యువ కథ: సిల్లు పడ్డ సీర | yuva katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: సిల్లు పడ్డ సీర

Published Sun, Jan 26 2025 1:10 PM | Last Updated on Sun, Jan 26 2025 1:11 PM

yuva katha magazine stories

‘వురెయ్‌ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. 
‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. 

లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు.  అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్‌ బకెట్‌లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు.

 ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. 

‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. 

బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’  భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. 

ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. 

‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్‌ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. 

మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.

ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది  బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్‌. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది.

 మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. 

చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు.

 ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. 

భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. 

తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ  ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. 

ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. 

ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement