ఒక చిన్నపిల్ల. చాలా చిన్నది. పాపం ఆ పిల్ల సొంత తల్లి చనిపోయేసరికి మారుతల్లి వచ్చింది. ఆమె వచ్చినప్పట్నించి ఆ పిల్ల బాధలు బాధలు గావు. కూర్చుంటే తప్పు. నిలుచుంటే తప్పు. లేస్తే తప్పు. పడుకుంటే తప్పు.
పసిదని కూడా చూడకుండా వీపు మీద కట్టె విరిగేలా బాదుతుండేది ఆ మహాతల్లి.
ఒకరోజు ఆవిడ ఈ పిల్లకు ఒక పావలా యిచ్చి ‘బజారుకెళ్లి ఫలానా వస్తువు తీసుకురా’ అని చెప్పింది.
పాపం చిన్నపిల్ల గదా అంగడికి పోతూ పోతూ పావలాను పోగొట్టుకుంది. పోగొట్టుకోగానే ఆ పిల్లకు అమితమైన భయం పట్టుకుంది. యిప్పుడేం చేసేది యింటికి వెళితే మారుతల్లి కొట్టి చంపేస్తుంది గదా అని ఏడుస్తూ యిల్లు చేరింది. లోపలికి అడుగుపెట్టకుండా బయటనే నిలబడి తల్లిని పిలిచింది.
‘అమా, అమా.. నా చేత పొరపాటు జరిగిపోయింది. పావలా పోగొట్టాను. నన్ను కొట్టొద్దమ్మా. యింకెప్పుడూ పోగొట్టనమ్మా. యింట్లోకొస్తే కొట్టొద్దమ్మా’ అని ఏడ్చింది.
ఆ మాటకి మారుతల్లి బుస్సున బుసకొట్టి నేరుగా యింట్లోకి వెళ్లి కారండబ్బా తీసుకొచ్చి నిలబడింది.
‘నువ్వు రా దరిద్రపుదానా. నువు చేసిన పనికి యివాళ నీ కళ్లల్లో చెవుల్లో ముక్కులో నోట్లో కారం కూర్చకపోతే నేను నీ మారుతల్లినే కాదు’ అని శప«థం చేసింది.
ఆ శప«థానికి చిన్నపిల్ల యింకా దడుచుకొని గుమ్మానికే అతుక్కుపోయింది.
బయట ఆ పిల్ల ఏడ్వను. లోపల ఈ మారుతల్లి శప«థాలు చేయను.
ఏడ్చిఏడ్చి వెక్కిళ్లకు వచ్చేసింది చిన్నపిల్ల.
యిదంతా చూసీ చూసీ ఆ యింటి ఆరుబయట వున్న ఒక వంగ మొక్కకి మాటలు వచ్చేశాయి.
‘తల్లీ, ఏందిది? నీకు దయా జాలీ అనేవి ఏమైనా వున్నాయా? ఆ పసిదాన్ని ఎందుకు అట్లా రాచి రంపాన పెడ్తున్నావు. ఆ పిల్ల చేసిన తప్పుకు కళ్లల్లో నోట్లో ముక్కుల్లో చెవుల్లో కారం కూర్చాలని నీకు ఉబలాటంగా వుంది కదా. ఆ కారమేదో నాకు కూరు. ఆ బాధేదో నేను పడ్తాను.. పాపం పసిదాన్ని క్షమించి వదిలేయ్’ అని బతిమిలాడింది.
అపుడా మారుతల్లి శప«థాలు చాలించి, ఆ చెట్టు వంకాయలు కోసి, వాటిలో కారం కూరి కూరి కూర వండింది.
అదే గుత్తి వంకాయ కూర. అట్లా ఆ కూర పుట్టింది.
అయితే యిట్లా వంకాయ చేసిన త్యాగం అల్లాకు తెలుస్తుంది గదా. అందుకు ఆయన ఎంతో సంతోషించి ‘ఒసే వంకాయ, యివాళ్టి నుంచి నిన్ను కూరగాయల్లో రాజుని చేస్తున్నాను. నీ నెత్తిన కిరీటం పెడ్తున్నాను. యిక నుంచి నిన్ను పేదోడు యిష్టపడతాడు. ఉన్నోడు యిష్టపడతాడు. వండి తిననివాడు పాపాత్ముడు. అంతేకాదు యివాళ్టి నుంచి నీ కూర లేనిదే విందు భోజనం అనిపించుకోదుపో’ అని వరం యిచ్చాడు.
యింక అప్పటి నుంచి రాజా, మహారాజాల విందు భోజనాల్లో కూడా గుత్తివంకాయ కూర వడ్డన చోటుచేసుకుంది.
- మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి)
చదవండి: టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!
Comments
Please login to add a commentAdd a comment