
ఆ దిశగా ఏనుగుకు ఎలుక సాయం చేసిందా..
కొలోస్సల్ బయోసైన్సెస్ శాస్త్రవేత్తల రోమాంచితమైన పరిశోధన
వూలీ మమోత్.. భారీ ఆకారంతో, సింహం జూలును తలపించేలా తొండం నుంచి తోకదాకా దట్టమైన రోమాలతో భీకరంగా ఉండే ఏనుగు అది. అలాంటి ఏనుగును పునః సృష్టించేందుకు.. ఒక ‘ఎలుకంత’ ముందడుగు పడింది.
తల నుంచి తోకదాకా నిండా దట్టమైన రోమాలతో కూడిన ఎలుక జీవం పోసుకుంది. అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు చేసిన ఈ చిత్రమైన పరిశోధన ఏమిటో తెలుసుకుందామా... –సాక్షి, సెంట్రల్‌డెస్క్
ధ్రువ ప్రాంత మంచులో దొరికిన ఆనవాళ్లతో..
భూమ్మీద తిరుగాడి, కాలక్రమేణా అంతరించిపోయిన అరుదైన జీవులను పునః సృష్టి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ‘కొలోస్సల్ బయోసైన్సెస్’ శాస్త్రవేత్తలు వూలీ మమోత్ ఏనుగులకు తిరిగి ప్రాణం పోసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల్లోని జన్యువులను, ప్రస్తుతమున్న సాధారణ ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు.
మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను గుర్తించారు. దీనికి సంబంధించి తొలుత ఎలుకలపై ప్రయోగాలు చేపట్టారు. ‘‘అంతరించిపోయిన ఒకనాటి జీవులను పునః సృష్టించగలం అనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యం. భవిష్యత్తులో ఈ టెక్నాలజీతో వూలీ మమోత్‌లను పుట్టించి, ప్రకృతిలోకి వదిలిపెట్టగలం..’’అని కొలోస్సల్ సంస్థ చీఫ్ సైన్స్ ఆఫీసర్ బెత్ షాపిరో పేర్కొన్నారు.

1 ధ్రువ ప్రాంతపు మంచులో దొరికిన వూలీ మమోత్ అవశేషాల నుంచి జన్యువులను సేకరించారు.
2 ఇప్పుడున్న ఆసియా ఏనుగుల జన్యువులతో, వూలీ మమోత్ జన్యువులను పోల్చి తేడాలను గుర్తించారు.
3 ఎలుక పిండ కణాలను తీసుకుని.. వాటిలో పైచర్మం, వెంట్రుకలు, వాటి పొడవు, మందం తదితర లక్షణాలను నియంత్రించే ఎనిమిది జన్యువుల్లో.. మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశారు.
4 ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను కొన్ని సాధారణ ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టారు.
5 నిండా దట్టమైన రోమాలతో, అతి శీతల వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగిన ‘ఊలు ఎలుకలు’ జన్మించాయి.
Comments
Please login to add a commentAdd a comment