
పదో తేదీ వచ్చినా పేదలకు అందని రేషన్ బియ్యం
నెల మొదటి తేదీ నుంచే అందాల్సిన రేషన్
ఈసారి అలాట్‌మెంట్‌లోనే జాప్యం
ఒకటో తేదీన అలాట్‌మెంట్ ఇచ్చిన పౌరసరఫరాల సంస్థ
అవసరమైన బియ్యం 1.51 లక్షల మెట్రిక్ టన్నులు రేషన్ దుకాణాలకు వెళ్లిన స్టాక్ 62,346 మెట్రిక్ టన్నులే
సన్న బియ్యంపై స్పష్టత కరువు.. ఉగాదికి కూడా అనుమానమే
సాక్షి, హైదరాబాద్: ఈ నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా జరుగుతుందని ఆశించిన పేదలకు నిరాశే మిగిలింది. సన్నబియ్యం సంగతి దేవుడెరుగు.. నెలనెలా వచ్చే దొడ్డు బియ్యం కూడా ఇంకా రాకపోవటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బియ్యం ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు సంచులు పట్టుకొని రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు వారం రోజులుగా చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి.
దుకాణాలకు చేరని బియ్యం
ప్రతినెల ఒకటో తేదీ నుంచి రేషన్ బియ్యం పంపిణీ మొదలై పదో తేదీ నాటికి దాదాపు పూర్తవుతుంది. ఈసారి పదో తేదీ వచ్చినా ఇంకా సుమారు 50 శాతం రేషన్ దుకాణాలకు బియ్యమే చేరలేదు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ల నుంచి నెలాఖరులోగానే దుకాణాలకు బియ్యం సరఫరా కావాలి. ఈసారి ఎంఎల్‌ఎస్ పాయింట్లకే ఒకటో తారీఖు తరువాత అలాట్‌మెంట్ ఇవ్వడంతో ఈ సమస్య ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని 17,335 రేషన్ దుకాణాలకు గాను చాలా దుకాణాలకు కూడా రేషన్ బియ్యం అందలేదు. ఈ నెల కోసం 1.51 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం రావాల్సి ఉండగా, వచ్చింది 62,346 మెట్రిక్ టన్నులే. అంటే 42 శాతమే సరఫరా అయ్యింది.
సన్నబియ్యంపై డైలమా..
మార్చి నెల నుంచి సన్న బియ్యం పంపి ణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దొడ్డు బియ్యం బఫర్ స్టాక్‌ను పూర్తిచేసే పనిలో పౌరసర ఫరాల సంస్థ అధికారులు ఉన్నారు. వానాకాలం సీఎంఆర్ సన్న వడ్లను రెండు నెలలుగా మిల్లింగ్ చేయించి గోదా ములకు పంపుతున్నారు. దీంతో దొడ్డు బియ్యం స్టాక్ లేకుండా పోయింది. అయితే ఈ నెలలో కూడా దొడ్డు బియ్యమే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయించడంతో.. గత నెల 20వ తేదీ నుంచే ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరాల్సిన దొడ్డు బి య్యం స్టాక్ వెళ్లలేదు. 2వ తేదీ నుంచి బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు పంపినట్లు ఓ అధికారి తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో అన్ని దుకాణాలకు బియ్యం పంపేందుకు కృషి చేస్తున్నట్లు ఓ జిల్లాకు చెందిన డీఎస్‌ఓ ‘సాక్షి’కి తెలిపారు.
ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ...?
ఈ వానాకాలం సీజన్‌లో 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రాగా, దాన్ని మిల్లింగ్ చేస్తే 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని అంచనా. రాష్ట్ర అవసరాలకు ఈ బియ్యం 8 నెలలు సరిపోతాయి. వచ్చే ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఏప్రిల్‌లో ఇచ్చే కోటాను లెక్కలోకి తీసుకోవలసి ఉంటుంది.
వానాకాలం సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన సన్న «ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పేదలకు సన్న బియ్యంగా సరఫరా చేస్తే.. కొత్త బియ్యం సరిగా ఉడకదు. అందుకని రెండు నెలలు నిల్వ చేసి మార్చి నుంచి పంపిణీ చేస్తాం. – గత డిసెంబర్‌లో పౌరసరఫరాల సంస్థ కమిషనర్ డీ.ఎస్. చౌహాన్ వెల్లడి
మార్చి నెల నుంచి రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తాం. – పలు సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ
Comments
Please login to add a commentAdd a comment