పిల్లల కథ: ఏయ్‌ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? | Telugu Kids Moral Story: Squirrel, Crow, Monkeys, Save Environment | Sakshi
Sakshi News home page

పిల్లల కథ: ఏయ్‌ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?

Published Sat, Dec 31 2022 6:35 PM | Last Updated on Sat, Dec 31 2022 6:35 PM

Telugu Kids Moral Story: Squirrel, Crow, Monkeys, Save Environment - Sakshi

వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్‌ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్‌ కావ్‌ అంటూ ఎగిరిపోయింది.

‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్‌ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి.  తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ.
ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది.

వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్‌ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్‌ ఉష్‌ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు.

‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ  అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే  మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత  గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి.

పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత.

అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో  క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం  అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది.         

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement