BPT grain
-
బీపీటీకి భలే గిరాకీ
అవనిగడ్డ: బీపీటీ ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర పలుకుతుండడంతో ‘దివిసీమ’ రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వర్షాభావ పరిస్థితుల్లో సైతం అధిక దిగుబడులు రావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఈ ఏడాది 62,548 ఎకరాల్లో బీపీటీ–5204 వరి రకాన్ని సాగు చేశారు. ఈ సంవత్సరం సరిగా వర్షాలు పడకపోయినా ఇరిగేషన్‌శాఖ అధికారులు రైతులను సమన్వయ పరచి వంతుల వారీ విధానం ద్వారా సాగునీరు అందించారు. దివిసీమలోని పలు ప్రాంతాల్లో నాలుగు రోజుల నుంచి యంత్రాలతో వరికోత పనులు ముమ్మరం చేశారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎకరాకు ఐదు బస్తాల దిగుబడి పెరిగినట్లు కోడూరుకు చెందిన రైతులు తెలిపారు. 2014తో పోలిస్తే రెట్టింపైన ధర.. 2014–15 చంద్రబాబు పాలనలో సాధారణ వరి రకం క్వింటా రూ.1,360 ఉండగా, బస్తా ధాన్యం రూ.850కి కొనుగోలు చేశారు. ఏ గ్రేడ్ రకం క్వింటా రూ.1,400 ఉండగా బస్తా ధాన్యం రూ.950కి కొన్నారు. 2022–23 నాటికి సాధారణ రకం రూ.2,040 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,060 ఉంది. 2023–24లో సాధారణ రకం రూ.2,183 ఉండగా, ఏ గ్రేడ్ రకం రూ.2,203 ఉంది. అంటే 2014తో పోలిస్తే సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.823 ధర పెరగ్గా, ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.803 ధర పెరిగింది. 2014తో పోలిస్తే సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో బస్తాకు ధర రెట్టింపు స్థాయిలో పెరిగింది. కాగా, గతేడాది «కోతల తరువాత నాలుగైదు నెలలకు బస్తా రూ.1,800 ధర పలకగా, నేడు యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కల్లంలోనే రూ.1,820కు కొంటుండడంతో రైతులు పట్టరాని ఆనందంలో ఉన్నారు. మిషన్కోత ధాన్యం ఇంత ధర పలకడం ఎప్పుడూ చూడలేదు.. ఆరున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాం. మిషన్‌తో వరికోత కోశాం. ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బస్తా ధాన్యం రూ.1,820కి అమ్మేశాం. మిషన్కోత ధాన్యం ఇంత రేటు పలకడం నేను ఎప్పుడూ చూడలేదు. –మాలే రాధాకృష్ణ, ఇస్మాయేల్బేగ్పేట, కోడూరు మండలం ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు.. రెండెకరాలు కౌలుకు సాగు చేశాను. గతేడాదితో పోలిస్తే ఖర్చులు తగ్గి.. దిగుబడులు పెరిగాయి. యంత్రాలతో కోసిన ధాన్యంను ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ధరకు కొంటున్నారు. – జుజ్జువరపు రామస్వామి, కౌలురైతు, వెంకటాపురం, మోపిదేవి మండలం -
అధిక దిగుబడి, అత్యధిక ప్రొటీన్ @ బీపీటీ 2848
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దేశంలోనే మొదటిసారిగా అత్యధిక ప్రొటీన్ అందించే అరుదైన వరి వంగడాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. 12 ఏళ్లపాటు విస్తృత పరిశోధనలు చేసి అధిక దిగుబడి.. అత్యధిక ప్రొటీన్ అందించే వరి వంగడాలకు రూపకల్పన చేశారు. వీటిని బీపీటీ 2848 పేరుతో పిలుస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్‌లో దీన్ని నమోదు చేశారు. ఇలా ఒక కొత్త వంగడాన్ని సృష్టించి నమోదు చేయడం ఇదే ప్రథమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి నల్ల రకం వరి విత్తనంగా బీపీటీ 2848ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్బీ బయో 2026/ఐఆర్జీసీ 48493 రకం వంగడాన్ని సంకరం చేసి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. ఈ విత్తనాల పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ రకాల్లో నల్ల రకం ఉన్నా అవి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి ఉండటం లేదు. సగటున 12 బస్తాలకు దిగుబడి మించే పరిస్థితి లేదు. పైగా ఇవి లావు రకాలు. కొత్తగా రూపొందించిన బీపీటీ 2848 సన్నరకం వంగడాలతో ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ సన్న రకం 1,000 బియ్యపు గింజల బరువు 13 గ్రాములు మాత్రమే ఉంటుంది. తినడానికి రుచిగా, అనువుగా ఉంటాయి. మిగిలిన వరి రకాల్లో ప్రొటీన్ల శాతం 6 నుంచి 7 శాతానికి మించదని.. బీపీటీ 2848 ముడి బియ్యంలో 13.7 శాతం ప్రొటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ముడి బియ్యాన్ని పాలిష్ చేసినా 10.5 శాతం తగ్గకుండా ప్రొటీన్లు ఉంటాయని పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో పరిశోధనలు.. బీపీటీ 2848 రకం వంగడంపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశారు. అన్నిచోట్లా శాంపిల్స్ తీసి కటక్ (ఒడిశా)లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ)లో పరీక్షించారు. బీపీటీ 2848లో సగటున 10.5 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో ఒడిశాలో సీఆర్ధన్ 310 రకం వంగడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంట్లోనూ 10.5 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. అయితే అది లావు రకం గింజ. అన్ని ప్రాంతాల వారు దాన్ని తినలేరు. ఇందుకు భిన్నంగా బాపట్ల వరి పరిశోధన కేంద్రం బీపీటీ 2848 వంగడాన్ని సృష్టించింది. ఈ విత్తనాలను వచ్చే ఏడాది నుంచి రైతులకు అందించనుంది. అత్యధిక ప్రొటీన్లు అందించే రైస్.. బీపీటీ 2848 రకం కొత్త వంగడాన్ని 12 ఏళ్ల కృషితో బాపట్ల వరి పరిశోదన కేంద్రంలో సృష్టించాం. ఇది బ్లాక్ రైస్. దేశంలోనే అత్యధిక ప్రొటీన్లు అందించే సన్నరకం రైస్ ఇవే. తినటానికి అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన కేంద్రం -
చౌడు నేలలకు సరైన వరి
నీటిలోని క్లోరైడ్స్ భూమిపైకి అధికంగా చేరటం వల్ల పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలు.. ఉప్పుటేరులు.. కొల్లేరు ప్రాంతభూములు.. రొయ్యల చెరువులు.. వాటి సమీప భూముల్లో చౌడు పేరుకుపోతోంది. ఆ భూముల్లో విత్తనాలూ సరిగా మొలకెత్తవు. దీనికి చెక్ పెడుతూ ఎంపీఎం–103 పేరిట మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. చౌడు భూముల్లోనూ సిరులు పండించేందుకు మార్గం సుగమం చేసింది. సాక్షి, అమరావతి: చౌడు నేలలు.. దేశంలో 1.73 కోట్ల ఎకరాల్లో విస్తరిస్తే మన రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతంలో విస్తరిస్తున్న రొయ్యల సాగు, విచక్షణా రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల పచ్చటి పొలాలు చౌడుబారిపోతున్నాయి. ఈ నేలల్లో లవణ సాంద్రత 3 పీహెచ్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ వరి వంగడాలు సాగుచేస్తే తరచూ తెగుళ్ల బారినపడటంతోపాటు కనీస దిగుబడులు కూడా రావు. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం చౌడుతోపాటు చీడలను తట్టుకుంటూ అధిక దిగుబడులనిచ్చే ఎంసీఎం–103 సన్న బియ్యం రకం అభివృద్ధి చేశారు. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వంగడాన్ని రబీలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడి రెండో పంటకు అనువైన ఎంసీఎం–103 వంగడాన్ని బీపీటీ–5204, ఎంటీయూ–4870 రకాలను సంకరపర్చి అభివృద్ధి చేశారు. దీని పంట కాల పరిమితి 140–145 రోజులు. చౌడు తీవ్రతను బట్టి హెక్టార్‌కు 4.5 నుంచి 5.5 టన్నులు.. సాధారణ భూముల్లో హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడులు వస్తాయి. చౌడు తీవ్రత 4 నుంచి 8 డిగ్రీల లవణ సాంద్రత వద్ద సాగు చేసినా సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులకు ఢోకా ఉండదు. దోమపోటు, పొడ, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. గింజ రాలదు. కాండం దృఢంగా ఉండి నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు. నాణ్యత కల్గిన గింజ శాతం 66.70 % . దమ్ము చేసిన తర్వాత ఎకరాకు 36:24:24 నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేసుకుంటే చేను పడి పోకుండా ఉంటుంది. 15, 20 రోజులకొకసారి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను పిచికారీ చేసుకోవాలి. భూమిలో జీలుగ చల్లి కలియ దున్నడం వలన చౌడు తగ్గుతుంది. బీపీటీ కంటే ఐదు బస్తాల అధికం మా భూముల్లో చౌడు తీవ్రతతో మొక్కలు చనిపోవడం వల్ల తిరిగి ఊడ్చాల్సి వచ్చేది. మొక్కలు సరిగా ఎదగక ఎరువులు ఎక్కువగా వాడాల్సి వచ్చేది. గతేడాది బందరు పరిశోధనా కేంద్రం నుంచి ఎంసీఎం–103 విత్తనాన్ని తీసుకొని ఊడ్చా. లవణ సాంద్రత 6 పీహెచ్ వద్ద కూడా మొక్కలు చనిపోలేదు. ఎక్కువ పిలకలు వేసింది. ఒక కోటా మందులు మాత్రమే వేశాను, ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బీపీటీ కంటే 5 బస్తాలు అధికంగా దిగుబడి వచ్చింది. – జి.సురేష్, మోదుమూడి, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా పరిశోధనా కేంద్రంలో విత్తనం రాష్ట్రంలో చౌడు ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఈ రకాన్ని సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ఈ రకం వంగడం కోసం రైతులు మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నేరుగా లేదా ఫోన్ నంబర్ 94901 95904లో సంప్రదించి పొందవచ్చు. – ఎం.గిరిజారాణి, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, మచిలీపట్నం -
బీపీటీ @ 1700
సాంబమసూరి (బీపీటీ) ధాన్యం ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. వారం రోజుల క్రితం కనీస మద్దతు ధర కూడా పలకని బీపీటీ ధాన్యం.. ప్రస్తుతం క్వింటా రూ. 1700లకు చేరింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -న్యూస్‌లైన్, మిర్యాలగూడ జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 1,43, 917 హెక్టార్లలో వరి సాగు చేశారు. సాగు చేసిన వరిలో 90 శాతం బీపీటీ ధాన్యాన్ని రైతులు పండించారు. కాగా సుమారు 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా దానిలో సుమారు 6 లక్షల క్వింటాళ్లు బీపీటీ ధాన్యమే కావడం విశేషం. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోవడంతో పాటు తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. ఎకరానికి 20 నుంచి 22 క్వింటాళ్ల ధాన్యం వస్తుందని రైతులు ఆశించారు. కానీ తెగుళ్ల వల్ల 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పడిపోయింది. ఒక్క నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోనే జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా సుమారు 12000 హెక్టార్లలో దోమపోటు సోకిందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కాగా పంట దిగుబడి తగ్గినా.. పెరిగిన ధరలతో రైతులకు కొంత ఊరట కలుగుతోంది. మార్కెట్ యార్డుల్లో కూడా పెరిగిన ధరలు జిల్లాలోని 19 మార్కెట్ యార్డుల్లో ఇంత కాలం పాటు తేమ పేరుతో ప్రభుత్వ మద్దతు ధర క్వింటా బీపీటీ ధాన్యానికి రూ. 1345 చెల్లించాల్సి ఉన్నా రూ. 1300 లోపే ఇచ్చారు. కానీ ఇటీవలనే ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ యార్డులతో పాటు మిల్లు పాయింట్ల వద్ద కూడా ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. మిల్లు పాయింట్ల వద్ద క్వింటా బీపీటీని ప్రస్తుతం రూ. 1700లకు పైగానే కొనుగోలు చేస్తున్నారు.