
నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు ఈఏపీసెట్ దరఖాస్తులు
సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో సిద్ధమైన జేఎన్‌టీయూహెచ్
త్వరగా అప్లై చేస్తే కోరుకున్న చోట సెంటర్ దొరికే అవకాశం
అప్లికేషన్ నింపేటప్పుడు అప్రమత్తత అవసరం
ముందే పేపర్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు
పేమెంట్ సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు
రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసెట్)కు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 4 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల గుర్తింపు, అప్లికేషన్లు త్వరగా ప్రాసెస్ చేసేందుకు ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచి్చనట్టు అధికారులు తెలిపారు. అగ్రి, ఫార్మసీ సెట్ ఏప్రిల్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు.
ఇంజనీరింగ్ సెట్ మే 2 నుంచి 5 వరకు జరుగుతుంది. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూహెచ్) ఈఏపీసెట్‌ను నిర్వహిస్తోంది. ఈ సెట్‌కు తెలంగాణ, ఏపీ నుంచి ఏటా దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈసారి నాన్–లోకల్ కోటాను సవరించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం నాన్–లోకల్ కోటా వర్తించదు. – సాక్షి, హైదరాబాద్
ముందే మేల్కొంటే మంచిది
చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ఈఏపీసెట్‌కు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. చివరలో దరఖాస్తు చేస్తే.. అందులో ఏమైనా ఇబ్బందులొస్తే సరిచేసుకోవడం కష్టమని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో తొలి పది రోజుల్లో 20 శాతం దరఖాస్తులు మాత్రమే వస్తున్నాయి.
ఆఖరి పది రోజుల్లో 68 శాతం మంది దరఖాస్తు చేస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు, వారి నివాస ప్రాంతాలకు సమీపంలో ఉండే పరీక్ష కేంద్రం కేటాయించే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ పరీక్ష కేంద్రాలుంటాయి. జిల్లాల్లో ఉమ్మడి జిల్లాకో పరీక్ష కేంద్రం ఉంది. కాబట్టి ముందే దరఖాస్తు చేసిన వారికి సాఫ్ట్‌వేర్ ద్వారా దగ్గర్లోని పరీక్ష కేంద్రం కేటాయిస్తారు. దీనిని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పుట్టిన తేదీ కీలకం
అభ్యర్థులు పుట్టిన తేదీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెట్ కమిటీ సూచించింది. ఇంటర్మిడియట్ ధ్రువపత్రాల్లో ఉన్న పుట్టిన తేదీని మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుంది. అందువల్ల టెన్త్, ఇతర తరగతులు, ఇతర ధ్రువపత్రాల్లో పుట్టిన తేదీలు ఒకే రకంగా ఉండేలా అభ్యర్థులు ముందే జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రాలను ముందే తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత అధికారుల చేత ధ్రువీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి. అప్లికేషన్‌లో తండ్రిపేరు పూర్వ ధ్రువపత్రాల్లో ఉండేలా చూసుకోవాలి. ఇంటర్మిడియట్ పత్రాలపై ఉండే ఫొటో, సంతకం ఒకేలా ఉండాలి. వీటిల్లో తేడా వుంటే తక్షణమే సెట్ హెల్ప్‌డెస్‌్కకు ఫోన్ చేసి సరిచేసుకోవాలని అధికారులు సూచించారు.
చెల్లింపు దగ్గర జాగ్రత్త
అప్లికేషన్‌తో పాటు అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే సెట్ దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫీజు చెల్లింపులో సమస్యలు వస్తాయి. అభ్యర్థి ఖాతా నుంచి డబ్బులు కట్ అయినా, సెట్ నిర్వాహకులకు క్రెడిట్ అవ్వదు. దీంతో ఐడీ రిజిస్ట్రేషన్ అవ్వదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్క్రీన్‌పై కన్పించే మెసేజ్‌తో సహా ఈఏపీసెట్ హెల్ప్ డెస్‌్కను సంప్రదించాలి. పరిష్కార మార్గాలను కమిటీ సూచిస్తుంది.
ఇలా చేయండి
ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసే ప్రతీ విద్యార్థి ముందుగా పేపర్ వర్క్ చేయాలి. యూజర్ మాన్యువల్‌ను దగ్గర పెట్టుకుని, పేపర్‌పై ముందుగా అవసరమైన కాలమ్స్‌ను రాసుకోవాలి. పుట్టిన తేదీ, కులం, రిజర్వేషన్ కేటగిరీ, తండ్రిపేరు, సిగ్నేచర్, ఫొటో వివరాలు ముందుగా రాసుకుని, ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ భర్తీ చేయాలి. దీనివల్ల రీ కరెక్షన్ కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఏ సమస్య వచి్చనా టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. తక్షణమే సెట్ కమిటీ యంత్రాంగం స్పందిస్తుంది. – డాక్టర్ కె.విజయకుమార్ రెడ్డి (రెక్టార్, జేఎన్‌టీయూహెచ్, ఈఏపీసెట్ కో–కన్వినర్)
Comments
Please login to add a commentAdd a comment