పత్రికల్లో వచ్చే కథనాలకు స్పందించండి
- సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పని చేయండి
- బాధితులకు భరోసా కల్పించాలి
- అధికారులతో కలెక్టర్ సత్యనారాయణ
- మీ కోసంలో వినతుల స్వీకరణ
కల్లూరు (రూరల్): జిల్లాలోని సమస్యలపై పత్రికల్లో వచ్చే కథనాలకు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. అందుకు ఏవైనా అవాంతరాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులు అందించే బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించాలన్నారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ 2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, ఇన్‌చార్జ్ ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ బాధితుల నుంచి వినతులను స్వీకరించారు.
పిచ్చి వేషాలేస్తున్నావా..
మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రైతు దొండపాటి పుల్లయ్య భూ సమస్యపై కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంటనే మహానంది తహసీల్దార్ రామకృష్ణ, వీఆర్వోను సత్యనారాయణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరణ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఏమయ్యా బాబు... మహానంది తహసీల్దార్ రామకృష్ణ.. మీ మండలానికి సంబంధించిన గోపవరం రైతు దొండపాటి పుల్లయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 558, 561, 570లోని 3 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. అందులో 24 సెంట్ల భూమిని ఆన్‌లైన్ అడంగల్ నుంచి ఎందుకు తొలగించావో సమాధానం చెప్పు. భూమికి సంబంధించి వీఆర్‌ఓ ఎందుకు పేచీ పెడుతున్నాడు. ఆన్‌లైన్‌లో ఉన్న భూమిని మీరెందుకు కరెక‌్షన్ చేస్తారు. మెకానికల్‌గా తహసీల్దార్, వీఆర్‌ఓ మాట్లాడకూడదు. అన్నదమ్ముల మధ్య పేచీ ఉంటే కోర్టుకెళ్లమని సూచించండి. ఆన్‌లైన్‌లో భూ విస్తీర్ణం మార్చడానికి నీవెవరు (వీఆర్‌ఓ సత్యనారాయణను)? ఇట్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఇష్యూ పిచ్చివేషాలేస్తున్నావా.. సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు.
‘మీ కోసం’లో వచ్చిన సమస్యల్లో కొన్ని..
కోడుమూరు ప్రజల దాహర్తి తీర్చండి:
కోడుమూరు పట్టణంలో నెలకొన్న తీవ్ర తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని సర్పంచ్ సీబీ లత కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. హంద్రీనది అడుగంటడం, గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని కర్నూలుకు తరలించడంతో పట్టణంలో నీటి సమస్య అధికమైందన్నారు. ఇప్పటికే గ్రామంలోని పలు వార్డుల్లో వారానికోసారి, మరికొన్ని వార్డుల్లో వారానికి రెండుసార్లు మాత్రమే నీటిని విడుదల చేయాల్సి వస్తుందన్నారు. 20 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ట్యాంకర్ల నుంచి నీటిని సరఫరా చేసి ప్రజల దాహం తీర్చాలని నోడల్ ఆఫీసర్ విజయభాస్కర్‌ను ఆదేశించారు.
-
1.62 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్సార్‌బీసీ మైనర్, సబ్ మైనర్ కాల్వలను అభివృద్ధి చేయాలని బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్థన్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు.
-
అన్ని జిల్లాల్లో మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతలు కల్పిస్తున్నారని, కర్నూలు జిల్లాలో రోస్టర్ ప్రకారం ఇస్తామంటున్నారని పీఈటీల అసోసియేషన్ నాయకులు కృష్ణ, పరమేష్, శేఖర్, లక్ష్మణ్, లక్ష్మయ్య, వెంకటేష్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ మెరిట్ ప్రకారం పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని డీఈఓ తాహేరా సుల్తానాను ఆదేశించారు.
-
సుంకేసుల రోడ్డులోని కొత్త క్రిష్టియన్ బరియల్ గ్రౌండులో సమాధులు కట్టేందుకు వెళితే కొందరు అడ్డుకుంటున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కారల్ మార్క్స్‌నగర్‌కు చెందిన సాల్మోన్, ఎస్.రాజు, నాగరాజు, ఏసు, వందనమయ్య జాయింట్ కలెక్టర్ 2 రామస్వామికి ఫిర్యాదు చేశారు.
-
ఆత్మకూరు పరిధిలోని సిద్ధేశ్వరం బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త కలెక్టర్‌ను కోరారు.
-
అనంతపురం– అమరావతి హైవే ఎక్స్‌ప్రెస్ రహదారిని కొలిమిగుండ్ల నుంచి రుద్రవరం మండలాల మీదుగా నిర్మిస్తే యథేచ్చగా ఎర్రచందనం, గంధపు చెక్కలు, టేకు అక్రమ రవాణా అయ్యే అవకాశం ఉందని, రహదారి నిర్మాణంపై పునారాలోచించాలని సీనియర్ దళిత నాయకుడు టీ.పీ.శీలన్న కలెక్టర్‌కు విన్నవించారు.