పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.
చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.
పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!
ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్‌మెంట్‌లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు.
‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.
రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.
‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట.
కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్‌లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.
‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు.
చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.
అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.
మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది.
పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు.
మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.
యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.
నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ.
నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.
ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment