Mohammed Khadeer Babu
-
Children's Day 2021 Special: గుత్తివంకాయ కూర.. కథ!
ఒక చిన్నపిల్ల. చాలా చిన్నది. పాపం ఆ పిల్ల సొంత తల్లి చనిపోయేసరికి మారుతల్లి వచ్చింది. ఆమె వచ్చినప్పట్నించి ఆ పిల్ల బాధలు బాధలు గావు. కూర్చుంటే తప్పు. నిలుచుంటే తప్పు. లేస్తే తప్పు. పడుకుంటే తప్పు. పసిదని కూడా చూడకుండా వీపు మీద కట్టె విరిగేలా బాదుతుండేది ఆ మహాతల్లి. ఒకరోజు ఆవిడ ఈ పిల్లకు ఒక పావలా యిచ్చి ‘బజారుకెళ్లి ఫలానా వస్తువు తీసుకురా’ అని చెప్పింది. పాపం చిన్నపిల్ల గదా అంగడికి పోతూ పోతూ పావలాను పోగొట్టుకుంది. పోగొట్టుకోగానే ఆ పిల్లకు అమితమైన భయం పట్టుకుంది. యిప్పుడేం చేసేది యింటికి వెళితే మారుతల్లి కొట్టి చంపేస్తుంది గదా అని ఏడుస్తూ యిల్లు చేరింది. లోపలికి అడుగుపెట్టకుండా బయటనే నిలబడి తల్లిని పిలిచింది. ‘అమా, అమా.. నా చేత పొరపాటు జరిగిపోయింది. పావలా పోగొట్టాను. నన్ను కొట్టొద్దమ్మా. యింకెప్పుడూ పోగొట్టనమ్మా. యింట్లోకొస్తే కొట్టొద్దమ్మా’ అని ఏడ్చింది. ఆ మాటకి మారుతల్లి బుస్సున బుసకొట్టి నేరుగా యింట్లోకి వెళ్లి కారండబ్బా తీసుకొచ్చి నిలబడింది. ‘నువ్వు రా దరిద్రపుదానా. నువు చేసిన పనికి యివాళ నీ కళ్లల్లో చెవుల్లో ముక్కులో నోట్లో కారం కూర్చకపోతే నేను నీ మారుతల్లినే కాదు’ అని శప«థం చేసింది. ఆ శప«థానికి చిన్నపిల్ల యింకా దడుచుకొని గుమ్మానికే అతుక్కుపోయింది. బయట ఆ పిల్ల ఏడ్వను. లోపల ఈ మారుతల్లి శప«థాలు చేయను. ఏడ్చిఏడ్చి వెక్కిళ్లకు వచ్చేసింది చిన్నపిల్ల. యిదంతా చూసీ చూసీ ఆ యింటి ఆరుబయట వున్న ఒక వంగ మొక్కకి మాటలు వచ్చేశాయి. ‘తల్లీ, ఏందిది? నీకు దయా జాలీ అనేవి ఏమైనా వున్నాయా? ఆ పసిదాన్ని ఎందుకు అట్లా రాచి రంపాన పెడ్తున్నావు. ఆ పిల్ల చేసిన తప్పుకు కళ్లల్లో నోట్లో ముక్కుల్లో చెవుల్లో కారం కూర్చాలని నీకు ఉబలాటంగా వుంది కదా. ఆ కారమేదో నాకు కూరు. ఆ బాధేదో నేను పడ్తాను.. పాపం పసిదాన్ని క్షమించి వదిలేయ్’ అని బతిమిలాడింది. అపుడా మారుతల్లి శప«థాలు చాలించి, ఆ చెట్టు వంకాయలు కోసి, వాటిలో కారం కూరి కూరి కూర వండింది. అదే గుత్తి వంకాయ కూర. అట్లా ఆ కూర పుట్టింది. అయితే యిట్లా వంకాయ చేసిన త్యాగం అల్లాకు తెలుస్తుంది గదా. అందుకు ఆయన ఎంతో సంతోషించి ‘ఒసే వంకాయ, యివాళ్టి నుంచి నిన్ను కూరగాయల్లో రాజుని చేస్తున్నాను. నీ నెత్తిన కిరీటం పెడ్తున్నాను. యిక నుంచి నిన్ను పేదోడు యిష్టపడతాడు. ఉన్నోడు యిష్టపడతాడు. వండి తిననివాడు పాపాత్ముడు. అంతేకాదు యివాళ్టి నుంచి నీ కూర లేనిదే విందు భోజనం అనిపించుకోదుపో’ అని వరం యిచ్చాడు. యింక అప్పటి నుంచి రాజా, మహారాజాల విందు భోజనాల్లో కూడా గుత్తివంకాయ కూర వడ్డన చోటుచేసుకుంది. - మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి) చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
Children's Day 2021 Special: నక్క సాయెబు – నక్క బీబీ.. కథ!
ఒక నక్క సాయెబుగారూ నక్క బీబీ అడవిలో కాపురం చేసుకుంటూ వున్నారు. నక్క సాయెబుగారికి ఏ పనీ రాకపోయినా జాతిబుద్ధి సోకి వాళ్లను ముంచి, వీళ్లని ముంచి మొత్తం మీద బీబీగారు ఏమడిగితే అది తెచ్చిపెడుతూ, ఆమె కళ్లలో కాటుక తడవకుండా చూసుకుంటూ వస్తున్నారు. బీబీగారు చిన్నమనిషి కాదు. నా మొగుడు సిపాయి, నా మొగుడు పైల్వాను అనుకుంటూ వుండేవారు. సరే వాళ్లున్న యింటి మీదుగా రోజూ ఒక ఏనుగు దాని మానాన అది కాలువకు స్నానానికి పోతూ వుండేది. స్నానానికి పోతూ వుంటే అప్పుడే స్నానానికి సిద్ధమవుతున్న నక్కబీబీగారు దాన్ని చూశారు. ఆ టైములో నక్కబీబీగారి ఒంటి మీద నూలుపోగు లేదు. అందువల్ల ఆవిడ సిగ్గుతో చచ్చిపోయి, గబగబా చీర చుట్టుకొని యింట్లోకి పరుగు తీశారు. ఆ తర్వాత, అలిగి మంచంమీద పడుకున్నారు. నక్కసాయెబుగారు కంగారుపడిపోయారు. ‘బీబీగారూ. ఏం జరిగింది? చెప్పంyì . చెప్పండి?’ అని సముదాయించారు. ‘చూడండి. నాకూ మానం మర్యాదా గోషా పరదా వున్నాయి. పొద్దున లేస్తే మీ పని మీద మీరు వెళ్లిపోతారు. యింట్లో నేనొక్కదాన్నే వుండాలి. ఎవరైనా కన్నేసి ఏదైనా చేస్తే నేనేం కావాలి? యివాళ నీళ్లు పోసుకుంటూ ఉంటే ఏనుగు చూసింది. యిప్పుడు యీ పని చేస్తుంటే చూసింది రేపు ఒంటికి పోతా వుంటే రెండుకు పోతా వుంటే చూస్తుంది. అది రోజూ ఈ దోవన పోతుంటే నాకు చచ్చేంత సిగ్గుగా వుంటోంది. మీరు నా మానం మర్యాదలు కాపాడేవాళ్లయితే దాన్ని చంపి దాని రక్తంతో మన యింటి ముందు కళ్లాపి చల్లండి’ అంది నక్క బీబీ. బీబీగారు అంత మాట అన్నాక నక్కసాయెబుగారు వెనక్కి తగ్గితే ఏం బాగుంటుంది? ‘నీ కోరిక నెరవేరుస్తా బీబీ’ అని చెప్పి మాట యిచ్చి అడవికి వెళ్లారు. వెళ్లి ఎక్కడెక్కడి నుంచో నారను సేకరించారు. తాడు పేనారు. పేని ఏనుగు వచ్చే దారిలో అక్కడొక ఉచ్చు, ఇక్కడొక ఉచ్చు అమర్చుకుంటూ వచ్చి తాడు కొసను తన నడుముకు కట్టుకున్నారు. ఏనుగుని ఉచ్చులో బంధించి ఆ తర్వాత చంపాలని ఆయన పథకం. ఎప్పటిలాగే ఏనుగు స్నానానికి బయలుదేరింది. దారిలో వస్తూ వస్తూ నక్క సాయెబుగారి ఉచ్చులో కాలు పెట్టింది. ఆ ఉచ్చు దానికో లెక్కా? చీమతో సమానం. అందుకని తాడును లాక్కుంటూనే అది తన దారిన తాను పోతూ వుంది. తాడు చివరను సాయెబుగారు నడుముకు కట్టుకున్నారు గదా. అందువల్ల ఆయన్ను కూడా లాక్కుపోతూ వుంది ఏనుగు. ఇది సాయెబుగారు ఊహించలేదు. తాడు చివరను నడుముకు కట్టుకుంటే చాలదా, నా బలానికి ఏనుగు ఆగిపోదా అనుకున్నాడు ఆయన. యిప్పుడు కథ తిరగబడేసరికి బిత్తరపోయి ‘ఓలమ్మో ఓరి నాయనో’ అని గోల మొదలుపెట్టారు. ఆ ఆరుపులకీ కేకలకీ ధర్మపత్ని అయిన నక్కబీబీగారు యింట్లో నుంచి బయటికొచ్చి చూశారు. సాయెబుగారిని ముళ్లల్లో పొదల్లో రాళ్లల్లో రప్పల్లో లాక్కుని పోతూ వుంది ఏనుగు. తమాషా ఏమిరా అంటే అసలా ఏనుగుకి ఆ దోవలో ఒక నక్కబీబీగారు ఒక నక్కసాయెబుగారు కాపురం వుంటున్నారని గానీ, నక్కబీబీగారు తనని చూసి సిగ్గుపడుతున్నారనిగానీ, తనని చంపడానికి వాళ్లు పథకం వేశారనిగానీ, ఉచ్చు పన్నారనిగానీ ఏమీ తెలియదు. మహారాజులకి అల్పసంగతులు పడతాయా? పట్టవు. అందుకే అది పోతూ పోతూ వుంటే వెనుక కుయ్యోమొర్రో అంటున్నారు సాయెబుగారు. ఆయన వెంట బీబీగారు లబోదిబోమంటున్నారు. ‘ఓరయ్యో నా మానం పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా మర్యాద పోతే పోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా గోషా పోతేపోయింది మీరు దక్కితే చాలు. ఓరయ్యో నా సిగ్గు పోతే పోయింది మీరు దక్కితే చాలు’అని శోకండాలు తీస్తున్నారు బీబీగారు. ఎన్ని శోకండాలు తీసినా నక్కసాయెబుగారు వెనక్కి వస్తారా? ఏనుగుతోపాటు కాలువలో మూడు మునకలు మునిగి చావుతప్పి కన్ను లొట్టపోయి ఎట్టో బతికి బయటపడి చెంపలు వేసుకున్నారు పాపం. - మహమ్మద్ ఖదీర్‌బాబు (పుప్పుజాన్ కతలు నుంచి) -
ఈవారం కథ: వాసన
టీ ఇచ్చింది. నీలిరంగు పూలున్న కప్పులో గాఢంగా నిండి, తీరం చేరని అలలాగా పలుచటి మీగడ కట్టిన టీ. ‘ఊ.. పీల్చండి.. ఆలస్యం ఎందుకు?’ అంది. తలెత్తి చూశాడు. ఆమె వెళ్లాక ఎలాగూ చేస్తాడు. ముందే చేయమంటోంది. వాసన చూశాడు. టీ వాసన. ‘వచ్చిందా?’ ‘ఊ’ ‘అంతా బాగైపోయాము. వొడ్డున పడ్డాము. పద్నాలుగు రోజులైపోయి ఇవాళ్టికి మూడు వారాలు గడిచాయి. పదో రోజుకే మనకు వాసన తిరిగి రాలేదూ. నీకొచ్చిందా అంటే నీకొచ్చిందా అని అనుకోలేదూ. మీ కళ్లకు తుండు గట్టి పసుప్పొడి వాసన చూపిస్తే మీరు ముక్కుకు దగ్గరగా పట్టి పసుప్పొడి అని చెప్పలేదూ. ఇంకా ఏమిటండీ ఈ ఆరాటం మీకూ నాకూ. అదున్నప్పుడు బానే ఉన్నారు. దాన్ని తరిమిగొట్టారు. తీరా నెగెటివ్ అని రిపోర్టు ఇద్దరం చూసుకుని చీమ కుట్టినంత కష్టమైనా లేకుండా కనికరించావు దేవుడా అనుకుని తెరిపిన పడుతుంటే ఏం జబ్బు చేసింది మీకు? వాసన పోయినట్టుగా వాసన లేనట్టుగా వాసనే రానట్టుగా ఉలికులికిపడుతున్నారు. ప్రతిదాన్ని వాసన చూస్తున్నారు. ఉందా... ఉన్నట్టే ఉందా అని నన్ను పీక్కు తింటున్నారు. అయ్యో... ఎక్కడికైనా పారిపోదామంటే ఏ ఇంటికీ వెళ్లలేని ఈ పాపిష్టి రోజులు’... ఇక అక్కడితో విసురుగా వెళ్లాలి లెక్కప్రకారం. కాని టీ తాగేదాకా ఆగి కప్పు తీసుకెళ్లిపోయింది. పదిహేను రోజులు అఫీషియల్ సెలవులిస్తారు ఆఫీసులో పాజిటివ్ రిపోర్ట్ పంపితే. ఇంకో పదిహేను రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు. ఆ పదిహేను రోజులూ అయిపోయాయి. ఫటీగ్గా ఉంది ఇంకో పదిరోజులు ఇవ్వండి అని కోరాడు. అవీ ముగిసి రేపో మర్నాడో వెళ్లాలి. లేదంటే నీకూ మాకూ చెల్లు అన్నా అంటారు. చిన్న బెడ్రూమ్ నుంచి పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి. ఆన్లైన్ క్లాసులు అయిపోయాయన్న మాట. యూట్యూబ్‌లోకి దిగి ఉంటారు. పోయిన సంవత్సరం న్యూస్ మొదలై హటాత్తుగా లాక్డౌన్ వచ్చినప్పుడే తీసుకోదగ్గ జాగ్రత్తలన్నీ తీసుకుందాం అని ఇద్దరూ అనుకున్నారు. లాక్డౌన్లు ముగిసి జనం మాస్క్‌లు కట్టుకుని, షాపులకు పాలిథిన్ షీట్లు వేళ్లాడేసి, తాళ్లు అడ్డం కట్టి బేరాలు మొదలెట్టాక... మాస్క్, మాస్క్ మీద షీల్డ్ పెట్టుకొని ఐకియాకు వెళ్లి రెండు చిల్డ్రన్స్ బెడ్స్ కొన్నారు. చిన్న బెడ్రూమ్లో ఇదివరకు ఫోర్ బై సిక్స్ బెడ్ ఉండేది. పెద్దదానికి నాలుగు బిస్కెట్లు ఇచ్చి నీకు రెండు తమ్ముడికి రెండు అనంటే గీత పెట్టి కొట్టినట్టుగా సమానంగా పంచుతుందిగాని ఒకే మంచం మీద ఇద్దర్నీ పడుకోమంటే మెల్లమెల్లగా కాలితో నెడుతూ వాణ్ణి తోసేస్తుంది. నలుగురూ మాస్టర్స్ బెడ్రూమ్లో పడుకునే రోజులు పోయాయి. ఏ క్షణాన ఏ అవసరం వస్తుందోనని ఆ ఫోర్ బై సిక్స్‌ను... అతని వాళ్లకా ఆమె వాళ్లకా అనే చర్చ లేకుండా... ఆమె వాళ్లకే చెప్తే వచ్చి పట్టుకెళ్లారు. కొన్న రెండు బెడ్లు అక్కడ వేశారు. కామన్ బాత్రూమ్ ఆ చిన్న బెడ్రూమ్కు దగ్గరగా ఉంటుంది. అందులో నాలుగువేలు పెట్టి మినీ గీజర్ బిగించారు. ఒక అరలో ఉడ్వర్క్లో మిగిలిన కర్ర ముక్కలు, ప్లైవుడ్ తునకలు దాచి ఉంటే పారేసి పిల్లలవే కొన్ని బట్టలు, టవల్స్, రెండు స్టీల్ జగ్స్ పెట్టారు. అతనికీ ఆమెకీ ఒకరోజు తేడాలో టెంపరేచర్ మొదలైనప్పుడు ఈ సిద్ధం చేసిందంతా పనికొచ్చింది. పిల్లల్ని ఆ రూమ్‌లోకి పంపించేశారు. ఇక క్లాసులొద్దు ఏం వొద్దు మీ ఇష్టమొచ్చినవి కంప్యూటర్లో ఫోన్లో చూసుకోండి అని చెప్తే, వాళ్లూ తెలివైనవాళ్లకు మల్లే అస్సలు బెంగలేనట్టుగా ముఖాలు పెట్టి సరేనన్నారు. పెద్దది ఎనిమిదో క్లాసుకు, వాడు ఆరుకు వచ్చే సమయానికి ఇదంతా మొదలవడం తమ అదృష్టం అనే అనుకున్నారు. ఇంకా చిన్నపిల్లలై ఉంటే తమ సంగతి తమకు మాత్రమే తెలిసేది. ఏమంటే కొన్ని బాధలు ఎంత చెప్పినా ఎదుటివారికి ఏ తలకాయీ అర్థం కాదని అనుకున్నారు. క్షణాల్లో కోర్సు మొదలెట్టడం వల్లో, ఇద్దరివీ సముద్రం వొడ్డున ఉండే ఊళ్లు కనుక అన్యం లేనట్టుగా చేపలు తింటూ పెరగడం వల్లో, మరీ యాష్ట పడేంతగా శరీరాలను ముందు నుంచి చేటు చేయక చూసుకోవడం వల్లో వచ్చిన చుట్టం ప్రతాపం చూపకుండా ఆరో రోజుకు ముడుచుకు పడుకున్నాడు. వంట యధావిధిగా సాగేది. పిల్లల వాటా తలుపు దగ్గర పెట్టి తప్పుకునేవాళ్లు. రెండుసార్లు పెద్దది ఏడ్చింది. వాడు వీడియో కాల్లో ముఖం ఎర్రగా పెట్టి నాన్న మర్యాద కాపాడ్డానికి బింకం పోయాడు. పన్నెండు రోజులకే డాక్టర్ ‘పోండి... పోయి పిల్లల దగ్గర పడుకోండి’ అన్నా పద్నాలుగో రోజున తల స్నానాలు చేసి, ఇద్దరు పేదవాళ్లకి, అంటే ఆమె దృష్టిలో అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డులకు, వెజిటెబుల్ బిర్యాని– ఎగ్ కర్రీ పెట్టి, అప్పుడు పిల్లలను దగ్గరకు తీసుకుని పెద్దపెద్దగా ఏడ్చారు. అయితే అమేజాన్‌లో పెద్దది తెలివిగా ‘ది వార్ విత్ గ్రాండ్‌పా’ సినిమా పెట్టి అందర్నీ నవ్వించింది బాగా. ఇక అంతా అయిపోయినట్టే అనుకుంటూ ఉంటే ఈ ముక్కు బాధ మొదలైంది. వాసన ఉన్నట్టా.. వాసన లేనట్టా... వాసన ఉండీ లేనట్టా.... స్నానం చేస్తూ సబ్బు వాసన చూట్టం... నూనె రాసిన జుట్టును దువ్వుకున్నాక దువ్వెన వాసన చూడటం, హ్యాంగర్‌కు వేళాడుతున్న మురికిబట్టల వాసన చూడటం, కప్‌బోర్డుల్లో పడేసి ఉంచిన నేఫ్తలిన్ ఉండలు తీసి వాసన చూడటం... కొత్తల్లో ఆమె గమనించి ఏమిటోలే అనుకునేది. తర్వాత్తర్వాత భయపడుతోంది. టెంపర్ మనిషి. పిల్లల్ని తీసుకొని ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్లినా వెళ్లగలదు. దీనిని ముగించాలి అనుకున్నాడు. ఆఫీస్ పని అయ్యేసరికి మధ్యాహ్నం నాలుగైంది. ఐదింటికి టీ తాగి, మాస్క్ పెట్టుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని బయటపడ్డాడు. ఆరు నుంచి కర్ఫ్యూ. ఇంకా గంట టైముంది. రోడ్డు మీదకు వచ్చాక ఎం.ఆద్రికి ఫోన్ చేశాడు. ఆద్రి డాక్టరు. హైస్కూల్లో అతడికి రెండేళ్లు సీనియర్. అసలు పేరు మాల్యాద్రి అయితే మార్చుకున్నాట్ట. ఆ ఆద్రిని అతడు వాడు అంటాడు. యు.కె వెళ్లి సైకియాట్రీ చదివి అక్కడే ప్రాక్టీసు చేసి ఆ అనుభవంతో ఇక్కడ ప్రాక్టీసు చేస్తున్నానని అతడితో ఆ వాడు చెప్పాడు కాని అతడికి వాడి మీద వాడి వైద్యం మీద ఏ మాత్రం నమ్మకం లేదు. పైగా కాల్ చేస్తే ‘తమ్ముడూ’ అంటాడు. ఈ వరసలు కలిపే వాళ్లంటే అతడికి మంట. కాని వేరే గతి లేదు. ‘ఆ.. తమ్ముడూ’ అన్నాడు వాడు. సంగతి చెప్పాడు. ‘ఆ... ఇంకేం సంగతులు... బోండాం శీను ఎలా ఉన్నాడు’ మళ్లీ సంగతి చెప్పాడు. ‘మొన్న ఊరి నుంచి మైసూర్‌పాక్ వస్తే తమ్ముడూ... నిన్నే తలుచుకున్నా’ ‘నాకు మోక్షం లేదా అన్నయ్యా’.. ‘ఎయ్... వదిలెయ్‌రా డౌట్‌ని. ముక్కేంటి మూతేంటి. సరిగ్గా నిద్ర పోతున్నావా? నిద్ర బిళ్ల వాట్సప్ చేస్తా ఒక వారం వేస్కో’ ‘ప్రతిదానికీ పడుకోబెట్టడమేనారా మీ సైకియాట్రిస్ట్‌ల పని’ ‘పడుకుంటే సగం దరిద్రం వదులుతుంది తమ్ముడూ’ ఆ వాడు ఏ మాత్ర రాశాడో అతడు ఏది మింగాడో ఇక నిద్రే నిద్ర. ఆఫీస్‌లో జాయినయ్యి రెండో రోజు మీటింగ్‌లో ఉన్నాననే అనుకున్నాడు. సెక్షన్ అంతా ఇళ్లకెళ్లాక బాయ్ వచ్చి లేపాడు లైట్లు లేకుండా చీకటిగా ఉన్న కాన్ఫరెన్స్ రూమ్‌లో. సీనియర్ ఉద్యోగి అని మర్యాద ఇచ్చినట్టున్నారు. మరుసటిరోజున బాస్ నుంచి ఇంకో వారం దాకా ఇంట్లోనే ఉండి పని చేయ్ అనే మెసేజ్ కూడా వచ్చింది. నిద్రపోయేవాడు వాసన చూడలేడు. అతడూ చూడలేదు. వారం తర్వాత తేన్పులొస్తున్నాయని మజ్జిగ తెచ్చి ఇస్తే గ్లాసు పట్టుకుని అరగంట సేపు వాసన చూస్తూనే కూచున్నాడు. చూసింది... చూసింది... వచ్చి గ్లాసు పెరుక్కొని ఎత్తి నేలకు కొట్టింది. మజ్జిగ ఎగిరి టీవీ మీదా, టీపాయ్ మీదున్న న్యూస్పేపర్ల మీద, అతని ముఖాన పడింది. ఆమె ఏడ్చింది. సాయంత్రం మాస్క్ తగిలించుకుని, ఫోన్ తీసుకొని ‘అలా వెళ్లొస్తా’ అని రోడ్డు మీదకొచ్చి వాడికి కాల్ చేశాడు. ‘ఏమిట్రా ఇదీ తమ్ముడూ’ అన్నాడు వాడు. ‘అరె... నీ ముక్కు ఆల్రైట్గా ఉంది. నువ్వు ఆల్రైట్గా ఉన్నావు. ఎందుకురా నా పని చెడదొబ్బుతావు’ అన్నాడు మళ్లీ. ఏమీ మాట్లాడలేకపోయాడు. ‘అరె.. మనసు కష్టపెట్టుకుంటున్నావు కదా నువ్వు. ఏం మనూరోడివిరా నువ్వు. స్కూల్లో షేర్ నువ్వు... షేర్. ఈ మాత్రం దానికి’... అన్నాడు వాడు. గొంతు పెగల్లేదు. వాడూ ఒక నిమిషం ఊరికే ఉండి– ‘అరె.. ఒకటి చెప్పు. నీ మైండ్ సరిగా ఉండాలంటే దానికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ కాళ్లు చేతులు సరిగా పన్జెయ్యాలంటే వాటికి ఎక్సర్సైజ్ ఉండాలి కదా. నీ పొట్ట సరిగా పని చేయాలంటే నువ్వు మూడుపూట్లా తిని, అరాయించుకుని, తెల్లారి దానికి వెళ్లాలి కదా. నీ ముక్కుకు ఏం ఎక్సర్సైజ్ ఉందో చెప్పూ. ఏం ఇస్తున్నావు దానికి. ఎలా బతికిస్తున్నావు. చచ్చి పడున్నట్టుందిరా అది. ఏ వాసనలూ లేక ఎప్పుడో చచ్చినట్టుందది. నీకు ఇప్పుడు తెలిసింది. అరెయ్.. ముక్కున్నది నీ చచ్చుపుచ్చు బతుక్కి గాలి పీల్చి వదలడానికి కాదు. దయ తలువు దాన్ని. షో సమ్ మెర్సీ. ఏదో వర్డ్ ఉంది... ఆ... ఆఘ్రాణించు... ఆఘ్రాణించు ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. బతుకుతుంది. మళ్లీ ఇందుగ్గాను కాల్ చేయకు. మందేద్దాం అనుకుంటే మాత్రం రా’... పెట్టేశాడు. ఆరవుతున్నట్టుంది. మనుషుల్ని రోడ్ల మీద నుంచి వెళ్లగొట్టే చీకటి దాపురిస్తూ ఉంది. పోలీస్ వెహికల్ ఒకటి సైరన్ మోగిస్తూ కర్ఫ్యూ అవర్స్ మొదలవుతున్నాయని గుర్తు చేస్తూ తిరుగుతూ ఉంది. షార్ట్స్, టీ షర్ట్, స్లిప్పర్స్‌లో చేత ఫోన్ పట్టుకుని కొత్తగా వేసిన పేవ్మెంట్ పక్కన నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉండటం, రోడ్డును అలా తిరిగి చూడగలగడం, ఆకాశం కింద అలా ప్రాణాలతో మిగలగలగడం కొన్నాళ్ల క్రితం అతడు ఊహించలేదు. ఇప్పుడు ప్రాణాలు ఉన్నాయి. జీవమే. ఎవరో ముసలాయన, ముస్లిం టోపీ పెట్టుకుని– పోలీసుల భయంతో తోపుడు బండిని గబగబా తోసుకొని వెళుతున్నాడు దూరంగా. చూస్తున్నాడు ఆ బండివైపు. ఏం పండ్లున్నాయో దాని మీద. బత్తాయిలా... కమలాపండ్లా... సురేశ్ గాడు గుర్తొచ్చాడు. స్కూల్లో ‘మావా... మాటరా’ అని పక్కకు తీసుకెళ్లి, వెనుక మడుచుకుని ఉన్న చేతుల్లో నుంచి టకాలున నారింజ తొక్క తీసి కళ్లల్లోకి పిండేవాడు. అబ్బా రే... ఆ తర్వాత ఆ నారింజ తొక్కను లాక్కుని వాడి కంట్లో పిండేవాడు. ఆ పూటంతా చేతుల్లో నారింజ వాసన. కమ్మటి సువాసన. నవ్వొచ్చింది. ముక్కుకు నారింజ వాసన తగిలింది– అప్పటిది. గట్టిగా గుండెలోకి పీల్చాడు. అప్పటి రసం ఇప్పుడూ పడిందేమో కళ్లు నీళ్లు చిమ్మాయి. ఆ సురేశ్ గాడే వాళ్ల నాన్నది లూనా తెచ్చేవాడు టెన్త్ క్లాస్‌లో. ట్యాంక్ విప్పి ‘చూడ్రా... వాసన భలే ఉంటుంది’ అనేవాడు. లీటరులో సగం డబ్బులు నీవి అని– ఆ సగం ఏనాడూ ఇవ్వకపోయినా లూనా నేర్పించాడు. డబ్బు చేత్తో పట్టుకున్న సురేశ్ గాడి పక్కన పెట్రోల్ బంకులో నిల్చున్నట్టే ఉంది. తెరలు తెరలుగా వాసన తాకుతున్నట్టే ఉంది. ముక్కు ఎగపీల్చాడు. ఫోన్ మోగింది. ‘ఏమయ్యారు’ ‘వచ్చేస్తున్నా.’ ‘ఏమిటి హుషారుగా ఉన్నారు’ ‘ఏం లేదు. ముక్కు. బాగుందిలే’... ఇంటికెళదామా అనిపించింది. ఇల్లు. బాత్రూమ్లో ఫినాయిల్... డెట్టాల్... ఫ్లోర్ తుడిచేప్పుడు లైజాల్... రాత్రి కచ్వా... ఎప్పుడైనా ఆమె వెలిగిస్తే అగరుబత్తి వాసన. ఆ వాసన అతడికి పడదు. ఊళ్లో చిన్నప్పుడు మమత మాంసాహార హోటల్‌కు పెరుగు పార్శిల్‌కు వెళితే కౌంటర్ మీదున్న స్టీల్ స్టాండ్ నుంచి వచ్చే గంధం బత్తి వాసన యిష్టం. ఆ వాసన కోసం ఎన్నిసార్లు ఎన్నిరకాల గంధం బత్తీలు కొని వెతికాడో. ఆ వాసనే వాసన. ప్రయత్నించాడు. దగ్గరగానే ఉంది. గాలిలో తేలి ఆడుతూ మెల్ల మెల్లగా సమీపిస్తూ ఉంది. నాటి బాలుణ్ణి చేస్తూ నీ ముక్కుకు ఏమీ కాలేదులేవోయ్ అంటూ ఉందా అది? కూరకు వెళితే ‘ఇదిగో... ఈ అబ్బాయి మన ఫలానా ఆయన కొడుకు. కాస్త ఎక్కువ కట్టు’ అని హోటలు ఓనరు అంటే, ఇచ్చిన ప్యాకెట్ అందుకుని ఇంటికి వొచ్చాక ఏ అలంకారమూ లేని ఆ అతి మామూలు అరటికాయ కూరలో కూడా ఎంత ఆకలి రేపే సువాసనో! ‘ఏవిటి.. కనీసం కూర వాసన కూడా రాదు ఇంట్లో’ అంటాడు ఎప్పుడైనా. ‘రండి.. ఇలా రండి’ అని పిలుస్తుంది వెంటనే. ‘చూడండి.. ఇది కొత్తిమీరట. వాసన ఉందా? హవ్వ. పుదినాలో కూడా వాసన లేకపోతే నేనేం చేయను. ఇవి ఆలుగడ్డలట. అవి టమేటాలు అట. వాటిదీ ఆకారమే. మనదీ ఆకారమే. తిరగమోతలో వాసన వచ్చి ఎంత కాలమనీ. మినుములు వేయిస్తే గుమ్మెత్తిపోయేది. పాలు పొంగినప్పుడు వచ్చే వాసన నాకిష్టం. ఎక్కడ చూస్తున్నాను నా మొహం. ఒక్క నేతిచుక్క వేసుకుని వేడన్నంలో కలుపుకుని తింటే ఆ అన్నమంతా నెయ్యి వాసన, కడుకున్నాక చేతికి వాసన. ఆ రోజులా ఇవీ. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, దనియాలు వేయించి పక్కింట్లో రోట్లో దంచుతుంటే వాసన మా ఇంటి దాకా వచ్చేది. చారు కాస్తే నాలుగు పెళ్ళల అన్నం మింగేదాన్ని. ఇప్పుడు ఆశించగలమా ఇదంతా. మరువం, దవనాలే వాసనల్లేక వొట్టి పోతే మీరేమిటండీ వాసనలంటారూ’ అంటుంది. కాని ఆ యోగం అతనికి తెలియనిదా? పెదమ్మ ఆంటీ ఇంటికెళితే తెల్లసున్నం వేసిన వీధిగోడల మీద పగిలిపోయిన కుండలను బోర్లేసి మట్టి నింపి పెంచిన మరువం, దవనం దుబ్బుగా ఉండేవి. వాటి దగ్గర నిలబడి చాలాసేపు వాటి సువాసన పొందేది. అది చాలక ప్రతిసారీ పెదమ్మ ఆంటీ ‘ఆ తలేందిరా’ అని నూనె రాసేది. గానుగ నుంచి తెచ్చిన కొబ్బరి నూనెలో రీటా వేసి, బావంచాలు పోసి, సుగంధవేర్లు జారవిడిచి అవన్నీ గాజు సీసాలో లేత ఎరుపులో కనిపిస్తూ ఒక దానికి ఒకటి సువాసన ఇచ్చుకుంటే ఆ నూనె తలకు రాసి, రాశాక ‘చూడు’.. అని రెండు అరిచేతులను ముఖానికి దగ్గరగా తెచ్చేది. అప్పుడు ముక్కు సొట్టలు పడేలా అతడు వాసన పీల్చేది. పెదమ్మ ఆంటీ చేతులు... ఇప్పుడూ దగ్గరగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ సెంటు నూనె వాసన ముక్కు దిగువన ఇప్పుడూ తారాడుతూ ఉంది. ‘చినమ్మ ఆంటీ ఇంటికెళ్తా.. పొయ్యిలో కాల్చి పనసగింజలు పెడుతుంది’ అనేవాడు. ‘ఆ పెడుతుందిలే సంబడం. నేనూ పెడతానుండు’ అని ఆరిపోయిన పొయ్యి ఎగదోసి చిలగడదుంపలు రెండు పడేసేది. చిలగడదుంపలు కాలే వాసన వాటిని తినడానికంటే రుచిగా ఉండేది. అవి తిన్నాక కదిలే పని ఉండదు. కడపు నిండి పెరడు బావి దగ్గర ఆడుకోవడమే. బైక్ వచ్చి ఆగింది. ముందు ఒక పోలీసు, వెనుక ఒక పోలీసు ఉన్నారు. ‘వెళ్లాలి సార్’ చూశాడు. ‘వెళ్తా. ఇక్కడే మా ఇల్లు’ వెళ్లిపోయారు. కాలేజీలో ఉండగా యూనియన్ వాళ్లు పెంచిన కాలేజీ ఫీజులు తగ్గించాలి, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి అని స్ట్రయిక్‌కి పిలుపు ఇస్తే కుర్రాళ్లు పది మంది స్కూళ్లు మూయించడానికి బయలు దేరితే తనూ వెళ్లాడు. ఒక్కో స్కూలు మూయిస్తూ వస్తుంటే ఒక హెడ్మాస్టరు మాత్రం హటం చేశాడు. ఎంత చెప్పినా వినడు. అన్ని క్లాసుల్లోని పిల్లలు గోలగోలగా కిటికీల్లోంచి చూస్తుంటే వెళ్లినవాళ్లు ఎదురు తిరిగి స్లోగన్స్ ఇస్తూ లాంగ్ బెల్ కొట్టేస్తూ ఉంటే పోలీసులు. కంపలకు అడ్డం పడి పరిగెత్తి పడ్డాడు. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళితే, కొత్తనర్సు నేరుగా టింక్చర్ పెట్టబోతే, పెద్దనర్సు తిట్టి స్పిరిట్‌తో కడిగి ఆ తర్వాత టింక్చర్ పెట్టాలి అని స్వయంగా ఆ పని చేస్తూ ‘ఏం స్టూడెంట్సయ్యా మీరంతా’ అని అక్కరగా మందలిస్తూ ఉంటే అప్పుడు వచ్చినదీ ఇప్పుడు వస్తున్నదీ టింక్చర్ వాసనా... ఆమె రాసుకున్న క్యుటికుర వాసనా... ఇంటి వైపు అడుగులు వేశాడు. మాస్క్ కట్టకుండా ఎవరూ లేకపోయినా ఫ్లాట్స్‌లోని అందరూ ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టే అనుభవం ఈ సంవత్సర కాలంలో వచ్చేసింది. లిఫ్ట్ దగ్గర థర్డ్‌ఫ్లోర్ భాస్కర్ నాయుడు ఉన్నారు. డెబ్బై ఉంటాయి. కాని ఏ కర్ఫ్యూ ఆయన్ను ఈవెనింగ్ వాక్కు వెళ్లనీకుండా ఆపదు. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కారు. క్షేమమే కదా అని ఆయన చేత్తో సైగ చేశారు. క్షేమమే అని అతడు సైగ చేశాడు. థర్డ్ ఫ్లోర్లో ఆయన దిగిపోయారు. ఒకసారి ఇలాగే లిఫ్ట్ బయట కలిస్తే, బటన్ నొక్కి వెయిట్ చేస్తూ, మాటల్లో పడ్డారు. చాలా మంచి వాసన వస్తోంది. పోల్చుకోవడం ఎంతసేపూ. అది మట్టి వాసన. ‘ఏమిటి సార్. ఇంత ఎండగా ఉంది. ఎక్కడ వాన పడుతోంది... మట్టి వాసన’ అన్నాడు. ఆయన నవ్వి ‘వాన లేదయ్యా. నా దగ్గరే’ అన్నాడు. ‘మీ దగ్గరా?’ ‘అవును. పుట్టింది పల్లెటూళ్లో. టీచరుగా జీవితాంతం పని చేసి రిటైరైంది పల్లెటూళ్లో. బరెగొడ్లు, పేడ కళ్లాపిలు, గడ్డి మోపులు, నార్లు పైర్లు... వీటి మధ్య బతికా. ఒక్కగానొక్క కొడుకు అని పదేళ్లుగా వీడి దగ్గర ఉన్నా. అబ్బా కష్టమయ్యా ఇక్కడ ఉండటం. మందు వాసన మందుల వాసన తప్ప ఇంకో వాసన రాదు. ఇక తట్టుకోలేక ఈ అత్తరు కొనుక్కున్న. కన్నోజ్ అని ఉత్తరప్రదేశ్‌లో ఊరు. అత్తర్లకు ఫేమస్. వానలు పడే కాలాన ఆ ఊరి నది వొడ్డున సుతారంగా ఏరిన మట్టితో ఈ అత్తరు తయారు చేస్తారు. పాతబస్తీలో దొరుకుతుంది. కాస్ట్లీ. అప్పుడప్పుడు పూసుకుంటా’... ఆకాశం కనికరిస్తే, జల్లు దయగా దిగి నేలను నిమిరితే అణాకాణీ ఖర్చు లేకుండా అందరూ పొదువుకోవాల్సిన మృత్తికా సౌరభం. ఇప్పుడు అతి ఖరీదుగా ఒక లిప్త పాటు జాగృతమై లిఫ్ట్‌లో అతణ్ణి కంపించేలా చేసింది. ఇంట్లోకి వచ్చాడు. ఆమె పరిశీలనగా చూసి సంతృప్తి పడింది. పిల్లలకు కారం లేని ఒక కూర ముందే చేసేసి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికీ వండుతుంది. ‘ఏం వొండను’ అడిగింది. ‘ఏదో ఒకటి. కాస్త ఎండు చేపలు వేయించరాదూ. రేగిపోవాలి’ నొచ్చుకున్నట్టు చూసింది. ‘మానేశాము కదండీ పిల్లలకు వాసన పడట్లేదని. పైగా అపార్ట్మెంట్లో ఆ కంపు రేపుతోంది మనమే. ఎందుకా అప్రదిష్ట. దాచిన కొన్ని ముక్కలుంటే పనమ్మాయికి ఇచ్చేశాను. ఊరికెళ్లినప్పుడు ఇక మీ అమ్మ దగ్గరే ఆ ముచ్చట’ శ్వాస– ఒక నిమిషం దిగ్బంధనం అయినట్టు అనిపించింది. అమ్మ గొంతు దాపున దూరాన వినిపించినట్టయ్యింది. అమ్మ గొంతు. దానిది కదా అసలైన వాసన. ‘ఒరేయ్ మేధావి’ అని పిలిచేది అమ్మ బుక్స్ చదువుకుంటూ ఉంటాడని. తిక్కపనులు చేస్తే ‘ఒరే మేతావి’ అని నవ్వేది. చిన్నప్పుడూ ఇప్పుడూ పలుచగా ఉంటుంది అమ్మ. చిన్నప్పుడూ ఇప్పుడూ మెత్తగా మాట్లాడుతుంది అమ్మ. ‘నాన్న జేబులో చిల్లరుంటుంది. తీసుకొని కొనుక్కోరా’ అనేది. ‘నాన్న జేబులో చేయి పెట్టను. రాలిన సిగరెట్ పొడి చేతికంటుకుంటుంది. వాసన’ అనేవాడు. ఆమే వచ్చి తీసి ఇచ్చేది. అమ్మ దగ్గరే ఉండేవాడు ఎప్పుడూ. ఆమె రవిక చంకల దగ్గర చెమట పట్టి– ఉండ్రా స్నానం చేయలేదు అన్నా పర్లేదులే అని పక్కన నులక మంచం మీద ఎగిరి కూచునేవాడు. ఆదివారాలు అన్నాలు తిన్నాక ఆడుకోవడానికి ఎవరూ రాని మధ్యాహ్న వేళలో ఆమె పక్కన పడుకుని కొంగు ముఖాన వేసుకుని ఏవో ఊహలు గొణుక్కునేవాడు. ‘పెద్దయ్యాక నీకేం కావాలన్నా కొనిస్తాను చూడు’ ‘నాకేం వద్దులేరా మేధావీ. నువ్వు పక్కనుండు చాలు’ ‘ఊహూ. కొనివ్వాల్సిందే’ అమ్మ ఎప్పుడూ నాన్నను ఏదీ అడిగేది కాదు. నాన్నే ఒకసారి ఆమెకని ప్రత్యేకం సింథాల్ సబ్బు తెచ్చి పెట్టాడు. నాలుగు భుజాల దీర్ఘ చతురస్రాకార ఎర్రఅట్ట సబ్బు. అమ్మ ఆ రోజు చాలాసేపు స్నానం చేసింది. చలువ చీర కట్టుకుని ‘రా’ అని నవ్వుతూ దగ్గర తీసుకుంది. చుబుకం కింద తల వొచ్చేలా పట్టుకోవడం ఆమెకు ఇష్టం. ఇప్పుడూ పట్టుకున్నట్టయ్యి ఆ స్పర్శది కదా అసలైన వాసన అనిపించింది. ‘ఏమిటండీ అలా అయిపోయారు’ అంది. ‘ఏం లేదు.. ఏం లేదులే’ అని గదిలోకి వచ్చాడు. డోర్ వేసుకున్నాడు. పచార్లు చేశాడు. హటాత్తుగా ఏదో అర్థమైంది. హటాత్తుగా ఏం అర్థమైందో. ఫోన్ తీసి వాడికి వాట్సప్ చేశాడు. ‘ఊరెళుతున్నా అమ్మను చూడ్డానికి. వచ్చాక మందేద్దాం’.. రెండు నిమిషాలకు బ్లూటిక్ పడి రెస్పాండ్ అయ్యాడు. ‘ఓ.. అదీ సంగతి. ఈ సంవత్సరంగా లాక్డౌన్ల రభసతో ఆమెను మిస్సయ్యి నా ప్రాణాలు తీశావు.’ ‘లేదురా. నా పెళ్లయ్యినప్పటి నుంచి ఆమె ఊళ్లోనే ఉంది’ ‘ఓ... సిటీలో ఉండలేదని అక్కడ పెట్టుంటావ్’ ‘లేదురా. ఆమెకు నా దగ్గర ఉండటమే ఇష్టం’... బ్లూటిక్ పడింది. రెస్పాండ్ కాలేదు. నిమిషం తర్వాత– ‘నీ భార్య మంచి కత్తి కేండేటా’... టైమ్ తీసుకున్నాడు. ‘ఇద్దరూ చేసే తప్పుల్రా ఇవి. ఒక్కరు గట్టిగా నిలబడినా చెడు జరగదేమోగాని మంచి జరుగుతుంది’ బ్లూ టిక్ పడింది. వెయిట్ చేశాడు. వాడు ఇక మాట్లాడేలా లేడు. బయటకు వచ్చాడు. పిల్లలు టీవీ చూస్తున్నారు. ఆమె వంట గదిలో కూర ఎక్కిస్తూ ఉంది. వెళ్లాడు. ‘ఉదయాన్నే అమ్మ దగ్గరకు వెళుతున్నా. కారులో. వచ్చేస్తా రెండు రోజుల్లో’ తిరిగి చూసింది. ఏమనుకుందో. ‘సరే’ ‘ఇంకో రెండ్రోజులు ఎక్కువున్నా విసిగించకు. తీసుకొస్తానేమో తెలియదు. ఇంకేం ఆలోచిస్తానో. మనం నిజంగా హ్యాపీగా ఉండటం మనకు అవసరమా కాదా’... అతని కళ్లల్లోకి ఆమె చూస్తోంది. అతనివి అలాంటి కళ్లు ఆమె ఎప్పుడూ చూళ్లేదు. ‘స్వామీ... ఇక వదిలిపెట్టండి’ ‘సరే’ రూమ్‌లోకి వచ్చాడు. బ్యాగ్ సర్దుకున్నాడు. త్వరగా భోం చేశాడు. ఐదు గంటలకు అలారం పెట్టుకున్నాడు. దారిలో డజను సింథాల్ సబ్బులు – నాలుగు పలకల ఎర్ర అట్టవి– తప్పక కొనాలని నిశ్చయించుకున్నాడు. మంచం మీద తల వాల్చాడు. నిద్ర పడుతుంటే సబ్బు వాసన అతణ్ణి తాకుతున్నట్టు అనిపించింది. అమ్మ వాసన కూడా. బహుశా అతడి ముక్కు అతణ్ణి క్షమించేసింది. -మహమ్మద్ ఖదీర్‌బాబు -
ఖదీర్‌బాబు, సుజాతాదేవికి పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం
విజయవాడ కల్చరల్: కథా రచయిత మహ్మద్ ఖదీర్‌బాబు, రచయిత్రి డి.సుజాతాదేవిని 2017 సంవత్సరానికి పెద్దిభొట్ల సుబ్బరామయ్య సాహిత్య స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు పురస్కారాల నిర్వాహకులు, కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి తెలిపారు. వారు శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఐదు సంవత్సరాలుగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు. ఖదీర్‌బాబు సామాన్యుని జీవితాలే కథా వస్తువులుగా అనేక కథలు రాశారని, కథా సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారని వివరించారు. ఖదీర్తోపాటు బాల సాహిత్యంలో విశేష కృషి చేసిన డి.సుజాతాదేవిని పురస్కారానికి సంయుక్తంగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ నెల 13న సాయంత్రం విజయవాడలోని ‘ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ’లో పురస్కారాల సభ జరుగుతుందని వివరించారు. ముఖ్య అతిథిగా కథా రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, అప్పాజోస్యుల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
కథ కథా వాన వాన
మాస్టర్స్ ఎప్పుడూ మాస్టర్సే. రావిశాస్త్రి ‘వర్షం’ తెలుగు పాఠకుడు దర్శించిన అత్యుత్తమ కథల్లో ఒకటి. చిన్నవాటికీ చితకవాటికీ భయపడుతూ జీవితంలో దేనికీ తెగించలేని స్థితికి చేరుకున్న ఒక యువకుడు ఒక వాన సాయంత్రం ఒక దుకాణం తాత నిష్టూరపు ప్రోత్సాహంతో శక్తి తెచ్చుకొని ధీరుడిగా మారే కథ. ఏం కథ ఏం కథ. ఏం వర్షం ఏం వర్షం ఆ కథలో. అయితే అటు నెల్లూరు దాకా అయినా పడుతుంది. లేదా ఇటు ఒంగోలు దాకా పడుతుంది. మేఘాలు ముసురుకున్నాయట. కుండపోత అట. వస్తుంది వస్తుంది అనుకుంటే ఏది? రాదు. కావలిలో వాన పడాలంటే తుఫాన్ రావాలి. ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో వాయుగుండం పడిందనే వార్త రేడియోలో విని ఆనందంగా చూడాల్సిన వానను భయం భయంగా చూసిన అనుభవమే అంతా. ధారగా కురిసే వాన... ముసురు స్థిరంగా నిలబడి చీకటిని నిలిపి ఉంచే వాన... అల్లా పుస్తకాల్లో చెప్పినట్టుగా కిటికీలో నుంచి వానను చూస్తూ పకోడీలు వేయించుకుని తినే వాన ఎరగను. ఆ అసంతృప్తి ఏదో ఉండిపోయినట్టుగా ఉంది. కథల్లోకి వచ్చాక కథల చదువు కొనసాగిస్తూ ఉండగా ఒకసారి ‘గాలి వాన’ కథ తటస్థించింది. అబ్బ. ఏం వాన. ఇనుముతో దృఢంగా చేసిన రైలుపెట్టెలను కూడా ఊపి ఊపి వదిలిన వాన. స్టేషన్‌ను పెళ్లగించిన వాన. మానవుడు తయారు చేసినవి ప్రకృతి తయారు చేసినవి అన్నింటినీ తుడిచి పెట్టిన వాన. మనిషి కృత్రిమంగా తయారు చేసుకున్న సిద్ధాంతాలు, విలువలు, పైపైని పటాటోపాలు తన ముందు క్షణమాత్రం కూడా నిలువవు అని నిరూపించిన వాన అది. ఆ వాన నా బాల్యపు వెలితిని తీర్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర రాసిన ‘అతడి పేరు మనిషి’ కథ చదివాను. చిత్తూరు జిల్లాలో ఒక నిరాడంబరమైన పల్లె మీద ఊరి చివరి గుడిసెలో వానలో చిక్కుకుపోయిన ఒక డబ్బున్న పిల్లను ఒక స్వచ్ఛమైన పల్లె యువకుడు ఎలా కాపాడుకున్నాడో చెప్పిన కథ అది. ఆ యువకుడికి దక్కిన ఫలితం? వరండాలో కుక్కతో సమానంగా భోజనం పెట్టడం. నన్ను కలిచి వేసిన వాన అది. రావిశాస్త్రి వర్షం వర్షం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కథను మింగివేసే సిమిలీలను ఎక్కువ ఉపయోగిస్తాడని అభ్యంతరం ఉండి చదువుదాములే చదువుదాములే అనుకుంటూ ఉండిన ఆ కథ ఏదో మేగజీన్‌లో పునర్ముద్రణ పొందితే చదివాను. లెంపలు వేసుకోవడం బాకీ. మాస్టర్స్ ఎప్పుడూ మాస్టర్సే. ‘వర్షం’ తెలుగు పాఠకుడు దర్శించిన అత్యుత్తమ కథల్లో ఒకటి. చిన్నప్పటి నుంచి చిన్నవాటికీ చితకవాటికీ భయపడుతూ జీవితంలో దేనికీ తెగించలేని స్థితికి చేరుకున్న ఒక యువకుడు ఒక వాన సాయంత్రం ఒక దుకాణం తాత నిష్టూరపు ప్రోత్సాహంతో శక్తి తెచ్చుకొని ధీరుడిగా మారే కథ అది. ఏం కథ ఏం కథ. ఏం వర్షం ఏం వర్షం ఆ కథలో. అద్దేపల్లి ప్రభు రాసిన ‘అతడి పేరు మనిషి’ కూడా నన్ను నిలువెల్లా తడిపేసింది చదివినప్పుడు. గోదావరి నది మీద ఆ కథలో కురిసినంత గాఢమైన వర్షం మరే కథలోనూ లేదు. ఆ వానలో మనం నది అంచున నిలువెల్లా తడిసి గడగడ వణుకుతూ కూడా ఉంటాం. ఇవన్నీ మనసులో ఉండి పోయాయి. వీటిని పుస్తకంగా తెస్తే బాగుండుననే కోరిక ఉండిపోయింది. తిరుపతిలో తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు అక్కడకు వచ్చిన తానా జంపాల చౌదరిగారికి ఈ విషయం చెప్పాను. ఆయన చెవిన వేసుకోలేదు. నా వాన కురవనే లేదు. తుదకు ఛాయా సంస్థ కృష్ణమోహన్ చెప్పిందే తడవు తడవడానికి సిద్ధమవడంతో ఈ కథల వాన ఇలా సాధ్యం కాగలిగింది. తెలుగులో వచ్చిన వాన కథలను సేకరించడానికి తువ్వాలు నెత్తిన కప్పుకున్నప్పుడు ఎన్నో వానల గుండా ప్రయాణించాల్సి వచ్చింది. తెలుగు కథ చిరపుంజీ వలే వాన కథలతో సమృద్ధిగా ఉందని అనిపించింది. తెలుగులో కనీసం వంద వాన కథలు ఉన్నాయి. వాటిలో చిరు జల్లులు పొడిజల్లులు పోను కనీసం ముప్పై నలబై కుండపోతలు ఉన్నాయి. ఏ సంకలనానికైనా ఒక హద్దు ఉంటుంది. నా సంకలనం 20 కథలను భరించగలిగింది. అదృష్టం ఏమిటంటే కళింగాంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ... ఈ జీవమృత్తికలన్నింటినీ తడిపిన వాన ఈ సంకలనంలోని పుటలను ముంచెత్తగలగడం. కృష్ణానది, గోదావరి నది మీద కురిసిన వాన సరే మనకున్న అతి పెద్ద సరస్సు ప్రళయ కావేరి (పులికాట్) సరస్సుపై కురిసిన వాన కూడా స.వెం. రమేశ్ రాసిన ‘ఉత్తరపొద్దు’ కథ ద్వారా సంభవించడం. తెలంగాణ కథలను వెతుకుతున్నప్పుడు అక్కడ కురిసిన వాన వెట్టిచాకిరీ చేసేవారితో కలిసి భోరున విలపించడం బి.ఎస్.రాములు ‘పాలు’ కథలో, ఎ.ఎం.అయోధ్యారెడ్డి రాసిన ‘గాలివాన’ కథలో గమనించాను. అదే వాన రైతు పట్ల దయతో ఉండటం గంగుల నరసింహారెడ్డి ‘వాన కురిసింది’లో చూసి సంతోషపడ్డాను. హైదరాబాద్ నగరం నాలుగు వందల ఏళ్లుగా ఉంది. ఎంతమంది అక్కడ కురిసే వానకు అత్తరు ఖుష్బూ అద్దగలిగారు? పూడూరి రాజిరెడ్డి ‘నగరంలో వాన’ కథతో కట్టడాన్ని వదిలి నగిషీని చూపినట్టు చూపినా నగిషీ అందం నగిషీదే కదా. కాని దుఃఖమంతా మాత్రం రాయలసీమదే. వద్దురా తండ్రీ. ఎన్ని కథలు చదివినా అక్కడి కథకులందరిది ఒకటే కల. వాన కల. అందరూ కలలో వానను చూసేవారే తప్ప నిజంగా వాన చూసినవారు లేరు. వాన కోసం అణువణువూ సాగే ఈ అన్వేషణ మాసిన గడ్డపు ఎదురు చూపు దీని వెనుక ఎండకు మండే వేదన వీటన్నింటి ప్రతీకగా ప్రతినిధిగా బండి నారాయణ స్వామి ‘వాన రాలే’ కథ ఉంది. జగన్నాథ శర్మ ‘పేగు కాలిన వాసన’, గుమ్మా ప్రసన్న కుమార్ ‘ముసురు పట్టిన రాత్రి’ ఒకే మధ్యతరగతి నిస్సహాయతకు రెండు ముఖాలను చూపి గాఢమైన ముసురును పాఠకులలో నింపుతాయి. అట్లాంటి ఇళ్లలో ఎందుచేతనో ఈడొచ్చిన ఆడపిల్లలు సుడిగుండాల్లో ఈదుతుంటారు. ఇక కుప్పిలి పద్మను. తూర్పు తీరం అంత పెద్దతుఫానులో చెదరక బెదరక మగవాడి సమక్షంలో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న యువతిని ‘గోడ’ కథలో ఆమె చాలా తీక్షణమైన నిశ్చయంతో చూపిస్తుంది. ప్రతి మగవాడికీ భయమేస్తుంది. విశేషం– వాన కోసం పశుపక్ష్యాదుల పలవరింతను అజయ్ ప్రసాద్ ‘మృగశిర’గా రాయడం. అంతకంటే విశేషం జీవితంలోని ఆశను కాగితపు పడవతో పోలుస్తూ వర్షపు నీటిలో అలాంటి పడవతో ప్రయాణించాలనుకునే మనిషిని కె.శ్రీకాంత్ ‘నిశ్శబ్దపు పాట’లో చూపడం. వాన కథల్లో దాదాపు మొదటి కథ శారద (నటరాజన్) రాసిన ‘అదృష్టహీనుడు’ (1950) దొరకడం. ప్రియ కథకుడు తిలక్ ‘ఊరి చివరి ఇల్లు’తో ఈ సంకలనానికి నాలుగు పదున్ల వానను జత పరచడం. మరేమిటి? పుస్తకం ధన్యమైంది. వానలో తడిశాక మనం మొలకెత్తడమే మిగిలింది. పాత విశ్వాసాలను కడిగేసి కొత్త నమ్మకాలకు పాదు చేసుకోవడమే మిగిలింది. ఆ పనికి ఈ సంకలనం ప్రోత్సహిస్తుంది. అయితే తెలుగు కథ ఇంకా చాలా వానలకు బాకీ ఉంది. ఆశల్లా కొత్త కథకులు ఆ వాన దారుల్లో నడుస్తారనీ ఆ ధారలను కథలుగా ధారపోస్తారనీ ఇలాంటి సంకలనాలు మరిన్ని వస్తాయనీ. అదిగో వాన. మేఘాలలో రథం పరిగెడుతోంది. అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ... వాన విల్లును ధరించిన తెలుగు కథకుడి ఎదుట ఛాతీ నిలుపుదాం పదండి. (వ్యాసకర్త సంపాదకుడిగా ఇటీవల ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సంకలనం వచ్చింది. ప్రచురణ: ఛాయా రిసోర్సెస్ సెంటర్.) మహమ్మద్ ఖదీర్‌బాబు 9701332807 -
కథ తెలుస్తూనే ఉంటుంది..
పాఠకుడితో సంభాషణ బొమ్మలు వేసేటప్పుడు వేళ్లు కదల్చాలా? మణికట్టు కదల్చాలా? కొత్తగా బొమ్మలు వేసేవాళ్లకూ చాలా ఏళ్లుగా బొమ్మలు వేసేవాళ్లకు కూడా ఈ సందేహం ఉంటుందట. మరి కొత్తగా కథలు రాసేవాళ్లకు? మపాసా ఒక కథ రాశాడు. అందులో ఒక అమాంబాపతు రైతు. అతనికి ఒక ముసలితల్లి. జబ్బు పడుతుంది. గుటుక్కుమంటే వేరే సంగతి. కాని మంచాన పడితే? పోయేలా ఉంది. ఎప్పుడు పోతుందో తెలీదు. తనేమో పొలానికి వెళ్లాలి. చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేరు. ఊళ్లో ఒక దాదీ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళితే రోజుకు రూపాయి అడుగుతుంది. రోజుకు రూపాయా? రేపో మాపో పోయేలా ఉంది కదా... అందుకని రైతు పోయేదాకా చూసుకో ఏడు రూపాయలు ఇస్తా. ఇవాళ పోయినా ఏడు రూపాయలే, పది రోజుల తర్వాత పోయినా ఏడు రూపాయలే అంటాడు. దాదీ వచ్చి ముసలిదాని వాలకం చూస్తుంది. మూడ్రోజులకు మించి ఉండదు. సరే అంటుంది. ఒక రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మారుతుంది. ఈ రాత్రికే అన్నట్టు ఉంటుంది. రైతుకు బాధ. అయ్యో ఈ రాత్రికే పోతే అనవసరంగా దాదీకి ఏడు రూపాయలు ఇవ్వాలే. మరో రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మళ్లీ మారుతుంది. ఒక నెలైనా బతికేలా ఉంది. దాదీకి బాధ. నెల రోజులు బతికితే వచ్చేది ఏడు రూపాయలా? ఏమీ తోచదు. సరే చేసేదేముంది అని ఆ రోజు రాత్రి దీపాలన్నీ ఆర్పేసి చేతిలో చీపురు, నెత్తి మీద చేట పెట్టుకొని నాలుక బయటపెట్టి వికృతమైన ఆకారం ధరించి హఠాత్తుగా ముసలిదాని ముందుకు వస్తుంది. దయ్యం కనపడితే ఎవరు బతుకుతారు? ముసల్ది పుటుక్కుమంటుంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని సిద్ధాంతపరంగా నిరూపించడానికి ఎన్ని వందల పేజీలు రాయాలో తెలియదు. మపాసా మాత్రం ఒక ఐదారు పేజీల్లో ఈ కథలో చెప్పేశాడు. ఈ విద్య అతనికి ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్తే కొన్ని తెలుస్తాయా? కథ రాసేవాళ్లు ఏవైనా సరే ఎవరి దగ్గరైనా సరే కొన్ని నేర్చుకోవాలా? అవసరమేనా? కథ రాసి ఎలా ఉందో చెప్పమని వేమన వసంతలక్ష్మి, చూపు కాత్యాయని, ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఎం.రాజేంద్ర, శ్రీరమణ, అనంత్, జంపాల చౌదరి వంటి మిత్రులకు చూపుతుండేవాణ్ణి. బాగుందో బాగలేదో చెప్తుండేవారు. దర్గామిట్ట కతలు రాసేటప్పుడు కథల నిండా కథల మధ్యలో బ్రాకెట్లు పెట్టి కొన్ని వివరాలు ఇస్తుండేవాణ్ణి. సాధారణంగా శ్రీరమణ సలహాలు ఇవ్వరు. కాని నా మీద దయతలచి ‘అలా బ్రాకెట్లు పాఠకులకు ఇబ్బంది అండీ’ అన్నారు. అంతే. ఇప్పటి వరకూ కథల మధ్యలో బ్రాకెట్లు వాడలేదు. నామిని నా ‘జమీన్’ కథను చదివి మధ్యలో మూడు చుక్కలు ( ) పెట్టి బ్రేక్ ఎందుకు చేస్తున్నావు? అది బ్యాడ్ నెరేషన్. జానపదులు ఓరల్ ట్రెడిషన్‌లో మధ్యలో మూడు చుక్కలు అని ఆపుతారా? ఆపరు కదా? కంటిన్యూగా కథ చెప్పలేవా? అని సలహా ఇచ్చాడు. నా ‘కింద నేల ఉంది’ 32 పేజీల కథ. ఒక్క బ్రేక్ లేకుండా కంటిన్యూగా కథ చెప్పాను. అంతే కాదు ఎంత పెద్ద కథనైనా ‘మూడు చుక్కల బ్రేక్’ లేకుండా చెప్పడం సాధన చేస్తున్నాను. ఎవరో ఒకరు కొన్ని చెప్పాలి. కొన్ని మనకు మనమే నేర్చుకోవాలి. అందుకు మార్గం ఏమైనా ఉందా? కార్మికుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రైతుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. అభివృద్ధి చేస్తున్న విధ్వంసక రూపాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రాశాం. రాస్తున్నాం. కాని కొంచెం మార్చవచ్చు కదా. వేరేది రాయవచ్చు కదా. ‘బస్ట్ సైజ్ ఫొటో’... ఇది ఒక సంస్కారం. మనిషిని అంత వరకే చూసి రాయడం లోకం మెచ్చిన సంస్కారం. కాని ఆ బస్ట్ కింద ఉండే చీకట్లను, జ్వాలలను, తాపాలను, తెప్పరింతలను, కటి ప్రాంతం ఈడ్చుకుంటూ వెళితే ఒంటి మీద పడే చెక్కుళ్లను లోకంలో చాలా మంది రాశారు. ఆల్బెర్టో మొరావియా, హెన్రి మిల్లర్, డి హెచ్ లారెన్స్, మంటో, ఇస్మత్ చుగ్తాయ్, కమలా దాస్, చలం... ‘అయ్యో.. పూర్వం మనం బాగానే మాట్లాడుకున్నామండీ... ఈ విక్టోరియన్ మొరాలిటీ తగలడ్డాకే ఇలా తయారయ్యాం’ అనేవాళ్లు ఉన్నారు... అయితే కొంచెం ప్రయత్నించి ‘బియాండ్ కాఫీ’ అని పది కథలు రాశాను. కొంచెం విమర్శ వస్తుంది. ఉక్కిరిబిక్కిరి వస్తుంది. అది ‘అంగీకారం’ పొందే వరకూ ఎలా తట్టుకొని నిలబడాలి? కొత్తదారిని ఎలా కనుగొనాలి? ఆ దారిన ఎదురుదెబ్బకు ఏ మందును పట్టుకొని నడవాలి? ఒక్కోసారి కథ తెలుస్తూ ఉంటుంది. దానికి పాత్రలు వెతుక్కోవాలి. ఎలా? ఒక్కోసారి ఒక బ్రహ్మాండమైన పాత్ర కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. దానికి కథను వెతుక్కోవాలి. అదీ ఎలా? ఒక్కోసారి కథంతా పూర్తయిపోతుంది. దానికో పేరు ఎంతకీ తెమలదు. సరైన పేరు ఎలా పెట్టాలి? ఒక్కోసారి కథంతా ముక్కలు ముక్కలుగా గోచరమవుతూ ఉంటుంది. ఏ ముక్క మొదట రాయాలి... ఏ ముక్క చివర అమర్చాలి? నిడివి పెరుగుతూ పోతే దోషమా? మరీ క్లుప్తంగా వచ్చేసిందే... లోపమా? ఓ కథాదేవేరీ... నీవెప్పుడు నా పక్కన సుఖాశీనురాలివి అవుతావు? నా వక్షాన ఎప్పుడు శాశ్వత ప్రతిష్టితమవుతావు? నిదుర రాదు. రాసేటప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది. ఇంట్లో వారికి ప్రవర్తన అర్థం కాదు. ట్రాఫిక్‌లో ఎవడో మన పరధ్యానానికి బండబూతులు తిడతాడు. ఆఫీస్‌లో పని తెమలదు. ఆ సాయంత్రం స్నేహితుల సాంగత్యం రుచించదు. కథ వెంట పడుతుంది. కథే ముద్ద మింగకుండా మన గొంతుకు అడ్డం కూచుంటుంది. పారిపోవాలనిపిస్తుంది. కాని కథ ముగిస్తేనే విడుదల పత్రం దొరుకుతుంది. ఈ జంజాటం జీవితాంతం ఉంటుంది. ఈ ప్రయాణానికి మనకేం తోడు కావాలి? కథ ఎప్పటికీ తెలిసిపోదు. అసలు సంపూర్తిగా తెలిసిపోయేదేదీ విద్య కాదు. అది తెలుస్తూ ఉంటుంది. అరె... నా అనుభవం ఇది... నీ ప్రయాస ఇదా... నేను ఇలా చేశాను... నువ్వు ఎలా చేస్తున్నావు.... డిగ్రీలు అమెరికాకు టికెట్టు కొనుక్కోమంటుంటాయ్. బయట రియల్ ఎస్టేట్ హోర్డింగ్స్ పిలుస్తుంటాయ్. టీవీల్లో చెత్త. సినిమాల్లో బురద. సరిగ్గా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టలేవు, ఈ కథను పట్టుకుని ఎందుకురా ఊగులాడుతున్నావ్ అని మధ్య మధ్య విసుగు వస్తూ ఉంటుంది. కాని- వదల్లేం. చేయి విదిలించుకోలేం. కథకు మనం తగిలాం. కథ మనల్ని దొరకబుచ్చుకుంది. దానిని తెలుసుకుంటూ దానికి మనల్ని తెలియచేసుకుంటూ ఈ మధురబాధాయానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. నాకు కొంత తెలిసింది. చెప్పేశాను. ఇక మీ వంతు. - మహమ్మద్ ఖదీర్‌బాబు 9705444243 -
ఒక కథ... రెండు బాధ్యతలు
'90ల కాలం ఉద్యమాలు పూసిన కాలం. కథకులు వేయి రేకలుగా వికసించిన కాలం. ఆ ఉమ్మడిరోజుల తీరికలేనితనంలో చాలామంది తెలుగు కథకుల కృషి సరైన గుర్తింపుకు నోచుకోలేదు. కళింగాంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ... ఈ నాలుగు ప్రాంతాలను కాళ్లు చేతులుగా ధరించిన తెలుగు రాష్ట్రంలో తెలుగు కథ కొత్తగా తల ఎత్తవలసి ఉన్నది. తల లేని తన నేలకు కొత్తగా తల ఇవ్వాల్సిన బాధ్యత దానికి ఉన్నది. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలుగు కథకు రెండు దారులు ఎదురుగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటానికీ ఆకాంక్షలకూ వెన్నుదన్నుగా నిలిచిన తెలంగాణ కథ ఆ రాష్ట్ర ఆవిర్భావంతో సఫలీకృతం అయ్యింది. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రజాస్వామిక రచయిత తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరడం పట్ల ఆనందం, హర్షం వ్యక్తం చేస్తాడు. చేశాడు. తెలంగాణ కథది విజయం సాధించిన ఉత్సాహం. దాని బాధ్యత సరిగ్గా లేని గీతలను సరి చేయడం. నవ నిర్మాణంలో చురుగ్గా పాల్గొనడం. గతంలో జరిగిన- ఉమ్మడి రోజులలో విస్మరణకు గురైన- తన కథలను కథారచయితలను తిరిగి నిలబెట్టుకోవడం. ఇప్పటికే నిలబెట్టుకున్నవారి కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేయడం. నవరాష్ట్రం పోకడలను నిశితంగా పరిశీలిస్తూ కొత్త అధికార దొంతరలను గమనిస్తూ ఈ పరిణామాలలో సామాజిక న్యాయం కోసం బాధ్యతగా మెలగనుండటం. అంతేకాక బహుశా దాని ఎదుట చాలా పనులే ఉన్నాయి. కథ విషయంలో భండారు అచ్చమాంబ, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి, నెల్లూరు కేశవస్వామి, ఇల్లిందల సరస్వతీ దేవి, గూడూరి సీతారాం... తదితర వైతాళికులను ప్రతిష్టించుకోవడం... పునఃప్రతిష్టించుకోవడం.... నిన్న మొన్న వరకూ అందుబాటులో లేకపోయిన భాస్కరభట్ల కృష్ణారావు వంటి అనేకమంది గొప్ప రచయితల రచనలు వెలికి తీయడం... ముఖ్యంగా మూడో తరం నాలుగోతరంలో రాసిలోగాని వాసిలోగాని ఇతర ఏ భారతీయ రచయితకూ తీసిపోని విధంగా కృషి చేసిన పి.యశోదా రెడ్డి, అల్లం రాజయ్య, నవీన్, తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, కాలువ మల్లయ్య, బి.ఎస్.రాములు, బోయ జంగయ్య, ఆడెపు లక్ష్మీపతి, ముదిగంటి సుజాతారెడ్డి, ఐతా చంద్రయ్య, జాతశ్రీ, శిరంశెట్టి కాంతారావు, రామా చంద్రమౌళి తదితర రచయితల కృషిని సేవనూ విస్తృతంగా చర్చించి గౌరవించుకోవడం.... అలాగే గురి తప్పక కథను సాధన చేస్తున్న పెద్దింటి అశోక్ కుమార్, బెజ్జారపు రవీందర్, వినోద్ కుమార్, కె.వి.నరేందర్, అఫ్సర్ వంటి సీనియర్ కథకుల కృషినీ.... ఈతరం కథకులలో చురుగ్గా ఉన్న భగవంతం, జాజుల గౌరి, కరుణ, జూపాక సుభద్ర, స్కైబాబా, షాజహానా, విమల, పసునూరి రవీందర్... తదితరుల కథా ప్రయాణాన్ని ప్రశంసించడం ప్రోత్సహించడం... ఇవిగాక విప్లవ కథ, ఉద్యమ కథ, ఉర్దూ కథ... వీటి అవలోకనాలు పరిచయాలూ అదంతా ఒక ఉత్సవ సౌరభం. అయితే మరోవైపు తెలుగు కథ పరిస్థితి సులువుగా లేదు. తెలుగు ప్రజలు కొత్త భావోద్వేగాలతో సతమతం అవుతున్నారు. ఊహించి కొంత ఊహించక కొంత ఆశించి కొంత భంగపడి కొంత ఏర్పడిన కొత్త రాష్ట్రాన్ని స్వీకరించి ముందుకు సాగడానికి సిద్ధమవుతున్నారు. వారికి కనిపిస్తున్న శకునాలు కూడా సంతోషాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ఎక్కే గడప దిగే గడపగా ఉన్నాడు. పత్రికలు రాజధాని కడుతున్నాం చందాలివ్వండి అని చేతులు సాచి నిలబడు తున్నాయి. ఉద్యోగుల రోదనలేవో దూరం నుంచి వినిపిస్తున్నాయి. నిరుద్యోగ కుర్రాళ్లు పరాయి రాజధానిలో దిక్కులు చూస్తూ నిలబడి ఉన్నారు. వీటన్నింటి నడుమ తెలుగు కథ తన దారిని వెతుక్కోవలసి ఉన్నది. కళింగాంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ... ఈ నాలుగు ప్రాంతాలను కాళ్లు చేతులుగా ధరించిన తెలుగు రాష్ట్రంలో తెలుగు కథ కొత్తగా తల ఎత్తవలసి ఉన్నది. తల లేని తన నేలకు కొత్తగా తల ఇవ్వాల్సిన బాధ్యత దానికి ఉన్నది. చెత్తకుప్పలో పారవేయబడ్డ శిశువు దీనాలాపన దాని ముందు అనివార్యంగా ఉన్న తాజా కథావస్తువు. వాస్తవానికి తెలుగు కథ ఈ పరిణామాన్ని ఊహించి అందుకు సిద్ధంగా లేదు. ఆ మాటకొస్తే నేను తెలంగాణ, నేను తెలుగు ఇలాంటి ‘సంకుచిత అస్తిత్వాన్ని’ స్వీకరించకుండా విశ్వ మానవునికి ప్రతినిధిగా ఉండటానికే కథకులు ఇష్టపడతారు. అయితే కొన్ని సమయాల్లో నిర్దిష్టంగా ఉంటూ మాట్లాడటం కూడా విశ్వమానవుడి గురించి మాట్లాడటమే అవుతుంది. నువ్వేమిటో నీవు గుర్తించుకో నిరాకరించినా ఎదుటివారు గుర్తించే పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాని తెలుగు రాష్ట్రంలోగాని ప్రస్తుతం ఇదే పరిస్థితి. అందువల్ల కూడా తెలుగు కథ తన కొత్త రాష్ట్రాన్ని పాత పరంపరని తిరిగి అసెర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడినది. దానికి ఎల్లలూ హద్దులూ గుర్తు చేయడం వల్ల ఆ ఎల్లలూ హద్దులకూ లోబడే ఈ సందర్భంలో తన పెద్దలందరినీ ఒకసారి స్మరణకు తెచ్చుకొని మహోత్సాహంతో ముందుకు కదలనున్నది. తలచుకుంటే తెలుగు కథది ఎంతటి ఘన పరంపర. తెలుగు కథకులది ఎంతటి ఆత్మగౌరవం. గురజాడ మా ఆది ఆధునిక కథకుడు. శ్రీపాద మా పలుకు. రావిశాస్త్రి మా దిశ. చలం మా ధిక్కారం. కొ.కు మా మేధ. బుచ్చిబాబు మా సౌందర్యం. చా.సో మా శిల్పం. రంగనాయకమ్మ మా అభ్యుదయం. పతంజలి మా వ్యంగ్యం. మధురాంతకం రాజారాం మా మధ్యతరగతి ఆత్మ. ఇనాక్ మా వెలికేక.... గడిచిపోయిన ఆ కాలాన్నంతా మరోసారి గుర్తుకు తెచ్చుకొని ఆ వైతాళికులకు కొత్త కైమోడ్పులు అర్పించాల్సి ఉన్నది. తెలుగు కథ ఇప్పుడు గోడ లోపలి తన కుటుంబ సభ్యులనే అనివార్యంగా అపురూపంగా చూసుకోవలసి వస్తున్నది. ఇంతకాలం అది కొందరిని సరిగా చూడలేదు. కొందరిని చూడవలసిన విధంగా చూడలేదు. ఆ నష్టాన్నిప్పుడు పూడ్చుకోవడానికి ఇదో అవకాశంగా భావించాల్సి ఉన్నది. కె.సభా, అందె నారాయణస్వామి, సొదుం జయరాం, శారద, కల్యాణ సుందరీ జగన్నాథ్, ఆర్.వసుంధరాదేవి, అల్లం శేషగిరిరావు, భూషణం, సి.రామచంద్రరావు, మహేంద్ర వంటి ఉత్తమోత్తమ కథకులందరినీ స్మరించి వారి కృషిని గ్రహించి వారి మెడన కొత్తపూలహారాలను ధరింపచేయవలసి ఉన్నది. ‘90ల కాలం ఉద్యమాలు పూసిన కాలం. కథకులు వేయి రేకలుగా వికసించిన కాలం. ఆ ఉమ్మడిరోజుల తీరికలేనితనంలో చాలామంది తెలుగు కథకుల కృషి సరైన గుర్తింపుకు నోచుకోలేదు. బండి నారాయణ స్వామి, చిలుకూరి దేవపుత్ర, దాదాహయత్, మధురాంతకం నరేంద్ర, జి.ఆర్.మహర్షి, జి.కల్యాణరావు, పి.సత్యవతి, కాట్రగడ్డ దయానంద్, బమ్మిడి జగదీశ్వరరావు, పి.రామకృష్ణ, (స్మైల్), సౌదా, పద్మాకర్, సతీష్ చందర్, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, వాడ్రేవు చినవీరభద్రుడు, డా.వి.చంద్రశేఖరరావు, కుప్పిలి పద్మ, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు వీరందరి కృషిని మాట్లాడాల్సి ఉన్నది. మాట్లాడుకోవాల్సి కూడా ఉన్నది. ఇక తెలుగు కథ మరొక్క మారు తన ముచ్చటైన మాండలికాలను ముద్దాడనున్నది. సుందరమైన పలుకుతో సజీవతతో ఎప్పటిలాగే కళకళలాడుతూ అడుగు ముందుకు వేయనున్నది. కేశవరెడ్డి దాని విలుకాడు. నామిని గురికాడు. గోపిని కరుణాకర్, స.వెం.రమేశ్, ఇనయతుల్లా, రహమతుల్లా, వంశీ, నక్కా విజయరామరాజు, రాసాని, తుమ్మల రామకృష్ణ... ఇంకా ప్రతిపథాన తన పెదాన పిల్లనగ్రోవి వూదే పాటగాళ్లందరితోనూ అది వంతపాడనున్నది. శ్రీరమణకు మాటలోని సొగసు తెలుసు. కేతుకు సీమపలుకులోని సుడిగాలి తెలుసు. సింగమనేనికి ఎడారి రైతు కంఠాన ఆక్రందన. తెలుగు కథ ఈ పరిణామకాలంలో ఖండాంతరాలలో ఉన్న తెలుగు కథకుల వైపు చూస్తున్నది. పట్టుదలతో ప్రతి గుక్కనూ ప్రాణంగా ఒడిసిపట్టనున్నది. చంద్ర కన్నెగంటి, ఆరి సీతారామయ్య, కనక ప్రసాద్, నారాయణ స్వామి, వేలూరి వేంకటేశ్వరరావు, కె.వి.గిరిధర రావు... వీరందరి కొత్త కథాపరంపరతో మరొక్కమారు తనను తాను సంపద్వంతం చేసుకోనున్నది. అన్నింటికీ మించి తెలుగు కథ ఈతరం కథకులతో అనేకానేక తాజాకథకుల రాకతో కొత్త ఊటలను వెదజల్లు తున్నది. అజయ్ ప్రసాద్, సురేశ్, ప్రతిమ, పసుపులేటి గీత, కె.ఎన్.మల్లీశ్వరి, లెనిన్, వేంపల్లి గంగాధర్, కె.సుభాషిణి, చింతకింది శ్రీనివాసరావు, ప్రసాదమూర్తి, కుమార్ రాజా, షరీఫ్, వినోదిని, సామాన్య, సింధు మాధురి, మల్లిపురం జగదీశ్, మెహర్, అనిల్ ఎస్.రాయల్, అక్కంపేట ఇబ్రహీం... వీరందరి ప్రవాహగానంతో మహాహోరుగా బలపడనున్నది. తెలుగు కథ నెత్తిన ఇప్పుడు నిజంగానే చాలా బరువు ఉన్నది. అది పునాదుల నుంచి మొదలవ్వాల్సి ఉన్నది. కొత్త పెళ్లలు విరిగిపడి పోయే ప్రాణాల గురించి రాయాల్సి ఉన్నది. కొత్త తగాదాల్లో నలగనున్న రైతు కంటి చెమ్మను తుడవాల్సి ఉన్నది. కొత్త బదిలీల వల్ల అపసవ్యం కానున్న కుటుంబాల కార్చిచ్చులను చల్లార్చాల్సి ఉన్నది. ఉన్న భరోసా పోయి కుదేలైన కుర్రాడికి ఏం పర్లేదులే అని ధైర్యం నూరిపోయాల్సి ఉన్నది. నొసటన ‘దొంగ’ అనే పచ్చబొట్టును చెరిపి పరాయి రాజధానిలో ఆత్మగౌరవంతో బతికే హక్కును చాటవలసి ఉన్నది. ఉసురుకూ ముసురుకూ చోటివ్వకుండా కొత్త ఉత్సాహంతో ముందుకు కదలమని పిలుపు ఇవ్వాల్సి ఉన్నది. ఇక మీదట తెలుగు కథ తనకిచ్చిన హద్దుల్లోనే తాను ఉండదల్చుకున్నది. బహుశా- ఆ హద్దుల నుంచే అది దిగంతాలకు ఎగరనున్నది. ఇది చెరువులు నింపుకోవాల్సిన కాలం. నిండిన చెరువులను సరిచూసు కోవాల్సిన కాలం. అటూ ఇటూ ఆ పని పూర్తయ్యాక వారధి గురించి ఆలోచించాల్సి ఉన్నది. - మహమ్మద్ ఖదీర్‌బాబు