ఒకవైపు వాన చినుకులు పడుతుంటే, మరోవైపు పక్కనే వేడి వేడి టీ, పకోడీలాంటివి ఉంటే ఎంత బాగుంటుంది! ‘అయితే, అలా తినాలంటే రోజూ కుదరదు కదా!’ అని బాధపడేవారికి ఒక చక్కని వార్త. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలోని సియోంగ్ ప్రాంతంలో ఉన్న ‘రెయిన్ రిపోర్ట్ క్రాయిసెంట్’ హోటల్లో ప్రతిరోజూ వానాకాలాన్ని ఆస్వాదించొచ్చు.
రెస్టారెంట్ ఇంటీరియర్ మొత్తం వాతావరణ వార్తలు, వర్షం పడే దృశ్యాలతో నిండి ఉంటుంది. హోటల్‌లో మొత్తం నిరంతరం వాన తుంపరలు పడేలా సెట్ చేశారు. వెదురు చెట్ల చుట్టూ కుర్చీలు, బల్లలు వేసి, పాదాలకు నీటి ప్రవాహం తగిలేలా అక్కడి ఫ్లోర్‌ను సెటప్ చేశారు. ఇక పక్కనే ప్రవహించే నీటిలో నేలపై కుర్చునే వీలుంది. అంతేకాదు, కుటుంబమంతా కలసి ఎంజాయ్ చేయడానికి రెండో అంతస్తులో ఒక మినీ సినీ థియేటర్ కూడా ఉంది.
సౌకర్యవంతమైన కుషన్స్‌లో పడుకొని సినిమా చూడొచ్చు. అక్కడ దొరికే మెన్యూ ఐటమ్స్‌లోని పానీయాలు, వంటకాల పేర్లన్నీ కూడా రెయిన్ రిపోర్ట్ స్టయిల్‌లోనే ఉంటాయి. ఉదాహరణకు ‘సన్ షైన్’, ‘క్లౌడ్’, ‘రెయిన్ డ్రాప్’ ఇలా వివిధ వాతవరణ సూచనల పేర్లతో ఉండే క్రాయిసెంట్స్, ‘రెయిన్‌బో మిల్క్’, ‘సెసేమ్ క్లౌడ్’, ‘వెట్ క్లౌడ్’, ‘వైట్ లాట్టే’ వంటి పానీయాలు ఉన్నాయి. బాగుంది కదా! వానాకాలాన్ని ఆస్వాదించాలంటే వెంటనే ఈ రెయిన్ రిపోర్ట్ రెస్టరెంట్‌కి వెళ్లాల్సిందే మరి.
(చదవండి: ఘోస్ట్ కోసం బీస్ట్ పిరమిడ్ వాసం)
Comments
Please login to add a commentAdd a comment