Save Environment
-
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్‌కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్‌గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్‌లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్‌లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్‌గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్‌ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్‌ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org -
ప్లాస్టిక్ వద్దంటూనే వాడకం
సంగారెడ్డి : ‘ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడండి, తినడానికి, తాగడానికి మట్టిపాత్రలు వినియోగించండి’ అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ ఆవరణలో మట్టిపాత్రలు ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఈ విషయాన్ని తెలిపేందుకు ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడొద్దని సూచిస్తూ ప్లాస్టిక్ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చూసి కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
సేవ్ ఎన్విరాన్మెంట్ కోసం ఎమ్మెస్సీ విద్యార్థి పాదయాత్ర
మిరుదొడ్డి(దుబ్బాక) : భుజంపై జాతీయ జెండాతో ‘మొక్కలు నాటండి. ప్లాస్టిక్‌ను నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించండి’ అని ప్లకార్డు చేతబట్టి, కనీసం పాదాలకు పాదరక్షలు లేకుండా పాదయాత్ర చేస్తున్న యువకుడి ఉత్సాహానికి ప్రతి ఒక్కరు జేజేలు పలుకుతున్నారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తన వంతు బాధ్యత గుర్తించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలం ముక్తాపూర్ గ్రామానికి చెందిన పాలడుగు సంగమ్మ, నర్సుగొండి దంపతుల కుమారుడు జ్ఞానేశ్వర్ అనే యువకుడు ప్రపంచ పర్యవరణ దినోత్సవం సందర్భంగా మొదలు పెట్టిన పాదయాత్ర సోమవారం మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చేరుకుంది. తాను వెళ్లే దారిలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని బోధిస్తున్నాడు. దారిలో ఏ పది మంది కనిపించినా ప్లాస్టిక్, పాలిథిన్ కవర్ల వల్ల వాతావరణం కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందని అవగాహన కలిగిస్తున్నాడు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై మొక్కలను నాటాలని కనిపించిన వారితో కోరుతున్నాడు. కాగా పర్యావరణాన్ని కాపాడాలన్న సంకల్పంతో జ్ఞానేశ్వర్ చేస్తున్న పాదయాత్ర ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. అప్పుడే చెప్పులు తొడుగుతా.. నేను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఎమ్మెస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. పర్యావరణ పరిరక్షణకోసం తన వంతు సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి పూనుకున్నాను. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, మొక్కలను విధిగా నాటాలని కోరుతూ కళాశాలకు సెలవులు దొరికినప్పుడల్లా పాదయాత్రలు చేపట్టి అవేర్నెస్ తీసుకువచ్చేలా కృషి చేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 5న పాదయాత్ర ప్రారంభించాను. ప్రస్తుతం 450 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ‘సేవ్ ఎన్విరాన్మెంట్ బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’పై అవగాహన కలిగిస్తూ చైతన్యం తీసుకువస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా 1500 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తయిన తర్వాతనే కాళ్లకు చెప్పులు తొడుగుతానని దీక్షను తీసుకున్నాను. పాదయాత్ర వల్ల సమాజంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. – జ్ఞానేశ్వర్, పర్యావరణ పాదయాత్రికుడు -
మట్టి వినాయకుడికే జై
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులకు స్వస్తి చెబుదాం భావి తరాలకు భరోసానిద్దాం సమప్త జీవకోటికి ప్రాణధారం స్వచ్ఛమైన నీరు, గాలి, పర్యావరణం. అలాంటి నీరు, గాలి, పర్యావరణం రోజురోజుకూ కలుషితమవుతోంది. ఫలితంగా జీవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఇష్టారీతిన చెట్లు నరికివేత, వాహనాల వినియోగం, పరిశ్రమల ఏర్పాటు, సహజ రంగుల వినియోగం, తదితర వాటితో జీవకోటికి ప్రమాదం ఏర్పడుతోంది. వినాయక చవితి కూడా రానే వచ్చింది. అందుకే రసాయనాల రంగులతో కూడిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన వాటిని వాడితే పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతాం. – మహబూబ్‌నగర్ క్రైం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఇటీవల మనం మొక్కలు నాటాం. వాటి సంరక్షణ బాధ్యతను భుజాలకెత్తుకున్నాం. పరిసరాలను మనం కాపాడితే..అవి మనల్ని కాపాడుతాయనే భావనలోంచే ఇది పుట్టింది. మరో ఐదు రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు రాబోతున్నాయి. వీధివీధినా విఘ్నేశ్వరుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రతి, ఫలాలతో ఏకదంతుడిని పూజించడానికి యువజన సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. ఆకర్షణీయంగా దర్శనమిస్తాడని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పాటు వివిధ రకాల రసాయనాల కలబోతతో రంగురంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను పూజిద్దాం. నీటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. జలచరాలకు ప్రాణదానం చేద్దాం. ఇప్పటి వరకు నాటిన మొక్కలన్నీ బతికేలా పర్యావరణ పరిరక్షణ కోసం మరోసారి నడుంబిగిద్దాం. చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం వినాయకచవితి అనగానే ఎక్కడా లేని సంతోషం. ఉత్సాహం వచ్చేస్తాయి. ఆకర్షణీయమైన రంగులతో తయారు చేసిన పెద్ద విగ్రహాల ఏర్పాటు చేసి అందరూ సంబురపడతారు. పెద్ద మైకులు పెట్టి సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం హోదాగా భావిస్తారు. దీనివల్ల ధ్వని కాలుష్యం పెరుగుతుంది. విగ్రహాల తయారీలో ఉపయోగిస్తున్న రసాయనాలతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతుంది. పెద్ద వినాయక విగ్రహాల తయారీకి వినియోగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులతో జలవనరులు కలుషితం అవుతున్నాయి. తొమ్మిది రోజుల సంతోషం కోసం దీర్ఘకాలిక నష్టాలను కొని తెచ్చుకోవడం ఎంతవరకు సరైన అంశమనే విషయం ఆలోచిద్దాం. రసాయన పదార్థాలతో తయారు చేసిన పెద్ద విగ్రహాల కంటే నల్లరేగడితో తయారు చేసిన చిన్న గణపయ్యలే మహా శ్రేష్టం. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం గ్రామాల్లో పోటీతత్వం పెరిగి అధికంగా విగ్రహాలు ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయడం ఎక్కువైంది. భారీ ఎత్తులో విగ్రహాలను తయారు చేసేందుకు చాలా ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా అనేక పరీక్షల్లో వెల్లడైంది. వీటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు కలుషితమై జలచరాలతో పాటు మన lపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. విగ్రహాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. రసాయన రంగులను వాడుతారు. వాటిలో సీసం, ట్రామ్, ఆర్సినిక్ కాపర్, కార్బోనియం, జింక్, మెర్క్యురీ, క్రోమియం వంటివి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఆ విగ్రహాలను నిమజ్జనం చేసిన నీటి వనరుల్లో లవణాల శాతం పెరిగిపోతుంది. దీంతో నీటి వనరులు పూర్తిగా కలుషితమవుతాయి. నిమజ్జనం తర్వాతే అసలు సమస్య రసాయనాలను వినియోగించి తయారు చేసిన వినాయకుడిని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశాకే అసలు సమస్య మొదలవుతుంది. మనం భారీగా ఖర్చుచేస్తే నష్టం కూడా భారీగానే ఉంటుంది. గొప్పగా ప్రతిష్ఠించే పెద్ద వినాయకుడి ద్వారా తిప్పలు కూడా పెద్దగానే ఉంటాయి. మన ఊరిలోని చెరువులో ఆ గణపయ్య నిమజ్జనం తర్వాత విగ్రహం నీటిలో కరగడానికి ఎన్నో నెలలు పట్టవచ్చు. ఆ గణపతి ప్రతిమలో వాడు ఇనుప చువ్వలతో జలచరాలకే కాదు ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురయ్యే వారు ఉంటారు. ప్లాస్టిక్‌పై సమరానికి ఓ యువకుడు సై వాతావరణ సంరక్షణకు సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేశాడో యువకుడు. స్నేహితుల సహకారం, అమ్మ ప్రోత్సాహంతో లక్ష్యం వైపు ముందుకు సాగుతున్నాడు జిల్లాకేంద్రంలోని శివశక్తినగర్‌కు చెందిన శ్రీకాంత్. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఈ యువకుడు ప్లాస్టిక్ వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలుసుకుని దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుతం సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరోవైపు ఎలాంటి రసాయనాలు లేకుండా బంకమట్టి, కొబ్బరిపీచుతో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నాడు. ఏడేళ్ల కాలంలో 50వేల మట్టి వినాయ విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అందించాడు. 2010లో మట్టి వినాయక విగ్రహాలను తయారుచేయడం మొదలు పెట్టి ఆయన ప్రతి ఏడాది వేల సంఖ్యలో వాటిని తయారు చేస్తూ కాలుష్యం కాపాడేందుకు తనవంతు కషి చేస్తున్నాడు. గతేడాది 10వేల మట్టి విగ్రహాలను తయారు చేయడంతో చాలా స్పందన వచ్చిందని, ఈ ఏడాది 20వేల విగ్రహాలు తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఈ సారి ఓపెన్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా మట్టి విగ్రహాలను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు చెబుతున్నాడు. 1995నుంచి ఏకో క్లబ్ ఆధ్వర్యంలో.. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ వేదికగా పని చేస్తున్నా ఏకో క్లబ్ సభ్యులు జిల్లాలో పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏకో క్లబ్‌ను జిల్లాలో 1995లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి గన్నోజీ చంద్రశేఖర్ చైర్మన్‌గా 200మంది సభ్యులు, 500మంది వలంటీర్లుగా జిల్లావ్యాప్తంగా పని చేస్తున్నారు. ఏకో క్లబ్ ఆధ్వర్యంలో వేల కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పర్యావరణం రక్షించడానికి కషి చేస్తున్నారు. జిల్లాస్థాయిలో యువకులకు సెమినార్లు, వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేసి కేవలం పచ్చదనం, నీటి వినియోగంపై చాలా ప్రచారం చేశారు. కాలుష్యాంపై అవగహన కల్పించడంలో భాగంగా క్షేత్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 2వేల సదస్సులు ఏర్పాటు చేశారు. కఠినచట్టాలు అవసరం.. విగ్రహాల తయారీలో విషపూరిత రసాయనాలు, రంగులు వాడటాన్ని రద్దు చేసి, కఠిన చట్టాలు తీసుకురావాలి. ప్రతి ఒక్కరూ బంకమట్టితో తయారు చేసిన నీటిలో సులువుగా కరిగిపోయే విగ్రహాలను తయారు చేయాలి. దేవుడు ఏ విగ్రహంలోనైనా అదే అవతారం కాబట్టి పెద్ద విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విగ్రహాలు బంకమట్టితో చేసినవి నిమజ్జనం చేస్తే విశ్వమానవాళికి ప్రమాదం తప్పుతుంది. – డాక్టర్ చంద్రకిరణ్, పీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్, రసాయన శాస్త్ర విభాగం అధిపతి