సన్న ధాన్యంపై వ్యాపారుల కన్ను | Fine grain sales complete in Nizamabad and Nalgonda | Sakshi
Sakshi News home page

సన్న ధాన్యంపై వ్యాపారుల కన్ను

Published Tue, Nov 5 2024 4:56 AM | Last Updated on Tue, Nov 5 2024 4:56 AM

Fine grain sales complete in Nizamabad and Nalgonda

పొలాల్లో పచ్చి వడ్లనే కొనుగోలు చేస్తున్న వైనం

ఫైన్‌ వెరైటీ రకాన్ని బట్టి రూ.2,000 నుంచి రూ.2,600 వరకు చెల్లింపు 

మార్కెట్‌లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునే యత్నం 

కొనుగోలు కేంద్రాల్లో మాదిరి తాలు, తరుగు, తేమ లొల్లి లేకపోవడంతో వ్యాపారుల వైపే రైతుల మొగ్గు 

నిజామాబాద్, నల్లగొండల్లోని కొన్ని మండలాల్లో ఇప్పటికే సన్న ధాన్యం అమ్మకాలు పూర్తి 

సంక్రాంతి నుంచి రేషన్‌షాపులకు ఇచ్చే సన్న బియ్యంపై ప్రైవేటు అమ్మకాల ప్రభావం! 

నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని, బోధన్, మోస్రా, చందూర్‌ తదితర కొన్ని మండలాల్లో వరి కోతలు 100 శాతం పూర్తయ్యాయి. ఈ మండలాల్లో రైతులు పండించే హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, బీపీటీ లాంటి మంచి రకం (ఫైన్‌ వెరైటీ) సన్న ధాన్యాన్ని ఇప్పటికే దళారులు, వ్యాపారులు పొలాల నుంచే కొనుగోలు చేశారు. తరుగు, తాలు, తేమ శాతంతో సంబంధం లేకుండా పచ్చి వడ్లను కొన్నారు. 

నెలరోజుల క్రితం ఇక్కడ కోతలు షురూ కాగా, మొదట్లో క్వింటాలుకు మద్దతు ధర రూ.2,320కి మించి రూ.2,600 వరకు చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం రూ.2,100 నుంచి రూ.2,300 వరకు చెల్లిస్తున్నారు. పైగా తాలు, తరుగు, తేమ శాతాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ధాన్యం కొని, డబ్బులు చెల్లిస్తుండడంతో.. రైతులు కూడా వారికే విక్రయిస్తున్నారు. ఫైన్‌ వెరైటీ సన్న ధాన్యం అధికంగా పండించే నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

సాక్షి, హైదరాబాద్‌: బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రంలో వ్యాపారులు, మిల్లర్లు పల్లెలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలో పెరిగిన సన్నాల సాగును తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 

తెల్ల బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన నేపథ్యంలో సన్న ధాన్యాన్ని పెద్ద ఎత్తున సేకరిస్తున్నారు. కోతలు ప్రారంభమైన వెంటనే కల్లాల నుంచే ధాన్యాన్ని ఏకమొత్తంగా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో సెపె్టంబర్‌ చివరి వారం నుంచే వరికోతలు మొదలై అక్టోబర్‌లో పెద్ద ఎత్తున సాగుతాయి. మిగతా జిల్లాల్లో అక్టోబర్‌ చివరి వారం, నవంబర్‌ మొదటి వారం నుంచి మొదలై జనవరి దాకా సాగుతాయి. 

సన్న ధాన్యానికి డిమాండ్‌ 
రాష్ట్రంలో కురిసిన అధిక వర్షాల నేపథ్యంలో ఈసారి ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉంది. దీంతో ధాన్యాన్ని 17 శాతం తేమ వచ్చేంత వరకు ఆరబెట్టి, తరుగు, తాలు లేకుండా తూర్పారబట్టి కొనుగోలు కేంద్రానికి తెస్తేనే సేకరిస్తామని మిల్లర్లు చెబుతుండటం.. ఆ బాధలేవీ లేకుండా వ్యాపారులు పచ్చి వడ్లనే కొంటుండడం, డబ్బులు వెంటనే చేతికి వస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వరకు వెళ్లడం లేదు. తమ వద్దకే వచ్చే వ్యాపారులకు ధాన్యం అమ్మేసుకుంటున్నారు.

ప్రస్తుతం కోతలు సాగుతున్న కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో సన్న ధాన్యాన్ని వ్యాపారులు కొంటున్నారు. ఫైన్‌ రకాలైన జైశ్రీరాం, సాంబ మసూరి (బీపీటీ 5204), తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048), హెచ్‌ఎంటీ సోనా రకాలకు బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఈ రకాలకు క్వింటాలుకు రూ.2,600 వరకు చెల్లిస్తున్నారు. మిగిలిన సన్న రకాలకు రూ.2,000 వరకు ఇస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన 20 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో కిలో సన్న ధాన్యం కూడా లేకపోవడం గమనార్హం. కాగా రాష్ట్రంలో సన్న ధాన్యం కోసం కేటాయించిన కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో 33 వరి రకాలను వ్యవసాయ శాఖ సన్నాలుగా గుర్తించింది. వీటికే రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తుంది.  

సర్కారు అంచనా సాధ్యమయ్యేనా? 
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నుంచి రేషన్‌ కార్డుదారుల కు సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని సుమారు 90 లక్షల కార్డుదారులకే కాకుండా ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్న స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్‌వాడీలు, గురుకుల పాఠశాలలకు కలిపి ఏటా 24 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) సన్న బియ్యం అవసరం. 

24 ఎల్‌ఎంటీల సన్న బియ్యం కావాలంటే 36 ఎల్‌ఎంటీల సన్నవడ్లు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్‌లో 50 ఎల్‌ఎంటీల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని పౌరసరఫరాల శాఖ అధికారులే చెపుతున్నారు.

వ్యవసాయ శాఖ గుర్తించిన సన్న ధాన్యం రకాలు ఇవే..  
సిద్ది (వరంగల్‌ 44), కంపాసాగర్‌ వరి–1 (కేపీఎస్‌ 2874), సాంబ మసూరి (బీపీటీ 5204), జగిత్యాల వరి–3 (జేజీఎల్‌ 27356), జగిత్యాల వరి–2 (జేజీఎల్‌ 28545), వరంగల్‌ సాంబ (డబ్ల్యూజీఎల్‌ 14), వరంగల్‌ సన్నాలు (డబ్ల్యూజీఎల్‌ 32100), జగిత్యాల్‌ మసూరి (జేజీఎల్‌ 11470), పొలాస ప్రభ (జేజీఎల్‌ 384), కృష్ణ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2458), మానేరు సోనా (జేజీఎల్‌ 3828), తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048), వరంగల్‌ వరి–1119, కునారం వరి–2 (కేఎన్‌ఎం 1638), వరంగల్‌ వరి–2 (డబ్ల్యూజీఎల్‌ 962), రాజేంద్రనగర్‌ వరి–4 (ఆర్‌ఎన్‌ఆర్‌ 21278), కునారం వరి–1 (కేఎన్‌ఎం 733), జగిత్యాల సన్నాలు (జేజీఎల్‌ 1798), జగిత్యాల సాంబ (జేజీఎల్‌ 3844), కరీంనగర్‌ సాంబ (జేజీఎల్‌ 3855), అంజన (జేజీఎల్‌ 11118), నెల్లూరు మసూరి (ఎన్‌ఎల్‌ఆర్‌ 34 449), ప్రద్యుమ్న (జేజీఎల్‌ 17004), సుగంధ సాంబ (ఆర్‌ఎన్‌ఆర్‌ 2465), శోభిని (ఆర్‌ఎన్‌ఆర్‌ 2354), సోమనాథ్‌ (డబ్ల్యూజీఎల్‌ 34 7), ఆర్‌ఎన్‌ఆర్‌ 31479 (పీఆర్‌సీ), కేపీఎస్‌ 6251 (పీఆర్‌సీ), జేజీఎల్‌ 33124 (పీఆర్‌సీ), హెచ్‌ఎంటీ సోనా, మారుటేరు సాంబ (ఎంటీయూ 1224), మారుటేరు మసూరి (ఎంటీయూ 1262), ఎంటీయూ 1271.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement