వాన అంటే అందరికీ ఇష్టమే. అదీ రెండు, మూడు రోజులు పడితే ఓకే.. మరి వారం పాటు దంచికొడితే!? అమ్మో.. అంతా ఆగమాగమే అంటారు కదా! అదే కొన్నేళ్లపాటు వానలు పడితే.. అలా వేలు, లక్షల ఏళ్లపాటు కురుస్తూనే ఉంటే.. వామ్మో అనిపిస్తోందా? కానీ ఇది నిజమేనని, భూమిపై ఏకంగా 20 లక్షల ఏళ్లపాటు వర్షం పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి అంత వాన ఎక్కడ పడింది? ఎందుకు పడింది? దాని వల్ల ఏం జరిగిందనే సంగతులు తెలుసుకుందామా..
– సాక్షి సెంట్రల్ డెస్క్
భూమి పొరలను పరిశీలిస్తుండగా..
1970వ దశకంలో కొందరు శాస్త్రవేత్తలు భూఉపరితలానికి సంబంధించి పరిశోధనలు చేస్తుండగా.. పురాతన రాళ్లలో అసాధారణమైన బూడిద రంగు పొరలను గమనించారు. అవి సిలికా (ఇసుక), మట్టితో ఏర్పడ్డాయని.. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఇలా ఉన్నాయని గుర్తించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి.. సుమారు 23 కోట్ల ఏళ్ల కింద ఆ పొరలు ఏర్పడినట్టు తేల్చారు. అవి ఇసుక, మట్టి తీవ్రస్థాయిలో పీడనానికి గురై ఏర్పడినట్టు నిర్ధారించారు. ఈ పొరల మందం, అవి మొదలై, ముగిసిన సమయాన్ని అంచనా వేసి.. సుమారు 20 లక్షల ఏళ్ల పాటు నిరంతరం వాన కురవడంతో అలా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
అంతా ఒకే ఖండంగా ఉన్నప్పుడు..
23 కోట్ల ఏళ్ల కింద భూమ్మీద ఖండాలన్నీ కలిసి ఒకే అతిపెద్ద ఖండం ‘పాంజియా’గా ఉండేది. అప్పటిదాకా వానలు తక్కువగా ఉండి.. వేడి వాతావరణం కొనసాగింది. ఆ సమయంలో గ్రహ శకలాలు ఢీకొనడం, భూమి పైపొరలోని టెక్టానిక్ ప్లేట్ల కదలికలు తీవ్రమై అతిభారీ స్థాయిలో అగ్ని పర్వతాల విస్ఫోటనాలు జరిగాయి.
వాతావరణంలోకి చేరిన పొగ, దుమ్ము, ధూళి వల్ల ఒక్కసారిగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. సముద్రాల్లో నీరు వేడెక్కి ఆవిరై.. గాలిలో ఆవిరి శాతం (హ్యూమిడిటీ) బాగా పెరిగింది. ఆ గాలులు ‘పాంజియా’ వైపు వీయడం, చల్లబడి వానలు కురవడం మొదలైంది. ఇదిలా 20 లక్షల ఏళ్లపాటు కొనసాగింది. ఈ పరిస్థితులు, తర్వాతి పరిణామాలకు ‘కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్’గా పేరుపెట్టారు.
తొలుత నాశనం.. ఆ తర్వాత సృష్టి..
కార్నియన్ ప్లూవియల్ ఈవెంట్ మొదట్లో జీవరాశుల నాశనానికి దారి తీసింది. ఉష్ణోగ్రతలు, విషవాయువులు పెరగడంతో మొక్కలు, చెట్లు, జంతువులకు సమస్యగా మారింది. అగ్నిపర్వతాల నుంచి వెలువడిన విషవాయువులు, దుమ్ము మేఘాల్లో కలిసి ఆమ్ల వర్షాలు (యాసిడ్ రెయిన్స్) కురిశాయి. అటు సముద్రాల్లో నీరు వేడెక్కడం, ఆమ్లత్వం పెరగడం, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో జలచరాలూ తగ్గిపోయాయి.
మొత్తంగా దాదాపు 80శాతానికిపైగా జీవరాశి అంతరించినట్టు అంచనా. అయితే కార్నియన్ ఈవెంట్ చివరిదశకు వచ్చేప్పటికి ఖండాలు విడివడటం మొదలై.. అగ్ని పర్వతాల విస్ఫోటనాలు తగ్గిపోయాయి. భూమ్మీద వేడి తగ్గిపోయింది. వానలు ఒక క్రమానికి పరిమితమై.. జీవానికి అనుకూలమైన, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ఇది మొక్కలు, జంతువులు సహా ఎన్నో కొత్త జీవరాశుల పునరుత్థానానికి దారితీసింది.
డైనోసార్ల ఆధిపత్యానికి తోడ్పడి..
కార్నియన్ ఈవెంట్ మొదలయ్యే నాటికే డైనోసార్లు, పలు ఇతర జీవరాశుల ఎదుగుదల మొదలైంది. ఈవెంట్ నాటి పరిస్థితులను బాగా తట్టుకోగలిగిన డైనోసార్లు.. ఈవెంట్ తర్వాత బాగా ప్రయోజనం పొందాయి. వాటిలో ఎన్నో ఉప జాతులు ఉద్భవించి జీవరాశిపై ఆధిపత్యం చలాయించాయి. ఇదే సమయంలో జీవ పరిణామం బాగా వేగం పుంజుకుంది. తాబేళ్లు, మొసళ్లు, బల్లులు వంటివాటితోపాటు పాలిచ్చి పెంచే వివిధ రకాల జీవులు (మమ్మాల్స్) అభివృద్ధి చెందాయి.
భూమ్మీద ఇప్పుడున్న జీవంలో చాలా వరకు ‘కార్నియన్ ఫ్లూవియల్ ఈవెంట్’ నాటి పరిస్థితులే తోడ్పడ్డాయని భూతత్త్వ, ఫోరెన్సిక్ శాస్త్రవేత్త అలస్టేర్ రఫెల్, పురాతత్త్వ శాస్త్రవేత్తలు (పేలియోన్విరాన్‌మెంటిస్ట్స్) జకొపో డాల్ కోర్సో, పాల్ విగ్నల్ వెల్లడించారు. ఈ పరిశోధన వివరాలు ఇటీవల న్యూసైంటిస్ట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అక్కడ 20 లక్షల ఏళ్లుగా వానలే లేవు..
ఒకప్పుడు 20 లక్షల ఏళ్లు వాన పడితే.. అసలు గత20 లక్షల ఏళ్లుగా చుక్క వాన పడని ప్రాంత మూ ఒకటుంది తెలుసా.అంటార్కిటికాలో మెక్‌మర్డో డ్రైవ్యాలీగా పిలిచేచోట దాదాపు 20 లక్షల ఏళ్లుగా వాన, మంచు వంటివేవీ కురవలేదని శాస్త్రవేత్తలు గత ఏడాదే నిర్ధారించారు. అతి తక్కువ హ్యూమిడిటీ, డ్రైవ్యాలీకి చుట్టూ ఉన్న పెద్ద కొండలు, గాలులు వీచే దిశ వంటివి దీనికి కారణమని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment