దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డులోని ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్‌యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు.
సుమారు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్ ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజామున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది.
వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యార్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment