సాక్షి ప్రతినిధి, బాపట్ల: దేశంలోనే మొదటిసారిగా అత్యధిక ప్రొటీన్ అందించే అరుదైన వరి వంగడాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. 12 ఏళ్లపాటు విస్తృత పరిశోధనలు చేసి అధిక దిగుబడి.. అత్యధిక ప్రొటీన్ అందించే వరి వంగడాలకు రూపకల్పన చేశారు. వీటిని బీపీటీ 2848 పేరుతో పిలుస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్‌లో దీన్ని నమోదు చేశారు. ఇలా ఒక కొత్త వంగడాన్ని సృష్టించి నమోదు చేయడం ఇదే ప్రథమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి
నల్ల రకం వరి విత్తనంగా బీపీటీ 2848ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్‌బీ బయో 2026/ఐఆర్‌జీసీ 48493 రకం వంగడాన్ని సంకరం చేసి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. ఈ విత్తనాల పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ రకాల్లో నల్ల రకం ఉన్నా అవి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి ఉండటం లేదు. సగటున 12 బస్తాలకు దిగుబడి మించే పరిస్థితి లేదు. పైగా ఇవి లావు రకాలు.
కొత్తగా రూపొందించిన బీపీటీ 2848 సన్నరకం వంగడాలతో ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ సన్న రకం 1,000 బియ్యపు గింజల బరువు 13 గ్రాములు మాత్రమే ఉంటుంది. తినడానికి రుచిగా, అనువుగా ఉంటాయి. మిగిలిన వరి రకాల్లో ప్రొటీన్ల శాతం 6 నుంచి 7 శాతానికి మించదని.. బీపీటీ 2848 ముడి బియ్యంలో 13.7 శాతం ప్రొటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ముడి బియ్యాన్ని పాలిష్ చేసినా 10.5 శాతం తగ్గకుండా ప్రొటీన్లు ఉంటాయని పేర్కొంటున్నారు.
పలు రాష్ట్రాల్లో పరిశోధనలు..
బీపీటీ 2848 రకం వంగడంపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశారు. అన్నిచోట్లా శాంపిల్స్ తీసి కటక్ (ఒడిశా)లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఆర్‌ఆర్‌ఐ)లో పరీక్షించారు. బీపీటీ 2848లో సగటున 10.5 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు స్పష్టమైంది.
గతంలో ఒడిశాలో సీఆర్‌ధన్ 310 రకం వంగడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంట్లోనూ 10.5 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. అయితే అది లావు రకం గింజ. అన్ని ప్రాంతాల వారు దాన్ని తినలేరు. ఇందుకు భిన్నంగా బాపట్ల వరి పరిశోధన కేంద్రం బీపీటీ 2848 వంగడాన్ని సృష్టించింది. ఈ విత్తనాలను వచ్చే ఏడాది నుంచి రైతులకు అందించనుంది.
అత్యధిక ప్రొటీన్లు అందించే రైస్..
బీపీటీ 2848 రకం కొత్త వంగడాన్ని 12 ఏళ్ల కృషితో బాపట్ల వరి పరిశోదన కేంద్రంలో సృష్టించాం. ఇది బ్లాక్ రైస్. దేశంలోనే అత్యధిక ప్రొటీన్లు అందించే సన్నరకం రైస్ ఇవే. తినటానికి అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment