యువ కథ: ది ప్రపోజల్‌ | Yuva Katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: ది ప్రపోజల్‌

Published Sun, Nov 24 2024 9:09 AM | Last Updated on Sun, Nov 24 2024 9:09 AM

Yuva Katha magazine stories

డియర్‌ రియా! ఆఫ్టర్‌ మచ్‌ థాట్‌ ఐ హావ్‌ కమ్‌ టు ద కంక్లూజన్‌ దట్‌ ఐ కెన్‌ నాట్‌ సస్టెయిన్‌ దిస్‌ ఫీలింగ్‌ వెరీ లాంగ్‌. ఐ జస్ట్‌ వాంట్‌ టు బి యువర్‌ పార్టనర్‌ ఫర్‌ ఎ లైఫ్‌ టైమ్‌. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్‌ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్‌కే ‘యస్‌’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్‌ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. 

అసలు ఈ మెసేజెస్, కాల్స్‌లో ప్రపోజ్‌ చేయడం ఏంటి? డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్‌లో ఎలా ఫేస్‌ చేయాలో అని భయపడుతూ ఆఫీస్‌ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్‌లో రియా నా కొలీగ్‌. కన్నడ కంటెంట్‌ రైటర్‌. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్‌లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. 

తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్‌ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్‌ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్‌ చికెన్‌ తింటూ నేను వేసిన ‘స్నాప్‌’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్‌ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్‌తో పాటు టేస్ట్‌ కూడా షేర్‌ చేశాను. 

నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్‌దీప్‌కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్‌కి వెళ్ళి ఆర్డర్‌కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్‌ చేయడానికి నేను, రాజ్‌దీప్‌ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. 

మాటల మధ్యలో రాజ్‌దీప్‌ ‘అర్జున్‌ కుక్స్‌ వెల్‌’ అని చెప్తే ‘నిజమా విచ్‌ ఐటెమ్స్‌ డు యు కుక్‌ వెల్‌’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్‌ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్‌’ అని జోడించింది. ఆ లక్‌ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్‌ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. 

మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్‌దీప్‌ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాము.  

ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్‌ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్‌ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్‌ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. 

కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్‌ ట్రావెలింగ్‌ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్‌లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్‌ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్‌ ని జయించి ఫ్లాట్‌కి వచ్చేసరికి రాత్రి అవుతుంది.

 అప్పుడప్పుడూ టెర్రస్‌ మీదకు వచ్చినా.. ఫోన్‌లో రీల్స్‌ స్క్రోల్‌ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. 

చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్‌ చేశాను.  

ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్‌కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. 

‘డు యు థింక్‌ ఇట్‌ వాజ్‌ ఎ ప్రపోజల్‌?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్‌ సారీ ఫర్‌ దట్‌’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. 
‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే  నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను.

 నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్‌ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్‌ వైపు అడుగులు వేసింది. 

ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్‌ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం.

 అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్‌ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్‌ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. 

‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement