కక్కుర్తి.. | thin rice froud in government schools | Sakshi
Sakshi News home page

కక్కుర్తి..

Published Thu, Nov 17 2016 3:38 AM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

కక్కుర్తి..

కక్కుర్తి..

బస్తాకు సుమారు మూడు నుంచి ఐదు కిలోలు మాయం
మూడు జిల్లాల్లో నెలకు సగటున 280 క్వింటాళ్లు హాంఫట్
నెలకు సుమారు రూ.11.24 లక్షల దుర్వినియోగం
పలు స్కూళ్లలో సన్నాలకు బదులు దొడ్డు బియ్యం సరఫరా
సన్న బియ్యం సరఫరాపై కొరవడిన అధికారుల నిఘా
సర్కారు విద్యార్థులకు తప్పని ఆకలి బాధలు

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలకు మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేస్తున్న సన్న బియ్యం బస్తా బరువు 50.7 కిలోలు. కానీ.. పలు చోట్ల ఒక్కో బస్తాకు సుమారు 4 నుంచి 5 కిలోలు తక్కువగా వస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో తిప్పర్తి మండల కేంద్రంతోపాటు మామిడాల ఉన్నత పాఠశాలలో ‘సాక్షి’ పరిశీలన చేయగా.. నిజమేనని తేలింది. తిప్పర్తి హైస్కూల్‌కు సరఫరా అయిన బియ్యం బస్తా 45.7 కిలోలే ఉంది. ఈ రెండు పాఠశాలల్లో కలిపి నెలకు 60 కిలోల బియ్యం తక్కువగా వస్తున్నట్లు  మధ్యాహ్న భోజనాన్ని  పర్యవేక్షించే ఉపాధ్యాయులు తెలిపారు.

బస్తాకు 4 కిలోలు తక్కువొస్తున్నాయి..
కనగల్ పాఠశాలలో 400 మంది విద్యార్థులున్నారు. రోజుకు 350 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. నెలకు సగటున 11 బస్తాల బియ్యం వినియోగిస్తున్నాం. ఒక్కో బస్తాలో మూడు నుంచి నాలుగు కిలోల చొప్పున తూకం తక్కువ వస్తోంది. నెలకు సుమారు  44 కిలోల బియ్యం కోత పడుతోంది. ఇక్కడికి చాలాసార్లు దొడ్డు బియ్యం బస్తాలే వచ్చాయి. తూకం తక్కువగా ఉండడంతో విద్యార్థులకు అప్పడప్పుడు అన్నం సరిపోని పరిస్థితి ఉంటోంది. బియ్యం దిగుమతి చేసే సమయంలోనే తూకం వేయక పోవడంతో ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. - జాఫర్, కనగల్ హైస్కూల్, ‘మధ్యాహ్న’ పర్యవేక్షకుడు

నల్లగొండ : దేవుడు వరమిచ్చినా... పూజారి కనికరించని చందంగా ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల పరిస్థితి తయూరైంది. పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం అందించాలనే మహోన్నత లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అధికారుల పర్యవేక్షణ లోపంతో అది అక్రమార్కుల పాలిట వరంగా మారింది. సర్కారు పాఠశాలలు, వసతి గృహాలకు సరఫరా అవుతోన్న ఒక్కో బియ్యం బస్తా నుంచి రెండు నుంచి  మూడు కిలోల వరకు పక్కదారి పడుతున్నాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడంలేదు. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లాల్లో సగటున నెలకు 280 క్వింటాళ్ల బియ్యం అక్రమార్కులు పాలవుతున్నాయి. ఈ లెక్కన నెలకు రూ.11.24 లక్షల చొప్పున ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ.కోటి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి.

 ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచే..
ప్రభుత్వం మిల్లర్ల ద్వారా సేకరించిన బియ్యాన్ని సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాంల్లో నిల్వ ఉంచి ప్రతి నెలా డిమాండ్ ఆధారంగా మండల స్థాయి నిల్వ(ఎంఎల్‌ఎస్) కేంద్రాలకు పంపుతోంది. ఈ గోదాంలు పౌరసరఫరాల సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి స్టేజ్-2 గుత్తేదారు ద్వారా పాఠశాలలు, వసతి గృహాలకు పంపిస్తున్నారు. ఎస్‌డబ్ల్యూసీ ,సీడబ్ల్యూసీ గోదాముల నుంచి తూకం వేశాకే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి పాఠశాలలు, వసతి గృహాలకు బియ్యాన్ని పంపే సమయంలో తూకం విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అక్రమాలకు తెరలేచిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్ పారుుంట్ల నుంచి వసతి గృహాలు, పాఠశాలలకు బియ్యం చేరే సమయంలోనే రెండు నుంచి మూడు కిలోల బియ్యూన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో పాఠశాలలకు పంపిణీ చేస్తోన్న బియ్యం బస్తాల పరిమాణం తక్కువగా ఉండడంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది.

మధ్యాహ్న భోజనం 2.82 లక్షల మందికి...
మూడు జిల్లాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 3,276 ఉన్నాయి. ఈ పాఠశాలలన్నింటిలో 2,82,853 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజన కోసం ప్రభుత్వం రోజూ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వంద గ్రాములు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు 150 గ్రాములు చొప్పున సరఫరా చేస్తోంది. బియ్యంతో పాటు రోజూ ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కోక్కరికి రూ.4.60, ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.6.38 చొప్పున చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రతి బస్తాలో రెండు నుంచి మూడు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అసలు సమస్య ఎదురవుతోంది.

నెలకు 37 వేల కిలోలు పక్కదారి....
మూడు జిల్లాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల వాస్తవ లెక్క ప్రకారం సగటున రోజూ 28,440 కిలోల బియ్యాన్ని వినియోగిస్తున్నారు. అంటే రోజుకు 568 బస్తాలు బియ్యాన్ని వాడుతున్నారన్న మాట. బస్తాకు సగటున మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయి. ఈ లెక్కన 568 బస్తాలకు 1706 కిలోల బియ్యం పక్కదారి పడుతున్నాయి. సాధారణంగా నెలకు 22 రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. అంటే నెలకు 37,532 కిలోల బియ్యాన్ని దోచేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం కిలో రూ.35 పైగానే పలుకుతున్నాయి. ఈ బియ్యాన్ని కనీసం రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని భావించినా నెలకు రూ.11,25,960 అవుతోంది. ఇంత భారీగా ఆదా యం ఉండడం, కిలో, రెండు కిలోలే కదా అంటూ ఎవరూ పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది.

పర్యవేక్షణ లోపం...
బస్తాకు రెండు, మూడు కిలోలు బియ్యం తక్కువగా వస్తుండటంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కోత పెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరు కావడం, మరికొంత మంది విద్యార్థులు ఇంటికెళ్లి తిని రావడం చేస్తున్నారు. ఈ విద్యార్థుల లెక్కలను సర్ధుబాటు చేసుకుని మిగిలిన విద్యార్థులకు భోజనం వండిపెట్టాల్సిన పరిస్థితి ప్రస్తుతం పాఠశాలల్లో కనిపిస్తోంది. ఇదిలావుంటే ఉపాధ్యాయులు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వెళ్లి బియ్యం తీసుకురావాలి.

అక్కడ వారు తూకం వేయించుకోవాలి. దీని వల్ల ఎక్కువ సమయ ం వృథా అవుతుందన్న ఉద్దేశంతో ఉపాధ్యాయులు తూకం లేకుండానే బియ్యం దిగుమతి చేసుకుంటున్నారు. చాలా మంది బస్తాకు 50 కిలోల చొప్పున ఎన్ని బస్తాలు వస్తే అన్ని కిలో లు వచ్చినట్లు రాసుకుంటున్నారు. వాటిని తూకం వేసి చూస్తేగానీ అసలు అక్రమాలు వెలుగులోకి రావడం లేదు. ఒకవేళ తూకం వేసినా బస్తాకు రెండు, మూడు కిలోలే కదా అని తేలికగా తీసుకుంటున్నారు. ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా బియ్యం తీసుకునేటప్పుడు మీరే చూసుకోవాలని చెప్పడంతో తమకెందుకుని మిన్నకుండిపోతున్నారు.

 

తిరుమలగిరి :  స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 730 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, వీరికోసం రోజూ 50 కిలోల నుంచి 60 కిలోల వరకు మధ్యాహ్న భోజనం వండుతున్నారు. నెల రోజులకు 11 క్వింటాళ్ల నుంచి 13 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతున్నాయి. అయితే.. ప్రతి నెల 20 కేజీల నుంచి 40 కేజీల వరకు బియ్యం తేడా వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి తుంగతుర్తిలో ఉన్న గోదాం పాయింట్ వరకు, అక్కడి నుంచి వివిధ పాఠశాలలకు ఎగుమతి, దిగుమతులు చేస్తుండటంతో బస్తాలు దెబ్బతిని చినిగి పోవడంతో తేడా వస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement