చూచాయగా వెల్లడించిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్
బియ్యం ఇచ్చేందుకు ఇబ్బంది లేదు.. కానీ కొత్త బియ్యం వంట సరిగా కాదు
సన్న బియ్యం కనీసం మూడు నెలలు ఆగితే బాగుంటుంది
ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తే 9 నెలలకు ఖరీఫ్ పంట సరిపోతుంది
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సాకారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కొత్త బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు ఇవ్వడానికి తమకేం ఇబ్బంది లేదని, సన్న బియ్యం మూడు నెలలు నిల్వ చేసిన తర్వాతే అన్నం బాగుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వంట సరిగా కాకపోతే బియ్యం బాగాలేవంటారని, అందుకే మూడు నెలల తర్వాత బియ్యం ఇస్తే మంచిదని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో సంక్రాంతికి సన్న బియ్యం ఇవ్వలేమని కమిషనర్ సూత్రప్రాయంగా వెల్లడించినట్టయ్యింది.
ఖరీఫ్ ధాన్యం ఉగాది నుంచి 9 నెలలు సరిపోతుంది
రేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదని, అందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కమిషనర్ చౌహాన్ అన్నారు. అయితే సంక్రాంతి, ఉగాది ఎప్పటి నుంచి అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 2.81 కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయన్నారు. ఇందుకోసం సంవత్సరానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కావాలని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నామని, అందులో 35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వస్తుందని చెప్పారు. ఈ సన్న ధాన్యం ఉగాది నుంచి ఇస్తే 9 నెలలకు సరిపోతుందన్నారు.
13.13 ఎల్‌ఎంటీ ధాన్యం సేకరణ
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కమిషనర్ చౌహాన్ చెప్పారు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో 10.11 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా 3.02 లక్షల టన్నులు సన్న ధాన్యమన్నారు. ఇందులో 12.40 ఎల్‌ఎంటీ ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్‌లకు పంపించినట్టు చెప్పారు. రూ. 3వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.1,560 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ కింద రైతులకు రూ. 9.21 కోట్లు చెల్లించామన్నారు. 362 మంది డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదని, సీఎంఆర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, ఎవరికీ బలవంతంగా ధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీని భూతంగా చూపుతున్నారన్నారు. సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీని మిల్లర్లకు తిరిగి ఇచ్చేస్తామని, ఇతర అప్పులకు వాటిని మినహాయించుకోమని స్పష్టం చేశారు.
సన్న ధాన్యానికి 4వేల కేంద్రాలు
సన్న ధాన్యం, దొడ్డు ధాన్యం పండించిన చోట జిల్లా కలెక్టర్లు జియోగ్రాఫికల్ సిస్టం ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. 8 వేల కేంద్రాల్లో 4వేలకు పైగా సన్న ధాన్యం కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment