మాస్టర్స్ ఎప్పుడూ మాస్టర్సే. రావిశాస్త్రి ‘వర్షం’ తెలుగు పాఠకుడు దర్శించిన అత్యుత్తమ కథల్లో ఒకటి. చిన్నవాటికీ చితకవాటికీ భయపడుతూ జీవితంలో దేనికీ తెగించలేని స్థితికి చేరుకున్న ఒక యువకుడు ఒక వాన సాయంత్రం ఒక దుకాణం తాత నిష్టూరపు ప్రోత్సాహంతో శక్తి తెచ్చుకొని ధీరుడిగా మారే కథ. ఏం కథ ఏం కథ.
ఏం వర్షం ఏం వర్షం ఆ కథలో.
అయితే అటు నెల్లూరు దాకా అయినా పడుతుంది. లేదా ఇటు ఒంగోలు దాకా పడుతుంది. మేఘాలు ముసురుకున్నాయట. కుండపోత అట. వస్తుంది వస్తుంది అనుకుంటే ఏది? రాదు. కావలిలో వాన పడాలంటే తుఫాన్ రావాలి. ఆగస్టులోనో సెప్టెంబర్‌లోనో అక్టోబర్‌లోనో వాయుగుండం పడిందనే వార్త రేడియోలో విని ఆనందంగా చూడాల్సిన వానను భయం భయంగా చూసిన అనుభవమే అంతా.
ధారగా కురిసే వాన... ముసురు స్థిరంగా నిలబడి చీకటిని నిలిపి ఉంచే వాన... అల్లా పుస్తకాల్లో చెప్పినట్టుగా కిటికీలో నుంచి వానను చూస్తూ పకోడీలు వేయించుకుని తినే వాన ఎరగను. ఆ అసంతృప్తి ఏదో ఉండిపోయినట్టుగా ఉంది.
కథల్లోకి వచ్చాక కథల చదువు కొనసాగిస్తూ ఉండగా ఒకసారి ‘గాలి వాన’ కథ తటస్థించింది. అబ్బ. ఏం వాన. ఇనుముతో దృఢంగా చేసిన రైలుపెట్టెలను కూడా ఊపి ఊపి వదిలిన వాన. స్టేషన్‌ను పెళ్లగించిన వాన. మానవుడు తయారు చేసినవి ప్రకృతి తయారు చేసినవి అన్నింటినీ తుడిచి పెట్టిన వాన. మనిషి కృత్రిమంగా తయారు చేసుకున్న సిద్ధాంతాలు, విలువలు, పైపైని పటాటోపాలు తన ముందు క్షణమాత్రం కూడా నిలువవు అని నిరూపించిన వాన అది. ఆ వాన నా బాల్యపు వెలితిని తీర్చింది.
ఆ తర్వాత నేను మహేంద్ర రాసిన ‘అతడి పేరు మనిషి’ కథ చదివాను. చిత్తూరు జిల్లాలో ఒక నిరాడంబరమైన పల్లె మీద ఊరి చివరి గుడిసెలో వానలో చిక్కుకుపోయిన ఒక డబ్బున్న పిల్లను ఒక స్వచ్ఛమైన పల్లె యువకుడు ఎలా కాపాడుకున్నాడో చెప్పిన కథ అది. ఆ యువకుడికి దక్కిన ఫలితం? వరండాలో కుక్కతో సమానంగా భోజనం పెట్టడం. నన్ను కలిచి వేసిన వాన అది.
రావిశాస్త్రి వర్షం వర్షం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కథను మింగివేసే సిమిలీలను ఎక్కువ ఉపయోగిస్తాడని అభ్యంతరం ఉండి చదువుదాములే చదువుదాములే అనుకుంటూ ఉండిన ఆ కథ ఏదో మేగజీన్‌లో పునర్ముద్రణ పొందితే చదివాను. లెంపలు వేసుకోవడం బాకీ. మాస్టర్స్ ఎప్పుడూ మాస్టర్సే. ‘వర్షం’ తెలుగు పాఠకుడు దర్శించిన అత్యుత్తమ కథల్లో ఒకటి. చిన్నప్పటి నుంచి చిన్నవాటికీ చితకవాటికీ భయపడుతూ జీవితంలో దేనికీ తెగించలేని స్థితికి చేరుకున్న ఒక యువకుడు ఒక వాన సాయంత్రం ఒక దుకాణం తాత నిష్టూరపు ప్రోత్సాహంతో శక్తి తెచ్చుకొని ధీరుడిగా మారే కథ అది. ఏం కథ ఏం కథ. ఏం వర్షం ఏం వర్షం ఆ కథలో.
అద్దేపల్లి ప్రభు రాసిన ‘అతడి పేరు మనిషి’ కూడా నన్ను నిలువెల్లా తడిపేసింది చదివినప్పుడు. గోదావరి నది మీద ఆ కథలో కురిసినంత గాఢమైన వర్షం మరే కథలోనూ లేదు. ఆ వానలో మనం నది అంచున నిలువెల్లా తడిసి గడగడ వణుకుతూ కూడా ఉంటాం.
ఇవన్నీ మనసులో ఉండి పోయాయి. వీటిని పుస్తకంగా తెస్తే బాగుండుననే కోరిక ఉండిపోయింది.
తిరుపతిలో తెలుగు మహాసభలు జరుగుతున్నప్పుడు అక్కడకు వచ్చిన తానా జంపాల చౌదరిగారికి ఈ విషయం చెప్పాను. ఆయన చెవిన వేసుకోలేదు. నా వాన కురవనే లేదు. తుదకు ఛాయా సంస్థ కృష్ణమోహన్ చెప్పిందే తడవు తడవడానికి సిద్ధమవడంతో ఈ కథల వాన ఇలా సాధ్యం కాగలిగింది.
తెలుగులో వచ్చిన వాన కథలను సేకరించడానికి తువ్వాలు నెత్తిన కప్పుకున్నప్పుడు ఎన్నో వానల గుండా ప్రయాణించాల్సి వచ్చింది. తెలుగు కథ చిరపుంజీ వలే వాన కథలతో సమృద్ధిగా ఉందని అనిపించింది. తెలుగులో కనీసం వంద వాన కథలు ఉన్నాయి. వాటిలో చిరు జల్లులు పొడిజల్లులు పోను కనీసం ముప్పై నలబై కుండపోతలు ఉన్నాయి. ఏ సంకలనానికైనా ఒక హద్దు ఉంటుంది. నా సంకలనం 20 కథలను భరించగలిగింది.
అదృష్టం ఏమిటంటే కళింగాంధ్ర, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ... ఈ జీవమృత్తికలన్నింటినీ తడిపిన వాన ఈ సంకలనంలోని పుటలను ముంచెత్తగలగడం. కృష్ణానది, గోదావరి నది మీద కురిసిన వాన సరే మనకున్న అతి పెద్ద సరస్సు ప్రళయ కావేరి (పులికాట్) సరస్సుపై కురిసిన వాన కూడా స.వెం. రమేశ్ రాసిన ‘ఉత్తరపొద్దు’ కథ ద్వారా సంభవించడం.
తెలంగాణ కథలను వెతుకుతున్నప్పుడు అక్కడ కురిసిన వాన వెట్టిచాకిరీ చేసేవారితో కలిసి భోరున విలపించడం బి.ఎస్.రాములు ‘పాలు’ కథలో, ఎ.ఎం.అయోధ్యారెడ్డి రాసిన ‘గాలివాన’ కథలో గమనించాను. అదే వాన రైతు పట్ల దయతో ఉండటం గంగుల నరసింహారెడ్డి ‘వాన కురిసింది’లో చూసి సంతోషపడ్డాను. హైదరాబాద్ నగరం నాలుగు వందల ఏళ్లుగా ఉంది. ఎంతమంది అక్కడ కురిసే వానకు అత్తరు ఖుష్‌బూ అద్దగలిగారు? పూడూరి రాజిరెడ్డి ‘నగరంలో వాన’ కథతో కట్టడాన్ని వదిలి నగిషీని చూపినట్టు చూపినా నగిషీ అందం నగిషీదే కదా.
