వజ్రపురం అనే గ్రామంలో నివసించే రాజయ్య, రత్నమ్మ దంపతులకు లేకలేక పాప పుట్టింది. ఆ పాపకి అపురూప అని పేరుపెట్టుకుని అల్లారుముద్దుగా పెంచసాగారు. అపురూప మూడో యేట అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు నాడు అపురూపకి పట్టులంగా, పట్టు జాకెట్టు కుట్టించారు. అలాగే పాపాయి బుల్లి బుల్లి చేతులకు బంగారు గాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రపులోలకులు, వజ్రాలహారం వేశారు. ఆరుబయట పందిరిలో సింహాసనంపై అపురూపను కూర్చోబెట్టి అత్యంత వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు.
అదే సమయానికి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఒక తల్లికోతి, పిల్లకోతి ఆ వేడుకకు దగ్గరలో ఉండే చెట్టు మీదకు చేరి ఆ వేడుకనంతా చూశాయి. పిల్లకోతికి అపురూప వేసుకున్న పట్టులంగా, పట్టు జాకెట్టు, గాజులు, అరవంకీలు, వజ్రాల హారం ఎంతగానో నచ్చాయి. తనకు అవన్నీ తెచ్చిపెట్టమంటూ తల్లికోతితో పేచీ పెట్టుకుంది. ‘వద్దమ్మా, పరులసొమ్ము పాము వంటిది’ అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. ఆఖరుకు పిల్లకోతి బాధ చూడలేక ‘సరేనని’ ఒప్పుకుంది తల్లికోతి.
వేడుకంతా పూర్తయి అంతా సర్దుకునేసరికి చీకటి పడింది. అపురూప వేసుకున్న పట్టు జాకెట్టు, పట్టు లంగా ఒక సంచిలో పెట్టారు. బంగారుగాజులు, అరవంకీలు, పాపిడిబొట్టు, వజ్రాలహారాన్ని ఒక పెట్టెలో పెట్టి.. అదే సంచిలో సర్దారు. ఆ సంచిని బీరువాలో పెడదామనుకుని అలసిపోయి ఉండటంతో ఆదమరచి నిద్రపోయారంతా. ఇదే అదనుగా భావించి తల్లి కోతి ఆ సంచిని దొంగిలించి చెట్టు పైకి తీసుకెళ్ళింది. తను అడిగినవన్నీ సంచిలో ఉండటంతో పిల్లకోతి సంతోషానికి హద్దే లేకుండాపోయింది. అప్పటికప్పుడు వాటన్నింటిని తనకు వేయమని గొడవపెట్టింది. ఆ పిల్లకోతికి లంగా, జాకెట్టు వేసింది తల్లి కోతి. చేతులకు గాజులు, అరవంకీలు తొడిగింది. మెడలో వజ్రాల హారాన్నీ వేసింది. వాటిని చూసుకుని పిల్లకోతి ఎంతగానో మురిసిపోయింది.
తెల్లవారుతుండగా మెల్లగా చెట్టు దిగి.. వయ్యారంగా ఊరిలోకి నడవసాగింది. రాజయ్య,రత్నమ్మలు ఉదయాన్నే లేచి చూసే సరికి తమ అమ్మాయి నగలు, పట్టు బట్టలు ఉన్న సంచి కనిపించకపోవటంతో వెతకటం మొదలు పెట్టారు. వాళ్ళకు పట్టులంగా, జాకెట్టు, నగలతో పిల్లకోతి ఎదురైంది. వెంటనే కోతులు పట్టుకునే అతన్ని పిలిపించి పిల్లకోతిని పట్టించారు. దాని ఒంటి మీది బట్టలు, నగలు తీసుకుని, అతనికి మంచి బహుమతినిచ్చి పంపించారు ఆ దంపతులు. ఈ లోపు తన పిల్ల కనిపించక ఆదుర్దాగా వెతకటం ప్రారంభించింది తల్లికోతి. ఎట్టకేలకు కోతులు పట్టే అతని చేతిలో ఒంటి మీద బట్టలు, నగలు ఏమీ లేకుండా కనిపించింది. అప్పటికే పిల్లకోతి తల్లి పై బెంగ పెట్టుకుంది.
తల్లి కోతిని చూసే సరికి ఎక్కడలేని ఆనందం పుట్టుకొచ్చింది. కోతులు పట్టే అతనికి కనిపించకుండా ‘కంగారుపడకు, నిన్ను కాపాడుకుంటాను’ అంటూ పిల్లకోతికి సైగచేసింది తల్లికోతి. కోతులు పట్టే అతను ఆ పిల్లకోతిని తీసుకెళ్ళి సర్కస్ కంపెనీ వాళ్ళకు అమ్మేశాడు. వాళ్ళు పిల్లకోతిని నానా హింసలు పెట్టి అది సర్కస్‌లో నాట్యం చేసేలా, గంతులేసాలా దానికి శిక్షణ ఇచ్చారు. వాళ్ళ చేతుల్లో పిల్లకోతి నరకయాతన పడింది. తన తల్లి చెబుతున్నా వినకుండా పరాయి వస్తువుల కోసం ఆశపడటంతో ఇన్ని ఇబ్బందులు, బాధలు పడవలసి వచ్చిందని తెలుసుకుంది. (క్లిక్: ప్రతిభకు పట్టం.. అందుకే ఇలా మారువేషంలో..)
ఒక రోజు సర్కస్ ముగించుకుని అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో తల్లి కోతి.. పిల్లకోతి దగ్గరకు వెళ్ళి దానికి కట్టిన తాడుని అతి కష్టం మీద నోటితో కొరికి తెంపింది. గుట్టుచప్పడు కాకుండా తన పిల్లతో బయట పడింది. తల్లిని పట్టుకుని పిల్లకోతి వెక్కివెక్కి ఏడుస్తూ ‘అమ్మా! ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను. పరులసొమ్ము ఇంకెప్పుడూ ఆశించను’ అంటూ తల్లిఒడిలో తలదాచుకుంది. (క్లిక్: మంచి పని.. ఈ కిరీటం నీకే!)
Comments
Please login to add a commentAdd a comment