‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్‌కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు.
అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్‌కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది.
భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.
ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్‌లోని వార్డ్‌రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్‌రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.
‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.
అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.
నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.
‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళాడు నరేంద్ర.
కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని.
కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను.
కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.
మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది.
Comments
Please login to add a commentAdd a comment