మేలో ఎంసెట్‌! | telangana: eam cet exam schedule is finalised 2024 | Sakshi
Sakshi News home page

మేలో ఎంసెట్‌!

Published Fri, Dec 8 2023 3:23 AM | Last Updated on Fri, Dec 8 2023 3:23 AM

telangana: eam cet exam schedule is finalised 2024 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం (2024)లో నిర్వహించాల్సిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ప్రవేశ పరీక్షల కన్వినర్ల ఎంపికకు సంబంధించిన అర్హులైన వారి జాబితాలను ఆయా వర్సిటీల వీసీలు ఉన్నత విద్యామండలికి పంపాల్సి ఉంటుంది. దీనిపై అన్ని స్థాయిల్లో చర్చించి, పరీక్షల షెడ్యూల్‌ ఖరారు చేస్తారు. మండలి పరిధిలో ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, పాలిసెట్, పీజీ సెట్‌ ఉంటాయి.

సాధారణంగా వీటిని మే నెల నుంచి మొదలు పెడతారు. వీటిల్లో ఎంసెట్‌ కీలకమైంది. కేంద్రస్థాయిలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ తేదీలు ఇప్పటికే ఖరారయ్యాయి. జనవరి, ఏప్రిల్‌ నెలల్లో మెయిన్స్, ఆ తర్వాత అడ్వాన్స్‌డ్‌ చేపట్టాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్ణయించింది. దీని తర్వాత జాతీయ ఇంజనీరింగ్, ఐఐటీల్లో సీట్ల భర్తీకి జోసా కౌన్సెలింగ్‌ చేపడుతుంది. దీన్ని పరిగణనలోనికి తీసుకునే ఎంసెట్‌ తేదీలు ఖరారు చేస్తారు. కోవిడ్‌ సమయం నుంచి జేఈఈతో పాటు, ఎంసెట్‌ కూడా ఆలస్యంగా జరిగాయి. గత ఏడాది మాత్రం సకాలంలో నిర్వహించారు.

ఇప్పుడా ప్రతిబంధకం లేకపోవడంతో మే నెలలోనే ఎంసెట్‌ చేపట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎంసెట్‌ సిలబస్, ఇంటర్‌ మార్కుల వెయిటేజీపై మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోవిడ్‌ కాలంలో ఇంటర్‌ పరీక్షలు లేకపోవడంతో వెయిటేజీని ఎత్తివేశారు. ఆ తర్వాత ఇంటర్‌ పరీక్షలు జరిగిన వెయిటేజీ ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా వెయిటేజీ లేకుండా చేయడమా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త విద్యాశాఖ మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా వారం రోజుల్లో అన్ని సెట్స్‌పైన స్పష్టమైన విధానం వెల్లడించే వీలుందని కౌన్సిల్‌ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement