thin rice
-
సంక్రాంతికి సన్నబియ్యం లేనట్టే!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సాకారం అయ్యే సూచనలు కనిపించడం లేదు. ఖరీఫ్ సీజన్లో సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేసి కొత్త బియ్యాన్ని రేషన్‌కార్డుదారులకు ఇవ్వడానికి తమకేం ఇబ్బంది లేదని, సన్న బియ్యం మూడు నెలలు నిల్వ చేసిన తర్వాతే అన్నం బాగుంటుందని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అన్నారు. వంట సరిగా కాకపోతే బియ్యం బాగాలేవంటారని, అందుకే మూడు నెలల తర్వాత బియ్యం ఇస్తే మంచిదని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. దీంతో సంక్రాంతికి సన్న బియ్యం ఇవ్వలేమని కమిషనర్ సూత్రప్రాయంగా వెల్లడించినట్టయ్యింది. ఖరీఫ్ ధాన్యం ఉగాది నుంచి 9 నెలలు సరిపోతుందిరేషన్ దుకాణాల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ప్రజలు తినడం లేదని, అందుకే సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని కమిషనర్ చౌహాన్ అన్నారు. అయితే సంక్రాంతి, ఉగాది ఎప్పటి నుంచి అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని 2.81 కోట్ల మందికి రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రతినెలా 2 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతాయన్నారు. ఇందుకోసం సంవత్సరానికి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కావాలని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నామని, అందులో 35 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం వస్తుందని చెప్పారు. ఈ సన్న ధాన్యం ఉగాది నుంచి ఇస్తే 9 నెలలకు సరిపోతుందన్నారు. 13.13 ఎల్ఎంటీ ధాన్యం సేకరణరాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కమిషనర్ చౌహాన్ చెప్పారు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో 10.11 లక్షల టన్నులు దొడ్డు ధాన్యం కాగా 3.02 లక్షల టన్నులు సన్న ధాన్యమన్నారు. ఇందులో 12.40 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లులు, గోడౌన్లకు పంపించినట్టు చెప్పారు. రూ. 3వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయగా, రైతులకు రూ.1,560 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ కింద రైతులకు రూ. 9.21 కోట్లు చెల్లించామన్నారు. 362 మంది డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదని, సీఎంఆర్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని, ఎవరికీ బలవంతంగా ధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు. కొందరు మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీని భూతంగా చూపుతున్నారన్నారు. సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీని మిల్లర్లకు తిరిగి ఇచ్చేస్తామని, ఇతర అప్పులకు వాటిని మినహాయించుకోమని స్పష్టం చేశారు. సన్న ధాన్యానికి 4వేల కేంద్రాలుసన్న ధాన్యం, దొడ్డు ధాన్యం పండించిన చోట జిల్లా కలెక్టర్లు జియోగ్రాఫికల్ సిస్టం ద్వారా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. 8 వేల కేంద్రాల్లో 4వేలకు పైగా సన్న ధాన్యం కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. -
సన్న ధాన్యంపై వ్యాపారుల కన్ను
నిజామాబాద్ జిల్లాలోని వర్ని, బోధన్, మోస్రా, చందూర్ తదితర కొన్ని మండలాల్లో వరి కోతలు 100 శాతం పూర్తయ్యాయి. ఈ మండలాల్లో రైతులు పండించే హెచ్ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ లాంటి మంచి రకం (ఫైన్ వెరైటీ) సన్న ధాన్యాన్ని ఇప్పటికే దళారులు, వ్యాపారులు పొలాల నుంచే కొనుగోలు చేశారు. తరుగు, తాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా పచ్చి వడ్లను కొన్నారు. నెలరోజుల క్రితం ఇక్కడ కోతలు షురూ కాగా, మొదట్లో క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320కి మించి రూ.2,600 వరకు చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం రూ.2,100 నుంచి రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. పైగా తాలు, తరుగు, తేమ శాతాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం కొని, డబ్బులు చెల్లిస్తుండడంతో.. రైతులు కూడా వారికే విక్రయిస్తున్నారు. ఫైన్ వెరైటీ సన్న ధాన్యం అధికంగా పండించే నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.సాక్షి, హైదరాబాద్: బహిరంగ మార్కెట్లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలో వ్యాపారులు, మిల్లర్లు పల్లెలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో పెరిగిన సన్నాల సాగును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కోతలు ప్రారంభమైన వెంటనే కల్లాల నుంచే ధాన్యాన్ని ఏకమొత్తంగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సెపె్టంబర్ చివరి వారం నుంచే వరికోతలు మొదలై అక్టోబర్‌లో పెద్ద ఎత్తున సాగుతాయి. మిగతా జిల్లాల్లో అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం నుంచి మొదలై జనవరి దాకా సాగుతాయి. సన్న ధాన్యానికి డిమాండ్ రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల నేపథ్యంలో ఈసారి ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి, తరుగు, తాలు లేకుండా తూర్పారబట్టి కొనుగోలు కేంద్రానికి తెస్తేనే సేకరిస్తామని మిల్లర్లు చెబుతుండటం.. ఆ బాధలేవీ లేకుండా వ్యాపారులు పచ్చి వడ్లనే కొంటుండడం, డబ్బులు వెంటనే చేతికి వస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వరకు వెళ్లడం లేదు. తమ వద్దకే వచ్చే వ్యాపారులకు ధాన్యం అమ్మేసుకుంటున్నారు.ప్రస్తుతం కోతలు సాగుతున్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో సన్న ధాన్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. ఫైన్ రకాలైన జైశ్రీరాం, సాంబ మసూరి (బీపీటీ 5204), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), హెచ్ఎంటీ సోనా రకాలకు బహిరంగ మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండడంతో ఈ రకాలకు క్వింటాలుకు రూ.2,600 వరకు చెల్లిస్తున్నారు. మిగిలిన సన్న రకాలకు రూ.2,000 వరకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంలో కిలో సన్న ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. కాగా రాష్ట్రంలో సన్న ధాన్యం కోసం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 33 వరి రకాలను వ్యవసాయ శాఖ సన్నాలుగా గుర్తించింది. వీటికే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తుంది. సర్కారు అంచనా సాధ్యమయ్యేనా? రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ కార్డుదారుల కు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల కార్డుదారులకే కాకుండా ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్వాడీలు, గురుకుల పాఠశాలలకు కలిపి ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) సన్న బియ్యం అవసరం. 24 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలంటే 36 ఎల్ఎంటీల సన్నవడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్లో 50 ఎల్ఎంటీల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులే చెపుతున్నారు.వ్యవసాయ శాఖ గుర్తించిన సన్న ధాన్యం రకాలు ఇవే.. సిద్ది (వరంగల్ 44), కంపాసాగర్ వరి–1 (కేపీఎస్ 2874), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి–3 (జేజీఎల్ 27356), జగిత్యాల వరి–2 (జేజీఎల్ 28545), వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14), వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100), జగిత్యాల్ మసూరి (జేజీఎల్ 11470), పొలాస ప్రభ (జేజీఎల్ 384), కృష్ణ (ఆర్ఎన్ఆర్ 2458), మానేరు సోనా (జేజీఎల్ 3828), తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048), వరంగల్ వరి–1119, కునారం వరి–2 (కేఎన్ఎం 1638), వరంగల్ వరి–2 (డబ్ల్యూజీఎల్ 962), రాజేంద్రనగర్ వరి–4 (ఆర్ఎన్ఆర్ 21278), కునారం వరి–1 (కేఎన్ఎం 733), జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798), జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844), కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855), అంజన (జేజీఎల్ 11118), నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్ 34 449), ప్రద్యుమ్న (జేజీఎల్ 17004), సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465), శోభిని (ఆర్ఎన్ఆర్ 2354), సోమనాథ్ (డబ్ల్యూజీఎల్ 34 7), ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్సీ), కేపీఎస్ 6251 (పీఆర్సీ), జేజీఎల్ 33124 (పీఆర్సీ), హెచ్ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271. -
సన్నాలకు.. సాంకేతికత
సాక్షి, సిద్దిపేట: సన్న బియ్యాన్ని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించనున్నారు. రాష్ట్రంలో సన్న రకాల ధాన్యం సాగు చేసిన రైతులకు మద్దతు ధరపై క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం నాణ్యత విషయంలో పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకు దొడ్డు, సన్న నిర్ధారణ ప్రమాణాలు పాటించకుండానే వడ్లను కొనుగోలు చేసింది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 60.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. అందులో 40 శాతం వరకు సన్నాలు సాగు చేశారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మొత్తంగా 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని, ఇందుకోసం 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే చాలా వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. గ్రేడ్–ఏ ధాన్యానికి క్వింటాకు రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చెల్లించనున్నారు. 33 సన్న రకాలకు బోనస్ ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, డబ్లూయజీఎల్ –44, కేపీఎస్–2874, జేజీఎల్–27356, జేజీఎల్ 28545, డబ్ల్యూజీఎల్–14, డబ్ల్యూజీఎల్–32100, జేజీఎల్–11470, జేజేఎల్–384, ఆర్ఎన్ఆర్–2458, జేజీఎల్–384, జేజీఎల్–3828, తెలంగాణ సోనా, వరంగల్–1119, కేఎల్ఎం–1638, వరంగల్–962, రాజేంద్రనగర్, కేఎల్ఎం–733, జేజీఎల్–1798, జేజీఎల్3844, జేజీఎల్ 3855, జేజీఎల్–11118, ఎన్ఆర్ఎల్–34449, సుగంధ సాంబ, శోభిని, సోమనాథ్, ఆర్ఎన్ఆర్–31379, కేపీఎస్–6251, జేజీఎల్ 33124, హెచ్ఎంటీ సోనా, ఎంజీయూ–1224, ఎంటీయూ–1271 రకాలకు బోనస్ చెల్లించనున్నారు.బియ్యం గింజగా మార్చేందుకు ప్యాడిహస్కర్ వడ్లకున్న పొట్టును ఒలిచేందుకు ప్యాడిహస్కర్ యంత్రాలను అందజేస్తున్నారు. 20 వడ్ల గింజలను తీసుకుని ఈ యంత్రంలో పోసి తిప్పితే.. పొట్టూడిపోయి బియ్యం గింజలు బయటికొస్తాయి. పాత కాలంలో వడ్లను చేతితో నలిపేవారు. అప్పుడు వడ్ల నుంచి బియ్యం వచ్చేవి. ఇప్పుడు ప్యాడిహస్కర్ను వినియోగిస్తున్నారు. ఈ బియ్యం గింజలను సుమారు 10 గింజలను తీసుకుని అన్నింటిని ఒక్కొక్కటిగా గ్రెయిన్ కాలిపర్ మెషీన్లో పెట్టి కొలవనున్నారు.గ్రెయిన్ కాలిపర్ యంత్రాలు సన్నధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాలకు గ్రెయిన్ కాలిపర్ (డయల్ మైక్రోమీటర్) యంత్రాన్ని అందజేస్తున్నారు. దీంతో సన్నబియ్యం గింజ పొడవు, వెడల్పు కొలవనున్నారు. పొడవు 6 మిల్లీమీటర్ల కంటే తక్కువ, వెడల్పు 2 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉండాలని నిర్ణయించారు. బియ్యం గింజ పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా నిర్దేశిత ప్రమాణాలుంటేనే కొనుగోలు చేయనున్నారు. ఇలా ఉన్న ధాన్యాన్నే సన్నాలుగా గుర్తించి వారికి క్వింటాకు రూ.500 చొప్పున ప్రభుత్వం బోనస్ అందజేయనుంది. ఇప్పటికే ఈ యంత్రంపై కొనుగోలు కేంద్రాల వారికి అవగాహన కల్పించారు. సంచులకు కోడ్ సన్నాల సంచులకు ఎరుపు రంగు దారంలో కుట్టి.. వాటిపై ఎస్ అనే అక్షరం రాయనున్నారు. దొడ్డు రకానికి పచ్చ రంగు దారంతో కుట్లు వేయనున్నారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ఓపీఎంఎస్ కోడ్‌ను రాయనున్నారు. మిల్లుకు చేరిన తర్వాత సైతం ఎక్కడి నుంచి వచ్చాయో గుర్తించనున్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మీటర్ సన్నాలు కొనుగోలు చేసే కేంద్రాలకు.. ఒక్కొక్క కేంద్రానికి ఒకటి గ్రెయిన్ కాలిపస్, ప్యాడిహస్కర్లను, ఓపీఎంఎస్ కోడ్లను అందించాం. ఇంకో 10 రోజులైతే సన్నాలు కొనుగోలు కేంద్రాలకు రానున్నాయి. సన్న వడ్ల సంచిలకు ఎస్ అనే అక్షరం సైతం రాయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. – ప్రవీణ్, డీఎం, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్, సిద్దిపేట -
36.80 లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో.. ఖరీఫ్‌లో రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఎన్నడూ లేనివిధంగా 36.80 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను సాగు చేశారని.. సుమారు 88.09 లక్షల టన్నుల సన్న వడ్ల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో 2024–25 ఖరీఫ్ పంట కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సీజన్లో రాష్ట్రంలో 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సన్న, దొడ్డు వడ్లు కలిపి ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగయ్యాయని, మొత్తంగా 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు. ఇందులో 91.28 లక్షల టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సన్నాలు, దొడ్డు వడ్లను వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదుగతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఇకపై ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ తొలివారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి చివరి వరకు కొనసాగుతాయన్నారు. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు వీలుగా గోదాములను సిద్ధం చేసిందని చెప్పారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో అందిస్తామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. -
చౌడు నేలలకు సరైన వరి
నీటిలోని క్లోరైడ్స్ భూమిపైకి అధికంగా చేరటం వల్ల పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలు.. ఉప్పుటేరులు.. కొల్లేరు ప్రాంతభూములు.. రొయ్యల చెరువులు.. వాటి సమీప భూముల్లో చౌడు పేరుకుపోతోంది. ఆ భూముల్లో విత్తనాలూ సరిగా మొలకెత్తవు. దీనికి చెక్ పెడుతూ ఎంపీఎం–103 పేరిట మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం నూతన వరి వంగడాన్ని అభివృద్ధి చేసింది. చౌడు భూముల్లోనూ సిరులు పండించేందుకు మార్గం సుగమం చేసింది. సాక్షి, అమరావతి: చౌడు నేలలు.. దేశంలో 1.73 కోట్ల ఎకరాల్లో విస్తరిస్తే మన రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల్లో విస్తరించాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతంలో విస్తరిస్తున్న రొయ్యల సాగు, విచక్షణా రహితంగా రసాయన ఎరువులు వాడటం వల్ల పచ్చటి పొలాలు చౌడుబారిపోతున్నాయి. ఈ నేలల్లో లవణ సాంద్రత 3 పీహెచ్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ వరి వంగడాలు సాగుచేస్తే తరచూ తెగుళ్ల బారినపడటంతోపాటు కనీస దిగుబడులు కూడా రావు. ఈ సమస్యను అధిగమించే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన మచిలీపట్నం వ్యవసాయ పరిశోధనా స్థానం చౌడుతోపాటు చీడలను తట్టుకుంటూ అధిక దిగుబడులనిచ్చే ఎంసీఎం–103 సన్న బియ్యం రకం అభివృద్ధి చేశారు. ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన ఈ వంగడాన్ని రబీలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడి రెండో పంటకు అనువైన ఎంసీఎం–103 వంగడాన్ని బీపీటీ–5204, ఎంటీయూ–4870 రకాలను సంకరపర్చి అభివృద్ధి చేశారు. దీని పంట కాల పరిమితి 140–145 రోజులు. చౌడు తీవ్రతను బట్టి హెక్టార్‌కు 4.5 నుంచి 5.5 టన్నులు.. సాధారణ భూముల్లో హెక్టార్‌కు 6 నుంచి 6.5 టన్నుల దిగుబడులు వస్తాయి. చౌడు తీవ్రత 4 నుంచి 8 డిగ్రీల లవణ సాంద్రత వద్ద సాగు చేసినా సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులకు ఢోకా ఉండదు. దోమపోటు, పొడ, అగ్గితెగుళ్లను తట్టుకుంటుంది. గింజ రాలదు. కాండం దృఢంగా ఉండి నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేయడానికి అనువైనది. 1000 గింజల బరువు 14.5 గ్రాములు. నాణ్యత కల్గిన గింజ శాతం 66.70 % . దమ్ము చేసిన తర్వాత ఎకరాకు 36:24:24 నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేసుకుంటే చేను పడి పోకుండా ఉంటుంది. 15, 20 రోజులకొకసారి 2 గ్రాముల జింకు సల్ఫేట్‌ను పిచికారీ చేసుకోవాలి. భూమిలో జీలుగ చల్లి కలియ దున్నడం వలన చౌడు తగ్గుతుంది. బీపీటీ కంటే ఐదు బస్తాల అధికం మా భూముల్లో చౌడు తీవ్రతతో మొక్కలు చనిపోవడం వల్ల తిరిగి ఊడ్చాల్సి వచ్చేది. మొక్కలు సరిగా ఎదగక ఎరువులు ఎక్కువగా వాడాల్సి వచ్చేది. గతేడాది బందరు పరిశోధనా కేంద్రం నుంచి ఎంసీఎం–103 విత్తనాన్ని తీసుకొని ఊడ్చా. లవణ సాంద్రత 6 పీహెచ్ వద్ద కూడా మొక్కలు చనిపోలేదు. ఎక్కువ పిలకలు వేసింది. ఒక కోటా మందులు మాత్రమే వేశాను, ఎకరాకు 35 బస్తాల దిగుబడి వచి్చంది. బీపీటీ కంటే 5 బస్తాలు అధికంగా దిగుబడి వచ్చింది. – జి.సురేష్, మోదుమూడి, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా పరిశోధనా కేంద్రంలో విత్తనం రాష్ట్రంలో చౌడు ప్రాంతాల్లో వరి సాగు చేస్తున్న రైతులు ఈ రకాన్ని సాగు చేసి అధిక ఆదాయం పొందవచ్చు. ఈ రకం వంగడం కోసం రైతులు మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని నేరుగా లేదా ఫోన్ నంబర్ 94901 95904లో సంప్రదించి పొందవచ్చు. – ఎం.గిరిజారాణి, సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, మచిలీపట్నం -
రైతన్న.. కొత్త రూటన్న!
సాక్షి, కామారెడ్డి: రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటకు సరైన ‘మద్దతు’ కరువవుతోంది. గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకే దాసోహం కావాల్సిన పరిస్థితి.. సన్నాలు సాగుచేసిన రైతులు అటు పంట దిగుబడి రాక, ఇటు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కొందరు రైతులు కొత్తదారులు వెతుకుతున్నారు. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక, వాటిని మర పట్టించి బియ్యం అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల పలువురు రైతులు సన్నవడ్లను మిల్లింగ్ చేయించి, అవసరం ఉన్న వారికి నేరుగా బియ్యం విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. దిగుబడి దెబ్బ.. ‘మద్దతు’ కరువు ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 34.45 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగైంది. కామారెడ్డి జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి పండించగా, ఇందులో 1,16,672 ఎకరాల్లో సన్నరకాలే సాగయ్యాయి. ఎంఎస్పీ ప్రకారం మేలు రకం ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 ధర ఉంది. ఈ ధరల ప్రకారం సన్నవడ్లను అమ్మితే నష్టమేనని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.2,500 చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. మరోపక్క ఈసారి భారీ వర్షాలు, తెగుళ్లు రైతులను నిండా ముంచాయి. గతంలో సన్నాలు ఎకరాకు 25 – 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈసారి చాలాచోట్ల ఎకరాకు 10 – 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. నిరుడు దళారులు, రైస్ మిల్లర్లు క్వింటాల్‌కు రూ.2 వేలు చెల్లించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈసారి కొనేందుకు వ్యాపారులు, మిల్లర్లు ముందుకురాలేదు. చదవండి: (విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు) మా దగ్గరే కొనండంటూ వాట్సాప్‌లో ప్రచారం ఒకపక్క తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి పడిపోవడం.. మరోవైపు, గిట్టుబాటు ధర లేకపోవడం, వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు కొత్త ఆలోచన చేశారు. పలువురు తాము పండించిన వడ్లను మర పట్టించేందుకు రైస్‌మిల్లులకు వరుస కడుతున్నారు. బియ్యంగా మార్చి 25 – 50 కిలోల చొప్పున బస్తాల్లో నింపి బయట వినియోగదారులకు అమ్ముతున్నారు. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,200 నుంచి రూ.4,500 వరకు అమ్ముడుపోతున్నాయి. కొందరు రైతులు తమకు తెలిసిన వారికి, హోటళ్లకు బియ్యం సప్లై చేస్తున్నారు. ఇక, రైతులు వాట్సాప్ గ్రూపుల ద్వారా తమ వద్ద సన్నబియ్యం ఫలానా ధరకు లభిస్తాయని, రైతుల వద్దనే నేరుగా బియ్యం కొని రైతులకు లాభం చేకూర్చాలంటూ భారీగా ప్రచారం చేస్తున్నారు. దళారులు, వ్యాపారుల దగ్గర కొనే బదులు రైతుల దగ్గర లభించే కల్తీ లేని నాణ్యమైన బియ్యాన్ని కొందామంటూ చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. కామారెడ్డి జిల్లా గన్పూర్(ఎం) గ్రామానికి చెందిన యువ రైతు పేరు శ్రీధర్‌రావు మొన్నటి వానాకాలంలో 15 ఎకరాల్లో సన్న రకం వరి వేయగా భారీ వర్షాలతో దిగుబడి పడిపోయింది. 15 ఎకరాలకు 240 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఇందులో 137 క్వింటాళ్లు విక్రయించి, మిగతా 103 క్వింటాళ్లను బియ్యం పట్టిస్తే 42 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చింది. ఇందుకోసం రూ.5 వేల వరకు ఖర్చయ్యాయి. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,500 చొప్పున అమ్ముడుపోతున్నట్టు రైతు శ్రీధర్‌రావు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,500 ఇస్తే మేలు జరిగేదని, ఇప్పుడున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం వల్లే తానే బియ్యం పట్టించి అమ్ముకుంటున్నట్టు చెప్పాడు. కామారెడ్డి జిల్లా గన్పూర్(ఎం)కు చెందిన నర్సింహులు 8 ఎకరాల్లో సన్నవడ్లు పండించాడు. తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 170 బస్తాల ధాన్యాన్ని అమ్మి, 76 బస్తాలను మర పట్టించగా 30 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. ప్రభుత్వం సన్నాలు సాగు చేయాలని చెప్పి, మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఈ పరిస్థితుల్లో బయట అమ్మితే నష్టం తప్పదని భావించి ఇలా బియ్యం పట్టించి అమ్ముతున్నట్టు వివరించాడు. -
కిలో ప్లాస్టిక్‌కు.. రెండు కిలోల సన్న బియ్యం!
రఘునాథపల్లి: ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు మండలంలోని వెల్ది గ్రామసభలో సర్పంచ్ వినూత్న ఆఫర్‌ను ప్రకటించాడు. 30 రోజుల ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కొయ్యడ మల్లేష్ అధ్యక్షతన జరిగిన గ్రామసభకు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ వసుమతి పాల్గొన్నారు. ప్రణాళికలో గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేస్తే విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్‌తో అపరిశుభ్రత చోటు చేసుకుంటుందని గ్రామస్తులు వాపోయారు. ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు ఊరంతా చెల్లాచెదురుగా పడుతున్నాయని వీటిని పూర్తిగా నివారించాలని గ్రామసభ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన సర్పంచ్ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో ప్లాస్టిక్ సేకరించి పంచాయతీకి అప్పగిస్తే కిలోకు రెండు కిలోల సన్నబియ్యం ఇస్తామని ప్రకటించాడు. వీధుల్లో చెత్త వేస్తే రూ 500 జరిమానా, చెత్త వేసిన వారి సమాచారం ఇస్తే రూ.250 నగదు బహుమతి అందజేస్తామన్నారు. ప్రతీ నెల 15, 30 తేదీలలో ఇంటింటా శుభ్రత చేయాలని గ్రామసభలో తీర్మాణం చేయగా గ్రామస్తులంతా ఏకీభవించారు. ఎంపీడీఓ వసుమతి మాట్లాడుతూ ప్లాస్టిక్, పారిశుద్ధ్య నిర్మూలనకు చక్కటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామసభలో ఉప సర్పంచ్ తిరుమల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వార్డుసభ్యులు పెద్దగోని రాజు, కావటి నాగేష్, గువ్వ యాదలక్ష్మి, పెండ్లి లావణ్య, నూనెముంతల ఊర్మిళ, ఎడ్ల బాలనర్సు, కొయ్యడ సుగుణ, దర్శనా రవి, మాజీ ఎంపీటీసీ పెండ్లి మల్లారెడ్డి, కోఅప్షన్ సభ్యులు రంగు యాదగిరి, బత్తిని మల్లేష్, కారోబార్ భిక్షపతి, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
బియ్యం.. భయ్యం!
సన్నబియ్యం ధర భగ్గుమంటోంది. వర్షాభావంతో సాగు తగ్గడం.. ఉన్న కొద్దిపాటి బియ్యాన్ని మిల్లర్లు కర్ణాటకకు ఎగుమతి చేయడం.. కృత్రిమ కొరత సృష్టించడం.. వెరసి ధరపై ప్రభావం చూపుతోంది. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని మిల్లర్లు రేషన్ బియ్యాన్ని సన్నబియ్యంలో కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సన్నబియ్యం(సోనా మసూరి) ధర మళ్లీ ఆకాశాన్నంటుతోంది. నాలుగు నెలలతో పోలిస్తే ధర పెరుగుదలలో భారీ వ్యత్యాసం ఉంది. క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరిగింది. సాధారణ రకం బియ్యం క్వింటా ధర మార్కెట్లో రూ.3,900 నుంచి రూ.4,100 ఉండగా.. ప్రస్తుతం రూ.4,500లకు విక్రయిస్తున్నారు. కొత్త బియ్యం(ఈ ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడి) క్వింటా రూ.3,600 పలుకుతోంది. అయితే కొత్త బియ్యం వంట వండితే గంజికడుతుంది. కాస్త పాతబడే వరకు తినేందుకు ఇబ్బందే. అందుకే పాతబియ్యం కొనుగోలుకే జనం మొగ్గు చూపుతారు. దీంతో గ్రేడ్–1 రకం బియ్యమైతే క్వింటా ధర రూ.4,800 వరకూ(బ్రాండ్‌ను బట్టి) ఉంటోంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు భారీగా బియ్యాన్ని ఎగుమతి చేస్తుండటం, మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించడం కూడా బియ్యం పెరుగుదలకు కారణాలుగా తెలుస్తోంది. రేషన్ బియ్యం కల్తీ కర్ణాటకలోని హోస్పేట్, బళ్లారి, రాయచూరు, బెంగళూరు, శివమొగ్గ ప్రాంతాలకు ‘అనంత’ నుంచి భారీగా సన్న బియ్యాన్ని ఎగుమతి అవుతోంది. మన జిల్లాలో బియ్యం ధర పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం. సన్న బియ్యానికి డిమాండ్ పెరగడంతో ఇదే ఆసరాగా చేసుకుని కొందరు మిల్లర్లు రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి సన్నబియ్యంలో కల్తీ చేసి కర్ణాటకకు తరలిస్తున్నారు. బియ్యం ధరను పెంచేయడం, కిలో రూపాయికి లభించే రేషన్ బియ్యాన్ని మిల్లుల్లో సన్నబియ్యంగా మార్చి అధిక ధరకు విక్రయించడం ద్వారా మిల్లర్లు భారీగా లబ్ధి పొందుతున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన దిగుబడితో పాటు ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లుల్లో భారీగా నిల్వ ఉంది. అయినప్పటికీ మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టించి ధరల పెంచేశారని తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు గోదాములు, రైస్ మిల్లులపై దాడులు నిర్వహిస్తే అక్రమ నిల్వల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది. జిల్లాలో 10.97లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో ఉన్న కుటుంబాల సంఖ్య 9.68లక్షలు. అంటే జిల్లాలోని కుటుంబాల కంటే రేషన్‌కార్డుల సంఖ్యే అధికం. దీన్నిబట్టి చూస్తే బోగస్ కార్డులు రేషన్‌డీలర్ల చేతిలో ఏ మేరకు ఉన్నాయో తెలుస్తుంది. ఈ కార్డుల ద్వారా మిగిలే బియ్యంతో పాటు కార్డులుదారులు కొనుగోలు చేయకుండా మిగిలిన బియ్యాన్ని బ్యాక్లాగ్ చూపించకుండా మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం కల్తీకి ఉపయోగపడుతున్నాయని స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల కుటుంబాలపై ప్రభావం జిల్లాలో 9.68 లక్షల కుటుంబాలు ఉండగా.. వీరిలో అధికభాగం సన్న బియ్యం కొనుగోలు చేస్తారు. పెరిగిన ధరలు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. అరకొరగా వచ్చే జీతాలతో పిల్లల ఫీజులు, నిత్యావసర ధరలు, ఇంటి అద్దెలు, పాలబిల్లులు లెక్కిస్తే భారీగా ఖర్చవుతుంది. ఈ క్రమంలో క్వింటాపై ఏకంగా రూ.400 నుంచి రూ.600 పెరగడమనేది కచ్చితంగా ఈ వర్గాలపై ప్రభావం చూపుతుంది. తగ్గిన వరి దిగుబడి కారణమే: గతేడాది ఖరీఫ్‌లో 22వేలు, రబీలో 16వేల హెక్టార్లలో వరి సాగయ్యేది. అయితే గతేడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో వరి సాగు తగ్గింది. ఖరీఫ్‌లో 13వేలు, రబీలో 8వేల హెక్టార్లలో మాత్రమే పంట సాగు చేశారు. హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు మాత్రమే వరి సాగు చేశారు. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. ఖరీఫ్‌లో 80వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావల్సి ఉంటే, కేవలం 30వేల మెట్రిక్‌టన్నులు మాత్రమే వచ్చింది. రబీ పంట ఇంకా కోతకు రాలేదు. దాదాపు 50వేల మెట్రిక్ టన్నుల దిగుబడి తగ్గింది. ఇది కూడా ధర పెరుగుదలపై ప్రభావం చూపింది. -
సన్న బియ్యం కాదు.. బిహార్ బియ్యం!
♦ పౌరసరఫరాల శాఖలో అవకతవకలపై కాంగ్రెస్ ధ్వజం ♦ అక్రమాలను అరికడుతున్నామని మంత్రి ఈటల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సన్న బియ్యం సరఫరాలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ సభ్యులు ధ్వజమెత్తారు. శనివారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో వరి పండించిన రైతులకు రూ.1,800 చొప్పున కనీస మద్దతు ధరను అందించి, వారి వద్ద నుంచే మిల్లర్లు సన్నబియ్యం కోసం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా, బ్రోకర్ల ద్వారా బిహార్నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై మంత్రి ఈటల జవాబిస్తూ.. బిహార్ నుంచి నల్లగొండకు బియ్యం దిగుమతి జరిగిన మాట వాస్తవమేనన్నారు. పౌరసరఫరాల శాఖకు గతేడాది రూ.2,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు (రూ.1,800 కోట్లు) తగ్గించడంతో ఆయా వర్గాలకు బియ్యాన్ని ఎలా అందించగలుగుతారని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసరఫరాల శాఖలో అవకతవకలను అరికట్టడం ద్వారా నాణ్యమైన బియ్యాన్ని పేదలకు, వసతి గృహాలకు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు.. కాగా, స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలోని మల్కాపూర్ గ్రామ సమీపంలో 13 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం రిజర్వాయరును ప్రతిపాదించిందని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రిజర్వాయర్ల గురించి పట్టించుకోలేదని, నాడు జరిగిన తప్పులను సవరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వాయర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిలోఫర్ ఆసుపత్రిలో వారం వ్యవధిలో ఐదుగురు మహిళలు మరణించిన మాట వాస్తవమేనని ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. ఈ మరణాలపై విచారణ కోసం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని, నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశవ్యాప్తంగా తల్లుల మరణాల రేటు 164 ఉండగా, రాష్ట్రంలో 74 మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల మెరుగుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలు నడుస్తున్న మాట వాస్తవమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికే జంటనగరాల్లో 548 కేసులు నమోదు చేశామని, హుక్కా పీల్చడంవల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
-
కక్కుర్తి..
• బస్తాకు సుమారు మూడు నుంచి ఐదు కిలోలు మాయం • మూడు జిల్లాల్లో నెలకు సగటున 280 క్వింటాళ్లు హాంఫట్ • నెలకు సుమారు రూ.11.24 లక్షల దుర్వినియోగం • పలు స్కూళ్లలో సన్నాలకు బదులు దొడ్డు బియ్యం సరఫరా • సన్న బియ్యం సరఫరాపై కొరవడిన అధికారుల నిఘా • సర్కారు విద్యార్థులకు తప్పని ఆకలి బాధలు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యం బస్తా బరువు 50.7 కిలోలు. కానీ.. పలు చోట్ల ఒక్కో బస్తాకు సుమారు 4 నుంచి 5 కిలోలు తక్కువగా వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో తిప్పర్తి మండల కేంద్రంతోపాటు మామిడాల ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. నిజమేనని తేలింది. తిప్పర్తి హైస్కూల్‌కు సరఫరా అయిన బియ్యం బస్తా 45.7 కిలోలే ఉంది. ఈ రెండు పాఠశాలల్లో కలిపి నెలకు 60 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే ఉపాధ్యాయులు తెలిపారు. బస్తాకు 4 కిలోలు తక్కువొస్తున్నాయి.. కనగల్ పాఠశాలలో 400 మంది విద్యార్థులున్నారు. రోజుకు 350 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. నెలకు సగటున 11 బస్తాల బియ్యం వినియోగిస్తున్నాం. ఒక్కో బస్తాలో మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున తూకం తక్కువ వస్తోంది. నెలకు సుమారు 44 కిలోల బియ్యం కోత పడుతోంది. ఇక్కడికి చాలాసార్లు దొడ్డు బియ్యం బస్తాలే వచ్చాయి. తూకం తక్కువగా ఉండడంతో విద్యార్థులకు అప్పడప్పుడు అన్నం సరిపోని పరిస్థితి ఉంటోంది. బియ్యం దిగుమతి చేసే సమయంలోనే తూకం వేయక పోవడంతో ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. - జాఫర్, కనగల్ హైస్కూల్, ‘మధ్యాహ్న’ పర్యవేక్షకుడు నల్లగొండ : దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించని చందంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల పరిస్థితి తయూరైంది. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందించాలనే మహోన్నత లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. సర్కారు పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా అవుతోన్న ఒక్కో బియ్యం బస్తా నుంచి రెండు నుంచి మూడు కిలోల వరకు పక్కదారి పడుతున్నాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడంలేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో సగటున నెలకు 280 క్వింటాళ్ల బియ్యం అక్రమార్కులు పాలవుతున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.11.24 లక్షల చొప్పున ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ.కోటి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచే.. ప్రభుత్వం మిల్లర్ల ద్వారా సేకరించిన బియ్యాన్ని సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాంల్లో నిల్వ ఉంచి ప్రతి నెలా డిమాండ్ ఆధారంగా మండల స్థాయి నిల్వ(ఎంఎల్ఎస్) కేంద్రాలకు పంపుతోంది. ఈ గోదాంలు పౌరసరఫరాల సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి స్టేజ్-2 గుత్తేదారు ద్వారా పాఠశాలలు, వసతి గృహాలకు పంపిస్తున్నారు. ఎస్‌డబ్ల్యూసీ ,సీడబ్ల్యూసీ గోదాముల నుంచి తూకం వేశాకే ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యాన్ని పంపే సమయంలో తూకం విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలకు తెరలేచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్ఎస్ పారుుంట్ల నుంచి వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం చేరే సమయంలోనే రెండు నుంచి మూడు కిలోల బియ్యూన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పాఠశాలలకు పంపిణీ చేస్తోన్న బియ్యం బస్తాల పరిమాణం తక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. మధ్యాహ్న భోజనం 2.82 లక్షల మందికి... మూడు జిల్లాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,276 ఉన్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో 2,82,853 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కోసం ప్రభుత్వం రోజూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వంద గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు 150 గ్రాములు చొప్పున సరఫరా చేస్తోంది. బియ్యంతో పాటు రోజూ ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.4.60, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.6.38 చొప్పున చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతి బస్తాలో రెండు నుంచి మూడు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అసలు సమస్య ఎదురవుతోంది. నెలకు 37 వేల కిలోలు పక్కదారి.... మూడు జిల్లాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల వాస్తవ లెక్క ప్రకారం సగటున రోజూ 28,440 కిలోల బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అంటే రోజుకు 568 బస్తాలు బియ్యాన్ని వాడుతున్నారన్న మాట. బస్తాకు సగటున మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఈ లెక్కన 568 బస్తాలకు 1706 కిలోల బియ్యం పక్కదారి పడుతున్నాయి. సాధారణంగా నెలకు 22 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. అంటే నెలకు 37,532 కిలోల బియ్యాన్ని దోచేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ.35 పైగానే పలుకుతున్నాయి. ఈ బియ్యాన్ని కనీసం రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని భావించినా నెలకు రూ.11,25,960 అవుతోంది. ఇంత భారీగా ఆదా యం ఉండడం, కిలో, రెండు కిలోలే కదా అంటూ ఎవరూ పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. పర్యవేక్షణ లోపం... బస్తాకు రెండు, మూడు కిలోలు బియ్యం తక్కువగా వస్తుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోత పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరు కావడం, మరికొంత మంది విద్యార్థులు ఇంటికెళ్లి తిని రావడం చేస్తున్నారు. ఈ విద్యార్థుల లెక్కలను సర్ధుబాటు చేసుకుని మిగిలిన విద్యార్థులకు భోజనం వండిపెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే ఉపాధ్యాయులు ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళ్లి బియ్యం తీసుకురావాలి. అక్కడ వారు తూకం వేయించుకోవాలి. దీని వల్ల ఎక్కువ సమయ ం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు తూకం లేకుండానే బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది బస్తాకు 50 కిలోల చొప్పున ఎన్ని బస్తాలు వస్తే అన్ని కిలో లు వచ్చినట్లు రాసుకుంటున్నారు. వాటిని తూకం వేసి చూస్తేగానీ అసలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. ఒకవేళ తూకం వేసినా బస్తాకు రెండు, మూడు కిలోలే కదా అని తేలికగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా బియ్యం తీసుకునేటప్పుడు మీరే చూసుకోవాలని చెప్పడంతో తమకెందుకుని మిన్నకుండిపోతున్నారు. తిరుమలగిరి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వీరికోసం రోజూ 50 కిలోల నుంచి 60 కిలోల వరకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. నెల రోజులకు 11 క్వింటాళ్ల నుంచి 13 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతున్నాయి. అయితే.. ప్రతి నెల 20 కేజీల నుంచి 40 కేజీల వరకు బియ్యం తేడా వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తిలో ఉన్న గోదాం పాయింట్ వరకు, అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు ఎగుమతి, దిగుమతులు చేస్తుండటంతో బస్తాలు దెబ్బతిని చినిగి పోవడంతో తేడా వస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
'సన్న సీఎంని కాబట్టి.. సన్నబియ్యం ఇస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. తాను 'సన్న ముఖ్యమంత్రిని కాబట్టి.. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నా' అంటూ నవ్వులు పూయించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్న విషయం పీడీఎస్‌యూ వాళ్లకు తెలియదా? అని నవ్వుతూ చురుకలు అంటించారు. చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలకారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 24 మండలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ. లక్ష 25వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. -
పిల్లల కంచాల్లోకి సన్నబియ్యం
సందర్భం సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్నబియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో ఉండే సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతోంది. ముక్కిపోయిన బియ్యం, పురుగులన్నంకు నిర్వచనమైన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన చేసే పనికి శ్రీకారం చుట్టింది. పేద పిల్లల ఆకలి తీర్చే సంక్షేమ హాస్టల్ కంచం లో సన్నబియ్యం బువ్వతో తెల్లగా మెరిసిపోతుంది. ఉద్య మకారుడు కేసీఆర్ పాలకుడైనందునే తెలంగాణ ప్రభుత్వం తల్లి కడుపులోని బిడ్డకు పౌష్టికాహారం అం దించే పనికి సిద్ధమైంది. మధ్యాహ్న భోజన పథకం అమ్మ చేతి వంటగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది తొలి మెట్టుగా భావించాలి. కాలం కళ్ల ముందు కర్పూరంలా కరిగిపో తుంటే కళ్లలో వొత్తులేసుకుని మార్పుల కోసం తెలంగాణ ఎదు రుచూసింది. ఎదురుచూసిన చూపులకు విజయాలు కనిపిస్తే అంతకంటే కావాల్సిందే ముంటుంది. గత కొన్ని దశాబ్దాలుగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మారాలని, ఆ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులకు వసతులను పెంచాలని విద్యార్థి సంఘాల న్నీ ముక్తకంఠంతో నినదిస్తూనే వస్తున్నాయి. కొన్ని వందల వేల విజ్ఞప్తులు, ధర్నాలు, పికెటింగ్‌లు, ప్రదర్శన లు, బంద్‌లు అనివార్యంగా జరుగుతూనే ఉన్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులు మెరుగు పడాల ని సుదీర్ఘకాలం విడువని పోరాటంగా ఎందరెందరో కృష్ణయ్యలు పోరాడుతూనే ఉన్నారు. కొన్ని సమస్యలను సాధించుకోవటం కూడా జరిగింది. పాలకులు సంక్షేమ హాస్టల్స్ అంటే సవతి పిల్లలుగానే చూశారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే భౌగోళిక హద్దులు ఏర్పడ తాయి తప్పితే, మార్పులు ఏం జరుగుతాయని ఉద్యమకాలంలో, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందని, ఏం లాభం జరుగుతుందని ప్రశ్నించిన వారికి సమాధానంగా అనేక మార్పులు జరుగుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నేలంతా పులకరిస్తోంది. పురుగు లన్నం, చారు, వసతులు సరిగాలేని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకుని ఎదిగివచ్చిన వ్యక్తి చేతికి ఆర్థిక శాఖ పగ్గాలనివ్వటమే గాకుండా, సన్నబియ్యంతో అన్నం వండిపెట్టే పనిని ఈటెల రాజేందర్‌కు ఇవ్వటం తో కేసీఆర్ నూతన చరిత్రకు ద్వారాలు తెరిచినట్ల యింది. ఈగలు ముసిరే కలుషిత వాతావరణంలో సమాజంలో విసిరేసినట్లుగా మిగిలిన సాంఘిక సంక్షేమ హాస్టళ్ల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం అన్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లనే కదా సాధ్యం అవుతుంది. లేకుంటే అంత తొందరగా పేద హాస్టల్ పిల్లల కంచాల లోకి సన్నబియ్యం వచ్చేనా అని ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సి ఉంది. ముక్కిపోయిన బియ్యం, ముతక బియ్యం, రేషన్ బియ్యం హాస్టల్స్‌కు పంపి చేతులు దులుపేసుకునే దుస్థితికి చరమగీతం పాడటం జరిగింది. కేసీఆర్ ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ ఎన్నికల ప్రణాళికల నుంచి ఆచరణ ప్రణాళికలుగా మారటం తెలంగాణకు శుభపరిణామంగా మారుతు న్నాయి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అమ్మ ఒడిగా మారినప్పుడే ప్రభుత్వాలు విజయం సాధించినట్లుగా చెప్పాలి. ఈ దేశానికి మానవ వనరులను అందించే భావి భారతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చా రు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను నరక కూపాలుగా మార్చివేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం లో తొలిగా బాగు చేసుకోవాల్సింది ప్రభుత్వ బడిని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. పేద వర్గాల పిల్లలకు ప్రమాణాలు గల విద్యను అందించేం దుకు మా ప్రభుత్వం నడుం కట్టిందని చెప్పడానికి తొలిమెట్టుగా హాస్టళ్ల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే పేద పిల్లల కంచాలలోకి సన్న బియ్యం అందించే పని ఎంతో ఉన్నతమైనది. మధ్యా హ్న భోజన పథకం విజయవంతం కావాలంటే అమ్మ పెట్టే అన్నం ముద్దగా పిల్లలకు కడుపునిండా శుభ్రమైన ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలి. ఈ పిల్లలకు పెట్టే ప్రతిపైసా ఖర్చు రాష్ట్ర పునర్నిర్మాణానికి, ఈ దేశ భవిష్యత్‌కు వెలకట్టలేని పెట్టుబడిగా మారుతుంది. పీ.వీ.నర్సింహారావు విద్యాశాఖా మంత్రిగా ఉన్న ప్పుడు ఏర్పరచిన సర్వేల్ లాంటి గురుకుల పాఠశాలలే ఆ తర్వాత దేశం మొత్తానికి నవోదయ స్కూల్స్‌గా రూపుదాల్చాయి. ఇప్పుడు కేసీఆర్ ఆలోచనల నుంచి వచ్చిన మండలానికి ఒక గురుకుల పాఠశాల అన్నది సఫలీకృతమైతే దేశానికి ఈ విధానం ఆదర్శవంతంగా నిలుస్తుంది. గురుకుల విద్యావ్యవస్థ విజయవంతంగా నిలబ డేందుకు తీసుకున్న తొలి నిర్ణయంగా హాస్టళ్లకు సన్న బియ్యం అమలు కార్యక్రమంగా చూడవచ్చును. సాంఘి క సంక్షేమ హాస్టళ్లను మరింత విస్తృతపర్చాల్సి ఉంది. పేద పిల్లలకు అన్ని వసతులు అందించే విధంగా మొత్తం పాలనా యంత్రాంగం పని చేయాలి. పేద పిల్లలకు నాసిరకమైన తిండిపెడితే, వారికి వచ్చే నిధుల ను మింగే ప్రయత్నం చేసే వారిపై కఠిన చర్యలు తీసు కోవాలి. పేద వర్గాల పిల్లలకు మంచి వసతులు, వారికి మేలైన విద్యనందిస్తే అది దేశానికి తిరుగులేని బలం అవుతుంది. తెలంగాణ ప్రభుత్వం చలికి వణుకుతున్న విద్యార్థికి కప్పుకునే దుప్పటి కావాలి. కంచంలో మెరిసే తెల్లటి అన్నంగా ప్రభుత్వం కనిపించాలి. హాస్టళ్లల్లో పేరుకుపోయిన అపరిశుభ్రతను తుడిచివేసే చేతులుగా ప్రభుత్వం మారాలి. నెత్తికి నూనెలేని చింపిరి జుట్లకు చల్లదనాన్నిచ్చే కొబ్బరినూనెగా మారాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల నుంచి వచ్చిన పిల్లలే నవలోకాలు వికసింపజేస్తారు. కొత్త శకానికి ఈ సంక్షేమ హాస్టళ్లే ప్రాణం పోయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను శక్తివంతం చే స్తే అక్కడి నుంచి వచ్చిన పిల్లలు దేశాన్ని అన్నిరంగాల్లో సర్వసమర్థంగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు సన్నబియ్యం అందించే ఈ పథకాన్ని విజయవంతం చేసే పనిలో మొత్తం పాలనా యంత్రాంగం సఫలీకృతం కావాలి. పేద పిల్లల నోటికాడ కూడును కూడా సొమ్ము చేసుకునే అవినీతిపరులను జైలుకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. (వ్యాసకర్త కవి, సీనియర్ జర్నలిస్టు మొబైల్ : 90599 67525)