయటపడ్డాడు. ఆయన ఎవ్వరినైనా సరే నవ్వించాలనుకున్నాడా.. తమాషా మాటల్తో కడుపుబ్బేట్టు నవ్వించేవాడు. ఎంత తెలివిగలవాడినైనా చాదస్తుడనిపించాలంటే ఏదో యుక్తిపన్ని బోల్తా కొట్టించేసేవాడు. మామూలు మనుషుల్నే కాదు మహారాజుల్నీ లెక్కలేకుండా హాస్యమాడేవాడు. ఈ అబునువాస్కు ఒక గాడిద ఉండేది. ఆ గాడిదకి నీళ్లు పెట్టటానికి ఒక పెద్దపళ్లెం కావలసివచ్చింది. పొరుగింటి వాళ్లను అడిగాడు. వాళ్లు అబునువాస్కు రాగిపళ్లెం ఇచ్చారు. దాన్ని మూడురోజులు తన వద్దే ఉంచుకున్నాడు. నాలుగోరోజున ఆ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం పెట్టి ఆ రెండిటినీ తీసుకెళ్లి పొరుగింటివాళ్లకు ఇచ్చాడు. పక్కింటి పెద్ద మనిషి తమ రాగిపళ్లెంలో ఇంకో చిన్నపళ్లెం కూడా ఉడడం చూసి ‘అయ్యో ఈ చిన్నపళ్లెం మాది కాదే!’ అన్నాడు. దానికి అబునువాస్ ‘మీరిచ్చిందేదో మీకు తిరిగి ఇచ్చేశాను. మీ రాగిపళ్లెం నా దగ్గర ఉన్నప్పుడు దానికి ఈ చిన్నపళ్లెం పుట్టింది. ఇది రాగిపళ్లెం బిడ్డ కాబట్టి ఈ రెండూ మీవే’ అని చెప్పాడు. అబునువాస్ తెలివి తక్కువతనానికి నవ్వుకుని ఇంకో పళ్లెం కూడా వస్తూంటే పోనివ్వటమెందుకని ‘మీరు చెప్పింది నిజమే! మా పళ్లానికి పుట్టిన బిడ్డ కాబట్టి ఇదీ మాదే. పళ్లాలకు కూడా బిడ్డలు పుట్టే చల్లని ఇల్లు మీది’అన్నాడు పొరుగింటాయన. మూడురోజులు పోయాక అబునువాస్ మళ్లీ వాళ్లింటికి వెళ్లి ఆ పళ్లమే ఇంకోసారి అరువడిగాడు. ఈసారి ఇంకో మంచి బిడ్డను తీసుకొస్తుందనే సంతోషంతో వెంటనే ఆ ఇంటి యజమాని ఆ పళ్లాన్ని తెచ్చిచ్చాడు. అబునువాస్ నవ్వుకుంటూ ఆయనకు నమస్కారం పెట్టి రాగిపళ్లెం చంకనబెట్టుకొని ఇంటికి పోయాడు. ఈసారి పళ్లెం తీసుకుపోయి ఎన్నాళ్లయినా తిరిగి ఇవ్వలేదు. పొరిగింటాయన వచ్చి పళ్లెం కావాలని అడిగాడు. అబునువాస్ ఎంతో విచారంగా‘ఏం చేయమంటారు బాబూ.. మీకు పుట్టెడు దుఃఖవార్త చెప్పాల్సి వచ్చింది. మీ పళ్లెం చచ్చిపోయింది బాబూ’ అని చెప్పాడు. ‘ పళ్లెం చచ్చిపోవడమేమిటి?’ విస్తుపోయాడు పొరుగింటి మనిషి. ‘ఈ విషయం మీకు చాలా దుఃఖం కలుగజేస్తుందనే నేను మీకు ఇన్నాళ్లూ చెప్పలేదు. ఏం చెయ్యను? చివరికి చెప్పక తప్పలేదు’ అన్నాడు అబునువాస్. ఆ మాటకు పొరుగింటి పెద్దమనిషికి తగని కోపం వచ్చింది. ‘తమాషాగా ఉందా? రాగిపళ్లెం చావటమేమిటి?నన్ను పిచ్చివాణ్ణనుకుంటున్నావా?’ అంటూ మండిపడ్డాడు. ‘ఆ రాగిపళ్లమే కదండీ ఇంతకుముంద బిడ్డను కనిందీ..’ గుర్తుచేశాడు అబునువాస్.‘అవును’ చెప్పాడు పొరుగింటాయన. ‘ఈ సృష్టిలో బిడ్డల్ని కనేవన్నీ ఏనాడో ఒకనాడు చచ్చిపోకమానవు బాబూ? ఎటొచ్చీ మీ రాగిపళ్లెం పాపం పరాయింట్లో చచ్చిపోవటమే చాలా విచారకరం. ఏం చేస్తాం.. దానికి అలా రాసిపెట్టి ఉంది’ అని ఓదార్చాడు అబునువాస్. అలా ఆ రాగిపళ్లాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నాడు. ఇంకోసారి ఒకడు అబునువాస్ దగ్గరకు వచ్చి అతని గాడిదను అరువు అడిగాడు. పని మీద తన గాడిద ఊరికి వెళ్లిందని అబునువాస్ చెప్తూండగానే పెరట్లోంచి గాడిద ఓండ్రపెట్టింది. ‘దొడ్లో గాడిద అరుస్తూంటే ఊరెళ్లిందని చెప్తున్నావ్.. నువ్వేం పెద్దమనిషవయ్యా?’ అంటూ నిలదీశాడతను. ‘నీకు కావలసింది మా గాడిదా? దాని అరుపా? గాడిదైతే ఇక్కడలేదు. దాని అరుపు కావాలంటే తీసుకుపో’ అంటూ గాడిదలాగా ‘ఈ.. ఓర్.. ఈ ..ఓర్’ అంటూ ఓండ్రపెట్టి ‘ఇదిగోనయ్యా.. గాడిద అరుపు. దానిమీద ఎక్కి నీ దారిన నువ్వు పో త్వరగా’ అని చెప్పాడు. తెల్లబోయాడు ఆ పెద్దమనిషి. ఇంకోసారి ఇంకా మంచి తమాషా జరిగింది. అబునువాస్ రెండంతస్తుల మేడ కట్టాడు. అంతా కట్టిన తరువాత ఆ మేడ అమ్మాలని బేరం పెట్టాడు. అంత పెద్దమేడ ఎవరికీ అవసరం లేకపోయింది. అడిగినవాళ్లే లేకపోయారు. చివరికెట్లాగో అబునువాస్ తన మేడ మీది అంతస్తు మాత్రం ఒక వ్యాపారస్తుడికి అమ్మగలిగాడు. వర్తకుడు మేడ మీద ప్రవేశించాక కిందిభాగం కూడా కొనమని అతణ్ణి అడగసాగాడు అబునువాస్. వ్యాపారస్తుడు మాత్రం తనకు అక్కర్లేదని చెప్పేశాడు. ఒకనాటి ఉదయం అబునువాస్ చాలామంది కూలీలను పిలిపించి తన ఇంటి గోడలు పగలగొట్టమన్నాడు. ఈ గడబిడ ఏమిటా అని పైనున్న వర్తకుడు కిటికీలోంచి కిందికి తొంగి చూశాడు. అంతమంది కూలీలు అబునువాస్ చెప్పినట్టే మేడ గోడలను కూలగొట్టసాగారు. కంగారుపడుతూ ఆ వర్తకుడు ‘ఏం చేస్తున్నారు?’ అంటూ అరిచాడు. ‘కింది అంతస్తు అమ్ముతానంటే ఎవరూ కొనలేదు. అందుచేత పగలగొట్టించేస్తున్నాను. నీ పై అంతస్తును జాగ్రత్తగా చూసుకో. నీ మేడ విరిగి నా కూలీల మీద పడి వాళ్లకు దెబ్బలు తగిలితే మాత్రం నేనూరుకోను’ అన్నాడు అబునువాస్. ‘పగలగొట్టించకండి.. కింది అంతస్తు కూడా నేనే కొంటాను’ అంటూ ఆ వర్తకుడు కింది అంతస్తు కూడా కొన్నాడు విధిలేక. ఆఖరికి ఆ ఊరి రాజుకూడా అబునువాస్ హాస్యపుదెబ్బ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఒకనాటి రాత్రి రాజుకి ఒక కల వచ్చింది. అబునువాస్ ఇంటి కింద.. భూమిలో వెండినాణాలతో నిండిన బిందెలు ఉన్నట్టు రాజుకి కలలో కనబడింది. తెల్లవారే ఆ బిందెలను తవ్వుకురమ్మని పదిమంది పనివాళ్లను అబునువాస్ ఇంటికి పంపాడు రాజు. అప్పుడు అబునువాస్ ఇంట్లోలేడు. పనివాళ్లు ఇంటి కింది నేలను తవ్వేస్తూంటే ఏమీ చేయలేక ఏడుస్తూ దూరంగా నిలబడింది అబునువాస్ భార్య. ఎంత పెళ్లగించినా వెండిబిందెలు కనబడలేదు. రాజుగారి కూలీలు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. అబునువాస్ ఇంటికి రాగానే అతని భార్య ఏడుస్తూ సంగతంతా చెప్పింది. ‘మరేమీ పరవాలేదులే. రాజుగారికి తగిన శాస్తి నే చేస్తాగా! నువ్వు దిగులు పడకు’ అంటూ భార్యను ఓదార్చాడు అబునువాస్. వండిన అన్నాన్ని కొంత తీసి ఒక పళ్లెంలో వేసుకుని దాని మీద ఒక తువాలు కప్పాడు. తువాలు మీద చాలా ఈగలు వాలాయి. అందులో కొన్ని లోపలికి దూరి అన్నం తినటానికి ప్రయత్నించాయి. మరునాడు తెల్లవారగానే తువాలు కప్పిన అన్నపు పళ్లాన్ని రాజుగారి కోటకు తీసుకెళ్లాడు. ‘ప్రభూ.. నాదొక ఫిర్యాదు. కొందరు నా ఇంటికి పిలవకుండానే వచ్చి నా ఆహారాన్ని తినేస్తున్నారు. వాళ్లను దండించ కుండా ఎట్లా ఊరుకోమంటారో మీరే చెప్పండి’ అని రాజుగారిని అడిగాడు. అబున్వాస్ ఏదో కట్టుకథలాంటిది చెబుతున్నాడేమో అనుకున్నాడు రాజు. తన పనివాళ్లు అతని ఇంట్లో నేలను పెళ్లగించిన విషయం చెబుతున్నాడేమోనని కూడా రాజుకి అనుమానం కలిగింది. ‘ఇంతకీ నువ్వు ఫిర్యాదు చేస్తున్నది ఎవరి మీద?’ అని అడిగాడు రాజు. తను తెచ్చిన అన్నపు పళ్లెం మీద కప్పిన తువాలు తీశాడు అబునువాస్. వెంటనే మూడు ఈగలు ఎగిరిపోయాయి. ‘వీటి మీదే నా ఫిర్యాదు’ అన్నాడు అబునువాస్ ఆ ఈగలను చూపిస్తూ. రాజుకి నవ్వు వచ్చింది. ‘ఈగల మీదా నీ ఫిర్యాదు? సరే. నన్ను ఏం చేయమంటావో చెప్పు’ అన్నాడు. ‘చట్టంప్రకారం నాకు న్యాయం చెయ్యమంటున్నాను. ఈగల్ని దండించడానికి మీరు నాకు అనుమతి ఇవ్వాలి. అంతే ప్రభూ’ అన్నాడు అబునువాస్. ‘భేష్.. ఈగలను దండించటానికి నీకు అనుమతి ఇచ్చాను. ఈగలు ఎక్కడ కనిపించినా నీ ఇష్టం వచ్చినట్టు దండించు’ అన్నాడు రాజు నవ్వుతూ. రాజుగారు ఈ తీర్పుని ఒక కాగితం మీద కూడా రాసి సంతకం చేసి అబునువాస్కి ఇచ్చాడు. అబునువాస్ ఈగలను దండించటానికి పెద్ద దుడ్డుకర్ర చేయించాడు. ఆ కర్ర చివర గట్టి ఇనుప పొన్ను వేయించాడు. ఎక్కడ ఈగ కంటబడితే అక్కడ కర్రతో కొట్టేసేవాడు. బజారుకు వెళ్లినప్పుడు ఖర్జూరపు పళ్ల బుట్టల మీద ఈగలు వాలటం చూసి దుడ్డుకర్ర విసిరేవాడు. పళ్లన్నీ చితికిపోయేటట్టు కర్రతో బాదేవాడు. అంగడివాళ్లు ‘ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు?’ అని గదమాయించి అడిగితే ‘నేనేమీ మీ పళ్లను కొట్టటం లేదయ్యా! వాటి మీద వాలిన ఈగల్నే దండిస్తున్నాను’ అని జవాబు చెప్పి రాజుగారు ముద్రవేసి ఇచ్చిన అనుమతి పత్రాన్ని చూపించేవాడు. వాళ్లు ‘ఇదేం మేళంరా!’ అనుకుంటూ ఊరుకునేవాళ్లు. ఇట్లా కొన్ని రోజులు గడిచాయి. అబునువాస్ వెర్రి చేష్టలకు విసుక్కునేవాళ్లు విసుక్కుంటున్నారు. నవ్వుకునేవాళ్లు నవ్వుకుంటున్నారు. రాజుగారు కూడా ఈ వింత చేష్టలన్నీ విని విరగబడి నవ్వాడు. చివరకు ఒకనాడు రాజుగారు రాజసభలో తీర్పులు చెబుతున్నాడు. అబునువాస్ కూడా వెళ్లి రాజుగారికి దగ్గరగా కూర్చున్నాడు. రాజుగారు ఏదో నేరాన్ని విచారణచేశాడు. గంభీరంగా తీర్పు చెబుతుండగా రాజుగారి వీపు మీద ఈగ వాలింది. చటుక్కున తన దుడ్డుకర్రతో రాజుగారి వీపు మీద గట్టిగా బాదాడు అబునువాస్. అతని ఆ చర్యకు సభంతా ఘొల్లుమంది. అబునువాస్ను చుట్టుముట్టి గట్టిగా పట్టుకున్నారు. రాజుగారిని కొట్టినందుకు అతనిని శిక్షించాలని పట్టుబట్టారు. ‘అబునువాస్.. ఏమిటీ పిచ్చి? రాజుగారిని కొడతావా?’ అని అధికార్లు అబునువాస్ మీద మండిపడ్డారు. జంకుగొంకు లేకుండా అబునువాస్ ‘నేను తప్పేం చేయలేదే? నన్ను శిక్షించడం న్యాయంకాదు. నేను రాజుగారి వీపు మీద వాలిన ఈగను కొట్టానుగాని, రాజుగారిని కొట్టలేదు. రాజుగానే ఈగల్ని చంపటానికి నాకు అనుమతి ఇచ్చారు’ అని చెప్పాడు. రాజుగారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన అనుమతి పత్రం జేబులోంచి తీసి అందరికీ చూపించాడు. ఇంకేం మాట్లాడతారు? అతను చెప్పిందంతా నిజమే. అతనిని నిర్దోషిగా వదలక తప్పిందికాదు. ‘వెధవ ఈగలకి తగిన శాస్తి జరిగింది. అవి నా ఇంట్లో ప్రవేశించి దౌర్జన్యంగా నా సొమ్మును తీసుకోటానికి ఎందుకు ప్రయత్నించాలి?’ అన్నాడు అబునువాస్. మరోసారి ఇంకో విచిత్రమైన సంగతి జరిగింది. పట్నంలో ఒక భాగ్యవంతుడైన వర్తకుడు మేకమాంసం వండించి మంచి విందు తయారు చేస్తున్నాడు. విందు భోజనం వండేటప్పుడు ఒక బిచ్చగాడు అక్కడ ఏమి జరుగుతూందో చూద్దామని వచ్చాడు. పాపం.. వాడు కాస్త దూరంగా వంటలు తయారుచేసే చోటు నుంచి వచ్చే ఘుమఘుమలాడే ఆ గాలిని పీల్చుకుంటూ కూచున్నాడు. వాసనే ఇంత కమ్మగా ఉంటే ఆ భోజనం ఇంకెంత రుచిగా ఉంటుందోనని విందు గురించి ఊహించుకోసాగాడు. అయితే ఆ ధనవంతుడు, ఆ బిచ్చగాడికి పిడికెడు అన్నం కూడా పెట్టించలేదు. మరునాడు ఆ వర్తకుడు కనిపించినప్పుడు ‘అయ్యా.. మీరెంత మంచివారో.. మీ వంట పందిరి దగ్గరైనా నన్ను కూచోనిచ్చారు! మీ విందులోని పసందైన మేకమాంసం కూరల కమ్మని వాసన పీల్చేటప్పటికే నాకు సంతృప్తిగా భోజనం చేసినట్టయింది’ అన్నాడు. ‘సరి..సరి.. అందుకేనేమో నిన్న మా మేకమాంసం రుచీపచీ లేకుండా పోయింది. ఆ కమ్మని వాసనంతా నువ్వే పీల్చేసి ఉండాలి సందేహం లేదు’ అన్నాడు వర్తకుడు. అంతటితో ఊరుకోక రాజు వద్దకు వెళ్లి తన మేకమాంసం కూరల కమ్మని వాసనంతా అపహరించుకుపోయాడని బిచ్చగాడి మీద అన్యాయంగా ఫిర్యాదు చేశాడు. రాజు.. వర్తకుల పక్షపాతి కాబట్టి అతడు చెప్పిన ఫిర్యాదు నమ్మి ఆ నేరం చేసినందుకు బిచ్చగాడు పన్నెండు వెండి నాణాలు ఆ వర్తకుడికి ఇచ్చి తీరాలని తీర్పు చెప్పాడు. బిచ్చగాడి చేతిలో పైసా లేదు. పాపం ఏడుస్తూ వెళ్లిపోయాడు. అదృష్టవశాత్తు వాడికి అబునువాస్ ఎదురుపడ్డాడు. రాజుగారి అన్యాయపు తీర్పు సంగతి చెప్పాడు. అబునువాస్ జాలిపడి ‘నేను నీకు సాయం చేస్తాను దిగులుపడకు. నీ అప్పు తీర్చిపారెయ్యటానికి రేపు ఉదయం కలుసుకుందాంలే’ అని ధైర్యం చెప్పాడు. మరుసటి దినం అబునువాస్ బిచ్చగాడితో సహా రాజసభకు వెళ్లాడు. వర్తకుడు కూడా తన పైకాన్ని తీసుకోటానికి వచ్చాడు. అబునువాస్ వర్తకుణ్ణి చూసి ‘నీ డబ్బు చెల్లిస్తే పుచ్చుకోటానికి సిద్ధంగా ఉన్నావయ్యా?’ అని అడిగాడు. ‘ఆ సిద్ధంగానే ఉన్నాను. ఇవ్వండి’ అన్నాడు వర్తకుడు. అబునువాస్ పన్నెండు వెండి నాణాలు తీసి బిచ్చగాడి చేతికిచ్చాడు. ‘ఇదిగో.. వీటిని భూమి మీద పడెయ్యి’ అన్నాడు అబునువాస్. అట్లాగే బిచ్చగాడు ఆ నాణాల్ని నేల మీద పడేశాడు. అవి రాతి నేల మీద పడగానే గణగణమని మోగాయి. ‘విన్నావా? ఆ నాణాల టింగు టింగు మోత!’ అన్నాడు అబునువాస్. ‘ఆ విన్నాను..’ చెప్పాడు వర్తకుడు. ‘ఆ వెండినాణాల్లో నీకు రావలసిన భాగం ఆ టింగ్ టింగే. తీసుకో’ అన్నాడు అబునువాస్. ‘నీ భోజనం కమ్మదనం వాసన చూసినంత మాత్రాన నువ్వు నష్టపోతే ఆ బిచ్చగాడి డబ్బు గణగణ ధ్వని నువ్వు విన్నావు గనుక అది నీకు ముట్టినట్టే. ఇక వెళ్లు’ అన్నాడు అబునువాస్. అతను చెప్పిన న్యాయం ప్రకారం బిచ్చగాడు వర్తకుడికి పన్నెండు కాసులూ చెల్లించినట్టే అని రాజుగారు కూడా ఒప్పుకున్నారు. తగాదా తీరిపోయింది. (‘వేటగాడి కొడుకు ఇతర విదేశ కథలు’ సంకలనం నుంచి) చదవండి: బాలల దినోత్సవం 2021: బొమ్మలతో ఆటలాడుకునే వయసులో.. ఎన్నెన్ని ఘనతలో..! -
Children's Day 2021 Special: గుత్తివంకాయ కూర.. కథ!
ఒక చిన్నపిల్ల. చాలా చిన్నది. పాపం ఆ పిల్ల సొంత తల్లి చనిపోయేసరికి మారుతల్లి వచ్చింది. ఆమె వచ్చినప్పట్నించి ఆ పిల్ల బాధలు బాధలు గావు. కూర్చుంటే తప్పు. నిలుచుంటే తప్పు. లేస్తే తప్పు. పడుకుంటే తప్పు. పసిదని కూడా చూడకుండా వీపు మీద కట్టె విరిగేలా బాదుతుండేది ఆ మహాతల్లి. ఒకరోజు ఆవిడ ఈ పిల్లకు ఒక పావలా యిచ్చి ‘బజారుకెళ్లి ఫలానా వస్తువు తీసుకురా’ అని చెప్పింది. పాపం చిన్నపిల్ల గదా అంగడికి పోతూ పోతూ పావలాను పోగొట్టుకుంది. పోగొట్టుకోగానే ఆ పిల్లకు అమితమైన భయం పట్టుకుంది. యిప్పుడేం చేసేది యింటికి వెళితే మారుతల్లి కొట్టి చంపేస్తుంది గదా అని ఏడుస్తూ యిల్లు చేరింది. లోపలికి అడుగుపెట్టకుండా బయటనే నిలబడి తల్లిని పిలిచింది. ‘అమా, అమా.. నా చేత పొరపాటు జరిగిపోయింది. పావలా పోగొట్టాను. నన్ను కొట్టొద్దమ్మా. యింకెప్పుడూ పోగొట్టనమ్మా. యింట్లోకొస్తే కొట్టొద్దమ్మా’ అని ఏడ్చింది. ఆ మాటకి మారుతల్లి బుస్సున బుసకొట్టి నేరుగా యింట్లోకి వెళ్లి కారండబ్బా తీసుకొచ్చి నిలబడింది. ‘నువ్వు రా దరిద్రపుదానా. నువు చేసిన పనికి యివాళ నీ కళ్లల్లో చెవుల్లో ముక్కులో నోట్లో కారం కూర్చకపోతే నేను నీ మారుతల్లినే కాదు’ అని శప«థం చేసింది. ఆ శప«థానికి చిన్నపిల్ల యింకా దడుచుకొని గుమ్మానికే అతుక్కుపోయింది. బయట ఆ పిల్ల ఏడ్వను. లోపల ఈ మారుతల్లి శప«థాలు చేయను. ఏడ్చిఏడ్చి వెక్కిళ్లకు వచ్చేసింది చిన్నపిల్ల. యిదంతా చూసీ చూసీ ఆ యింటి ఆరుబయట వున్న ఒక వంగ మొక్కకి మాటలు వచ్చేశాయి. ‘తల్లీ, ఏందిది? నీకు దయా జాలీ అనేవి ఏమైనా వున్నాయా? ఆ పసిదాన్ని ఎందుకు అట్లా రాచి రంపాన పెడ్తున్నావు. ఆ పిల్ల చేసిన తప్పుకు కళ్లల్లో నోట్లో ముక్కుల్లో చెవుల్లో కారం కూర్చాలని నీకు ఉబలాటంగా వుంది కదా. ఆ కారమేదో నాకు కూరు. ఆ బాధేదో నేను పడ్తాను.. పాపం పసిదాన్ని క్షమించి వదిలేయ్’ అని బతిమిలాడింది. అపుడా మారుతల్లి శప«థాలు చాలించి, ఆ చెట్టు వంకాయలు కోసి, వాటిలో కారం కూరి కూరి కూర వండింది. అదే గుత్తి వంకాయ కూర. అట్లా ఆ కూర పుట్టింది. అయితే యిట్లా వంకాయ చేసిన త్యాగం అల్లాకు తెలుస్తుంది గదా. అందుకు ఆయన ఎంతో సంతోషించి ‘ఒసే వంకాయ, యివాళ్టి నుంచి నిన్ను కూరగాయల్లో రాజుని చేస్తున్నాను. నీ నెత్తిన కిరీటం పెడ్తున్నాను. యిక నుంచి నిన్ను పేదోడు యిష్టపడతాడు. ఉన్నోడు యిష్టపడతాడు. వండి తిననివాడు పాపాత్ముడు. అంతేకాదు యివాళ్టి నుంచి నీ కూర లేనిదే విందు భోజనం అనిపించుకోదుపో’ అని వరం యిచ్చాడు. యింక అప్పటి నుంచి రాజా, మహారాజాల విందు భోజనాల్లో కూడా గుత్తివంకాయ కూర వడ్డన చోటుచేసుకుంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి) చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
Children's Day 2021 Special: పరమానందయ్య కాళ్లు నరకబోయిన శిష్యులు.. కథ!
పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఉండేవాడు. ఆయన భార్య సుందరమ్మ. వాళ్లకు పిల్లల్లేరు. ఆయన దగ్గర దద్దమ్మల్లాంటి శిష్యులు ఉండేవారు. పిల్లల్లేకపోవడంతో వాళ్లెంత దద్దమ్మలైనా పరమానందయ్య దంపతులు వాళ్లను సొంత పిల్లల్లాగానే చూసుకునేవాళ్లు. వాళ్ల చేష్టలు పరమానందయ్యకు తరచు చిక్కులు తెచ్చిపెడుతుండేవి. ఒకసారి పరమానందయ్య భార్యతోను, శిష్యులతోను కలసి పొరుగూరుకు బయలుదేరాడు. దారి మధ్యలో ఏరు దాటాల్సి వచ్చింది. చాలా దూరం కాలినడకన ప్రయాణం సాగించడమే కాకుండా, ఏరు కూడా దాటి ఊరికి చేరుకోవలసి రావడంతో పరమానందయ్య బాగా అలసిపోయాడు. ఆయన భార్య పరిస్థితీ అలాగే ఉంది. విపరీతమైన ప్రయాణ బడలిక వల్ల ఒళ్లునొప్పులతో బాధపడసాగాడు. శిష్యులను పిలిచి, ‘నాయనలారా! ప్రయాణ బడలిక వల్ల ఒళ్లంతా నొప్పులుగా ఉంది. కాస్త ఒళ్లు పట్టండి’ అని చెప్పాడు. గురువుగారు ఆజ్ఞాపించడమే తడవుగా, ఆయన ఒళ్లు పట్టడానికి నలుగురు శిష్యులు ముందుకొచ్చారు. ఒక్కొక్క అవయవాన్నీ వంతులు వేసుకున్నారు. ఒకడు కుడిచెయ్యి, ఇంకొకడు ఎడమచెయ్యి, ఒకడు కుడికాలు, మరొకడు ఎడమకాలు పట్టనారంభించారు. శిష్యులు శ్రద్ధగా ఒళ్లుపడుతుండటంతో పరమానందయ్యకు కొంత బడలిక తీరి నిద్ర ముంచుకొచ్చింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంతలో కాళ్లు పట్టే శిష్యుల మధ్య గొడవ మొదలైంది. నా కాలు మంచిదంటే, నా కాలే మంచిదంటూ వాదనకు దిగారు. ఒకడు పట్టే కాలిని మరొకడు కొట్టుకునే వరకు వచ్చింది వ్యవహారం. అప్పటికీ గొడవ చల్లారలేదు. ‘నీ కాలిని నరికేస్తా’ అన్నాడొకడు. ‘నేనూరుకుంటానా! నేనూ నీ కాలిని నరికేస్తా!’ బదులిచ్చాడు ఇంకొకడు. ఇల్లంతా గాలించి, ఇద్దరూ చెరో గొడ్డలీ తీసుకొచ్చి, గురువుగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు. వాళ్ల వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు ప్రారంభించారు. ఈ గలాటాకు గురువుగారికి తెలివి వచ్చింది. చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరు కనిపించగానే, ఆయన నిద్ర దెబ్బకు వదిలిపోయింది. మూర్ఖులు పట్టుదలకు పోయి, నిజంగానే తన కాళ్లను ఎక్కడ నరికి పారేస్తారోనని భయం పట్టుకుంది. ‘ఒరే! వెధవల్లారా! మీరూ మీరూ తగవుపడి నా కాళ్లు నరుకుతారేమిట్రా? మీకేం పోయేకాలమొచ్చింది?’ అంటూ లేవబోయాడు. చేతులు పడుతున్న శిష్యులిద్దరూ, గురువుగారిని లేవనివ్వకుండా గట్టిగా నొక్కిపట్టి, ‘గురువుగారూ! ఈ వెధవలిద్దరూ ఎప్పుడూ ఇలాగే గొడవపడుతుంటారు. మీరేమీ వాళ్ల గొడవ పట్టించుకోకండి. మేం మీ చేతులు పడుతున్నాం కదా!’ అని సర్దిచెప్పసాగారు. ఈలోగా కాళ్లు పట్టే శిష్యులిద్దరూ, గొడ్డళ్లు పట్టుకుని ఆవేశంగా గురువుగారి కాళ్లు నరకడానికి సిద్ధమయ్యారు. వారి వాలకం చూసి ఆయనకు గుండె గుభేలుమంది. వెంటనే, ‘సుందరీ! ఒకసారి ఇలారా!’ అంటూ లోపల ఉన్న భార్యను కేకవేసి పిలిచాడు. భర్త పొలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది. గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి, ఆమెకు పట్టరాని కోపం వచ్చింది. ‘మూర్ఖపు వెధవల్లారా! మీరు గొడవపడి, గురువుగారి కాళ్లు నరికేస్తార్రా! ఉండండి మీ పని చెబుతాను’ అంటూ అందుబాటులో ఉన్న దుడ్డుకర్ర తీసుకుని, వాళ్లను చావబాది, ఇంట్లోంచి తరిమేసింది. ఆ రోజంతా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు ఉదయం కూడా వాళ్లకు తిండిపెట్టలేదు. మర్నాడు మధ్యాహ్నం ఇంటి బయట చెట్టుకింద కూర్చుని, ఆకలికి అలమటిస్తూ దుఃఖిస్తున్న శిష్యులను చూసి, పరమానందయ్యకు వాళ్ల మీద జాలి పొంగుకొచ్చింది. భార్య మనసు కరిగితే గాని, వాళ్లకు ఆ పూట కూడా తిండిపుట్టదని ఆయనకు తెలుసు. అందుకే, వెంటనే ఇంట్లోకి వచ్చి, భార్యకు నచ్చచెప్పడం ప్రారంభించాడు. ‘వాళ్లు ఉత్త అమాయకపు వెధవలు. మనల్నే నమ్ముకుని మన ఇంట్లో పడి ఉంటున్నారు. ఏ పని చెప్పినా, కాదనకుండా చేస్తున్నారు. అప్పుడప్పుడు తెలివితక్కువతనంతో పిచ్చిపనులు చేస్తుండవచ్చనుకో! అంతమాత్రాన వాళ్లకు తిండిపెట్టకుండా మాడ్చిచంపడం సరైన పనికాదు. మనం కాకపోతే ఈ ప్రపంచంలో వాళ్లను పట్టించుకునే దిక్కేది? మనకే పిల్లలు ఉండి, వాళ్లే ఇలాంటి పిచ్చిపనులు చేస్తే వాళ్లను వదిలేసుకుంటామా? పాపం ఆకలితో మాడుతున్నారు. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చెయ్యి’ అన్నాడు. భర్త మాటలతో సుందరమ్మ కూడా ఆ పిచ్చి శిష్యులపై జాలిపడింది. నాలుగు కేకలేస్తే సరిపోయేదానికి, అనవసరంగా దుడ్డుకర్రతో బాదిపారేశానే అని బాధపడింది. వెంటనే వంటకు ఉపక్రమించింది. భోజనానికి పిలుపు రావడంతో శిష్యులు మెల్లగా లోపలకు చేరుకుని, సుందరమ్మ వడ్డించిన వంటకాలను ఆవురావురుమంటూ భోంచేశారు. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
మనిషిని నమ్ముతున్నావా... ఓ కథ చెబుతా విను!
‘‘...అపకారికి నుపకారము నెపమెన్నక...’’.. చేయడం అంటే ఎలాగో... లంకాపట్టణంలో రావణవధ తరువాత సీతమ్మ... స్వామి హనుమకు వివరిస్తూ... ‘‘జంతువులపాటి మంచితనం అయినా మనుషులకు ఉండాలి కదా! దీనికి నీకు ఒక కథ చెబుతా విను...’’ అంది. ‘‘ఒకానొకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక వేటగాడు తీవ్రగా గాలిస్తున్నాడు. అకస్మాత్తుగా ఓ పెద్దపులి ఎదురయింది.. ఆకలిమీద ఉన్నట్లుంది. అది మీద పడేలోగా ప్రాణభయంతో పరుగు లంఘించుకున్నాడు. అది తరుముకొస్తున్నది. దారిలో ఓ పెద్ద చెట్టొకటి కనిపిస్తే... గబగబా ఎక్కేసాడు... దానికి అందకుండా ఉండాలని అన్ని కొమ్మలు దాటుకుంటూ పైకి ఎక్కుతూ పోతున్నాడు. వెనక తరుముకుంటూ వచ్చిన పులి చెట్టుకింద తిష్టవేసింది. ఎప్పటికయినా దిగకపోతాడా... అని కింద కాపుకాసింది. మరో రెండు కొమ్మలు దాటితే చిటారు కొమ్మ ను అందుకోవచ్చని రొప్పుతూ పోతున్న వేటగాడికి పైకొమ్మను పట్టుకునేంతలో అక్కడ గుబుర్లలో ఒక భల్లూకం (ఎలుగుబంటి) కూర్చుని ఉంది. కింద చూస్తే పులి చూపు అతని మీదే ఉంది. ముందు చూస్తే వేటగాడికి సమీపంలో భల్లూకం. చావు ఖాయం అనుకుని గుండె దిటవు చేసుకున్నాడు. ఊపిరి బిగపట్టుకుని చావుకోసం చూస్తున్నాడు. ఈలోగా పెద్దపులి ఎలుగుబంటితో...‘‘ వీడు వేటగాడు. నన్ను చూసి పారిపోతూ ఈ చెట్టెక్కాడు. నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తాడు. అందుకని వీడిని నమ్మకు. వాడిని కిందకు తోసెయ్. తినేస్తా. నిన్ను వదిలిపెట్టేస్తా....’’ అంది. దానికి ఎలుగుబంటి...‘‘ఈ మనిషి తెలిసో తెలియకో నేనున్న చెట్టుమీదికి వచ్చాడు. అంటే... నా ఇంటికొచ్చిన అతిథితో సమానం. వాడిని నేను కాపాడాలి. వాడిని కిందకు తోసేసి నీకు ఆహారంగా అందించలేను’’ అని చెప్పేసింది. ‘‘నీవు మనిషివి నమ్మావు కదా...అది నీకే తెలిసొస్తుందిలే..’’ అని పెద్దపులి చెప్పింది. కానీ కదలకుండా అక్కడే కూర్చుంది. ఈలోగా వేటగాడికి అలసటవచ్చి నిద్రపోయాడు. అది కూడా అతనిని ఏమీ చేయలేదు. కాసేపటికి నిద్ర లేచాడు.. ఈలోగా భల్లూకానికి నిద్ర వచ్చి.. నిద్రపోతున్నది. పెద్దపులి వేటగాడితో ...‘‘ఆ భల్లూకం నిద్ర లేస్తుంది. ఆకలితో ఉంటుంది. నేను చంపేస్తానని దిగదు. నువ్వు అందుబాటులో ఉన్నావు కాబట్టి నిన్ను తినేస్తుంది. దాన్ని కిందకు తోసెయ్. నేను తినేస్తా.. నా ఆకలి తీరిపోతుంది కాబట్టి నేను నీ జోలికి రాను...’’ అంటుండగానే వేటగాడు క్షణం ఆలస్యం చేయకుండా భల్లూకాన్ని కిందకు తోసేసాడు. అదృష్టంకొద్దీ అది కిందకు పడేసమయంలో తేరుకుని మధ్యలో ఒక కొమ్మ అందితే దాన్ని పట్టుకుని పైకి ఎక్కేసింది. వెంటనే పెద్దపులి అంది..‘‘నేను ముందే చెప్పా. వాడిని నమ్మొద్దు అని... ఇప్పటికయినా తెలుసుకున్నావు కదా.. వెంటనే తోసెయ్ వాడిని..’’ అన్నది. ‘‘వాడు నాకు అపకారం చేసి ఉండొచ్చు. వాడు నా అతిథి. వాడికి అపకారం చేయను. కిందకు తోయను..’’ అన్నది భల్లూకం. చేసేదిలేక పెద్దపులి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా అతనిని వదిలేసింది. వేటగాడు కిందకు దిగి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయాడు....’’ ...‘‘చూసావా హనుమా ! అడవిలో ఉండే జంతువులపాలిటి వివేకం కూడా మనం చూపకపోతే ఎలా...అందువల్ల ఆ రాక్షస స్త్రీలను చంపవద్దు. వారి జోలికి పోకు...’’ అంది... అది బద్దెనగారు సుమతీ శతకం ద్వారా మనకు చెప్పిన శీల వైభవం. -
పని చెప్పు
అతడొక బీదవాడు. పేదరికం నుంచి విముక్తి పొందాలన్నది అతడి తీవ్రమైన కోరిక. ఒక భూతాన్ని వశపరచుకొంటే దాని ద్వారా కోరినదంతా తెచ్చుకోవచ్చుననుకొన్నాడు. సమీపంలోని అడవిలో ఆ వశీకరణ మంత్రాన్ని అనుగ్రహించే మహాత్ముడున్నాడని తెలుసుకొని వెళ్లి, అతడి కాళ్లమీద పడ్డాడు. భూతాన్ని వశం చేసుకునే మంత్రాన్ని ఉపదేశించమని బతిమాలాడు. మహాత్ముడు ఆలోచించి ’నీకెందుకయ్యా భూతం? దానితో వ్యవహారం చాలా కష్టం. నీవిప్పుడు సుఖంగా ఉన్నావు. అనవసరంగా కష్టాలపాలవుతావు.’ అన్నాడు. బీదవాడు వినకపోవడంతో ‘నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిదినం జపించు. భూతం నీ వశమవుతుంది. నీవు చెప్పిన పనులన్నీ చేస్తుంది. కానీ జాగ్రత్త... దానికి తగినంత పని కల్పించకపోతే అది నీ ప్రాణాలు తీస్తుంది’ అన్నాడు. బీదవాడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. సెలవు తీసుకుని వెళ్లి శ్రద్ధగా మంత్రాన్ని జపించాడు. కొన్ని రోజులు తరవాత పెద్ద భూతం ప్రత్యక్షమైంది. ‘ఇదో వచ్చాను. నీ మంత్రంతో నన్ను వశపరచుకొన్నావు. ఇక మీద, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని కల్పించి తీరాలి. పని చెప్పకపోయావో నిన్ను చంపేస్తాను’ అన్నది. ‘అయితే నాకో రాజభవనం కట్టించు’ అన్నాడు. తన మనసులో భూతానికి పెద్దపనే కల్పించాననుకొన్నాడా బీదవాడు. రాజభవనం నిర్మించడానికి చాలాకాలం పడుతుందిలే అనుకొన్నాడు. చూస్తుండగానే రాజభవనం, ఉద్యానవనం అన్నీ తయారయ్యాయి. ‘మరేం చేయాలో చెప్పు’ అన్నది భూతం. ‘సమీపంలోని అడవిని కూల్చి ఒక మహా నగరాన్ని నిర్మించు’ అన్నాడు బీదవాడికేమీ తోచక. నగర నిర్మాణం కొన్నేళ్లు పడుతుందనుకొన్నాడు. భూతం కొన్ని నిమిషాల్లోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించింది. బీదవాడు దిక్కుతోచక నేరుగా మహాత్ముడి వద్దకు వెళ్లి.. ‘స్వామీ, నన్ను కాపాడండి’ అంటూ పాదాల మీద పడ్డాడు. ‘అయితే, ఆ కుక్కను పట్టుకో. దాన్ని తీసుకెళ్లి దాని తోకను నిటారుగా ఉంచమని చెప్పు’ అన్నాడు మహాత్ముడు. బీదవాడు ధైర్యంగా ఆ కుక్కను పట్టుకెళ్లి భూతం చేతికిచ్చాడు. ‘వెంటనే ఈ కుక్క తోకను నిటారుగా చెయ్యి’ అన్నాడు. భూతం ‘ఇదేం పెద్దపని!’ అంటూ కుక్క తోకను తన రెండు చేతులతో నిలబెట్టి చేతులు తీయగానే వంకర! భూతం ఎన్నిసార్లు యత్నించినా ఏం లాభం, మళ్లీ వంకరే! వారం రోజులు చేసినా సాధ్యం కాలేదు. బీదవాడి దగ్గరకు వెళ్లి, ‘ఈ కుక్క తోకను నిటారుగా పెట్టించే పని మాన్పించు, నేను నిర్మించిన వాటినన్నింటినీ నీకే అప్పగిస్తాను. నిన్ను చంపనని ప్రమాణం చేస్తాను’ అన్నదా భూతం. బీదవాడు సమ్మతించాడు. ‘బతికాను’ అంటూ కాళ్లకు బుద్ధి చెప్పింది భూతం. బీదవాడు మహాత్ముడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. (డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కథల నుంచి) -
మౌనమూ బోధనే
జెన్ పథం జెన్ గురువు విన్సీ దగ్గరకు ఒకరోజు శిష్యులు వచ్చారు. అవీ ఇవీ మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘అన్నట్టు గురువుగారూ, మీరు బుద్ధుడు, బోధిధర్ముడు వీరిద్దరిలో ఎవరిని ఉన్నతులుగా పేర్కొంటారు?’’ అని అడిగారు. వారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నేను ఆ ఇద్దరికీ ప్రాధాన్యమివ్వను’’ అని చెప్పారు. బుద్ధుడిని వెతుకుతున్నప్పుడు బుద్ధుడిని కోల్పోతున్నాం. బోధిధర్ముడిని వెతుకుతున్నప్పుడు బోధిధర్ముడిని కోల్పోతున్నాం అనేది జెన్ తత్వం. దేని కోసమూ వెతుకుతూ తిరగకు. ఒకవైపే ఉండకు. సొంతమనేదేదో నీకు నువ్వు తెలుసుకో అనేది పరమార్థం. జెన్ గురువు యౌషన్ ఏదీ మాట్లాడరు. శిష్యులు అనేక మంది ఆయను చూసి మాట్లాడేందుకు వచ్చినా సరే ఆయన ఏమీ మాట్లాడరు. వారిలో ఒకరు ఉండబట్టలేక ‘‘గురువుగారూ, మీదగ్గర ఆత్మజ్ఞానం పొందుదామనే ఉద్దేశంతో మేమందరం వచ్చాం. నేనైతే ఇదే విషయాన్ని తెలుసుకోవాలని అనేక సార్లు వచ్చాను. వెళ్లాను. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడటం లేదు....’’ అన్నాడు. ‘‘సరే, సాయంత్రం మీరందరూ ఇక్కడికి రండి. మాట్లాడుకుందాం’’ అని చెప్పారు గురువుగారు. సాయంత్రం భారీ సంఖ్యలో శిష్యులు తరలివచ్చారు. గురువుగారు వారి వంక మౌనంగా చూశారు. కాస్సేపు తర్వాత ఆయన అక్కడి నుంచి తిరిగివెళ్ళడానికి సిద్ధపడ్డారు. అందరూ విస్తుపోయారు. వారిలో ఒకరు ‘‘గురువుగారూ, జ్ఞానామృతం ఏదైనా చెప్తారేమోనని మేమందరం వచ్చాం. ఇక్కడకు రావలసిందిగా మీరు చెప్పారు కూడా. మీరేదో చెప్తారని మేమొచ్చాం. కానీ మీరు ఒక్క మాటా మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమనుకోవాలి?’’ అని అడిగాడు. గురువు ఇలా అన్నారు...... ‘‘క్రమశిక్షణ నేర్పడానికి అనేకమంది ఆచార్యులు ఉన్నారు. నీతి కథలు చెప్పడానికీ చాలా మంది ఉన్నారు. ధర్మాల గురించి చెప్పడానికీ అనేక మందే ఉన్నారు. అటువంటివి చెప్పడం నా పని కాదు. జెన్ అనేది భాషకు అతీతం. మాటకు అతీతం. దేనికీ లొంగదు. మరి దానిని నేనెలా చెప్పగలను? సహజసిద్ధంగా ఉన్న దానిని ఏదో విడమరిచి చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నదంతా చెడి అర్థంపర్థం లేకుండా పోతుంది. సహజసిద్ధమైనదానిని ఉన్నదున్నట్లుగానే గ్రహించాలి’’ అని చెప్పారు. మరొక జెన్ గురువు. ఆయన చుట్టూ అనేక మంది శిష్యులు. ఆయననే అందరూ చూస్తూ రెప్పవాల్చక కూర్చున్నారు. ఆయన ఏ క్ష ణాన ఏం చెప్తారా అని చూస్తున్నారు. అప్పుడు ఆ ఆశ్రమ ఆవర ణలోని ఒక పక్షి కీచుకీచుమని అరుస్తోంది. ఆ అరుపు వినసొంపుగా ఉంది. అది కాస్సేపటికి అరవడం ఆపేసింది. ‘‘ఏమిటి అందరూ విషయాన్ని గమనించారుగా?’’ అని గురువుగారు లేచి వెళ్ళిపోయారు. ఇంకొక గురువు. ఆయన జ్ఞానోపదేశం కోసం అనేక మంది వచ్చారు. వారిని చూసి ‘‘మీరందరూ వెళ్లి తేనీరు తాగి రండి’’ అని చెప్పారు. అంతే అంతకన్నా ఆయన మరేదీ చెప్పలేదు. జ్ఞానం, ఉపదేశం, వివరణ, విడమరిచి చెప్పడం వంటివన్నీ వొట్టి సంగ తులు. అవన్నీ అప్రధానమైనవి. వాటికోసం బుర్రలు బద్దలుకొట్టుకోవడం మూఢత్వం అంటుంది జెన్. వెళ్లి టీ తాగి రండి అనే దానిపై అనేక వివరణలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. అయినా అదే ఫలానా అర్థమని ఎవ్వరూ చెప్పలేకపోయారు. జెన్ యథార్థమైంది. చిక్కుల్లేనిది. నిజాన్ని తెలుసుకోవడానికి చదువో సంధ్యో తెలివితేటలో ఇవేవీ అక్కర్లేదు. ఎవరైనా జ్ఞానాన్ని పొందవచ్చు అంటుంది జెన్. - సమయ