నీటిలోని క్లోరైడ్స్ భూమిపైకి అధికంగా చేరటం వల్ల పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలు.. ఉప్పుటేరులు.. కొల్లేరు ప్రాంతభూములు.. రొయ్యల చెరువులు.. వాటి సమీప భూముల్లో చౌడు పేరుకుపోతోంది. ఆ భూముల్లో విత్తనాలూ సరిగా మొలకెత్తవు. దీనికి చెక్ పెడుతూ ఎంపీఎం–103 పేరిట మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. చౌడు భూముల్లోనూ సిరులు పండించేందుకు మార్గం సుగమం చేసింది.
సాక్షి, అమరావతి: చౌడు నేలలు.. దేశంలో 1.73 కోట్ల ఎకరాల్లో విస్తరిస్తే మన రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతంలో విస్తరిస్తున్న రొయ్యల సాగు, విచక్షణా రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల పచ్చటి పొలాలు చౌడుబారిపోతున్నాయి. ఈ నేలల్లో లవణ సాంద్రత 3 పీహెచ్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ వరి వంగడాలు సాగుచేస్తే తరచూ తెగుళ్ల బారినపడటంతోపాటు కనీస దిగుబడులు కూడా రావు.
ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం చౌడుతోపాటు చీడలను తట్టుకుంటూ అధిక దిగుబడులనిచ్చే ఎంసీఎం–103 సన్న బియ్యం రకం అభివృద్ధి చేశారు. ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ వంగడాన్ని రబీలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు.
హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడి
రెండో పంటకు అనువైన ఎంసీఎం–103 వంగడాన్ని బీపీటీ–5204, ఎంటీయూ–4870 రకాలను సంకరపర్చి అభివృద్ధి చేశారు. దీని పంట కాల పరిమితి 140–145 రోజులు. చౌడు తీవ్రతను బట్టి హెక్టార్‌కు 4.5 నుంచి 5.5 టన్నులు.. సాధారణ భూముల్లో హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడులు వస్తాయి. చౌడు తీవ్రత 4 నుంచి 8 డిగ్రీల లవణ సాంద్రత వద్ద సాగు చేసినా సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులకు ఢోకా ఉండదు.
దోమపోటు, పొడ, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. గింజ రాలదు. కాండం దృఢంగా ఉండి నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు. నాణ్యత కల్గిన గింజ శాతం 66.70 % . దమ్ము చేసిన తర్వాత ఎకరాకు 36:24:24 నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేసుకుంటే చేను పడి పోకుండా ఉంటుంది. 15, 20 రోజులకొకసారి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను పిచికారీ చేసుకోవాలి. భూమిలో జీలుగ చల్లి కలియ దున్నడం వలన చౌడు తగ్గుతుంది.
బీపీటీ కంటే ఐదు బస్తాల అధికం
మా భూముల్లో చౌడు తీవ్రతతో మొక్కలు చనిపోవడం వల్ల తిరిగి ఊడ్చాల్సి వచ్చేది. మొక్కలు సరిగా ఎదగక ఎరువులు ఎక్కువగా వాడాల్సి వచ్చేది. గతేడాది బందరు పరిశోధనా కేంద్రం నుంచి ఎంసీఎం–103 విత్తనాన్ని తీసుకొని ఊడ్చా. లవణ సాంద్రత 6 పీహెచ్ వద్ద కూడా మొక్కలు చనిపోలేదు. ఎక్కువ పిలకలు వేసింది. ఒక కోటా మందులు మాత్రమే వేశాను, ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బీపీటీ కంటే 5 బస్తాలు అధికంగా దిగుబడి వచ్చింది. – జి.సురేష్, మోదుమూడి, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా
పరిశోధనా కేంద్రంలో విత్తనం
రాష్ట్రంలో చౌడు ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఈ రకాన్ని సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ఈ రకం వంగడం కోసం రైతులు మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నేరుగా లేదా ఫోన్ నంబర్ 94901 95904లో సంప్రదించి పొందవచ్చు. – ఎం.గిరిజారాణి, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, మచిలీపట్నం
Comments
Please login to add a commentAdd a comment