పాఠకుడితో సంభాషణ
బొమ్మలు వేసేటప్పుడు వేళ్లు కదల్చాలా? మణికట్టు కదల్చాలా?
కొత్తగా బొమ్మలు వేసేవాళ్లకూ చాలా ఏళ్లుగా బొమ్మలు వేసేవాళ్లకు కూడా ఈ సందేహం ఉంటుందట.
మరి కొత్తగా కథలు రాసేవాళ్లకు?
మపాసా ఒక కథ రాశాడు.
అందులో ఒక అమాంబాపతు రైతు. అతనికి ఒక ముసలితల్లి. జబ్బు పడుతుంది. గుటుక్కుమంటే వేరే సంగతి. కాని మంచాన పడితే? పోయేలా ఉంది. ఎప్పుడు పోతుందో తెలీదు. తనేమో పొలానికి వెళ్లాలి. చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేరు. ఊళ్లో ఒక దాదీ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళితే రోజుకు రూపాయి అడుగుతుంది. రోజుకు రూపాయా? రేపో మాపో పోయేలా ఉంది కదా... అందుకని రైతు పోయేదాకా చూసుకో ఏడు రూపాయలు ఇస్తా. ఇవాళ పోయినా ఏడు రూపాయలే, పది రోజుల తర్వాత పోయినా ఏడు రూపాయలే అంటాడు. దాదీ వచ్చి ముసలిదాని వాలకం చూస్తుంది. మూడ్రోజులకు మించి ఉండదు. సరే అంటుంది. ఒక రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మారుతుంది. ఈ రాత్రికే అన్నట్టు ఉంటుంది. రైతుకు బాధ. అయ్యో ఈ రాత్రికే పోతే అనవసరంగా దాదీకి ఏడు రూపాయలు ఇవ్వాలే. మరో రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మళ్లీ మారుతుంది. ఒక నెలైనా బతికేలా ఉంది. దాదీకి బాధ. నెల రోజులు బతికితే వచ్చేది ఏడు రూపాయలా? ఏమీ తోచదు. సరే చేసేదేముంది అని ఆ రోజు రాత్రి దీపాలన్నీ ఆర్పేసి చేతిలో చీపురు, నెత్తి మీద చేట పెట్టుకొని నాలుక బయటపెట్టి వికృతమైన ఆకారం ధరించి హఠాత్తుగా ముసలిదాని ముందుకు వస్తుంది. దయ్యం కనపడితే ఎవరు బతుకుతారు? ముసల్ది పుటుక్కుమంటుంది.
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని సిద్ధాంతపరంగా నిరూపించడానికి ఎన్ని వందల పేజీలు రాయాలో తెలియదు. మపాసా మాత్రం ఒక ఐదారు పేజీల్లో ఈ కథలో చెప్పేశాడు.
ఈ విద్య అతనికి ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్తే కొన్ని తెలుస్తాయా? కథ రాసేవాళ్లు ఏవైనా సరే ఎవరి దగ్గరైనా సరే కొన్ని నేర్చుకోవాలా? అవసరమేనా?
కథ రాసి ఎలా ఉందో చెప్పమని వేమన వసంతలక్ష్మి, చూపు కాత్యాయని, ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఎం.రాజేంద్ర, శ్రీరమణ, అనంత్, జంపాల చౌదరి వంటి మిత్రులకు చూపుతుండేవాణ్ణి. బాగుందో బాగలేదో చెప్తుండేవారు. దర్గామిట్ట కతలు రాసేటప్పుడు కథల నిండా కథల మధ్యలో బ్రాకెట్లు పెట్టి కొన్ని వివరాలు ఇస్తుండేవాణ్ణి. సాధారణంగా శ్రీరమణ సలహాలు ఇవ్వరు. కాని నా మీద దయతలచి ‘అలా బ్రాకెట్లు పాఠకులకు ఇబ్బంది అండీ’ అన్నారు. అంతే. ఇప్పటి వరకూ కథల మధ్యలో బ్రాకెట్లు వాడలేదు. నామిని నా ‘జమీన్’ కథను చదివి మధ్యలో మూడు చుక్కలు ( ) పెట్టి బ్రేక్ ఎందుకు చేస్తున్నావు? అది బ్యాడ్ నెరేషన్. జానపదులు ఓరల్ ట్రెడిషన్‌లో మధ్యలో మూడు చుక్కలు అని ఆపుతారా? ఆపరు కదా? కంటిన్యూగా కథ చెప్పలేవా? అని సలహా ఇచ్చాడు. నా ‘కింద నేల ఉంది’ 32 పేజీల కథ. ఒక్క బ్రేక్ లేకుండా కంటిన్యూగా కథ చెప్పాను. అంతే కాదు ఎంత పెద్ద కథనైనా ‘మూడు చుక్కల బ్రేక్’ లేకుండా చెప్పడం సాధన చేస్తున్నాను.
ఎవరో ఒకరు కొన్ని చెప్పాలి.
కొన్ని మనకు మనమే నేర్చుకోవాలి.
అందుకు మార్గం ఏమైనా ఉందా?
కార్మికుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రైతుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. అభివృద్ధి చేస్తున్న విధ్వంసక రూపాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రాశాం. రాస్తున్నాం. కాని కొంచెం మార్చవచ్చు కదా. వేరేది రాయవచ్చు కదా. ‘బస్ట్ సైజ్ ఫొటో’... ఇది ఒక సంస్కారం. మనిషిని అంత వరకే చూసి రాయడం లోకం మెచ్చిన సంస్కారం. కాని ఆ బస్ట్ కింద ఉండే చీకట్లను, జ్వాలలను, తాపాలను, తెప్పరింతలను, కటి ప్రాంతం ఈడ్చుకుంటూ వెళితే ఒంటి మీద పడే చెక్కుళ్లను లోకంలో చాలా మంది రాశారు. ఆల్బెర్టో మొరావియా, హెన్రి మిల్లర్, డి హెచ్ లారెన్స్, మంటో, ఇస్మత్ చుగ్తాయ్, కమలా దాస్, చలం... ‘అయ్యో.. పూర్వం మనం బాగానే మాట్లాడుకున్నామండీ... ఈ విక్టోరియన్ మొరాలిటీ తగలడ్డాకే ఇలా తయారయ్యాం’ అనేవాళ్లు ఉన్నారు... అయితే కొంచెం ప్రయత్నించి ‘బియాండ్ కాఫీ’ అని పది కథలు రాశాను.
కొంచెం విమర్శ వస్తుంది. ఉక్కిరిబిక్కిరి వస్తుంది.
అది ‘అంగీకారం’ పొందే వరకూ ఎలా తట్టుకొని నిలబడాలి?
కొత్తదారిని ఎలా కనుగొనాలి? ఆ దారిన ఎదురుదెబ్బకు ఏ మందును పట్టుకొని నడవాలి?
ఒక్కోసారి కథ తెలుస్తూ ఉంటుంది. దానికి పాత్రలు వెతుక్కోవాలి. ఎలా? ఒక్కోసారి ఒక బ్రహ్మాండమైన పాత్ర కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. దానికి కథను వెతుక్కోవాలి. అదీ ఎలా? ఒక్కోసారి కథంతా పూర్తయిపోతుంది. దానికో పేరు ఎంతకీ తెమలదు. సరైన పేరు ఎలా పెట్టాలి? ఒక్కోసారి కథంతా ముక్కలు ముక్కలుగా గోచరమవుతూ ఉంటుంది. ఏ ముక్క మొదట రాయాలి... ఏ ముక్క చివర అమర్చాలి? నిడివి పెరుగుతూ పోతే దోషమా? మరీ క్లుప్తంగా వచ్చేసిందే... లోపమా?
ఓ కథాదేవేరీ... నీవెప్పుడు నా పక్కన సుఖాశీనురాలివి అవుతావు?
నా వక్షాన ఎప్పుడు శాశ్వత ప్రతిష్టితమవుతావు?
నిదుర రాదు. రాసేటప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది. ఇంట్లో వారికి ప్రవర్తన అర్థం కాదు. ట్రాఫిక్‌లో ఎవడో మన పరధ్యానానికి బండబూతులు తిడతాడు. ఆఫీస్‌లో పని తెమలదు. ఆ సాయంత్రం స్నేహితుల సాంగత్యం రుచించదు. కథ వెంట పడుతుంది. కథే ముద్ద మింగకుండా మన గొంతుకు అడ్డం కూచుంటుంది.
పారిపోవాలనిపిస్తుంది.
కాని కథ ముగిస్తేనే విడుదల పత్రం దొరుకుతుంది.
ఈ జంజాటం జీవితాంతం ఉంటుంది. ఈ ప్రయాణానికి మనకేం తోడు కావాలి?
కథ ఎప్పటికీ తెలిసిపోదు. అసలు సంపూర్తిగా తెలిసిపోయేదేదీ విద్య కాదు. అది తెలుస్తూ ఉంటుంది. అరె... నా అనుభవం ఇది... నీ ప్రయాస ఇదా... నేను ఇలా చేశాను... నువ్వు ఎలా చేస్తున్నావు.... డిగ్రీలు అమెరికాకు టికెట్టు కొనుక్కోమంటుంటాయ్. బయట రియల్ ఎస్టేట్ హోర్డింగ్స్ పిలుస్తుంటాయ్. టీవీల్లో చెత్త. సినిమాల్లో బురద. సరిగ్గా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టలేవు, ఈ కథను పట్టుకుని ఎందుకురా ఊగులాడుతున్నావ్ అని మధ్య మధ్య విసుగు వస్తూ ఉంటుంది.
కాని- వదల్లేం. చేయి విదిలించుకోలేం.
కథకు మనం తగిలాం.
కథ మనల్ని దొరకబుచ్చుకుంది.
దానిని తెలుసుకుంటూ దానికి మనల్ని తెలియచేసుకుంటూ ఈ మధురబాధాయానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
నాకు కొంత తెలిసింది. చెప్పేశాను. ఇక మీ వంతు.
- మహమ్మద్ ఖదీర్‌బాబు
9705444243
కథ తెలుస్తూనే ఉంటుంది..
Published Mon, Mar 28 2016 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement