stories
-
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్‌లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
చంద్రబాబు ఏడు చేపల కథ.. |
-
యువ కథ : అబార్షన్
‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్‌కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్‌కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది. భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్లోని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నరేంద్ర.కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్‌కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని. కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది. -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్‌కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్‌లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్‌ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్‌స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్‌లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్‌గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్‌లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్‌లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్‌లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్‌తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్‌కి వెళ్ళి ఆర్డర్‌కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్‌దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్‌దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్‌దీప్ మా ఫ్లాట్‌కి మేము బయలుదేరాము. ఫ్లాట్‌కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్‌కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్‌కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్‌గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్‌కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్‌లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్‌ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్‌ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్‌గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్‌డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్‌కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్‌లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్‌ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్‌సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్‌గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి?
ఎలెక్సా 4 ఎకో డాట్ 6.59 అని చూపిస్తోంది. బజ్ మంటున్న అలారం శబ్దానికి నూరు గొంతుకల్లో నుంచి మెలకువ వచ్చేసింది. తెరుచుకున్న కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. నిద్ర కూడా కొందరికి బాధే, వచ్చి పోయే పీడకలల మధ్య. మూసుకున్న కనురెప్పల తెరల వెనుక కొన్ని దృశ్యాలు మూడు ముక్కలుగా, ముక్క చెక్కలుగా.బూతు భూయిష్టమైన మాటల్ని వినలేని చెవులు, తమను తాము మూసుకోవటం చేతకాక నిస్సహాయంగా నిటారుగా నిల్చున్నాయి. చిట్లిన పెదాలు, రెండు ముక్కల రామములక్కాయ లాగా. మోకాళ్ళు ముడుచుకొని డౌన్ కంఫర్టర్లో దాక్కుంది బుజ్జి కుక్కపిల్ల లాగా. తానెవరో తనకే తెలియని ఓ ఉదయపు అజ్ఞానం. స్నూజ్లోకి వెళ్ళిన అలారం నిద్ర లేవమని మరోసారి బతిమిలాడింది.ఓపికను అరువు తెచ్చుకుంటూ సరస్వతి లేచే ప్రయత్నం చేసింది. మొద్దు బారిన కాళ్ళల్లో కొద్దిపాటి కదలిక. మైనస్ డిగ్రీల చలికి వణికిపోతూ సూర్యుడు కొంచెంగా తొంగి చూస్తున్నట్లు, కిటికీలోంచి లేత కాంతి గదిలోకి వస్తోంది. కాళ్ళకు చెక్క నేల తగలగానే, సాక్సులో నుంచి చలి పెట్టిన ముద్దుకు, కాళ్ళను మళ్ళీ పైకి లాక్కుంది. మోయలేనంత బరువుగా అనిపిస్తున్న శరీరాన్ని, బలవంతాన నిలబెట్టి పల్లవి పడక గదిలోకి వెళ్ళింది సరస్వతి.గాఢ నిద్రలో పల్లవి. పదిహేడేళ్ళ యవ్వనపు కలలన్నీ పెదాల మీద పువ్వులై పూస్తుంటే అబ్బురంగా, ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లు నిలబడిపోయింది. ‘ఇది నా కూతురేనా?’ ‘నా కడుపు చీల్చుకొని పుట్టినదేనా?’.. తన మీద తనకే నమ్మకం లేనట్లు ఇంకొన్ని క్షణాలు అలా ఆలోచనల్లో మునిగిపోయింది. పల్లవి క్లాస్ షెడ్యూల్ గుర్తుకొచ్చింది. కోవిడ్ పుణ్యమా అని క్లాసులు ఆన్‌లైన్‌కి మారడంతో, కూతుర్ని ఇంకాసేపు పడుకోనివ్వాలని అనిపించింది. నిద్రపోతున్న కూతుర్ని, గదిగోడల మీద ఫొటోల్ని, డెస్క్ మీదున్న మెమెంటోలను కొత్తగా చూస్తోంది. ఒక్కో ఫొటో జ్ఞాపకంగా వెలుగుతోంది. ఒక్కో మెమెంటో కూతురు సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది.ఓ ఫొటోలో విక్రమ్‌కు, తనకు మధ్య పిల్లి పిల్ల లాగా ఒదిగి కూర్చొని నవ్వుతున్న చిన్ననాటి పల్లవిని చూస్తుంటే మరో ఆరు నెలల్లో ఫాల్ సెమిస్టరుకి కాలేజీ చదువు కోసం ఇల్లొదిలి వెళ్తుందని గుర్తురాగానే మనసు భారమైంది. ‘ఎంత మంచిది ఈ కోవిడ్! అందరిని మళ్ళీ ఇంటికి చేర్చింది. ఇంట్లో ఉండేలా, ఇంట్లో వాళ్ళతో ఉండేలా. ఇల్లు, ఇంట్లోని బంధాలు ఎంత ముఖ్యమో వైరస్ కుదుపుతో మళ్ళీ అందరికీ తెలిసి వచ్చింది.’ ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్‌తో కూతురితో ఎక్కువ సమయం గడపగలుగుతున్న పాజిటివ్ అంశాన్ని గుర్తు చేసుకుంది సరస్వతి, థెరపిస్ట్ సూచించినట్లు. ‘బీ పాజిటివ్, బీ హోప్ ఫుల్.’ప్రయత్నిస్తోంది సరస్వతి తన శాయశక్తులా. మందులేసుకోవటానికి, మిగతా అందరి.. తల్లిలాగా ఉండేందుకు. రోజూ ఓ యుద్ధం. మందులేసుకోవటం ఓ నరకం. వేసుకోకపోతే మరో నరకం. ఇరవైఏళ్ళుగా మరింత ఎక్కువైన ఈ నరకాన్ని ఇక తట్టుకోలేననిపిస్తోంది సరస్వతికి ఏ రోజుకారోజు. ‘పల్లవే లేకపోతే.. అవును అప్పుడు తన జీవితమే మరోలా!’ఫొటోల్లో మాత్రమే మిగిలి, జీవితంలో నుంచి తప్పుకున్న విక్రమ్ వంక నిర్లిప్తంగా చూసింది సరస్వతి. అతని మీద ఆమెకు కోపం లేదు. ‘వదిలించుకున్న తల్లిదండ్రుల కంటే ఏమంత తప్పు చేశాడు?’ ‘‘కోవిడ్ ఈజ్ హిట్టింగ్ బట్ హైస్కూల్ సీనియర్ పల్లవి ఈజ్ ఏ సర్వైవర్’’ చుట్టూ ఆర్ట్ వర్క్‌తో తన డెస్క్ ఎదురుగుండా, గోడ మీద పల్లవి పిన్ చేసుకున్న పోస్టరును చూస్తూ నిలబడింది. పల్లవి ఫోన్ అలారం మోగిన శబ్దానికి ఉలికిపడ్డ సరస్వతి గుండె వేగంగా కొట్టుకుంది.కళ్ళు తెరిచిన పల్లవికి ఎదురుగా తల్లి. నిద్ర మత్తులో కూడా తల్లిని గుర్తు పట్టేసింది. అమ్మ లాగా. పల్లవి చేతులు చాపడంతో ఆప్యాయంగా కూతుర్ని హత్తుకొని పక్కన పడుకొని కళ్ళు మూసుకుంది. రెండో అలారం శబ్దానికి తప్పనిసరై ఇద్దరూ కళ్ళు విప్పి సన్నటి చిరునవ్వుతో లేచి కూర్చున్నారు. ‘ఇట్ విల్ బి ఎనదర్ గుడ్ డే’.. ఒకరికొకరు చెప్పుకున్నారు, గట్టి నమ్మకంతో. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సరస్వతి, ఆన్లైన్ క్లాసుకి పల్లవి ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇంట్లో ఆఫీసు పని చేస్తుంటే, ఒక్కోసారి ఇంటి జ్ఞాపకాలు ఆఫీసు రూమును గిరగిరా తిప్పేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ రగిలిస్తాయి ఆరనిమంట లాగా! ఎవరి గదుల్లో, ఎవరి ప్రపంచంలో, ఎవరి బాధల్లో వాళ్ళు. ఎవరి ఒత్తిళ్ళు, చికాకుల్లో వాళ్ళు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమే! కొన్ని కుటుంబానివి, మరి కొన్ని సమాజానివి కూడా. అందరి కథలకు కాలం సాక్ష్యం. కొందరి జీవితాల్ని తన కడుపులో కాలం రహస్యంగా దాచుకుంటుంది, సమయం వచ్చేవరకు!పల్లవి పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రిలో పేరు రాయించారు. పదమూడో రోజు బాలింత స్నానం చేయించి, పురోహితుడు వచ్చేలోగా పసి గుడ్డును, సరస్వతిని ఇద్దరినీ తయారు చేసేందుకు తల్లి లక్ష్మీదేవమ్మ నానా హడావిడి పడుతోంది. పచ్చి బాలింత వొళ్ళు, ఆ పైన తలంటు స్నానం సరస్వతికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సరస్వతి పాలు కుడుపుతున్నా పసిదాని ఏడుపు ఆగటం లేదు. విక్రమ్ చేయగలిగిన సహాయం చేస్తూ, ఇండియాలోని తల్లి తండ్రుల కోసం బారసాల లైవ్‌లో చూపించటానికి ఐపాడ్ సిద్ధం చేశాడు.ముగ్గురు స్నేహితులు కుటుంబసమేతంగా ఆ వేడుక చూడటానికి వచ్చారు. సరస్వతికి ఊపిరాడటం లేదు. చీకి చీకి పాలు తాగుతూ కూడా ఏడుస్తున్న పసిగుడ్డును చూస్తే ఆ నోరు నొక్కేయాలని పిస్తోంది. కార్యక్రమానికి కావాల్సిన సంబారాలన్నీ సిద్ధం చేస్తోంది లక్ష్మీదేవమ్మ. సహాయం చేస్తామని అందరూ కిచెన్‌లోకి వచ్చేస్తుండటంతో అక్కడంతా గందరగోళంగా వుంది. బారసాలతో పాటు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు. పురోహితుడు చదివే మంత్రాలు, చెప్పే వ్యాఖ్యానాలు ఏవీ సరస్వతి బుర్రలోకి ఎక్కటం లేదు. ఒడిలో ఉన్న పాపను, ఒంటి మీదున్న చీరను గిరాటేసి మంచం మీద వాలిపోవాలని ఉంది.ఏవేవో పలకరింపులు. మాటలు.. ఏమీ అర్థం కావటం లేదు. తనెవరో తనకు తెలియనట్లు ముభావంగా, అభావంగా, నిస్తేజంగా, నిర్లిప్తంగా కూర్చుంది సరస్వతి. అయోమయంగా ఉన్న భార్య వంక చూసి, పాపం అలసిపోయిందనుకున్నాడు విక్రమ్. సరస్వతి చెయ్యి పట్టుకొని కార్యక్రమం నడిపించారు. కార్యక్రమం పూర్తి కాగానే పాపకు పాలివ్వటానికని బెడ్రూమ్లోకి వెళ్ళిన సరస్వతి మళ్ళీ బయటకు రాలేదు. పిల్లదాని ఏడుపు అంతకంతకూ పెద్దగా బయటకు వినిపిస్తుంటే, గదిలోకి వెళ్ళిన విక్రమ్ కళ్ళకు మంచానికి అడ్డంగా పడుకొని నిద్రపోతున్న భార్య కనిపించింది.పిల్లను చేతుల్లోకి తీసుకొని సముదాయిస్తూ, భార్యను లేపాడు. లక్ష్మీదేవమ్మ కూడా వచ్చి కూతుర్ని లేపేందుకు ప్రయత్నించింది. బలవంతాన కళ్ళు తెరిచిన సరస్వతి మొహం ఉగ్రంగా, భయానకంగా. ఎరుపెక్కిన కళ్ళతో సూటిగా వాళ్ళను చూసింది. ఆ చూపుకు విక్రమ్ అప్రయత్నంగానే రెండడుగులు వెనక్కేశాడు, పసిగుడ్డును గుండెకు హత్తుకుంటూ. లక్ష్మీదేవమ్మ కూతురు పక్కన కూర్చొని, ‘సరూ, పాపకు పాలు ఇవ్వాలమ్మా’ నెమ్మదిగా చెపుతూ అల్లుడి చేతుల్లో నుంచి పసిదాన్ని అందుకుంది.సరస్వతి పాపను అందుకోలేదు. విక్రమ్కేమీ అర్థంకాక అత్తమ్మ వంక చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. కూతుర్ని పట్టి కుదుపుతూ, ఆమె జాకెట్టు గుండీలని విప్పే ప్రయత్నం చేసింది. తల్లి చెంప మీద ఛెళ్ళున కొట్టి మళ్ళీ దుప్పటి లాక్కొని పడుకుండిపోయింది సరస్వతి. ఏం జరిగిందో అర్థమై, కానట్లు లక్ష్మీదేవమ్మ పిల్లదానితో సహా ఆ గది నుండి బయటకు వచ్చి, ఫార్ములా కలిపి బాటిల్లో పోసి పిల్లకు పాలు పట్టింది. ఒడిలో పడుకొని ఆత్రంగా పాలు తాగుతున్న పసి గుడ్డుని చూసి లక్ష్మీ దేవమ్మ కళ్ళల్లో నీళ్ళు.కొన్నేళ్ళ పాటు ఎలాంటి ఎపిసోడ్లు లేని కూతురు జీవితం ఇప్పుడెటు మళ్ళుతుందో, ఈ చిన్నదాని జీవితం ఎలా ఉంటుందోనన్న ఆలోచనలు ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి. అత్తమ్మ మొహంలోని ఆందోళన విక్రమ్‌కు చెప్పకనే ఏదో చెప్పినట్లనిపించింది. ‘అమ్మాయికి పాలు రావటం లేదు. అంతే. బాలింతలకు కొద్దిసార్లు ఇలాగే వుంటుంది’ అత్తమ్మ మాటలకు తలూపాడు విక్రమ్.ఆ పగటికి సరికొత్త మొహం ఆ రాత్రి. మంచి నిద్రలో తనపైన ఎవరో ఉండటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది విక్రమ్‌కి. అతని మీద ఆమె. సరస్వతిని చూసి బిత్తరపోతూ లేవబోయాడు. అతడ్ని లేవనివ్వలేదు. పొద్దుట భయపెట్టిన సరూ రాత్రి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, అమాయకమైన మొహంతో. ఆమె ఏం చేస్తోందో అతనికి తెలుస్తోంది. ఆమె స్పర్శ కొత్తగా. ఆమె ప్రవర్తన కూడా. అతని శరీరం ఆమెకు స్పందిస్తోంది. కానీ ఏదో తెలియని భయం. పక్కన పాప కోసం చూశాడు. కనిపించలేదు. విక్రమ్ ఆందోళన చూసి క్రిబ్ వంక చూపించింది. గాఢంగా, తీవ్రంగా ఇద్దరూ అల్లుకుపోయారు. విక్రమ్‌కు ‘ఆ రాత్రి సరస్వతి’ నచ్చింది.ఆ ‘రాత్రి సరస్వతి’కి విక్రమ్ పెట్టుకున్న పేరు సంపెంగ. తనకు తెలిసిన తన భార్య సరూ కంటే, కొత్తరూపు దాల్చిన సంపెంగనే అతనికి బాగా నచ్చింది. ఉదయం భార్యను చూసి ఆందోళన చెందిన విక్రమ్ మనసు కుదుటపడింది. నిశ్చింతగా అనిపించింది. పక్కకు తిరిగి మాట్లాడబోయిన విక్రమ్, అప్పటికే గాఢనిద్రలోకి జారుకున్న తన సంపెంగ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.విక్రమ్ ఇంట్లోకి రాగానే, హాల్లో కూర్చొని హోమ్‌వర్క్ చేసుకుంటున్న పల్లవి కనిపించింది. పల్లవి పక్కనే తిని పడేసిన చాక్లెట్ రాపర్స్, సగం తిని వదిలేసిన సీరీయల్ చూడగానే పరిస్థితి అర్థమైంది. ఆరేళ్ళ పిల్లకు తల్లి ప్రేమ, ఆదరణ సంగతి అటుంచి కనీసం సమయానికి తిండి కూడా దొరకటం లేదని బాధ తన్నుకొచ్చింది.‘ఆకలేస్తోందా తల్లీ?’ తలూపింది పల్లవి. ఆకలితో వాడిపోయిన ఆ పసిదాని మొహం, ‘నేనేం పాపం చేశా?’నని నిలదీస్తున్నట్లనిపించింది అతనికి. ఫ్రిజ్‌లో నుంచి అన్నం, పప్పు, గోంగూర పచ్చడి ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్‌లో వేడి చేసి కూతురికిచ్చాడు. ఆవురావురుమని అన్నం తింటున్న కూతుర్ని చూసి విక్రమ్ కళ్ళమ్మట నీళ్ళు. కోపమొచ్చింది. సరస్వతి మీద, ఆమె తల్లిదండ్రుల మీద, తన జీవితాన్ని నాశనం చేసినందుకు. సరస్వతి కోసం వెతుకుతూ వెళితే, కింద బేస్మెంట్లో ఒంటరిగా కూర్చొని ఉంది ఎటో దిక్కులు చూస్తూ. తన్నుకొచ్చిన కోపాన్ని తమాయించుకున్నాడు. చికాకు, కోపం, అసహనం, తగువులు, కేకలు వీటివల్ల లాభం లేదని పల్లవి పుట్టిన దగ్గర నుంచి అర్థమవుతూనే ఉంది విక్రమ్‌కు.‘సరూ, పైకి రా. పల్లవికి ఆకలేస్తోంది పాపం’ తెచ్చి పెట్టుకున్న మృదుత్వంతో మాట్లాడుతున్న విక్రమ్ గొంతు ఆమెకు చేరలేదు. కళ్ళెత్తి భర్త వంక చూసింది నువ్వెవరన్నట్లు? తల తిప్పేసుకుంది అతన్ని చూడటం ఇష్టం లేదన్నట్లు. అతనెవరో తెలియదన్నట్లు. నెమ్మదిగా సరస్వతి మీద చెయ్యి వేశాడు. పైకి తీసుకెళ్లటానికి. ఛెళ్ళున చెంప మీద కొట్టి ఏమీ ఎరగనట్లు శూన్యంలోకి చూస్తుండి పోయింది.‘మాత్రలేసుకున్నావా?’ సరస్వతి నుంచి యే సమాధానం రాలేదు. ‘సరూ, పద. పైకెళదాం. టీ చేస్తా’ మృదువుగా మాట్లాడుతూ చెయ్యి పట్టుకొని ఆమెను పైకి తీసుకొచ్చాడు. క్షణం క్రితం అతడిని కొట్టిన ఆమె, మళ్ళీ పసిపిల్లలా అతని వెంట యే గొడవ చేయకుండా వచ్చింది.సరస్వతిని సోఫాలో కూర్చోబెట్టి టీ చేయటానికి వంటింట్లోకెళ్ళాడు విక్రమ్. కిచెన్‌లో నుంచి హాల్లోని వాళ్ళిద్దరినీ గమనిస్తూనే స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు, టీ పొడి, ఎండిన లెమన్ గ్రాస్, ఏలక్కాయ పొడివేసి తెర్లుతున్న నీళ్ళను చూస్తూ నిలబడ్డాడు. సరస్వతి ద్వంద్వ ప్రవృత్తి, తరచూ మారిపోయే ఉద్వేగాలు, ఒక్కోసారి హింసాత్మకంగా, ఉద్రిక్తంగా మారిపోయే ఆమె ప్రవర్తన, పల్లవి పట్ల నిరాదరణ ఇవన్నీ అతనిలో తెర్లుతున్నాయి. తెల్లటి నీళ్ళు నల్లటి డికాక్షన్, ఏలకుల వాసనతో.పల్లవి అరిచిన అరుపులకు విక్రమ్ ఉలిక్కిపడి చూసి పరుగెత్తాడు హాల్లోకి. డికాక్షన్ పొంగి, బర్నర్ ఆరిపోయింది. నోటుబుక్కుని చింపేస్తున్న తల్లి నుంచి పుస్తకంలాగే ప్రయత్నం చేసి విఫలమై దూరంగా జరిగి ఏడవటం మొదలెట్టింది పల్లవి. పరుగున వచ్చిన విక్రమ్, సరస్వతి నుంచి బలవంతాన పుస్తకాన్ని లాక్కోగలిగాడు. మొండి బలంతో చేతులు బిగించి తనను గుద్దుతుంటే, చేతులు అడ్డం పెట్టుకొని ఆమెని ఆపటానికి ప్రయత్నించాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని తల్లిని లాగే ప్రయత్నం చేసినందుకు, పల్లవిని కూడా కొట్టసాగింది.‘సింకు కింద ఏమైనా వుంటే పట్టుకురా’ సరస్వతిని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. పల్లవి తెచ్చిన వైరుతో ఇద్దరూ కలిసి సరస్వతి చేతులు కట్టేశారు. వాళ్ళు ఆమెను ఆపుతున్న కొద్దీ ఆమె మరింత రెచ్చిపోయింది. పళ్ళు గట్టిగా కొరుకుతూ, బూతులు మాట్లాడుతూ, కాళ్ళు చేతులూ విదిలిస్తూ. ‘ఇది అమ్మ కాదు, మాన్స్టర్’ ఆ భూతాన్ని చూడలేనట్లు భయంతో, బాధతో కళ్ళు మూసుకుంది పల్లవి.ఇదంతా అలవాటైనట్లే ఉంటుంది. ప్రతిసారి కొత్తగానూ ఉంటుంది పల్లవికి. ‘అమ్మకు ఎందుకిలా?’మెడిసిన్ కిట్‌లో నుంచి పల్లవి తెచ్చిచ్చిన మాత్రను సరస్వతి చేత బలవంతాన మింగించి అలసటతో కూలబడ్డాడు విక్రమ్. కొద్ది క్షణాల్లో సరస్వతి నేల మీద ఒరిగి పోయింది మత్తులోకి జారిపోతూ. సరస్వతి చేత అత్యవసర పరిస్థితుల్లో మిగించే ఆ మాత్ర మనిషి కన్నా బలమైనది. ఆలోచనని, ఆగ్రహాన్ని నిర్జీవం చేయగలిగేంత శక్తివంతమైనది. తండ్రి పక్కనుంటే ధైర్యంగానే ఉన్నట్లనిపిస్తున్నా, పల్లవికి గుండె దడ తగ్గలేదు. ఎన్నోసార్లు,‘అమ్మకు బాగైపోతుందని’ ధైర్యం చెప్పిన విక్రమ్, ఇప్పుడిక అది కూడా చేయలేనట్లు నిస్సహాయంగా, నిస్సత్తువుగా తల పట్టుకొని కూర్చుండిపోయాడు ఇంకేమీ చేయలేనట్లు.‘నువ్వు నాతో వచ్చేయి బంగారు’ తండ్రి మాటలకు రాలేనన్నట్లు తలూపింది పదమూడేళ్ళ పల్లవి. ‘అమ్మకున్నది ఈ మానసికరోగం కాకుండా క్యాన్సర్ అయితే ఇలాగే చేసేవాడివా?’ కూతురు సూటిగా ప్రశ్నించేసరికి దెబ్బతిన్నట్లు చూశాడు విక్రమ్.‘పదమూడేళ్ళుగా మీ అమ్మ మూడ్ స్వింగ్స్‌తో మనం పడ్డ నరకయాతన పగవాడికి కూడా వద్దు తల్లీ. థెరపీ సెషన్స్, మందులు వీటితో ఒక రోజు బాగున్నట్లే ఉన్నా, మీ అమ్మకు పూర్తిగా నయమవుతుందన్న నమ్మకం చచ్చిపోయింది. ఎప్పుడెలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో, ఏరోజు విపరీతంగా పనిచేస్తుందో, ఏరోజు పక్క మీద నుంచి కూడా లేవదో తెలియదు. ఇన్నేళ్ళు నేచేయగలిగింది చేశా. ఇక నావల్ల కాదు. నాకు నా జీవితం కావాలి. ఈ కొత్త జీవితంలో నువ్వుండాలనుకోవటం కూడా తప్పేనా బంగారు?’ అతని కంఠంలో నిజాయితీతో కూడిన బాధ.‘అమ్మను నువ్వెంతలా చూసుకున్నావో తెలుసు డాడీ. కానీ పాపం అమ్మ! తనకు తెలియదు కదా తానేం చేసేది? మనిద్దరం వదిలెళ్ళిపోవటం క్రూయల్ డాడీ. మనం వదిలేస్తే అమ్మ రోగం ఎక్కువవుతుంది కానీ తగ్గుతుందా? అవసరమైతే రీహేబ్ సెంటర్లో చేర్పిద్దాం. అయినా ఇప్పుడు మందులేసుకుంటోంది కదా. అమ్మకు బాగైపోతుంది’ పల్లవి కంఠం రుద్ధమైంది.వయసుకు మించి ఎదిగిపోయిన కూతుర్ని చూస్తే అతనిలో చెప్పుకోలేని బాధ. ఆ పిల్ల పసితనాన్ని, అమాయకత్వాన్ని, ఆనందాన్ని అన్నింటినీ మింగేసిన సరస్వతి మీద చెప్పలేనంత కోపం. మళ్ళీ అంతలోనే ఆమె మీద సానుభూతి కూడా. కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు విక్రమ్.‘మీ అమ్మకు పెళ్లికి ముందు నుంచీ ఈ సైకోటిక్ మూడ్ డిసార్డర్ ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేయకుండా ఉండాల్సింది..’ ‘తగ్గిపోయిన రోగం డెలివరీ టైమ్‌లో తిరగబెట్టిందన్నది కదా .. నేను పుట్టకుండా వుంటే అమ్మ బావుండేదేమో!’ ‘ఈ పెళ్లి వల్ల జరిగిన మంచి ఏదైనా ఉంటే అది నువ్వే బంగారు. నీ కోసమైనా ఇక నుంచి అమ్మ మందులు క్రమం తప్పకుండా వేసుకుంటుందేమో?’‘అందుకే డాడీ, నేను అమ్మతోనే ఉంటా. నువ్వుండేది ఊర్లోనే కదా. వారంవారం వస్తాగా నీ దగ్గరకు’ తండ్రి కళ్ళల్లో నీళ్ళు చూసి పల్లవికి కూడా ఏడుపు ఆగలేదు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేశారు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో సరస్వతి క్రమం తప్పకుండా మందులేసుకోవటం మొదలెట్టింది. తల్లీ కూతుళ్ళు కొత్త జీవితం మొదలెట్టారు. నాలుగేళ్ళు గడిచిపోయాయి చూస్తుండగానే. తల్లి మూడ్ స్వింగ్స్ పరిణామాల్ని ఒక్కర్తే తట్టుకొని నిలబడింది. యేరోజు ఎలావుంటుందో తెలియని అనిశ్చితి నుంచి పారిపోవాలని ఎన్నోసార్లు అనిపించినా, మునిపంటితో భరించింది తండ్రికి చెప్పినట్లు. తల్లికి తల్లిగా మారింది పల్లవి. పల్లవికిప్పుడు పదిహేడేళ్ళు. తల్లికి దూరంగా కాలేజీకి వెళ్లటం గురించి మొదట్లో కొంచెం భయపడినా, ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎపిసోడ్లు లేకపోవటంతో, తల్లికి నయమైపోయిందని భ్రమపడింది. మందులేసుకుంటే తనకెలా వుంటుందో కూతురికెప్పుడూ తెలియనివ్వలేదు సరస్వతి. గత కొద్దికాలంగా తల్లి మందులు మానేసిన సంగతి పల్లవి గ్రహించలేకపోయింది. సరస్వతి ప్రవర్తన ఆమెకు అంతా బాగయిపోయినట్లే ఉంది.‘అతను నిన్ను చీట్ చేస్తున్నాడు. అతని మీద పగ తీర్చుకో!’‘అది నీకూతురు కాదు. దానికి పుట్టిన కూతురు.’‘చంపేయి, వాళ్ళంతా దుర్మార్గులు.’‘ఎర్రటి రక్తం తాగు!?’చెవుల్లో వినిపిస్తున్న మాటల్ని వినలేక చెవుల్నే కోసేసుకోవాలని ఉంది సరస్వతికి. మెదడు ఏదేదో చెప్తోంది. మనసు ఏదేదో అంటోంది. తనెవరో, తన పేరేమిటో కూడా తెలియకుండా పోతోంది ఒక్కోసారి ఆమెకు. మందులేసుకుంటే నిద్ర నిద్ర నిద్ర. ఉద్యోగం చేయకపోతే, పల్లవి చదువెలాగా? ఏవేవో ఆలోచనలు సరస్వతిని ఊపిరాడకుండా చేస్తున్నాయి. మందులేసుకోవాలని వుంది పల్లవి కోసం. కానీ ఈ నరకం వద్దు. నేను లేకపోతే పల్లవికి ఎలా? విక్రమ్ నమ్మకద్రోహి. నన్ను వదిలిపెట్టినట్లే, దాన్ని కూడా వదిలేస్తాడు అవకాశం వచ్చినప్పుడు. పల్లవిని రక్షించాలి, కాపాడాలి.తనతో తాను యుద్ధం. ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు. ఎవరెవరో వచ్చి వెళ్లిపోతున్నారు. ఏవేవో చెప్తున్నారు. ఒళ్ళు రగిలిపోతోంది. చావాలనిపిస్తోంది. చంపేయాలనిపిస్తోంది.ఒకే మనిషి.. వేర్వేరు ముఖాలు. అనేక జీవితాలు. అందరూ బద్ధశత్రువుల్లాగా కనిపిస్తున్నారు. శరీరంతో పెనుగులాట. మాటల్లో, ఆలోచనల్లో హింస. ఏవేవో మాటలు. ఎవరెవరివో గొంతుకలు. ఎవరెవరో వచ్చేస్తున్నారు. కళ్ళ ముందు రకరకాల మనుషులు. కళ్ళు మూసుకోవాలంటే భయం. నిద్ర పోవాలంటే భయం. మెలకువగా ఉండాలంటే భయం. రావద్దని వాళ్ళను బతిమిలాడుతోంది. బెదిరిస్తోంది. భయపెడుతోంది. సరస్వతిని వాళ్ళు ఆక్రమించుకున్నారు.వాళ్ళా? నేనా? ఓడిపోకూడదు వాళ్ళ చేతిలో. నే గెలవాలి. గెలిచి తీరాలి. వీళ్ళందరి నుంచి పల్లవిని కాపాడాలి? ఎలా? ఏం చేయాలి? నిరంతరం అదే ఆలోచన సరస్వతిలో. ఎదురుగా నిల్చున్న ఆమెను చూస్తూనే సరస్వతి కళ్ళు కోపాన్ని వర్షించాయి. విక్రమ్ పక్కన ఆమెను చూడగానే కోపం, అసూయ, ద్వేషం. అతనామెను ముద్దుపెట్టుకుంటున్నాడు. సరస్వతి మనసు రగిలిపోతోంది. విక్రమ్ కొత్త పెళ్ళాం భళ్ళున ఆకాశం బద్దలయ్యేలా నవ్వుతోంది.డైరెక్షన్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్న సరస్వతి సరిగ్గా ఫైర్ ఆర్మ్స్ షాపు ముందు ఆగింది. ఆమె మొహంలో ప్రశాంతతతో పాటు చిన్నపాటి ఉత్సాహం.తలుపు తీయగానే గంట శబ్దం రావటంతో కౌంటర్ దగ్గరున్న వ్యక్తి తలతిప్పి చూశాడు. కురచగా ఉండటంతో వున్నదాని కంటే లావుగా కనిపిస్తోంది ఆమె. బీఎమ్‌డబ్ల్యూ కారు. గూచీ బ్యాగ్, ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ ఆమె ఆర్థిక స్థోమతను చెప్తుంటే, ఆమె రూపు రేఖలను బట్టి ఏషియన్ అని అతనికి అర్థమైంది. వ్యాపారంలో ఎవరనేది లెక్క కాదు, ఎంతనేది మాత్రమే ముఖ్యం. ఆ ఊర్లో అదో పెద్ద ఫైర్ ఆర్మ్స్ స్టోర్. గోడల మీద పెద్ద పెద్ద పొడవాటి తుపాకులున్నాయి. చిన్నగా, చేతిలో ఇమిడిపోయే పిస్టల్స్ వంటివి అద్దాల కింద దాక్కొని తమ కోసం ఎవరొస్తారోనని ఎదురుచూస్తున్నాయి.‘కెన్ ఐ హెల్ప్ యు?’తనకు కావాల్సిన మోడల్ ధీమాగా చెప్పింది సరస్వతి. ఆ మోడల్ ఉన్న కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళాడు సేల్స్‌మన్. అదే కౌంటర్ దగ్గర మరో ఇద్దరు మగవాళ్ళు కూడా నిలబడి రకరకాల మోడల్స్‌ను పరీక్షిస్తున్నారు.సరస్వతి అడిగిన పిస్టల్ని తీసి సేల్స్‌మన్ చేతిలో పట్టుకొని చూపించి ఆమె చేతికిచ్చాడు. మొదటిసారి పిస్టల్ పట్టుకోగానే ఏదో తెలియని ఉత్తేజం ఆమె అరచేతిలో ఇమిడిపోయినట్లు అనిపించింది. ఓ శక్తిని పట్టుకున్నట్లు. వెయ్యేనుగుల బలం వచ్చినట్లు. రెండు చేతుల్లోకి మార్చి మార్చి చూసింది. సేల్స్‌మన్‌కు తెలియలేదు, ఆమెకు అనుభవం ఉందా? లేదా? అనేది.రెండు క్షణాలు ఆమెను ఆ తుపాకీతో ఆడుకొనిచ్చి బుల్లెట్ ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎలా తీసి జాగ్రత్త చేయాలో అన్నీ చూపించాడు. అర్థమైనట్లు ఆమె తలూపింది. చేతిలోకి మళ్ళీ తుపాకిని తీసుకొని కుడివైపు తిరిగి షూట్ చేస్తున్నట్లు చేసి చూసుకుంది. సేల్స్‌మన్‌కి తన మొబైల్ ఇచ్చి ఫొటో తీయమంది. అప్పుడర్థమైంది ఇదామె మొదటి తుపాకీ అని. ‘కంగ్రాట్స్, వెల్కమ్ టు రియల్ వరల్డ్’ అంటూ ఆమె అంగీకారం కోసం చూశాడు. ఆమె తల ఊపడంతో బిల్లింగ్ కౌంటర్ వైపు చూపించాడు.ఆమె దగ్గర డ్రైవర్ లైసెన్స్ తీసుకొని ఒక పుస్తకంలో ఆమె పేరు, అడ్రస్, హేండ్ గన్ వివరాలు రాశాడు. క్రెడిట్ కార్డుతో పే చేశాక ఆమె చేతికి గ్లాక్(ఎ ౌఛిజు) 19 సెమీ ఆటోమేటిక్ పిస్టల్, 9 మిమి బుల్లెట్స్ జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆడవాళ్ళు ఒంటరిగా వచ్చి తుపాకీలు కొనడం ఆ షాపులోని వాళ్ళకు కొత్త కాదు. కానీ ఓ భారతీయురాలు ఒంటరిగా వచ్చి పిస్టల్ కొనడం అతని షాపులో ఎప్పుడూ జరగకపోవటంతో అతను కొంత వింతగా చూశాడు.ఆమె వెళ్లిపోయాక సేల్స్‌మన్, షాపు ఓనర్ ఆమె గురించి కొంత మొరటు హాస్యంతో మాట్లాడుకొని ఆ తర్వాత మర్చిపోయారు. కానీ రెండు వారాల తర్వాత ఆమె గురించి, ఆమె కొన్న షాట్ గన్ గురించి పోలీసులొచ్చి అడుగుతూ ఏం జరిగిందో చెప్పినప్పుడు కానీ వాళ్ళకు పూర్తి వివరాలు తెలియలేదు. అక్కడ ఆ ఇంట్లో పల్లవి గది గోడ మీద పోస్టర్ జాలిగా చూస్తోంది, రక్తపు చారికలతో! – కల్పనా రెంటాలఇవి చదవండి: మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి.. -
కేతు విశ్వనాథ రెడ్డి గారి తెలుగు కథలు!
నాకు ఇష్టమైన కథకుల కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నాకు దక్కిన అదృష్టాల్లో చిన్నతనాననే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం అని రాసి పెట్టబడి ఉంది. రెక్కలు అనే ఆ కథకు నా బొమ్మ ఎంత బాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా. కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను ' నాయనా ' అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో మా రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకించి పోతాను నేను. పెద్దలు, ఇష్టులు, నాకు దగ్గరువారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం పుష్కల బాగా ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కొకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి వందల ఫుట్నోట్స్ చేర్చి ఆ సాహిత్యాన్ని ఇంకాస్త ఎత్తు పెంచారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక , అచ్చుతప్పుల పురుగు పట్టి లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. చేయవలసినంత ఆ నాశనపు పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కొకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు. ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఇంకో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు. కదా, పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని ఎందుకో కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! బహుశా నాకు గల ప్రాంతీయాభిమానమేమో ! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డిగారి పుస్తకాల కవర్లకు చంద్ర గారి కొల్లాజ్ పొకడలు నాకు ఎప్పుడూ సంభ్రమాన్నే కలిగిస్తూ ఉండేవి. విశ్వనాథరెడ్డి గారు తన కాలేజీ ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా తన సేవలందించారు. పంజాగుట్టలో ఉండేది ఆ ఆఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అయితే నాకు గుర్తుండి కృష్ణారెడ్డి గారితో ఆంద్రజ్యోతి లో నా తొలి పరిచయం. శ్రీ రమణ గారిని కలవడం కొరకు రోజూ ఆ పత్రిక అఫీసు కి వెళ్ళేవాడిని, ఆ పక్కనే శ్రీ కృష్ణారెడ్డి గారు కనపడేవారు. అదే సి. సి. రెడ్డి గారి ఆఫీస్ లో అప్పుడప్పుడూ వంశీ అని ఒక పాత దర్శకుడు గారు కూడా కనపడేవారు. నాకు గుర్తు ఉండి అప్పట్లో "తను నేనూ సావిత్రి" అనే సినిమా తీస్తున్నా, టైటిల్ ఎలా ఉంది అని నన్ను ఒకసారి అడిగారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు. అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయిత గా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.--అన్వర్ సాక్షి(చదవండి: 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!) -
Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!
స్కూల్లో మ్యాథ్స్ అవర్... సైన్స్ అవర్ అంటుంటాం. చట్టసభలో జీరో అవర్ అనే మాట వింటుంటాం. స్టోరీ అవర్... ఈ గంట ఎక్కడ నుంచి వచ్చింది?నీలిమ పెనుమర్తి ఆలోచన నుంచి వచ్చింది. రోజుకో గంట కథలు వినమని చెప్తున్నారీమె. యూకేలో ఆచరణలో పెట్టి... ఇండియాకి తెచ్చారు. విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆడియో బుక్స్‌తో స్వచ్ఛమైన భాష నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన నీలిమ ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పిల్లల పెంపకంలో కథలు కూడా ఒక భాగం అయి తీరాలని నమ్ముతారామె. మనదేశంలో స్కూల్ కరికులమ్‌లో పిల్లలకు కథలు లేక΄ోవడం విచారకరం అంటారామె. కథ ్రపాధాన్యం తెలిసిన అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల రోజువారీ క్రమంలో ఓ గంట కథల కోసం కేటాయిస్తున్నాయని, మన దగ్గర అది లోపించడంతో ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఒక విషయాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించగలిగిన నైపుణ్యం కొరవడుతోందన్నారు నీలిమ. భాష ఏదైనా ఆ భాషలో పదాలను స్పష్టంగా ఉచ్ఛరించడం అలవాటు చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అంత స్వచ్ఛంగా మాట్లాడే నేపథ్యం ఉండాలి. ఆ వెసులుబాటు లేని పిల్లలకు తన ప్రయత్నం మంచి భాషను, చక్కటి భావ వ్యక్తీకరణను నేర్పిస్తుందన్నారు నీలిమ. ఏడేళ్ల కిందట ‘స్టోరీ అవర్‘ ఆలోచనకు బీజం పడిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నా రామె.ఓ గంట నిడివిలోనే కథ ‘‘నాకు లండన్ ఇంపీరియల్ కాలేజ్‌లో కెమిస్ట్రీలో ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. మా వారు కూడా స్కాలర్షిప్ మీద లండన్‌లోనే వచ్చారు. అలా 30 ఏళ్ల కిందట యూకేకి వెళ్లడం, చదువు, ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిలయ్యాం. రెండవసారి గర్భిణిగా ఉన్నప్పుడు పీహెచ్‌డీలో విరామం తీసుకున్నాను. ఆ విరామం నా ఆలోచనలను కథల మీదకు మళ్లించింది. పెద్ద బాబుకి కథలు చెప్పడం మొదలుపెట్టాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అదే చిన్నబాబుకి కూడా అలవడింది. మా అబ్బాయిలిద్దరూ గ్రీక్ ΄ûరాణిక గ్రంథాలను కూడా చదివారు. వాళ్లిద్దరి మాటల్లో ఆ పాత్రల గురించిన చర్చ వస్తుండేది.అప్పుడు మన రామాయణాన్ని పరిచయం చేశాను. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్ వాళ్లిచ్చిన ్రపాజెక్ట్ కోసం ఒక స్టోరీ బోర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు రామాయణం ఇతివృత్తంగా చేశాడు. ఆ తర్వాత పిల్లలకు సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్ రాయమని చె΄్పాను. ఆ టాస్క్‌లో మరో చాలెంజ్... కథనం గంటకు మించరాదు. తమకు తోచినట్లు ఎడిట్ చేసుకుంటూ సీతారామలక్ష్మణులు యుద్ధం తర్వాత విజేతలై అయోధ్యకు రావడం దీపావళి వేడుక చేసుకోవడంతో ముగింపు ఇవ్వాలన్నమాట. ఆ సాధన ఆడియో బుక్ ఆలోచనకు రూపమిచ్చింది.పిల్లలే పాట రాశారు!మాల్గుడి డేస్ వీడియోలకు సిగ్నేచర్ ట్యూన్ ఉన్నట్లే మా ఆడియో బుక్స్‌కి కూడా ట్యూన్ ఉండాలని పాట కోసం ప్రయత్నించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికిచ్చాను. తాను రామాయణం కథను ఒక్క వాక్యంలో ‘వారధి నిర్మాణం సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబింబం’ అనే భావంతో రాసింది. అలాగే భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ‘ఎవీ సిమన్స్’ అనే అమ్మాయి ‘లైట్ ద ల్యాంప్స్’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని రాసింది. మంథర విషపూరిత వచనాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరించింది.క్రియేటివ్‌గా సైన్స్ పాఠాలు బాల్యంలో మేము బాలానందం వినేవాళ్లం. సరళంగా సాగే కథనాలు పిల్లల్ని అలరించేవి. నా ఆడియోబుక్స్ కూడా సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘స్టోరీ అవర్ డాట్ కో డాట్ యూకే’ వెబ్సైట్లో ఉచితంగా ఉన్నాయి. భాష శుద్ధంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే శుద్ధంగా ఉంటాయని నా అభి్రపాయం. మంచి భాష మాట్లాడితే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే... మంచి భాష ద్వారా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఉచ్చారణ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అందుకే సైన్స్ సబ్జెక్ట్‌ని కూడా ఈ క్రియేటివ్ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష’’ అని తన ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు నీలిమ పెనుమర్తి. సమయం లేని తల్లిదండ్రుల కోసం...ఇప్పుడు ఉద్యోగాలు దాదాపుగా అందరి జీవితాలనూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కథ చె΄్పాలని ఉన్నప్పటికీ కొంతమందికి అందుకోసం ఓ గంట సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటోంది. వాళ్లకు ఉపయోగపడేటట్లు కథలకు ఆడియో బుక్ రూపమిచ్చాను. దానిని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో తెచ్చాను. మా పిల్లలు శ్రేయాస్, ఆయుర్ ఇద్దరూ హిస్టరీ చదివారు. అక్కడ హిస్టరీ అంటే రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా ఉంటాయి.మా పిల్లలు అలాగే యూకేలో ఉన్న భారతీయమూలాలున్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద మొఘల్స్ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్ చేశాను. ఆ స్టోరీ ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సముపార్జన వరకు సాగింది. అలాగే మన సామెతలను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ‘తాతమ్మ కథలు’. మా అమ్మ, నాన్న, అత్త, మామగారితో ఒక్కో సామెతకు ఒక్కో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్ చేసి రికార్డ్ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో.ఈ కథలకు నాకు మాల్గుడి డేస్ స్ఫూర్తి. యూకేలోని తెలుగు కుటుంబాల పిల్లలు ఈ కథలను వినడం మొదలు పెట్టిన తర్వాత తొలి రోజుకి పన్నెండవ రోజుకీ వారి ఉచ్చారణ మారి΄ోయింది. కథకు అంతటి శక్తి ఉంటుందనే నా నమ్మకం నిజమేనని నిరూపితమైంది. తోలుబొమ్మలతో చేసిన ప్రయోగానికి చాలా ఖర్చయింది, కానీ అది కూడా సంతృప్తినిచ్చింది. ఆరు పాత్రలతో కథను అల్లుకుంటూ రాసుకున్నాం. ఆడియో బుక్ అనువాదాలకు హైదరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయ (ఉప్పల్) విద్యార్థులు, బేగంపేటలోని దేవనార్ (అంధ విద్యార్థుల పాఠశాల) స్కూల్ విద్యార్థులు గళమిచ్చారు.– నీలిమ పెనుమర్తి, స్టోరీ అవర్ రూపకర్త– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
కథల అమ్మమ్మ
నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది. విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి. ‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్‌లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం. కడ్మా అనేది జార్ఖండ్‌లో జెమ్షెడ్పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్‌లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను. అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్‌లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను. ‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను. ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి! నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను. నా అక్షరాలకు చిత్ర రూపం! నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్‌లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్‌లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్‌లో ట్రాన్స్‌లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది! నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్ -
భారత్‌లోనే మొట్టమొదటి దాస్తాంగోయి.. ఈ కళ గురించి మీకు తెలుసా?
‘దాస్తాంగో ప్రదర్శన ఇస్తున్నది ఓ అమ్మాయా!!’ అని బోలెడు ఆశ్చర్యపడుతూనే ప్రేక్షకుల మధ్య కూర్చున్నాడు ఒక ప్రేక్షకుడు. ఇలా కూర్చొని అలా వెళ్లిపోదాం... అనుకున్నాడు.అయితే ప్రదర్శన పూర్తయ్యే వరకు కదలకుండా కూర్చున్నాడు. ఆ హాల్లో నవ్వుల్లో నవ్వు అయ్యాడు. ఏడుపులో ఏడుపు అయ్యాడు. సకల భావోద్వేగాల సమ్మేళనంతో ‘దాస్తాంగోయి’ ఫౌజియాను ఆశీర్వదించాడు. ఉర్దూలో మౌఖిక కథాసాహిత్య కళారూపం... దాస్తాంగో. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ కళారూపంలో అపారమైన పేరు తెచ్చుకొని ‘ఫస్ట్ ఫిమేల్ దస్తాంగోయి’గా గుర్తింపు పొందింది ఫౌజియా... దిల్లీకి చెందిన ఫౌజియాకు స్కూల్ రోజుల నుంచి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్లో ప్రదర్శించే నాటకాల్లో పాల్గొనేది. ఫౌజియా తండ్రి మోటర్‌బైక్ మెకానిక్. ఆర్థిక పరిస్థితి రీత్యా ఫౌజియా ఎప్పుడో చదువు మానేయాలి. ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బుతో పై చదువులు చదివింది. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. దయాల్ సింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరోజు తొలిసారిగా ‘దాస్తాంగో’ ప్రదర్శన చూసింది ఫౌజియా. ఇక అప్పటి నుంచి ‘దాస్తాంగో’ పై ఆసక్తి, అభిమానం పెరిగాయి. తాను కూడా ‘దాస్తాంగోయి’గా పేరు తెచ్చుకోవాలనుకుంది. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) ‘ఇది పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం. మహిళలు చేయలేరు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు ఆదరించరు’ అన్నట్లుగా చాలామంది మాట్లాడారు. ఆ మాటలు విని ఫౌజియా కొంచెం కూడా నిరాశపడలేదు. తనపై తనకు గట్టి నమ్మకం ఉంది. ‘జీవితాంతం దాస్తాంగో చెంతనే ఉండాలనుకున్నాను. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళ గురించి ఈ తరంలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తరానికి కూడా తెలిసేలా దాస్తాంగోకు ప్రాచుర్యం తీసుకురావాలనుకున్నాను’ అంటుంది ఫౌజియా.డానీష్ హుస్సేన్, మహ్మద్ ఫారూఖీలాంటి గొప్ప కళాకారుల నుంచి ‘దాస్తాంగో’ను నేర్చుకుంది ఫౌజియా. ఫౌజియా కథాసంవిధానంలో కృత్రిమమైన భాషా గాంభీర్యం వినిపించదు. పాత దిల్లీ యాస మాత్రమే వినిపిస్తుంది. ‘మన దేశంలో ఎన్నో భాషలకు సంబంధించి ఎన్నో మాండలికాలు ఉన్నాయి. ప్రతి మాండలికానికి తనదైన సొగసు ఉంటుంది. ఈతరంలో చాలామంది తమ యాసను దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది సరికాదు. మన ఊరు, తల్లిదండ్రులు, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకున్నట్లే మన మాండలికం గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి’ అంటుంది ఫౌజియా. ఫౌజియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ముఖ్యంగా ఉర్దూ సాహిత్యం. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ, నానమ్మల నుంచి ఎన్నో కథలు విన్నది. అద్భుతమైన రీతిలో కథలు చెప్పేవారు. కథను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ విరామం ఇవ్వాలి, మళ్లీ ఎక్కడ మొదలు పెట్టాలి... అనే దాంట్లో వారు సిద్దహస్తులు. ఆ మెళకువలు ఊరకే పోలేదు...‘దాస్తాంగో’లో ఫౌజియాకు బాగా ఉపకరించాయి. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) జానపద కథలు మాత్రమే కాకుండా సామాజిక సందేశం ఉన్న ఆధునిక కథలను కూడా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఫౌజియా. దేశవిభజన సమయంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, హింస గురించి కథగా చెబుతున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. కోవిడ్ కల్లోల సమయంలో ఫౌజియాకు ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వడానికి కుదరలేదు. దీంతో ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే ప్రదర్శన ఇచ్చింది. మహాభారతం కథల నుంచి స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం వరకు ‘దాస్తాంగోయి’గా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఫౌజియాకు ఉర్దూ భాషలోనే కాదు హిందీ, ఇతర భాషలలోనూ ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వాలనేది కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) -
గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?
అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్! విచిత్రం! మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’ ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88) -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్‌ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్‌కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్‌కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్‌కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్‌గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్‌గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్‌గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!
సద్ధర్మంఅది శ్రావస్తి నగరానికి దాపున ఉన్న జేతవనం. ఆ వనం మధ్యలో ఉన్న ఆనందబోధి వృక్షం కింద ప్రశాంత వదనంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షు సంఘం ఆ చెట్టు చల్లని నీడలో కూర్చొని ఉన్నారు. వారు ధరించిన కాషాయ వస్త్రాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ వెలుగు వారి దేహం మీద పడి ప్రకాశిస్తోంది. ‘‘భిక్షువులారా! మనం ఎలాంటి ధర్మాన్ని తెలుసుకోవాలి? ఎలాంటి ధర్మాన్ని సేవించాలి? ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి? అని ఆలోచించాలి’’ అన్నాడు గంభీరంగా. భిక్షువులందరూ ప్రశాంతంగా వినసాగారు. మనం పాటించే ధర్మం నాలుగు విధాల ఫలితాలనిస్తుంది. అందులో మొదటిది విషపదార్థం కలిసిన చేదు గుమ్మడికాయ రసం లాంటిది. దీని రుచీ, వాసన, రంగూ ఏదీ బాగోదు. పైగా తాగితే ప్రమాదం కూడా. అలాగే... వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దుఃఖాన్ని ఇచ్చే ధర్మం అలాంటిది.అలాంటి కుశలం ఇవ్వని ధర్మాన్ని గ్రహించి దూరంగా ఉండాలి. ఇక, రెండోరకం ధర్మాచరణ బంగారు పాత్రలో ఉన్న కుళ్ళిన పదార్థం లాంటిది. ఈ పదార్థం రంగు, రుచి, వాసనలు ఇంపుగా ఉంటాయి. పైగా బంగారు పాత్రలో ఉంది. కానీ, దీన్ని సేవిస్తే అనారోగ్యం కలిగి, ప్రాణాలకే ముప్పు. వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇచ్చే ధర్మాచరణ ఇలాంటిది. మరి, భిక్షువులారా! ఒక చెక్క పాత్ర ఉంది. దానిలో ఎన్నో మూలికలతో మరిగిన మూత్రం ఉంది. పాండు రోగానికి అది మంచి ఔషధం. దాని రంగు, రుచి, వాసనలు ఏవీ బాగోలేదు. అయినా దాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది. అలాగే... వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో సుఖాన్ని ఇచ్చే ధర్మాచరణ కూడా ఇలాంటిదే!’’ అన్నాడు. ‘‘అలాగే... ఒక పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి కలిపిన బెల్లం రసం ఉంది. అది కడుపులో బాధల్ని హరించే ఔషధం. ఆ బెల్లం రసం రంగు బాగుంటుంది. రుచి బాగుంటుంది. వాసన కూడా బాగుంటుంది. అది చేసే మేలు కూడా బాగుంటుంది. ఇలా వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది సద్ధర్మం.’’ ‘‘భిక్షువులారా! సద్ధర్మం అనేది శరత్కాలంలోని సూర్యుని కాంతి లాంటిది. అది ప్రకాశిస్తుంది. మనిషి దుఃఖాన్ని పారద్రోలుతుంది’’ అని చెప్పి, అందరి వంకా ఓసారి చూశాడు. అందరి మనస్సుల్లోని ఉషస్సు వారందరి ముఖాల్లో తేజస్సుగా ప్రతిఫలిస్తోంది! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా ప్రకాశిస్తూ నేఉంటుంది!) -
ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!
అది మండు వేసవి. అప్పుడే సూర్యోదయం అయింది. లేత కిరణాలు సోకి సాలవృక్షం పచ్చదనాన్ని వెదజల్లుతూ పరవశించిపోతోంది. ఆ అడవిలో తానే ఎత్తైన వృక్షాన్ని అనే గర్వంతో కూడిన ఆనందం అది. అంతలో..ఒక కాకి ఎగిరి వచ్చి ఆ వృక్షం కొమ్మల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో వాలింది. దాని ముక్కున పండిన మాలువా పండు ఉంది. ఆ పండును కాలివేళ్ళతో తొక్కి పట్టి, గుజ్జునంతా తినేసింది. ముక్కును అటూ ఇటూ రాచి, వాలుగా చూసి, ‘కా..కా’’ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. అలా కాకి వెళ్ళిపోగానే, తన మీద వదిలి వెళ్ళిన మాలువా విత్తనాన్ని గమనించిన ఆ సాలవృక్షం ఆలోచనలో పడింది. భయం పుట్టి వణికింది. అయినా తనని తాను సమాధాన పరచుకుని శాంతించింది. వేసవి ముగిసింది. మాలువా విత్తనం టెంకె పగిలింది. దానిలోంచి నిగనిగలాడే విత్తనం బయటకొచ్చి పడింది. ఆ విత్తనాన్ని చూడగానే సాలవృక్షానికి వేళ్ళు కుంగినట్లయింది. పెనుగాలికి కూలినట్లు భావించింది. కార్చిచ్చుకి తగలబడి బూడిద అయినట్లు అనిపించింది. నిలువెల్లా వణకసాగింది. మొత్తుకోసాగింది. అప్పుడు ఆ వృక్షం చుట్టూ ఉండే ఇతర వృక్ష మిత్రులంతా ‘‘దుఃఖ కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘సాలవక్షం విషయం చెప్పింది. అప్పుడు ‘‘సాలవృక్షమా! చింతించకు. అనవసరంగా భయపడుతున్నావెందుకు? ఆ విత్తనాన్ని నెమలి తినవచ్చు. జింక నమిలి వేయవచ్చు. కార్చిచ్చు కాల్చవచ్చు. ఎవరైనా మనిషి చూసి తీసుకుపోవచ్చు. ఎండకు ఎండిపోవచ్చు. నీడలో నాని కుళ్ళిపోవచ్చు. చెద పురుగులు తినొచ్చు. చీమలు తీసుకుపోవచ్చు. ఇన్ని అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని అది మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా వెంటనే వానలు ఆగిపోతే, మొలకలోనే మాడిపోవచ్చు. కాబట్టి లేనిపోని భయాన్ని ఊహించుకుని వణికిపోకు’’ అంటూ ధైర్యం చెప్పాయి. తోటి వృక్షాల ఓదార్పుకు ఆ సాలవృక్షం ధైర్యాన్ని తెచ్చుకుంది. కానీ ఆ విత్తనం మొలవడానికి ఏ అవరోధం కలగలేదు. ఆ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో చక్కగా మొలకెత్తింది. వేగంగా పెరిగింది. పెద్ద పెద్ద తమలపాకుల్లా లేత పచ్చని ఆకుల తీగపైకి లేచింది. దాన్ని చూసి సాలవృక్షం లబోదిబోమంది. మరలా వృక్షాలన్నీ– ‘‘నీవు మహావృక్షానివి. అది చిన్న తీవె. అయినా ఆ బుజ్జి కాడ ఎంత ముచ్చటగా, అందంగా ఉందో, అది నీకు మంచి అలంకారంగా ఉంది. ఈ చిన్న తీవె నిన్నేమి చేయగలదు’’ అని మరలా ధైర్యం చెప్పాయి. వాటి మాటలు విని సాలవృక్షం కొంత సాంత్వన పడింది. కానీ.. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బలపడింది. దాని బెరడును చీల్చుకుని వేళ్ళను లోనికి పంపింది. ఆ వృక్ష సారాన్నే పీల్చుకోసాగింది. చివరికి చెట్టంతా కమ్ముకుపోయింది. సారాన్ని కోల్పోయిన సాలవృక్షం ఎండి.. క్రమంగా జీవాన్నీ కోల్పోయింది. ఒకప్పుడు అడవిలో తిరిగే మనుషులు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ‘‘ఆ పెద్ద సాలవృక్షం దగ్గర ఆ మహా సాలవృక్షం పక్కన..’’ అని ఆనవాళ్ళను చెప్పుకుంటూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు.. ఆ మాలువా పొద పక్కన’’ అంటూ చెప్పుకోసాగారు. చెడ్డవారిని చేరదీయడం వల్ల, చెడ్డతనం పట్ల ఉపేక్ష భావంతో ఉండటం వల్ల అది మన ఉనికికే చేటు తెస్తుంది. మనిషి మనసులో చెడు కోరికలు రేగినప్పుడు.. ‘‘ఇది చిన్న కోరికే కదా! ఈ ఒక్కసారికీ ఈ పని చేసి ఇక ఆ తరువాత చేయకుండా ఉంటే మనకు వచ్చే నష్టం లేదు. కలిగే కష్టమూ లేదు’’ అనుకుని ఆ చెడ్డ కర్మలకు పూనుకుంటారు. కానీ, ఆ తర్వాత వాటిని మానడం అటుంచి, మరింత లోతుకు కూరుకుపోతారు. కామ రాగాలన్నీ ఇలానే ప్రవేశించి, పెరిగి పెరిగి మన ఉనికికే ప్రమాదాన్ని తెస్తాయి. వాటిని మనస్సులో పుట్టకుండా చేసుకోవాలి. లేదా పుట్టిన వెంటనే నివారించుకోవాలి. ఆపేక్షతో ఉపేక్ష చూపితే మన ఉనికికే నిక్షిప్తం చేస్తాయి. ఇది కామరాగాల పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో బుద్ధుడు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో ‘మోక్షానికి కామం కూడా ఒక మార్గమే’ అని చెప్పే సాధువులు కొందరు ఉండేవారు. వారికి కనువిప్పు కలిగించడం కోసం, బుద్ధుడే ఈ కథ చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
కథ చెబుతాం ఊ కొడతారా..
చిన్నప్పుడు ‘అనగనగా..’అంటూ అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పే రోజులు గుర్తున్నాయా? కథను ఊరిస్తూ.. ఊహించేలా చెబుతుంటే ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసేవాళ్లం. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’గురించి విని నేర్చుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. దృశ్య రూపంలో కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. అందుకే మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యం అనన్య సామాన్యం. అయితే నేటి కంప్యూటర్ యుగంలో ఆ అదృష్టం పిల్లలకు పూర్తిగా దూరమైంది. కెరీర్ పరుగులో పడిపోయి.. పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ తల్లిదండ్రులకు దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లలు కథలంటే గుగూల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ చదువుపై వారికి ఆసక్తి కలిగించి.. తద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని, నిద్రాణంగా దాగి ఉన్న కళలను వెలికి తీసే ఉద్దేశంతోనే పుట్టిందే స్టోరీ టెల్లింగ్ డే. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది. – విశాఖపట్నం డెస్క్ నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా.. వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా యాజమాన్యాలకు అభ్యర్థిస్తున్నారు . ఈ పరిస్థితుల్లో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ‘మియావాకీ’ అలా మొదలైంది కథల ద్వారా పిల్లలను చదువు వైపు మళ్లించడం సులభమని ఉపాధ్యాయురాలు, ప్రముఖ స్టోరీ టెల్లర్ షింపీ కుమారి అంటున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నివాసి అయిన షింపీ కుమారి ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఉద్యోగ రీత్యా 2006లో విశాఖ వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేట్ పాఠశాలలో సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయం కమిటీ కార్యదర్శి డీఎస్ వర్మ చొరవతో 7 నెలల కిందట మియావాకీ స్టోరీ టైమ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పౌర గ్రంథాలయంలో నెలలో రెండు రోజులు ఒకటి నుంచి 4వ తరగతి పిల్లలకు ఉదయం 10.15 నుంచి 11.30 వరకు, 5వ తరగతి నుంచి 8 తరగతి చదివే పిల్లలకు 11.15 నుంచి 12.30 వరకు కథలు చెప్పడం ప్రారంభించారు. తొలుత షింపీ కుమారి ఒక్కరే పిల్లలకు చక్కని కథలు చెబుతూ.. వివిధ అంశాలు వివరించేవారు. ఆమె తలపెట్టిన ఈ కార్యానికి తర్వాత నగరానికి చెందిన స్టోరీ టెల్లర్, వాయిస్ ఆరి్టస్ట్ సీతా శ్రీనివాస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఎడ్యుకేటర్ శ్రావ్య గరుడ, ఉపాధ్యాయిరాలు రబియా నవాజ్ తోడయ్యారు. వారు స్వచ్ఛందంగా తమ సేవలందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతలో భాగస్వాములయ్యారు. ఒక్క స్టోరీ టెల్లింగ్ ఎన్నో కళలను వెలికి తీస్తుందని షింపీకుమారి తెలిపారు. స్టోరీ టెల్లింగ్ క్లాస్ పూర్తయిన ప్రతిసారీ తాము పిల్లలతో డ్రాయింగ్, క్రాఫ్టŠస్, సింగింగ్, పప్పెట్రీ, ఒరిగామి తదితర కృత్యాలు పిల్లలతో చేయిస్తామని.. తద్వారా పిల్లల్లో తాము అనుకున్నది వ్యక్తీకరించే స్వతంత్రత వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయం మూడో అంతస్తులోని పిల్లల విభాగంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. కథ అంటే ఓకే అంటారు సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లలను అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఓ కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రలను ఊహించుకుంటారు. అందుకే కథలను అందరూ ఇష్టపడతారు. కెనడాలో మూడేళ్ల కిందట స్కూల్ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో అది ఎప్పట్నించో ఉంది. చరిత్ర, పురాణాలను కథల ద్వారానే మనం చెప్తాం కదా.. ఊహాశక్తితో పాటు భాషా పరిజ్ఞానం కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పే పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఓ కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. మాతృభాషతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. కథ చెప్పడం ఓ కళ శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ. కథల్లోని అంశాలకు తగ్గ ట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇప్పటి స్టోరీ టెల్లర్స్ వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారు. ఎంచుకున్న కథతోపాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఓ స్టోరీ టెల్లర్ నైపుణ్యాన్ని తెలియజేస్తా యి. కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. కథల్లా పాఠాలు కథలు వింటూ పాఠాలు వినడం.. కథలే పాఠాలైపోవడం నాకెంతో నచ్చింది. ఇంతకు ముందు చదివింది గుర్తుండేది కాదు. ఇప్పుడు మా బుక్స్‌లోని లెసన్స్ కథల్లా మారిపోయాక.. బాగా గుర్తుంటున్నాయి. మార్కులు కూడా బాగా వస్తున్నాయి. – బి.తనూశ్రీ, 3వ తరగతి, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ క్లాసెస్ బాగుంటున్నాయి స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ చాలా బాగుంటున్నాయి. లైబ్రరీలో కొత్తకొత్త పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. బుక్స్ రీడింగ్ వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కథలు నేర్చుకోవడంతో పాటు చెప్పడం అలవాటు చేసుకుంటున్నా.. – సూర్య విహాన్ వర్మ, 3వ తరగతి, టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అద్భుతాలు చేయవచ్చు కథలు ఎవరికైనా నచ్చుతాయి. అవి ఏ వయసు వారికైనా గుర్తుండిపోతాయి. కథ, కథలు చెప్పే విధానంలోను నవ్యత ఉంటే అవి మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. మేం చేస్తున్నది అదే. కథల ద్వారా చిన్ని మనసుల్లో నైపుణ్యాన్ని చొప్పిస్తున్నాం. ఈ నెల 26న మియావాకీ స్టోరీటైమ్లో మళ్లీ కలుద్దాం. – సీతా శ్రీనివాస్, స్టోరీ టెల్లర్, వాయిస్ ఆర్టిస్ట్ విద్యార్థులకు మేలు చేస్తుంది స్టోరీ టెల్లింగ్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా కథలా చెబితే వారికి ఇట్టే గుర్తుండిపోతుంది. ఒక్క చదువే కాదు.. సరైన రీతిలో భావవ్యక్తీకరణ అనేక విధాలుగా జీవితంలో ఉపయోగపడుతుంది. స్టోరీ టెల్లింగ్ ద్వారా ఆ నైపుణ్యం పిల్లలకు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. – శ్రావ్య గరుడ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) ఎడ్యుకేటర్ -
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు అతుక్కుపోతున్నారా?
‘అనగనగా’ అనే కథలకంటే ‘కొకోమెలెన్, సూపర్ జోజో’ అంటేనే ఊకొడుతున్నారు ఇప్పటి బుజ్జాయిలు. కార్టూన్ వీడియోలను, టామ్ అండ్ జెర్రీ కథలను ఆస్వాదిస్తూ.. అనుకరిస్తూ పెరుగుతున్నారు! ఈ ‘స్మార్ట్’ చిచ్చరపిడుగులు. సరైన పద్ధతిలో సాంకేతికతను స్వీకరించేలా చేయడమే ఈ తరం తల్లిదండ్రులకున్న టఫ్ టాస్క్! బలవంతంగా ఫోన్ లాక్కుని.. వాళ్లకు బోరుకొట్టకుండా సమయాన్ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మరెలా? సింపుల్.. మీ స్మార్ట్ ఫోన్లో ఈ కిడ్స్ యాప్స్‌ను డౌన్లోడ్ చేస్తే సరి. మెంటల్అప్ యాప్ ఈ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ యాప్.. అన్ని వయసుల వారికీ వినోదభరితమైన సైంటిఫిక్ లెర్నింగ్ గేమ్‌లను అందిస్తుంది. ఇది క్రిటికల్ థింకింగ్ గేమ్స్, డెసిషన్ మేకింగ్ గేమ్స్, అనేక ఇతర సూపర్ బ్రెయిన్ కాగ్నిటివ్ గేమ్స్‌ను ఉపయోగించి పిల్లల మెదడుకి పదునుపెడుతుంది. 123 కిడ్స్ అకాడమీ అక్షరాలు, సంఖ్యలు, పదాలు, రంగులు వేయడం, అద్భుతమైన కథలు, నర్సరీ రైమ్స్.. ఇలా అన్నింటినీ ఈ యాప్ అందిస్తుంది. ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా వీటన్నింటినీ నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషనల్ గేమ్స్, ఇంటరాక్టివ్ వర్క్‌షీట్స్, క్విజ్ వంటివెన్నో ఇందులో ఉంటాయి. ముస్సిల మ్యూజిక్ స్కూల్ ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్ మ్యూజిక్, మ్యూజిక్ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్ నేర్పిస్తుంది. ఫోనిక్స్ జీనియస్ (ఐఫోన్, ఐప్యాడ్స్‌లో మాత్రమే) ఇది అక్షర శబ్దాలతో ఆంగ్ల పదాలను గుర్తించడంలో సహకరిస్తుంది. స్పష్టంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం నేర్పిస్తుంది. ఫోనెమిక్ అవగాహనను కల్పించడానికి, ఆంగ్లంలో మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్ చే యడానికి యూజ్ అవుతుంది. ముస్సిల మ్యూజిక్ స్కూల్ ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్ మ్యూజిక్, మ్యూజిక్ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్ నేర్పిస్తుంది. ఆసమ్ ఈట్స్ (ఐఫోన్లో మాత్రమే) ఈ యాప్..హె ల్దీ ఫుడ్ మీద చాలా వివరాలను అందిస్తుంది. జంక్ ఫుడ్‌కు దూరం చేస్తుంది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలతో పిల్లలకు వినోదభరితంగా ఆటలు ఆడిస్తూనే.. పోషకాహారం మీద అవగాహన కలిగిస్తుంది. స్మార్ట్ టేల్స్ (లెర్నింగ్ గేమ్స్) సైన్స్ , టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్ట్స్‌ను తేలికగా పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఈ యాప్. ఆహ్లాదకరమైన, వినోదాత్మకమైన పద్ధతిలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరిన్ని యాప్స్: ఖాన్ అకాడమీ కిడ్స్ (రెండేళ్ల తర్వాత వారికి) ఎబిసీ మౌస్, ఎపిక్(అన్ని వయసుల వారికి), డుయోలింగో(హైస్కూల్) నిక్ జూనియర్ (ప్రీస్కూల్), క్విక్ మ్యాథ్ జూనియర్(ఎలిమెంటరీ స్కూల్) స్విఫ్ట్ ప్లేగ్రౌండ్స్(కోడింగ్), సింప్లీ పియానో(పియానో నేర్చుకోవడానికి) -
నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!
ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది. అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు. పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా. ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని ఏం తింటున్నాం? దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే. ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం. మంచి భోజనం మాదిరిదే మంచి కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా. భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది. సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు. గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి అర్థమయ్యింది. అసలే ఊరికి కొత్త . బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని దిగమింగగలిగిన మీ వంటి ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు. "అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై. యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) "చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక. యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి. "పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..) 'ఎవరది?" అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన. ఏమిటండి సంగతి?" "నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా" - అన్వర్ -
ఘనంగా ‘స్త్రీ హృదయం’ పుస్తకావిష్కరణ
ప్రముఖ కవి, రచయిత, నటులు, సంగీతకారులు పెయ్యేటి రంగారావు కథల సంపుటి ‘స్త్రీ హృదయం’ను సామవేదం షణ్ముఖ శర్మ ఆవిష్కరించారు. ఆన్లైన్లో జూమ్ వేదికగా జూలై 16న ఆస్ట్రేలియా, అమెరికా, భారతదేశం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీ నరేంద్ర ప్రార్థనా గీతంతో శుభారంభం చేయగా, విజయ గొల్లపూడి ఆస్ట్రేలియా, అమెరికా, హాంకాంగ్, న్యూజిలాండ్, భారతదేశం నుండి ప్రముఖులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సిడ్నీ నుంచి పోతుకూచి మూర్తి అధ్యక్షత వహించారు. ప్రారంభ ఉపన్యాసంలో వంశీ రామరాజు మాట్లాడుతూ..‘స్త్రీ హృదయ’ పెట్టడంలో ఇందులోని కథలకున్న ప్రాముఖ్యత తెలుస్తోందన్నారు. ‘పిల్లికి చెలగాటం కథ చదివానని, కథలో భావవ్యక్తీకరణ బాగుందన్నారు. ఇక్కడ స్థానికంగా తెలుగువారిని ప్రోత్సాహిస్తూ ఉంటానని, భావితరాలకి మన భాష, సంస్కృతి అందటం ముఖ్యమ’ని బ్లాక్ టౌన్ కౌన్సిలర్ లివింగ్ స్టన్ చెట్టిపల్లి అన్నారు. ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. రచయిత స్త్రీ హృదయాన్ని లేత అరిటాకులో పెట్టి అందించారు. అంత సున్నితమైనది స్త్రీ హృదయం అన్నారు. రచయిత పెయ్యేటి రంగారావును ‘నవరస కథా సార్వభౌముడు’గా సినీగీత రచయిత భువనచంద్ర కొనియాడారు. సిడ్నీ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు శోభ వెన్నెలకంటి కథా రచయితకు శుభాకాంక్షలు తెలియచేసారు. సామవేదం షణ్ముఖశర్మ ఆశీస్సులతో నూతన పతాక వేదిక ‘సకల కళాదర్శిని, సిడ్నీ ఆస్ట్రేలియా’ లోగోను ఈ సందర్భంగా విడుదల చేసారు. ఈ వేదిక నెలకొల్పటంలో ముఖ్యోద్దేశ్యం సకల కళలకు ఈ వేదిక నిలయంగా కళాకారులని ప్రోత్సహించడమని విజయ గొల్లపూడి అన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశాన్ని శ్రీదేవి సోమంచి చదివి వినిపించారు. తెలుగు తియ్యదనంతో పాటు జీవిత సత్యాలను ‘స్త్రీ హృదయం’ పుస్తకంలో ఆవిష్కరించారని సామవేదం షణ్ముఖ శర్మ పేర్కొన్నారు. ఇంకా నూతనంగా వెలసిన ‘సకల కళాదర్శిన’ ద్వారా ఎన్నో మంచి పనులు జరగాలని ఆకాంక్షించారు. కాలిఫోర్నియా నుంచి డా. రవి జంధ్యాల, సినీ రచయిత దివాకర బాబు, హాస్య రచయిత వంగూరి చిట్టెన్ రాజు, ప్రముఖ సాహితీవేత్త సుధామ, నవలా రచయిత్రి గంటి భానుమతి, రచయిత్రి తమిరిశ జానకి, సిడ్నీ నుంచి విజయ చావలి, న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సోమంచి సుబ్భలక్ష్మి, శాక్రిమెంటో నుంచి తెలుగు వెలుగు మాసపత్రిక ప్రధాన సంపాదకులు వెంకట్ నాగం తదితరులు ఈ పుస్తకావిష్కరణలో పాలుపంచుకున్నారు. -
జైహింద్ స్పెషల్: ఉద్వేగాలను దట్టించి.. కథల్ని ముట్టించారు
తొలినాళ్ల తెలుగు కథకుల చేతుల్లో స్వాతంత్య్రకాంక్షతో కథానిక నడిచింది. స్వాతంత్య్రోద్యమంలోని అంతర్భాగాలైన సంఘసంస్కరణ, మద్యపాన నిషేధం, అస్పృశ్యతా నివారణ, హరిజనుల దేవాలయ ప్రవేశం, విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి అంశాలు ఆ కథలలో చోటుచేసుకున్నాయి. ఈ ఇతివృత్తాలతో దాదాపు ఓ యాబై కథలు వచ్చాయి. శ్రీపాద సుబ్రహ్యమణ్య శాస్త్రి, రాయసం వెంకటశివుడు, వజ్జ బాబూరావు, బందా కనక లింగేశ్వరరావు, కరుణకుమార, కనుపర్తి వరలక్ష్మమ్మ, అడివి బాపిరాజు, అందే నారాయణస్వామి, చలం.. ఇలా మరికొద్ది మంది కథకులున్నారు. అంతర్లీన సందేశాలు సంస్కరణవాదానికి చెందిన కథానిక బందా కనకలింగేశ్వరరావు రాసిన ‘గ్రుక్కెడునీళ్లు’ (1932). వెట్టి మాల వెంకటప్ప బ్రాహ్మణ స్త్రీ మహాలక్ష్మమ్మ చుట్టూ తిరిగిన కథ అది. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘ఇలాంటి తవ్వాయి వస్తే’ (1934) కథలో హిందూ మాదిగలకు ఆ వూరి చెరువులో నీరు తెచ్చుకునే అవకాశం లేకపోవడంతో వారు ముస్లిం మతం స్వీకరించి ఆ హక్కును పొందటం ప్రధాన అంశం. ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో రాయసం వెంకటశివుడు రాసిన మంచి కథ ‘నీలవేణి’ (1934). మత్స్యకారుల కులానికి చెందిన నిరక్ష్యరాస్యురాలైన నీలమ్మ ఉద్యమ సందర్భంలో పోలీసులాఠీ దెబ్బలకు గురైన స్వాతంత్య్రోద్యమ కార్యకర్త ప్రసాదరావు చౌదరికి తన సపర్యల ద్వారా చేరువై అతనిని భర్తగా పొందుతుంది. ఈ కథానిక అంతర్భాగం మద్యపాన నిషేధం. సంస్కరణలకు ప్రేరణ కుక్కలనైనా చేరనిస్తాం కాని హరిజనులను దేవాలయంలోకి ప్రవేశించనీయబోమనే అమానుషాన్ని ప్రశ్నిస్తూ బ్రాహ్మణ భావజాలంపై దండెత్తిన కథ ‘పరివర్తనం’ (1940). కథారచయిత అందే నారాయణస్వామి హరిజనులకు దేవాలయం ప్రవేశంతో పాటు అస్పృశ్యతా నివారణ, కులాల మధ్య సామరస్యత అనే అంశాల నేపథ్యంలో ఈ కథను రాశారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో హరిజనుల దేవాలయ ప్రవేశం, యజమాని–పాలేరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని సంస్కరణ దృష్టితో ‘నరసన్న పాపాయి’ కథలో రచించారు అడవి బాపిరాజు. ఆయనే రాసిన మరో కథ ‘బొమ్మలరాణి’.. మీనాక్షి, కామేశ్వరరావుల కులాంతర వివాహం ద్వారా సంస్కరణాభిలాషను వ్యక్తం చేస్తుంది. మరోకథలో.. ‘‘రుక్మిణీ! ఆ పూలదండ సీమనూలుతో గట్టినదేమో నేను ముట్టను’ అంటాడు గోపాలరావు. ఆ యోధపత్ని ఇలా చెబుతుంది : ‘సీమనూలు చేతి నుండి తొలగి అయిదు మాసములు యిరువది దినములు’ అని. ఆ మాటల ద్వారా విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం ఐదు నెలల ఇరవై రోజులుగా సాగుతున్నట్లు చెబుతారు కథలో కనుపర్తి వరలక్ష్మమ్మ. వీరిదే మరొకటి స్వాతంత్య్రోద్యమ కథానిక ‘కుటీరలక్ష్మి’ (1931). ‘మల్లుపంచ’ కథానికలో వజ్జ బాబూరావు విదేశీ వస్తు వ్యామోహం, వస్త్రధారణపై వ్యంగ్య ధోరణిలో విమర్శించారు. (విదేశీ వస్త్ర బహిష్కరణ సందర్భంగా వాటిని దహనం చేసే సమయంలో కట్టుకోవటానికి గుడ్డ్డలేని పేదలు వాటిని తమకు దానం చేయమని కోరడమనే కోణాన్ని కొడవటిగంటి కుటుంబరావు తన ‘చదువు’ నవలలో చిత్రించారు). ఆంధ్ర విద్యార్థి పక్షపత్రికలో 15 డిసెంబర్ 1947న ప్రచురితమైన కె.వి. సుబ్బయ్య కథానిక ‘ఆత్మశాంతి’ అత్యంత నాటకీయతతో కూడుకున్నది. రహస్యోద్యమ సన్నివేశం ‘1942 ఆగస్టు విప్లవదినాలు’ ఉగ్రవాద కార్యకర్తల గురించిన కథానిక. రహస్యోద్యమ కార్యకర్త మాధవ పోలీసుల దాడి నుండి తప్పించుకొని తన సహ కార్యకర్తతో కలిసి ఒక పూరి కుటీరానికి చేరుతారు. ఆ పూరి పాకలో నివసించే జట్కావాలా.. మాధవకు అడ్డు నిలబడి పోలీసుల బారి నుండి కాపాడి తీవ్రంగా గాయపడతాడు. అంతకు మునుపే అదే జట్కాబండిలో మాధవ ప్రయాణించినప్పుడు అతను తన కొడుకే అని జట్కావాలా గుర్తిసాడు. ఆ సందర్భంలో జట్కావాలా.. మాధవతో తన తండ్రిని నేనే అని చెప్పుకుంటాడు. ‘‘నా పుత్రుడు అకుంఠితమయిన దేశభక్తుడు, మాతృ సేవకుడని తెలిసికొనగలిగాను. నా కుమారుని ప్రాణాలకు నా ప్రాణాలను ధారబోసి కాపాడుకొనగిలిగితిని. నేను కేవలము నా కుమారునికే మేలు జేసినట్లు గాదు. మాతృభూమికే సేవజేసినట్లు..’’ అన్న ఆత్మశాంతితో కన్నుమూస్తాడు. సాహిత్యంలో సంచలనాలు సృష్టించిన చలం 1924లో సహాయ నిరాకరణోద్యమ కాలంలో రాసిన కథ ‘సుశీల’. సుశీల నారాయణప్ప భార్య. పోలీసు అధికారి సులేమాన్‌తో సన్నిహితంగా వుంటుంది. ఈ ముక్కోణపు వ్యవహారంలో ఎంతో మధనపడి సుశీల చివరకు నారాయణప్ప మనిషే అవుతుంది. (1947లో రాసిన ‘1960’ కథానికలో గాంధీజీ సామాజిక ఆర్థిక సిద్ధాంతాలు అమలులోకి వస్తే దేశం ఎంత నిర్జీవంగా వుంటుందో వ్యంగ్య ధోరణిలో చెప్పాడు చలం.) – పెనుగొండ లక్ష్మీనారాయణ ‘అరసం’ జాతీయ కార్యదర్శి హరిజనోద్ధరణ పర్యటనలో భాగంగా 1933లో మద్రాసు చేరుకున్న మహాత్మాగాంధీ. కుల వ్యవస్థకు, కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన ఆ సమయంలో ఎన్నో రచనలు చేశారు. అనేక ప్రసంగాలు ఇచ్చారు. (ప్రతీకాత్మక చిత్రం) -
పిల్లలు చెప్పిన పేరెంట్స్ కథ
తమ తల్లిదండ్రుల పెళ్లిళ్ల గురించి రాసిన ఇద్దరు రచయితల గురించి మాత్రమే నాకు ఇటీవలి వరకూ తెలుసు. ఒకరు నిగెల్ నికల్సన్. ఈయన రాసిన ‘పోర్ట్రెయిట్ ఆఫ్ ఎ మ్యారేజ్’ పుస్తకం తన తండ్రి, రచయిత అయిన వీటా శాక్ విల్లే–వెస్ట్, హెరాల్డ్ నికల్సన్ మధ్య అస్థిరమైన, విశిష్టమైన సంబంధం గురించి చెబుతుంది. మరొకటి జరీర్ మసానీ రాసిన ‘అండ్ ఆల్ ఈజ్ సెడ్: మెమోయిర్ ఆఫ్ ఎ హోమ్ డివైడెడ్’ అనే పుస్తకం. శత్రుత్వం, పిచ్చితనం, అవిశ్వాసం వంటి కారణాల వల్ల మినూ మసానీ తన భార్య శకుంతల నుంచి విడిపోయిన ఉదంతాన్ని ఇది తెలుపుతుంది. ఆ రోజుల్లో ఆమె ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఐ)లో చేరాలని భావించారు. కాగా మినూ మసానీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండేవారు. వీరి ఉదంతం అప్పట్లో చాలా ఆసక్తి గొలిపింది. నేను ఇప్పుడే మూడో పుస్తకం కూడా చదివాను. దానిపేరు ‘సుమిత్ర అండ్ ఎనీస్ టేల్స్: అండ్ రెసిపీస్ ఫ్రమ్ ఎ కిచిడీ ఫ్యామిలీ’. ఇది సీమా చిస్తీ తల్లిదండ్రులు, అసాధారణమైందే అయినప్పటికీ వారి ప్రగాఢమైన ప్రేమ వివాహం గురించిన కథ. ఇది చాలా కొత్తగా, వైవిధ్యపూరితంగా ఉంది. నేను సీమా చిస్తీ వల్లే ఈ మూడో పుస్తకం చదివాను. ఆమె అప్పుడే కాలేజీ విద్య పూర్తి చేసి తన తొలి ఉద్యోగాన్ని నాతోనే ప్రారంభించింది. అందుకు ఈ పుస్తకం నా టేబుల్ వద్దకు వచ్చేసరికి దాన్ని తీసుకోకుండా ఉండలేకపోయాను. సుమిత్ర, ఎనీస్ వివాహం అసాధారణమైందని చెప్పాలి. ఆమె కన్నడిగ, హిందూ వ్యక్తి. అతడు ఉత్తరప్రదేశ్‌లోని దేవిరయా నుంచి వచ్చాడు. ముస్లిం. ఆమె అతడికంటే ఏడేళ్లు పెద్దది. ఇరు కుటుంబాల్లో ఎవరికీ చెప్పకుండానే పెళ్లాడారు. అదృష్టవశాత్తూ తర్వాత వారిని రెండు కుటుం బాలు సాదరంగా ఆహ్వానించాయనుకోండి! తమ కథను చెప్పడంలో, సీమ ఒక మార్మిక శైలిని స్వీకరించింది. కొన్నిసార్లు తన తల్లితండ్రులను మా అమ్మ అనీ, మా నాన్న అనీ రాసిందామె. కానీ చాలాసార్లు మాత్రం వారిని సుమిత్ర, ఎనీస్ అంటూ థర్డ్ పర్సన్ సింగ్యులర్ (ప్రథమ పురుష)లో రాసింది. నిజాయితీగా చెప్పాలంటే, ఇలాంటి హైబ్రిడ్ శైలిని మొదటిసారి చూశాను. ఇది చాలా ప్రభావశీలంగా ఉంది. న్యూఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో మెయిన్ స్ట్రీమ్ పత్రికా కార్యాలయం బేస్మెంట్లో సుమిత్ర, ఎనీస్ కలిశారు. దట్ ఓల్డ్ స్టేపుల్, ద హౌస్హోల్డర్, దిస్, ఇన్ 1964 వంటి సినిమాలు చూస్తూ వారి మధ్య ప్రేమ వికసించిందని సీమ రాసింది. మరింత ఎక్కువగా తన గురించి తెలుసు కోవడానికి ఆమె ఎన్నటికీ విముఖత చూపదని ఎనీస్కి అది సంకేతంలా కనిపించిది. కేవలం స్నేహితులుగా మాత్రమే తాము ఉండాల్సిన అవసరం లేదని ఆ సంకేతం ఎనీస్కి సూచించింది. ఇది కాల పరీక్షకు నిలిచిన సందర్భం. అది ఫలించింది కూడా! తన తల్లితండ్రుల నేపథ్యం, జీవితం, వారి ప్రేమ గాథ గురించి సీమ చెబుతున్నప్పుడు అన్నీ వివరించి చెప్పలేని నిరాకరణ కనిపించింది. అలాంటి పరిస్థితి మీలో మరింత ఆకాంక్షను రేపుతుంది. సుమిత్ర, ఎనీస్ ఇద్దరూ ఎగువ తరగతి వారే. అత్యంత వేడిగా ఉంటూ మిత్రపూరితంగా లేని నగరంలో తమకంటూ ఒక గూడుకోసం, కనీస వనరుల కోసం ప్రయత్నిస్తూ తొలి తరం వలసవచ్చినవారి గురించిన కథ వీరిది. జీవించడానికి 1960లలో ఒక నివాసం కోసం వెతకటం అనేది ఇప్పుడు కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలాగే ఉంటుంది. ఒక సందర్భంలో లీజుపై సంతకం పెట్టిన తర్వాత ఎనీస్ అంటే అనీష్ (హిందువు) కాదని ఇంటి యజమానురాలికి అర్థమైపోయి ఆ లీజును వెనక్కు తీసుకుంది. పెళ్లయిన సంవత్సరానికి సీమ పుట్టింది. తన పేరును అలా పెట్టడం తనకు గమ్మత్తుగా ఉండిందని సీమ ఒప్పు కుంది. ఎనీస్ తల్లి నీలిరంగు ఉత్తరంలో బోలెడన్ని సూచనలు రాసి పంపింది. సుమిత్ర ఆ సూచనలను పాటిం చింది. తన భర్త ఇంటిపేరు పెట్టుకోవడానికి ఆమె స్వచ్ఛందంగా సిద్ధపడిపోయింది. నిఖా పట్ల సంతృప్తి చెందింది. కానీ ఆమె కూతురు విషయానికి వచ్చేసరికి సీమ అనే పేరు పెట్టడంలో కాస్త సందిగ్ధత ఏర్పడింది. సీమ అనే పేరు హిందూ, ముస్లిం రెండు మతాల పేరును స్ఫురించడంతో సరిగ్గా సరిపోయింది. అయితే తన పేరు గురించి సీమ పెద్దగా పట్టించు కోలేదు కానీ, సుమిత్ర–ఎనీస్ కథలో పేర్లకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ రెండు పేర్లకూ ఒకే అర్థం ఉంది. ఎనీస్ అంటే అరబిక్‌లో మంచి మిత్రులు అని అర్థం. సుమిత్ర అనే సంస్కృత పదానికీ అదే అర్థముంది. ఈ ఇద్దరికీ సంబంధించిన ఉమ్మడి లక్షణాల్లో పేర్లు కూడా కలిసిపోయాయి. ఈ పుస్తకంలో సగంపైగా తల్లి తన కుమార్తెకు ఎంపిక చేసే వంటకాల గురించే ఉంటుంది. అయితే ఆ కుమార్తెకు వాటిని చేసేంత సమయం ఉండదు. పైగా వాటిని ఆమె ఒప్పుకోదు. అవి సబ్టైటిల్ని మాత్రమే వివరిస్తాయి. కానీ అవి దేన్నో సూచిస్తాయి. ఆమె తల్లిదండ్రుల వివాహం ఇరుమతాల సంగమం, కలిపిన కిచిడీ లాంటిది. దీనికి మించి మెరుగ్గా నేను ఈ పుస్తకం గురించి వర్ణించలేను. తొలి నామవాచకం ఇరువురూ ఒక చెంతకు వచ్చి, ఒకే అస్తిత్వంగా మారిపోవడాన్ని సూచిస్తుంది. ఇక రెండోది ఒక కొత్త ఆనందకరమైన దాన్ని రూపొందిం చేందుకు వివిధ భాగాలను తెలివిగా, ఉద్దేశపూర్వకంగా కలపడాన్ని సూచిస్తుంది. (క్లిక్: సంఘీభావమే పరాయీకరణకు మందు) మినూ, శకుంతల దంపతుల లాగా సుమిత్ర, ఎనీస్ పోరాడారా లేక వీటా, హెరాల్డ్ లాగా విభిన్న మార్గాలను అనుసరించారా అనేది నాకు తెలీదు. సీమ కథ అంతవరకూ తీసుకుపోలేదు. కానీ అది మంచిదే. తల్లితండ్రుల అసమ్మ తిని పిల్లలు ఏ మేరకు వెల్లడించవచ్చు అనే అంశంలో ఒక పరిమితి ఉంటుంది. సామరస్యపూర్వకమైన స్నేహం ఆహ్లాదకరమైన పఠనానికి తావిస్తుంది కదా! (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కరణ్ థాపర్ సీనియర్ పాత్రికేయులు -
ఏపీ రైతులు భళా.. నీతి ఆయోగ్ కథనాల్లో 21 మందికి స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం ఆవశ్యకతను తెలుపుతూ నీతి ఆయోగ్ విడుదల చేసిన సేంద్రియ వ్యవసాయదారుల స్ఫూర్తిదాయక కథనాల్లో 21 మంది ఏపీ రైతులకు స్థానం దక్కింది. వీరంతా వరి, వేరుశనగ, కందులు, ఉల్లిపాయలు, కూరగాయలు తదితర పంటలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించారు. సేంద్రియ వ్యవసాయంతో తమ ఆదాయం పెంచుకున్న వీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారంటూ నీతి ఆయోగ్ ‘కాంపెడియం ఆఫ్ సక్సెస్ స్టోరీస్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్’ పేరిట దేశవ్యాప్తంగా 110 మంది కథనాలు ప్రచురించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 21 మంది ఉన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి, చీపురుపల్లి ఉప సర్పంచ్ బెల్లాన శ్రీదేవి కూడా వీరిలో ఉన్నారు. చదవండి: ఇక్కట్లు లేని ‘ఇల’ పంటలు! ఏపీ రైతులు వీరే.. (ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన..) ♦చిర్తి నారాయణమూర్తి, పి.కొత్తగూడెం, నాతవరం, విశాఖ జిల్లా ♦అనుగుల వెంకటసుగుణమ్మ, నాగమంగళం, పలమనేరు, చిత్తూరు జిల్లా ♦బెల్లాన శ్రీదేవి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా ♦ఆర్.భాస్కర్‌రెడ్డి, ఎన్.గుండ్లపల్లి, బెలుగుప్ప, అనంతపురం జిల్లా ♦చందు సత్తిబాబు, అమ్మపాలెం, పెదవేగి, పశ్చిమగోదావరి జిల్లా ♦ఎస్.దిలీప్‌కుమార్, పెదకొండూరు, దుగ్గిరాల, గుంటూరు జిల్లా ♦గమ్మెలి లక్ష్మి, ఐతగుప్ప, పాడేరు, విశాఖ జిల్లా ♦గెడ్డ అప్పలనాయుడు, గజపతినగరం, విజయనగరం జిల్లా ♦హనుమంతు ముత్యాలమ్మ, కోసరవానివలస, పార్వతీపురం, విజయనగరం జిల్లా ♦కంటిపూడి సూర్యనారాయణ, తీపర్రు, పెరపలి, పశ్చిమగోదావరి జిల్లా ♦కిల్లో ధర్మారావు, రంగసిల, హుకుంపేట, విశాఖ జిల్లా ♦కొత్తపల్లి శివరామయ్య, టి.కొత్తపల్లి, మైదుకూరు, కడప జిల్లా ♦మాగంటి చంద్రయ్య, ఎన్.గొల్లపాలెం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా ♦మన్నేటి గంగిరెడ్డి, చెన్నమరాజుపల్లి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ♦ముప్పాల నిర్మలమ్మ, అరిమేనుపాడు, ఓజిలి, నెల్లూరు జిల్లా ♦వై.పద్మావతమ్మ, లొడ్డిపల్లి, ఓర్వకల్లు,కర్నూలు జిల్లా ♦బి.రామకోటేళ్వరరావు, గ్రామనపల్లె, కలసపాడు, వైఎస్సార్ జిల్లా ♦శ్యాం రఘునాథ్, బంగారుపేట, బుచ్చయ్యపేట, విశాఖ జిల్లా ♦బి.శ్రీనివాసరావు, కొణితివాడ, వీరవాసరం, పశ్చిమ గోదావరి జిల్లా ♦కె.వెంకటరమణ, దుద్దుకూరు, దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లా ♦టి.యామిని, ఇన్నుగుంట, ఓజిలి, నెల్లూరు జిల్లా -
ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ఫీచర్.. హైలెట్స్ ఆఫ్ ది ఇయర్..!
ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ సమయంలో సింహావలోకనం చేసుకున్నట్లుగా పెళ్లి, పుట్టినరోజు, శుభకార్యం.. ఇలా ‘స్పెషల్ మూమెంట్స్’ను గుర్తు చేసుకోవడం మనకు అలవాటు. ఇప్పుడు మనసులోనే వాటిని గుర్తు చేసుకోనక్కర్లేదు. ఫొటోలు, వీడియోల రూపంలో చూసుకొని మరోసారి సంతోషించవచ్చు. ఇన్స్టాగ్రామ్ ‘ప్లేబ్యాక్’ అనే ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఆర్కైవ్‌లో నుంచి మనకు నచ్చిన 10 సందర్భాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. షేర్ చేయవచ్చు. గత ఏడాది కాలంలో వినియోగదారులు తమకు నచ్చిన స్టోరీలను తిరగి తమ స్టోరీ మీద జత చేసుకునే ఒక కొత్త ఫీచర్. వీటిని మీకు నచ్చిన మిత్రులతో కూడా షేర్ చేయవచ్చు. ఇది ఒక లిమిటెడ్ ఫీచర్. ఈ ఏడాది ముగింపు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు కూడా మీకు నచ్చిన పాత స్టోరీలను ప్లేబ్యాక్ ఫీచర్ సహాయంతో క్రియేట్ చేసుకోండి. (చదవండి: Fact Check: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..?) -
మరో విషాదం: ప్రముఖ రచయిత్రి కన్నుమూత..
సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రముఖ రచయిత్రి వాణీ మోహన్ (80) మరణించారు. ఇటీవల చలిజ్వరం బారిన పడిన ఆమె రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో చెన్నైలోని స్వగృహంలో ఆమె మృతి చెందారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు ఆదివారం చెన్నై చేరుకోనున్నారని, అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పదేళ్ల క్రితం కన్నుమూసిన ఆమె భర్త వఠ్యం మోహన్ రైల్వే ఉన్నతాధికారిగా ఉత్తరాది రాష్ట్రాల్లో విధులు నిర్వహించేవారు. ఈ కాలంలో అక్కడి తెలుగువారితోఅనేక కార్యక్రమాలను ఈమె నిర్వహించేవారు. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలు, విశేషాలను భర్తతో కలిసి గ్రంథస్థం చేశా రు. చెన్నై వచ్చాక ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ స్ఫూర్తితో రచయితగా ఎదిగిన వాణీ మోహన్ రాసిన అనేక కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి చెన్నై కేంద్రంలో దశాబ్దాలపాటు అనేక అంశాలపై ఆమె ప్రసంగించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన సొసైటీ సభ్యురాలిగా ఆ భవనాన్ని నిర్మింపజేసిన వైఎస్ శాస్త్రి ఏర్పాటు చేసిన అనేక కార్య క్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. కాగా ఆమె మృతికి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి కార్యదర్శి వై. రామకృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. -
దీపావళి 2021: పండుగ సంబరాలు, కథలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి అంటే వెలుగులు విరజిమ్మే దీపాలు. సరదాలు..సంబరాలు. చిచ్చర పిడుగుల ముఖాల్లో సంతోషాల మతాబులు. పిండివంటల ఘుమ ఘుమలు. కొత్తబట్టలు, కొత్త అల్లుళ్లు. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దాజరుపుకునే దీపకాంతుల పండగే దీపావళి. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే వెలుగు దివ్వెల పండుగ దీపావళి సందర్భంగా మా ప్రియమైన పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. జాతి కుల మత వర్గ విచక్షణలేకుండా సర్వమానవ సౌభ్రాతృత్వంతో దశ దిశలా చాటే పండుగే దీపావళి పండుగ. భారతదేశ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే పండుగల్లో మరో విశిష్టమైన పండుగ దీపావళి. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా ధంతేరస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ణన్ పూజ, భాయ్ దూజ్ ఇలా ఐదు రోజుల పాటు దీపావళి వేడుక సాగుతుంది. లోకాన్ని పీడించిన నరకాసురుడి పీడ విరగడైనందుకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటున్నామనేది ప్రాచుర్యంలో ఉంది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ తర్వాతి రోజు దీపావళి. అయితే దీపావళికి సంబంధించి చాలా పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భమని ఒక కథ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగా, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగా ఈ దీపావళి సంబరాన్ని చేసుకుంటారు. అంతేకాదు తమకు కలిగిన దాంట్లో తృణమో, ఫణమో ఇతరులకు దానం చేయడం కూడా మనకు అలవాటు. -
ఆపిల్ 'థింక్ డిఫరెంట్'..వీళ్లకి మూడింది!
థింక్ డిఫరెంట్ క్యాప్షన్ తో ప్రపంచ టెక్ మార్కెట్‌ను శాసిస్తున్న ఆపిల్ మరో అడుగు ముందుకేసింది. సంస్థలో పని చేసే ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించేలా చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా ఆ ప్లాట్ ఫామ్‌లో ఎకరువు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు మాయని మచ్చని మిగుల్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ ఈ తరహా చర్యలు తీసుకోవడం టెక్ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఆపిల్ సంస్థలో వరల్డ్ వైడ్‌గా పనిచేస్తున్న 500 మంది ఉద్యోగుల నుంచి అభిప్రాయాల్ని సేకరించింది. అభిప్రాయాలతో పాటు జాత్యహంకారం, లింగవివక్ష, అసమానత్వం, వివక్ష, బెదిరింపు, అణచివేత, బలవంతం, దుర్వినియోగం ఇలా అన్నీ అంశాల్లో ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుంది. #appletoo,#metto అని పిలిచే ఈ వేదికకు ఆపిల్ సంస్థ గ్లోబల్ సెక్యూరిటీ టీమ్‌లో సెక్యూరిటీ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న 'చెర్ స్కార్లెట్' ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెర్ స్కార్లెట్ మాట్లాడుతూ..ఆపిల్‌లో నిజమైన మార్పును చూడాలనుకుంటున్న ఆపిల్ ఉద్యోగులు పనివేళల్లో తలెత్తుతున్న సమస్యల గురించి స్పందించాలని కోరుతున్నాం.దీంతో ఆపిల్‌లో బాసిజంతో పాటు రకరకాల వేధింపులకు గురి చేస్తున్న వారికి చెక్ పెట్టినట్లవుతుంది' అని అన్నారు. ఇందులో మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు సైతం పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. కాగా, ఆపిల్ నిర్ణయంపై టెక్ దిగ్గజ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. థింక్ డిఫరెంట్‌తో సొంత సంస్థలో ఉద్యోగుల వేధింపుల గురించి బహిరంగంగా చర్చించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చదవండి : ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి! -
Friend Ship Day 2021: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
ఫ్రెండ్.. అందరికీ ఇష్టమైన పదం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లు.. బాధలో ఉన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితుడు.. సంతోషాన్ని పంచుకునేందుకు వెంట ఉండేది స్నేహితుడు. జాతి, మతం అన్న తేడాల్లేకుండా ఇద్దరు వ్యక్తులను కలిపిఉంచే బంధం కేవలం స్నేహానిది మాత్రమే. ఏ రక్త బంధంతో నిమిత్తం లేకుండా చివరి వరకు నిలిచేది స్నేహితుడు. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే అన్న నానుడి కూడా స్వచ్ఛమైన స్నేహం నుంచి జన్మించిందే. ఏ స్వార్థం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత ప్రపంచంలో అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో చాలామంది స్నేహితులు కరోనా సమయంలో అండగా నిలిచారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడారు. కాల పరీక్షకు ఎదురుగా నిలుస్తూ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంలా కనిపిస్తున్న పలువురిపై స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనాలు.. ఫేస్బుక్ మిత్రుల రూ.1.12లక్షల సాయం సాక్షి, ధర్మపురి(కరీంనగర్): ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచి రూ.1.22లక్షల సాయం అందించారు. ధర్మపురికి చెందిన నరుముల లక్ష్మీ భర్త కొన్నినెలల క్రితం చనిపోయాడు. కొడుకు పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. కూలీపని చేస్తూ.. కూతురును బీఈడీ చదివిస్తోంది. భర్త మరణంతో పోషణ కష్టమైంది. ఇల్లుగడవని పరిస్థితి ఎదురైంది. కూతురు చుదువు మానిపించేద్దామని అనుకుంది. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ లక్ష్మీ కష్టాలను గురించి జూలై 5న ఫేస్బుక్లో పోస్టుచేసి సాయం అందించాలని మిత్రులను కోరాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై మిత్రులు రూ.1.17లక్షలు, ధర్మపురికి చెందిన కొరెడె కిరణ్‌కుమార్ మిత్రబృందం రూ.5 వేలు సాయం అందించారు. డిపాజిట్ బాండ్లను సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ చేతుల మీదుగా శనివారం అందించారు. ఆదుకున్న స్నేహితులు కోరుట్ల: తమతో చదువుకున్న స్నేహితుల్లో మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఏడాది క్రితం అనారో గ్యంతో మరొక రు మృతి చెందడంతో మిత్రులు వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కోరుట్లలోని ఆదర్శ విద్యాలయం 1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విడిపోయినా తమ స్నేహ బంధాన్ని వీడలేదు. ఈ మిత్ర బృందంలో గాజెంగి శ్రీధర్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పోతుగంటి శ్రీనివాస్, అంబల్ల ఆనంద్, తాళ్ల్లపల్లి శ్రీనివాస్‌లు తమ మిత్రు ల సహకారంతో రూ.1,02,000 శ్రీధర్ కూతురు నిత్య పేరిట డిపాజిట్ చేశారు. మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1,60,000 ఆర్థికసాయం అందించారు. బడి సోపతికి 37ఏళ్లు బోయినపల్లి(చొప్పదండి): విభిన్నానికి మారుపేరు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్. ఆయనకు స్నేహమంటే ప్రాణం. స్నేహాన్ని మనసుతో చూస్తారు. ఉద్యోగంతో పాటు స్నేహాన్ని సైతం ఓ బాధ్యతగా తీసుకుని 37ఏళ్లుగా అల్లుకుపోతున్నారు. హుస్నాబాద్ 1983–84 ఎస్సెస్సీ బ్యాచ్ ఇతడిది. బడిసోపతులు పేరిట శ్యాంప్రసాద్‌లాల్ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ, సోపతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గెట్టు గెదర్ నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి అశోక్, కొండూరి శ్రీనివాస్, ఆశోక్‌కుమార్ కామారపు, అన్నవరం శ్రీనివాస్, బాపిరాజు, రజని, లత, ఉమారెడ్డి కోర్‌కమిటీ సభ్యులతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా చనిపోయిన ఇద్దరు మిత్రుల కూతుళ్ల వివాహానికి రూ.4 లక్షలు, ఆర్థికంగా లేని స్నేహితుల కూతుర్ల వివాహానికి రూ.2.50 లక్షలు, అనారోగ్యంతో బాధ పడుతున్న మిత్రులకు రూ.2లక్షల చొప్పున సాయం అందించారు. పాతికేళ్ల స్నేహం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో నివాసం ఉంటున్న వేముల తిరుపతి, ఎలగొండ రవీందర్ టైలరింగ్ పని మీద తొ లిసారి బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లినపుడు కలుసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా కలిసే ఉంటున్నారు. రవీందర్ కుటుంబం కరోనా బారిన పడగా.. తిరుపతి అన్ని వి«ధాలుగా అండగా ఉండి మనో«ధైర్యం కలిగించాడు. దైవం కలిపిన బంధం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన హనుమాండ్ల శ్రీకాంత్, మహ్మద్ ఫరీ ద్ ఆరోతరగతి నుంచి స్నేహితులు. గత మే నెలలో శ్రీకాంత్ ఇంట్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఫరీద్ కు ఫోన్ చేశాడు శ్రీకాంత్. రాత్రి గంటలకు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆక్సిజన్ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పడకలు లేవు. తనకున్న పరిచయాలతో ఆక్సిజన్ బెడ్ తెప్పించాడు. వారంపాటు కంటికి రెప్పలా కాపాడాడు. ‘మొదట్నుంచి అతనే లేకపోతే ఈ రోజు నేనిలా ఉండలేక పోయేవాడిని’ అని శ్రీకాంత్ చెప్పాడు. క్లాస్మేట్స్.. జాబ్మేట్స్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లికి చెందిన మాడిచెట్టి సాయికిరణ్, వాసాల సంతోశ్, మోగులోజి నరేశ్ ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఒకేపాఠశాల,ఇంటర్, డిగ్రీ కలిసి చదివారు. గ్రామంలో కలిసి సాధనచేసి 2019లో పోలీస్ ఉద్యోగాలు సాధించారు. సాయికిరణ్ ఏఆర్ పీసీగా కరీంనగర్లో, సంతోష్ మంచిర్యాలలో టీఎస్ఎస్పీ పీసీగా, నరేశ్ సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పీసీగా ఉద్యోగం చేస్తున్నారు. -
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం.. ‘టిక్లింగ్ టేల్స్’
పిల్లల ఊహాశక్తికి సరైన ఇంధనం కథ. పిల్లల మెదళ్లను చురుగ్గా మార్చగలిగే సాధనం కథ కానీ, ఈ డిజిటల్ యుగంలో యంత్రాలతో కుస్తీ పడే పిల్లలకు కథ చేరువలో లేదు.నాయనమ్మ, తాతయ్య లేని చిన్న కుటుంబాలు.సంపాదనలో తల్లీదండ్రులవి తీరికలేని క్షణాలు. ఇలాంటి లోకంలో పిల్లల మానసిక శక్తి గురించి ఆలోచించారు డాక్టర్ శ్వేత.టిక్లింగ్ టేల్స్ అంటూ పిల్లలకోసం కథల పందిరి అల్లుతున్నారు. రాజస్థాన్‌లో పుట్టి పెరిగిన శ్వేత వృత్తిరీత్యా దంతవైద్యురాలు. తల్లి అయ్యాక మూడేళ్ల కొడుకు తను ఏం చెప్పినా ‘ఊ..’ కొట్టే విధానం ఆమెను కట్టిపడేసింది. ఎంతో తెలుసుకోవాలనే ఆరాటం గల ఆ చిన్న వయసు ‘కథ చెప్పవూ’ అని అడుగుతున్నట్టుగా అనిపించేది’ అంటారు శ్వేత. ఆ ఆలోచనే ఇప్పుడు వేలాది మంది పిల్లలకు కథలు చెప్పేలా చేసింది అంటారామె. అక్కణ్ణుంచే ‘టిక్లింగ్ టేల్స్’అంటూ లిటిల్ స్టార్స్‌కి కథల పందిరి వేస్తోంది. తల్లిదండ్రులకు కథలు చెప్పడంలో నైపుణ్యాలు చెబుతుంది. స్కూళ్లలో కథల వర్క్‌షాప్స్ నడుపుతోంది. పిల్లల పుట్టిన రోజులు, పాఠశాల వార్షికోత్సవాలు.. అది ఇది అని ఏమీ లేకుండా పిల్లలు ఎక్కడుంటే అక్కడ కథలతో దోస్తీ చేయిస్తుంది. రచయిత్రిగా, కథకురాలిగా, శిక్షకురాలిగా, కోచ్‌గా, టిక్లింగ్ టేల్స్ డైరెక్టర్‌గా డాక్టర్ శ్వేత అద్భుతమైన పాత్రలను పోషిస్తోంది. చదవని వారికి వినిపించే కథ ‘చిన్నతనం లో తల్లితో కలిసి భయం భయంగా లైబ్రరీకి వెళ్లిన తొలిరోజులను ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటుంది శ్వేత. అక్కడ తను చూసిన కథల పుస్తకాలు పఠనం పట్ల ఎలా ఆసక్తిని పెంచిందో చెబుతుంది. ఆ ఆసక్తే ఇప్పుడు ప్రతిభావంతులైన కథకుల బృందానికి నాయకత్వం వహించేలా చేసింది’ అంటోంది ఈ డాక్టర్. ‘బాగా చెప్పాలంటే బాగా చదవాలనే విషయాన్ని ఎప్పుడో గ్రహించాను. ఇప్పుడు పిల్లలను చూడండి. వారు ఎంతసేపూ వీడియో గేమ్స్ ఆడటమే చూస్తున్నాం. కథల పుస్తకాలు చదవడం అనేదే మనం చూడటంలేదు. ఈ తరం ఎక్కడికి వెళుతుందో అనే ఆందోళన నాది. నా కొడుకుతో కాసేపు సమయం గడిపినా వాడిని కథల్లోకి తీసుకెళ్లిపోతాను. నేను చదివిన విషయాలన్నీ వాడికి కథలుగా మార్చి చెబుతుంటాను. వాడిపై ఆ కథల ప్రభావం, ఫలితాన్ని చూసినప్పుడు తల్లిగా నా ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్ధమైంది. అప్పుడే మా ఇంటి నాలుగు గోడలు దాటి కథలు వినే పిల్లల సంఖ్య పెరగాలన్న విషయం గ్రహించాను. ఎక్కువమంది పిల్లలకు కథలు వినసొంపుగా చెప్పాలంటే నేను మరిన్ని పుస్తకాలతో ప్రేమలో పడాలి. ఈ వాస్తవాన్ని గ్రహించి ఇంట్లో పుస్తకాల లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను. ఎవరైనా తల్లితండ్రులు ఈ సూత్రాన్ని పాటించవచ్చు’ అంటారు డాక్టర్ శ్వేత. ఈ కథాస్టార్ బృందంలో ఆరుగురు కథలు చెప్పే ప్రతిభావంతులైన తల్లులు ఉన్నారు. ఈ బృందం రేపటితరానికి కథలతోఎలాంటి మార్గం వేయాలో సమావేశాలు ఏర్పరచుకుంటారు. తాము చేయబోయే, చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రణాళికలు రచిస్తుంటారు. కథా ప్రపంచంలోకి ప్రయాణం ‘టిక్లింగ్ టేల్స్’ అంటూ కథలు చెప్పడం 2013 లో ప్రారంభించింది డాక్టర్ శ్వేత. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదామె. టిక్లింగ్ టేల్స్ ముఖ్య ఉద్దేశం పాఠకులను పెంచడం, పిల్లలను తిరిగి పుస్తకాల లోకంలోకి తీసుకురావడం, వారిని చదివించేలా చేయడం, కథ చెప్పే సెషన్ల తోపాటు, ఉపాధ్యాయులతో శిక్షణా కార్యక్రమాలు, పాఠశాల సెషన్లు ఏర్పాటు చేయడం వంటివీ ఉంటాయి. ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కథ ‘కథలు వినడం ప్రతి బిడ్డ జన్మహక్కు. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పిల్లలకి మంచి ఆహారాన్ని ఇస్తారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవితం కోసం మనసు కూడా హెల్దీగా ఉండాలి. అందుకు ప్రతి బిడ్డకు మంచి ఆలోచన విధానం కలిగించాలి. కథలు ప్రతి బాల్యంలో అంతర్భాగం గా మారాలి. ఇంట్లో ఒక మేధావిని పెంచాలనుకుంటే ఆ బిడ్డకు అద్భుత కథలు చెప్పాలి. అలాగని ఉనికిలో లేని విషయాల గురించి చెప్పకూడదు. కథ ద్వారా ఏది మంచిది, ఏది మంచిది కాదనేది వారికి తెలిసిపోవాలి. కథలు చెప్పేటప్పుడు పిల్లలను తక్కువ అంచనా వేయవద్దు..’ అంటూ తల్లిదండ్రులకు, టీచర్లకు తన వర్క్‌సెషన్ల ద్వారా వివరిస్తారు డాక్టర్ శ్వేత. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తున్న టిక్లింగ్ టేల్స్ వర్చువల్ ప్లానెట్ వెంచర్ ద్వారా కథా శ్రవణాన్ని అందిస్తోంది. పిల్లలకు పుస్తకాలు అందేలా చూడటంతోపాటు మ్యూజిక్‌తో కూడిన ఆడియో కథలనూ జతచేసి ఇస్తున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఆసక్తికరంగా ఆడియో కథల పుస్తకాల ద్వారా పదాల ఉచ్చారణ, పఠనం, శబ్దాన్ని నేర్పుతున్నారు. పిల్లలు కథను గుర్తుకు తెచ్చుకోవడానికి, తిరిగి ఆస్వాదించడానికి దేశవ్యాప్తంగా పప్పెట్ షోలను కూడా నిర్వహిస్తాం’ అని చెబుతున్నారు ఈ డాక్టర్. -
యువతులకు జీవిత పాఠం.. కవితత్త కథ
చదువు అర్ధంతరంగా ఆగిపోయింది. అత్తగారింట్లో అడుగుపెట్టడం కోసమే ఆమె పుస్తకాలు అటకెక్కాయి. తండ్రి అనారోగ్యం ఆ నిర్ణయానికి కారణమైంది. అత్తగారిల్లు పూర్తిగా కొత్త... అక్కడి వాతావరణం కొత్త... ఈ సమస్య ఏ అమ్మాయికైనా ఉండేదే. అయితే ఈ అమ్మాయికి భాష కూడా కొత్త. తెలుగమ్మాయి మరాఠా కుటుంబంలో అడుగుపెట్టింది. వాళ్లు తెలుగు మాట్లాడేవాళ్లే అయినా ప్రతి ఆచారం, సంప్రదాయం మరాఠా పద్ధతిలోనే జరిగేది. ఈ తెలుగమ్మాయికి మరాఠా సంప్రదాయం కాదు కదా పెళ్లి నాటికి తెలుగు సంప్రదాయాలు కూడా పెద్దగా తెలియవు. అలా బేలగా అత్తగారింట్లో అడుగుపెట్టి... రెండు సంప్రదాయాలను కలబోసుకుంటూ తనను వ్యక్తిగా మలుచుకుని ఒక శక్తిగా నిర్మించుకున్న రేణిగుంట కవిత పరిచయం ఇది. ఇప్పుడామె సామాజికంగా వెనుకబడిన యువతులకు జీవితం విలువ తెలియ చేస్తున్నారు. అనవసరమైన అపోహలతో అత్తగారింటి పట్ల, అత్తింటి వారి పట్ల దూరం పెంచుకుంటున్న యువతులకు తన జీవితాన్ని ఒక పాఠంలా వివరిస్తున్నారు. అలాగే పిల్లలకూ కథలు చదివి వినిపిస్తున్న ఈ ‘కవితత్త’ కథ ఇది. భర్తతో కవిత ‘‘పుట్టింట్లో పదిహేనేళ్లు చదువుకున్నాను, ఆపేసిన చదువును అత్తగారింట్లో పదహారేళ్లపాటు కొనసాగించగలిగాను. నాన్న సింగరేణి ఉద్యోగి. రామకృష్ణాపూర్లో ఉద్యోగం. ఐదవ తరగతి వరకు సింగరేణిలోనే చదువుకున్నాను. ఆరవ తరగతికి జవహర్ నవోదయ విద్యాలయకు వెళ్లాను. ఇంటర్ వరకు నవోదయలో చదివాను. పరిస్థితులకు అనుగుణంగా మెలగగలిగే నేర్పు నాకు నవోదయ విద్యావిధానమే నేర్పించింది. ఆ విద్యావిధానం వల్ల జీవితాన్ని చూసే దృష్టి కోణం మారిపోతుంది. ఇంటర్ తర్వాత బీఫార్మసీలో సీటు వచ్చింది. అయితే అదే సమయంలో నాన్న ఆరోగ్యం దెబ్బతిన్నది. నేను పెద్దదాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముళ్లు. ఆడపిల్ల బాధ్యత తీర్చుకుంటే చాలన్నట్లు హడావుడిగా నాకు పెళ్లి చేసేశారు. అలా 1998లో ఇరవై ఏళ్లకు సిర్పూర్ కాగజ్ నగర్లో అత్తగారింట్లో అడుగుపెట్టాను. వాళ్లది మరాఠా సంప్రదాయ కుటుంబం. మా వారు గవర్నమెంట్ టీచర్. ఉమ్మడి కుటుంబంలో కొత్త సంప్రదాయాల మధ్య ఊపిరిసలపని మాట నిజమే. మానసికంగా పెళ్లికి సిద్ధంగా లేకపోవడంతో అమ్మవాళ్లు నాకు ఇంటి పనులేవీ నేర్పించలేదు. బలహీనంగా ఉన్నానని బాగా గారం చేస్తూ ఏ పనీ చేయనిచ్చేవారు కాదు. అత్తగారింట్లో అలా కుదరదు కదా! అయితే అన్నింటినీ తట్టుకుని నిలబడి నన్ను వాళ్లు అర్థం చేసుకునే వరకు ఎదురు చూశాను. నా విజయ రహస్యం అదే. ఇంట్లో వాళ్లు నన్ను ఆదరించడంతోపాటు నాకు చదువుకోవాలని ఉందనే కోరికను కూడా గౌరవించారు. నేను పరీక్షలకు ప్రిపేరవుతుంటే మా అత్తగారు భోజనం ప్లేట్లో పెట్టి ఇచ్చేవాళ్లు. అత్తగారు పోయాక మామగారు కూడా అంతే ఆదరంగా చూశారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో క్లాసులకు వెళ్లినప్పుడు, పరీక్షలకు వెళ్లినప్పుడు మా మామగారు మా ఇద్దరబ్బాయిలకు స్వయంగా వండిపెట్టి మరీ, పిల్లల బాగోగులు చూసుకున్నారు. అత్తగారింటితో మనల్ని మనం మమేకం చేసుకోగలగాలి. మన జీవిత నిర్మాణంలో అత్తగారిల్లు ప్రధానమైన పునాది అని మర్చిపోకూడదు’’ అని అన్నారు కవిత. పెళ్లి తర్వాతే ఆమె ఎం.ఎ. ఇంగ్లిష్, ఎమ్మెస్సీ సైకాలజీ, సైకాలజీలో డాక్టరేట్ చేశారు. ‘షీరోజ్’ ఆవిర్భావం నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చినప్పుడు ఏదో సాధించాననే సంతృప్తి కలిగింది. అప్పటి వరకు నా లక్ష్యం ఏమిటి? అనేది తెలియకుండా... ఇద్దరు బిడ్డల తల్లిగా పిల్లల్ని పెంచుకుంటూ, అర్ధంతరంగా ఆగిపోయిన అక్షర ప్రయాణాన్ని కొనసాగించడంలో మునిగిపోయాను. టీచర్ ఉద్యోగంలో చేరిన తర్వాత నన్ను నేను నిలబెట్టుకోగలిగాననే ఆత్మసంతృప్తి కలిగింది. ఆ తర్వాత ఇంకా ఏదో చేయాలనే ఆసక్తి పెరిగింది. కథల పుస్తకాల సేకరణ సమయంలో ఒక అవసరం తెలిసింది. మా తరంలో పిల్లలున్న ఇళ్లలో చందమామ కథల పుస్తకాలు కనిపించేవి. ఇప్పుడు పిల్లలకు కథల పుస్తకాల అలవాటు తప్పి పోయింది. కొంతమంది పిల్లల కోసం ఇంగ్లీష్ కథల పుస్తకాలు తెప్పించుకుంటున్నారు. కానీ తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది. తెలుగులో చదవడం రాని పిల్లల తరం తయారవుతోంది. అందుకే పిల్లలకు కథలు వినిపించే బాధ్యత తీసుకున్నాను. ‘కవితత్త కథలు’ పేరుతో నీతి కథలు చెప్పి రికార్డు చేశాను. వాటికి ఫీజు చెల్లించాల్సిన పని లేదు, ఉచితంగా వినవచ్చు. ఇక మా మంచిర్యాల వంటి అభివృద్ధి చెందని పట్టణాలు, గ్రామాల్లో అమ్మాయిలకు కెరీర్ అవకాశాల పట్ల అవగాహన ఉండడం లేదు. వారికి గైడెన్స్ ఇచ్చే వాళ్లు కూడా తక్కువే. అందుకే రెండేళ్ల కిందట ‘షీరోజ్’ సంస్థను స్థాపించాను. ఇది మా మంచిర్యాల దాటి బయట ప్రపంచం పెద్దగా తెలియని వాళ్లకు అవగాహన వేదిక. యూఎస్ కల... కలగానే మా తమ్ముళ్లిద్దరూ యూఎస్‌లో స్థిరపడ్డారు. నన్ను కూడా వచ్చేయమన్నారు. నాక్కూడా యూఎస్ క్రేజ్ బాగానే ఉండేది. ఎండాకాలం సెలవుల్లో పిల్లల్ని మా అమ్మ దగ్గర పెట్టి, నేను హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉండి మరీ టెస్టింగ్ టూల్స్ వంటి కోర్సులు చేశాను. అవకాశం అంది వచ్చింది. కానీ మా వారికి పెద్దగా ఇష్టం లేకపోయింది. వద్దని చెప్పలేదు కానీ, నీ యిష్టం అనే మాటను మనస్ఫూర్తిగా చెప్పడం లేదనిపించింది. ‘లక్షలాది మంది సాఫ్ట్వేర్ నిపుణుల్లో ఒకదానివిగా ఉండడం కంటే, మంచి టీచర్‌గా పేరు తెచ్చుకోవడం ఇంకా బాగుంటుంది కదా! నీ లాగ ఉత్సాహం ఉన్న వాళ్లు మహిళల కోసం ఏదైనా చేయవచ్చు కూడా’’ అన్నారు. ఇక యూఎస్ ఆలోచన మానుకున్నాను. మా వారి సూచనలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ‘షీరోజ్’. ఇక నేను సైకాలజీ చదివాను కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్ కూడా చేస్తున్నాను. మహిళల కోసం చేస్తున్న సేవకు ఒక వ్యవస్థగా నిర్మించాలనేది ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దీనిని చేరుకున్న తర్వాత మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాను’’ అన్నారు కవిత చిరునవ్వుతో. – వాకా మంజులారెడ్డి, ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: ఎం. సతీశ్ కుమార్, పెద్దపల్లి -
'జింబో' కథలు
కరోనా సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు రిటైర్డ్ జడ్జి మంగారి రాజేందర్ జింబో. వెంటనే ఒక యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఆగస్టు చివరి వారం నుంచి మొదలుపెట్టి రోజుకో కథను పోస్తూ చేస్తూ నేటితో 100 కథలను పూర్తి చేశారు. న్యాయరంగంలో తాను చూసిన అనుభవాలే ఈ కథలు. కోర్టులు, పోలీసులు సామాన్యులకు అన్నిసార్లు న్యాయం చేయడం లేదని, ఈ వ్యవస్థలు సవ్యంగా నడవాల్సిన అవసరం ఉందని ఈ కథలు చెబుతున్నాయి. ‘మనుషులందరిలో ఒకే రక్తం ఉంటుంది. అలాగే పోలీసులందరిలోనూ ఒకే రక్తం ఉంటుంది’ అని ఆయన రాస్తారు. రిటైర్డ్ జడ్జి మంగారి రాజేందర్ తన కలం పేరు ‘జింబో’ ద్వారా ప్రసిద్ధులు. ఆయన రాసిన కథలు ఐదు సంకలనాలుగా వెలువడ్డాయి. ‘రూల్ ఆఫ్ లా’, ‘జింబో కథలు’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్నమాట’, ‘వేములవాడ కథలు’ అనే పేర్లతో విడుదలైన ఆ సంకలనాలు పాఠకాదరణ పొందాయి. సుప్రసిద్ధ న్యాయమూర్తులు వాటికి ముందుమాటలు రాశారు. న్యాయరంగం లో ఉన్నవారు గతంలో చాలామంది రచయితలుగా రాణించినా వాటి లోతుపాతులను తెర తీసి చూపినవారు తక్కువ. జింబో ఆ పని ధైర్యంగా, ధర్మాగ్రహంతో చేశారు. తీర్పరి స్థానంలో కూచున్నా నియమ నిబంధనలు, సాక్ష్యాలు ఆధారాలు, విధి విధానాలు.. ఇవన్నీ ఒక్కోసారి కళ్లెదుట సత్యం కనపడుతున్నా న్యాయం చేయలేని పరిస్థితిని కల్పిస్తాయి. ఆ ప్రతిబంధకాలు రచయితకు ఉండవు. అందుకే తన కథల ద్వారా సరిౖయెన న్యాయం ఎలా జరిగి ఉండాల్సిందో జింబో చూపిస్తారు.‘యజమాని తాను అద్దెకు ఇచ్చిన వ్యక్తి నుంచి ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆ కేసు గట్టిగా ప్రయత్నించినా పదేళ్ల లోపు తేలే పరిస్థితి మన దగ్గర లేదు. రూల్ ఆఫ్ లా పాటించాలని అందరం అనుకుంటాం. కాని రూల్ ఆఫ్ లా ప్రకారం పోగలుగుతున్నామా’ అంటారు జింబో. మన చట్టాలు, న్యాయశాస్త్రాలు సగటు మనిషి అవగాహనకు దూర విషయాలు. వాటిని చదివి అర్థం చేసుకోవడం కష్టం. అందుకే సామాన్యులకు అర్థమయ్యేలా జింబో కథల రూపంలో వాటి పట్ల చైతన్యం కలిగిస్తారు. వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని లబ్ధిపొందేవారు ఉన్నా వ్యవస్థ చేసిన ఏర్పాట్లను సమర్థంగా ఉపయోగించుకుని న్యాయం పొందినవారినీ చూపిస్తారు.జింబో తన యూట్యూబ్ చానల్లో 6 నిమిషాల నిడివి నుంచి 20 నిమిషాల నిడివి వరకూ పోస్ట్ చేశారు. వీటిని సామాన్యులతో పాటు న్యాయవాదులు, జడ్జిలు, విద్యార్థులు కూడా వింటూ ఉండటం విశేషం. కరీంనగర్– వేములవాడకు చెందిన జింబో జిల్లా జడ్జి స్థాయిలో పని చేశారు. నాటి ఆంధ్రప్రదేశ్ జుడీషియల్ అకాడెమీకి డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ‘మొదట ఎవరితోనైనా ఈ కథలు చదివిద్దామనుకున్నాను. కాని రచయితగా నేనే ప్రేక్షకులకు కనిపిస్తే బాగుంటుందని ల్యాప్‌టాప్ ముందు కూచుని రికార్డ్ చేయడం మొదలెట్టాను. మా అబ్బాయి ఎడిటింగ్ యాప్ సూచిస్తే ఎడిటింగ్ కూడా నేనే చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. నా ప్రయత్నానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది’ అన్నారు జింబో.కోర్టులు, చట్టాల వర్తమాన పనితీరు తెలుసుకోవాలంటే ఈ కథలు తప్పక వినండి. యూట్యూబ్‌లో మంగరి రాజేందర్ జింబో అని టైప్ చేసి ఆ కథలు వినొచ్చు. -
వైకల్యం ఓడిపోయింది.. స్ఫూర్తి గాథలు
ప్రొద్దూటూరు/రాజంపేట టౌన్/ రూరల్/ జమ్మలమడుగు/సంబేపల్లె/అట్లూరు/ చాపాడు: వారంతా దివ్యాంగులే... పుట్టుకతో విధి వంచితులే.. అయినా బెదరలేదు.. కన్నీరు కార్చలేదు.. పట్టుదల, ఆత్మస్థైర్యంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఒకరిపై ఆధారపడకుండా, వ్యాపారం చేసుకుంటూ తమదైన నైపుణ్యంతో రాణిస్తూ, ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా ఒకరి సాయం కోసం ఎదురుచూడకుండా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది దివ్యాంగులపై ప్రత్యేక కథనం. చిరు వ్యాపారమే ఆసరా ఇక్కడ కన్పిస్తున్న దివ్యాంగుడి పేరు ప్రొద్దుటూరు రెహామాన్. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు కాల్వకట్ట వద్ద నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. గతంలో సంచులు కుట్టేవాడు. ‘‘కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డానని, లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా జరుగుతోందని, పెట్టుబడి పోయి మిగిలిన ఆదాయంతో పాటు, ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని’’ చెబుతున్నాడు. మొక్కవోని ధైర్యంతో.. ఇతని పేరు అహమ్మద్‌బాషా. పుట్టుకతోనే దివ్యాంగుడు. రాజంపేట పట్టణం రైల్వేస్టేషన్ సమీపంలో టైలరింగ్ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనాతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. లాక్డౌన్ కారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో షాపు మూసివేశాడు. ప్రస్తుతం చౌకదుకాణంలో నెలకు రెండుమార్లు ఇచ్చే రేషన్ బియ్యం, సరుకులతో భార్య, డిగ్రీ చదివే ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాపులో కూర్చుంటే కనీసం రూ. 100 వస్తుందన్న ఆశ ఇతనిది. కరోనా ఇబ్బందులు తాత్కాలికమే అంటూ, ధైర్యంతో మొండిగా బతుకుబండిని లాగుతున్నట్లు చెబుతున్నాడు రెక్కల రిక్షా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ దివ్యాంగుని పేరు కరీముల్లా. చిన్నప్పుడే ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకున్న ఈయన ఎంతో ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా రిక్షాను తయారు చేయించుకుని సీజన్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం రోజూ హోల్‌సేల్ మార్కెట్లో వేరుశనగ కాయలు కొని ఊరంతా తిరిగి విక్రయిస్తాడు. సీజన్‌ను బట్టి రేగిపండ్లు, జామకాయలు, మామిడికాయలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈయన సతీమణి ఖాదర్‌బీ దివ్యాంగురాలే. చిన్నప్పుడే పోలియోతో కాలు చచ్చుబడిపోయింది. సతీమణి ఇంటిలో అన్నం వండిపెట్టడం మినహా ఏ పని కావాలన్నా తాను ఒంటిచేత్తోనే చేస్తానని ఎంతో ధైర్యంతో కరీముల్లా ఈ సందర్భంగా చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వెరీ ‘గుడ్డు’రఫి జమ్మలమడుగుకు చెందిన మహమ్మద్‌రఫి పుట్టుకతోనే పోలియో సోకడంతో దివ్యాంగుడిగా మారాడు. ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా కోడి గుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో దుకాణాలు మూతపడి వ్యాపారం కుంటుపడింది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారిని జయించడంలో గుడ్డు ఎక్కువగా సహకరిస్తుందన్న డాక్టర్ల సూచనతో వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. దీంతో రఫీ రోజంతా బిజీబిజీగా ఉంటున్నాడు. సేవకుడయ్యాడు.. రాజంపేటకు చెందిన ఎన్. శ్రీనివాసులు డిగ్రీ వరకు చదివాడు. తండ్రి అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఇతనికి తల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ శ్రీనివాసులుపైనే పడింది. పెద్దతమ్ముడికి సెలూన్‌షాపు ఏర్పాటు చేయించాడు. మరో సోదరుడిని చదివిస్తున్నాడు. జననేత ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థతో 19వ వార్డులో ప్రస్తుతం వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్నాడు. బతుకు ‘చిత్రం’ ఇదే.. ఏపీ దివ్యాంగుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న షాకీర్‌హుసేన్ పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఆల్బమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ స్టూడియోకు వెళ్లి కంప్యూటర్లో ఫొటోలు డిజైన్ చేస్తున్నాడు. ఒక్కో ఫొటోకు రూ.3 చొప్పున తనకు కమీషన్ ఇస్తారని, రోజూ 200 ఫొటోలుపైగా డిజైన్ చేస్తానని ఈ సందర్భంగా షాకీర్ తెలిపాడు. కుట్టుకుంటూ.. నెట్టుకుంటూ సంబేపల్లె మండలం పీఎన్‌కాలనీ పంచాయతీ రేగడగుంటపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు రెండు కాళ్లు లేవు. అయినా కష్టపడి టైలరింగ్ చేస్తూ అమ్మానాన్నకు ఆసరాగా ఉంటూ వచ్చాడు. దురదృష్టవశా>త్తూ కన్నవారు కూడా కాలం చేశారు. ఆత్మస్థైర్యంతో తను నేర్చుకున్న చేతి వృత్తితో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవనం సాగిస్తున్నాడు. తల్లి కోసం రాజంపేట మండలం ఎర్రబల్లికి చెందిన ఖమ్మం నాగేంద్రరెడ్డి బీఎస్సీ, బీఈడీ చదివాడు. తండ్రి మరణించడంతో తల్లిని పోషించేందుకు చిన్న పాటి కిరాణా షాపును ఏర్పాటు చేసుకున్నాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా నిరాశ చెందకుండా జీవనం సాగిస్తున్నాడు. షాపులో వచ్చిన ఆదాయంతో తల్లిని బాగా చూసుకుంటున్నాడు. కష్టాలకు బెదరలేదు.. ఈ ఫొటోలేని వ్యక్తి పేరు మద్దూరు నరసింహులు. అట్లూరు మండలం కొండూరు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడు. అవయవాలు ఎదగలేదు. అయితే టైలర్ పని నేర్చుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయ్యాడు. కరోనా కష్టాల్లోనూ బెదరకుండా టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అందరికీ అండగా .. రాజంపేట మండలం మన్నూరు గ్రానికి చెందిన షేక్ జైనులు దివ్యాంగుడు. డిగ్రీ చదివాడు. తల్లి, భార్య, కుమార్తె, తమ్ముడు ఉన్నారు. అందరినీ పోషించాల్సిన బాధ్యత జైనులుపై పడింది. ఇంటిలోనే టైలరింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇతని పట్టుదల కింద వైకల్యం ఓడిపోయింది. -
ఎవరి కథ వారిదే
మన సినిమాల్లో ఆడవాళ్లను గయ్యాళి వారిగా పరిచయం చేయడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లుంటాయి. వీధి కుళాయి దగ్గర పెద్ద నోరేసుకుని అరుస్తూ మిగిలిన అందరినీ హడలుగొడుతూ నీళ్లు పట్టుకునే సన్నివేశం కూడా ఆ కోవకు చెందినదే. అయితే అవన్నీ సమాజంలో ఉన్నవే. కానీ పైకి కనిపించే సంఘటనల వెనుక ఉన్న కారణాల జోలికి వెళ్లదు సినిమా. ఎందుకంటే ఆ చిత్రంలో ఆ పాత్ర పరిచయానికి అంతకంటే లోతుగా అధ్యయనం చేయాల్సిన పని ఉండదు. అలాగని మహిళను గయ్యాళిగా చూసే అభిప్రాయాన్ని సమాజం మెదడు నుంచి తుడిచేయకపోతే ఎలా? ఇదే పని చేస్తున్నారు ప్రియదర్శిని పళని. జీవిత రచన చెన్నైలో బ్లూ క్లబ్ పేరుతో ఒక మీడియా సంస్థ శ్రామిక వర్గ మహిళల కోసం పని చేస్తోంది. ప్రియదర్శిని ఆ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ఆమె చెన్నైలోని పెరుబాక్కమ్, తెదీర్ నగర్ వంటి ప్రదేశాలను సందర్శించి అనేక యదార్థ గాథలను డాక్యుమెంట్ చేస్తోంది. ఐదేళ్ల కిందట మొదలైన ఈ క్లబ్ ఇప్పటివరకు రెండు వందలకు పైగా మహిళల జీవితాలను వాళ్ల చేతనే గ్రంథస్థం చేయించింది. నిజానికి ఆ మహిళల్లో ఎవరూ కథ, కథనాల మధ్య తేడా తెలిసిన వాళ్లు కూడా కాదు. అయితే జీవితం నేర్పించినన్ని పాఠాలు మరే యూనివర్సిటీ కూడా నేర్పించలేదు. జీవితం ఇచ్చే శిక్షణ ముందు మిగిలిన శిక్షణలన్నీ దిగతుడుపే. ఇదే మాట చెబుతారు ప్రియదర్శిని. ఆమె అల్పాదాయ వర్గాలు నివసించే కాలనీలలో శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. వాళ్లంతా ఏదో బడికి వెళ్లి చదవడం, రాయడం మాత్రమే నేర్చుకుని ఆ తర్వాత బతుకు పోరాటంలో భాగంగా పనుల్లో పడిపోయిన వాళ్లే. ఒక్కో మహిళను ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజులో చేసే పనులను చెప్పమన్నప్పుడు అందరూ చెప్పడం మొదలు పెట్టారు. పైకి దాదాపుగా అందరి జీవితం ఒకటే మూసలో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే ఎవరి అగాధం వారిదే. ఆ అగాధాన్ని దాటి రావడానికి వాళ్లు పడే శ్రమ కూడా దేనికదే ప్రత్యేకం. వాళ్ల జీవితాలను రిపోర్టు చేయడానికి వచ్చిన ఏ రిపోర్టర్ అయినా మహా అయితే... వీధి చివర్లో నీళ్ల కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే మహిళల దుస్థితిని దయనీయంగా కళ్లకు కట్టగలుగుతారేమో. నిజానికి ఆ బిందెడు నీళ్లు తీసుకెళ్లకపోతే ఇంట్లో ఆగిపోయే పనుల గురించి ఏకరువు పెట్టగలిగింది ఆ బాధను అనుభవిస్తున్న మహిళలే. నీళ్లు లేకుండా ఇంటికి వెళ్తే ఒక మహిళ ఇంట్లో భర్త చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. మరో ఇంట్లో ఆ మహిళ బిడ్డకు స్నానం చేయించకుండా చెంబుడు నీటిలో వస్త్రాన్ని తడిపి ఒంటిని తుడిచి సరిపెట్టాల్సి వస్తుంది. మరో ఇంట్లో ముసలి వాళ్లు ఉంటారు. నీళ్లు లేకపోతే ఎలాగా అనే బెంగతో అదే విషయాన్ని పలుమార్లు తలుచుకుంటూ కోడలిని సతాయిస్తుంటారు. ఇంకో ఇంట్లో బిందెడు నీళ్లు లేని కారణంగా స్కూలుకెళ్లాల్సిన పిల్లలకు అన్నం వండి బాక్సు పెట్టడానికి కుదరదు. అవసరానికి పనికొస్తాయని దుస్తుల అడుగున దాచుకున్న చిల్లర డబ్బులను పిల్లలకిచ్చి ఏదైనా కొనుక్కుని తినమని స్కూలుకు పంపిస్తుందా తల్లి. నీటి కుళాయి తగవులాట వెనుక, ఆటోవాలాకిచ్చే చిల్లర దగ్గర గొడవ పడడం వెనుక ఇంతటి విషాదాలుంటాయి. ఆ కష్టాలను యథాతథంగా పేపర్ మీద రాయమంటుంది ప్రియదర్శిని. తమ రోజువారీ కార్యక్రమాలను చెప్పడం మొదలైనప్పటి నుంచే వారిలో ఆలోచన విస్తరిస్తోంది. ఇక రాయడం మొదలు పెట్టిన తర్వాత వాళ్ల దృష్టి కోణం మరింతగా విస్తరిస్తోందని చెబుతున్నారు ప్రియదర్శిని. శ్రామిక వర్గ మహిళలు తాము జీవిస్తున్న జీవితాన్ని విశ్లేషించడంతోపాటు అందుకు దారి తీసిన మూల కారణాలను కూడా అన్వేషించగలుగుతున్నారు. కొందరి విషయంలో అవి కుటుంబ పరమైన కారణలయి ఉంటున్నాయి. మరికొందరికి ఆ కారణాలు సామాజికపరమైనవి అయి ఉంటున్నాయి. ‘శ్రామిక వర్గ మహిళల కష్టాలను నేను చూసి రాయడంకంటే వాళ్ల చేత రాయించగలిగితే అసలు కారణాలు బయటకు వస్తాయనుకున్నాను. అది నిజమని నా ప్రయత్నంలో నిర్ధారణ అయింది’ అంటున్నారు ప్రియదర్శిని. -
ఎల్లలు లేని ఊహా ప్రపంచం
కథ చదవడం ఆసక్తి అయితే.. కథ చెప్పడం గొప్ప ఆర్ట్. సంపూర్ణ బాల్యానికి కథ పునాది. చిన్నారుల్లో దీక్ష, పట్టుదల, జ్ఞాన సముపార్జన, మంచి చెడుల మధ్య వ్యత్యాసం, మానవ సంబంధాల గొప్పతనాన్ని కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో ప్రతి ఇంటిలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు గొప్ప కథకులుగా ఉండేవారు. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని చిన్నారులకు అర్థమయ్యేలా, వారిని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి సినిమా స్క్రీన్ ప్లే రైటర్స్ కంటే అద్భుతంగా నడిపించేవారు. తెనాలి : ‘అనగనగా’.. అంటూ మొదలు పెట్టి సాఫీగా వెళ్తున్న కథను ఒక్కసారిగా ఆపి.. చిన్నారుల ఆలోచనా శక్తికి కథకులు పదనుపెట్టే వారు. కథలోని ట్విస్టే ఉలిక్కిపడేలా ఉత్సుకతను పెంచి ఆ ట్విస్ట్‌ని బయటపెట్టి పిల్లలను ఆశ్చర్యపరిచి ఆనందాన్ని అందిచేవారు. ఒక రాజు కథలో.. ‘ఏడు చేపలు’ గురించి ఏడు తరాలు చెప్పుకునేవారు. ‘నాన్నా పులి’ అంటూ చిన్నారి కేకలో.. ముందు నవ్వును పంచి.. కన్నీటి నీతిని బయటపెట్టేవారు. ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేయవద్దంటూ ‘కుందేలు–తాబేలు’ పోటీని వినిపించేవారు. ‘మాట తప్పని ఆవు’ గురించి చెప్పి మాట విలువను పెంచేవారు. ‘పంచతంత్ర’లో విజ్ఞాన్ని పంచి.. ‘చందమామ’లో జానపథాన్ని వినిపించి.. ‘అక్బర్ బీర్బల్’.. తెనాలి రామకృష్ణుడి తెలివిని వినిపించి, ‘ఇంద్రజాలాన్ని’ పరిచయం చేసి కథతోనే కథను చెప్పించి.. బాలలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవారు. తరాలు మారడంతో.. కానీ, ఇప్పుడు తరాలు మారాయి. ఆ కథలు కలగా మిగిలిపోయాయి. అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ గుర్తుకురాదు. నేటి పాఠశాల విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలకు ఆస్కారం ఎక్కడ! ఈ క్రమంలోనే తనను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. లోగిళ్ల నుంచి దూరమైపోంది. కొత్త రూపు దాల్చిన కథ ప్రస్తుతం కథ.. కొత్త రూపుదాల్చింది. ‘తెర’బొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, షార్ట్‌ఫిల్మŠస్‌గా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి గానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. పిల్లల్ని కథలకు దగ్గర చేద్దాం.. విధి ఎంత విచిత్రమో!.. ‘కథ’ కంచికి వెళ్తే.. ‘మనం’ ఇంటికి వచ్చాం. కరోనా లాక్డౌన్లో కుటుంబం మొత్తం ఒకే చోటుకు చేరింది. వ్యక్తుల మధ్య దూరం తగ్గి ప్రేమానురాగం బలపడింది. పెద్దల సంగతి అలా ఉంటే బడుల కెళ్లాల్సిన చిన్నారులకు మరే అవకాశం లేదు. కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఆన్లైన్ పాఠాలు చెవికెక్కుతున్నా, మెదడుకు ఎక్కేది ఎంతవరకు అన్నదీ ప్రశ్నే! ఎటుతిరిగి పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లల్ని, కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు సద్వినియోగమైనట్టే. అపరిమిత విలువలు, జ్ఞానం, ఆలోచనాశక్తిని అందించినట్టే. మరోవైపు వెబ్సైట్, యూట్యూబ్ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి. నెట్టింట్లో కథలు.. help@pratham.org podupukathalu.blogspot.com indianepicstories.blogspot.in telugupennidhi.com telugu& velugu.net forkids.in telugumalika.blogspot.com యానిమేషన్ రూపంలో కథలు అందిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు fairy toonz telugu bommarillu videos kids planet bhul bhul fairy toonz telugu bommarillu videos kids planet bhul bhul -
కథ కంచికి.. మనం ఇంటికి!
కథ చదవడం ఆసక్తి అయితే.. కథ చెప్పడం గొప్ప ఆర్ట్. సంపూర్ణ బాల్యానికి కథ పునాది. చిన్నారుల్లో దీక్ష, పట్టుదల, జ్ఞాన సముపార్జన, మంచి చెడుల మధ్య వ్యత్యాసం, మానవ సంబంధాల గొప్పతనాన్ని కథ కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. గతంలో ప్రతి ఇంటిలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు గొప్ప కథకులుగా ఉండేవారు. కథ ఎంపిక దగ్గర నుంచి దానిని చిన్నారులకు అర్థమయ్యేలా, వారిని ఆకట్టుకునేలా వివరించడంలో ఇప్పటి సినిమా స్క్రీన్ ప్లే రైటర్స్ కంటే అద్భుతంగా నడిపించేవారు. తెనాలి: ‘అనగనగా’.. అంటూ మొదలు పెట్టి సాఫీగా వెళ్తున్న కథను ఒక్కసారిగా ఆపి.. చిన్నారుల ఆలోచనా శక్తికి కథకులు పదనుపెట్టే వారు. కథలోని ట్విస్టే ఉలిక్కిపడేలా ఉత్సుకతను పెంచి ఆ ట్విస్ట్‌ని బయటపెట్టి పిల్లలను ఆశ్చర్యపరిచి ఆనందాన్ని అందిచేవారు. ఒక రాజు కథలో.. ‘ఏడు చేపలు’ గురించి ఏడు తరాలు చెప్పుకునేవారు. ‘నాన్నా పులి’ అంటూ చిన్నారి కేకలో.. ముందు నవ్వును పంచి.. కన్నీటి నీతిని బయటపెట్టేవారు. ఇతరుల శక్తిని తక్కువ అంచనా వేయవద్దంటూ ‘కుందేలు–తాబేలు’ పోటీని వినిపించేవారు. ‘మాట తప్పని ఆవు’ గురించి చెప్పి మాట విలువను పెంచేవారు. ‘పంచతంత్ర’లో విజ్ఞాన్ని పంచి.. ‘చందమామ’లో జానపథాన్ని వినిపించి.. ‘అక్బర్ బీర్బల్’.. తెనాలి రామకృష్ణుడి తెలివిని వినిపించి, ‘ఇంద్రజాలాన్ని’ పరిచయం చేసి కథతోనే కథను చెప్పించి.. బాలలకు వినోద, విజ్ఞానాన్ని అందించేవారు. తరాలు మారడంతో.. కానీ, ఇప్పుడు తరాలు మారాయి. ఆ కథలు కలగా మిగిలిపోయాయి. అమ్మమ్మ, నాయనమ్మ ఒడిలో చిన్నారులు నిద్రపోవడం లేదు. సాయంత్రం వేళ సరదా కబుర్లు లేవు. కుటుంబ వ్యవస్థ చిన్నదైపోయింది. పని ఒత్తిడిలో ఎవరికివారే యమునా తీరే. పుస్తకాలు చదివే అలవాటు లేకపోవడంతో ఎప్పుడైనా ఏదైనా కథ చెప్పాలనిపించినా ఏదీ గుర్తుకురాదు. నేటి పాఠశాల విద్యలో పుస్తకాలతోపాటు మోసుకొచ్చే హోంవర్క్‌తోనే పిల్లల కళ్లమీదకు నిద్ర ముంచుకొస్తోంది. ఇక కథలకు ఆస్కారం ఎక్కడ! ఈ క్రమంలోనే తనను వినిపించేవారు, వినేవారు లేక కథ మూగబోయింది. లోగిళ్ల నుంచి దూరమైపోంది. కొత్త రూపు దాల్చిన కథ ప్రస్తుతం కథ.. కొత్త రూపుదాల్చింది. ‘తెర’బొమ్మగా మారింది. సినిమాలు, నాటికలు, షార్ట్‌ఫిల్మŠస్‌గా కనిపిస్తోంది. కాలక్షేపంగా కార్టూన్ సినిమాలు, వీడియో గేమ్‌లలోకి వచ్చేసింది. మొబైల్/టీవీలకు అతుక్కుపోతున్న పిల్లలకు కంటి సమస్యలు రావడం తప్ప కథా విషయాలు తెలియడం లేదు. కథ చెప్పడంలో కొత్త మార్పులొచ్చాయి గానీ నీతిని, జ్ఞానాన్ని పంచడంలో నేల విడిచి సాము చేస్తున్న చందంగా తయారైంది. పిల్లల్ని కథలకు దగ్గర చేద్దాం.. విధి ఎంత విచిత్రమో!.. ‘కథ’ కంచికి వెళ్తే.. ‘మనం’ ఇంటికి వచ్చాం. కరోనా లాక్డౌన్లో కుటుంబం మొత్తం ఒకే చోటుకు చేరింది. వ్యక్తుల మధ్య దూరం తగ్గి ప్రేమానురాగం బలపడింది. పెద్దల సంగతి అలా ఉంటే బడుల కెళ్లాల్సిన చిన్నారులకు మరే అవకాశం లేదు. కేవలం ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ఆన్లైన్ పాఠాలు చెవికెక్కుతున్నా, మెదడుకు ఎక్కేది ఎంతవరకు అన్నదీ ప్రశ్నే! ఎటుతిరిగి పెద్దోళ్లు, పిల్లలు ఇంటిలోనే గడుపుతున్న ఈ కాలంలో పిల్లలి్న, కథల్లోకి తీసుకెళ్లగలిగితే, సెలవులు సది్వనియోగమైనట్టే. అపరిమిత విలువలు, జ్ఞానం, ఆలోచనాశక్తిని అందించినట్టే. మరోవైపు వెబ్సైట్, యూట్యూబ్ చానళ్లలో కూడా తెలుగు కథలు లభిస్తున్నాయి. నెట్టింట్లో కథలు.. ♦help@pratham.org ♦podupukathalu.blogspot.com ♦indianepicstories.blogspot.in ♦telugupennidhi.com ♦telugu& velugu.net ♦forkids.in ♦telugumalika.blogspot.com యానిమేషన్ రూపంలో కథలు అందిస్తున్న యూట్యూబ్ ఛానళ్లు ♦fairy toonz telugu ♦bommarillu videos ♦kids planet -
కథ చెబుతారాఊ... కొడతాను
ఈ ప్రధానోపాధ్యాయుడు ఉద్యోగ విరమణ పొందారు. అయినా ఇప్పటికీ బడికి వెళుతుంటారు. అక్కడ పిల్లలకు కథలు చెబుతూ, వారి చేత చెప్పిస్తూ.. చిన్నారుల మేధాశక్తికి పదును పెడుతుంటారు. బాలల కోసం రచనలు చేస్తూ... బాలలే లోకం అని విశ్వసిస్తున్న ఈ (అ)విశ్రాంత ప్రధానోపాధ్యాయుడి పేరే వి.రాజేశ్వర శర్మ. ఆయనది పిల్లల లోకమే. పిల్లలే ఆయన కథా వస్తువు. ఆయన రచనలన్నీ పిల్లలకు సంబందించినవే. చివరకు ఆయన పీహెచ్డీ చేసింది కూడా పిల్లలకు సంబంధించిన అంశాలపైనే. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి చెందిన డాక్టర్ వి.రాజేశ్వరశర్మ (వీఆర్‌శర్మ) గెజిటెడ్ ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన రెండు దశాబ్దాలుగా పిల్లలకు సంబంధించిన రచనలతో ఎన్నో పుస్తకాలను తీసుకువచ్చారు. ‘పిల్లల లోకం’ అన్న పేరుతో ఆయన పిల్లలతో కథలు, కవితలు రాయిస్తూ, బొమ్మలు గీయిస్తూ వాటì తో పుస్తకాలు వేయించారు. పిల్లలతో మాట్లాడితే వారిలోని మేధాశక్తి బయటకు వస్తుందని విశ్వసించే శర్మ పిల్లల లోకం పేరుతో గడచిన రెండు దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రచనలూ చేస్తున్నారు. 1998లో మొదలైన ఆయన ప్రయత్నం ఇప్పటికీ నిరాటంకంగా కొనసాగుతోంది. ఉద్యోగ విరమణ తరువాత మరింత సమయం కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ వీఆర్‌శర్మ ‘పిల్లల లోకం’ పేరుతో రాసిన కవితలు, కథలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. అలాగే ‘ఆనందం’ అనే పిల్లల పాటలు, ‘కానుక’ అనే పేరుతో ఆధునిక బాలల అద్భుత సాహస కాల్పనిక నవల, బడిపిల్లలు రాసిన కథలను కూర్చి ‘బంగారు నెలవంకలు’ అన్న పుస్తకాన్ని, ‘కవులు పిల్లలు’ అన్న సంకలనాన్ని తీసుకొచ్చారు. సామాజిక అంశాలపై ఆయన రాసిన ఎన్నో పుస్తకాలు ముద్రితమయ్యాయి. ఆయన రాసిన దాదాపు అన్ని పుస్తకాల కవర్‌పై పిల్లల చిత్రాలే కనిపిస్తాయి. కాగా పూర్వ కాలంలో తాత, బామ్మలు పిల్లలకు పురాణాలు, ఇతిహాసాలు, నీతికథలు చెప్పేవారు. వాటి ప్రభావం పిల్లలపై ఎంతో ఉండేది. కుటుంబాలు విడిపోతున్న కారణంగా పిల్లలకు నీతి కథలుగాని, ఇతర కథలు కాని చెప్పేవారు లేకుండాపోయారు. బడి పిల్లలతో కథలు చెప్పిస్తూ.. రికార్డు చేయిస్తూ.. పిల్లలు చాలామంది కథలు చెప్పే మేధస్సు ఉన్నా వాటిని వెలికితీసే ప్రయత్నం జరగడం లేదు.అయితే డాక్టర్ వీఆర్‌శర్మ పిల్లలలోకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి పిల్లలతో కథలు చెప్పిస్తున్నారు. పిల్లలు చెప్పిన క£ý లను రికార్డు చేయడం ద్వారా వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. గర్గుల్, సిద్దిపేట తదితర ఉన్నత పాఠశాలల్లో ఆయన పిల్లలతో కథలు చెప్పించారు. దాదాపు ముపై ్పమంది పిల్లలు చెప్పిన కథలు విని ఆయన ఆశ్చర్యపోయారు. పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్లలో సృజనాత్మక ఆలోచనలు మరింతగా పెరుగుతాయని, నీతి కథను కొత్తగా చెప్పగలుగుతారని శర్మ అంటున్నారు. అలాగే సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఐడీఏ బొల్లారం ఉన్నత పాఠశాలలో కూడా పిల్లల లోకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు నగదు ప్రోత్సాహకాలు డాక్టర్ వీఆర్‌శర్మ పాఠశాలల్లో విద్యార్థులతో కథలు చెప్పించే సందర్భంలో మంచి కథలు చెప్పిన వారిలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.3 వందల నగదు, రెండో స్థానం సంపాదించిన విద్యార్థికి రూ.రెండు వందలు, మూడో స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ. 100 నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు. అంతేగాక బాలసాహిత్య పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలతో కథలు చెప్పించడం ద్వారా మిగిలిన పిల్లలు వాటిని వింటూంటే తాము కూడా నేర్చుకోవాలన్న ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే పిల్లలను కథ చెబుతారా ఊ కొడతాను అని అడుగుతుంటారు. ఇప్పటివరకు వందలాది మంది విద్యార్థులు కథలు చెప్పారని, ఆ కథలన్నింటినీ యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేస్తున్నానని, ఇలా చేయడం వల్ల అవి విశ్వవ్యాపితం అవుతాయన్నారు. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
ఐకియా బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా వార్షికోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెంబర్షిప్ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను, ఫోటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్సైట్లో ఓటింగ్ పెడతామని, సెప్టెంబర్ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలను స్వీడన్‌లోని (6 డేస్, 5 నైట్స్) వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ప్రకటన పేర్కొంది. తెలంగాణా వాసులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. -
పీకి పందిరేయవచ్చు
ఇప్పటి వరకు మనకు తెలిసింది పిల్లలకు కథ చెప్పి వాళ్లను ఊహా లోకంలో విహరింపచేయడమే. అది కాకపోతే టీవీలో, యూ ట్యూబ్‌లో కామిక్ వీడియోలు చూపించి కథ తెలియ చేయడం తెలుసు. ఇప్పుడు కొత్త ట్రెండ్ పిల్లల్ని కథల్లో జీవింపచేయడం. ఆ ట్రెండ్‌ను సృష్టించింది.. ‘అమర్ చిత్ర కథ అలైవ్’. ఓ హనుమంతుడు, ఓ శ్రీకృష్ణుడు వంటి పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్ల సృజనాత్మకతకు చక్కటి పందిరి వేయడానికి అనువైన రూపకల్పన ఇది. రాణా రతన్ సింగ్ రాజస్థాన్‌లో ఓ రాజ్యానికి రాజు. అతడి గారాల కూతురు మీరా. ఆమె ఓ రోజు అంతఃపురంలో నుంచి రాజవీథి నుంచి వెళ్తున్న పెళ్లి ఊరేగింపుని చూసింది. ఏనుగు అంబారీ మీద ఊరేగుతున్న వరుణ్ని చూసింది. పెళ్లంటే... ఒక అమ్మాయి వధువులా అలంకరించుకుని ఒద్దికగా ఉంటుంది. ఒక అబ్బాయి వరుడి అలంకరణలో చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు... అని అర్థం చేసుకుంది ఆరేళ్ల మీరా. ‘అమ్మా! నాకు వరుడు ఎవరు’ అని వాళ్లమ్మను అడిగింది. ఈ సన్నివేశంతో మొదలైన భక్త మీరాబాయి కథ, ఆమె వృద్ధాప్యం వరకు సాగుతుంది. కృష్ణుడి పట్ల ఆమె మధురభక్తిని బొమ్మలతో కళ్లకు కడుతుంది అమరచిత్ర కథ. అలాగే హనుమాన్ కూడా. పిల్లలకు ఇష్టమైన పాత్ర. ఉదయిస్తున్న ప్రభాత భానుడిని పండుగా భావించిన బాల హనుమాన్ ఆ పండుని అందుకోవడానికి గాల్లోకి ఎగురుతాడు. ఆ చిత్రాన్ని చూసిన పిల్లలు తమను తాము హనుమంతుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటారు. హనుమంతుడు లంకాదహనం చేస్తున్న బొమ్మలను చూస్తూ... తోక ఒక్కటి లేదన్నమాటే కానీ ఇంట్లో అంతటి బీభత్సాన్ని సృష్టిస్తారు గడుగ్గాయిలు. అమరచిత్రకథ రూపకర్త అంకుల్ పాయ్ సృష్టించిన పిల్లల ప్రపంచం ఇది. కథల మామయ్య అందరికీ మేనమామ చందమామ. అయితే పిల్లలకు కథలు చెప్పే మామ అనంత్‌పాయ్. అంకుల్ పాయ్ పేరుతో పిల్లలకు కథలు చెప్పిన మామయ్య అనంత్‌పాయ్. 1967లో అనంత్‌పాయ్ చెప్పిన కథలకు ‘అమరచిత్ర కథ అలైవ్’ పేరుతో భౌతిక రూపం వచ్చిందిప్పుడు. దేశంలోనే తొలి ప్రయత్నమిది. పిల్లలకు కథ చెప్పడమే కాదు, కథలో దాగి ఉన్న పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయించడంతోపాటు, జీవననైపుణ్య కళలను పరిచయం చేసే ప్రయత్నం కూడా ఇది. ఓ హనుమంతుడు, శ్రీకృష్ణుడు పాత్రలను ఆవాహన చేసుకుని పిల్లలు ఇంటిని పీకి పందిరి వేయకుండా, వాళ్లే పందిరి వేయడానికి అనువైన ఇంటి రూపకల్పన ఇది. ఎవరికి తోచినట్లు వాళ్లు వేసవి సెలవులు కావడంతో ‘అమరచిత్ర కథ అలైవ్’ పిల్లలకు ఇది ఓ పెద్ద ఆటవిడుపు. ఒక్కోగదిలో నలుగురైదుగురు పిల్లలు కలిసి ఏదో ఒక యాక్టివిటీలో నిమగ్నమై ఉన్నారు. వాల్మీకి గదిలో స్టోరీ టెల్లింగ్, తాన్సేన్ గదిలో మ్యూజిక్ క్లాస్, చిత్రలేఖ గదిలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుంటున్నారు పిల్లలు. ఆమ్రపాలి గదిలో ట్రైనర్లు పిల్లలకు భరతనాట్యం, యోగ, కలరిపయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్‌లో పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ సెక్షన్లో ప్రింటింగ్ బ్లాక్స్‌తో కుస్తీ పడుతున్నారు, మరికొందరు మూన్ సర్ఫేస్ను వాళ్ల ఊహ మేరకు పేపర్ క్రాఫ్ట్ చేస్తున్నారు. దర్జీ కార్నర్లో రంగురంగుల గుండీలు, దారాలను మ్యాచ్ చేస్తూ టైలరింగ్‌తో పరిచయం పెంచుకుంటున్నారు. పై ఫ్లోర్లో ఉంది పాటరీ సెక్షన్. పిల్లలు మట్టితో కుండలు చేయడానికి ప్రయాస పడుతున్నారు. ఆ పక్కనే ఉన్న స్కల్ప ్చర్ అండ్ మాస్క్ మేకింగ్ విభాగంలో ఓ పాపాయి దీపావళి ప్రమిద చేసి సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకుంటోంది. మరో గదిలో సంస్కృతం నేర్చుకుంటూ కొందరు, లైబ్రరీలో ఉన్న కథల పుస్తకాలు తీసుకుని చదువుకుంటున్న పిల్లలు... మొత్తానికి ‘అమర్ చిత్రకథ అలైవ్’ ప్రాంగణం అంతా ఆహ్లాదంగా ఉంది. బయట ఆర్చరీ పాయింట్ ఉంది. గురి బాణాలు వేస్తున్న విలుకాళ్లు అర్జునుడిని మించి పోవడం జరగదేమో కానీ ఓ లింబారామ్, మరో దీపికా కుమారి తయారయ్యే అవకాశం మాత్రం ఉంది. ఈ తరం కృష్ణులు ‘ఫ్యూచర్ గ్రూప్’ అధినేత కిషోర్ బియాని, రానా దగ్గుబాటి, అమర చిత్ర కథ గ్రూప్ సంయుక్తంగా డిజైన్ చేసిన థీమ్.. ‘అమర చిత్ర కథ లైవ్’ శ్రీకృష్ణుడు, బలరాముడు సాందీపుని ఆశ్రమంలో 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నారు. ప్రతి కళనూ ఒక కథరూపంలో నేర్చుకున్నారు. లైఫ్డిజైనింగ్ స్కిల్స్‌ని కథల రూపంలో నేర్పించాడు సాందీపుడు. ఆ కథల్లో పిల్లల్ని జీవింపచేస్తోంది అమర చిత్ర కథ అలైవ్. కాలదోషం పట్టిన కళల్ని వదిలేసి 32 కళలను మాత్రమే పిల్లలకు నేర్పిస్తున్నారు. – వాకా మంజులారెడ్డి మాట్లాడే కుందేళ్లు ‘అమర చిత్ర కథ అలైవ్’ లెర్నింగ్ సెంటర్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, 79వ రోడ్లో ఉంది. లైబ్రరీలో కృష్ణ– రుక్మిణి, పృథ్విరాజ్ చౌహాన్, చంద్ర గుప్త మౌర్య, విక్రమాదిత్య, అష్టావక్రుడు, బీర్బల్, షాజహాన్, రాణి– ఝాన్సీ, కృష్ణదేవరాయ, ద హిస్టారిక్ సిటీ ఆఫ్ ఢిల్లీ, షేర్షా, ద గోల్డెన్ మంగూస్, తంజావూరు.. ఇలాంటి కథల పుస్తకాలెన్నో ఉన్నాయి. ఈ కథల్లోని పాత్రలు గోడలమీద పెయింటింగ్స్ రూపంలో ప్రాణం పోసుకుని ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ రూమ్‌లో ఉన్న పిల్లలు ఆ పాత్రల్లో ఒదిగిపోయి ఉన్నారు. క్లాత్‌తో చేసిన జంతువుల మాస్కులను వేళ్లకు తొడుక్కుని తమను తాము ఆ పాత్రలో లీనం చేసుకుని మరీ కథలో జీవిస్తున్నారు. కుందేలు, రామచిలుక, ఏనుగు, చిట్టి ఎలుగుబంటి.. ఇలా ఒక్కో పాపాయి ఒక్కో పాత్రను ఆవాహన చేసుకుని ఆ పాత్ర చెప్పాల్సిన డైలాగ్స్ చెప్తూ అమర చిత్ర కథలకు ప్రాణం పోస్తున్నారు. మధ్యలో కిలకిల నవ్వుకుంటున్నారు. కోట్లు కుమ్మరించినా అంతటి స్వచ్ఛమైన నవ్వు నవ్వలేరు పెద్దవాళ్లు. లక్షలు ఫీజు వసూలు చేసే స్కూళ్లు కూడా పిల్లల్ని రోజుకో గంటసేపు అలా నవ్వించలేవు. నవ్వడానికి ఎటువంటి శషబిషలు లేని బాల్యం కడుపారా నవ్వాలి. నవ్వడానికి ఓ కథ చెప్పే తీరిక లేని పెద్దవాళ్లున్నప్పుడు నవ్వించడానికి, పిల్లల్ని నవ్వులో జీవింపచేయడానికి చేసిన గొప్ప ఆలోచన ఇది. -
వెలిసిపోయిన రంగుల స్వప్నాలు
యేండ్రియా హిరాటా తొలి నవల, ‘ద రెయిన్బో ట్రూప్స్’–బహాసా ఇండోనేసియాలో రాసినది. 1970ల నేపథ్యం. కథకుడు–కుర్రాడైన ఇకాల్. ఇకాల్– బెలిటన్ ద్వీపంలో ఉన్న ‘ఆవేశమెత్తిన మేక ఒక్క తోపు తోస్తే పడిపోయే’ ‘ముహమ్మదీయా ఎలిమెంటరీ స్కూల్’లో చేరతాడు. ధనిక ద్వీపమది. అక్కడి బీద విద్యార్థులకు చదువందించే ఆశయంతో– జూనియర్ హైస్కూల్ పాస్ అయిన, 15 ఏళ్ళ ఇబూ మూ(ఇబూ ముస్లీమా) ఆ పేద బడి ప్రారంభిస్తుంది. దాని ప్రిన్సిపాల్ హాఫన్. ఆ ప్రాంతంలోజాతీయ గనుల తవ్వకపు కంపెనీ అధికారమే చెల్లుతుంది. పాఠశాల మూతపడకుండా ఉండాలంటే, పదిమంది విద్యార్థులైనా ఉండాలన్నది ప్రభుత్వ నియమం. సరిగ్గా పదే మందున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందోమోనని ఉపాధ్యాయులిద్దరూ బెంగటిల్లుతుంటారు. పిల్లలకు–అబూ మూ, ‘రెయిన్బో ట్రూప్స్’ అన్న పేరు పెడుతుంది. వారికి జీవితంపై ఆశ కలిగిస్తుంది. తన జీవిక కోసమూ, స్కూల్ ఖర్చుల కోసమూ రాత్రిళ్ళు కుట్టుపని చేస్తుంది. విద్యార్థుల్లోఒకడైన లింగ్టంగ్, మొసళ్ళుండే చిత్తడి నేలను తప్పించుకుంటూ, రానూ పోనూ రోజూ 80 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతాడు. గణితంలో దిట్ట. ఈ పేద పిల్లలు– ఆడంబరమైన పీఎన్ స్కూలు విద్యార్థులను స్థానిక పోటీల్లో ఓడిస్తూ పోతారు. రెండు పాఠశాలలకీ మధ్యనుండే తేడా, ఊరి సామాజిక అసమానతను కనబరుస్తుంది. చాక్‌పీసుల కోసం దుకాణానికి వెళ్ళిన ఇకాల్ అక్కడ ‘ఎ లింగ్’ అనే చైనీస్ అమ్మాయి ‘నెలవంక చంద్రుని ఆకారంలో ఉన్న వేళ్ళ గోళ్ళని’ చూసి ఆకర్షితుడవుతాడు. అయితే, ఆమె తల్లిదండ్రులు ఆమెను ‘మంచి చదువు’ కోసం జకార్తా పంపిన తరువాత, ‘480 గంటల 37 నిమిషాల 12 సెకన్ల పిమ్మట, నా నష్టం గురించి దుఃఖించడం మానాను. నామీద నేను సానుభూతి కురిపించుకోవడం ఆపేశాను’ అంటాడు. అయితే, అప్పటి ఇకాల్ వయస్సు గురించిన స్పష్టత ఉండదు. హాఫన్ మరణిస్తాడు. ‘మనం చదువు కొనసాగించాలి. మనకింక అన్యాయం జరగదు’ అంటుండే లింగ్టంగ్– దురదృష్టవశాత్తూ జాలరైన తండ్రి చనిపోవడంతో, చదువాపేసి, కుటుంబ బాధ్యత తలకెత్తుకోవాల్సి వస్తుంది. పిల్లలందరి తండ్రులూ చితకాముతకా పనులు చేసేవారే. ఉపాధ్యాయులూ, విద్యార్థులూ– బడి నిలపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ, పరిస్థితులు వారి అదుపులో ఉండవు. పిల్లలు తమకున్న వనరులని ఉపయోగించుకోవడంలో ఏ అవకాశమూ వదలరు కానీ వారి ప్రా«థమిక అవసరాలే వారి చదువు మానిపించేస్తాయి. ‘12 ఏళ్ళ పిమ్మటి’కి (చివరి 40 పేజీల వద్దకు) చేరిన తరువాత, విధివాదాన్ని సమర్థిస్తారు రచయిత హిరాటా. ‘రోజువారీ జీవితాల్లో మమ్మల్ని ఊపిరాడకుండా చేసిన ఆర్థిక ఇబ్బందులని తట్టుకున్నాం... విద్యావ్యవస్థకి అతి క్రూరమైన, దృఢమైన, అదృశ్య శత్రువు– భౌతికవాదం. అదే మమ్మల్ని అణచివేసి, మోకాళ్ళమీద కుదేసింది’ అంటాడు ఎదిగిన ఇకాల్. ఆ పదిమందిలో– పైకొచ్చినది అతనొక్కడే. విద్యార్థి వేతనంతో చదువుకొని పారిస్‌లో ఉద్యోగం సంపాదించుకుంటాడు. ‘ఎంత సాధ్యమైతే అంత తీసుకోకుండా, ఎంత వీలయితే అంత ఇవ్వడం నేర్చుకున్నాం. ఆ మనస్తత్వం వల్ల పేదరికం అనుభవిస్తూ కూడా, కృతజ్ఞతగా ఉండటం అలవాటయింది’ అంటాడు. కాలక్రమం లేని నవల్లో– ఎప్పుడు, ఎన్నేళ్ళు గడిచిపోయాయో సులభంగా అర్థం కాదు. సంభాషణా శైలిలో ఉన్న వచనం సరళమైనది. ఇది నవలనిపించదు. కొన్ని సంఘటనలు, పిట్టకథలు, సూక్తులు కలిపి అల్లినట్టనిపిస్తుంది. యేంజీ కిల్బనె ఇంగ్లిష్‌లోకి అనువదించిన ఈ రచయిత స్వీయచరిత్రను, హార్పర్ కాలిన్స్ 2013లో ప్రచురించింది. హిరాటా దీన్ని ‘ఇబూ మూ’కే అంకితం ఇచ్చారు. ఈ నవల ఆధారంగా, ఇండోనేసియాలో ఇదే పేరుతో వచ్చిన సినిమా బాగా ఆదరణ పొందింది. కృష్ణ వేణి -
అర్థమైందా నాన్నగారూ?
‘‘చూడండీ.’’ ‘‘..........’’ ‘‘మిమ్మల్నే’’ ‘‘ఊ– రేపు నాకు బడిలేదు... నిద్రపోనీ.’’ ‘‘మాట; – రేపు మీరు కార్తీక సోమవారం ఉంటారా?’’ ‘‘సోమవారం ఉండటమా? ఎక్కడ?’’ ‘‘ఎక్కడేమిటి? – ఇంకా మీకు మెలుకవ రాలేదూ? కార్తీక సోమవారం ఉపవాసం ఉంటారా?’’ ‘‘ఉండను.’’ ‘‘పోనీయండి, నేను సముద్ర స్నానానికి వెళ్లివస్తాను. కాస్త పిల్లలను చూస్తుండండి.’’ ‘‘వద్దు...’’ ‘‘పెద్దపిల్లను తీసుకొనే పోతాను. చిన్నవాళ్లను కాస్త చూస్తుండండి.’’ నిద్రమత్తులో ఏమన్నానో జ్ఞాపకం లేదు. ఆమె బండెక్కి వెళ్లటం నేను తలుపు వేసుకొని మళ్లీ వచ్చి పడుకోటం. కాంతం ఇల్లు దాటిన పావుగంట కల్లా పసిది లేచి తల్లి పక్కలో లేకపోవటం మూలాన కెవ్వున ‘అమ్మా’ అని పిలిచింది. నేను లేవక తప్పింది కాదు. ‘‘అమ్మా లేచావు తల్లీ పడుకో’’ అన్నాను. నా మాటలు దానికి అర్థం అయితే గద! అట్లాగే మేకులాగ కూర్చున్నది నడిమంచం మీద ‘‘అమ్మ, అమ్మ’’ అంటూ. నాలుగు వైపులా చూచి, అమ్మ రాకపోవటం మూలాన లేచి మేడ దిగటానికి పోతున్నది. మెట్లు పసిది దిగలేదు. దాని ఉద్దేశాన్ని గ్రహించి క్రిందికి దింపాను. ముందు వంట ఇంట్లోకి వెళ్లింది ‘‘అమ్మా’’ అని ఏడుస్తూ. ఎవ్వరూ కనబడలేదు. తరువాత దొడ్డితలుపు దగ్గర నుంచుని ఏడ్చింది. తలుపు తీశాను. మసక చీకట్లోనే దొడ్డంతా వెతికింది. అమ్మ కనబడలేదు. అమ్మ ఇంట్లో లేదన్న విషయాన్ని గ్రహించి అది నన్నే నమ్ముకొని నేను చెప్పినట్లు వింటుందని నా నమ్మకం. ఎత్తుకొని మళ్లీ మేడపైకి వచ్చాను. ఏడ్పు ఆపలేదు. అట్లా పెంకితనంగా ఏడ్వటం సమంజసంగా కనపడలేదు. ‘‘తల్లీ మీ అమ్మ సముద్రానికి పోయింది. గంటలో వస్తుంది’’ అని చెప్పాను. దాని కాసంగతి బోధపడలేదనా? ‘‘అమ్మ– ఓ పోయి’’ అన్నది. ‘‘ఆ. అదీ. నీవు ఏడ్వవద్దు. బిస్కట్లు పెడతాను’’ అన్నాను. ఇక ఊరుకోవలసిందేనా, న్యాయంగా? ఊరుకోదే! పైగా ఎత్తుకున్నా నిలవక పోవడం, భుజం మీద పడుకోబెట్టుకొని చిచ్చిగొట్టినా జారిపోవటానికి ప్రయత్నం చేయటం. ‘‘ఎట్లాగే నీతో, అమ్మాయీ, కోపం వస్తోంది’’ అని చెయ్యి ఎత్తి చూపి భయపెట్టాను. ఇంకా ఎక్కువైంది ఏడ్పు. ఇంతలో ‘‘అమ్మా’’ అంటూ లేచాడు చిన్నవాడు. వీడు దానికంటె పెద్దవాడు. నాలుగో ఏడు. మాటలు అర్థం అవుతాయి. ‘‘నాయనా పడుకో’’ అన్నాను. ‘‘అమ్మేది’’ అన్నాడు. ‘‘అమ్మ ఇంకాసేపుట్లో వస్తుంది. తెల్లవారలేదు. నిద్రపో’’ ‘‘నేను పడుకోను’’ ‘‘పోనీ ఆడుకో... ఆ పుస్తకంలో బొమ్మలు చూచుకో.’’ ‘‘వద్దు’’ ‘‘మరి ఏం జేస్తావు?’’ ‘‘అమ్మ పోతా.’’ ‘‘ఓరి వెధవా– అమ్మ సముద్రానికి వెళ్లింది. నాలుగు మైళ్లుంది. నీవు నడవలేవు. ఇంకాసేపటికల్లా వస్తుంది’’ అన్నాను. ‘‘రాదు’’ అన్నాడు నిస్సందేహంగా. అన్నవాడు ఊరుకోక మేడ మెట్లు దిగి ప్రయాణం గట్టాడు. సముద్రానికి నాలుగేండ్ల వెధవ వెళ్లటం ఏమిటి? వీళ్లకు తెలివి ఎందుకుండదో. గబగబ మెట్లు దిగి పోతున్నాడు. ఏమిటి వీడి సాహసం! ‘‘ఒరేయ్’’ అంటూ వాడ్ని రెక్కుచ్చుకున్నాను. ‘‘నాయనా, ఒరే... ఏడ్వకూ’’ వాడు మళ్ల ‘అమ్మా’ అన్నాడు. ‘‘వస్తుందిరా నాయనా, తెల్లవారేప్పటికి వస్తుంది.’’ ‘రాదు’ అని ఒకటే ఏడ్వటం. ‘‘అబ్బబ్బ. చంపుతున్నావురా నాయనా. తప్పక వస్తుందిరా’’ అని అరిచాను కోపంతో. ఊహు. మహాప్రభూ– ఎట్లా వీడ్ని నమ్మించడం! పోనీ ఏదో అల్లాగ ఏడుస్తూ ఉన్నా ఒక సుగుణమే. కాళ్లొచ్చిన వెధవ. మేడ దిగి సముద్రానికి పోతానంటూ బయలుదేరుతున్నాడు. చిన్నది ఎత్తుకున్నా ఏడ్వటం మానలేదు. దాన్ని దింపేసి, వీడి దగ్గర చేరి ఎట్లాగయినా సముదాయిద్దామని కూర్చున్నాను. చిన్నది నా పడకగదిలోకి వెళ్లింది. ఇంకో గదిలోకి వెళ్లింది. వాళ్లమ్మను నేను దాచేశానని కాబోలు దీని నమ్మకం. చిన్న గదిలో సుశీ పడుకొని ఉన్నది. వాళ్లమ్మ చీర కప్పుకొని. చిన్నది ఆ చీర గుర్తుపట్టి అదే అమ్మ అనుకొని వెళ్లి అమాంతం దానిమీద పడ్డది. కెవ్వున కేకేసి ‘‘అమ్మా’’ అంటూ లేచింది సుశీ కూడా. కాస్త పెద్ద పిల్లగదా ‘‘అమ్మా సుశీ, పసిదాన్ని కాస్త సముదాయించు’’ అన్నాను. ‘‘అమ్మ ఎక్కడి కెళ్లిందీ?’’ అన్నది సుశీ. ‘‘సముద్రానికి స్నానానికి’’ ‘‘నన్ను తీసుకెళ్లలేదేం?’’ అని ఒక్క పెట్టున ఏడ్చింది. ‘‘ఓసి భడవా? నీవు కూడా ఏడిస్తే ఎట్లాగే? వీళ్లతోటే సతమతం అవుతుంటేను! వళ్లు పగలగొడతా ఏడిస్తివా అంటే!’’ అని భయపెట్టాను. ఇది మట్టుకు భయపడి ఊరుకుంది. పసిది మాత్రం వెక్కి వెక్కి ఏడ్వటం మానలేదు. చిన్నవాడు ఒకే స్థాయిలో ఏడుస్తున్నాడు. అమ్మ వస్తుంది ఉండరా అని నేనూ, రాదనివాడూ వాదన. తలబద్దలు కొట్టుకుందామనుకున్నంత విసుకు పుట్టింది. ఈ లోపున సుశీ మెల్లగా వెళ్లి నిద్రపోతున్న తమ్ముడ్ని లేపింది. అమ్మ వెళ్లిపోయిందని చెప్పేసింది. వాడో ఏడ్పు ఏడ్చాడు. భయపెడితే బిక్కముఖం వేశాడు. ‘‘నాయనా, మొగపిల్లలు ఏడ్వకూడ’’దని అప్పీలు చేశాను. ఎట్లాగయితేనేం మొగతనాన్ని నిలబెట్టాడు మా వాడు. వాళ్ల ఇద్దర్ని ఎట్లాగో ఆపానుగాని పసివాళ్లనే ఊరుకోబెట్టడం నా తరం గాలేదు. బిస్కట్లు పెట్టాను. విసిరి పారేశారు. కర్జూరపండు ఇచ్చాను. మొఖాన కొట్టారు. ఆట వస్తువులు చూపాను. కాళ్లతో తన్నేశారు. చిన్నదానికి ఏమీ తెలియక ఏడ్పు. వాడు మొండితనాన ఏడ్పు. వీపుపైని చెళ్లున వేశాను నోరు మూయమని. వాడు ఏడస్తూ మెట్లు దిగాడు. చీకట్లో భయపడతాడని పసిదాన్ని దింపి వాడి వెంటబడి గిలగిల కొట్టుకుంటూన్న వాడ్ని పట్టుకొచ్చాను. ఈ లోపున పసిది మెట్లు దొర్లటానికి సిద్ధమైంది. మహాప్రభో! పసిదాన్ని లాక్కొచ్చి మంచం మీద కూలేసి, చూస్తూ ఊరుకున్నాను. శత్రుసేనలు కోట తలుపులు బద్దలు కొట్టుకుని వస్తూంటే, ఏమీ చేయలేక నిలబడిపోయిన రాజులాగ. అంతలో అరుణోదయం అయింది. ‘‘అమ్మాయీ, సుశీ, మీ అమ్మ వస్తున్నదేమో చూడూ వాకిట్లో కెళ్లి’’ ఏదీ? సుశీ లేదు. దాని తమ్ముడూ లేడు. గుండె గుభేలు మన్నది. వీధి తలుపు తీసివుంది. పెద్దగా కేకవేశాను. జాడ లేదు. ఆ పిల్ల చేతులకు బంగారపు గాజులున్నాయి. వాటి కాశపడి పిల్లదాన్ని ఎవరేం జేస్తారో? పోనీ వాళ్ల కోసం వెతుకుదామంటే వీళ్లిద్దరినీ వదలి ఎల్లాగ కదలటం! ఇంతలో పసిముండ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది. భుజాల మీదే ఉంచుకొని పాలడబ్బా తీసి కొంచెం పాలు కలిపి, ‘అమ్మా తాగ’మని ఇచ్చాను. పుచ్చుకొని గుక్కెడు కామోలు ఆ గ్లాసు విసిరి కొట్టింది. బట్టంతా తడిసింది. మొఖం నిండా పాలచుక్కలు. ‘చీ–దీని దుంపతెగ... అవస్థ...’ అని విసుక్కొని ఇటు చూద్దును గదా, ఆ చిన్న వెధవ సందు దొరికింది గదా అని, సముద్రానికి ప్రయాణం గట్టి వాకిట్లోకి పోయినాడు. అపుడు తెలతెల వారుతుంది. పరుగెత్తుకొని వెళ్లాను వాడ్ని పట్టుకొందామని. నాకు చిక్కకుండా పారిపోవాలనే ప్రయత్నంలో వాడు పరుగెత్తి జారి సైడుకాల్వలో పడ్డాడు. ఠకీమని దిగాను. మోకాలు లోతు మురుగులోకి. వాడ్ని చప్పున ఎత్తుకొని చంక నేసుకొన్నాను. వాడి ముఖం, వళ్లూ, అంతా బురద. నా బట్టలన్నీ బురద. ఇంతలోకే చిన్నది కూడా అడుగులేస్తున్నది ఆ వేపే. ఎక్కడ పడుతుందోనని ఇంకో చంకలో ఎత్తుకున్నాను. అప్పుడు చూడాలి నన్ను. ఈ స్థితిలో నేనుండగానే వాకిట్లో బండి ఆగటం ఆవిడ దిగటం తటస్థించింది. నన్ను ఆ స్థితిలో చూచి నేను పడ్డ పాట్లన్నీ గ్రహించి, కాంతం నా పై జాలిపడి నాయందు సానుభూతి చూపి, తాను సుఖంగా సముద్రస్నానం చెయ్యటానికి వీలు కల్పించేందుకోసం, ఇంత అవస్థా నేను పడ్డందుకు నాయందు ఎంతో కృతజ్ఞత కలిగి, నన్ను ఎంతో థేంక్ చేస్తుందన్న ఆశతో అక్కడే నిలబడ్డాను. వచ్చిందో అమ్మగారు నిప్పులు గక్కుతూ ‘‘ఇద్దరు పిల్లలనూ వదిలేశారేం? వంతెన మీద కూర్చుని ఏడుస్తున్నారు’’ అంటూ. నేనేం మాట్టాడలేదు. చూడు నా అవస్థ– అన్నట్లు అక్కడే నుంచున్నాను. చూచింది ఒక్క నిమిషం. కొంచెం విచారం కళ్లలో. మళ్లీ చిరునవ్వు. పసిది తాచులాగ జారిపోయింది తల్లి దగ్గరకు. పసివాడు పోయి కావలించుకున్నాడు. కాంతం కూర్చుని పిల్లదానికి పాలిస్తూ ‘‘అమ్మా నా తల్లే, ఎంత ఏడ్చిందో! నోరెండి పోయిందా? నాన్నా... నా తండ్రి... ప్రాణాలన్నీ మీ మీదే ఉన్నాయి. ఎంత ఏడ్చావురా? నాయినా పడ్డావా?’’ అని మాట మీద మాట అంటూ దాన్ని ముద్దెట్టుకోనూ, వీడ్ని ముద్దెట్టుకోనూ, దాన్ని పలకరించనూ, వీడ్ని పలకరించనూ, ఇదే వరస! ఈ మానవుడు పడ్డ కష్టానికి ఒక్క సానుభూతి వాక్యం, కృతజ్ఞతను సూచించు ఒక్క చూపు లేదు. పిల్లలకు తల్లే లోకమైంది. నాకు స్థానం ఏదీ! అల్లాగ సూర్యుని కెదురుగా నిలబడిపోయేను వెర్రి చూపులు చూస్తూ. -
వండిన కథలు కావు
వండుకోవడానికి సరుకులే లేవు..ఇక ఆకలి కడుపున మెదడేం వండుద్ది?కాదు.. విషయం అది కాదు!నిజానికి కడుపు నిండితే.. మెదడు ఖాళీగా ఉంటుంది!కడుపు ఖాళీగా ఉంటే మెదడు నిండుగా ఉంటుంది!భారతి రచయిత్రి కాదు.. కథా వస్తువు!ఇంకా గట్టిగా చెప్పాలంటే కథా దినుసు!ఎంత బాగా వండుతుందో.. కానీ వండినట్టే ఉండదు!ఊర్లో నిలువెత్తు అద్దం తీసుకుని తిరిగినట్టు ఉంటుంది!అవును.. ఇవి వండిన కథలు కాదు..రోమాంచిత వాస్తవాలు! మట్టి పాత్రలే ఉన్న ఇళ్లలో ఇత్తడి బిందె.. బంగారపు బిందె కన్నా గొప్పది. ఆ బిందెను కొనుక్కోవడం వాళ్ల జీవన కల. రెక్కల కష్టం పెట్టుబడిగా సంపాదించుకున్న ఆస్తి. ఇలాంటి అపురూపాలకు, జీవనసారానికి అక్షరాలతో విలువగడ్తుంది ఎండపల్లి భారతి. చదువు అయిదవ తరగతే. అయితేనేం.. ఆమె రచనకు ప్రమాణం.. వందేళ్ల జీవిత అనుభవం.. అంతే లోతైన పరిశీలన. అందుకే ఆమె కథల్లో మనుషులు కదులుతారు. భావోద్వేగాలు కనపడ్తాయి. ఆమె పరిచయం ఎండపల్లి భారతి.. పుట్టింది, పెరిగింది.. చిత్తూరు జిల్లా, నిమ్మనపల్లి మండలంలోని దిగువ బురుజు. తండ్రి వెంకటరమణ, తల్లి ఎల్లమ్మ. వాళ్లకు భారతి ఏకైక సంతానం. ఆమెకు అయిదేళ్లున్నప్పుడే భారతి తల్లి టీబీతో చనిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తండ్రీ పోయాడు. అమ్మమ్మ, తాత ఇంట్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. దాంతో చదువు ముందుకు సాగలేదు. అమ్మమ్మ, తాతకు తోడుగా పొలంలో పని చేసేది భారతి. ఆమెకు పన్నెండేళ్లు వచ్చేసరికి ఉన్న ఊళ్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేసింది పెద్దమ్మ. భర్త శ్రీనివాసులు. మెట్టినింటికీ కూలి పనే ఆర్థిక ఆధారం. భర్తతోపాటు తనూ కూలీకి వెళ్లేది. కుటుంబ బాధ్యతల బరువు ఆమె భుజాల మీదున్నా.. చదువు పట్ల ఆసక్తి ఆవిరి కానివ్వలేదు. తన పిల్లలను బాగా చదివించాలని నిర్ణయించుకుంది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. ఆడపిల్లలకు ధైర్యం, అబ్బాయికి ఆపోజిట్ జెండర్‌ను గౌరవించడం నేర్పింది. పెద్దమ్మాయి విజయ కుమారి ఎమ్మే బీఈడీ. ప్రస్తుతం డిఎస్సీకి ప్రిపేర్ అవుతోంది. రెండో అమ్మాయి స్వరూప డిగ్రీ ఫైనలియర్. అబ్బాయి సోమశేఖర్ డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కథలు రాయి ‘‘ఏం రాయాలి?’’ ‘‘ఇప్పటి దాకా నువ్వు చూసిన జీవితం రాయి భారతీ’’ అన్నారు కిరణ్ కుమారి, సావెం రమేశ్. రాసింది. ‘సావు బియ్యం’ అనే పేరుతో. స్పష్టమైన వ్యక్తీకరణ. అద్భుతమైన మాండలీకం. చక్కటి పద సంపద. అబ్బుర పడ్డారు వాళ్లు. అక్షర దోషాలను సరిచేసి.. మరిన్ని రాయమని ప్రోత్సహించారు. రాస్తోంది భారతి.. ఏ ఒక్కరి జీవితాన్నో కాదు.. మొత్తం సమాజ సరళినే. ఆమె రాసిన కథలన్నిటినీ టైప్ చేసి పలు పత్రికలకు పంపించింది కిరణ్ కుమారి. అలా పత్రికల్లో అచ్చయిన కథలన్నిటితో ఓ సంకలం తెస్తే కూడా బాగుంటుందని భారతికి సలహా ఇచ్చింది ఆమె. పుస్తకం అంటే మాటలా? కనీసం యాభై వేలన్నా కావాలి. రెక్కలు ముక్కలు చేసుకున్నది కూటికి, పిల్లల చదువులకే చాలడం లేదనే చింత తొలుస్తున్నా.. పుస్తకం తేవాలనే కాంక్షా బలంగానే నాటుకుంది భారతిలో. అనుకున్నది సాధించేదాకా నిద్రపోని పట్టుదల ఆమెది. ఆ ఉత్సాహానికి ఊతంలా పదిహేను వేల రూపాయలు సహాయం చేసింది కిరణ్ కుమారి. చిత్రకారిణి కూడా అయిన ఆమె.. భారతి కథలకు చక్కటి బొమ్మలనూ గీసింది. మిగిలిన డబ్బును అప్పుగా తెచ్చి ‘ఎదారి బతుకులు’ అనే కథా సంకలనాన్ని ముద్రించింది భారతి. వెయ్యి కాపీలు చేతుల మీదే అమ్ముడు పోయాయి. రెండునెల్లకే మొదటి ముద్రణ ఖాళీ అయిపోయింది. ఈ సంకలనం అమెరికాకూ చేరింది. తానా సభల్లో సందడి చేసింది. ఇప్పుడు ఈ పుస్తకం రెండో ముద్రణ బాధ్యతను హెచ్‌బీటీ చేపట్టింది ఎంతో ఇష్టంగా. త్వరలోనే లాంచ్ కానుంది. నవోదయం భారతిలోని రచయిత్రిని ప్రపంచానికి చూపించిన కిరణ్ కుమారి, సావెం రమేశ్.. ఇద్దరూ వెలుగు ప్రాజెక్ట్ ఆఫీసర్లు. డ్వాక్రా గ్రూపు సభ్యుల్లో కాస్త చదవగలిగిన, రాయగలిగిన పన్నెండు మంది మహిళలతో ‘నవోదయం’ అనే ఓ మాస పత్రికను మొదలుపెట్టించారు. వాళ్లలో ఒకరే ఎండపల్లి భారతి. తనకు వచ్చిన ఈ కొత్త గుర్తింపు ఘనతను ఆ ఇద్దరికే ఇస్తుంది భారతి. ‘‘ ముఖ్యంగా కిరణ్ కుమారి మేడమ్.. నాకు ఫ్రెండ్, గైడ్.. అన్నీ’’ అంటుంది. నవోదయం.. భారతికే కాదు మిగిలిన పదకొండు మంది మహిళలకూ కొత్త గుర్తింపును ఇచ్చింది. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచింది. ‘‘ఏదో రాస్తారట.. ’’ అని పెదవి విరిచిన వాళ్లే ఈ గ్రామీణ మహిళా విలేకర్లు రాస్తున్న వార్తలను కుతూహలంగా చదువుతున్నారు. బైక్, కారు నడుపుతున్న భారతిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. పేపర్, పెన్నుతోనే కొంగుముడి ఆవులు.. సేద్యం.. అక్షరం.. ఇవే భారతి పనులు.. వ్యాపకాలూ. పేపర్, పెన్నూ ఆమె కొంగుతో ముడిపడే ఉంటాయి. ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు పేపర్ తీసి రాస్తుంది.. ఆవులు మేపేందుకు వెళ్లినా.. పొలం పనులు చేస్తున్నా! అలాంటి తలపోతకే ఆ తర్వాత కథా రూపం ఇస్తుంది. ‘‘డబ్బు కూడబెట్టే కంటే అక్షరం కూడబెడితే ముందు తరాల వాళ్లకు ఎంతోకొంత లాభం. జీవితం తెలుసుకుంటారు. నేను చూసింది.. విన్నది.. అనుభవించిందే రాస్తాను. ఊహించి రాయలేను. మనుషులే నాకు ఇన్స్పిరేషన్. తాతా, అవ్వ వయసున్న వాళ్లతో ఎక్కువగా మాట్లాడ్తాను. వాళ్ల అనుభవాలే నా కథా వస్తువులు. నా కథలను చదివి ఫస్ట్ మా పిల్లలు నవ్వారు.. ఇట్లా మన మాండలికంలో రాస్తే.. ఎవరు చదువుతారు? అని. పుస్తకంగా వచ్చి.. అమ్ముడు పోయేసరికి ఇప్పుడు గొప్పగానే చూస్తున్నారు (నవ్వుతూ). డెబ్బై కథలు రాశా. వ్యవసాయదారుల సాదక బాధకాలనూ కథలుగా రాసి పుస్తకంగా తేవాలనుంది. ఇప్పటికే ఓ పది రైతు కథలు రాశా’’ అని చెప్పింది భారతి. భవిష్యత్ కన్నా వర్తమానంలో బతకడమే ఇష్టపడే భారతి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కూడా. ఇప్పటివరకు అయిదు షార్ట్ ఫిల్ములు తీసింది. జాతీయ స్థాయి సమావేశాల్లో వాటిని ప్రదర్శించింది కూడా. ‘‘సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్లెందరో సమాజానికి తెలియకుండానే పోయారు. నేనేం చేశానని నాకు ఈ గుర్తింపు? అనిపిస్తుంటుంది’’ అని అంటుంది భారతి. మహిళల మీద జరుగుతున్న దాడులపై స్పందిస్తూ ‘‘చుట్టూ నిప్పు పెట్టి జాగ్రత్తలు చెబితే ఎలా కుదురుతుంది? ఆ నిప్పును ఆర్పే పనే కాదు.. ఇంకెప్పుడూ ఎవరు నిప్పు పెట్టకుండా చూసే బాధ్యతను మనం తీసుకోవాలి. అప్పుడే ఆడవాళ్లు క్షేమంగా ఉంటారు’’ అంటుంది భారతి. – సరస్వతి రమ -
శివరాజ్
‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’ చివరి వాక్యం రాసి వేళ్లు విరుచుకున్నాడు శ్రీధన్ శివరాజ్. డెబ్భై ఏళ్లు ఉంటాయి అతడికి. పొడవుగా, బక్క పలుచగా ఉంటాడు. కళ్లు లోతుగా ఉంటాయి. ఆ లోతుల వెనుకాల పూర్వజన్మల్లోంచి చూస్తున్నట్లుగా సూక్ష్మంగా, నిశితంగా ఉంటుంది శివరాజ్ చూపు. ఎంతటి మనిషినైనా పట్టేస్తాడు. దెయ్యాల్ని పట్టేయడం గొప్పగానీ, మనుషుల్ని పట్టేయడం ఏం గొప్ప అన్నారు ఎవరో ఎప్పుడో. అప్పుడు పెద్దగా నవ్వాడు శివరాజ్. నవ్వాడు అంతే. ఏమీ అనలేదు. శివరాజ్ ఎవరికీ అంతుపట్టడు. అంతుపట్టకపోవడానికి ఒక కారణం అతడు పెద్దగా మాట్లాడడు. భార్య పోయినప్పుడు, పిల్లలు వెళ్లిపోతున్నప్పుడూ అతడు మౌనంగానే ఉన్నాడు. ‘‘ఉండు పార్వతీ’’ అని మాత్రం తన అరవై ఏళ్ల వయసులో భార్య చేతిని పట్టుకుని అడిగాడు. వెళ్లిపోయాక ఎక్కడి నుంచి వస్తుంది పార్వతి? పార్వతి అనే ఆత్మ వెళ్లిపోయాక, శివరాజ్ అనే దేహం ఒక్కటే మిగిలింది భూమి మీద. ఎప్పుడూ ఆత్మలో ఉండే ఈ దేహానికి ఏకాంతాన్ని కల్పించాలని అనుకున్నారేమో పిల్లలు.\ ఊళ్లోనే ఉన్నా, విదేశాల్లో ఉన్నట్లుగా వేరే ఇంటికి మారిపోయారు. ఇల్లు, ఆ ఇంట్లో శివరాజ్.. ఇద్దరే మిగిలారు. పార్వతి ఫొటో ఉన్న గదిలో కూర్చుంటాడు రోజంతా అతడు. పార్వతి బతికి ఉన్నప్పుడు కూడా అతడు ఆమెతో మాట్లాడిందీ, ఆమెను చూస్తూ కూర్చున్నదీ లేదు. పార్వతితో మాట్లాడ్డం అంటే శివరాజ్‌కు తనతో తను మాట్లాడుకోవడమే. ఎవరైనా తమతో తాము మాట్లాడుకుంటారా? శివరాజ్ ఎవరికీ అంతుబట్టకపోవడానికి ఇంకో కారణం అతడు రచయిత. దెయ్యాల రచయిత. ఎప్పుడూ ఆ ఆలోచనల్లో ఉంటాడు. నలభై ఏళ్లుగా అతడు పత్రికలకు దెయ్యాల కథలు రాస్తున్నాడు. పరభాషల్లోకి కూడా అవి తరచూ అనువాదం అవుతుంటాయి. శివరాజ్ రాసేవి పేరుకు దెయ్యాల కథలే కానీ.. దెయ్యాలు ఉన్నాయనీ, దెయ్యాలు లేవనీ చెప్పే కథలు కావు. ‘‘మరెందుకు రాస్తున్నట్లు?’’ అని ఓసారెప్పుడో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినవాళ్లు అడిగారు. నవ్వాడు శివరాజ్. ‘‘దెయ్యాలు ఉన్నాయనుకునే వాళ్ల కోసం, దెయ్యాలు లేవనుకునేవాళ్ల కోసం రాస్తున్నాను’’ అన్నాడు. ‘‘మీరేం చెప్పదలచుకున్నారు. దెయ్యాలు లేవనా? దెయ్యాలు ఉన్నాయనా?’’.. అడిగారు ఇంటర్వ్యూ వాళ్లు.‘‘నేను చెప్పదలచుకున్నదే కదా రాస్తున్నాను’’ అన్నాడు శివరాజ్. ‘‘మీ ఉద్దేశం ఏంటి? దెయ్యాలు ఉన్నాయనా? లేవనా?’’ ‘‘తెలీదు. కానీ దెయ్యాల మీద నాకు రెస్పెక్ట్ ఉంది’’‘‘రెస్పెక్ట్ ఎందుకు?’’‘‘మీలా అవి ప్రశ్నలు వేయవు కాబట్టి..’’ఇలాగే ఉంటుంది శివరాజ్ మాట్లాడ్డం. శివరాజ్‌తో మాట్లాడ్డం. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి.’చివరి వాక్యం రాశాక.. ఫొటోలో పార్వతివైపు చూశాడు శివరాజ్. నవ్వు ముఖం. మనసు నిండా ప్రశాంతతను నింపే ముఖం. ఫొటోని చేతుల్లోకి తీసుకుని మెత్తటి గుడ్డతో తుడిచి, మళ్లీ గోడకు పెట్టేశాడు. పెరట్లోని తాజా పూలతో తానే గుచ్చిన దండను పార్వతి ఫొటోకి తగిలించాడు.అతడు రాసిన చివరి వాక్యం తను రాస్తుండే దెయ్యం కథల్లోని ముగింపు వాక్యం కాదు. తన బయోగ్రఫీలోని ‘ది ఎండ్’ సెంటెన్స్. అతడి జీవిత చరిత్రను సీరియల్‌గా వేసుకుంటామని పెద్ద పెద్ద పత్రికలు, పెద్ద పెద్ద పారితోషికాలతో ముందుకు వచ్చాయి. ఆసక్తి లేదన్నాడు. ఒకేసారి రిలీజ్ చేస్తానన్నాడు. పబ్లిషర్స్ వచ్చారు. ఇవ్వలేనన్నాడు. ప్రచురణ హక్కులు తన భార్యకు ఇచ్చేశానన్నాడు! పార్వతీ పబ్లికేషన్స్ పేరు మీద పుస్తకం వస్తుందన్నాడు. పార్వతే పుస్తకాన్ని ఆవిష్కరిస్తుందని కూడా చెప్పాడు! శివరాజ్ భార్య ఎప్పుడో చనిపోయింది కదా, ఆవిడ ఆవిష్కరించడం ఏంటని కొందరికి సందేహం వచ్చింది. శివరాజ్‌కి మతి భ్రమించినట్లుందని కొందరనుకున్నారు. ‘‘పూర్తయింది పార్వతీ’’ అన్నాడు శివరాజ్ పార్వతి ఫొటో వైపు చూస్తూ. ఫొటోలోని పార్వతి నిశ్చలంగా, కోనేటి పువ్వులా ఉంది. దేవుడి చెట్టు మీది నుంచి రాలిపడినట్టు. ‘‘పూర్తయింది’’ అని పత్రికల ఎడిటర్లకు ఫోన్ చేసి చెప్పాడు! ‘‘ఆల్రెడీ ఇచ్చేశారు కదా శివరాజ్ గారూ.. నెక్స్ట్ వీక్ కదా మీరు ఇవ్వాల్సింది ’’ అన్నారు వాళ్లు. ‘‘పూర్తయింది’’ చెప్పేశాడు శివరాజ్. అరగంటకు టీవీలో స్క్రోలింగ్ మొదలైంది! ప్రముఖ దెయ్యాల కథా రచయిత శ్రీధన్ శివరాజ్ (70) ‘కథాధర్మం’.మొదటి కథ çఫలానా సంవత్సరంలో. చివరి కథ ఫలానా పేరుతో.. అంటూ ఇంకా వివరాలేవో స్క్రోల్ అవుతున్నాయి. నవ్వుకున్నాడు శివరాజ్. వెళ్లి టీవీ కట్టేశాడు. రిమోట్ పనిచేయడం ఎప్పుడో మానేసింది. పార్వతికి టీవీలో ఆ డబడబలు ఇష్టం ఉండదు. ఆమె చనిపోయినప్పట్నుంచీ టీవీని మ్యూట్‌లోనే చూస్తున్నాడు శివరాజ్. టీవీ కట్టేశాక, పార్వతి ఫొటో వైపు ఒకసారి చూసి, గది తలుపులు వేసుకున్నాడు శివరాజ్. శివరాజ్ కథలు రాయడం మానేశారనే అర్థంలో ‘కథాధర్మం’ అని మొదటి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చిన చానల్‌ను చూసి, తక్కిన చానళ్లు కొన్ని.. ‘శివరాజ్ కాలధర్మం’ అని టెలికాస్ట్ చేసేశాయి! శివరాజ్ పోయారనే వార్త తెలిసి ఆయన అభిమానులు నివ్వెరపోయారు. ఆయనకు డెబ్భై ఏళ్లా అని కొందరు ఆశ్చర్యపోయారు. అందరికంటే ముందుండే టీవీ చానల్ వ్యాన్ ఒకటి లైవ్ టెలికాస్ట్ కోసం శివరాజ్ ఇంటి ముందు ఆగింది. ‘కథాధర్మం’ అని క్రియేటివ్ బ్రేక్ ఇచ్చింది ఆ చానలే. శివరాజ్ ఇంటి బయటి గేటు తెరిచే ఉంది. లోపలికి వెళుతూ, తన పక్కనే ఉన్న కెమెరామన్‌ని అడిగింది ఆ చానల్ నుంచి వచ్చిన రిపోర్టర్.. ‘దేవాలయాలు ఎక్కడైనా పాడుబడతాయా?’ అని. తెలియదన్నాడు కెమెరామన్. ‘మేము వెళ్లేటప్పటికి పాడుబడిన దేవాలయంలా ఉంది శివరాజ్ ఉంటున్న ఇల్లు’ అని మొదలు పెడితే బాగుంటుందని అనిపించినట్లుంది ఆ రిపోర్టర్‌కి. హాల్లోకి, అక్కడి నుంచి శివరాజ్ గది దగ్గరికి వెళ్లి తలుపుల్ని మెల్లిగా నెట్టారు ఆ రిపోర్టర్, కెమెరామన్. లోపల.. మంచం మీద పడుకుని ఉన్నాడు శివరాజ్. అతడి పక్కనే కుర్చీ ఉంది. ఆ కుర్చీలో అతడి బయోగ్రఫీ స్క్రిప్ట్ కాగితాలు ఒక బొత్తిగా తాడుతో కట్టి ఉన్నాయి. ఆ కాగితాల బొత్తికి ఆన్చి శివరాజ్ భార్య ఫొటో ఉంది. ఆమె ఫొటోకి ఉండాల్సిన తాజా పూల దండ, శివరాజ్ స్క్రిప్టు పేపర్స్‌కి వేసి ఉంది!‘‘సార్..’’ అని దగ్గరికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు చానల్ వాళ్లు. కళ్లు తెరవలేదు శివరాజ్. స్క్రిప్టులోని చివరి కాగితం.. బొత్తి నుంచి వేరుగా ఉంది. ‘ధైర్యమిచ్చే అబద్ధాన్ని చాటి చెప్పాలి. భయపెట్టే నిజాన్ని పాతిపెట్టాలి’ అనే వాక్యం ఉన్న కాగితం అంది. రెండో రోజు న్యూస్ పేపర్లలో ఆ వాక్యాన్ని చూసి.. శివరాజ్‌ని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూ చేసినవారు అనుకున్నారు:‘దెయ్యాలు లేవని అబద్ధం చెప్పారా? దెయ్యాలు ఉన్నాయనే నిజాన్ని దాచిపెట్టారా?’ -
పెళ్లాం దిద్దిన కాపురం
‘‘తలుపు! తలుపు!’’ తలుపు తెరవలేదు. గదిలో గడియారం టింగుమని వొంటి గంట కొట్టింది. ‘‘ఎంత ఆలస్యం చేస్తిని? బుద్ధి గడ్డి తిన్నది. రేపట్నుంచి జాగ్రత్తగా వుంటాను. యాంటినాచల్లా పోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమై పోయింది. ఒక్క పాట సరదాతోటి కుదరలేదు. పాడే మనిషి మీదిక్కూడా మనసు పరుగెత్తుతోంది. లేకుంటే, నేను పోకిరి మనిషిలాగ పాట ముగిసిందాకా కూర్చోవడమేమిటి? ఏదో వొక అవకాశం కలగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడడపు ఆసక్తి ఏమిటి? యిదుగో, లెంపలు వాయించుకుంటున్నాను. రేపట్నుంచి పాటకు వెళితే వొట్టు. మరి వెళ్లను. నిశ్చయం. గట్టిగా గాని పిలిస్తినట్టయినా కమలిని లేవగలదు. మెల్లిగా తలుపు తట్టి రాముణ్ని లేపగలిగితినా చడీ చప్పుడూ లేకుండా పక్కజేరి పెద్దమనిషి వేషం వెయ్యవచ్చు. గోపాలరావు తలుపు చేతనంటగానే, రెక్క విడబారింది. ‘‘అరే యిదేమి చెప్మా!’’ అనుకొని తలుపు మెల్లిగ తెరిచేసరికి, నడవలో దీపం లేదు. పడకగది తలుపు తీసిచూస్తే దాన్లోనూ దీపం లేదు. చడీచప్పుడూ లేకుండా అడుగువేస్తూ మంచము దరికిపోయి, కమలిని మేలుకొని వున్నదా, నిద్రించుతున్నదా అని కనిపెట్ట ప్రయత్నించెను గాని, యేర్పరించ లేకపోయినాడు. బల్లమీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించినాడు. మంచం మీద కమలిని లేదు. నిశ్చేష్టుడైపోయినాడు. చేతినుంచి అగ్గిపుల్ల రాలింది. గదినీ, అతని మనస్సునీ చీకటి కమ్మింది. వెఱి< శంకలూ, అంతకు వెఱి< సమాధానాలూ మనసున పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలగజేశాయి. నట్టి వాకిట వచ్చి నిలబడ్డాడు. చుక్కల కాంతిని నౌకరుగానీ, దాసీగానీ కానరాలేదు. తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి, గది నాలుముఖాలా పరికించి చూశాడు. కమలిని ఎక్కడా కానరాలేదు. వీధి గుమ్మం దగ్గిరికి వెళ్లి తలుపు తెరిచి చూసేసరికి, చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రావుడు కనపడ్డాడు. ‘‘రామా!’’ అని పిలిచాడు. రావుడి గుండె జల్లుమంది; నోట్లో చుట్ట జారి కిందపడ్డది. ‘‘రా వెధవా!’’ కాలీడ్చుకుంటూ రావుడు దగ్గర కొచ్చాడు. ‘‘మీ అమ్మేదిరా?’’ ‘‘మా యమ్మా బాబు? మా కొంపలున్నాది.’’ ‘‘నీ అమ్మ కాదురా! నా భార్యరా.’’ ఆ మాటతో రావుడికి మతి పోయింది. ‘‘ఎక్కడుంటారు బాబూ? అమ్మగోరు గదిలో తొంగున్నారు బాబూ!’’ ‘‘యింట్లో ఎక్కడా లేదురా, యిల్లు విడిచి నువ్వెక్కడికి పోయినావురా?’’ రావుడు మొహం ఓరజేసుకుని ‘‘నౌఖరోడికి కాల్నొస్తుంది, కడుపు నొస్తుంది బాబూ. పెద్దయ్యోరు మరీ మరీ అప్పసెప్పి ఎల్లినారు గందా, అమ్మగారి నొక్కర్నీ ఒగ్గేసి నిసి రాత్రేళ సానమ్మ గారి–’’ రావుడి వీపు మీద రెండు వీశ గుద్దులు పడ్డాయి. ‘‘సంపేసినారు బాబూ’’ గోపాలరావు దయగలవాడు. కోపం దిగజారి పశ్చాత్తాపం కలిగింది. వీపు నిమిరి, గదిలోకి తీసుకువెళ్లాడు. కుర్చీమీద తాను కూచుని ‘రామా ఏమాయెరా!’యని దైన్యంతోటి అన్నాడు. రావుడు యీ తట్టూ, ఆ తట్టూ చూసి ‘‘ఏటో మాయలా ఉంది, బాబూ’’ అన్నాడు. ‘‘పుట్టింటిగ్గానీ వెళ్లివుండునా?’’ ‘‘అంతోరు కారనా? కోపగించితే సెప్పజాల్నుగానీ, ఆడోరు సదువుకుంటే ఏటౌతది బాబూ?’’ ‘‘విద్య విలువ నీకేం తెలుసురా’’ అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆనిచ్చి, ఆ నడుమ శిరస్సు వుంచి తలపోస్తూ ఉన్నంతలో, ముద్దులొలికే చేవ్రాలున్న వుత్తరవొకటి బల్లమీద కనపడ్డది. పైకి చదివాడు. ‘‘అయ్యా! ‘‘ప్రియుడా!’ పోయి ‘అయ్యా’ కాడికి వొచ్చిందా?’’ ‘‘పెయ్య పోయిందా బాబూ?’’ ‘‘మూర్ఖుడా! ఊరుకో.’’ ‘‘అయ్యా! పది దినములాయె రాత్రుల నింటికి మీ రాకయే నే నెరుగను. మీటింగులకు బోవుచుంటిమంటిరి. లోకోపకారమునకై యుద్యమముల నిదురమాని చేయుచుంటిమంటిరి. నేనింట నుండుటను గదా మీరిన్ని కల్లలు పలుకవలసి వచ్చెను. మీచే దినదినము అసత్యమాడించుట కన్న మీ త్రోవకు అడ్డుగ నుండకుండుటయే, పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కాదా? నేనీ రేయి కన్నవారింటికి చనియెద. సంతసింపుడు.’’ ఉత్తరం ముగించి, ‘‘నేను పశువును’’ అని గోపాలరావు అనుకున్నాడు. ‘‘అదేటి బాబూ, అలా శలవిస్తారు?’’ ‘‘శుద్ధ పశువును’’ రావుడు అతి ప్రయత్నం చేత నవ్వు ఆపుకున్నాడు. ‘‘గుణవతి, విద్యవతి, వినయ సంపన్నురాలు, నా చెడుబుద్ధికి తగిన శాస్తి చేసింది.’’ ‘‘అమ్మగారేటి సేసినారు బాబూ!’’ ‘‘పుట్టింటికి వెళ్లిపోయింది– గాని, నీకు తెలియకుండా ఎలా వెళ్లిందిరా?’’ రావుడు రెండడుగులు వెనక్కి వేసి, ‘‘నా తొంగున్నాను కావాల బాబు! అలిగితే సెప్పసాల్ను గాని బాబు, ఆడదాయి సెప్పకుండా పుట్టినోరింటికి ఎల్తానంటే లెంపలోయించి కూకోబెట్టాలి గాని మొగోర్లాగా రాతలూ, కోతలూ మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?’’ ‘‘ఓరి మూర్ఖుడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టతమయిన వస్తువు విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుడు పార్వతికి సగం దేహం పంచియిచ్చాడు కాదా. ఇంగ్లీషువాడు భార్యను ‘బెటర్ హాఫ్’ అంటాడు. అనగా పెళ్లాం మొగుడికన్న దొడ్డది అన్నమాట. బోధపడ్డదా?’’ ‘‘నాకేం బోధకాదు బాబు?’’ రావుడికి నవ్వు ఆచుకోవడం అసాధ్యం కావచ్చింది. ‘‘నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది. మీ వాళ్లకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వొచ్చిందో చూడు. ఆ మాట అలా వుణ్ణియ్యిగాని, యిప్పుడు నువ్వో నేనో వెంటనే బయల్దేరి చెంద్రవరం వెళ్లాలి. నే వెళ్డానికి శెలవు దొరకదు. నువ్వు తాతల నాటి నౌఖరువి. నీ మీద కమలినికి యిష్టం. గనక నువ్వే వెళ్లడం మంచిది.’’ ‘‘శలవైతే యెలతాను. ఆర్రానంటే–’’ ‘‘యింద పది రూపాయలు. బతిమాలి తీసుకొస్తివట్టాయనా, మరి పది రూపాయలిస్తాను.’’ ‘‘సిత్తం.’’ ‘‘ఐతె, యేవిటి చెప్పాలో తెలుసునా?’’ ‘‘యేటా బాబూ? సెప్పకుండా లేసి రావడం మా మంచి పని సేసినారమ్మా. బాబు నా యీపు పగలేసినారు. రండి రండమ్మా అని సెప్తాను.’’ ‘‘నన్ను క్షమించి దెబ్బ మాట మర్చిపో. కమలినితో ఎన్నడూ దెబ్బల మాట చెప్పబోకు. ఈమాట జ్ఞాపకం ఉంచుకుంటావు గదా?’’ ‘‘సిత్తం’’ ‘‘నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో చెబుతాను. బాగా చెవొగ్గి విను... పంతులికి బుద్ధి వొచ్చిందను...’’ ‘‘అదేటి బాబు!’’ ‘‘నీకెందుకు? నే అన్న మాట గట్టిగా జ్ఞాపకం వుంచుకుని చెప్పు. పంతులికి బుద్ధి వొచ్చింది అను. యిటుపైని ఎన్నడూ, రాత్రిళ్లు యిల్లు కదలరు. ఇది ఖరారు. తెలిసిందా?’’ రావుడు తల వూపాడు. ‘‘ఇంకా ఏవిటంటే, గెడ్డం పట్టుకుని బతిమాలుకున్నానని చెప్పమన్నారు. దయదల్చి పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు. (ఇది ముఖ్యమైన మాట. విన్నావా?) మీరు దగ్గర లేకపోవడం చేత వెఱె -
మైమరపించిన ‘మాంటో’
-
కవి కానివాడెవ్వడు?
ఒకనాడు ఓ కవి తన కవిత్వంతో భోజరాజును అమితంగా మెప్పించాడు. అతనికి తగిన వసతి కల్పించాల్సిందిగా భటులను ఆజ్ఞాపించాడు భోజుడు. ‘మహాప్రభో, ఇప్పటికే ధారానగరం కవులతో నిండిపోయింది. వీరికి వసతి ఇవ్వడం కష్టం’ అన్నారు. ‘అయితే రాజధానిలో కవికానివాడెవడైనా ఉంటే అతని గృహం ఇతనికివ్వండి’ అన్నాడు రాజు. భటులు ప్రతి ఇంటి తలుపు తడుతూ ‘మీరు కవులా?’ అని అడగటం మొదలుపెట్టారు. చివరకు కువిందుడు అనే చేనేతపనివాడు ‘కాదు’ అన్నాడు. ‘అయితే నీ గృహం కవిగారికి ఇస్తున్నాం’ అన్నారు భటులు. ‘ఇది అన్యాయం, నేను రాజుగారితో మాట్లాడతాను’ అన్నాడు కువిందుడు. సభకు వచ్చిన కువిందుడిని ‘నీవు కవిత్వం వ్రాయగలవా?’ అని భోజుడు ప్రశ్నించగానే– కావ్యం కరోమి నహిచారుతరం కరోమి యత్నాత్ కరోమి యదిచారుతరం కరోమి హేసాహసాంక! హేభూపాల మౌళి మణిరంజిత పాదపీఠ కవయామి, వయామి, యామి ‘కావ్యం వ్రాయగలను కానీ అందంగా ఉంటుందో లేదో చెప్పలేను. ప్రయత్నిస్తే అందంగానూ కావ్యం చెప్పగలను. సాహసమే జెండాగా గల ఓ మహారాజా! రాజుల యొక్క మణికిరీట కాంతులచే ప్రకాశించే పాదపీఠంగల ఓ భోజరాజేంద్రా! కవిత్వం చెప్పగలను(కవయామి), నేతపనీ చేయగలను(వయామి), వెళ్లమంటే వెళ్లనూగలనూ(యామి)’ అని జవాబిచ్చాడు. ‘‘ఇంత గొప్ప శ్లోకం చెప్పిన నీవు కవివి కావనడం ఎలా? కావున నీవు ఎక్కడకూ వెళ్లనవసరం లేదు’ అని భరోసా ఇచ్చాడు భోజుడు. నూతనంగా వచ్చిన కవికి మరేదో వసతి చూపించారనుకోండి. అది వేరే సంగతి. ‘భోజుని ధారానగరంలో కవులు కాని వాళ్లే లేరు’ అని చెప్పడానికి అతిశయోక్తిగా కల్పించబడిన కథే అయినా కడురమ్యంగా ఉందీ కథ. డి.వి.ఎం.సత్యనారాయణ -
ఒక తలపు రెండు తలుపులు
పాతకాలంలో ఒక అర్ధ అనాగరిక రాజు ఉండేవాడు. ఆయన ఆలోచనలు పొరుగు లాటిన్ దేశాల ప్రభావంతో ప్రగతిశీల మెరుగు అద్దుకున్నప్పటికీ చాలావరకు అనాగరికంగానే ఉండేవి. ఆయన ఎంతటి అతిశయంతో కూడిన అధికారాన్ని అనుభవించేవాడంటే తలుచుకున్నది తలుచుకున్నట్టే జరిగిపొయ్యేది. వ్యతిరేకించినవారిని చక్కబెట్టడానికి మించిన ఆనందం ఆయనకు ఎందులోనూ లేదు.ఆయన మొరటు ఆలోచనలన్నీ పోతపోసినట్టుగా కనబడే ప్రదేశం ఏదైనా ఉందంటే అది రంగభూమి. ఈ వేదికను ఖడ్గధారుల కరవాల ధ్వనులు వినడానికో, భిన్న మతాల మధ్య తలెత్తే వాదోపవాదాలను గ్రహించడానికో ఏర్పాటు చేయలేదు. జనాల మానసిక శక్తులను విస్తృతపరిచే కేళీ విలాసాలు చోటుచేసుకుంటాయిక్కడ. మార్మికమైన చీకటిగుహలతో, ఎవరికీ అంతుపట్టని లోపలి దారులతో చుట్టూ గుండ్రంగా ప్రేక్షకులు కూర్చుండేలా నిర్మించిన ఈ విశాలమైన రంగభూమిలో లేశమాత్రం స్వపర భేదం లేని, అవినీతికి ఆస్కారం లేని కవితాన్యాయం జరుగుతుంది. నేరం శిక్షించబడుతుంది, ధర్మం ప్రతిఫలం పొందుతుంది. ఎవరైనా నేరారోపణ ఎదుర్కొన్నట్టయితే, ఆ నేరం రాజుకు ఆసక్తి కలిగించేంతటిదైతే దాని గురించి తెలియపరుస్తూ ప్రజలకు దండోరా వేస్తారు. నిర్దేశిత రోజున ప్రజా వేదిక మీద అణువణువూ రాజసం నింపుకున్న రాజుగారి సమక్షంలో నిందితుడి విధిరాత నిర్ణయమవుతుంది. ప్రజలందరూ గుమికూడాక, వేదిక ఒకవైపున రాజు తన మంత్రివర్గాన్ని కొలువుతీర్చుకుని అత్యున్నత పీఠం మీద కూర్చుంటాడు. సంజ్ఞ చేయగానే ఆయన కిందివైపు ఉన్న ద్వారం తెరుచుకుంటుంది. నిందితుడు రంగభూమి మీద అడుగుపెడతాడు. రాజుకు సరిగ్గా వ్యతిరేక దిశలో ఒకేలా కనబడే రెండు ద్వారాలు పక్కపక్కనే ఉంటాయి. నిందితుడు తనకు ఒసగబడిన విశేషాధికారంతో ఈ రెండు ద్వారాల వైపు నడుచుకుంటూ వెళ్లి ఒక తలుపు తెరవాలి. ఏది సమ్మతమో అదే తెరవొచ్చు. ఏ ప్రభావం ఉండదు, ఏ మార్గదర్శనం లభించదు. ముందు చెప్పుకున్న అవినీతికి తావులేని, స్వపరభేదం లేని న్యాయం జరిగే చోటిది. అతడు గనక ఒక ద్వారం తెరిస్తే అందులోంచి ఒక ఆకలిగొన్న పులి బయటకు వస్తుంది. నేరానికి శిక్షగా అతి క్రూరంగా నిందితుడి శరీరాన్ని ఖండఖండాలుగా చీల్చేయవచ్చు. తిరిగి ఇనుప ఊచలు మూసిన చప్పుడు వినబడగానే, నిందితుడికి పట్టిన గతిని తలుచుకుంటూ ప్రేక్షకులు భారంగా నిష్క్రమిస్తారు. ఒకవేళ నిందితుడు మరో తలుపు తెరిస్తే, అందులోంచి ఓ యువతి బయటకు వస్తుంది. రాజు తన దగ్గరున్న పడుచుల్లోంచి నిందితుడి వయసుకు తగినట్టుగా ఎంపిక చేసిన ఈ వధువును ఇచ్చి తక్షణమే కల్యాణం జరిపిస్తాడు. ఒకవేళ అదివరకే వివాహం జరిగిందా, అతడి మనసు ఇంకెవరిమీదైనా ఉందా లాంటి చిల్లర విషయాలను రాజు లక్ష్యపెట్టడు. రాజు మరో ద్వారం తెరవగానే పూజారి, వాయిద్యగాళ్లు వచ్చి మేళతాళాలతో వేడుకను జరిపించగానే, ప్రజలు హర్షధ్వానాలతో నూతన వధూవరుల మీద పూలు జల్లి సంతోషంగా ఇళ్లకు వెళ్లిపోతారు. ఇది రాజుగారి అర్ధ అనాగరిక న్యాయ విధానం. ఇందులో తరతమ భేదం లేదనేది నిశ్చయం. మరు క్షణంలో పాశవికంగా హత్యకు గురవుతాడా, కేరింతల నడుమ వివాహం చేసుకుంటాడా అన్న చిన్నపాటి సూచన కూడా నిందితుడికి అందదనేది ఖాయం. తనకు న్యాయం చేసుకునే పూర్తి హక్కును రాజు నిందితుడికే వదిలిపెట్టాడనే అంశాన్నీ విస్మరించకూడదు. కొన్ని సందర్భాల్లో పులి ఇటువైపు ద్వారం నుంచి బయటకు వస్తే, కొన్నిసార్లు అటువైపు నుంచి రావొచ్చు. ఈ అర్ధ అనాగరిక రాజుకు ఒక చక్కటి కూతురు ఉంది. ఆమె కూడా రాజు అంతటి దర్పం గలది. భూమ్మీద ఏ మనిషినీ రాజు తన కూతురంత ప్రేమించడు. రాజు ఆస్థానంలో ఒక యువకుడు పనిచేస్తున్నాడు. అతడి రక్తం కులీన వంశీయుడిదైనా స్థానం మాత్రం రాచకన్యలను ప్రేమించే అతి సాధారణ శృంగార నాయకుల కోవలోనిది. రాచబిడ్డ కూడా ప్రేమికుడి పట్ల సంతుష్టిగానే ఉంది. అతడు అందగాడు, రాజ్యం మొత్తంలో అతడి ధైర్యానికి సరితూగేవాళ్లు తక్కువ. యువరాణి ప్రేమలో కూడా మోటుదనానికి సరిపోయేంత తీవ్రత ఉంది. ఈ ప్రేమకలాపం కొన్ని మాసాల పాటు సంతోషంగా సాగింది, చివరికి రాజు ఈ వ్యవహారాన్ని కనిపెట్టేదాకా. అంతఃపురంలో జరిగిన దీని పట్ల రాజు తన బాధ్యత నుంచి వెనక్కిపోలేదు. యువకుడిని తక్షణం కారాగారంలో బంధింపజేసి, నిర్దేశిత రోజున ప్రజావేదిక మీద న్యాయం కోసం పిలుపునిచ్చాడు. రాజు, ప్రజలు కూడా ఎంతో ఉత్సుకతతో తీర్పు రోజు కోసం ఎదురుచూడసాగారు. గతంలో ఏ యువకుడూ రాజుకూతురినే ప్రేమించే సాహసం చేయలేదు. తర్వాతి కాలంలో ఇట్లాంటివి సాధారణమైతే అవొచ్చుగాక కానీ ఆ కాలానికి అది విపరీతమైన సంగతే. రాజ్యంలో ఉన్న అత్యంత క్రూరమైన పులిని అన్వేషించి తెచ్చారు. రాజ్యాన్ని మొత్తం గాలించి సుందరమైన కన్యను వెతికి పట్టుకున్నారు, ఒకవేళ విధి గనక యువకుడికి మరో రాత రాస్తే సరిపోయేలా. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు, యువకుడు యువరాణిని ప్రేమించిన సంగతి. దీన్ని యువరాణిగానీ యువకుడుగానీ నిరాకరించడం లేదు. కానీ రాజు దీన్ని వ్యవహారం మధ్యలోకి తేవడానికి ఇష్టపడలేదు. తీర్పు దినం రానేవచ్చింది. రాజ్యపు దూరదూరాల నుంచి వచ్చిన జనం రంగభూమి మీద కూర్చున్నారు. చోటు చాలనివాళ్లు గోడలకు నిలదొక్కుకున్నారు. విధిని నిర్ణయించే ఆ ఏకరూప ద్వారాలకు సరిగ్గా ఎదురుగా వేసిన ఉన్నతాసనం మీద రాజు ఆసీనుడయ్యాడు. మంత్రివర్గం తమ తమ స్థానాల్లో వేచిచూస్తోంది. అంతా సిద్ధం. సంకేతం ఇచ్చారు. కిందున్న ద్వారం తెరుచుకోగానే యువరాణి ప్రేమికుడు నడుచుకుంటూ వేదిక పైకి వచ్చాడు. పొడుగ్గా, తెల్లగా, అందంగా ఉన్న ఆ యువకుడిని చూడగానే జనంలో ఒక ఆరాధన చోటు చేసుకుంది. ప్రేక్షకుల్లో సగమందికి ఇంతటి సొగసుకాడు తమ మధ్యనే నివసిస్తున్నట్టు తెలియదు. మరి యువరాణి ప్రేమించిందంటే ఆశ్చర్యం ఏముంది! యువకుడు వేదిక మధ్యకు వచ్చాడు. రాజుకు వంగి అభివాదం చేయడం సంప్రదాయం. అదేమీ పట్టించుకోకుండా యువరాణి వైపు కళ్లు నిలిపాడు. ఆమె సరిగ్గా తండ్రికి కుడివైపున కూర్చుంది. ఎంతో కొంత క్రూరత్వపు ఉత్సుకత ఆమె స్వభావంలో ఉండబట్టిగానీ లేదంటే ఆమె అక్కడ కూర్చోవలసినదే కాదు. తన ప్రియుడిని బంధించిన క్షణం నుంచీ రాత్రీపగలూ ఆమె ఈ వ్యవహారంతో ముడిపడిన విషయాల గూర్చే ఆలోచించింది. తనకున్న అధికారం, తను చూపగల ప్రభావం రీత్యా ఈ వ్యాజ్యం మీద గొప్ప ఆసక్తిని నిలబెట్టుకుంది. పైగా ఇంతవరకూ రాజ్యంలో ఏ వ్యక్తీ చేయలేని పని చేసింది– ఆ ద్వారాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించింది. ఆ చిన్నగదుల్లో ఎందులో పులిబోను ఉందో, ఎందులో యువతి ఉందో తెలుసుకుంది. తోలుతో నింపివున్న ఆ చిన్నగదుల్లోంచి గడియ తీయబోయే నిందితుడికి ఏ శబ్దమూ వినిపించదు, ఏ సూచనా అందే వీలుండదు. స్త్రీకి ఉండే సంకల్పమూ, బంగారమూ ఆ రహస్యం యువరాణికి అందడానికి కారణమైనాయి. ఏ తలుపు వెనుక సిగ్గులమొగ్గ లాంటి యువతి వేచివుందో తెలియడంతోపాటు ఆ యువతి ఎవరో కూడా యువరాణికి తెలుసు. రాజాస్థానంలోని చక్కటి చుక్కను యువకుడి కోసం ఎంపిక చేశారు. ఆ యువతి అంటే యువరాణికి గిట్టదు. చాలాసందర్భాల్లో యువరాణి చూసింది లేదా అనుకున్నది ఏమంటే, ఈ యువతి తన ప్రేమికుడి మీద ఆరాధన కనబరిచింది. ఆ వలపుచూపులను యువకుడు అందుకోవడమే కాదు, వాటికి బదులిచ్చివుంటాడని కూడా యువరాణి భావన. పైగా అమ్మాయి అందంగా ఉంది, తన ప్రేమికుడి వైపే కన్నెత్తి చూడటానికి సాహసించింది. పూర్వీకుల నుంచి యువరాణిలో ప్రవహిస్తున్న అనాగరిక రక్తం ఆ ద్వారం వెనకాల చెంపల ఎరుపుతో నిల్చునివున్న యువతిని ద్వేషించేలా చేసింది. ఎప్పుడైతే ఆమె ప్రేమికుడు ఆమెవైపు చూశాడో, కుతూహలంతో చూస్తున్న జనసంద్రం మధ్యలో, ఆత్మలు ఏకమైన వాళ్లకే పరిమితమైన సంజ్ఞభాషలో వాళ్ల కళ్లు వేగంగా కలుసుకున్నాయి. ఏ ద్వారం వెనుక పులి నక్కివుందో, ఏ ద్వారం వెనుక అమ్మాయి నిలబడివుందో ఆమెకు తెలుసనీ, ఆ గుట్టు చిక్కించుకోకుండా ఆమె నిద్రపొయ్యేరకం కాదనీ యువకుడి నమ్మకం. ఎప్పుడైతే ఆమె కళ్లవైపు చూశాడో ఆమెకు అంతు చిక్కిందని అర్థమైంది. అంతే వేగంగా కంటిచూపుతో ‘ఏది?’ అని ప్రశ్నించాడు. అంత జనం మధ్యలో గొంతెత్తి అరిచినంత స్పష్టంగా ఆ ప్రశ్న ఆమెకు అర్థమైంది. కంటిరెప్పపాటులో అడిగిన ఈ ప్రశ్నకు అదే కంటిరెప్పపాటులో జవాబివ్వాలి. ఆమె కుడిచేయి సింహాసనపు మెత్తటి చేయి మీద ఆన్చివుంది. చేతిని లేపి, చిన్నగా వేగంగా సంజ్ఞ చేసింది. యువకుడు తప్ప దాన్ని ఎవరూ చూడలేదు. అందరి కళ్లూ ఆ యువకుడి మీదే లగ్నమైవున్నాయి. అతడు తిరిగి, స్థిరమైన అడుగుల వేగంతో తలుపుల వైపు నడిచాడు. ప్రతి ఒక్కరి గుండె కొట్టుకోవడం ఆగింది, శ్వాస నిలిచింది, రెప్పలు వేయడం మరిచారు. ఏమాత్రం సంశయం లేకుండా, అతడు కుడివైపు ఉన్న గది దగ్గరకు వెళ్లి గడియ తీశాడు. ఇప్పుడు కథలోని కీలకాంశం ఏమిటంటే, అందులోంచి పులి బయటకు వచ్చిందా, యువతా? దీని గురించి ఎంత ఆలోచిస్తే, జవాబు దొరకడం అంత కష్టం అవుతుంది. ఉడుకు రక్తం పరుగెడుతున్న అర్ధ అనాగరిక యువరాణిని దృష్టిలో ఉంచుకుని దీనికి సమాధానం అన్వేషించాలి. ఆమెలో ఒకవైపు అసూయ, మరోవైపు నిరాశ. ఆమె ఎటూ ప్రేమికుడిని కోల్పోయింది. కానీ ఎవరు పొందాలి? తన సఖుడు తలుపు తీయగానే పులి తన వాడి పంజాతో చీల్చే దృశ్యాన్ని తలుచుకుని తన కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది! అదే సమయంలో తరుచుగా ఆమె మరో ద్వారం ముందు తన ప్రియుడు ఉండటాన్ని ఊహించుకుంది! హృదయం మరిగి, పళ్లు పటపట కొరికింది. జీవితాన్ని పూర్తిగా పొందిన సంతోషంలో జనాల తుళ్లింతల మధ్య వాళ్లిద్దరూ ఆలుమగలుగా నిర్ణయింపబడితే! అతడు ఒక్కసారిగా చచ్చిపోవడం మంచిది కాదా, తనకోసం మరుజన్మలో ఎదురుచూస్తూ? మళ్లీ ఆ ఘోరమైన పులి, దాని గాండ్రిపు, ఆ రక్తం! ఆమె రెప్పపాటులో తన సైగ చేసివుండవచ్చు. కానీ దాని వెనుక రోజుల తరబడి సాగించిన అంతర్మథనం ఉంది. తనను అడుగుతాడని నిశ్చయంగా తెలుసు, ఏం జవాబివ్వాలో నిర్ణయించుకుని, సంశయం లేకుండా కుడివైపు చేతిని కదిల్చింది. ప్రియ పాఠకులారా, ఇక ఇది పూరించుకోవాల్సింది మీరే. యువకుడు తలుపు తీయగానే పులి వచ్చిందా, యువతా? -
పుస్తక రూపంలో ప్రియాంక ఆత్మకథ
మాజీ ప్రపంచ సుందరి, బాలీవూడ్ అగ్రశ్రేణి నటి ప్రియాంక చోప్రా.. రిషి కపూర్, ట్వింకిల్ ఖన్నా, నసీరుద్దీన్ షాల సరసన చేరారు. ఈ బాలీవుడ్ దిగ్గజాల దారిలోనే కలం చేత పట్టి ప్రియాంక తన ఆత్మకథ రాశారు. ‘పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్’ ప్రచురిస్తున్న ఈ పుస్తకానికి ‘అన్‌ఫినిష్ఢ్’గా నామకరణం చేశారు. 2019లో మార్కెట్లోకి రాబోతున్న ఈ ఆత్మకథలో ప్రియాంక సేకరించిన వ్యాసాలు, కథలు, ఆమె జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన సంఘటనలను వివరించారు. ఈ పుస్తకాన్ని ఎంతో నిజాయితీగా, సరదాగా, ముక్కు సూటిగా, ఎవరినీ విమర్శించకుండా రాశానన్నారు ప్రియాంక. గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ బయటకి చెప్పలేదని, కానీ ఈ పుస్తకంలో వివరించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. పుస్తకం గురించి వివరిస్తూ.. పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ సంస్థ కు చెందిన మానసి సుబ్రమణ్యం, ప్రియాంక రాసిన ఆత్మకథ గురించి వివరిస్తూ.. ‘ఈ పుస్తకం ప్రియాంక ఆత్మకథకు మాత్రమే కాదు.. మహిళల మేనిఫెస్టో’గా అభివర్ణించారు. అన్ఫినిష్డ్ పుస్తకం చదివాక మహిళలు ఏదైనా సాధించగలరనే నమ్మకం ఏర్పడుతుందని, ఎవరినైన ప్రభావితం చేయగలిగే శక్తి ప్రియంకకు ఉందని సుబ్రమణ్యం తెలిపారు. -
చిత్రనళినీయం.. కథ వెనక కథ
ప్రియాతి ప్రియమైన పాఠకులారా!! ఈ రోజు ఈ ఉత్తరం మీకు వ్రాస్తుంటే నా మనసు చెప్పలేనంత ఉద్విగ్నభరితంగా ఉంది. 60 సంవత్సరాల సుదీర్ఘమైన నా రచనాప్రయాణంలో నేను 1957లో వ్రాసిన ‘చిత్రనళినీయం’అనే ఈ కథ నా తొలి అడుగు! దాదాపు 60 సంవత్సరాల అలుపెరుగని, నిరుత్సాహం ఎరుగని, విసుగు ఎరుగని, సుదీర్ఘ ప్రయాణం ఇది. నేను పుట్టి పెరిగినది ‘కాజ’అనే చిన్న గ్రామం. చాలా అందమైన పల్లెటూరు. ప్రకృతి మధ్య ఒదిగి పడుకున్న అమాయకపు పసిపాప లాంటి అందమైన ఊరు. ఎటు చూసినా పచ్చదనం! పంట కాలవలు. వరిచేలు. ఉదయం అవగానే చెట్ల మీద గుంపులుగా వాలే రామచిలుకలు, కావ్–కావ్ మని కాకుల గోలలు! వేణుగోపాల స్వామి ఆలయంలో జేగంటల ధ్వనులు.. ఇటు పక్క శివాలయంలో శివనామ స్మరణలు! దొడ్లో ఒక పక్క బావిలోంచి బకెట్టుతో నీళ్ళు తోడుతున్న చప్పుడు..! ఇటు పక్క కట్టెలపొయ్యి మీద కాగులో కాగుతున్న వేడి నీళ్ళు. పొయ్యిలోంచి కట్టెలు, పిడకల వాసన. కొద్ది దూరంలో ఆవు పేడ వాసన. గుమ్మం పక్కన విరగబూసి సువాసనలు వెదజల్లుతున్న సన్నజాజి చెట్టు. దానికి కొద్దిదూరంలో తులసి వనంలా పచ్చటి తులసి మొక్కలు.. తెల్లవారేసరికి ఒకటో రెండో పళ్ళు రాల్చే విరగ గాసిన బాదం చెట్టు. ఇంట్లో కరెంటు లేదు. కిరసనాయిలు లాంతర్ల ముందు కూర్చుని అప్పుడప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఊరిలో అన్నిటికంటే నాకు ప్రియాతి ప్రియమైనది ‘మా ఊరి చెరువు’. దాన్ని చూస్తే సంతోషంతో పులకరింతలు వచ్చేవి.. ఎందుకంటే అది ఒక అందమైన, అద్భుతమైన దృశ్యం! ఆ చెరువులో తెలుపు, ఎరుపు కలువ పూలు!! కొన్ని మొగ్గలుగా ఉండేవి. కొన్ని విచ్చుకుని విరబూసి ఉండేవి. కార్తీకమాసంలో, చలిలో అమ్మా అత్తయ్యలు, చెరువుకి స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా వాళ్ళ వెంట వెళ్ళేదాన్ని. అమ్మ ఒక పాత చీరలో నన్ను కాగితంలో పొట్లం చుట్టినట్టు చుట్టి చలిబారిన పడకుండా చూసేది. చెరువు మెట్ల మీద కూర్చుని అమ్మా అత్తయ్యలు అరటి దొప్పల్లో దీపాలు పెట్టి చెరువులోకి వదిలేస్తుంటే, అవి మెల్లగా నీటిలో ప్రయాణం చేస్తుంటే ఆ చీకటి రాత్రి, చెరువు – దీపాలు , నాకు చాలా ఆనందంగా, చూడముచ్చటైన దృశ్యంగా ఉండేది. తెల్లవారి అమ్మా అత్తయ్యలు చెరువు గట్టున ఉన్న రామాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే నేను చెరువుని వదలలేని దానిలా అక్కడే కూర్చునే దాన్ని.. చెరువు చుట్టూ పాకలు! పైకప్పులోంచి వలయాకారంగా బయటికి వస్తున్న వంట పొయ్యిల పొగలు. మా ఊరికి బస్సు సౌకర్యం లేదు. పోస్ట్ అంతా పంట కాలవలో, పడవలో బందరు వెళ్ళాలి. అలా నేను వ్రాసిన నా మొట్టమొదటి కథ ‘చిత్ర నళినీయం’ పంట కాలవలో, పడవలో ప్రయాణం చేసి బందరు వెళ్ళి, అక్కడ నుంచి రైలులో మద్రాసు వెళ్ళింది. ఆ పచ్చటి పొలాలు, పంట కాలవల్లో ఆకాశం పైనుందా, క్రింద కాలవలో ఉందా అన్నట్టూ ప్రతిబింబించే దృశ్యాలు.. పడవని తాడుతో లాగుతూ ఒడ్డున నడిచే పల్లెకారులు, నీళ్ళలో వెళుతున్న పడవ శబ్దం. ఇదంతా గుర్తుకువస్తే ‘సత్యజిత్ రే’ సినిమాలో ఒక దృశ్యంలా అనిపిస్తుంది. అప్పటికే నా వివాహం కావడం వల్ల నా పేరు యద్దనపూడి సులోచనారాణి అని పెట్టుకున్నాను. అలాంటి పల్లెటూరిని వదిలి ఈ హైదరాబాదు వచ్చాను. కాలగమనంలో ఇన్నాళ్ళ నా సాహితీచరిత్ర సాగుతోంది. ఇంకెన్ని పుటలు ఉన్నాయో నాకే తెలి యదు. కాలగమనంలో మార్పు చూడండి.. ఆ నాడు పంట కాలవలో, పడవలో వెళ్ళే నా కథ, ఇప్పుడు నా కలం నుంచి తెల్ల కాగితం మీద వచ్చిన అక్షరాలని ‘అని’ నిమిషంలో కంప్యూటర్లో పెట్టడం జరుగుతోంది.. 1957 లో ప్రచురితం అయిన నా ఈ కథని మీ ముందు ఉంచుతుంటే, నా హృదయం ఊహించలేనంత ఉద్విగ్నంగా, ఆనందంగా ఉంది. ఈ క్షణం, 60 సంవత్సరాలు గల గతం, ఇప్పటి ఈ రోజు వర్తమానం రెండూ కలిసిపోయిన అద్భుత క్షణాలుగా అనిపిస్తున్నాయి.. కథ ముందు.. నేను రచయిత్రిగా ఎలా మారానో, నేను రాసిన మొట్టమొదటి కథ వెనక జరిగిన కథ ఇది : ‘చిత్రనళినీయం’ కథ పోస్ట్ చేయటానికి వెనక చిన్న కథ వుంది. నేను ఆ కథ రాయటానికి (ఇది నేను ఎస్.ఎస్.ఎల్.సి. పాస్ అయిన తర్వాత సెలవల్లో వ్రాసాను). అంత క్రితం 8వ క్లాసు చదువుతుండగా స్కూల్లో మేగ్జీన్ కోసం ఖుద్దూస్ మాస్టార్ గారు నన్ను ఒక కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అన్నాను. అంత క్రితం నేను ‘గోమాత’ మీద ఒక వ్యాసం వ్రాసి, క్లాస్‌లో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను. నేను అది బాగా వ్రాసానని, క్లాస్‌లో మిగతా పిల్లలతో నాకు అభినందనగా చప్పట్లు కొట్టించి, వారితో కలిసి ఆయన కూడా కొట్టారు! నా మనసు పరవశించి పోయింది. ఖుద్దూస్ మాస్టార్ ముస్లిం అయినా తెలుగు బాగా మాట్లాడేవారు, వ్రాసేవారు. చక్కగా కథలు చెప్పి నీతి బోధించేవారు. ఆయనంటే నాకు బాగా ఇష్టం. నిజానికి ‘గోమాత’ వ్యాసం వ్రాయటానికి నేను యేమీ కష్టపడలేదు. మా దొడ్లో ఒక ఆవు ఉండేది. అమ్మ దాన్ని ‘లక్ష్మి’ అని పిలిచేది. దాని ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, దండం పెడుతూ దాని చుట్టూ ప్రదక్షిణం చేసేది. అది మూత్రం పోస్తే దాని తోక మీద పట్టి, తన తల మీద చల్లుకుని, నా తల మీద చల్లేది. లక్ష్మికి ఒక దూడ ఉండేది. అది దొడ్లో చెంగున గంతులేస్తుంటే మేం పిల్లలంతా దానితో ఆడేవాళ్ళం. నేను దాన్ని పట్టుకుని, మా అమ్మలా దాని మెడ మీద నిమిరేదాన్ని! అది నా దగ్గరికి వచ్చేసేది. మా బాబాయి ఒకరు ఆవు వల్ల ఉపయోగాలు చెప్పారు. ఇదంతా కలిపి ఒక వ్యాసం వ్రాసాను. మూత్రం శుద్ధి చేయటానికి పనికొస్తుందని, పాలు ఆరోగ్యానికి మంచిదని మా బాబాయి చెప్పినట్టే వ్యాసంలో వ్రాసాను. ఇది వ్రాసిన తర్వాత ఖుద్దూస్ మాస్టార్ స్కూల్ నుంచి వచ్చే వ్రాత పత్రికకి కథ వ్రాయమని అడిగారు. నాకు రాదు అని అంటే... నువ్వు వ్రాయగలవని ప్రోత్సహించారు. ఆయన పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది గుర్తుకువచ్చి, శరీరం సంతోషంతో పులకరించేది. ఆ ఉత్సాహంతోనే స్కూల్ వ్రాత పత్రికకి ఒక కథ వ్రాసాను. దాని పేరు ‘మనోఛాయలు’ (ఇద్దరు స్కూల్లో చదివే స్నేహితురాళ్ల మధ్య చిన్న మనఃస్పర్థలు వచ్చి, మళ్ళీ ఇద్దరు కలిసిపోయి ఆనందంగా ఒకరి భుజం మీద మరొకరు చేతులేస్కొని, స్నేహంగా స్కూల్‌కి వెళ్ళటం! ) అది నా 14వ సంవత్సరంలో వ్రాసిన కథ! అది కూడా ఖుద్దూస్ మాస్టార్ మరీ మరీ వ్రాయమని అడిగితే వ్రాసినదే! నేను పెద్ద రచయిత్రిని అయిన తర్వాత, ఎవరో ఒకరు వ్రాయండి అని అడిగితే రాసిన నవలలే ఎక్కువ.. 1) సెక్రటరీ – రమణా – బాపు, జ్యోతి రాఘవయ్య గారు. 2) జీవన తరంగాలు – నార్ల వెంకటేశ్వరరావు గారు 3) మీనా – చక్రపాణి గారు 4) ఆరాధన – ఎమెస్కో ఎం.ఎన్. రావు గారు ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఎస్.ఎస్.ఎల్.సి. పరీక్షలు అయిపోయినాయి. వేసవి సెలవుల తర్వాత నవంబర్‌లో అమ్మ పోయింది. మనసులో భయం! ఒంటరితనం! దిగులు.. దుఃఖం! అప్పటికే పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది. నాన్న ఎస్.ఎస్.ఎల్.సి. అయి, ఇంటర్ అయిన తర్వాత కాపురానికి పంపిస్తామని పెళ్ళికి ముందే షరతు పెట్టారు. ఇంటినిండా అక్కయ్యలు, ఒదినలు, పిల్లలు.. అయినా ఒంటరితనం. ఖుద్దూస్ మాస్టార్ ఒకసారి నాన్నని చూడటానికి వచ్చి.. నన్ను కథలు వ్రాయమని గట్టిగా చెప్పారు... కథలు వ్రాస్తే నా బాధలు పోతాయని చెప్పారు... అప్పుడు ‘చిత్రనళినీయం’ వ్రాసాను.. – యద్దనపూడి సులోచనారాణి రహస్యంగా పోస్టయిన కథ... మంగళవారం (29.05.2018) సంచికలో... -
రాతి హృదయం
ప్రేమ ప్రేమ అమ్మ పాల వంటిది అది ఒక చైతన్యధార! దానికి మతం, కులం, ఇజం అనేవి ఏవీ లేవు, ఈ మానవాళికి అది ఒక అమృతధార స్త్రీ ఒక ప్రేమ దాసి! ఆమె పుట్టినప్పటి నుంచి తల్లిలో, తండ్రిలో, అక్కచెల్లెళ్ళలో, అన్నదమ్ముల్లో, ఇరుగుపొరుగులో, పెళ్ళి అయిన తరవాత భర్తలో, పిల్లల్లో, అత్తమామల్లో, దేవుడిలో, ప్రేమను వెతుక్కుంటూ వుంటుంది.. యుగయుగాలనుంచి, ఇప్పటివరకూ ఒక్క స్త్రీ కూడా ఆమె కోరుకున్న ప్రేమ తనకి లభించినట్టు చెప్పలేక పోతూంది... దీనికి కారణం ఏమిటి? మనుషులా? కాలమా? రాతి హృదయం నేను హైదరాబాదులో దుర్గం చెరువు దగ్గర ఉన్న ఒక పెద్ద బండ రాయిని. నా వయసు నాకే తెలీదు. సృష్టిలో విస్ఫోటం జరిగి ఈ భూమి ఏర్పడినప్పుడు ఏర్పడిన శిలాకుటుంబం మాది. మా వయసు వేల సంవత్సరాలు. మొదట్లో గరుకుగా, మోటుగా ఉన్న మా కుటుంబం, ఈ ప్రకృతి మమ్మల్ని అదే పనిగా తోమటంతో ఇలా నున్నగా, నిగనిగలాడుతూ, అప్పుడే బ్యూటీ పార్లర్ నుంచి ఒచ్చిన సొగసైన అమ్మాయి ముఖంలా మెరుస్తున్నాం అనేవారు మా పెద్దవాళ్ళు. మాది కఠినకాయం. చెరువు చుట్టూ చిన్నా–పెద్దా, తాత–ముత్తాతలైన పెద్ద పెద్ద రాళ్ళతో మా కుటుంబం ఉండేది. హైదరాబాదుకి వయసు వచ్చి, మమ్మల్ని నమిలి మింగేయసాగింది. మా పూర్వీకులు చాలా మంది నశించిపోయారు. నాది భారీకాయం. ఎండ వచ్చినా, వెన్నెల వచ్చినా, నా నీడ 300 గజాలు పైగా వ్యాపిస్తుంది. ఈ ప్రపంచంలోకల్లా, నాకు చాలా ఇష్టమైనది నా నీడ. నా నీడలో, పగలు మేకలు, కుక్కలు వచ్చి పడుకుని సేదతీరుతాయి, అప్పుడప్పుడు మేకలు ప్రసవించడం కూడా జరుగుతుంది. మేకలు కాసే పిల్లవాడు, నన్ను ఆనుకొని కూర్చొని పిల్లనగ్రోవి వాయిస్తుంటే, నాకు పరవశం కలుగుతుంది. ఇంతకంటే నాకు కనువిందైన దృశ్యాలు ఎన్నో! సాయంత్రం వేళ, వెన్నెల రాత్రులలో, ప్రేమికులైన యువతీయువకులు వచ్చి నా నీడ క్రింద కూర్చొని, అరమరికలు లేకుండా సరసాలు ఆడుకుంటూ, ముద్దుముద్దుగా ప్రవర్తిస్తుంటే నాకు చక్కలిగింతలు పెట్టినట్టుగా ఉండేది. నిజం చెప్పొద్దూ? ఒక్కోసారి వారి చేష్టలు చూడలేక, కళ్ళు మూసుకునేదాన్ని. కొంతమంది వాళ్ళ తీపి గుర్తుగా నా భారీకాయంలో కొంతభాగంలో వాళ్ళ ప్రేమికులని నిలబెట్టి ఫోటోలను తీసుకునేవారు, నా మీద వారి గుర్తుగా పిచ్చి పిచ్చి రాతలు రాసేవారు. నేను ఇవన్నీ వర్ణించి వర్ణించి చెప్తుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నిట్టూర్చేది. ‘‘రాతి మిత్రమా! నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. నా సంగతి చూడు. ఒకప్పుడు వాన నీళ్ళతో కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉండేదాన్ని ఇప్పుడు మనుషుల, పశువుల మలమూత్రాలు నాలోనే ఒంపేస్తున్నారు. వ్యాఖ్..! ఒక్కరూ నన్ను ప్రేమగా చూడటం లేదు. ఏం చెప్పను? జన్మ ఎత్తగానే సరిపోతుందా? మంచిగా బ్రతుకు వెళ్ళదీసే మహా అదృష్టం కూడా ఉండాలి.’’ నేను గర్వంగా ఫీల్ అయ్యాను, నేనెంత బలశాలినో గుర్తుచేసుకొని చెరువుని చిన్న చూపు చూసాను. రోజులు గడుస్తున్నాయి, నాకు చాలా ఉత్సాహం పెరిగిపోయింది. ఒకసారి చెరువుతో అన్నాను.. ‘మనమిద్దరం ప్రేమించుకుందామా! పెళ్లి చేసుకుందామా?’ చెరువు నా మాటలకి సిగ్గుపడుతూ ‘‘అంత అదృష్టమా?’’అంటుంది అనుకున్నాను. కానీ బ్రహ్మరాక్షసిలా విరుచుకుపడింది. ఆవేశంతో ఊగిపోయింది. ‘‘బండ వెధవా! ఇన్నాళ్లు ఇరుగు పొరుగుగా ఉన్నామని అరమరికలు లేకుండా మాట్లాడాను. దుర్మార్గుడా! నీ కుటుంబం నాశనం అవుతుంది. దున్నపోతా! నీ మంచితనం అంతా నటనన్నమాట! నీచుడా! నీ తల నిలువునా పగిలిపోనూ! నీదేం జాతి, నాదేం జాతి? కాస్త రంధ్రం దొరికితే మైళ్ళ దూరం పరిగెత్తిపోయే జాతి నాది. కూర్చున్నచోటి నుండి కదలలేని వెధవ్వి నువ్వు! ఖబడ్దార్! కన్నెత్తి చూసావో?’’ అని దులపరించింది. ఆమె అరుపులకి, నా మీదకి విరుచుకుపడిపోతున్న దురుసుతనానికి బిత్తరపోయాను. నా తల మీద విందు చేసుకుంటున్న కాకులు ఆమె అరుపులకి కావ్! కావ్! అని అరుస్తూ ఎగిరిపోయాయి. నేను తల దించుకున్నాను. సిగ్గుపడ్డాను. కొంతమందికి కొన్ని అర్హతలు ఉండవు. అంతే! భగవంతుడు కొంతమంది జీవితాలు శూన్యం చేసి, ఎదురుగా అందమైన ప్రపంచం, చైతన్యం, చూపించి ఏడిపిస్తాడు. నా హృదయం క్రుంగిపోయింది. మనకి ఇష్టం కదా అని, ఎదుటివారి మనసు తెలుసుకోకుండా మాట్లాడితే, అవి ప్రేమవాక్యాలు కాదు, పిచ్చి ప్రేలాపనలు అవుతాయని తెలుసుకున్నాను. ప్రేమ ఒక రోజు నా ఖర్మ కాలింది. ఎవరో డైనమైట్ పెట్టి... ఒకటి కాదు!! రెండు కాదు!! 20 డైనమైట్లు పెట్టి నన్ను నిలువునా పేల్చేసారు. నా శరీరం పేలిపోయింది. సగం శరీరం తునాతునకలైంది. మిగతా సగం శరీరం ఆపిల్ పండుని సగానికి కోసినట్టు, మొండి శరీరం సగం ముక్కగా ఉండి పోయింది. ముష్కరులు అయిన ఈ దుష్టమానవ మూక ఇలా వచ్చి మా వంశం అంతా నాశనం చేసింది.. ఉన్నవాళ్ళలో అర్ధశరీరంతో ఉన్న నేనే పెద్ద దిక్కుని. నా వంశం అంతా కూలిన బురుజులా ఉన్నాయి. వాళ్ళను చితకపొడిచి క్రేన్లతో బుట్టలతో ఎత్తి పడేసి, బర్రున శబ్దం చేస్తూ ట్రక్కులు తీసుకుపోతుంటే నేను వల.. వల.. ఏడ్చాను. ఎంత గొప్ప కుటుంబం నాది! వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురం చేస్తున్నాం.. ఈ ముష్కరులైన మానవులు మా మీద పడి మా వునికినే నాశనం చేస్తున్నారు.. మా జాతిని కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నారు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ఇంత చరిత్ర చూసిన పెద్ద మనిషిని కదా! సగర్వంగా చెప్పుకొని చూపించుకునేది పోయి, నన్ను సర్వనాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. నేను కాలానికే గుర్తుని. ఇలా అయితే హైదరాబాదు బాల్డ్ హెడ్ అవుతుంది.. ముష్కరమానవులకి దేని మీదా ప్రేమ లేదు! ప్రాచీనమైన వాళ్ళ భాషనే నాశనం చేసుకుంటున్నారు.. సాంస్కృతిక వారసత్వం అయిన అన్ని కట్టడాలనీ మింగేస్తున్నారు.. ఆధునికత అనే భ్రమశాలి గుండులో పడ్డ ఈగలా మతిపోయినట్టు ఉన్నారు. ఇలా అయితే ఏముంటుంది చరిత్ర? ఏడుపొస్తోంది నాకు. నా శరీరం చూడండి. బలశాలిలా, సూర్యకాంతిలో, చంద్రకాంతిలో నిగనిగ లాడుతూ ప్రేమికులు, మేకలు, కుక్కలు, పిల్లనగ్రోవి వాయించేవాడు నీడ కోసం నా దగ్గరికి రావటం నాకు ఎంత సంతోషమో.. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోతుంటే రెట్టింపు బాధ వేస్తోంది. ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రారు. నేనెప్పుడు ఎవరి మీద పడిపోతానో అని వారికి భయం! ఈ బాధ నేను వెళ్ళబోసుకుంటే నా మిత్రురాలు దుర్గం చెరువు నన్ను చూసి ముసిముసి నవ్వు నవ్వింది.. నా బాధ ఇంకా రెట్టింపు అయింది.. ఓ ముష్కరమానవుడా! మేము ప్రకృతి ప్రసాదించిన జీవితంతో ప్రశాంతంగా.. అమాయకంగా.. మా బతుకులు మేము బతుకుతున్నాం.. మమ్మల్ని మీరు ఇలా మూకుమ్మడిగా మా కుటుంబాలని నామరూపం లేకుండా ఎందుకు నాశనం చేస్తున్నారు? ‘‘అడుగో! అడుగో! వస్తున్నాడు! వచ్చేస్తున్నాడు డైనమైట్ల రాక్షసుడు! వాడి చేతిలో బ్యాగ్ చూసాను.. నా గుండె ఝల్లు మంది. నాకు తెలుసు! నాకు ఆఖరి క్షణాలు దగ్గర పడ్డాయి. నేను ఏడుస్తున్నాను..! బిగ్గరగా ఏడుస్తున్నాను..! దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నాను.. నా ఏడుపు మీ చెవులకి వినిపిస్తోందా? వినిపిస్తోందా? వినిపిస్తోందా? మా ఊరి గురించి కొన్ని వాక్యాలు... అందరూ మా ఊరి గురించి అడుగుతున్నారు.. మా ఊరు అప్పట్లా లేదు. చాలా మారిపోయింది. మట్టి రోడ్లు పోయి. కంకర రోడ్లు వచ్చాయి. కాలవలో పడవలు పోయి. రోడ్ల మీదికి బస్సులు వచ్చాయి.. ఇంటింటికి కారు.. ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్. నా చిన్నప్పుడు సాయంత్రం అవగానే.. పంచాయితీ నౌకరు ఒచ్చి. ప్రతి వీథిలో ఉన్న దీపస్తంభాలని నిచ్చెనతో ఎక్కి, అందులో దీపం వెలిగించేవాడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉండేది నాకు. ఇప్పుడు ఊరంతా. ఇళ్ళంతా కరెంటు లైట్లు. ఏసీలూ, షవర్లూ వచ్చాయి. గుడి పడగొట్టేసి చాలా అందమైన పెద్ద గుడి కట్టారు. లైబ్రరీ పడగొట్టేస్తున్నారు. పొద్దున లేవగానే సన్నటి శబ్దాలు చేసే పిచుకలు ఎప్పుడో అంతరించిపోయాయి. కాకుల గోల తగ్గింది. ఒకటో అరో రామచిలుకలు ఎగురుతున్నాయి. గడ్డి. మట్టి. వాసన పోయింది. చెరువు మెట్లు పాడుబడ్డాయి. చెరువు కళ లేకుండా పోయింది. ఊరిని నూతనతరానికి యౌవనవంతం చేయాలని ప్రజలు చాలా కృషి చేస్తున్నారు. మరికొన్ని మ్యూజింగ్స్ రేపటి సంచికలో... -
ప్రియనేస్తమా!
జీవితంలో అన్నీ అనుభవించాను, మనసు సకల సౌఖ్యాలూ అనుభవించి, పరిపూర్ణమైన విందు భోజనం తిని సంతృప్తిగా, వెనక్కు వాలి, కూర్చున్నట్టుగా ఉంది. ఈ రకమైన జీవితం ఇక చాలు అనుకున్నాను, అన్నీ వదిలి, అందరికీ సెలవు చెప్పి నాకిష్టమైన వానప్రస్థాశ్రమానికి వచ్చేసాను. అక్కడ నా అందమైన కథల పూలతోట నా కోసం ఎదురు చూస్తోంది. ఒక్క క్షణం కళ్ళు తడితో బరువెక్కినాయి. ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కని పించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను. ఇంతలో, ఎవరో నా బుజాలు పట్టి, నేను పడకుండా ఆపి, నన్ను జాగ్రత్తగా రాయి మీద కూర్చోబెట్టారు. నా చేతిని పట్టుకున్న అతని చేతిని చూసాను. ‘‘వృద్ధాప్యానికి యౌవనం ఆసరా ఇచ్చినట్టుగా ఉంది.’’ ‘‘తల్లిదండ్రులు – పిల్లలు’’ఇదేగా అనుబంధం..! తలెత్తి చూసాను, నా ఎదురుగా, దార్ఢ్యవంతుడు, స్ఫురద్రూపి, అయిన ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ‘‘అతని కళ్ళలో అపారమైన అనుభవం కనిపిస్తోంది.’’ అతను నిత్యయౌవనుడిలా ఉన్నాడు. ‘‘ఎవరు నువ్వు?’’ – అడిగాను. ‘‘మీ ప్రియమిత్రుడిని!’’– అన్నాడు. ‘‘నేను నిన్ను ఎప్పుడూ చూడలేదే?’’– అన్నాను. ‘‘మీరు నాకు బాగా తెలుసు’’ – అన్నాడు. నేను అతన్ని పరీక్షగా చూస్తూ, ‘‘నేను అన్నీ అనుభవించి, అన్నీ వదులుకుని వానప్రస్థాశ్రమానికి వచ్చాను. ఇక్కడ, నీకేం పని?’’ అని సూటిగా అడిగాను. అతను పక్కనున్న రంగురంగుల పువ్వులబుట్ట తీసుకుని, నా ముందు పట్టుకున్నాడు. పువ్వులు కళకళలాడిపోతున్నాయి, నా కోసమే ఎదురు చూస్తున్నట్టుగా, చిరునవ్వుతో, నన్ను పలకరిస్తున్నట్టుగా ఉన్నాయి. అతను నాతో అన్నాడు, ‘‘మీరు ఇక్కడికి వచ్చేసారు! కథల పూలదండలు గుచ్చి ఆ దేవుడికి అర్పించటమే మీ వృత్తి. వయోభారంతో, మీరు సూదిలో దారం సరిగ్గా ఎక్కించలేరు కదా! సహాయం చేయడానికి భగవంతుడు నన్ను పంపించాడు.’’ నేను అతన్నే చూస్తున్నాను! నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లినాయి. అతన్ని అడిగాను, ‘‘నీకు ఇల్లు–వాకిలి, పిల్ల–పాప, ఉద్యోగం–సద్యోగం ఏమీ లేవా?’’ అతను దారం ఎక్కించిన సూది నా చేతికి ఇచ్చాడు. నేనది అందుకోబోయి చేయి తడబడి సూది చురుక్కున వేలికి గుచ్చుకుని, రక్తం వచ్చింది. అతను ప్రేమతో ఆ రక్తాన్ని తుడుస్తూ సూది అందిస్తూ, చిరునవ్వుతో ‘‘అన్నీ ఉన్నాయి, పెద్ద కుటుంబం నాది’’ అన్నాడు.. ‘‘అలాగా బాబూ! చాలా సంతోషం. ఈ రోజుల్లో పెద్ద కుటుంబం బాధ్యతని తీసుకునే యువకులే తక్కువ! నువ్వు వెయ్యేళ్ళు చల్లగా ఉండాలి.’’ అన్నాను.. ‘‘మీ ఆశీస్సులు నాకు ఆనందం’’అని బుట్టలో ఉన్న రెండు రంగురంగుల కథల పూలు అందించాడు. నేను తలవంచి గుచ్చుతూ, ‘‘నీ పేరేమిటి నాయనా?’’ అని అడిగాను.. ‘‘కాలం’’ అని జవాబు వచ్చింది. నేను ఆశ్చర్యంగా తలెత్తి చూసాను! అతను అక్కడ లేడు. ఒక్క క్షణం ఆలోచించాను, చిన్నగా తలపంకించాను, అవును! అతనికి ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో బాధ్యతలు! ఎంతమందినో చూడాలి! పెద్ద కర్తవ్యమే! నాకు చాలా ఆనందంగా ఉంది, నేను ఒంటరిని కాను, అతను తప్పక నా దగ్గరికి మళ్ళీ వస్తాడు... ప్రియనేస్తమా!! నీ రాక కోసం వేచి చూస్తూ, ఈ కథల దండలు గుచ్చుతూ, నా శేష జీవితం గడుపుతాను, నేను ఇప్పుడు ఒంటరిదాన్ని కాదు! నాకు నువ్వు ఉన్నావని తెలిసిన తర్వాత, నేను చాలా.. చాలా.. చాలా ఆనందంగా ఉన్నాను! నిశ్చింతగా ఉన్నాను.. నాకు ఆఖరిక్షణం వచ్చి కళ్ళు మూతలు పడుతున్నప్పుడు.. నువ్వు వచ్చి చేతులు చాచి నన్ను అక్కున చేర్చుకుని, సుఖమరణానికి నన్ను జాగ్రత్తగా అప్పగిస్తావు! నీ మీద నాకు నమ్మకముంది.. గులాబి – జీవితం సూర్యోదయంలా ఒక మొగ్గ పువ్వుగా వికసించింది, దాని రెక్కలు సుతి మెత్తగా ఉన్నాయి. దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది. ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలిగింతలు పెట్టి నవ్వించింది. తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది. సాయంత్రం అయింది. గులాబి పూర్తిగా వడిలి పోయింది. అస్తమిస్తున్న సూర్యుడికి చేతులెత్తి మొక్కి ప్రార్థన చేసింది. ‘‘దేవుడా! రేపటికి నువ్వు వచ్చే సమయానికి నేను మళ్ళీ కళకళలాడుతూ ఉండేట్టు చేయి.’’ మర్నాడు మళ్ళీ సూర్యుడు ఉదయించాడు. గులాబి వడిలి పోయింది. రెక్కలు నేలరాలి పోయాయి. తోటమాలి వచ్చి వాటిని ఊడ్చి తీసుకెళ్ళి చెత్తలో పడేసాడు. జీవితంలో ఎంతో కావాలని ఉంటుంది, అంతా మనకు దొరకదు. ఈ గులాబి కథ సమాప్తి అయింది. కథలో నీతి : ఇందులో గులాబి మనిషి! తేనెటీగ మృత్యువు! కాలం తోటమాలి! ఇన్నాళ్ళూ నాకు తోడుగా ఉన్న నా ప్రియమైన కథల ప్రపంచం నా కంటే ముందు అక్కడికి వచ్చినట్టుంది. వయోభారంతో తడబడుతున్న అడుగులతో ఆ తోటలోకి వచ్చాను. ఎన్నెన్నో రకరకాల, రంగురంగుల కథల పువ్వులు నా కళ్ళకి కనిపించాయి. వాటిని చూడగానే చెప్పలేని ఆనందం! నా మనసుకి పారవశ్యం! ఘుమ ఘుమ సువాసనలు వెదజల్లుతున్న పున్నాగపూల చెట్టు క్రింద ఉన్న ఒక రాయి మీద కూర్చోబోయి, తూలిపడిపోబోయాను. దాని వర్ణం గులాబి రంగు. తనకి తానే గులాబి అని పేరు పెట్టుకుంది. చుట్టూవున్న ఈ ప్రపంచాన్ని చూసి అబ్బురపడిపోయింది. ఇదంతా తన ఆనందం కోసమే దేవుడు సృష్టించి ఇచ్చాడని సంబరపడింది. చిరుగాలికి ఊగుతూ ఆత్మానందంతో నాట్యం చేస్తోంది. ఇంతలో ఒక తుమ్మెద వచ్చి దాని మీద వాలింది. పువ్వుని కదలనీయకుండా గుచ్చి పట్టుకుంది. చక్కలి గింతలు పెట్టి నవ్వించింది. తుమ్మెద ఎగిరిపోయింది, పువ్వు నీరసించింది, అయినా ఆ తేనెటీగ తనకి కావాలని ఆశించింది. చుట్టూ వెతికింది. తేనెటీగ ఇంకో పువ్వు మీద వాలి ఆ పువ్వుని నవ్విస్తోంది. గులాబి డీలా పడింది. రేపటి సంచికలో... ప్రేమ... మా ఊరి గురించి కొన్ని వాక్యాలు -
విలియం ఫాక్నర్
గ్రేట్ రైటర్ పిల్లాడిగా కథలు వింటూ పెరిగాడు విలియం ఫాక్నర్ (1897–1962). అమెరికా పౌరుడిగా, అందునా దక్షిణాది రాష్ట్రమైన మిసిసిపి వాడిగా అక్కడి ఉత్తరాది రాష్ట్రాలకూ దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య జరిగిన సివిల్ వార్ గాథలూ, నల్లవాళ్లు–తెల్లవాళ్ల బానిసత్వపు కథలూ, శ్వేతాధిపత్యాన్ని ప్రవచించిన ‘కు క్లక్స్ క్లాన్’ కథలూ, ఫాక్నర్ వంశీయుల కథలూ... వాటన్నింటి ప్రభావం వల్ల పదిహేడేళ్ల నాటికే రాయడం ప్రారంభించాడు. కథలు, నవలలు, కవిత్వం, వ్యాసాలు, సినిమాలకు స్క్రీన్‌ప్లేలు రాశాడు. ‘ఎ రోజ్ ఫర్ ఎమిలీ’ ఒక అమెరికన్ రాసిన అత్యంత ప్రసిద్ధ కథగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘ద సౌండ్ అండ్ ద ఫ్యూరీ’ ఇంగ్లిష్‌లో వెలువడిన వంద గొప్ప నవలల్లో ఒకటిగా నిలిచింది. ‘యాజ్ ఐ లే డైయింగ్’, ‘లైట్ ఇన్ ఆగస్ట్’, ‘ద రీయవర్స్’, ‘ద ఫేబుల్’, ‘అబ్సలోమ్, అబ్సలోమ్!’ ఆయన ఇతర రచనలు. 1949లో ఫాక్నర్ను నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. ఒక మంచి కళాకారుడు తనకు సలహా ఇవ్వగలిగే స్థాయిలో ఎవరూ ఉండరని నమ్ముతాడు, అన్నారు ఫాక్నర్. తప్పులు చేస్తూనే నేర్చుకోవాలనీ, రచన అనేది యాంత్రికంగా ఏదో టెక్నిక్‌ను పాటించడం కాదనీ అనేవారు. -
ఆసియాన్ సదస్సులో రామాయణ కథలు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మహాకావ్యం రామాయణానికి ఒక్క భారత్‌తోనే కాదు ఆసియాన్ దేశాలతోనూ విడదీయరాని బంధముంది. చరిత్ర, నాగరికతల పరంగా భారత్‌ను ఆసియాన్ దేశాలతో మమేకం చేసింది ఈ ఇతిహాసమే. ఈ విశేషాలు ప్రస్ఫుటించేలా 25–26న ఢిల్లీలో జరిగే భారత్–ఆసియాన్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన కళాకారులు రామాయణంలోని కొన్ని ఘట్టాలను ప్రదర్శించనున్నారు. ఆసియాన్ దేశాల(ఇండోనేసియా, సింగపూర్, ఫిలిప్పైన్స్, మలేసియా, థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, బ్రూనై, మయన్మార్, లావోస్) అధినేతలు ఈ కార్యక్రమాల్ని తిలకించనున్నారు. భారత్–ఆసియాన్ సంబంధాలకు పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి జరిగే గణతంత్ర వేడుకలకు ఆ దేశాల అధినేతలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. ఆసియాన్ దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలోనూ రామాయణం దోహదపడింది. -
స్నాప్‌చాట్‌లో సరికొత్త ఫీచర్!
శాన్ఫ్రాన్సిస్కో: ఫొటోషేరింగ్ యాప్ స్నాప్‌చాట్ వెబ్సైట్లలో ఇక నుంచి ‘స్టోరీస్’ సదుపాయం నెటిజన్లకు అందుబాటులోకి రానుంది. దీనిని స్టోరీస్ ఎవ్రీవేర్గా పిలుస్తున్నారు. ఫేస్బుక్ టైమ్‌లైన్ మాదిరిగానే స్నాప్‌చాట్ యూజర్ రోజంతా తీసిన వీడియోలు, ఫొటోలను కలిపి అందంగా ప్రదర్శించడాన్నే స్టోరీస్‌గా పిలుస్తారు. స్నాప్‌చాట్ యాప్‌లోనూ స్టోరీస్‌ను సృష్టించుకునేందుకు కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 'స్టోరీస్' సదుపాయం వల్ల స్నాప్‌చాట్ అప్లికేషన్ వాడని వాళ్లను కూడా వెబ్ ద్వారా ఆకర్షించవచ్చని స్నాప్‌చాట్ యాజమాన్యం భావిస్తోంది. అంతేగాక వెబ్ప్లేయర్ ద్వారా ఇతర పరికరాలకు సులువుగా వీడియోలను పంపుకునే సదుపాయాన్ని కూడా ప్రవేశపెడుతోంది. -
పత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించండి
- సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయండి - బాధితులకు భరోసా కల్పించాలి - అధికారులతో కలెక్టర్ సత్యనారాయణ - మీ కోసంలో వినతుల స్వీకరణ కల్లూరు (రూరల్): జిల్లాలోని సమస్యలపై పత్రికల్లో వచ్చే కథనాలకు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అందుకు ఏవైనా అవాంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులు అందించే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ 2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఇన్చార్జ్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. పిచ్చి వేషాలేస్తున్నావా.. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతు దొండపాటి పుల్లయ్య భూ సమస్యపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంటనే మహానంది తహసీల్దార్ రామకృష్ణ, వీఆర్వోను సత్యనారాయణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఏమయ్యా బాబు... మహానంది తహసీల్దార్ రామకృష్ణ.. మీ మండలానికి సంబంధించిన గోపవరం రైతు దొండపాటి పుల్లయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 558, 561, 570లోని 3 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. అందులో 24 సెంట్ల భూమిని ఆన్లైన్ అడంగల్ నుంచి ఎందుకు తొలగించావో సమాధానం చెప్పు. భూమికి సంబంధించి వీఆర్ఓ ఎందుకు పేచీ పెడుతున్నాడు. ఆన్లైన్లో ఉన్న భూమిని మీరెందుకు కరెక్షన్ చేస్తారు. మెకానికల్‌గా తహసీల్దార్, వీఆర్ఓ మాట్లాడకూడదు. అన్నదమ్ముల మధ్య పేచీ ఉంటే కోర్టుకెళ్లమని సూచించండి. ఆన్లైన్లో భూ విస్తీర్ణం మార్చడానికి నీవెవరు (వీఆర్ఓ సత్యనారాయణను)? ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఇష్యూ పిచ్చివేషాలేస్తున్నావా.. సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు. ‘మీ కోసం’లో వచ్చిన సమస్యల్లో కొన్ని.. కోడుమూరు ప్రజల దాహర్తి తీర్చండి: కోడుమూరు పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని సర్పంచ్ సీబీ లత కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. హంద్రీనది అడుగంటడం, గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని కర్నూలుకు తరలించడంతో పట్టణంలో నీటి సమస్య అధికమైందన్నారు. ఇప్పటికే గ్రామంలోని పలు వార్డుల్లో వారానికోసారి, మరికొన్ని వార్డుల్లో వారానికి రెండుసార్లు మాత్రమే నీటిని విడుదల చేయాల్సి వస్తుందన్నారు. 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసి ప్రజల దాహం తీర్చాలని నోడల్ ఆఫీసర్ విజయభాస్కర్‌ను ఆదేశించారు. 1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్సార్బీసీ మైనర్, సబ్ మైనర్ కాల్వలను అభివృద్ధి చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అన్ని జిల్లాల్లో మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతలు కల్పిస్తున్నారని, కర్నూలు జిల్లాలో రోస్టర్ ప్రకారం ఇస్తామంటున్నారని పీఈటీల అసోసియేషన్ నాయకులు కృష్ణ, పరమేష్, శేఖర్, లక్ష్మణ్, లక్ష్మయ్య, వెంకటేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డీఈఓ తాహేరా సుల్తానాను ఆదేశించారు. సుంకేసుల రోడ్డులోని కొత్త క్రిష్టియన్ బరియల్ గ్రౌండులో సమాధులు కట్టేందుకు వెళితే కొందరు అడ్డుకుంటున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కారల్ మార్క్స్‌నగర్‌కు చెందిన సాల్మోన్, ఎస్.రాజు, నాగరాజు, ఏసు, వందనమయ్య జాయింట్ కలెక్టర్ 2 రామస్వామికి ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు పరిధిలోని సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త కలెక్టర్‌ను కోరారు. అనంతపురం– అమరావతి హైవే ఎక్స్‌ప్రెస్ రహదారిని కొలిమిగుండ్ల నుంచి రుద్రవరం మండలాల మీదుగా నిర్మిస్తే యథేచ్చగా ఎర్రచందనం, గంధపు చెక్కలు, టేకు అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉందని, రహదారి నిర్మాణంపై పునారాలోచించాలని సీనియర్ దళిత నాయకుడు టీ.పీ.శీలన్న కలెక్టర్‌కు విన్నవించారు. -
మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే..
ఛత్రపతి శివాజి తల్లి బాల శివాజికి చిన్ననాటి నుంచే రామాయణ మహాభారత కథలు, భారతీయ వీరాధివీరుల కథల్ని వినిపించేది. తల్లి ఒడిలో కూర్చున ఆసక్తిగా వినే శివాజి పెద్దయ్యాక తానూ వీరాధివీరుణ్ని కావాలని కలలు కనేవాడు. యావత్ భారతాన్ని ఆధ్యాత్మికంగా తట్టిలేపిన వివేకానందుడు కూడా బాల్యంలో తల్లి చెప్పే పురాణ ఇతిహాసాలు, వాటిలోని గొప్ప వ్యక్తుల కథలను నరేంద్రునికి చెబుతుంటే ఆ బాలుడు ఉత్తేజానికి గురయ్యేవాడు. ఇలా అనాదికాలం నుంచి ‘స్టోరి టెల్లింగ్’ బాలల మానసిక వికాసంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అది మళ్లీ ఇప్పుడిప్పుడే ఆదరణ అందుకుంటోంది. బెంగళూరు: ‘అనగనగా ఓ రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడుకులు, ఆ ఏడుగురు వేటకెళ్లారు’ గుర్తుందా ఈ కథ, ప్రతి చిన్నారికి తన నాన్నమ్మ, తాతయ్యలు కచ్చితంగా ఇలాంటి కధలు చెప్పేవాళ్లు. కానీ ఉరుకుల పరుగుల నేటి కాలంలో ఇలాంటి కథలు, కథలు చెప్పే వాళ్లు కనిపించడం లేదు. ఇందుకు కారణం ఒక్కటే నగర జీవితంలో కుటుంబాలు చిన్నవైపోతున్నాయి, దీంతో నాన్నమ్మ, తాతయ్యలు పిల్లల దగ్గర ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ఇక కెరీర్ పరుగులో పడిపోయిన తల్లిదండ్రులకు తమ పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లల్లో చాలా మందికి వీడియోగేమ్స్, ఇంటర్నెట్లలో మునిగిపోతున్నారు తప్ప కథలంటే ఏమిటో తెలియడం లేదు. వీటి కారణంగానే చాలా మంది పిల్లలు పుస్తకాలకు పరిమితమైపోతున్నారు తప్ప వారిలో ఏమాత్రం సృజనాత్మక పెరగడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితిలో కాస్తంత మార్పు వస్తోంది. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో స్టోరీ టెల్లింగ్ విభాగంలో నిపుణులు తయారవుతున్నారు. స్టోరీ టెల్లింగ్ క్లాసులకు కూడా ఉద్యాననగరిలో ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ఈ స్టోరీ టెల్లింగ్ క్లాసులకు తమ పిల్లలను పంపించడానికి మెట్రో ఎగువ మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ‘స్టోరీ టెల్లింగ్’కి పెరుగుతున్న క్రేజ్.... ఎప్పుడూ వీడియోగేమ్‌లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇప్పటికే అనేక సర్వేలు వెళ్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’ అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే, చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్ధం అవుతుంది. అందుకే ప్రస్తుతం బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని తల్లిదండ్రుల్లో ఇప్పుడిప్పుడే కాస్తంత మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళుతున్నారు. అంతేకాదు పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా చూడాలని పాఠశాల యాజమాన్యాలకు తల్లిదండ్రుల వద్ద నుండి అభ్యర్థనలు కూడా వస్తున్నాయి. దీంతో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులకు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. నగరంలోని రంగోలి మెట్రో ఆర్ట్ సెంటర్లో ప్రతి వారాంతంలో స్టోరీ టెల్లింగ్ కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయంటే ఈ తరహా కార్యక్రమాలు ఏ విధంగా క్రేజ్ పెరుగుతోందో మనం అర్ధం చేసుకోవచ్చు. ప్రయోజనాలెన్నెన్నో.. కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పె పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఒక కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. ఇక ప్రతి రోజూ చిన్నారులకు కథలు చెప్పడం వల్ల చిన్నారుల్లో ఊహాశక్తి పెరుగుతుందని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు కూడా ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. పంచతంత్ర కథల ద్వారా బుద్ధికుశలత వల్ల ఎలాంటి అపాయం నుండైనా తప్పించుకోవచ్చని పిల్లలు తెలుసుకుంటారు. ఇక మాతృభాషతో పాటు ఇంగ్లీష్, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా... శ్రోతలను ఆకట్టుకునేలా కధలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ అంటారు నగరానికి చెందిన ప్రముఖ స్టోరీ టెల్లర్ ‘దీప్త’. కధల్లోని అంశాలకు తగ్గట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కధలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కధలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటి స్టోరీ టెల్లర్స్ చాలా మంది వారి హావభావాలను కధలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారని దీప్త చెబుతున్నారు. ‘ఎంచుకున్న కధతో పాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఒక స్టోరీ టెల్లర్ నైపుణ్యం తెలుస్తుంది. ఇక కధలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కధాకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. అమెరికా, సింగపూర్, దుబాయ్ వంటి దేశాల్లో ఇప్పటికే స్టోరీ టెల్లింగ్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక మన దేశంలోని మెట్రో నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ స్టోరీ టెల్లింగ్‌కి ఆదరణ పెరుగుతోంది. స్టోరీ టెల్లింగ్‌లో నైపుణ్యాన్ని సాధించగలిగితే మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు దీప్త. -
బుద్ధుని జాతక కథల చిత్ర ప్రదర్శన
విజయపురి సౌత్: స్థానిక లాంచీస్టేషన్లో శుక్రవారం జిల్లా సోషల్ వెల్ఫేర్ జాయింట్ కలెక్టర్, టూరిజం ఇన్చార్జి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అమరావతి బుద్ధ విగ్రహం రూపకర్త రేగుళ్ల మల్లికార్జునరావు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించి ఆయన గీసిన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాల కిందట ఏ ఆంధ్రప్రదేశలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. అప్పట్లోనే అమరావతిలోని బౌద్ధ స్థూపంపై ఆంధ్రులు బుద్దుని జీవిత కథలు, జాతక కథలు, ఆనాటి మానవ జీవనానికి సంబంధించిన శిల్పాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆంధ్రా శిల్పుల గొప్పతనం గురించి వారు చెక్కిన శిల్పాలను చిత్రాలుగా గీసి ఇప్పటికే సింగపూర్, చైనా, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో 75 ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలిపారు. లాంచీస్టేషన్లో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను పలువురు పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో లాంచీ యూనిట్ మేనేజర్ వి.సూర్యచందర్‌రావు, సిబ్బంది ఉన్నారు. -
దళితులే రాసిన దళిత కథలివి!
కథకుడూ, అనువాదకుడూ అయిన రంగనాథ రామచంద్రరావు తాజాగా ‘సమకాలీన కన్నడ దళిత కథలు’ తెలుగులోకి అనువదించారు. ఆ సందర్భంగా ఈ ఐదు ప్రశ్నలు. 1. కన్నడ భాషతో మీకు ఎలా పరిచయం? మా పూర్వులు మైసూరు సమీపంలోని చామరాజనగర్‌కు చెందినవారు. 80 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లాలోని ఆదోనికి వలస వచ్చారు. తల్లిదండ్రుల నుంచి కన్నడ, ఆదోనిలో పుట్టి పెరగటం వల్లా, తెలుగులోనే విద్యాభ్యాసం చేయటం వల్లా ఇరుభాషలతో సంబంధాలు ఏర్పడ్డాయి. 2. అనువాదాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం? మనదేశం వివిధ భాషలకూ, సంస్కృతులకూ నిలయం. అనువాదం వివిధ భాషల మధ్య సేతువుగా నిలుస్తుందని అందరికీ తెలుసు. కన్నడ నుంచి అత్యుత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందజేయాలన్న అభిలాషే నన్ను అనువాద రచనను గంభీరంగా తీసుకునేలా చేసింది. 3. ఇప్పటివరకూ చేసిన అనువాదాలు? కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం కన్నడ నుంచి ‘రాళ్లు కరిగే వేళ’, ‘తిరుగుబాటు’, ‘ఓం నమో’, ‘పూర్ణచంద్ర తేజస్వి జీవితమూ సాహిత్యమూ’, ‘అంతఃపురం’, ‘అవధేశ్వరి’ అనువదించాను. సొంతంగా ‘ప్రసిద్ధ సమకాలీన కన్నడ కథలు’, ‘నలుపు, తెలుపు కొన్ని రంగులు’ తెచ్చాను. ఇంకా, నేను అనువదించిన 350 కథల్లో 200కు పైగా కన్నడ కథలున్నాయి. మిగిలినవి హిందీ, ఇంగ్లీషు. 4. ఈ ‘సమకాలీన కన్నడ దళిత కథ’ల ప్రత్యేకత ఏమిటి? దళితేతరులు ఎంత చక్కగా రాసినా, అవి సానుభూతితో కూడుకుని ఉంటాయి. కానీ, దళితులే రాసినప్పుడు వారి బాధలు, వ్యథలు, కోపాలు, నిస్సహాయత అన్నీ మరింత ప్రామాణికంగా బయటికి వస్తాయి. అందుకే ఈ సంకలనం కోసం దళితులే రాసిన దళిత కథలను ఎన్నుకోవటం జరిగింది. 1968లో దేవనూరు మహాదేవ రాసిన ‘అమ్ముడు పోయినవాళ్లు’ నుంచి 2015లో సంతోష గుడ్డియంగడి రాసిన ‘గొడ్డు కాఫీ’ వరకు మొత్తం 15 కథలున్నాయిందులో. 5. తర్వాతి సంకలనం? ప్రస్తుతం కన్నడ నుంచి ‘బండాయ’ (తిరుగుబాటు) కథలు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. రంగనాథ రామచంద్రరావు పుస్తక ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్. అనువాదకుడి ఫోన్: 9290050229 -
ఆంగ్ల త్రైమాసిక పత్రికకు రచనలు ఆహ్వానం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆంగ్ల భాషోపాధ్యాయ సంస్థ(ఎల్టా) ఆధ్వర్యంలో అక్టోబర్‌లో ఆంగ్లభాషా త్రైమాసిక పత్రికను విడుదల చేయనున్నట్లు ఎల్టా జిల్లా అధ్యక్షుడు నాగం రఘురాంరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, కెజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులు, విద్యార్థుల నుంచి వ్యాసాలు, కథలు, కవితలు, హాస్యం, బాల సాహిత్యం, కార్టూన్లతోపాటు తమకు నచ్చిన అంశాలపై ఆంగ్లలో రచనలను ఆహ్వానిస్తున్నట్లు పే ర్కొన్నారు. రచనలను eltambnr@gmail.com మెయిల్‌కు పంపించాలని, వివరాలకు సెల్ నెం : 9885031043ను సంప్రదించాలని కోరారు. -
‘కథల బతుకమ్మ’ పుస్తకావిష్కరణ
హన్మకొండ కల్చరల్ : కథల బతుకమ్మ పుస్తకాన్ని హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో ప్రతాపరుద్ర హాల్లో ఆకాశవాణి వరంగల్ కేంద్రం సహాయ సంచాలకుడు సి.జయపాల్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని డా. కె.పద్మలత రచించిన తీరు చక్కగా ఉందన్నారు. అనంతరం కార్యక్రమ ముఖ్య అతిథి డా.పర్చా అంజనీదేవి, విశిష్ట అతిథి, రచయిత రామాచంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని పెంపొందించే రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డా. అంపశయ్య నవీన్, ప్రముఖ కవులు వి.ఆర్.విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, ఏబీకే ప్రసాద్, కర్ర ఎల్లారెడ్డి , లకీ‡్ష్మనర్సింహారావు, డా.ప్రకాశ్చందర్, డా.సాయిదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
కథలు కళ్లకు కట్టినట్లు
చిన్నప్పుడు అమ్మానాన్నలు కథలు చెబుతుంటే కథలోని పాత్రలను, వాటి చర్యలను మనమే ఊహించుకునే వాళ్లం. అలా చిన్న వయసులోనే సృజనాత్మకత, ఆలోచనా శక్తి పెంపొందేవి. నేడు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల దృష్ట్యా నూతన బోధనా పద్ధతులు వస్తున్నాయి. విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఫొటోలను, మ్యాప్‌లను, ఊహా చిత్రాలను పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం పాఠ్య పుస్తకాల్లో రంగు రంగుల బొమ్మలను ఉపయోగిస్తూ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చూస్తున్నారు. ఆంగ్ల మాధ్యమ పుస్తకాల్లో కథలకు సంబంధించినవే పై ఫొటోలు. కథను కళ్లకు కట్టించినట్లుగా ఉన్నాయి కదా పై చిత్రాలు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న వివిధ పాఠ్యపుస్తకాల్లో బోధన అంతా ఇదే శైలిలో సాగుతోంది. – ఆదిలాబాద్ టౌన్ -
ఆ ఆదర్శ దంపతుల అద్భుత గాథ మరోసారి
సత్గ్రంథం లోకపూజ్యమూ, రసరమ్యమూ అయిన రామాయణాన్ని మనకు తొలుత అందించింది వాల్మీకే అయినా, ఈ రమణీయ గాథను వందలాదిమంది కథలుగా, కావ్యాలుగా, పద్యాలుగా, శ్లోకాలుగా, చలనచిత్రాలుగా, కల్పవృక్షాలుగా, ఆఖరికి విషవృక్షాలుగా కూడా రకరకాల నామరూపాలతో అందించారు. అయినప్పటికీ రామకథను ఆస్వాదించేవారికి ఎప్పటికీ కొదవలేదనే చెప్పాలి. రాజమండ్రి వాస్తవ్యులు, ‘సాక్షి’లో ఉపసంపాదకులుగా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక వ్యాసాలను రచించిన దీక్షితుల సుబ్రహ్మణ్యం ప్రక్షిప్తాల జోలికి పోకుండా, వాల్మీకి రామాయణాన్ని తనదైన శైలిలో, మాటలలో తొలుత ‘సంహిత’ అనే వెబ్ పత్రికలోనూ, తర్వాత ఫేస్‌బుక్‌లోనూ ధారావాహికగా అందించారు. ఆ వ్యాసాలకు లభించిన ఆదరణ, ప్రోత్సాహ ఉత్సాహాలతో, పెద్దలు, పీఠాధిపతుల ఆశీస్సులు, అండదండలతో ‘సీతారామ కథాసుధ’గా పుస్తక రూపమిచ్చారు. వాటిలో ప్రస్తుతానికి బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండలు విడుదలయ్యాయి. సామాన్యులకు కొరుకుడు పడని పదాలు, పెద్ద పెద్ద విశ్లేషణలు, సంస్కృత శ్లోకాలతో నింపకుండా, ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే శ్లోకాలను పొందుపరచడం రచయిత పాత్రికేయ పరిణతికి నిదర్శనం. పత్రికలలో ప్రత్యేక కథనాలు రాసినట్లుగా, చక్కటి శైలిలో అంతంత మాత్రం చదువుకున్న వారికి కూడా అర్థం అయేలా ఉండటం ఈ రచనలోని ప్రధాన బలం. ‘లాభాల మాట రాముడెరుగు, ముందు అందరికీ ఈ అమృతాన్ని తలాకాస్త అందిద్దాం’ అనుకున్నట్లు రచయిత, ప్రచురణకర్తలు ధరను అందుబాటులో ఉంచారు. ఈ సంపుటిలోని ‘అరణ్యకాండ’ ఐదుదేశాలలో ఆవిష్కృతం కావడం ఆనందదాయకం. శ్రీమద్రామాయణం బాలకాండము పుటలు: 270; వెల రూ. 150 అయోధ్యాకాండము పుటలు: 300; వెల రూ. 200 అరణ్యకాండ పుటలు: 176; వెల రూ. 100 ప్రతులకు: ఆర్.ఆర్. పబ్లికేషన్స్, షాప్‌నంబర్-2, ప్రెస్‌క్లబ్, గణేశ్ చౌక్, రాజమండ్రి, ఫోన్: 9440451836.ఈ - డి.వి.ఆర్. -
పరివర్తనకు పాటుపడుతున్నమహిళలెవరు?
న్యూఢిల్లీః దేశాభివృద్ధికి తోడ్పడటంలోనూ, మానవీయతను ప్రదర్శించి జనంలో పరివర్తన కలిగించడంలోనూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం 'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వానికి అందిన వెయ్యి ఎంట్రీల్లో 25 మందిని ప్రజలు ప్రత్యక్షంగా ఎంపిక చేసేందుకు వీలుగా ఆన్ లైన్, ఎస్ఎంఎస్ పోల్ నిర్వహిస్తోంది. పదిమంది యాసిడ్ దాడి బాధితులకు ప్రత్యేక స్కాలర్షిప్ అందించడంతోపాటు, సంవత్సరానికి 400 మందికి ఉచితంగా ఐఏఎస్ కోచింగ్ ను చైన్పైలోని ఓ విశ్వవిద్యాలయ డైరెక్టర్ అందిస్తోంది. అలాగే బెంగళూరుకు చెందిన ఓ బీపీఓ సంస్థ యజమాని తన సంస్థలో వికలాంగ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోంది. ఇలా జనంలో పరివర్తనను కలిగించే లక్షణాలు కలిగిన మహిళలను గుర్తించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనను.. మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా' పేరున ప్రారంభించారు. ఆరోజునుంచీ ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యి ఎంట్రీల్లో దేశంలోని 25 మంది మహిళలను ప్రజలు ఎన్నుకునేందుకు వీలుగా ఆన్ లైన్ పోల్, ఎస్ఎంఎస్ పోల్ ను మే 14వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన మొత్తం వెయ్యిమంది ప్రత్యేక మహిళల జాబితాలో ఆన్ లైన్ పోల్ ద్వారా ఎంపికైన జాబితాను చివరి ఫలితాలను ప్రకటించేందుకు నీతి ఆయోగ్ ద్వారా ఏర్పాటైన జ్యూరీ ముందు ఉంచనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ముఖ్యంగా పోల్ లో ఇప్పటివరకూ చెన్నై సత్యభామా యూనివర్శిటీ డైరెక్టర్ డాక్టర్ మారియా జీనా జాన్సన్, వెస్ట్ బెంగాల్ వస్త్ర వ్యాపారవేత్త దిపాలీ ప్రమాణిక్, బెంగళూరు బీపీవో యజమాని పవిత్ర లు అత్యధిక ఓట్లను సాధించినట్లు తెలుస్తోంది. అత్యధిక ఓట్లు సంపాదించిన తదుపరి జాబితాలో మాజీ జర్నలిస్ట్ మంజీత్ కృపాలిని, దౌత్యవేత్త నీలమ్ డియోలు కూడ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పరివర్తనకు పాటుపడటంతోపాటు.. ప్రత్యేకతలు సాధించిన మహిళల జీవిత కథలను ప్రపంచానికి తెలిసేట్లు చేయడంతో... ఇతర మహిళల్లో సాధికారతను పెంచడానికే కాక, సవాళ్ళను అధిగమించేందుకు సహకరిస్తాయన్నదే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. -
ఈవెంట్
తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం ఏర్పాటు ‘ఇంతవరకూ రాసిన చరిత్రలో దొర్లిన తప్పులను సరిదిద్దుతూ, తెలంగాణ కేంద్రంగా కొత్తగా చరిత్రను నిర్మించే’ లక్ష్యంతో అడపా సత్యనారాయణ అధ్యక్షుడిగా, దేమె రాజారెడ్డి గౌరవాధ్యక్షుడిగా ‘తెలంగాణ చరిత్ర పరిశోధక సంఘం’ ఏర్పడింది. స్థానిక, ప్రాంతీయ, ఉపజాతీయ చారిత్రక సంబంధాలపై లోతైన అధ్యయనం చేయడమే గాకుండా, వివిధ జిల్లాల్లో చరిత్ర పరిశోధక కేంద్ర శాఖలను ఏర్పాటుచేసి జిల్లాల వారి చరిత్రను కూడా నిర్మించాలనీ; చారిత్రక, పురావస్తు, నాణేలు, శాసనాలు, రాత ప్రతులు, అపురూప గ్రంథాల సేకరణ, రాష్ట్రస్థాయి ప్రదర్శనశాలను ఏర్పాటుచేయడంతోపాటు, రాష్ట్రేతర ప్రాంతాలకు తరలిన తాళపత్ర గ్రంథాలు, విలువైన కళాఖండాలను తెలంగాణకు తెప్పించాలనీ కూడా సంఘం తీర్మానించింది. కాలక్రమంలో డిజిటల్ లైబ్రరీని ఏర్పాటుచేసుకోవడమే గాకుండా, అర్కయివల్ మెటీరియల్ అంతా ఒక దగ్గరికి చేర్చేందుకు కృషి చేయాలనీ; తెలంగాణ చరిత్ర, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఒత్తిడి తేవాలనీ కూడా సంఘం తన లక్ష్యాలుగా నిర్ణయించుకుంది. ఈ సంఘం తరపున తేనున్న పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకులుగా ఉంటారు. కవిసేన మేనిఫెస్టో- సాహిత్య చర్చ శ్రీత్యాగరాయ గానసభ, భీమన్న సాహిత్య నిధి ఆధ్వర్యంలో- ఏప్రిల్ 21న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో శేషేంద్ర శర్మ ‘కవిసేన మేనిఫెస్టో’ నూతన ముద్రణ ఆవిష్కరణ, చర్చ ఉంటాయి. ననుమాస స్వామి, ముక్తేవి భారతి, కళావేంకట దీక్షితులు, బన్న ఐలయ్య, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, వి.పి.చందన్ రావు పాల్గొంటారు. శివలెంక రాజేశ్వరీదేవి పుస్తకావిష్కరణ నామాడి శ్రీధర్ సంపాదకత్వలో ‘ప్రేమలేఖ’ ప్రచురిస్తున్న శివలెంక రాజేశ్వరీదేవి కవితల, స్మృతుల సంకలనం ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 24న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరగనుంది. రావు బాలసరస్వతీదేవి, వాడ్రేవు వీరలక్ష్మీదేవి, అంబటి సురేంద్రరాజు పాల్గొంటారు. మా కథలు- 2015 2015లో ప్రచురించబడిన కథలతో, ‘తెలుగు కథ రచయితల వేదిక’ ఆధ్వర్యంలో, సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో కథాసంకలనం తేనున్నట్టు కన్వీనర్ సీహెచ్.శివరామప్రసాద్ తెలియజేస్తున్నారు. కథకులు తమ కథలను మే 10లోగా పంపాలి. చిరునామా: కన్వీనర్, తె.క.ర.వే. స్వగృహ అపార్ట్మెంట్, సి బ్లాక్, జి-2, భాగ్యనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్-72. ఫోన్: 9390085292 బలివాడ కథానికల పోటీ బలివాడ కాంతారావు జయంతి(జూలై 3) సందర్భంగా సహృదయ సాహితి-విశాఖపట్నం వారు భారత్ నిధి ఫౌండేషన్‌తో కలిసి కథానికల పోటీ నిర్వహిస్తున్నారు. ప్రథమ బహుమతి 10 వేలు. ద్వితీయ 5 వేలు, తృతీయ 3 వేలు. బహుమతుల ప్రదానం జయంతి రోజున ఉంటుంది. సామాజిక ఇతివృత్తంతో ఈ పోటీ కోసమే రాసిన కథల్ని మే 20లోగా పంపాలి. చిరునామా: శేఖరమంత్రి ప్రభాకరరావు, స.సా. కార్యదర్శి, 409, ఆర్ ఆర్ టవర్స్, మహారాణిపేట, విశాఖపట్నం-530002; ఫోన్: 9885874474 దాశరథి ఉపదేశగీత కోసం... నది మాసపత్రికలో రెండేళ్లపాటు ధారావాహికగా వచ్చిన దాశరథి రంగాచార్య భగవద్గీత వచనానువాదం ‘ఉపదేశగీత’ను పుస్తకంగా తేనున్నామనీ, అయితే, 17వ భాగపు (నవంబర్ 2013) సంచిక లభించడం లేదనీ, కావున, ఆ ప్రతి ఉన్నవారు ఎవరైనా అందజేయగలరనీ, వి.జయప్రకాష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్: 9550002354 రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు సంస్కృత వేదాన్తంలో ఆళ్వార్ల(తమిళ) ప్రబంధాలలో నిష్ణాతులైన ముగ్గురు పండితులకు నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల జన్మదినం సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లోని కోడం దామోదర్ ఫంక్షన్ హాలులో ‘రఘునాథ దేశిక విశిష్ట పురస్కారాలు’ ప్రదానం చేయనున్నామని ఆహ్వాన సంఘం కార్యదర్శి సముద్రాల శఠగోపాచార్య తెలియజేస్తున్నారు. గ్రహీతలు: నేపాల్ కృష్ణమాచార్య, కె.వి.నర్సింహాచార్య, ఎస్.రమాకాంతాచార్య. పురస్కర్త: చిన్న జీయర్ స్వామి. -
కథ తెలుస్తూనే ఉంటుంది..
పాఠకుడితో సంభాషణ బొమ్మలు వేసేటప్పుడు వేళ్లు కదల్చాలా? మణికట్టు కదల్చాలా? కొత్తగా బొమ్మలు వేసేవాళ్లకూ చాలా ఏళ్లుగా బొమ్మలు వేసేవాళ్లకు కూడా ఈ సందేహం ఉంటుందట. మరి కొత్తగా కథలు రాసేవాళ్లకు? మపాసా ఒక కథ రాశాడు. అందులో ఒక అమాంబాపతు రైతు. అతనికి ఒక ముసలితల్లి. జబ్బు పడుతుంది. గుటుక్కుమంటే వేరే సంగతి. కాని మంచాన పడితే? పోయేలా ఉంది. ఎప్పుడు పోతుందో తెలీదు. తనేమో పొలానికి వెళ్లాలి. చూడ్డానికి ఇంట్లో ఎవరూ లేరు. ఊళ్లో ఒక దాదీ ఉంటుంది. ఆమె దగ్గరకు వెళితే రోజుకు రూపాయి అడుగుతుంది. రోజుకు రూపాయా? రేపో మాపో పోయేలా ఉంది కదా... అందుకని రైతు పోయేదాకా చూసుకో ఏడు రూపాయలు ఇస్తా. ఇవాళ పోయినా ఏడు రూపాయలే, పది రోజుల తర్వాత పోయినా ఏడు రూపాయలే అంటాడు. దాదీ వచ్చి ముసలిదాని వాలకం చూస్తుంది. మూడ్రోజులకు మించి ఉండదు. సరే అంటుంది. ఒక రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మారుతుంది. ఈ రాత్రికే అన్నట్టు ఉంటుంది. రైతుకు బాధ. అయ్యో ఈ రాత్రికే పోతే అనవసరంగా దాదీకి ఏడు రూపాయలు ఇవ్వాలే. మరో రోజు గడుస్తుంది. ముసలిదాని వాలకం మళ్లీ మారుతుంది. ఒక నెలైనా బతికేలా ఉంది. దాదీకి బాధ. నెల రోజులు బతికితే వచ్చేది ఏడు రూపాయలా? ఏమీ తోచదు. సరే చేసేదేముంది అని ఆ రోజు రాత్రి దీపాలన్నీ ఆర్పేసి చేతిలో చీపురు, నెత్తి మీద చేట పెట్టుకొని నాలుక బయటపెట్టి వికృతమైన ఆకారం ధరించి హఠాత్తుగా ముసలిదాని ముందుకు వస్తుంది. దయ్యం కనపడితే ఎవరు బతుకుతారు? ముసల్ది పుటుక్కుమంటుంది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని సిద్ధాంతపరంగా నిరూపించడానికి ఎన్ని వందల పేజీలు రాయాలో తెలియదు. మపాసా మాత్రం ఒక ఐదారు పేజీల్లో ఈ కథలో చెప్పేశాడు. ఈ విద్య అతనికి ఎవరు నేర్పించారు? ఎవరైనా చెప్తే కొన్ని తెలుస్తాయా? కథ రాసేవాళ్లు ఏవైనా సరే ఎవరి దగ్గరైనా సరే కొన్ని నేర్చుకోవాలా? అవసరమేనా? కథ రాసి ఎలా ఉందో చెప్పమని వేమన వసంతలక్ష్మి, చూపు కాత్యాయని, ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఎం.రాజేంద్ర, శ్రీరమణ, అనంత్, జంపాల చౌదరి వంటి మిత్రులకు చూపుతుండేవాణ్ణి. బాగుందో బాగలేదో చెప్తుండేవారు. దర్గామిట్ట కతలు రాసేటప్పుడు కథల నిండా కథల మధ్యలో బ్రాకెట్లు పెట్టి కొన్ని వివరాలు ఇస్తుండేవాణ్ణి. సాధారణంగా శ్రీరమణ సలహాలు ఇవ్వరు. కాని నా మీద దయతలచి ‘అలా బ్రాకెట్లు పాఠకులకు ఇబ్బంది అండీ’ అన్నారు. అంతే. ఇప్పటి వరకూ కథల మధ్యలో బ్రాకెట్లు వాడలేదు. నామిని నా ‘జమీన్’ కథను చదివి మధ్యలో మూడు చుక్కలు ( ) పెట్టి బ్రేక్ ఎందుకు చేస్తున్నావు? అది బ్యాడ్ నెరేషన్. జానపదులు ఓరల్ ట్రెడిషన్‌లో మధ్యలో మూడు చుక్కలు అని ఆపుతారా? ఆపరు కదా? కంటిన్యూగా కథ చెప్పలేవా? అని సలహా ఇచ్చాడు. నా ‘కింద నేల ఉంది’ 32 పేజీల కథ. ఒక్క బ్రేక్ లేకుండా కంటిన్యూగా కథ చెప్పాను. అంతే కాదు ఎంత పెద్ద కథనైనా ‘మూడు చుక్కల బ్రేక్’ లేకుండా చెప్పడం సాధన చేస్తున్నాను. ఎవరో ఒకరు కొన్ని చెప్పాలి. కొన్ని మనకు మనమే నేర్చుకోవాలి. అందుకు మార్గం ఏమైనా ఉందా? కార్మికుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రైతుల కష్టాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. అభివృద్ధి చేస్తున్న విధ్వంసక రూపాలు... కళ్ల ముందు కనపడుతున్నాయి. రాశాం. రాస్తున్నాం. కాని కొంచెం మార్చవచ్చు కదా. వేరేది రాయవచ్చు కదా. ‘బస్ట్ సైజ్ ఫొటో’... ఇది ఒక సంస్కారం. మనిషిని అంత వరకే చూసి రాయడం లోకం మెచ్చిన సంస్కారం. కాని ఆ బస్ట్ కింద ఉండే చీకట్లను, జ్వాలలను, తాపాలను, తెప్పరింతలను, కటి ప్రాంతం ఈడ్చుకుంటూ వెళితే ఒంటి మీద పడే చెక్కుళ్లను లోకంలో చాలా మంది రాశారు. ఆల్బెర్టో మొరావియా, హెన్రి మిల్లర్, డి హెచ్ లారెన్స్, మంటో, ఇస్మత్ చుగ్తాయ్, కమలా దాస్, చలం... ‘అయ్యో.. పూర్వం మనం బాగానే మాట్లాడుకున్నామండీ... ఈ విక్టోరియన్ మొరాలిటీ తగలడ్డాకే ఇలా తయారయ్యాం’ అనేవాళ్లు ఉన్నారు... అయితే కొంచెం ప్రయత్నించి ‘బియాండ్ కాఫీ’ అని పది కథలు రాశాను. కొంచెం విమర్శ వస్తుంది. ఉక్కిరిబిక్కిరి వస్తుంది. అది ‘అంగీకారం’ పొందే వరకూ ఎలా తట్టుకొని నిలబడాలి? కొత్తదారిని ఎలా కనుగొనాలి? ఆ దారిన ఎదురుదెబ్బకు ఏ మందును పట్టుకొని నడవాలి? ఒక్కోసారి కథ తెలుస్తూ ఉంటుంది. దానికి పాత్రలు వెతుక్కోవాలి. ఎలా? ఒక్కోసారి ఒక బ్రహ్మాండమైన పాత్ర కళ్ల ముందు కనపడుతూ ఉంటుంది. దానికి కథను వెతుక్కోవాలి. అదీ ఎలా? ఒక్కోసారి కథంతా పూర్తయిపోతుంది. దానికో పేరు ఎంతకీ తెమలదు. సరైన పేరు ఎలా పెట్టాలి? ఒక్కోసారి కథంతా ముక్కలు ముక్కలుగా గోచరమవుతూ ఉంటుంది. ఏ ముక్క మొదట రాయాలి... ఏ ముక్క చివర అమర్చాలి? నిడివి పెరుగుతూ పోతే దోషమా? మరీ క్లుప్తంగా వచ్చేసిందే... లోపమా? ఓ కథాదేవేరీ... నీవెప్పుడు నా పక్కన సుఖాశీనురాలివి అవుతావు? నా వక్షాన ఎప్పుడు శాశ్వత ప్రతిష్టితమవుతావు? నిదుర రాదు. రాసేటప్పుడు విపరీతంగా ఆకలి వేస్తుంది. ఇంట్లో వారికి ప్రవర్తన అర్థం కాదు. ట్రాఫిక్‌లో ఎవడో మన పరధ్యానానికి బండబూతులు తిడతాడు. ఆఫీస్‌లో పని తెమలదు. ఆ సాయంత్రం స్నేహితుల సాంగత్యం రుచించదు. కథ వెంట పడుతుంది. కథే ముద్ద మింగకుండా మన గొంతుకు అడ్డం కూచుంటుంది. పారిపోవాలనిపిస్తుంది. కాని కథ ముగిస్తేనే విడుదల పత్రం దొరుకుతుంది. ఈ జంజాటం జీవితాంతం ఉంటుంది. ఈ ప్రయాణానికి మనకేం తోడు కావాలి? కథ ఎప్పటికీ తెలిసిపోదు. అసలు సంపూర్తిగా తెలిసిపోయేదేదీ విద్య కాదు. అది తెలుస్తూ ఉంటుంది. అరె... నా అనుభవం ఇది... నీ ప్రయాస ఇదా... నేను ఇలా చేశాను... నువ్వు ఎలా చేస్తున్నావు.... డిగ్రీలు అమెరికాకు టికెట్టు కొనుక్కోమంటుంటాయ్. బయట రియల్ ఎస్టేట్ హోర్డింగ్స్ పిలుస్తుంటాయ్. టీవీల్లో చెత్త. సినిమాల్లో బురద. సరిగ్గా పిల్లల స్కూల్ ఫీజ్ కట్టలేవు, ఈ కథను పట్టుకుని ఎందుకురా ఊగులాడుతున్నావ్ అని మధ్య మధ్య విసుగు వస్తూ ఉంటుంది. కాని- వదల్లేం. చేయి విదిలించుకోలేం. కథకు మనం తగిలాం. కథ మనల్ని దొరకబుచ్చుకుంది. దానిని తెలుసుకుంటూ దానికి మనల్ని తెలియచేసుకుంటూ ఈ మధురబాధాయానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. నాకు కొంత తెలిసింది. చెప్పేశాను. ఇక మీ వంతు. - మహమ్మద్ ఖదీర్‌బాబు 9705444243 -
పాతికేళ్ల కథ ప్రయాణం
ఈ పాతికేళ్ల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు మినహాయిస్తే తర్వాతి కాలంలో వచ్చిన కథల్లో ప్రధాన ఇతివృత్తాలు రెండు. ఒకటి- గ్లోబలైజేషన్, తదనుగుణంగా మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు. రెండోది- సమాజంలోని వివిధ వర్గాల అస్తిత్వ వేదనలు. ఇవి స్త్రీవాదం నుంచి ప్రాంతీయత వరకు విస్తరించాయి. కథ, జీవితమంత గొప్పది. సమాజమంత విశాలమైనది. తెలుగు కథ 1910కి ముందే పుట్టి ఇప్పటికి లక్షకు పైగా కథలు వెలువడ్డాయని ఒక అంచనా. (ఆ సంవత్సరం వచ్చిన కథలతో) వార్షిక సంకలనాలు తీసుకురావడం వంద సంవత్సరాల క్రితమే అమెరికాలో మొదలైంది. ద బెస్ట్ అమెరికన్ షార్ట్ స్టోరీస్ పేరుతో ఒక వార్షిక కథాసంకలనం 1915లో ప్రారంభమై వందేళ్లుగా నేటికీ కొనసాగుతోంది. బహుశా పాతిక సంవత్సరాలుగా కొనసాగుతున్న వార్షిక సంకలనాల పరంపరలో కథాసాహితి సంకలనాలు ఆ వరుసలో రెండోది కావచ్చు. ఒక సంస్థ మనుగడలోనో, ఒక మనిషి జీవితంలోనో పాతికేళ్లు ఎక్కువ కాలమే కావచ్చు. కానీ చరిత్ర గమనంలో ఒక సమాజానికి అది స్వల్పకాలమే. అయితే, ఈ స్వల్పకాలం భారతదేశ చరిత్రలో మరీ ముఖ్యంగా తెలుగు సమాజ చరిత్రలో అతి ముఖ్యమైనది. 90లలో దేశంలో ప్రారంభమయిన నూతన ఆర్థిక విధానాలు అతి త్వరలోనే గ్లోబలైజేషన్ ప్రక్రియలో భాగమై మనల్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకు ప్రయోగవేదికే అయింది. సమాజాన్ని ఆలోచనాపథం వైపు నడిపిన కమ్యూనిస్టు ఉద్యమాలు తాత్కాలికంగానే కావచ్చు, వెనకపట్టు పట్టాయి. వివిధ అస్తిత్వవాద ఉద్యమాలు అనేక కోణాల నుండి కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. అందులో భాగంగానే నిర్లక్ష్యానికి, వివక్షకు గురయిన ప్రాంతాలలో మొదలయిన అలజడి ఉద్యమరూపం సంతరించుకుంది. ఫలితంగా రాష్ట్రం రెండు భాగాలయింది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడిచిన ఉద్యమం రాజకీయాలను శాసించి, వాటికి కేంద్రబిందువయింది. ఈ మొత్తం వాతావరణం సాహిత్యంలోకి, ముఖ్యంగా కథల్లోకి తర్జుమా అయింది. రాజకీయాలు, ఆర్థిక విషయాలు, సామాజిక వాతావరణం సాహిత్యం మీద వేయగలిగిన ముద్ర ఎంత బలమైనదో ఈ కాలంలో వెలువడిన కథలు చదివితే అర్థమవుతుంది. హక్కులు, ఉద్యమాలు, నిర్బంధాలు, విప్లవాలు ప్రధాన వస్తువులుగా వెలువడిన కథల స్వరూపం 2000 సంవత్సరం నాటికి మారిపోయింది. వ్యక్తిగత భావనలు, అనుభవాలు, అంతఃసంఘర్షణలు, మానసిక ఒత్తిడులు, పురాజ్ఞాపకాలు కథలకు ప్రధాన వస్తువులయ్యాయి. ఈ పాతికేళ్ల కాలంలో మొదటి ఐదు సంవత్సరాలు మినహాయిస్తే తర్వాతి కాలంలో వచ్చిన కథల్లో ప్రధాన ఇతివృత్తాలు రెండు. ఒకటి- గ్లోబలైజేషన్, తదనుగుణంగా మానవసంబంధాల్లో వచ్చిన మార్పులు. రెండోది- సమాజంలోని వివిధ వర్గాల అస్తిత్వ వేదనలు. ఇవి స్త్రీవాదం నుంచి ప్రాంతీయత వరకు విస్తరించాయి. గ్లోబలైజేషన్ పరిణామాలు సమాజంలో పెనుమార్పులు తీసుకొచ్చాయి. అవి కేవలం ఆర్థిక విషయాల వరకే పరిమితమయి లేవు. ప్రభుత్వ నిర్ణయాల్లోకి, పరిశ్రమల్లోకి, గ్రామీణ జీవితంలోకి, వ్యాపారాల్లోకి, విద్యా, ఉద్యోగ రంగాల్లోకి, నెమ్మదిగా వ్యక్తిగత జీవితాల్లోకీ ప్రవేశించాయి. ఆర్థికం నుండి వ్యక్తిగత జీవితం వరకూ ఈ పరిణామాలు ప్రవేశించిన తీరును కప్పడాలు కథలో అత్యంత ప్రతిభావంతంగా, వ్యంగ్యంగా చిత్రించారు. వివిధ సౌకర్యాలు గ్రామాలను భౌతికంగా పట్టణాల ముంగిటకు తీసుకువచ్చాయి. కానీ గ్రామీణ జీవన సంబంధాలు మాత్రం దూరంగా జరిగిపోయాయి. మానవ నాగరికతా పరిణామంలో ఇది అనివార్యతే కావచ్చు. కానీ, మార్పుల వేగం, తీవ్రత అందుకు సిద్ధంగా లేని జీవితాలను శిథిలం చేశాయి. అలాంటి నిర్వీర్యమైన గ్రామీణ వ్యవస్థను చిత్రించిన కథలెన్నో. అడుసు, కొలిమి, కుట్ర, అన్నంగుడ్డ, తెల్లదయ్యం, రంకె, నేలతిమ్మిరి, మిత్తవ వంటి కథలన్నీ ఒకరకంగా బతికి చెడ్డ దేశానివే. పట్టణ ప్రాంతాల్లో ఒకటొకటిగా మూతపడిపోయిన పరిశ్రమల ఆత్మఘోషలు, మానవ ఆక్రందనలు మరికొన్ని కథల్లో వినవచ్చు. జీవన్మృతుడు, విధ్వంసదృశ్యం, టైటానిక్, అలజడి వంటివి ఈ దృశ్యాలకు కథారూపాలు. మానవ సంబంధాలను ఆర్థిక అవసరాలు నిర్దేశించే స్థితికి సమాజం ప్రయాణించింది. తరాల మధ్య అంతరం, వాటి మధ్య భావ సంఘర్షణ తీవ్రమయింది. ఈ మార్పుల పట్ల ఒక ఆవేదనాపూర్వక స్వరం కథల్లో వినబడుతుంది. తెగిన గొళ్లాలు, చివరి యిల్లు, దూరపు కొండలు, సప్తవర్ణ సమ్మిశ్రీతం, అంత్యాక్షరి, ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, రూపాయిచొక్కా వంటి అనేక కథలు ఈ సంబంధాల మీద దృష్టిని కేంద్రీకరించి రాసినవే. తొలిరోజుల్లో గ్లోబలైజేషన్ను తీవ్రంగా వ్యతిరేకించే కథావస్తువు నెమ్మదిగా చైతన్యస్థాయిని పెంచడానికి దోహదపడే కథావస్తువుగా విస్తరించింది. న్యూ బాంబే టైలర్స్, సాలభంజిక, పెండెం సోడాసెంటర్, ఆవు-పులి మరికొన్ని కథలు, యూ టర్న్ కథల్లో ఈ పరిణామం కనబడుతుంది. అస్తిత్వవాద చైతన్యం ముందుగా స్త్రీవాదంతో మొదలయింది. తరువాత కాలంలో దళిత, బహుజన, మైనారిటీ వాదాలు ముందుకొచ్చాయి. ఇల్లలకగానే... కథ సాదాసీదాగా మొదలై, స్త్రీ వాదానికి పెద్ద ఊపునిచ్చింది. సిగ్గు బహుశా తెలుగు సాహిత్యంలో దళిత తాత్త్విక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన తొలి కథగా భావించవచ్చు. మట్టి-బంగారం బహుజన చైతన్యాన్ని నేరుగా చిత్రించిన కథ. జమీన్, సారీ జాఫర్ వంటి కథల్లో ప్రదర్శితమైన సానుభూతి, గెట్ పబ్లిష్డ్ వంటి కథల్లో ఆక్రోశంగా మారి, జీవం, అతడు, గోరీమా కథల ద్వారా తమ అస్తిత్వాన్ని ధైర్యంగా ప్రదర్శించుకునే స్థాయికి మైనారిటీవాదం ఎదిగింది. మరోవైపు, వర్షాభావం, కరువుకి తోడుగా రాయలసీమ ఫ్యాక్షన్ జీవితాల వెనుక విషాదాన్ని ఆ ప్రాంత రచయితలు వీరనారి, మెడ మీద వేలాడే కత్తి, వానరాలే, కన్నీటి కత్తి కథల ద్వారా బలంగానే తీసుకొచ్చారు. ఈ పాతికేళ్లలో తెలుగు కథాసాహిత్యానికి అదనపు కూర్పు డయాస్ఫోరా కథలు. బతుకు కథతో మొదలై ‘అవచారం’, పరివర్తన, సరిహద్దు, ఐ హేట్ మై లైఫ్ వంటివి ఆవలి తీర జీవితాలను పరిచయం చేసిన కథలు. అలాగే, ప్రధానపాత్ర కథలోకి ప్రవేశించకుండా ఆ పాత్ర చుట్టూ కథ నడుపుతూ, ఆ వ్యక్తి సృష్టించిన ఒక ప్రాంత ఉద్యమ విశ్వరూపాన్ని పాఠకుల ముందుంచిన అతడు కథ ఇరవై ఏళ్ల క్రితం ఓ సంచలనం. భార్యాభర్తల మధ్య సంబంధాలను వ్యక్తిగత కోణం నుంచి, ఉద్యమ నేపథ్యం నుంచి, సాంఘిక నేపథ్యం నుంచి చర్చించిన పనిపిల్ల కథపై పెద్ద పుస్తకమే వచ్చింది. ఇలా తెలుగు సమాజంలో వచ్చిన సకల మార్పులూ ఈ సంకలనంలోని కథల్లో ప్రతిబింబిస్తాయి. పాతికేళ్ల సామాజిక చరిత్రకు కథాదర్పణం ఈ సంకలనం. (1990-2014 వరకు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ సంపాదకులుగా కథాసాహితీ ఆధ్వర్యంలో వచ్చిన 155గురు కథకుల 336 కథలతో 1300+1300 పేజీల రెండు బృహత్ సంకలనాలను ‘మనసు ఫౌండేషన్’ వెలువరిస్తోంది. వీటి ఆవిష్కరణ జనవరి 24న ఎన్.టి.ఆర్.కళామందిరం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో ఉదయం 10:30- సాయంత్రం 5 వరకు భిన్న కార్యక్రమాల మధ్య జరగనుంది. పై వ్యాసం, సంపాదకీయంలోని కొంత భాగం; కొన్ని చేర్పులతో.) -
తెలుగు లో సైన్సు ఫిక్షన్ రచనలు
అభిప్రాయం శాస్త్రాన్ని సామాన్య ప్రజలకి అందించటానికి స్థూలంగా రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని దంతపు మేడల బురుజుల్లోంచి నేలమట్టానికి దింపి, తేలిక భాషలో చెప్పడం ఒక పద్ధతి. దీనినే జనరంజక విజ్ఞానం అంటారు. సైన్స్‌ని ప్రాతిపదికగా తీసుకుని కథలు రాయటం రెండవ పద్ధతి. దీనిని వైజ్ఞానిక కల్పన సాహిత్యం అంటారు. కథలలో శాస్త్రాన్ని జొప్పించి రాయటంలో రెండు మార్గాలు ఉన్నాయి. శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని, శాస్త్రం కుంటుపడకుండా కథ రాయటం. ఉదాహరణకి పరీక్ష నాళికలో పిండోత్పత్తి చేసి, అ సాంకేతిక పరిజ్ఞానంతో పిల్లలు లేనివారికి పిల్లలు పుట్టేలా చేయటమే తీసుకుందాం. దీని వల్ల కొత్త సమస్యలు ఎదురయే అవకాశం ఉంది కదా. ఉదాహరణకి గర్భాన్ని అద్దెకు ఇవ్వటం. దీని పర్యవసానంగా పుట్టిన పిల్ల ఎవరిది అనే ప్రశ్న ఉదయించటం. ఈ రకంగా కథ అల్లుకుపోవచ్చు. ఇక్కడ కథలో సంఘటనలు కల్పితాలు కావచ్చు. కాని, కథలో కనిపించే సైన్స్ కల్పితం కాదు. సైన్స్ కథలలో మరో రకం ఉన్నాయి. వీటిల్లో శాస్త్రపు పునాదుల లోతు తక్కువ, ఊహలతో విహరించే ఎత్తు ఎక్కువ. ఈ కథాసంపుటంలో అనిల్ రాసిన కథలన్నీ ఈ కోవకి చెందుతాయి. కవిత్వంలో కవి సమయాలలా సైన్సుని సాగదీసి కథ అల్లుతాం. ఈ రకం కథలలో అల్లికకి, కల్పనకి అవధులు లేవు. ఈనాడు కల్పితం అని కొట్టిపారేసినవి రేపు నిజం కావచ్చు. జురాసిక్ పార్కు కథ ఈ కోవకి చెందుతుంది. కానీ, భూతంలోకీ, భవిష్యత్తులోకీ ప్రయాణం చేసినట్లు రాసిన కథలు మూడొంతుల ముప్పాతిక అసంభవం. పైన ఉదహరించిన ధోరణిలో తెలుగులో కథలు రాసేవాళ్లు బహు తక్కువ- అని చాలా రోజులు అనుకునేవాడిని. పదహారో శతాబ్దంలో పింగళి సూరన్న రాసిన కళాపూర్ణోదయం(తెలుగులో మొదటి నవల! )లో కలభాషిణి ఉయ్యాల ఊగుతూ ఉంటే నలకూబరుడు విమానంలోంచి చూసి కిందకి దిగి వస్తాడు. ఈ కథలో విమానం కనిపించినంత మాత్రాన దీనిని వైజ్ఞానిక కల్పన అనగలమా? విమానాలున్నంత మాత్రాన కథ ‘సైన్సు ఫిక్షన్’ అనుకుంటే రామాయణం కూడ సైన్సు ఫిక్షనే. రామాయణంలో ఒక్క పుష్పక విమానం ఉండటమే కాదు, మరో అసక్తికరమైన వైజ్ఞానిక కల్పన ఉంది. రావణుడి రక్తం నేల మీద పడితే ప్రతి బొట్టు మరొక రావణుడిగా అవతరిస్తాడని విభీషణుడు రాముడిని హెచ్చరిస్తాడు. జురాసిక్ పార్కు సంభవం అయిన రోజున రావణుడి రక్తపుబొట్టు నుండి మరొక రావణుడు పుట్టటం కూడా సంభవం ఎందుకు కాకూడదు? మహాభారతంలో కౌరవులంతా నాళికా శిశువులే కదా. కనుక భారతం కూడా వైజ్ఞానిక కల్పన- లేదా వై-కల్పన కోవలోకే వస్తుంది. మన పురాణాలలో దేవుడు ప్రత్యక్షం అవటం అనే సన్నివేశానికీ, స్టార్ట్రెక్లో ‘బీం మి అప్ స్కాటీ’ సన్నివేశానికీ పోలికలు లేవూ? కనుక ఒక విధంగా మన పురాణ గాథలలో వైకల్పనలు లేకపోలేదు. మూడు కళ్లు, నాలుగు తలకాయలు, ఆరు చేతులు ఉన్న వ్యక్తులు కల్పన కాక మరేమిటి? మరో లోకం నుండి వచ్చిన మేనకని విశ్వామిత్రుడు పెళ్లి చేసుకోకపోతే మనం అంతా ఇక్కడ ఉండే వాళ్లమా? మనం అంతా భూలోకులకీ, మరో లోకులకీ పుట్టిన సంకర సంతానమే కదా. ఇరవయ్యవ శతాబ్దంలో, కొత్త పోకడలతో తెలుగులో వైకల్పనలు రాసిన వాళ్లు లేకపోలేదు: టేకుమళ్ల రాజగోపాలరావు ‘విహంగయానం’ నవలలో నాయిక ఒక జలాంతర్గామిలో ప్రయాణం చేస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘హాహాహూహూ’లో ఒక గంధర్వుడు దివి నుండి భువికి దిగివచ్చి లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లో తారసపడతాడు. ఇదొక రకం కాలయానం. రావూరి భరద్వాజ ‘చంద్రమండల యాత్ర’ రోదసి యానం చిరుత ప్రాయంలో ఉన్నపుడు రాసిన నవల. చంద్రమండలానికి రోజూ పొద్దున్నే లండన్‌కి వెళ్లొచ్చినట్లు వెళ్లొస్తున్నాం కనుక ఈ కథని వై- కల్పన కోవలోంచి తీసెయ్యవచ్చు. బొల్లిముంత నాగేశ్వరరావు ‘గ్రహాంతర యాత్రికులు’లో మరో లోకం నుండి పర్యాటకులు భూలోకం వచ్చి ఇక్కడ మన వారిలో ఉన్న ఆర్థిక వ్యత్యాసాలు చూసి చాలా అసహజంగా ఉందే అని ఆశ్చర్యపోతారు. ఇది కచ్చితంగా వై- కల్పనే. కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన ‘ఒకే రక్తం, ఒకే మనుష్యులు’ దిట్టంగా ఉన్న సైన్స్‌ని ప్రాతిపదికగా తీసుకుని రాసిన నవలే అయినప్పటికీ అక్కడక్కడ వై- కల్పన ఛాయలు కనిపిస్తాయి. కొడవటిగంటి కుటుంబరావు ఈ కోవకి చెందిన కథ ఒకే ఒకటి రాసేరని ఆయన కుమారుడు రోహిణీ ప్రసాద్ నాతో చెప్పేరు. ఆ కథ - గ్రహశకలం - నిజానికి సైన్సు ఫిక్షన్ కాదనిన్నీ, అది కేవలం ‘పొలిటికల్ ఎలిగొరీ’ అనీ రోహిణీప్రసాద్ అభిప్రాయపడ్డారు. యండమూరి వీరేంద్రనాథ్ ‘యుగాంతం’లో ఒక గ్రహశకలం వచ్చి భూమిని గుద్దుకుంటుంది. మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘నత్తలొస్తున్నాయి, జాగ్రత్త!’ పేలవమైన వై-కల్పనకి ఒక ఉదాహరణ. వీరేంద్రనాథ్, వేంకటకృష్ణమూర్తి జనాదరణ పొందిన నవలలు ఎన్నో రాసేరు కాని వీరికి పేరు తెచ్చిపెట్టినది వీరి సైన్సు ఫిక్షన్ రచనలు కావు. రెంటాల నాగేశ్వరరావు ‘స్త్రీ లోకం’ కథలో తల్లి తండ్రిగా మారిపోతుంది (మారిపోతాడు అనాలా?). చిత్తర్వు మధు ఈ మధ్య ప్రచురించిన కుజుడి కోసం, ఎపిడమిక్ అనేవి పేరుని బట్టి వైకల్పనలలాగే ఉన్నాయి. పదిహేనేళ్ల క్రితం రమేష్‌చంద్ర మహర్షి రాసిన ‘పేరడైజ్’ స్వాతి మాసపత్రికలో వచ్చిందిట. ఇది కూడ వై-కల్పన కథే అని అంటున్నారు. మన్నె సత్యనారాయణ రాసిన ‘కాలంలో ప్రయాణం’ రాష్ట్ర స్థాయి నవలల పోటీలో 20,000 రూపాయలు గెలుచుకొందిట. ఆంధ్రభూమి వారపత్రికలో ధారావాహినిగా ప్రచురించబడింది కూడా! ఈ మధ్య వైకల్పన కథల వినీలాకాశంలో ఒక కొత్త తార వెలుగొందుతోంది. ఇంతవరకు పైన పేర్కొన్న వారంతా వైకల్పన బాణీలో ఒక కథో, ఒక నవలో రాసి ఊరుకున్నారు కాని అనిల్ రాయల్ ఈ క్షేత్రాన్ని ఒక కృషీవలుడిలా దున్నడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు సాహిత్యరంగం మీద వైకల్పనలకి ఒక స్థానం లభించాలంటే ఇలా ఈ రంగంలో నాలుగు కోణాల నుండి రకరకాల కథలు రాసేవారు ఇంకా రావాలి. (‘నాగరికథ’ కథాసంకలనానికి రాసిన ముందుమాట నుంచి...) రామాయణంలో ఒక్క పుష్పక విమానం ఉండటమే కాదు, మరో అసక్తికరమైన వైజ్ఞానిక కల్పన ఉంది. రావణుడి రక్తం నేల మీద పడితే ప్రతి బొట్టు మరొక రావణుడిగా అవతరిస్తాడని విభీషణుడు రాముడిని హెచ్చరిస్తాడు. జురాసిక్ పార్కు సంభవం అయిన రోజున రావణుడి రక్తపుబొట్టు నుండి మరొక రావణుడు పుట్టటం కూడా సంభవం ఎందుకు కాకూడదు? వేమూరి వేంకటేశ్వరరావు rvemuri@ucdavis.edu -
మనసుని స్పృశించే మృదు కెరటాలు
పాతబియ్యం తెలుగు కథాప్రపంచంలో పరిచయమక్కరలేని రచయిత భమిడిపాటి జగన్నాథరావు. 1960 దశాబ్దం నుండి సుమారు 25 కథలు రాశారు. ‘మువ్వలు’, ‘అడుగు జాడలు’ పేర్లతో యీ మధ్యనే అచ్చువేశారు. ఈ కథలు జీవితంలోని వివిధ పార్శ్వాలను సున్నితంగా స్పృశిస్తాయి. మనసు అట్టడుగు లోతుల చెమ్మను పైకితీస్తాయి. దైనందిన యాంత్రికతలో లోపిస్తున్న జీవితాన్ని గుర్తుచేస్తాయి. జీవితమంటే బతకటం కాదు, రసవంతంగా, ఫలవంతంగా అనుభూతుల్ని అనుభవాలుగా మలుచుకోవడం అని బోధిస్తాయి. సమాజంలో మేధావిగా గుర్తించబడ్డ వ్యక్తి కుటుంబంలోని వారినీ, తోటివారినీ ఎలా ప్రేమించలేకపోయాడో చెబుతారు ‘చూపు’ కథలో. ఆ దృష్టిని మార్చుకుని, జ్ఞానాన్ని మేధస్సుతోకాక హృదయంతో స్వీకరిస్తే, ఇతరులు ప్రేమగా దగ్గరకు రాగలుగుతారని, అదే అసలైన చూపు అనీ అంటారు భజరా. జీవిత భాగస్వామిని కోల్పోయి, జీవితం శూన్యంగా మారిన సందర్భంలో మరో భాగస్వామితో ఆ శూన్యాన్ని భర్తీ చేసే ప్రయత్నం కంటే, తన చుట్టూ వున్న సమాజానికి తాను చేయగలిగే సేవ చేస్తూ, మనిషి తనను తాను నింపుకోవచ్చు అని చెబుతుంది ‘బొంగరం’ కథ. ‘చిత్రనళీయం’లో జీవితాన్ని ఆస్వాదించడానికి కావలసింది లక్షలూ కోట్లూ కాదు, కేవలం కాసింత స్వచ్ఛమైన చిరునవ్వు... అలా నవ్వగలిగే మానసిక స్థితి అంటారు. ఒక పెదవి వంపు నుండీ, చిన్న బుగ్గసొట్ట నుండీ, మట్టెల సవ్వడి నుండీ కూడా ఆనందాన్ని అనుభవించవచ్చంటారు. ఆయన కథల్లో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన కథ ‘సముద్రం’. ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా, ఒకరిని ఒకరు మలుచుకొని జీవిస్తున్న జంటల మధ్య అనురాగమూ అవగాహనా తప్ప అసూయా అనుమానాలకు తావుండదని చాటుతుందీ కథ. దంపతుల మధ్య ఉండవలసిన స్వచ్ఛమైన, స్వేచ్ఛాపూరితమైన, అరమరికలు లేని, పరస్పర ఆరాధనతో నిండిన ప్రేమను చలంను మరిపించే స్థాయిలో ఆవిష్కరిస్తారు భమిడిపాటి. పొద్దు వాలిపోతున్న జీవనసంధ్యను ఎలా అర్థవంతంగా మలచుకోవచ్చో ‘మంటల్లో జాబిల్లి’ చెబుతుంది. బిడ్డల అనాదరణకు గురై, బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేరవలసి వస్తే బాధ తప్ప, పట్టణాల్లో ఊపిరాడని ఉరుకులు పరుగుల్లో కొట్టుకుపోతున్న పిల్లలతోవుండి ఇబ్బందిపడేకంటే, ప్రశాంత వాతావరణంలో నెలకొల్పిన వృద్ధాశ్రమాల్లో జీవించాలని నిర్ణయం తీసుకుంటే అది ఆనందించదగిన విషయమే అంటారాయన. నైతిక విలువల పేరుతో సమాజపు ఇరుసులో నలిగిపోయిన బతుకుల ఆక్రోశం, కుహనా సంస్కర్తలూ, హృదయపు లోతుల ప్రేమలూ, ఆదర్శాలూ, ఆవేశాలూ, సర్దుబాట్లూ... ఎన్ని ఉన్నా ‘జీవితం జీవించడానికే’ అనే సందేశాన్ని చిన్న చిన్న పదాలతో సరళంగా అందించిన సహజ కథకుడు; రాసినవి కొన్నే అయినా, తెలుగు పాఠకుల హృదయ సౌకుమార్యాన్ని స్పృశించి, తెలుగు కథాస్రవంతిలో మృదు కెరటమై నిలిచిపోయిన కథకుడు భమిడిపాటి జగన్నాథరావు. (ఫోన్: 0712-2548766) పెద్దిభొట్ల సుబ్బరామయ్య 9849550924 -
రాయాలీ అని రాయలేను, రచనొక జ్వరం
‘నేను దేన్నయితే నమ్మలేదో దాని గురించి ఎప్పుడూ రాయలేదు,’ అంటారు పతంజలి శాస్త్రి. ఈ కథకుడు, నవలాకారుడు, పర్యావరణ చింతనాపరుడికి ఇది సప్తతి సంవత్సరం. ఆ అసందర్భసందర్భమే ఈ సంభాషణకు పునాది. పురస్కారాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం చేశారు... వ్యతిరేకత కంటే అసంతృప్తి ఎక్కువ. ఏ పురస్కారం తీసుకున్నా ‘ఎవరు ఇప్పించారు గురూ’ అని అడుగుతారు. ఎందుకంటే ప్రతిభ వల్ల వచ్చేవి తక్కువ అని అందరికీ అర్థమయింది. మీపై రచన దిశగా పడిన తొలి ప్రభావం చెప్పండి? ఎక్కువ కుటుంబమే. ఆరో తరగతిలోనే మొదటి కథ రాశాను. ఇల్లంతా పుస్తకాలుండేవి, ఇంటికి ఎంతోమంది కవులూ గాయకులూ వచ్చిపోతుండేవాళ్లు. మూడుతరాల కవులతో నాకు ప్రత్యక్ష పరిచయం ఉంది. మొదట్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన రచయితలెవరు? నేను కాలేజీ స్థాయికి వచ్చేసరికి- నేనే కాదు మా తరానికి అందరికీ గురువులు ఎవరంటే- మపాసా, సోమర్సెట్ మామ్, ఇక ఆ మూడో పేరు ఓ.హెన్రీ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. మపాసా కథకు వాతావరణాన్ని గొప్పగా సృష్టిస్తాడు. మామ్‌ను అప్పట్లో ఇష్టపడ్డాంగానీ గొప్ప రచయిత కాడు, లోతు తక్కువ. కాని కథ గొప్పగా చెప్పగలడు. మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది? ఎక్కువ రివైజ్ చేస్తారా, లేక ఒకే ఊపులో రాసి అదే ఖాయం చేస్తారా? కూర్చుని కథ రాయాలీ అనుకుని రాయలేను. లోపల చిత్రమైన కదలిక మొదలై, అది జ్వరంలా మారుతుంది. అప్పుడు రాయడానికి కూర్చుంటాను. రాయడం మొదలుపెడితే ఏకబిగిన రాస్తాను. వేగంగా రాస్తాను. ఒక్కోసారి రాసింతర్వాత ఏం రాశానో నేనే గుర్తు పట్టలేను. పూర్తయ్యాకా మళ్లీ డ్రాఫ్ట్ అంటూ విడిగా రాయను గానీ, ఇంక అందులోనే మార్పులు చేస్తాను. రాయడానికి కూర్చుంటే ముందే కథ ఆద్యంతాల పట్ల పూర్తి అవగాహన ఉంటుందా? లేక రాస్తూపోతూ దారి కనుక్కుంటారా? రెండూను. మామూలుగా కథల విషయంలో ఎలా ముగించాలనేది ముందే ఉంటుంది. ప్రారంభమే ఉండదు. ఇలా మొదలెట్టాలీ అని ఖాయంగా అనుకోలేను. ఇన్ని పేజీలూ అనుకోను. ఎంతవరకూ వస్తే అంతటితో ఆపేస్తాను. కథ రాసేటప్పుడు పాత్రలన్నీ నా కనుల ముందర కనిపిస్తూ ఉంటాయి. చర్మం రంగేమిటి, జుట్టు ఎలా దువ్వుకుంటుంది, ఎలా మాట్లాడుతుంది... ఇలా ప్రతి మైనరు డీటైలూ కనిపిస్తుంది. కనిపించిందంతా కథలో రాయకపోవచ్చు. కానీ కనిపిస్తుంది. కాబట్టి ముందు ఎక్కడో ఒకచోట మొదలుపెట్టేస్తాను. నాకు ఇష్టమైన ఉదాహరణ చెప్తాను. నా ‘వీరనాయకుడు’ నవలలో నాకు ఇష్టమైన పాత్ర పూర్ణయ్య అనే ఒక వేగు పాత్ర. ఆ పాత్ర వచ్చే ముందున్న పేరాగ్రాఫులో కూడా నాకు ఆ పాత్ర వస్తుందన్న స్పృహ లేదు. మీ కథలు కొన్ని వాస్తవికంగా సాగుతూనే ఉన్నట్టుండి దాన్నించి దూరం జరుగుతాయి... వాస్తవికత అనేదానికి చాలా పరిమితులు ఉన్నాయి. దాని రిలవెన్స్ దానికి ఉంది, కాదనటం లేదు. కానీ కేవల వాస్తవికత అనేది creatively not inspiring for me. లాటిన్ రచయిత Mario Vargas Llosa 'The Feast’ నవల రాశాడు. డొమినికన్ రిపబ్లిక్‌ను పాలించిన ఒక నియంత జీవితం గురించి. రచయిత వాస్తవికంగానే కథ చెప్తాడు, చెప్తూనే ఏం చేస్తాడంటే, తన కథన శక్తి ద్వారా ఈ వాస్తవిక పరిమితుల నుంచి దాన్ని పైకి లేపి వదిలేస్తాడు. ఫలితంగా, అది కేవలం ఒక దేశానికి సంబంధించిన నియంత గురించి అని తెలుస్తూనే ఉన్నాగానీ మనం రిలేట్ చేసుకోగలం. మీ ఉద్దేశం మేజిక్ రియలిజమా? ఇది most misunderstood word. మన తెలుగువాళ్లు ఏం చేసినా అతి కదా. ఒకరకంగా ఆలోచిస్తే మన దేశానికి మేజిక్ రియలిజం కొత్త కాదు. నేను చెప్తున్నది సింబాలిజం గురించి. మేజిక్ రియలిజం మార్క్వెజ్ నుంచి మొదలైంది. నేరేషన్లో కాలం అన్న డెమైన్షన్ను మేజిక్ రియలిస్టులు తీసి పారేశారు. కాలంతో సంబంధం లేకుండా గతాన్ని వర్తమానం చేస్తుంటారు. మనవాళ్లు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. తెలుగు రచయితల్లో గోపిని కరుణాకర్ ఒక్కడే దానికి సమర్థుడు. అతనికే అది సహజంగా పట్టుబడింది. కథారచన చేసినంత విస్తారంగా నవలారచన వైపు మీ దృష్టి ఎందుకు పోలేదు? నాకు కథలంటే ఎక్కువ ఇష్టం. రాసిన నవలలు కూడా బాగా చిన్నవి. అసలు నేను- రచన ఇంతవరకూ ఉండాలి, ఈ కోవకు చెందాలి అనుకోను. అది సహజంగా ఎంతవరకూ డెవలప్ అవుతుందో అంతవరకూ పోనిచ్చి ఆపేస్తాను. కుళాయిలో నీరు పోయినంత పోయి చివరకు చుక్కలుగా మారి డ్రై అయిపోతుందే- అలాగ. ఒక పర్యావరణ కార్యకర్తగా, కల్చర్కూ ఎకాలజీకి ఉన్న సంబంధం ఏమిటి? మానవ సమూహం జీవిత నిర్వహణ కోసం చేసే కృషి అంతా ఆ జీవావరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో ఈ ప్రభావం ఉంటుంది. అది ఒక జీవనవిధానాన్ని ఏర్పాటుచేస్తుంది. ఆ విధానంలో ముఖ్యమైన భాగమే సంస్కృతీ సంప్రదాయాలు. మీకు సినిమా అంటే ఇష్టమని తెలిసింది. ఆ వైపుగా ప్రయత్నాలేమన్నా చేశారా? దృశ్యమాధ్యమం మన క్రియేటివిటీకి కొనసాగింపు లాంటిది. మంచిసినిమా చూడటం నాకు గొప్ప ఈస్థటిక్ అనుభవం. నాలుగైదు ప్రయత్నాలు చేశాను, కుదర్లేదు. నా కథలు కొన్ని స్క్రీన్‌ప్లేగా చేస్తున్నాను. మీకు బాగా నచ్చిన రచయితలు? త్రిపుర, కేశవరెడ్డి, పాలగుమ్మి పద్మరాజు, చాసో, గోపిని కరుణాకర్, కాశీభట్ల... ఇలా చాలామంది. ఇంగ్లీషులో లెక్కేలేదు. ఇంటర్వ్యూ: ఫణి (పతంజలి శాస్త్రి ఫోన్: 9440703440) -
కలలు చెప్పే కథలు...
డ్రీమ్స్ కలలకు అర్థాలు ఉండవు. అన్వయాలు మాత్రమే ఉంటాయి. అన్వయం అంటే... అలా జరిగింది కాబట్టి, ఇలా కల వచ్చింది అనుకోవడం. లేదా ఇలా కల వచ్చింది కనుక అలా జరగబోతోందని భావించడం. కల కలే. నిజం నిజమే. రెంటికీ పోలిక లేదు. పొంతన లేదు. అయినప్పటికీ కలలు.. ‘తేలిగ్గా తీసి అవతల పడేయవలసిన’ కేటగిరీలో ఉండిపోలేదు! కలలపై పరిశోధనలు జరిగాయి. జరుగుతున్నాయి. కలలకు అర్థాలను వెతుకుతున్నారు. అంతరార్థాలను బయటికి లాగుతున్నారు. ఎంత వెతికినా, ఎంత లాగినా... కల అంతు చూడ్డం మనిషికి ఒక కలలానే మిగిలిపోయింది. మరి.. కొన్ని కలలెందుకు నిజం అయ్యాయి? కొన్ని నిజాలెందుకు కలలుగా కనిపించాయి? కల నిజం అవడం యాదృచ్ఛికం కావచ్చు. నిజం కల అవడం... కలవరింత కావచ్చు. ఏమైనా కలలు ఇంట్రెస్టింగ్. అవి కొత్త లోకాలను చూపిస్తాయి. కొత్త ఊహల్లో తేలియాడిస్తాయి. కొత్త భయాలను కలిగిస్తాయి. కొన్నిసార్లు ఉన్న భయాలనూ పోగొడతాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పడం ఏమంటే.. తీరని కోరికలు కలలుగా వస్తాయని! వస్తాయి సరే. తీరినట్టు వస్తాయా? తీరనట్టే వస్తాయా? ఎలాగైనా రావచ్చు. ఇక ఎప్పటికీ తీరనట్టు కూడా రావచ్చు. ఫ్రాయిడ్ పందొమ్మిదో శతాబ్దపు ఆస్ట్రియా న్యూరాలజిస్టు. సైకోఎనాలసిస్కి పితామహుడు. కలల్ని ఆయన డీసైఫర్ చేశారు. కలల కొలనులో ఈతకొట్టి లోపల ఏం మున్నదీ పైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్రాయిడ్ చెప్పేదాన్ని బట్టి కలలన్నిటీనీ ఒకే మూసలో పెట్టి చూడ్డానికి లేదు. ఏ కలని, ఆ కలగానే ఎనలైజ్ చేయాలి. అప్పుడు ఆ కల దేనికి సంకేతమో తెలిసే అవకాశం ఉంటుందట! ఫ్రాయిడ్ తర్వాత ఆ స్థాయిలో కలల్ని విశ్లేషించి గూఢార్థాలు కనిపెట్టిన ఆధునిక సైకాలజిస్ట్ ఇయాన్ వాలెస్. ఆయన 1,80,000 కలల్ని కాచి వడబోశారు. ‘టాప్ 100 డ్రీమ్స్’ అనే పుస్తకం రాశారు. అందుల్లోంచి మళ్లీ సర్వసాధారణంగా మనకు వచ్చే కొన్ని కలలను ప్రత్యేకంగా వేరు చేసి, వాటికి వాలెస్ చెప్పిన అర్థాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, కలల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కలలు... అర్థాలు * ఎవరో తరుముతున్నట్లుగా వస్తే: లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్ని పరిష్కరించుకోలేక, దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. లేదా ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అదే కలలో మీరు పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా కూడా మీ కాళ్లు మొరాయిస్తూ, మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం. * ఏం చేయాలి? మీలోని జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకోడానికి ఇదొక అవకాశం. మీ శక్తి ఏమిటో గ్రహించి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చెయ్యండి. * నలుగురి మధ్య దిగంబరంగా...: ఇలా కల వస్తే.. మీరు గుర్తింపు కోరుకుంటున్నారని. అది మీకు లభ్యం కావడం లేదని! ఎలాగైనా గుర్తింపు సంపాదించాలని తపిస్తున్నారని. ఏం చేయాలి? ధైర్యం చేయాలి. జనం మధ్యకు రావాలి. చొరవ చూపాలి. మీ శక్తియుక్తుల్ని నిరూపించుకోవాలి. * పరీక్షకు ప్రిపేర్ కానట్లు...: జీవితం విసురుతున్న సవాళ్లను ఎదుర్కొలేనేమో అనే భయం మీలో ఉంది. ఓడిపోతానేమో, నెగ్గుకు రాలేనేమో, వైఫల్యం చెందుతానేమో, పరాజయం పాలౌతానేమో అనే నెగిటివ అలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఈ కలకు అర్థం. * ఏం చేయాలి? మీ నైపుణ్యాన్ని, సామర్థ్యాలను కలిపి విజయసాధనకు కృషి చెయ్యాలి. * దెయ్యాలు: కలలో తరచు దెయ్యాలు కనిపిస్తుంటే కనుక.. జీవితానికి, సమాజానికి మీరు దూరంగా ఉంటున్నట్లు లెక్క. * ఏం చెయ్యాలి? మనుషుల్లో కలవాలి. మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవాలి. * గాలిలో ఎగురుతున్నట్లు: సామాజిక పోకడలకు అనుగుణంగా వెళ్లాలని ఈ కల సూచిస్తోంది. అదే సమయంలో జీవితంలోని సమస్యల విషయంలో ఓపికగా, నేర్పు ప్రద ర్శించాలని చెబుతోంది. * ఏం చెయ్యాలి? మన జీవితం మీద మనం అదుపు సాధించాలి. పట్టువిడుపులతో ఒడుపుగా విజయ శిఖరాలను అందుకోవాలి. * పడిపోయినట్లు: మంచం మీది నుంచి పడిపోయినట్లు కనుక కల వస్తే... నిజ జీవితంలో దేని కోసమో మీరు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారని. ఆ ప్రయత్నం విఫలం కాకూడదని దృఢనిశ్చయంతో ఉన్నారని. ఏం చేయాలి? మీ మీద మీరు నమ్మకం ఉంచండి. జరిగేది జరగనివ్వండి. మీరు చేయదలచుకున్నది చేసేయండి. * పళ్లు రాలిపోతున్నట్లు వస్తే: పళ్లు (దంతాలు) ఆత్మవిశ్వాసానికి, శక్తికి సంకేతాలు. పళ్లు రాలిపోతున్నట్టు కల వస్తే, ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు ఏవో మీ నిజ జీవితంలో జరగబోతున్నాయని అర్థం. * ఏం చేయాలి? జీవితంలో మీరు మార్పు కోరుకుంటున్నారనే దానికి ఈ కల సూచన కావచ్చు. లేదా మీరు పరిష్కరించుకోవలసిన ఒక సమస్యను మీకు గుర్తు చేయడం అంతరార్థం కావచ్చు. సమస్య పరిష్కారం కోసం పాజిటివ్ ఎనర్జీతో ప్రయత్నించండి. * పాములు: పాములు... దాగి ఉన్న భయాలకు చిహ్నాలు. పాములు కలలోకి రావడం అన్నది ఓ హెచ్చరిక కావచ్చు. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేయడం కావచ్చు. * ఏం చేయాలి? భయాలను ధైర్యంగా ఎదుర్కోండి. జీవితంలో ఎదురవుతున్న అవరోధాలను నేర్పుగా తొలగించుకుంటూ ముందుకు వెళ్లండి. * మరణం: జీవితంలో ఊహించని పరిణామాలు ఏవో సంభవించబోతున్నాయనేందుకు చావు కలను ఒక సూచనగా పరిగణించాలి. ఒక ముగింపునకు, ఒక ప్రారంభానికి ఇలాంటి కలలు ప్రతీకలు. * ఏం చేయాలి? మరణానికి సంబంధించిన కలలు ఆత్మపరిశీలనకు, ఎదుగుదలకు సోపానాలు. * అదుపు తప్పిన వాహనాలు: విజయానికి చేరువ చేసే దారిలో మీ ప్రయాణం అదుపు తప్పుతోందని అర్థం కావచ్చు. ప్రస్తుతం ఉన్న ఒక చెడు అలవాటు త్వరలోనే ఒక దీర్ఘ వ్యసనంగా మారబోతోందన్న దానికి ఇదొక సూచన కావచ్చు. * ఏం చేయాలి? రిలాక్స్ అవండి. పట్టు వదలండి. దూకుడు తగ్గించి మీ గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేయండి. ముందే కలగన్నారు! 1. అబ్రహాం లింకన్ తన హత్య గురించి. 2. కార్ల్ జంగ్ ప్రపంచ యుద్ధం గురించి. 3. ప్రిన్సెస్ డయానా తన దుర్మరణం గురించి. 4. ఐన్‌స్టీన్ ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ గురించి. 5. ల్యారీ పేజ్ గూగుల్ ఐడియా గురించి. 6. కొంతమంది అమెరికన్లు 9/11 ఘటన గురించి. సృజనాత్మక స్వప్నాలు (క్రియేటివ్ డ్రీమ్స్) ది స్ట్రేంజ్ కేస్ ఆఫ్ డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హైడ్: రాబర్ట్ లూయీ స్టెవెన్సన్ ఈ పుస్తకాన్ని తనకొచ్చిన కల ఆధారంగా రాశారు! అలా తొలి చిత్తు ప్రతిని కేవలం మూడు రోజుల్లో ఆయన పూర్తి చేశారట. కుబ్లా ఖాన్: సామ్యూల్ టేలర్ కొలెరిడ్జ్.. ఓపియం మత్తులో నిద్రలోకి జారి కనిన కలలోంచి గుర్తు చేసుకున్న సంఘటనల ఆధారంగా కుబ్లా ఖాన్ అనే కవితను రాశారు. టెర్మినేటర్: జేమ్స్ కామెరాన్ జ్వరంలో ఉన్నప్పుడు వచ్చిన కథ ఆధారంగానే టెర్మినేటర్ సినిమా తయారైంది. ఫ్రాంకెయిన్స్టెయిన్: మేరీ షెల్లీ చారిత్రక నవల ఫ్రాంకెయిన్స్టెయిన్ 1816లో ఆమెకు వచ్చిన ఒక కల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఆ పుస్తకం 1818లో పబ్లిష్ అయింది. ట్విలైట్ సీరీస్: 2003 జూన్ 2న స్టెఫీన్ మేయర్‌కి వచ్చిన ఒక కలే, ఆ తర్వాత ‘ట్విలైట్’ సీరీస్‌కి కథాంశం అయింది. కల వచ్చిన మూడు నెలల్లో ఆమె తొలి పుస్తకాన్ని పూర్తి చేశారు. -
తగిన వరుడు
కథలు చెప్పుకుందాం పూర్వం హేలాపురి అనే గ్రామంలో విశ్వగుప్తుడు అనే వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా సంపన్నుడు. బోలెడన్ని ఆస్తిపాస్తులు గడించాడు. అతని ఏకైక కుమార్తె విశ్వరూప. ఆమె గొప్ప అందగత్తె. విశ్వగుప్తుడికి మగ పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆమెను చేసుకున్నవారికే అతని ఆస్తిపాస్తులు దక్కుతాయి. దాంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది వరుస కట్టసాగారు. అయితే విశ్వగుప్తుడు సంపదకు, అంతస్తులకు విలువ ఇచ్చే మనిషి కాదు. అందుకే తన కుమార్తెను కేవలం డబ్బున్నవాడికి కాకుండా... నిజాయితీపరుడికి, స్వయంకృషిని నమ్ముకున్నవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అలాంటి వాడయితే తన కుమార్తెను సుఖపెట్టడమే కాక... తన వార సుడిగా తర్వాత తన వ్యాపారం అతనే చేపట్టి, మరింత బాగా అభివృద్ధి చేస్తాడన్నది విశ్వగుప్తుడి ఆలోచన. ఎట్టకేలకు పెళ్లిళ్లల పేరయ్య ద్వారా అందమైన, తెలివైన ఇద్దరు యువకుల వివరాలు లభించాయి విశ్వగుప్తుడికి. వెంటనే వీరా, ధర్మ అనే ఆ ఇద్దరు యువకులకూ కబురంపాడు. ఆ ఇద్దరూ బాగా చదువుకున్నవారు. చూడటానికి కూడా ఎంతో చక్కగా ఉన్నారు. ఇద్దరినీ రకరకాల ప్రశ్నలు వేశాడు విశ్వగుప్తుడు. అన్నింటిలోనూ సమ ఉజ్జీలుగా ఉన్నారు ఆ ఇద్దరూ. అయితే వారిలో ఎక్కువ సమర్థుడు ఎవరో కనిపెడితే కానీ, విశ్వగుప్తుడు తన కుమార్తెకు పెళ్లి చేయలేడు. కాబట్టి చిట్టచివరగా ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఒకరోజు ఇద్దరినీ పిలిపించి, చెరొక పదివేల రూపాయలూ ఇచ్చి, పట్నం వెళ్లి తన కూతురికి బాగా నచ్చేవి కొనుక్కురండి అని చెప్పాడు విశ్వగుప్తుడు. ఆ డబ్బు తీసుకుని ఇద్దరూ పట్నం బయలుదేరారు. వీరా నేరుగా పట్నం వెళ్లి ఏం కొందామా అని ఆలోచించాడు. సహజంగా ఆడవారికి చీరలపై మక్కువ ఎక్కువ కాబట్టి, అవే కొందామను కున్నాడు. దాంతో పది వేలూ ఖర్చు చేసి విలువైన చీరలు కొనుక్కుని మధ్యాహ్నానికే ఊరికి తిరిగి వచ్చేశాడు. తను తెచ్చిన చీరలు విశ్వగుప్తుడికి చూపించాడు. అతడు సంతోషించాడు కానీ అంతగా తృప్తి కలగలేదు. దాంతో తర్వాత కబురు చేస్తానని చెప్పి పంపేశాడు. ధర్మ ఎప్పుడో చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు. పదివేల రూపాయలతో కొన్న చీరలతో పాటు మరో పదివేల రూపాయల్ని విశ్వగుప్తుడి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయిన విశ్వగుప్తుడు ఆ డబ్బు ఎక్కడిదని అడిగాడు. దాంతో తాను చేసిన పని గురించి చెప్పాడు ధర్మ. అతడు మొదట విశ్వగుప్తుడు ఇచ్చిన డబ్బుతో కొన్ని అందమైన రంగు రంగుల చీరలు కొన్నాడు. సాయంత్రం వరకూ వీధుల్లో తిరిగి వాటిని రెట్టింపు ధరకు అమ్మాడు. తర్వాత పదివేల రూపాయలతో చీరలు కొని ఊరికి తిరిగి వచ్చాడు. తనకు కాబోయే భార్యకు తన డబ్బుతోనే చీరలు కొనాలనిపించిందని, అందుకే అలా చేశానని చెప్పాడు. ధర్మ తెలివి తేటలకు మురిసిపోయాడు విశ్వగుప్తుడు. అతనే తన కుమార్తెకు తగిన వరుడనీ, తన తదనంతరం తన వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేయగల తెలివితేటలు అతనికి సమృద్ధిగా ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. అయినా, ఎందుకయినా మంచిదని కూతురితో వరుడి విషయంలో తాను పెట్టిన పరీక్షను, దానికి వారి స్పందనను వివరించాడు. తన నిర్ణయాన్ని ఆమెకు తెలియజెప్పి, ఆమె అభిప్రాయాన్ని కోరాడు. తండ్రి ఇచ్చిన డబ్బుతో గాక తన సొంత తెలివితేటలతో తన కోసం చీరలు కొని తెచ్చిన ధర్మ ఆమెకు బాగా నచ్చాడు. దాంతో ఆమె తండ్రి నిర్ణయాన్ని మనసులోనే బాగా మెచ్చుకుంది. పైకి మాత్రం ‘‘ నాదేముంది నాన్నా! ఏమి చేసినా మీరు నా మంచి కోసమే చేస్తారు కదా, అయినా మీ ఆలోచన చాలా బాగుంది నాన్నా’’ అంటూ సిగ్గుతో తలవంచుకుంది. కూతురి మనసు కనిపెట్టిన విశ్వగుప్తుడు తన నిర్ణయం సరైనదే అయినందుకు మిక్కిలి సంతోషించాడు. వెంటనే మంచి ముహూర్తం చూసి తన కుమార్తె విశ్వరూపను అతనికిచ్చి వివాహం చేసి, వీరాను తన వద్ద సహాయకునిగా నియమించుకున్నాడు. నీతి: ఒకరిపై ఆధారపడకుండా... తన సొంత తెలివితేటలను, కృషిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ విజయమే లభిస్తుంది. - కృష్ణకార్తీక -
నచ్చిన పది పుస్తకాలు
దీన్ని ‘నాకు నచ్చిన పది పుస్తకాల జాబితా’ అనే కన్నా ‘నాకు నచ్చిన పదిమంది రచయితల పుస్తకాల జాబితా’ అనాలి. తెలుగు నుంచి ఐదుగురూ, ఇంగ్లీషు నుంచి ఐదుగురూ ఉండేలా ఈ ఎంపిక చేశాను. త్రిపుర ‘కథలు’: పాఠకుణ్ని ఇంత చేరువగా తీసుకుని కథలు చెప్పిన రచయిత తెలుగులో మరెవరూ నాకు తగల్లేదు. ఎంత చేరువగా అంటే, పాఠకునితో తనకు ఒక ఇంటిమేట్ షేర్డ్ పాస్ట్ ఉన్నట్టు భుజం మీద చెయ్యేసి, కాబట్టి అన్నీ వివరించి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు గుసగుసగా గొణుగుతూ చెప్పే కథలవి. సోకాల్డ్ మహారచయితలెందరో రచనా సర్వస్వాలే రాసి సంపాదించుకోలేని గొంతు త్రిపుర ఈ కొన్ని కథల్లో సాధించుకున్నారు. కథల్లో నాకు బాగా నచ్చినవి ఈ క్రమంలో: ‘చీకటి గదులు’, ‘జర్కన్’, ‘ప్రయాణికులు’, ‘గొలుసులు -చాపం- విడుదల భావం’. పెద్దగా నచ్చని, త్రిపురతనం లేవని అనిపించే కథలు: ‘వలసపక్షుల గానం’ (సగం కథ కాఫ్కా అనువాదం), ‘హోటల్లో’, ‘సుబ్బారాయుడి రహస్య జీవితం’. అలాగే కొన్ని ఇంటర్వ్యూల్లో త్రిపుర చెప్పిందాన్ని బట్టి కాఫ్కాని నేనెందుకు ఇష్టపడతానో అందుకే ఇష్టపడిన మనిషి ఆయనే అనిపిస్తుంది. ఆయన ఆమోదముద్ర చూసింతర్వాతనే ఇ్ఛజ్ఛీ, ఓ్ఛటౌఠ్చఛి లాంటి రచయితల్ని పరిచయం చేసుకున్నాను. వీలుండీ ఆయన్ని కలవలేకపోవటం ఒక పెద్ద లిటరరీ రిగ్రెట్. చలం ‘అమీనా’: చలం కథకునిగా కన్నా కూడా వ్యక్తిగా ఎక్కువ ఇష్టం. అయితే, చలంలోని కథకుడు నాకు బాగా నచ్చిన చోటు మాత్రం ‘అమీనా’నే. పైన ‘పాఠకుణ్ని చేరువగా తీసుకుని కథ చెప్పడం’ అన్నానుగా- అది చలం ఈ రచనలో చేసినట్టు ఎక్కడా చేయలేదు. ఇక్కడ చలం మొపాసా కాదు, డీహెచ్ లారెన్సు కాదు, ఠాగూరూ కాదు; ఇక్కడ చలం చలమే! ఈ పుస్తకం గురించి బ్లాగులో రాశాను.http://loveforletters.blogspot.in/2011/05/blog-post_06.html. శ్రీపాద ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’: I like it for its poetry, music & language. నాకాయన అభిప్రాయాలూ అవీ పెద్దగా ఏం పట్టలేదు. ఇందులో కనపడిన జీవితం నచ్చింది. ఆ జీవితాన్ని చెప్పటంలో ఆయన భాష నచ్చింది. కామా తర్వాత కామాకి ఒక్కో పైసంగతి వేస్తూ ఆయన వాక్యాన్ని సంగీతమయంగా సాగించే పద్ధతి బాగుంటుంది. తెన్నేటి సూరి ‘చంఘిజ్ ఖాన్’: ఈ పుస్తకం పట్ల నాకున్నది సెంటిమెంటల్ వాల్యూ అని చెప్పాలేమో. అమ్మకి ఏదో ఊరు బదిలీ అయినప్పుడు ఈ పుస్తకాన్ని లైబ్రరీ డిపాజిట్ వదిలేసి దగ్గర ఉంచేసుకుంది. నాకు ఊహ తెలిసినప్పణ్నించీ ఇంట్లోనే ఉంది. చాలాసార్లు చదివాను. ‘సూటూ బోడ్గా బట్ టెంగ్రీ టెమూజిన్ ఖాఖాన్’ అని అరుస్తూ, కత్తి ఒర (మొలతాడు) లోంచి తాతయ్య పడక్కుర్చీ కర్ర బయటకు లాగి, పోలోమంటూ వెళ్లి ఏ బియ్యంబస్తా మీదో, కొబ్బరిమాను మీదో పడి కత్తిపోట్లు పొడవటం లాంటి ఎన్నో హీరోయిక్ డీడ్స్‌కి కావాల్సిన ఇమేజినేషన్ని మెదడులో నింపిందీ పుస్తకం. నామిని ‘నా కుశల నా మనేద’: The whole of Namini is the perfect sum of his writings. అంతగా సాహిత్యానికి తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఈ ‘నా కుశల నా మనేద’ అనేది వైకుంఠం గీసిన ముఖచిత్రంతో ఇటీవల వెలువడిన ఎడిషన్‌లో కొత్తగా చేర్చిన రచన. ఐ్ట’ట ్చ ౌజ ఝఠటజీజ ౌఠ్ఛిట ఛ్ఛ్చ్టీజి. మిగతా నామిని రచనలన్నీ చిన్న నిడివిగల ప్రదర్శనలు (నవలల్ని మినహాయించి). కానీ దాదాపు యాభై పేజీల ఈ రచన మాత్రం ఒక శాక్సాఫోన్ ఆర్టిస్టు ఒకే ఎమోషనల్ కంటెంటును ఎక్కడా తడబాటు లేకుండా, ఎక్కడా సాగదీసినట్టు అనిపించకుండా పలికించిన పాటలాగా భలే సాగుతుంది. ఓ్చజజ్చు ఈజ్చీటజ్ఛీట: నేనీ పుస్తకాన్ని దొబ్బుకొచ్చాను, కానీ ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. ప్రపంచపు ప్రాణమయ సారాంశానికి మన జీవితాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో చెప్పిన పుస్తకం; సాహిత్యాన్ని ఎంత దగ్గరగా తీసుకెళ్లచ్చో కూడా చెప్పిన పుస్తకం. ఈ పుస్తకాన్ని వరుసగా చదవక్కర్లేదు. పూర్తిగా కూడా చదవక్కర్లేదు. మనలో కాఫ్కా అంశ ఏదైనా ఉంటే అదే ఖాళీల్ని పూరించుకుంటుంది, మిగతాది తనకు తానే రాసుకుంటుంది. Flaubert 'Sentimental Education': ‘‘నా తరం మనుషుల మోరల్ హిస్టరీ రాయాలనుకున్నాను’ అని చెప్పుకున్నాడు ఫ్లాబె ఈ రచన గురించి. నా వరకూ ఇది నా ఆత్మ తాలూకు రొమాంటిక్ హిస్టరీ అనిపిస్తుంది. ‘దీవిలో ఒంటరిగా చిక్కుబడిపోతే దగ్గరుండాలనుకునే పుస్తకాల జాబితా’ అంటారు కదా, అలా రెండే పుస్తకాలు పట్టుకెళ్లే వీలుంటే ‘కాఫ్కా డైరీ’లతో పాటూ ఈ పుస్తకాన్నీ తీసుకువెళ్తాను. ఎందుకంటే, ఫ్లాబె ఈ పుస్తకాన్ని ఎలాగో జీవితమంత సంక్లిష్టంగానూ నిర్మించగలిగాడు. పుస్తకంలో ఎన్నో మూలల్ని అలా చదివి వదిలేయక పట్టి ఊహించుకుంటే ఇంకెన్నో కథలు ఆవిష్కృతమవుతాయి. Borges 'Selected Nonfiction': జీవితమనేది కాఫ్కాకి రాయటం కోసం ఒక సాకు ఐతే, బోర్హెస్‌కు చదవటం కో ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. ఆయన కాల్పనిక రచనలు కూడా పఠనాజీవితం మధ్యలో పఠనం ఆధారంగానే ఆడుకున్న ఆటల్లాంటివి. Dostoevsky 'Brothers Karamazov': For the sheer feverish absorption it induces in the reader. దేవుడు చచ్చిపోయాడని టెంకిజెల్ల కొట్టినట్టు చెప్పి జీవితపు ఎసెన్సిషయల్ ఏకాకితనానికీ, ఏడ్చే మూలలేనితనానికీ సంసిద్ధపరచిన పుస్తకమిది. ఇవాన్ కరమజవ్ని మనలో గుర్తించటం, లేదా అతన్ని మనమీదకు ఆవహింపజేసుకోవటమూ ఒక శాపం. Salinger 'Franny And Zooey': అమాయకత్వం చేయి వదిలి, కాపట్యపు రద్దీ మధ్య దారి తప్పి దిక్కుతోచక, తిరిగి జ్ఞానరాహిత్యపు సాంత్వన కోసం అంగలార్చే శరణార్థి రచనలు శాలింజర్వి. అలాగే ఆయన వచనాన్ని చదవటం అంటే చెక్కిన వజ్రాన్ని వేళ్ల మధ్య ఎత్తిపట్టుకుని లోపలి ప్రతిఫలిత వర్ణకేళిని చూడటం లాంటిది. ఆయనలోని ఈ రెండు అంశాల పక్వదశ ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఒక పాఠకుని జీవితం కూడా ఈక్వల్‌గా సృజనాత్మకమనీ, స్వయం సమృద్ధమనీ చెప్తుంది బోర్హెస్ నాన్ ఫిక్షన్. మెహెర్ రచయిత -
అభినందనలు.. ధన్యవాదాలు
సాక్షి దినపత్రికలో నాలుగో పేజీలో ప్రచురించే త్రికాలమ్ నాకు ఎంతో ఇష్టమైన శీర్షిక. 26-4-2015 సంచికలో అన్నదాతను ఆదుకోరా! అన్న శీర్షికతో వెలువడిన రచన ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రులనూ అభ్యర్థిస్తూ చేసిన విన్నపంలా నాకు అనిపిం చింది. జాతీయ స్థూల ఉత్పత్తిలో మొదటిది సేవారంగం కాగా, రెండోది పారిశ్రామిక రంగం, మూడో స్థానంలో వ్యవసాయం ఉన్నాయి. అయినా రైతులు దేశంలో దుర్భర స్థితిలో ఉన్నారు. రాజధాని ఢిల్లీలో జరిగిన గజేంద్రసింగ్ ఆత్మహత్య ఇందుకు నిదర్శనం. అలాగే ఒక రాష్ట్రంలో 67 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కూడా దారుణ పరి ణామం. మన నేతలు స్మార్ట్ సిటీలకీ, స్మార్ట్ విలేజ్లకీ ఇచ్చే ప్రాధాన్యం రైతులకు ఇస్తే వారి ఆత్మహత్యలు ఆగుతాయి. రైతు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వా లన్నీ ఈ ఆత్మహత్యలను నివారించాలి. అది వారి బాధ్యత, నైతిక విధి. పదకొండవ పేజీ లో ప్రచురించిన ‘ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు’ ఆ సంచికకే పరిపూర్ణతను తెచ్చింది. కె.ఆర్. వేణుగోపాల్ అభిప్రాయాలు అందులో చదివాం. అంతర్జాతీయ విధివిధానాలు రూపొందించిన వేణుగోపాల్ ఐసీడీఎస్ వంటి చిన్న పథకం చేపట్టడం ఏమిటని మొదట అనుకున్నాం. కానీ ఆయన పుస్తకం వచ్చిన తరువాత ఆ పథకం లోతుపాతులు ఎంతటివో తెలిశాయి. శాసన, చట్ట, కార్యనిర్వాహక వ్యవస్థలు మూడిం టినీ ఆయన అపారంగా గౌరవించారు. ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావిస్తాను. వేణుగోపా ల్ ఒక పని మీద సబ్‌రిజిస్ట్రార్ దగ్గరకు వెళ్లారు. సొంతపని. అయినా అందరికి ఉండే పద్ధ తి ప్రకారమే క్యూలో నిలబడి ఆఫీసర్‌ను గౌరవంగా సంబోధించారు. అదీ ఆయన సం స్కారం. ఇలాంటి మహోన్నతుడి ఇంటర్వ్యూ ప్రచురించినందుకు సాక్షికి ధన్యవాదాలు. - నీలయ్య జ్యోతి హైదరాబాద్ -
సంస్థానాధీశుల శివాలు..
రాజులు, మహారాజులంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మన తాతాతండ్రుల్ని గోచీగుడ్డలతోనైనా బతకనిచ్చారు కాబట్టి. స్వాతంత్య్రం వచ్చే నాటికి మనదేశంలో వందలకొద్దీ సంస్థానాధీశులుండేవాళ్ళు. వాళ్ళు విందులు వినోదాల్లో మునిగితేలుతూ ఎప్పుడైనా బ్రేక్‌టైంలో ప్రజల్ని గురించి ఆలోచించేవాళ్ళు. దివాన్ జర్మణి దాస్ అనే ఆయన పాటియాలా, కపుర్తలా సంస్థానాల్లో మంత్రిగా పని చేసి వాళ్ళను జాగ్రత్తగా గమనించి ‘మహారాజా’ అనే పుస్తకాన్ని రాశారు. ఆయన వ్యాసాల్లో రాస్తే, చలసాని ప్రసాదరావు కథలుగా మార్చి అనువాదం చేశారు. 1977లో ఈ పుస్తకం వచ్చింది. ఇటీవల అనంతపురం పుట్‌పాత్‌పై దొరికింది. తెలుగు పాఠకులు మంచివాళ్ళు. మంచి పుస్తకాలను తూకానికి వేస్తారు. ఈ రాజులబూజులో ఏముందంటే... జునాగడ్ రాజావారైన రసూల్ఖాన్కి కుక్కలంటే ఇష్టం. కేవలం తొమ్మిది వందల కుక్కలను మాత్రమే పెంచేవాడు. వాటిలో రోషనార అనే కుక్కకు ఆయన పెళ్ళి చేయాలనుకున్నాడు. వరుడేమో మంగ్రోల్ రాజావారి కుక్క, దాని పేరు బాబీ. వరుడు రైలు దిగిన వెంటనే గౌరవార్ధం 101 సార్లు తుపాకులు పేల్చారు. 250 కుక్కల సమేతంగా స్వయంగా రాజావారే స్వాగతం పలికారు. పెళ్ళి కోసం మూడు రోజులు సెలవు ప్రకటించారు. 50 వేల మందికి భోజనాలు. పెళ్ళి కవరేజ్ కోసం వందలమంది ఫోటోగ్రాఫర్లు విలేకరులు వచ్చారు. ఇది చూసి ప్రేరణ పొందిన బోలెడంత మంది రాజావార్లు తమ కుక్కలకు కూడా ఇదే రీతిలో కళ్యాణం జరిపించారు. పాటియాలా రాజా యాదవేంద్రవారికి బ్రిటిష్ సైన్యాన్ని ఓడించాలని కోరిక. అది సాధ్యంకాదు కాబట్టి తన సైన్యాన్నే రెండుగా విభజించి సగం సైన్యానికి బ్రిటిష్ యూనిఫాం వేసి ఉత్తుత్తి యుద్ధం చేయించి చిత్తుగా ఓడించారు. భూపేంద్రసింగ్ రాజావారికి క్రికెట్ పిచ్చి. ఒకసారి ఆయన టీం ఇంగ్లండ్ టీంతో ఆడాల్సి వచ్చింది. బ్రిటిష్ ఆటగాళ్ళ చేతిలో ఎలాగూ ఓడిపోతామని తెలిసి ఆయన ఓ ఎత్తు వేశారు. బ్రిటిష్ ఆటగాళ్ళకు తానే ఆతిథ్యమిచ్చాడు. బ్రహ్మాండమైన కానుకలు, రుచికరమైన భోజనం, ఖరీదైన మద్యం, సుందరీమణుల నాట్యంలో ఆటగాళ్ళు రాత్రంతా అలసిపోయి తెల్లారేసరికి ఆటలో ఓడిపోయారు. మనవాళ్ళు రన్ చేయకుండా అవతలవాళ్ళను అవుట్ చేశారు. ఒక రాజావారికి పైజామా బొందు కట్టడానికి, లంగోటి ఎక్కించడానికి పర్మనెంట్ ఆఫీసర్ వుండేవారు. ఇంకొకాయనకు ఐదొందల మంది అంతఃపుర స్త్రీలుండేవారు. ఇలా చాలా విషయాలున్నాయి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే రాచరికాలు రద్దయ్యాక ఈ రాజుల్లో అనేకమంది ప్రభుత్వంలో మంత్రులుగా చేరిపోయారు. ఇప్పటికీ వీరి వారసులు అనేక మంది పార్లమెంట్లో కూచుని చట్టాలు చేస్తున్నారు. జనం గురించి పట్టించుకోకపోవడం వీళ్ళ నుంచి అంటువ్యాధులుగా మన నేతలకు కూడా సోకినట్టుంది.ఈ పుస్తకం ఇప్పుడు బుక్‌స్టాల్స్‌లో దొరికే అవకాశం లేదు. పాత పుస్తకాల షాపులో దొరికితే దొరకొచ్చు. వీలైతే దొరికించుకుని చదవండి. - జి.ఆర్. మహర్షి 9000226618 -
మన సంస్కృతీ సంప్రదాయాలు
వాక్కు సాక్షాత్తూ వాగ్దేవతకు ప్రతిరూపం. మంచిగా, మధురంగా మాట్లాడే వాళ్లకు అందరూ మిత్రులే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ‘మంచిమాట’, ‘తేనెచినుకులు’, ‘దీక్ష’ ‘విదురనీతి కథలు’ వంటి పాఠకాదరణ పొందిన పుస్తక రచయిత విశ్రాంత అధ్యాపకులు సూర్యప్రసాదరావు ఎందరో మహనీయులు చెప్పిన ఎన్నో మంచి మాటలను ఎంతో నేర్పుగా, మరెంతో ఓర్పుగా ఒకచోట గుదిగుచ్చారు. దానికి మకరంద బిందువులు అనే పుస్తక రూపమిచ్చారు. ఈ పుస్తకంలో భగవత్ స్వరూపాన్ని నిర్వచించే సత్యమ్.. శివమ్...సుందరమ్, గృహస్థాశ్రమ ధర్మాన్ని, విశిష్టతను వివరించే మంచిమాటలు, మన సంస్కృతికి మాత్రమే సొంతమైన ‘వందన’ ప్రాధాన్యత, అక్షరార్చన ఆవశ్యకతను ఆవిష్కరించే అక్షరం.. అక్షరాభ్యాసం, అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించే ఓం శాంతిః శాంతిః శాంతిః అనే వ్యాస కుసుమాలు గుబాళించాయి. రాసిన ప్రతిదానినీ ప్రామాణిక మంత్రశ్లోకాలతో సమన్వయం చేశారు రచయిత. మకరంద బిందువులు; పుటలు: 238, వెల రూ. 150; ప్రతులకు: ఎం. సూర్యప్రసారావు, విశ్రాంత అధ్యాపకులు, ఇంటినం. 5-6-18/బి, పాకబండ బజార్, పెట్రోల్ బంక్ వెనక, ఖమ్మం- 507 001. - డి.శ్రీలేఖ -
ఆహా ఏమి కథ!
కథలు దొరకడం లేదు, అయినా కొత్తగా కథలేముంటాయి. అనే మాటలు పరిశ్రమలో తరచూ వింటుంటాం. అలాంటిది యువ నటి నందిత అబ్బురపరచే కథ విన్నారట. అంతేకాదు ఆ కథలో తనకు అవకాశం ఇస్తే పారితోషికం అడగకుండా నటిస్తానని మాటిచ్చేశారట. అయితే ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆమె అలా అనలేదట. నిజానికి ఈ పక్కింటి అమ్మాయి ఇమేజ్ ఉన్న నందిత అట్టకత్తి, ఎదిర్‌నీశ్చల్, ఇదర్కుదానే ఆశై పడ్డాయే బాల కుమారా, ముండాసు పట్టి వంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రతిభ గల నటిగాను పేరు తెచ్చుకున్నారు. గ్లామర్ విషయంలో ససేమిరా హద్దులు దాటను అంటూ తనకంటూ గీత గీసుకున్న నందిత పారితోషికం విషయంలోను పట్టు విడుపులు పాటిస్తున్నారు. అయితే నా షరతులకు మీరు ఓకే అంటే మీరు ఇచ్చేపారితోషికానికి తాను రెడీ అంటున్నారట. ప్రస్తుతం నటనకు అవకాశం ఉన్న పాత్రలను పోషిస్తున్న నందిత ఇటీవల నటుడు కృష్ణతో వానవరాయన్ వల్లవరాయన్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రాజ్మీనన్ ఆమెను కలిసి ఒక కథ చెప్పారట. అది విన్న నందిత చాలా విస్మయం చెందారట. అంతేకాదు ఆ చిత్రంలో నటించే అవకాశం తనకు కల్పిస్తే పారితోషికం కూడా తీసుకోకుండా చేస్తానని చెప్పారట. అంతగా ఆ కథ ఆమెను ఆకట్టుకుందట. స్త్రీ ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని నందితతో తెరకెక్కించడానికి దర్శకుడు రాజ్మీనన్ సిద్ధం అవుతున్నారట. నటకు అవకాశం ఉన్న పాత్రల్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు నందిత. -
రంది: వెలుగు తెప్పించే తెలంగాణ కథలు...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నుంచి స్వతంత్రంగా వెలువడిన తొలి కథా సంకలనం రంది కొన్ని కథలు చదివితే కొన్నిసార్లు వెలుగు వస్తుంది. చీకటిలో ఉన్న కొందరిలో వెలుగు వస్తుంది. వెలుగనేదే చూడని వారిలో వెలుగు వస్తుంది. తెలుగు కథలో తెలంగాణ కథను చాలాకాలం చీకటిలో ఉంచారు. ఆ మాటకొస్తే తెలుగు కథలో మంచి కథకులైన చాలామందిని చాలాకాలంగా చీకటిలోనే ఉంచుతూ వస్తూ ఉన్నారు. రెండు మూడు పేర్లను జపియించి జపియించి తెలుగు కథ అంటే ఈ రెండు మూడు బిందువుల మధ్య తిరుగాడే బంతిగా మలచిన సంగతి సత్యదూరం కాదు. వేలెత్తి చూపకుండా వదలాల్సిన విషయం ఎంత మాత్రమూ కాదు. పూసపాటి కృష్ణంరాజు, భూషణం, అల్లం శేషగిరిరావు, బలివాడ కాంతారావు, రామకోటి వీళ్లను ఎన్నడైనా గానం చేసి ఎరిగామా? కె.ఎన్.వై.పతంజలికి సన్మానాలు జరిపి సంతోషించామా? అద్భుతమైన కథలు రాసిన ఆర్.వసుంధరాదేవి, కల్యాణ సుందరీ జగన్నాథ్‌లకు ఏ పట్టువస్త్రాలు కప్పాము గనక? విశాలాంధ్ర కథ పేరుతో వెలువరించిన బృహత్ కథా సంకలనంలో అత్యుత్తమ తెలుగు కథకుడు సి.రామచంద్రరావుకు చోటు దక్కలేదంటే ఈ చీకటి నిర్మాణం చేసిందెవరు? తెలుగు కథకులు వేరు, ప్రాంతీయ కథకులు వేరు అనే తెలివైన విభజన చేసి ‘మరి రాయలసీమకు వస్తే మధురాంతకం రాజారాం’... అంటూ ఆ గొప్ప రచయితను ఉపశ్రేణిలో ఉంచలేదా? మరో గొప్ప కథకుడు మహేంద్ర మీద ఒక్క వ్యాసమైనా తటస్థించిందా? శారద ఆకలిచావుకు ఎవరు ఏడ్చారని? ఈ పరిస్థితి తెలంగాణకు వచ్చేసరికి ఇంకా అన్యాయంగా మారింది. కనీసం వట్టికోట ఆళ్వారుస్వామి పేరు వినడానికి కూడా సీమాంధ్ర పాఠకులు చాలాకాలం నోచుకోలేదు. నెల్లూరు కేశవస్వామి, భాస్కరభట్ల కృష్ణారావు, ఇల్లిందల సరస్వతీదేవి, పి.యశోదారెడ్డి, గూడూరి సీతారాం... వీళ్ల పేర్లు తలచినవారు సీమాంధ్రలో ఒక్కరు లేరు. ఉద్యమం మొగ్గతొడిగి 2000 సంవత్సరం నుంచి తెలంగాణ సాహితీకారులు పదే పదే చెప్తే తప్ప వీరున్నారు వీరూ ఉన్నారు అని తెలియరాలేదు. ఇక ‘ప్రజల మనిషి’, ‘చిల్లర దేవుళ్లు’, ‘మోదుగుపూలు’, ‘ప్రవాహంలో పూచిక పుల్లలు’ వంటి తెలంగాణ ప్రాంత నవలల ప్రస్తావన ఏమాత్రం జరిగిందని? ఇవన్నీ సహజంగానే అసంతృప్తికి కారణమయ్యాయి. ఉద్యమం వచ్చింది. విభజనా వచ్చింది. ఇక తెలంగాణ కథ స్వతంత్రమయ్యింది. అది ఎవరికీ సామంతం కాదు. ఎవరి మెహర్బానీలూ దానికి అక్కర్లేదు. వేరెవరో గుర్తిస్తే ఏంటి? గుర్తించకపోతే ఏంటి? అది తన పాటికి తాను ఎదుగుతుంది. తన ప్రజల దగ్గరికి వెళుతుంది. తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఈ మొత్తం నేపథ్యం ‘రంది’ కథా సంకలనానికి ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నుంచి స్వతంత్రంగా వెలువడిన తొలి కథా సంకలనం రంది. 2014లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలవారివి మంచి కథలు ఎంచి సంకలనంగా వెలువరించారు. మొత్తం 18 కథలు. ఈ అంకె చూస్తేనే సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్ర రోజుల్లో ఉత్తమ వార్షిక కథా సంకలనాల్లో తెలంగాణ కథల వాటా రెండు మూడు కథలకు మించేది కాదు. ఇప్పుడైనా అన్ని ప్రాంతాల తాకిడిలో ఈ సంఖ్య దాదాపుగా మించబోదు. కనుక తెలంగాణ కథను తెలంగాణ వారు ప్రచురించుకుంటేనే అందరు రచయితలకూ చోటు దొరుకుతుంది. కథ ముందుకు సాగుతుంది. ఇందులోని కథలు దాదాపుగా నిమ్నవర్గాల జీవనాన్ని చూపుతున్నాయి. సంపాదకుల ఎంపిక ఉద్దేశం కూడా అదేగా కనిపిస్తుంది. దళిత, బహుజన, ముస్లిం వర్గాల నుంచి కొత్తగా రాస్తున్నవారినీ కొత్త జీవితాలను చూపుతున్నవారినీ ఎంచి సంకలన పరచడం మెచ్చుకోదగ్గ అంశం. పర్కపెల్లి యాదగిరి (ఉసురు), గాదె వెంకటేశ్ (బత్తెం), చెన్నూరి సుదర్శన్ (ఝాన్సీ హెచ్.ఎం), కవిత.కె (సంగీత), బూతం ముత్యాలు (బుగాడ), మన్నె ఏలియా (మర్రిచెట్టు), డా.కె.నాగేశ్వరాచారి (గద్వాల్జాతర) వంటి కథకులు, కథలు తెలుగు పాఠకలోకానికి ఈ సంకలనం ద్వారా చేరువకావడం- ఇదిగో వీరంతా గట్టిగా రాస్తున్నారు అని తెలియజేయడం చాలా మంచి సంగతి. డా.కాంచనపల్లి వంటి సీనియర్లు రాసిన ‘నాన్న.. ఒక వర్షం రోజు’ వంటి కథలు శిల్పం రీత్యా, వస్తువు రీత్యా తెలంగాణ కథ చేస్తున్న ప్రయోగాలకు తార్కాణం. ఈ సంకలనంలోనే గ్రామీణకళలు కాలక్రమంలో ఎలా అంతరించి పోతున్నాయో వివరిస్తూ డా.పసునూరి రవీందర్ రాసిన ‘పెంజీకటి’ అనే కథ ఉంది. చాలా స్థానికమైన వస్తువును, అట్టడుగు భాషనూ తీసుకుని కథ పేరు మాత్రం ‘పెంజీకటి’ అని పెట్టడం శిల్పదోషం. అంతకు సమానమైన తెలంగాణ పదం పెట్టి ఉంటే బాగుండేది. ఈ సంకలనంలోని సీనియర్ కథకుల కథలు బలమైనవి. చివరి చూపు (కె.వి.నరేందర్), పరాయిగ్రహం (బెజ్జారపు రవీందర్), బిల్లి (షాజహానా), సాహిల్ వస్తాడు (అఫ్సర్), నల్లజెండా (జూపాక సుభద్ర), దారి తెలిసిన వేకువ (బెజ్జారపు వినోద్‌కుమార్), బిందెడు నీళ్లు (పెద్దింటి అశోక్‌కుమార్), బిడ్డ పురిటికొచ్చింది (హనీఫ్), అంటు (స్కైబాబ) తెలంగాణలోని విస్తృత శ్రేణుల విభిన్న పార్శ్వాలను పట్టి ఇస్తాయి. అయితే పెద్దింటి అశోక్‌కుమార్ ‘బిందెడు నీళ్లు’ కథ చదివితే ఆ నాటకీయతకు ఈ రచయిత నాటకాలు రాస్తే ఇంకా గొప్పగా ఉంటుంది కదా అనిపిస్తుంది. సంకలనంలో ప్రతి రచయిత పరిచయమూ ఇచ్చారు. కాని ఒక సూత్రం అంటూ పాటించకపోవడం వల్ల కొందరి గురించి చాలా విపులంగా కొందరి గురించి అతి క్లుప్తంగా ఉంది. కె.వి.నరేందర్, అఫ్సర్, బెజ్జారపు రవీందర్, వినోద్‌కుమార్‌ల పరిచయాలు మూడు ముక్కల్లో ముగించేంత చిన్నవైతే కాదు. అలాగే ప్రతి రచయితా ఉద్యమసమయంలో ఏమేమీ పోరాటాలు చేశారో వివరించారు. అంటే ఉద్యమంలో ఏ కారణం చేతనైనా పాల్గొనక నిశ్శబ్ద మద్దతు తెలిపినా లేదా ‘సాహిత్యం కొరకే సాహిత్యం’ అని ఊరుకున్నా ఈ సంకలనంలో చోటు ఉండదా అనే సందేహం వస్తోంది. ఏమైనా ముందే చెప్పినట్టు ఇవి చీకటిని ఛిద్రం చేసే కథలు. తెలుగుకథలో కొత్త వెలుతురు నింపే కథలు. రంది- తెలంగాణ కత 2013 ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ప్రచురణ; సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ; వెల- రూ.60; ప్రతులకు: 9849220321 -
నా పాట విని వాళ్లిద్దరూ కలిశారట!
సంభాషణం చూడగానే ఆమె ఆహార్యం ఆకట్టుకుంటుంది. గొంతు విప్పి పాడిందంటే మనసు ఆమెకు దాసోహమంటుంది. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న ఆమె... రెనినారెడ్డి. రెక్కలు తొడిగిన పక్షల్లే (కరెంట్), బంతిపూల జానకీ జానకీ (బాద్షా), మాటే రాని మౌనం (రౌద్రం), మీ ఇంటికి ముందు (జులాయి) వంటి పాటలతో సంగీత ప్రియుల మనసులు దోచిన రెనినా తన గురించి, తన కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... తెలుగువారై ఉండీ, తమిళంలో ఎక్కువ పాడతారెందుకు? నేను తెలుగమ్మాయినే కానీ, బెంగళూరులో పుట్టి పెరిగాను. అయితే కన్నడ పరిశ్రమలో అవకాశాలు అంతంతమాత్రం. అందుకే చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. అవకాశాలు అందిపుచ్చుకున్నాను. తర్వాతే తెలుగులో పాడాను. అందుకే తమిళంలో ఎక్కువ పాడుతుంటాను. పాటతో పరిచయం ఎప్పటి నుంచి? నాన్న సి.ఎం.స్వామి క్లాసికల్ సింగర్, కంపోజర్. నాటకాలకు దర్శకత్వం కూడా వహించేవారు. అమ్మ కూడా మంచి గాయని. దాంతో చిన్నప్పుడే సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. పెద్దయ్యాక సింగర్ అవ్వాలని అప్పుడే ఫిక్సైపోయాను. ఇప్పటి వరకూ ఏయే భాషల్లో పాడారు? నచ్చిన పాట ఏది? తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, కొంకణి భాషల్లో పాడాను. రౌద్రం చిత్రంలోని ‘మాటే రాని మౌనం’ నేను పాడిన వాటిలో నాకు చాలా నచ్చిన పాట. మర్చిపోలేని ప్రశంస? చాలా వస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్బుక్లో చాలామంది పొగుడుతుంటారు. ఒక వ్యక్తి అయితే నా పుట్టినరోజుకి రక్తదానం కూడా చేశారు. మరోసారి అయితే ఇద్దరు దంపతులు నన్ను కాంటాక్ట్ చేశారు. వాళ్లిద్దరికీ చాన్నాళ్లుగా గొడవలట. విడాకులు తీసుకునే వరకూ వెళ్లారట. కానీ నేను పాడిన ‘మాటే రాని మౌనం’ విన్న తర్వాత ఇద్దరూ కదిలిపోయారట. ఆలోచించడం మొదలుపెట్టారట. మీ పాట వల్ల మా పొరపొచ్చాలు పోయాయి, మేం హ్యాపీగా ఉన్నాం అని వాళ్లు చెప్తుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కోయంబత్తూరుకు చెందిన ఒక వ్యక్తి అయితే... తన పార్లర్‌కి నా పేరు, పార్లర్లో నా ఫొటో పెట్టుకున్నాడట. ఇంతకంటే కాంప్లిమెంట్స్ ఉంటాయా అసలు! విసిగించిన ఫ్యాన్ ఎవరైనా ఉన్నారా? నేను ఫేస్బుక్లో అందరి మెసేజ్లకీ సమాధానాలు ఇస్తాను... ఎంతో అభిమానంతో ఇస్తారు కదా అని! కెనడాలో ఉన్న ఓ అబ్బాయికీ అలానే ఇచ్చాను. అయితే ఓసారి స్విట్జర్లాండులో నా షో ఉందని తెలిసి తనూ వస్తానన్నాడు. నా కోసమే అయితే వద్దు, కెనడా వచ్చినప్పుడు నేనే కలుస్తాను అన్నాను. వెంటనే అతడు ఏవేవో పిచ్చి మెసేజులు మొదలుపెట్టాడు. దాంతో బ్లాక్ చేసి పారేశాను. కానీ ఓసారి శ్రీలంకలో కాన్సర్ట్కి వెళ్తే సడెన్‌గా వచ్చి చేయి పట్టుకున్నాడు. ఏదేదో మాట్లాడాడు. దేవుడి దయవల్ల తప్పించుకున్నాను. అతను గుర్తొస్తే ఇప్పటికీ చెమటలు పోస్తాయి నాకు! మనసు గెలుచుకున్నవారెవరూ లేరా? ఇంకా లేదు. మంచివాడు, నిజాయతీపరుడు, నన్నూ నా ప్రొఫెషన్నీ అర్థం చేసుకున్నవాడు దొరికితే మనసులో చోటిస్తా. అంతవరకూ పాటనే ప్రేమిస్తా! మీరు ఆహార్యం పట్ల కూడా చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు కనిపిస్తారు... నిజం చెప్పొద్దూ... నాకు మొదట్నుంచీ గ్లామర్ మీద శ్రద్ధ కాస్త ఎక్కువే. షోలు ఉన్నప్పుడు దుస్తులు డిజైన్ చేయించుకుంటాను. హెయిర్ స్టయిల్, మేకప్ మీద చాలా శ్రద్ధ పెడతాను. పాటలు వినాలంటే సీడీలో అయినా వింటారు కదా! కాన్సర్ట్కి వస్తున్నారు అంటే మనల్ని చూడ్డానికే వస్తారు. కాబట్టి వారి కళ్లకు అందంగా కనిపించాలి అన్నది నా ఉద్దేశం. మీ గ్లామర్ చూసి నటించమని ఎవరూ అడగలేదా? నాకైతే ఇష్టమే. కానీ నాన్నగారే ఒప్పుకోవడం లేదు. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా వదిలేశాను. కానీ ‘గజినీ’లో అసిన్ చేసిన రోల్ లాంటిది దొరికితే నాన్నను ఒప్పించి నటించేస్తాను. ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తోన్న కోరికేదైనా ఉందా? ఇళయరాజా దగ్గర ఇంకా పాడలేదు. ఆ చాన్స కోసం చూస్తున్నాను. రెహమాన్‌తో పని చేసే చాన్స్ వచ్చినా తీరిక లేక మూడు నాలుగుసార్లు మిస్ అయ్యాను. ‘కడలి’ తెలుగు వెర్షన్లో పాడాను కానీ ఇంకా ఆయనతో పని చేయాలనుంది. భవిష్యత్ ప్రణాళికలు...? ప్రైవేట్ ఆల్బమ్స్ చేయాలని ఉంది. కానీ విదేశాల్లో మాదిరిగా మన మార్కెట్లో ప్రైవేట్ ఆల్బమ్స్ నిలబడటం లేదు. సంగీతమంటే సినిమా సంగీతమే అన్న పరిస్థితి వచ్చింది. నిజానికి సినిమా పాటలు దర్శకుడికి, నిర్మాతకి నచ్చినట్టుగా చేస్తారు. అదే ప్రైవేట్ ఆల్బమ్‌కి అయితే, ఆ సంగీతం మనసులోంచి వస్తుంది. కాబట్టి కచ్చితంగా గొప్పగా ఉంటుంది. అయితే మన దగ్గర వాటికి పెద్ద ఆదరణ, మార్కెట్ రెండూ లేవు. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? మన సంగీతానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించాలి. మనం పాశ్చాత్య సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. మరి మన సంగీతాన్ని వాళ్లకూ రుచి చూపించాలి కదా! వాళ్లు అక్కడ కొన్ని రాగాలను మాత్రమే వాడతారు. కానీ మనకు కొన్ని వేల రాగాలున్నాయి. వాటన్నికీ వారికి పరిచయం చేయాలి. భారతీయ సంగీత విశిష్టతను ప్రపంచమంతా చాటాలి. ఇది చిన్న విషయం కాదని నాకు తెలుసు. అయితే నాలాంటి కొందరు చేతులు కలిపితే ఆ రోజు ఎప్పటికైనా వస్తుంది అని నా నమ్మకం! - సమీర నేలపూడి -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి... పూర్వఖండం, రెండు... ఉత్తర ఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
నేనసలు అద్దమే చూడను...
అంతర్వీక్షణం ఏ రంగంలో స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? అలాంటిదేమీ అనుకోలేదు, రచయితగా స్థిరపడడం కూడా అనుకోకుండా జరిగిపోయింది. అలాగే ఫలానా ప్రదేశంలోనే స్థిరపడాలనే ఆలోచనలు అప్పట్లో పెద్దగా ఉండేవి కాదు. ఇప్పటికి ఎన్ని నవలలు, కథలు రాసి ఉండవచ్చు? 150 నవలలు, మూడు వేలకు పైగా కథలు. మీ రచనల్లో మీకు అత్యంత ఇష్టమైనవి? రెండు రెళ్లు ఆరు, చంటబ్బాయి, విధాత ఏదైనా ఒక పాత్రను మలిచిన తర్వాత కొన్నాళ్లకు ఆ పాత్రను మరోలా రూపొందించి ఉండాల్సింది అనుకున్న సందర్భం ఉందా? లేదు. రచన మొదలు పెట్టే ముందే సమగ్రమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మొదలు పెట్టాక మార్చకూడదు. నాకెప్పుడూ మార్చాల్సిన అవసరం కూడా రాలేదు. మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు? ఏ రకంగా ప్రభావం చూపారు? కొమ్మూరి సాంబశివరావు గారు. ఆయన రచనలే నాకు స్ఫూర్తి. ఆయన లేకపోతే మల్లాది వెంకట కృష్ణ మూర్తి ఉండేవాడు కాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు... అమ్మ ఒడిలోకి పయనం, ఒక యోగి ఆత్మకథ. ఇన్నేళ్లుగా ఎన్నడూ మీ ఫొటో ప్రచురించడానికి ఇష్టపడకపోవడానికి ప్రత్యేక కారణం ఉందా? నాలో కీర్తి కాంక్ష కొద్దిగా కూడా లేదు. ఫొటోలు తీసుకుని చూసుకోవాలనే కోరిక కూడా లేదు. నా జీవితంలో తీసుకున్న ఫొటోలు బస్ పాసు, పాస్ పోర్టు, స్కూలు రికార్డుల కోసమే. మీ అభిమాన పాఠకులలో ఒకరి పేరు చెప్తారా? వైజాగ్ నుంచి ఎం. ఎన్. దేవి అనే పాఠకురాలు, తాడేపల్లి గూడెం నుంచి రాము అనే పాఠకుడు క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తుండే వారు. ఎలాంటి విషయాలకు భయపడతారు? ఒక సాధారణమైన మనిషికి ఉండే భయాలన్నీ నాకూ ఉన్నాయి. పామును చూసి భయపడడం మా నాన్నగారి నుంచి వారసత్వంగా వచ్చినట్లుంది. ఆధ్యాత్మిక మార్గంలో తరచూ పాములుండే ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో ఇప్పుడా భయం పోయింది. అబద్ధం చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు? ఒకప్పుడు స్వీయరక్షణ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసే వాడిని. ఆధ్యాత్మికంలో సత్యానికి దగ్గరగా ఉండడాన్ని సాధన చేయడం మొదలు పెట్టిన తర్వాత పూర్తిగా మానేశాను. అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు? నేనసలు అద్దమే చూడను. తల దువ్వడానికి కూడా చూడను. షేవింగ్ సమయంలో కూడా చెంపల మీదే తప్ప ముఖం మీద నా దృష్టి పడదు. మీరు ఎన్నడైనా మీ శ్రీమతిని క్షమాపణ అడగాల్సి వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. కానీ గతంలో మగాడిననే అహంతో క్షమాపణ చెప్పేవాడిని కాదు. ఇప్పుడు చెప్తున్నాను. శ్రీమతికే కాదు బయటి వాళ్లకు కూడా గతంలో వాళ్లకు కలిగించిన అసౌకర్యాలను గుర్తు చేసుకుని మరీ క్షమాపణ చెప్తున్నాను. పిల్లల గురించి... నాకు ముగ్గురమ్మాయిలు. పెద్దమ్మాయి కావ్య అమెరికాలోని హ్యూస్టన్‌లో, రెండో అమ్మాయి ఊహ ఇండియానాపోలిస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో అమ్మాయి లిపి... విచిటా స్టేట్ యూనివర్శిటీలో ఎం.ఎస్ చేస్తోంది. ఈ తరాన్ని చూస్తే ఏమనిపిస్తుంటుంది? సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటున్నారు. వారి కారణంగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగితే దానికి కనీసంగా కూడా స్పందించడం లేదు. పొరపాటు జరిగిందనే భావన మనసులోకే రానివ్వడం లేదు. ఆ ధోరణి మారాలి. మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఉందా? జీవితం నిండా అవే ఉన్నాయి. సంస్కరించుకునే ప్రయత్నం జరిగిందా? జరిగింది. అందులో భాగంగానే మద్యం, మాంసం,మగువల జోలికెళ్లడం పూర్తిగా మానేశాను. దేవుడు ప్రత్యక్షమై ‘నీ జీవితంలో ఒక్కరోజే ఉంద’ంటే.. మీ చివరి కోరిక..? మోక్ష సాధన కోసం ఏమేమి చేయాలో ఆ దేవుణ్ణే అడిగి, ఆయన చెప్పినట్లు చేస్తాను. - వాకా మంజులారెడ్డి -
లక లక లక...అదిగో డ్రాకులా!
పరిశోధన నిజజీవిత డ్రాకులా అని ప్రపంచవ్యాప్తంగా దుష్కీర్తి గడించిన ‘ప్రిన్స్ ఆఫ్ రొమేనియా’ వ్లాడ్ గురించి ఒళ్లు జలదరించే కథలు ప్రచారంలో ఉన్నాయి. రొట్టెను రక్తంలో ముంచుకొని తినేవాడు. స్నేహితులతో కలిసి రక్తపు విందులలో పాల్గొనేవాడు... ఇలా చెప్పుకుంటే పోతే నిజజీవిత డ్రాకులా వ్లాడ్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో భయానక విషయాలు ఉన్నాయి. రకరకాల ఎత్తులు వేస్తూ, తన రాక్షసత్వాన్ని చాటుకోవడం అంటే వ్లాడ్‌కు ఇష్టంగా ఉండేది. వ్లాడ్ పేరు వింటేనే ప్రజలు గడగడలాడేవారు. 1476లో టర్కీయులతో జరిగిన ఒక యుద్ధంలో వ్లాడ్ కనిపించకుండా పోయాడు. అతని అదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. చనిపోయాడు అని కొందరంటే కాదు అజ్ఞాతంలో ఉన్నాడని కొందరు, శత్రువుల చెరలో ఉన్నాడని కొందరు అన్నారు. ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. యుద్ధం జరిగిన ప్రదేశంపై కూడా చర్చ జరిగింది. రొమేనియాలోని పర్వతప్రాంతమైన ట్రాన్స్వేలేనియాలో జరిగిందని కొందరు అంటే, ‘కానే కాదు’ అంటూ దీనికి భిన్నమైన వాదనలు వినిపించాయి. యుద్ధం ఎక్కడ జరిగింది? వ్లాడ్ ఎలా చనిపోయాడనేది పక్కన పెడితే తాజా పరిశోధనలో కొత్త విషయం ఒకటి బయట పడింది. ‘‘వ్లాడ్ను యుద్ధఖైదీగా ఇటలీకి తీసుకువెళ్లారు. ఆ తరువాత నోపెల్ నగరంలోని ఒక చర్చిలో పాతి పెట్టారు. దీనికి సంబంధించిన ఆధారాలు సంపాదించాం’’ అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ టాలిన్ (రిపబ్లిక్ ఆఫ్ ఇస్టోనియా)కు చెందిన పరిశోధకులు. సమాధిపై చెక్కబడిన డ్రాకులా బొమ్మతో సహా ‘‘ఇది వ్లాడ్ సమాధి’’ అని చెప్ప దగ్గ ఆధారాలు పరిశోధకులకు లభించాయి. సమాధిపై మరిన్ని పరిశోధనలు జరపడానికి అధికారిక అనుమతి కోసం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అనుమతి లభిస్తే కీలకమైన వివరాలు తెలిసే అవకాశం ఉంది. -
ఒక మంచి అనువాద నవల- అసురుడు
విజేతల గొంతు బలంగా, గర్వంగా, అతిశయంగా ఉంటుంది. వాళ్ల కథలు రాయడానికి, వినిపించడానికి కవులు, కథకులు బారులు తీరి ఉంటారు. గాయకులు, భజంత్రీలు, వందిమాగదులు సర్వదా విజేతల వెంట సిద్ధం. పరాజితుల గొంతు బలహీనంగా, దుఃఖంతో పెరపెరలాడుతూ ఉంటుంది. వాళ్ల కథలు ఎవరూ రాయరు. వాళ్లే రాసుకోవాలి. ‘అసురుడు’ నవల పరాజితుల గాథ. యుద్ధభూమిలో నిస్సహాయుడై ఎలుకలు తన కండరాలను నములుతుండగా మృత్యువు దేహంపై పురుగులా పారాడుతుండగా రావణుడు ఈ కథ చెబుతాడు. ఇది రావణుడి కథే కాదు. భద్రుడి కథ కూడా. భద్రుడు ఒక సామాన్యుడు. అనామకుడు. సాదాసీదా రైతు. భార్యాబిడ్డలతో పొలంలో పని చేసేవాడు. వర్షమొస్తే ఆనందంతో తడిసి, పంట పండితే ధాన్యపు బస్తాను బిడ్డను మోసుకొచ్చినట్టు మోసుకొచ్చే అమాయక రైతు. తాతలు తండ్రులలాగే కడుపు నింపుకోవడమే ఆశయంగా బతికే మామూలు మనిషి. అతనికి రాజ్యం తెలియదు. రాజులు తెలియరు. కానీ రాజ్యం ఎవరినీ అంత సులభంగా బతకనీయదు. ఎక్కడో మొదలైందనుకున్న యుద్ధం భద్రుడి నట్టింటికి వచ్చింది. రక్తపు మడుగులో భార్యాబిడ్డలు... అగ్నిజ్వాలల్లో ఇల్లు. పారిపోయాడు. కానీ ఎక్కడో ఒకచోట బతకాలి గదా. రావణుడి దగ్గర చేరాడు. రామాయణం మనకు కొత్తకాదు. రావణుడి వైపు నించి కథ వినడమే కొత్త. కూతురు సీత కొత్త. కూతురు సీత కోసం అతను పడిన క్షోభ కొత్త. అన్ని కాలాల్లోనూ మనుషుల అకారణ ప్రేమ అపవాదులకు దారి తీస్తుంది. అందుకే అతను నిందలు మోశాడు. ఈ కథలో మాయలు, అద్భుతాలు లేవు. అందరూ సాధారణ మనుషులే. పేదరికం నుంచి, అవమానాల నుంచి ఒక రాజుగా రావణుడు ఎదిగిన తీరు, కుట్రలు కుతంత్రాలను ఎదుర్కొని పొందిన తీరు అబ్బురపరుస్తాయి. రావణుడి గురించైనా మనకు ఎంతో కొంత తెలుసు. భద్రుడి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే అతను పేదవాడు. తక్కువ కులం వాడు. అణగారిన వర్గాల సాహసం, శౌర్యం ఎవరికి గుర్తుంటాయి. యుద్ధంలో సామాన్యల ప్రాణదానాన్ని లిఖించేదెవరు. ఎంతో సాహసంతో రావణున్ని కాపాడితే కాసింత కృతజ్ఞత కూడా చూపడు. ఎందుకంటే భద్రుడు ఒక సేవకుడు. సైనికుడు. చరిత్ర పొరల్లో పూడికలో కలిసి పోవాల్సినవాడు. అతనికో పేరు, ఊరు ఉండాల్సిన అవసరం లేదు. రావణుడు రాజ్యం కోసం పోరాడితే భద్రుడు ఆత్మగౌరవ ప్రకటన కోసం పోరాడాడు. శతాబ్దాలుగా భద్రుడు రకరకాల మనుషులగా రూపాంతరం చెంది పోరాడుతూనే ఉన్నాడు. భద్రుడికి కృతజ్ఞత చూపే సంస్కారాన్ని ఇంకా రావణుడు అలవరచుకోలేదు. 464 పేజీల ఈ పుస్తకాన్ని మొదలుపెడితే ఆపలేం. ఇంగ్లిష్‌లో ఆనంద్ నీలకంఠన్ రాశారు. తెలుగులో ఆర్.శాంతసుందరి అనువాదం చేశారు. మూలంలోనే ఇంత బలముందా లేక అనువాదంలోనే బలముందా అనేంత గొప్పగా ఉంది. తెలుగులో ఇలాంటివి కనిపించవు. తెలుగు నవల ఆత్మహత్య చేసుకోవడానికి రచయితలే కారణం. నానా చెత్త రాయడంలో అది జబ్బు పడి మందులు మింగలేక ఉరిపోసుకుంది. ఈ పుస్తకం చదివితే నవల ఎలా రాయాలో తెలుస్తుంది. - జి.ఆర్.మహర్షి అసురుడు- ఆనంద్ నీలకంఠన్, అనువాదం: ఆర్.శాంత సుందరి ధర: 250, అన్ని పుస్తక కేంద్రాల్లో లభ్యం -
అమ్మకానికి దెయ్యాల దీవి
హారర్ దెయ్యాల గురించి ఎన్ని కథలు ఉన్నాయో, దెయ్యాల దీవిగా ప్రసిద్ధి చెందిన పోవెగ్లియా(ఇటలీ) గురించి అంతకంటే ఎక్కువ కథలు ఉన్నాయి. అయిదు భవంతులు ఉన్న ఈ దీవిలో సేద తీరడాన్ని ఒకప్పుడు గొప్పగా భావించేవాళ్లు. ఒకానొక కాలంలో ఇటలీలో ప్లేగ్ మహమ్మారి విజృంభించింది. ప్లేగ్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి, ప్లేగ్ సోకిన వారిని పోవెగ్లియా దీవిలో వదిలింది ఇటలీ ప్రభుత్వం. ఆ దీవిలో చాలామంది దిక్కూమొక్కూ లేకుండా చనిపోయారు. అలా చనిపోయిన వారు దెయ్యాలుగా మారి ప్రతీకారం, కోపంతో తిరుగుతున్నారనే వార్తలు వ్యాపించాయి. అది నిజమే అనుకునేలా కొందరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. నిజం ఎంతో తెలుసుకుందామనుకొని దీవికి వెళ్లిన వాళ్ల అడ్రస్ గల్లంతయింది. ఈ దీవిలో ఒక ఆస్పత్రి ఉంది. ఈ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఒకరు దెయ్యాల గురించి రకరకాల పరిశోధనలు చేసేవాడట. ఈ క్రమంలో దెయ్యాల ఆగ్రహానికి గురై, మతిచలించి మేడ మీది నుంచి దూకి ఆత్మహత్మ చేసుకున్నాడట. దెయ్యాల ఉనికి...పుకారా? నిజమా? అనుకునే రోజుల్లో ఒక అమెరికన్ టీవి ప్రెజెంటర్ ఈ దీవికి వెళ్లి ఒక కార్యక్రమం చేశాడు. దెయ్యాలు ఉన్నట్లు గట్టిగా నిర్ధారించాడు. ఈ దీవి గురించి ఎన్నో పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రభుత్వం ఈ దీవికి రాకపోకలను నిషేధించింది. తాజా ఖబర్ ఏమిటంటే, తన ఖర్చుల కోసం ప్రభుత్వం ఈ దీవిని అమ్మకానికి సిద్ధం చేసింది. కొనే ధైర్యవంతులు ఎవరో మరి! -
కథ కంచి నుంచి తిరిగొస్తుంది...
వెన్నెల రాత్రిలో అమ్మమ్మ కథ మొదలు పెడుతుంది.... ‘‘అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు ఏడుగురు కుమారులు...’’ పిల్లలు ఆరు బయట కూర్చున్నట్లే కనిపిస్తున్నారుగానీ, వారు రాకుమారులతో పాటు వేటకు వెళ్లారు. వస్తూ వస్తూ చేపలు తెచ్చారు. ‘‘చేప... చేప ఎందుకు ఎండలేదు?’’ అని అడిగారు. చేప సమాధానాలు సావధానంగా విన్నారు... ‘చేప...చేప ఎందుకు ఎండలేదు?’ అని అడిగితే ఆ చేప ఎన్ని కారణాలు చెప్పిందో ‘కథ...కథ...ఎందుకు వినిపించడం లేదు?’ అని అడిగితే కథ కూడా ఎన్నో కారణాలు చెప్పింది. ఇంట్లో పెద్దవాళ్లందరూ బిజీగా ఉన్నారని, పిల్లలు చదువుల్లో అంతకంటే బిజీ బిజీగా ఉన్నారని. ఇక కథ మాత్రం ఏం చేస్తుంది పాపం... కంచికి పోకుండా!! కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! మళ్లీ మంచి కాలం వస్తోంది. ఇది ఆశాభావం కాదు...అక్షరాలా నిజం! పిల్లలు కథలు వినడాన్ని కాలహరణంగా భావించే తలిదండ్రులు మారిపోతున్నారు. పిల్లలను ప్రేమగా దగ్గరకు పిలిచి కథలు చెబుతున్నారు. తమకు వీలు కాకపోతే కథల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. ఎందుకీ మార్పు?: బోలెడు చానళ్ల పుణ్యమా అని పిల్లల వినోదానికి కొదవ లేదు. అయితే టీవీ వినోదం పిల్లల మానసిక ఎదుగుదల మీద మితిమీరి ప్రభావం చూపుతోంది. మితిమీరి టీవి చూడడం వల్ల ఆలోచన, విశ్లేషణా సామర్థ్యానికి పిల్లలు దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కథలు వినడానికి ప్రాముఖ్యం పెరిగింది. ఉపయోగం ఏమిటి?: కథ వినే క్రమంలో పిల్లలలో రకరకాల సందేహాలు వస్తుంటాయి. అవి వారి మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయి. కథ వినే క్రమంలో రకరకాల దృశ్యాలను ఊహించుకుంటారు. ఇది వారి సృజనను శక్తిమంతం చేస్తుంది. విన్న కథను తిరిగి చెప్పే క్రమంలో పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కథ మొత్తం చెప్పకుండా సగం వరకు చెప్పి... ‘ఆ తరువాత ఏమైందో చెప్పండి?’ అని అడిగితే పిల్లలు అప్పటికప్పుడు కథను అల్లుతూ పోతారు. ఇది ఒక రకంగా సృజనను పెంపొందించే విధానం. కథను పూరించే క్రమంలో ఆశావాద దృక్పథానికి ప్రాధాన్యం ఇస్తారు. సమస్యకు పరిష్కారం ఆలోచించడాన్ని పెంపొందించుకుంటారు. మానవసంబంధాలు, నైతిక విలువల్లోని గొప్పదనాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రదేశాలు, పాత ఆచారాలు, భాషావ్యవహారాలు, పద పరిచయం, సాంస్కృతిక మూలాలు...ఒక్కటనేమిటి సమస్త విషయాలను, విలువలను ‘కథ’ పిల్లలకు పరిచయం చేస్తుంది. సృజనాత్మక ఆలోచనలకు, ఆలోచన పరిధిని పెంచడానికి కథను మించిన సాధనం లేదనే విషయం ఎన్నో పరిశోధనల్లో తెలిశాక...మెల్లిగా కథలకు ప్రాముఖ్యం పెరగడం మొదలైంది. కొన్ని పాఠశాలల్లో కథ చెప్పడం కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించుకుంటున్నారు. బెంగళూరులోని ‘మహాత్మా స్కూలు’లో ‘కథాలయ’ పేరుతో విరివిగా కథా సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ‘మహాత్మా’ బాటలోనే చాలా పాఠశాలలు ‘కథాలయ’లు నిర్వహిస్తున్నాయి. ‘‘కథ అనేది అనేక కళల సమాహారం. కథ చెబుతున్నప్పుడు ఆడతాం, పాడతాం, అనుకరిస్తాం. అందుకే పిల్లలు కథ వినడానికి ఇష్టపడతారు. కథలు చెప్పడం అనేది కాలక్షేపం కోసం కాదు..పిల్లలను చక్కగా తీర్చిదిద్దడానికి’’ అంటున్నారు ‘కథాలయ’ ట్రస్ట్ డెరైక్టర్ గీతా రామానుజన్. విదేశాల నుంచి కూడా ప్రసిద్ధ కథకులను రప్పించి పిల్లలకు కథలు చెప్పించడం ఈ ‘కథాలయ’ ప్రత్యేకత. ‘ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ నెట్వర్క్’తో ‘కథాలయ’ ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. ఈ నెట్‌వర్క్‌లో 15 దేశాలకు చెందిన 490 మంది సభ్యులు ఉన్నారు. జూన్ 21ని ‘వరల్డ్ సోరీ టెలింగ్ డే’గా ఈ నెట్వర్క్ ప్రకటించింది. ‘కథాలయ’ మరో ప్రత్యేకత ఏమిటంటే, పిల్లలను మారుమూల ఆదివాసుల దగ్గరికి తీసుకెళ్లి వారి చేత కథలు వినిపిస్తారు. ఇలా ఎన్నో విలువైన జానపద కథలు వినే అదృష్టం పిల్లలకు కలిగింది. ఈ సమకాలీన పరిణామాల మధ్య మన రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ ఇప్పుడిప్పుడే ‘కథ చెప్పడం’ అనేది ఊపందుకుంటుంది. అంటే ‘కథ’కు మళ్ళీ బంగారు కాలం వస్తోందని ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది! నేను గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ఆరు పాఠశాలలకు ‘స్టోరీ టెల్లర్’గా పనిచేస్తున్నాను. ఈ మధ్యనే ‘స్టోరీ ఆర్ట్స్ ఇండియా’ పేరుతో హైదరాబాద్‌లో కొన్ని ప్రదేశాల్లో పిల్లల్ని సమీకరించి కథలు చెబుతున్నాను. కథలంటే చందమామ కథలు మాత్రమే కాదు, వయసుని బట్టి వారికి కావాల్సిన భాష, విజ్ఞానం కూడా అందులో ఉండేలా కథలను తయారుచేసుకుంటున్నాను. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయుల కోరిక మేరకు హరికథల రూపంలో కూడా కథలు చెబుతున్నాను. చిన్నపిల్లల విషయానికొస్తే కథ సృజనాత్మకతను పెంచుతుంది కాబట్టి వారి మెదడులో పూర్తిస్థాయి ఊహాచిత్రం వచ్చే విధంగా వివరించి చెబుతాను. అలాగే మన శరీరంలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో చెప్పే కథలను కూడా తయారుచేసుకున్నాను. అరటి పండు తింటే అది ఎలా జీర్ణమవుతుందో చెప్పడానికి...అరటి పండు మాట్లాడుతున్నట్లు కథ అల్లి చెప్పాలి. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాలు, జాతులు, భాషలు, మతాలు అన్నింటిపై కనీస అవగాహనను పెంచే కథలను ఏ రోజుకారోజు తయారుచేసుకుంటాను. ‘కథ’కున్న శక్తి గురించి ఇంకా చాలామంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియదు. అన్ని పాఠశాలలో కథలు చెప్పే తరగతి ఉండాల్సిన అవసరం చాలా ఉంది. - దీపాకిరణ్ స్టోరీ ఆర్ట్స్ ఇండియా వ్యవస్థాపకురాలు -
పాలమూరు మేలిమి కథకుడు
1954 - 60ల మధ్య పాలమూరు జిల్లా నుంచి విస్తృతంగా కథలు రాసి గుర్తింపు పొందిన రచయిత వల్లపురెడ్డి. వాస్తవ జీవిత చిత్రణ వల్లపురెడ్డి బలం. కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఆయన ప్రధాన కథా వస్తువులు. ప్రధాన స్రవంతి వచనంలో అలవోకగా కథను నడిపించడం తెలిసిన వల్లపురెడ్డి కథలకు భారతి, తెలుగు స్వతంత్ర వంటి పత్రికలు పీఠం వేయడంలో ఆశ్చర్యం లేదు. వల్లపురెడ్డి దాదాపు 70 కథలు రాసినా అన్నీ అందుబాటులో లేకపోవడం దురదృష్టం. దొరికిన 35 కథలతో ఈ సంపుటి తీసుకొచ్చిన పాలమూరు మిత్రులు అభినందనీయులు. మరుగున పడ్డ కథకులు అలాగే ఉండిపోరనీ మబ్బు తొలగిన మరుక్షణాన పాఠకుల సమక్షంలో హాజరవుతారని ఈ సంపుటి సాక్ష్యం పలుకుతుంది. కథాభిమానులు తప్పక పరిశీలించాల్సిన పుస్తకం. వెల: రూ.150/- ప్రతులకు: 94908 04157 -
అమరిక : బొమ్మలే కథలు చెబుతాయి!
‘కథ చెబుతాను... ఊఁ కొడతావా!’ అని పిల్లల్ని అడిగే పరిస్థితి ఇప్పుడు ఏ తల్లిదండ్రులకు ఉంది? ‘నాన్నా! కథ చెప్పవూ’ అని పిల్లలు అడిగితే ఏదో ఓ వంకతో తప్పించుకునే వాళ్లే ఎక్కువ. విశ్రాంత జీవనం గడుపుతూ పిల్లలకు కథలు చెప్పడంలో కాలం గడపాల్సిన తాతలు, నానమ్మలు కూడా తమకంటూ ఏదో ఓ వ్యాపకంలో బిజీగానే ఉంటున్నారు. కథలు పిల్లల్లో సృజనాత్మకతను పెంచుతాయి. కథ వింటూ నిద్రలోకి జారుకున్న పిల్లలు కథలో విన్న చెవుల పిల్లి, గున్న ఏనుగుతో కలల్లో కబుర్లు చెబుతారు. కథ చెప్పే సమయమూ, సహనమూ లేకపోతే ఒక ప్రత్యామ్నాయాన్ని వెతకండి. ఇదిగో... ఇలాంటి బెడ్రూమ్ని ఇస్తే పిల్లలు సొంతంగా కథ అల్లేసుకుంటారు. వినే ఓపిక ఉంటే ఒకే బొమ్మను చూపిస్తూ అమ్మానాన్నలకు బోలెడన్ని కథలు చెబుతారు. ఇందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జిబిషన్లలో, బుక్‌షాపుల్లో ఇలాంటి కామిక్ బొమ్మలున్న వాల్పేపర్లు దొరుకుతాయి. వాటిని తెచ్చి పిల్లల బెడ్రూమ్ గోడకు అతికించడమే. అలాగే పిల్లల చేత బొమ్మలు గీయించి ఆ చార్టునే గోడకు అతికించవచ్చు. ఇలా నెలకో కొత్త బొమ్మ వేయమని సూచిస్తే చాలు. పిల్లలలోని సృజనాత్మకత బయటకు వస్తుంది, కొత్త కొత్త ఆలోచనలకు తెరతీస్తారు. -
కొత్త పుస్తకం: మలినం అంటని మాండలిక కతలు.. ఇరులదొడ్డి బతుకులు
హోసూరులో కథలు వరదలెత్తుతున్నాయి. తమిళ పరిష్వంగంలో నలిగిపోతున్న తెలుగు ప్రాంతం హోసూరు. కృష్ణగిరి జిల్లాలో ఉంది. బెంగళూరుకు కూతవేటు దూరం. అక్కడ తెలుగువారున్నారన్న సంగతి, అది తెలుగు ప్రాంతం అన్న సంగతి చాలామంది తెలుగువారికే తెలియదు. మేమున్నాం ఇక్కడ అని వాళ్లు అరిస్తే ఎవరూ పట్టించుకోరు. అందుకే వాళ్లు సాహిత్యంలోకి తమ గళాల్ని (కలాల్ని) మళ్లించారు. తమ ప్రాంతం భాష, యాస, సంస్కృతి, తెలుగు వారు మర్చిపోయినా తాము మర్చిపోని కట్టుబాట్లు అన్నింటిని తాము ఎలా కాపాడుకుంటున్నామో కథలు రాస్తున్నారు. ఇంతకు ముందు ఈ ప్రాంతం నుంచి ‘ఎర్నూగుపూలు’, ‘తెల్లకొక్కెర్ల తెప్పం’ వంటి పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు నంద్యాల నారాయణరెడ్డి రాసిన ‘ఇరులదొడ్డి బతుకులు’. హోసూరుకు సమీపంలోని ఒక అడవి ప్రాంతంలో ఈ రచయిత గడిపిన బాల్యాన్ని ఈ కతలన్నీ చూపుతాయి. చెట్లు, పుట్టలు, సీళు కుక్కలు, ఏనుగులు, కొమ్ముల ఆవులు అడపా దడపా గాండ్రించే పులులూ అన్నెం పున్నెం ఎరగని అమాయకపు మనుషులు... వీళ్లంతా ఈ కథల్లో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందులో వాడిన భాషది కూడా ఒక తెలియని రుచి. మాండలికం అంటే అశ్లీలమైన పదాలు వాడాలనీ స్త్రీలను కించపరిచే పదాలు ఉన్నదే మాండలికం అనీ స్థిరపరిచిన కొన్ని రకాల రచనలకు ఈ కథలు ఒక మెరుగైన జవాబు. కాలుష్యం గాలి నుంచి కాసేపు తప్పించుకోవాలంటే ఈ కథలు వీచే అడవిగాలిని ఆహ్వానించండి. వెల: రూ. 100; ప్రతులకు: 09360514800 స్త్రీ హృదయం: గాజు నది ‘ఏమీ రాయకపోతే/ ఏదీ రాయలేకపోతే ఏదో కోల్పోయిన వెలితి కలల నిండా కలం నిండా స్త్రీల కన్నీటి సిరాతో చైతన్యించిన దీపశిఖల ప్రజ్వలనమే కవిత్వం’ అనే కవయిత్రి రాయకుండా ఉండగలదా? ఏదో ఒక బాధను కవిత్వం చేయకుండా ఉండగలదా? స్త్రీ వాద రచయిత్రులలో ఒక ప్రత్యేకతను సాధించుకున్న కవి శిలాలోలిత. సరళంగా చెప్తూనే గట్టిగా నిర్మొహమాటంగా కూడా మాట్లాడే కవిత్వం ఆమెది. అతడు - ప్యాంటూ చొక్కా తొడుక్కుని వెళతాడు. ఆమె - ఇంటిని కూడా తొడుక్కుని వెళుతుంది... అనడంలో స్త్రీని వదలని ఇంటి చాకిరి స్త్రీని పట్టి ఉంచే బంధనాలు ఎలాంటివో సూటిగా చెప్తారామె. ‘ఎడారుల్లా పరుచుకున్న స్త్రీలు ఒకప్పుడు సముద్రాలేమో’ అనే వేదన ఆమె కవిత్వం. ద్రవీభవించే, ఘనీభవించే, ప్రతిబింబాన్ని చూపే, భళ్లున బద్దలయ్యే స్త్రీ హదృయం వంటి ఈ గాజునది కవిత్వాన్ని చదవండి. వెల: రూ.రూ.80; ప్రతులకు: 9391338676 సాహిత్య పత్రిక చినుకు గత ఎనిమిదేళ్లుగా తెలుగు సాహిత్యానికి మెరుగైన వేదికగా వెలువడుతున్న మాస పత్రిక ‘చినుకు’. కథలు, కవితలు, సాహిత్య చర్చలు... ప్రామాణిక స్థాయిలో ప్రచురిస్తూ సాహిత్యాభిమానులకు చేరువైన పత్రిక ఇది. అంతే కాకుండా ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో వార్షిక సంచిక వెలువరించి తెలుగులో వార్షిక సాహిత్య సంచికలకు ఉన్న లోటును తీరుస్తోంది. చిన్నా పెద్దా రచయితలు చాలా మంది తమ రచనలు ఈ పత్రికలో చూసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే ఇది సాధించిన గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. సంపాదకుడు నండూరి రాజగోపాల్. వివరాలకు: 98481 32208 సాహిత్య డైరీ నల్గొండలోని మారుమూల గ్రామం కదిరేని గూడెం నుంచి ఇవాళ అంతర్జాతీయ చిత్రకళా ప్రపంచంలో తనదైన ముద్రను వేసే స్థాయికి ఎదిగిన చిత్రకారుడు ఏలే లకష్మణ్. దేశ విదేశాల్లో ఆయన ఆర్ట ఎగ్జిబిషన్ జరుగుతున్నా చాలా ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో అక్టోబర్ 5 నుంచి 15 వరకూ ‘ఫెలో ట్రావెలర్స’ పేరుతో ఆయన చిత్రకళా ప్రదర్శన జరగనుంది. వేదిక: కళాకృతి, రోడ్ నం. 10, బంజారాహిల్స. 040 - 66564466 రూ. 12 వేల నగదు బహుమతి కలిగిన ‘రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం’ (సిరిసిల్లా) కోసం కవిత్వ సంపుటాలు ఆహ్వానిస్తున్నారు. వివరాలకు : 98490 12459 అంగడి సరుకు: మండి ‘మండి’ అంటే మార్కెట్ అని అర్థం. మార్కెట్లో సరుకు అమ్ముతారు. అయితే తరతరాలుగా ఈ ప్రపంచంలో అమ్ముడుపోయే ఒక మానవ సరుకు ఉంది - స్త్రీ. హైద్రాబాద్‌లో జరిగే ఈ కథలో ఒక రద్దీ ప్రాంతంలో ఒక ‘కోఠా’ (వ్యభిచార కేంద్రం) ఉంటుంది. నగరం పెరిగి పెద్దదయ్యి ఆ ప్రాంతంలో ఒక కొత్త మార్కెట్‌ను కట్టాలనుకోవడంతో ఆ ‘కోఠా’కు ముప్పొచ్చి పడుతుంది. దానిని ఖాళీ చేయాలి. కాని ఆ ఆడవాళ్లు, పొట్టకూటి కోసం పడుపువృత్తి చేసుకునే ఆ నిర్భాగ్యులు, నిరక్షరాస్యులు ఎక్కడికెళ్లాలి? చివరకు వాళ్లను ఊరి అవతలకు తరిమేస్తారు. ఆశ్చర్యం. అక్కడ ఎప్పటితో ఒక బాబాగారి సమాధి బయటపడి అదొక రద్దీ క్షేత్రం ఏర్పడుతుంది. మళ్లీ ఆ స్థలానికి మార్కెట్ వ్యాల్యూ వచ్చింది. దాంతో అక్కణ్ణుంచి వాళ్లను తిరిగి తరిమేయాలి. లేదా ఆ చీమల పుట్టను పాములు ఆక్రమించుకోవాలి. చివరకు అదే జరుగుతుంది. విషాదమైన ఈ కథను వ్యంగ్యంగా చెప్పడం వల్ల అప్పుడప్పుడు నవ్వుతూ అప్పుడప్పుడు ఏడుస్తూ చూస్తాం. ప్రసిద్ధ పాకీస్తానీ రచయిత గులామ్ అబ్బాస్ రాసిన ‘ఆనంది’ అనే కథానిక ఆధారంగా శ్యామ్ బెనగళ్ తీసిన సినిమా (1983) ఇది. షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ పోటీ పడి చేసినా షబానా స్థిరత్వం అసామాన్యం అనిపిస్తుంది. ‘మేమున్నాం కాబట్టే ఈ సమాజం ఈ మాత్రమైనా ఉంది’ అంటుంది ఈ సినిమాలో షబానా. ‘మేం తప్పు చేస్తున్నామా? మీ మొగాళ్లను ఇంట్లో కట్టి పెట్టండి చేతనైతే. మమ్మల్నెందుకంటారు?’ అని నిలదీస్తుంది నలుగురినీ. దానికి సమాధానం లేదు. ఉండదు కూడా. మర్యాదకరమైన సాహిత్యం చూడ నిరాకరించే ఈ కురుపు సలపరం తెలియాలంటే యూ ట్యూబ్‌లో Mandi (film) అని కొట్టి చూడండి. పాత సంగతి భమిడిపాటి కామేశ్వరరావు అభిమానులు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి ‘అయ్యా... తమకు సన్మానం చేసి బిరుదు ప్రదానం చేద్దామనుకొంటున్నాం’ అన్నారు. అందుకు ఆయన మొదట్లో ఒప్పుకోలేదు. వాళ్లు మరీ బలవంతం చేసేటప్పటికి - ‘కొంతమంది బిరుదులు తమకు తాము తగిలించుకుంటారు. మరికొంతమంది బిరుదులు సాహిత్య సంఘాలకు విరాళాలు ఇచ్చి కొనుక్కుంటారు. మొదటి పద్ధతి బిరుదు స్వయంగా తగిలించుకోవడం నాకిష్టం లేదు. రెండో పద్ధతిలో బిరుదు కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మీకు మీరుగా బిరుదు ఇస్తున్నారు కనుక సరే అలాగే కానివ్వండి’ అన్నారు. అలా ఆయనకు ‘హాస్యబ్రహ్మ’ అనే బిరుదు లభించింది. ఒకసారి క్లాస్‌లో హోమ్‌వర్‌క చేయని పిల్లలను తలా ఒక దెబ్బ వేస్తున్నారట. క్లాసులో వారబ్బాయి కూడా ఉన్నాడు. ‘హోమ్‌వర్‌క ఎందుకు చేయలేదు’ అనంటే ‘మా కుటుంబం అంతా పెళ్లికి వెళ్లిందండి’ అన్నాట్ట కుమారుడు. ఆయన కుమారుడికి ఒక దెబ్బ వేసి, పరీక్షలు దగ్గర పడుతున్న సంగతి పట్టించుకోకుండా నిన్ను పెళ్లికి తీసుకెళ్లినందుకు ఇదిగో నాక్కూడా దెబ్బ అని చేతి మీద ఒక దెబ్బ కొట్టుకున్నారట. ఇలా భమిడిపాటి ఉదంతాలు అనేకం. న్యూ రిలీజెస్ ది హంగ్రీ ఘోస్‌ట్స The Hungry Ghosts చేసిన పాపాల నుంచి నిష్కృతి ఉంటుందా? ఈ జీవితంలో లెక్కకు మించి కోరికలు ఉన్నవారు చనిపోయాక దెయ్యాలుగా మారతారట. కాని వాళ్లకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుందట. కాని ఏమీ తినలేకపోతారట. వింటేనే భయం వేసే ఇలాంటి కథలు తన నాయనమ్మ నోటి గుండా విని పెద్దవాడయ్యాడు శివన్. కాని అతడి జీవితంలో కూడా అతడి నిమిత్తం లేకుండా ‘పాపం’ జరిగింది. అతడు ‘గే’. తన స్వదేశం శ్రీలంకను వదిలి కెనడా వెళ్లి స్థిరపడ్డాడు. కాని ఏదో అసంతృప్తి, పాపభీతి నాయనమ్మ చిన్నప్పుడు చెప్పిన బౌద్ధకథలు వెంటాడుతూనే ఉన్నాయి. అతడు తిరిగి కొలంబో బయలుదేరుతాడు. తర్వాత ఏం జరుగుతుంది? జీవితంలో ఉండాల్సిన వెతుకులాట, కనుగొనడం, అర్థం చేసుకోవడం, వచ్చిన సంఘర్షణలను దాటి ముందుకు వెళ్లడం, వదలక పట్టుకున్న కోరికల దెయ్యాలను వదిలించుకోవడం వీటన్నింటి సమాహారమే శ్యామ్ సెల్వదురై రాసిన నవల ‘ది హంగ్రీ ఘోస్‌ట్స’. ఇంగ్లిష్‌లో రాసే శ్రీలంక రచయితలు భారతీయ రచయితలతో సమానంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నారు. వాళ్లలో శ్యామ్ కూడా ఒకడు. బాగుంది. రెండు కోట్ల మంది ఉన్న శ్రీలంక నుంచి అంతమంది రచయితలు వస్తే ఇన్ని కోట్ల మంది ఉన్న తెలుగువారి నుంచి ఎంత మంది రావాలి? పోనీలెండి. మనకెందుకు? నవల చదవండి. The Hungry Ghosts, Shyam Selvadurai, Penguin Viking, Rs. 599 -
పుస్తక సమీక్షణం
పేజీలు: 200 వెల: 125 ప్రతులకు: ప్రజాశక్తి, విశాలాంధ్ర బుక్ హౌస్‌లు ఊతం కోల్పోతున్న జీవితాలు పుస్తకం : ఊతకర్రలు (కథలు) రచన : శిరంశెట్టి కాంతారావు విషయం : కుదేలవుతున్న కులవృత్తులు, అంగలారుస్తున్న వ్యవసాయం, పగుళ్లిస్తున్న పల్లె సంస్కృతి... ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న జీవన నేపథ్యాలను గుదిగుచ్చిన 18 కథల సంపుటిది. కుమ్మరి అయోధ్య నుంచి ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించేందుకు నిరాకరిస్తాడు కొడుకు వీరన్న. పొలం కౌలుకు తీసుకుని, డక్కాముక్కీలు తిని, ఉత్తమ రైతు అవార్డు అందుకోగలుగుతాడు. ఈ పురోగతిని భూస్వామ్యవర్గం ఆమోదించని తీరును ‘ప్రయాస’లో చిత్రించారు. ఫార్మా కంపెనీలు జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను గిరిజనులపై చేస్తున్న వైనాన్ని ‘గంధపు చెక్కలు’లో చిత్రీకరించారు. మైదాన ప్రాంతపు సంపన్నులు, విప్లవకారులు, పోలీసుల నడుమ ఖమ్మం సరిహద్దుల్లోని గిరిజనుల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో ‘సమిధలు’, ‘మూగజీవాలు’ కథల్లో బొమ్మ కట్టించారు. కాంతారావు మాత్రమే రాయగలిగిన కథ ‘పూసుగూడెం రాజులు’. గట్టు తెగిన ఊరు, నాన్న పోయిన తర్వాత, అంతులేని పయనం ఆకట్టుకుంటాయి. గూనపెంకుల ఇల్లు, రాతెండి సర్వ, వర్రగాలి, పారుటాకుల విస్తళ్లు, తాటితోపులు, బ్రహ్మంగారి తత్వాలు, మెట్ట తాబేళ్లు, ఆరగట్టిన నాటుపొగాకు, చల్లకవ్వాలు... ఈ తరం విస్మరిస్తున్న ఎన్నో పల్లెపదాల సౌకుమార్యం ఈ కథలకు అదనపు సొగసు. - భాస్వంత్ సస్పెన్స్ కథలు పేజీలు: 48 వెల: 50 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. పుస్తకం : థ్రిల్లర్స్ (కథలు); రచన : రేణిగుంట ఉత్తమ్ విషయం : పది థ్రిల్లింగ్ కథల చిన్న సంపుటమిది. తెలుగులో ఈ రకమైన కథలు రాసినవాళ్లు తక్కువ. ప్రతి కథా ఉత్కంఠతో నడుస్తుంది. సంపుటిలో ఒకటి రెండు దెయ్యాల కథలున్నాయి, భయపెట్టడానికి. ‘ద్రోహం’, ‘ఖలుడు’ కథల్లో ఎక్కడా బిగి సడలదు. ‘కుట్ర’ కథావస్తువు కృష్ణదేవరాయల కాలం నాటిది. రాజమందిరాల్లో జరిగే కుట్రలను తెలియజేస్తుంది. ఇలాంటి కథలను రాయాలంటే క్రిమినల్ సైకాలజీతో పాటు, సైన్స్‌కి సంబంధించిన విషయాలు కూడా తెలియాలి. రచయితకి ఆ పరిజ్ఞానం పుష్కలంగా ఉంది. - రామాంజనేయులు విలువలకు ఊపిరిలూదే కథలు పేజీలు: 112 వెల: 60 పుస్తకం : నేనున్నాగా (కథలు) రచన : రంగనాథ రామచంద్రరావు విషయం : కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు, టీవీ నటుడు రంగనాథ రామచంద్రరావు కలం నుండి జాలువారిన మూడో కథాసంపుటిది. మొత్తం పది కథలున్నాయి. వాస్తవికతకు ప్రాధాన్యతనిస్తూ, సన్నివేశాలను దృశ్యమానం చేస్తూ కాల్పనిక శక్తితో కథల్లో రీడబిలిటీని పెంచుకుంటూ పాఠకుణ్ని తీయని అనుభూతిలోకి లాక్కుపోయే తత్వమున్నవి వీరి కథలు. ఉత్పత్తి సంబంధాల్లో తీవ్రమైన మార్పులు కలుగుతున్నాయి. కథాశిల్పంలో తగిన విధంగా మార్పులు చోటు చేసుకోవడం లేదనే చెప్పొచ్చు. రామచంద్రరావు కథలు ఆత్మీయ సంబంధాలకు అద్దం పట్టే విధంగా నడిచాయి. ‘థామస్ మన్రో మళ్లీ చచ్చిపోయాడు’ కథ తెల్లవాండ్ల పాలన దగ్గర నుంచి నల్లవాళ్ల పాలనలో జరుగుతున్న దోపిడీ దౌర్జన్యాలనూ చర్చించింది. వృద్ధులు ఇంట్లో నిరాదరణకు గురవుతున్న రోజుల్లో కోడలు మామ మంచం దగ్గరకు వెళ్లి ‘నేనున్నాగా’ అంటూ తల్లిలా ఒడిలోకి తీసుకోవడం హృదయాల్ని కదిలిస్తుంది. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి కొత్త పుస్తకాలు క్రికెట్ అండ్ లవ్ (నవల) రచన: బి.ఎస్.జగదీశ్ పేజీలు: 136; వెల: 100 ప్రతులకు: రచయిత, 2-2-18/17, డిడి కాలనీ, బాగ్ అంబర్పేట్, హైదరాబాద్-13. ఫోన్: 040-27426521 నందికొటుకూరి సిద్ధ యోగి ప్రణీత యోగీశ్వర విలాసము (ద్విపద) పరిష్కర్త: వైద్యం వేంకటేశ్వరాచార్యులు పేజీలు: 260; వెల: 120 ప్రతులకు: పరిష్కర్త, ప్లాట్ 167, ఇం.నం. 87/1246, శ్రీకృష్ణ నిలయం, మేడపైన, రెవెన్యూ కాలనీ, కర్నూలు-2; ఫోన్: 9989679681 నా తిరుపతి యాత్ర రచన: తెల్లమేకల శ్రీనివాసరావు పేజీలు: 108; వెల: 70 ప్రతులకు: రచయిత, ఎన్ఎస్పి కాలనీ మెయిన్ రోడ్, 29-829/2, వినుకొండ, గుంటూరు. ఫోన్: 9030637270 తెలంగాణ ఆత్మఘోష (వ్యాసాలు) రచన: గడ్డం కేశవమూర్తి పేజీలు: 204; వెల: అమూల్యం ప్రతులకు: 4-7-138/1, కుమార్‌పల్లి, హన్మకొండ-1. ఫోన్: 8008794162 సత్యాన్వేషణ రచన: మల్లవరపు విజయ పేజీలు: 142; వెల: 250 ప్రతులకు: రచయిత్రి, కేరాఫ్ డి.భీమన్న, ఏపీఎస్ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్, షాప్ నం.24, నిజామాబాద్ బస్‌స్టేషన్, నిజామాబాద్; ఫోన్: 9989326248 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36; ఫోన్: 040-27678430