కాని దుఃఖమంతా మాత్రం రాయలసీమదే. వద్దురా తండ్రీ.
ఎన్ని కథలు చదివినా అక్కడి కథకులందరిది ఒకటే కల. వాన కల. అందరూ కలలో వానను చూసేవారే తప్ప నిజంగా వాన చూసినవారు లేరు. వాన కోసం అణువణువూ సాగే ఈ అన్వేషణ మాసిన గడ్డపు ఎదురు చూపు దీని వెనుక ఎండకు మండే వేదన వీటన్నింటి ప్రతీకగా ప్రతినిధిగా బండి నారాయణ స్వామి ‘వాన రాలే’ కథ ఉంది.
జగన్నాథ శర్మ ‘పేగు కాలిన వాసన’, గుమ్మా ప్రసన్న కుమార్ ‘ముసురు పట్టిన రాత్రి’ ఒకే మధ్యతరగతి నిస్సహాయతకు రెండు ముఖాలను చూపి గాఢమైన ముసురును పాఠకులలో నింపుతాయి. అట్లాంటి ఇళ్లలో ఎందుచేతనో ఈడొచ్చిన ఆడపిల్లలు సుడిగుండాల్లో ఈదుతుంటారు. ఇక కుప్పిలి పద్మను. తూర్పు తీరం అంత పెద్దతుఫానులో చెదరక బెదరక మగవాడి సమక్షంలో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న యువతిని ‘గోడ’ కథలో ఆమె చాలా తీక్షణమైన నిశ్చయంతో చూపిస్తుంది. ప్రతి మగవాడికీ భయమేస్తుంది. విశేషం– వాన కోసం పశుపక్ష్యాదుల పలవరింతను అజయ్ ప్రసాద్ ‘మృగశిర’గా రాయడం. అంతకంటే విశేషం జీవితంలోని ఆశను కాగితపు పడవతో పోలుస్తూ వర్షపు నీటిలో అలాంటి పడవతో ప్రయాణించాలనుకునే మనిషిని కె.శ్రీకాంత్ ‘నిశ్శబ్దపు పాట’లో చూపడం. వాన కథల్లో దాదాపు మొదటి కథ శారద (నటరాజన్) రాసిన ‘అదృష్టహీనుడు’ (1950) దొరకడం. ప్రియ కథకుడు తిలక్ ‘ఊరి చివరి ఇల్లు’తో ఈ సంకలనానికి నాలుగు పదున్ల వానను జత పరచడం.
మరేమిటి? పుస్తకం ధన్యమైంది. వానలో తడిశాక మనం మొలకెత్తడమే మిగిలింది. పాత విశ్వాసాలను కడిగేసి కొత్త నమ్మకాలకు పాదు చేసుకోవడమే మిగిలింది. ఆ పనికి ఈ సంకలనం ప్రోత్సహిస్తుంది.
అయితే తెలుగు కథ ఇంకా చాలా వానలకు బాకీ ఉంది. ఆశల్లా కొత్త కథకులు ఆ వాన దారుల్లో నడుస్తారనీ ఆ ధారలను కథలుగా ధారపోస్తారనీ ఇలాంటి సంకలనాలు మరిన్ని వస్తాయనీ.
అదిగో వాన. మేఘాలలో రథం పరిగెడుతోంది. అర్జునా... ఫల్గుణా... పార్థా... కిరీటీ... వాన విల్లును ధరించిన తెలుగు కథకుడి ఎదుట ఛాతీ నిలుపుదాం పదండి.
(వ్యాసకర్త సంపాదకుడిగా ఇటీవల ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సంకలనం వచ్చింది. ప్రచురణ: ఛాయా రిసోర్సెస్ సెంటర్.)
మహమ్మద్ ఖదీర్‌బాబు
9701332807
Comments
Please login to add a commentAdd a comment