
లక లక లక...అదిగో డ్రాకులా!
పరిశోధన
నిజజీవిత డ్రాకులా అని ప్రపంచవ్యాప్తంగా దుష్కీర్తి గడించిన ‘ప్రిన్స్ ఆఫ్ రొమేనియా’ వ్లాడ్ గురించి ఒళ్లు జలదరించే కథలు ప్రచారంలో ఉన్నాయి. రొట్టెను రక్తంలో ముంచుకొని తినేవాడు. స్నేహితులతో కలిసి రక్తపు విందులలో పాల్గొనేవాడు... ఇలా చెప్పుకుంటే పోతే నిజజీవిత డ్రాకులా వ్లాడ్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో భయానక విషయాలు ఉన్నాయి.
రకరకాల ఎత్తులు వేస్తూ, తన రాక్షసత్వాన్ని చాటుకోవడం అంటే వ్లాడ్‌కు ఇష్టంగా ఉండేది. వ్లాడ్ పేరు వింటేనే ప్రజలు గడగడలాడేవారు.
1476లో టర్కీయులతో జరిగిన ఒక యుద్ధంలో వ్లాడ్ కనిపించకుండా పోయాడు. అతని అదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. చనిపోయాడు అని కొందరంటే కాదు అజ్ఞాతంలో ఉన్నాడని కొందరు, శత్రువుల చెరలో ఉన్నాడని కొందరు అన్నారు. ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. యుద్ధం జరిగిన ప్రదేశంపై కూడా చర్చ జరిగింది.
రొమేనియాలోని పర్వతప్రాంతమైన ట్రాన్స్‌వేలేనియాలో జరిగిందని కొందరు అంటే, ‘కానే కాదు’ అంటూ దీనికి భిన్నమైన వాదనలు వినిపించాయి. యుద్ధం ఎక్కడ జరిగింది? వ్లాడ్ ఎలా చనిపోయాడనేది పక్కన పెడితే తాజా పరిశోధనలో కొత్త విషయం ఒకటి బయట పడింది. ‘‘వ్లాడ్‌ను యుద్ధఖైదీగా ఇటలీకి తీసుకువెళ్లారు. ఆ తరువాత నోపెల్ నగరంలోని ఒక చర్చిలో పాతి పెట్టారు. దీనికి సంబంధించిన ఆధారాలు సంపాదించాం’’ అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ టాలిన్
(రిపబ్లిక్ ఆఫ్ ఇస్టోనియా)కు చెందిన పరిశోధకులు. సమాధిపై చెక్కబడిన డ్రాకులా బొమ్మతో సహా ‘‘ఇది వ్లాడ్ సమాధి’’ అని చెప్ప దగ్గ ఆధారాలు పరిశోధకులకు లభించాయి. సమాధిపై మరిన్ని పరిశోధనలు జరపడానికి అధికారిక అనుమతి కోసం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అనుమతి లభిస్తే కీలకమైన వివరాలు తెలిసే అవకాశం ఉంది.